Tuesday 23 February 2016

PM's Conspiracy Theory itself is a Conspiracy

ప్రధాని కుట్ర సిధ్ధాంతమే ఓ కుట్ర
-     డానీ 

కథ, నవల వంటి వర్ణనాత్మక సాహిత్య ప్రక్రియల్ని చదువుతున్నప్పుడు పాఠకులు రెండు రకాల అనుభూతులకు గురవుతుంటారు. మొదటిది, రచనలోని సన్నివేశాలు, పాత్రల భావోద్వేగాలను ఆస్వాదించడం. రెండోది, రచనల్ని పోలిన నిజజీవిత పాత్రలు, సన్నివేశాలని గుర్తుకు తెచ్చుకుని ఆస్వాదించడం. వర్తమాన జాతీయ రాజకీయాలు కూడా మనకు అలాంటి రెండు రకాల అనుభూతుల్ని ఇస్తున్నాయి. వర్తమానంతోపాటూ  రెండవ ప్రపంచయుధ్ధానికి ముందు నాటి ఇటలీ, జర్మనీ పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి.

ఒక నకిలీ ట్వీట్ ను పట్టుకుని భారత హోంమంత్రి, ఒక నకిలీ వీడియోను తీసుకుని ఢిల్లీ పోలీస్ బాస్ కలిసి జేయన్ యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మీద ఆడిన దేశద్రోహ ప్రహసనాన్ని దేశమంతా చూసింది. అంతకు ముందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల బలవన్మరణానికి పురికొల్పిన కేంద్రమంత్రుల నిర్వాకాన్ని కూడా మనం చూశాం.

భారత రాజ్యాంగాన్ని అభిమానించేవాళ్ళకు కూడా కొన్ని అంశాల్లో కొంత అసంతృప్తి కూడా వుంటుంది. కొన్ని విషయాల్లో మరి కొంత స్పష్టత అవసరమనీ, ఇంకొన్ని విషయాలను చేరిస్తే మరింత బాగుండేదనీ అనిపిస్తుంది. కానీ, భారత రాజ్యాంగాన్ని ప్రశంసిస్తూ కన్హయ కుమార్ అంతటి ఉత్తేజం, ఉత్సాహం, తాదాత్మ్యం, ఆవేశాలతో ప్రసంగించే యువతరాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాంకార్ల్ మార్క్స్, బాబాసాహెబ్ అంబేడ్కర్, అష్ఫఖుల్లా ఖాన్ కూర్పు ఒక మహత్త పరిణామం. ఇందులో బిర్సాముండా, ఫూలేలను కూడా చేరిస్తే అదొక కొత్త చరిత్ర ఆవిర్భావానికి వేదిక అవుతుంది.

గత ప్రభుత్వాధినేత్రి సోనియా గాంధి చాలా ఆచితూచి మాట్లాడేవారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంతకన్నా తక్కువగా మాట్లాడేవారు. ఇది చాలా మందికి నచ్చలేదు. విషయం మీద అయినా సరే కుండబద్దలుకొట్టినట్టు తన అభిప్రాయాల్ని చెప్పేస్తారు అని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పేరుండేది. అయితే, ఇది అర్ధసత్యమే అనిపిస్తోందివారు స్పందించాల్సిన అవసమేలేని విషయాల మీద  అత్యుత్సాహం ప్రదర్శిస్తూ  స్పందించాల్సిన అవసరంవున్న విషయాల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు దేశమంతటా బలపడుతున్న అభిప్రాయం

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అక్కడి పోలీసులు తరచూ ఒక ప్రహసనం ఆడేవారు. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ఒక ముఠా కుట్ర చేస్తున్నదని ప్రచారం చేసేవారు. ఒకటి రెండు బూటకపు ఎన్ కౌంటర్లు జరిపి మృతుల్ని ముఠా సభ్యులుగా ప్రకటించేవారు. దానితో పోలీసులకు పదోన్నతులు, అవార్డులు మాత్రమేకాక వాళ్ళు లెఖ్ఖ చెప్పాల్సిన అవసరంలేని నిధుల కేటాయింపులు, అధికారాలు పెరిగేవి. ఇజ్రాయిల్ నుండో మరో దేశం నుండో అత్యాధునిక భద్రతా పరికరాలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేవి. అన్నింటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద సానుభూతి పెరిగేది.

దాదాపు ఇదే ఫార్మూలాను ఇప్పుడు నరేంద్ర మోదీ సలహాదారులు జాతీయస్థాయిలో అమలు చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ సంఘటనల తరువాత దేశంలోని దాదాపు యాభై విశ్వవిద్యాలయాల్లో అసమ్మతి రగులుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. నెహ్రు హరితవిప్లవం , ఇందిరాగాంధీ గరీబీ హటావో, రాజీవ్ గాంధీ ఐటీ విప్లవం, మన్మోహన్ సింగ్ గ్రామీణ ఉపాధిపథకం వంటి చెప్పుకోదగ్గ ఒక్క పథకాన్ని కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపొందించలేకపోయింది. మరోవైపు, ఆయన్ను ఏరికోరి తెచ్చుకున్న కార్పొరేట్ రంగానికి కూడా సంతృప్తికరంగా వున్నట్టులేదు. దేశంలో పెరుగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత అసహన వాతావరణం మీద రతన్ టాటా వంటి  కార్పొరేట్ దిగ్గజాలు సహితం తరచూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనేవున్నారు.  “(మోదీ) జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు 7 శాతం వుంటే ఏపీ పెరుగుదల రేటు 15 శాతం వుందని  ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబే అనేస్తుంటే నరేంద్రుని ప్రతిష్ట ఎంత వేగంగా దిగజారిపోతున్నదో అర్ధం అవుతుంది.

ఇలాంటి నైతిక సంక్షోభ సమయాల్లో ప్రయోగించడానికి నరేంద్ర మోదీ దగ్గర గుజరాత్ మార్కు సానుభూతి ఫార్మూలా ఎలాగూ వున్నది. దాన్నే వారు ఒడిషాలో ప్రయోగించారు. తనను అంతం చేయడానికీ, తన ప్రతిష్టను దెబ్బతీయడానికీ  తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి స్వచ్చంద సేవా సంస్థ (ఎన్జీవో)లు, యూరియా ఉత్పత్తిదారులు, ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు  కుట్రలు చేస్తున్నాయని బార్గడ్ రైతు సదస్సులో వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాయ్ వాలా ప్రధాని కావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఒక భావోద్వేగాన్ని కూడా వదిలారు. హిట్లర్ కూడా తనకు నైతిక సంక్షోభం వచ్చినప్పుడెల్లా తాను పేద కుటుంబంలో పుట్టాననీ,   పెళ్ళిచేసుకోలేదనీ, శాఖాహారిననీ, కమ్యూనిస్టులు, యూదులు తనను అంతం చేయడానికి కుట్రలు చేస్తున్నారని  చెప్పుకునేవాడట!

అధికార పార్టీ తప్పుల్ని ఎండగట్టి, ఎన్నికల్లో ఓడించి తాము అధికారాన్ని చేపట్టడమే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల ప్రకటిత లక్ష్యం. ఇందులో కుట్ర ఎక్కడ నుండి వచ్చిందీ? ప్రధాని ప్రసంగంలో యురియా ఉత్పత్తిదారుల ప్రస్తావన రైతుల కంటితుడుపు కోసమేతప్ప  మరోటి కాదు. ప్రధాని ప్రధానంగా ప్రస్తావించదలచింది స్వచ్చంద సంస్థల గురించి. విశ్వవిద్యాలయ విద్యార్ధుల ఆందోళనల వెనక కొన్ని ఎన్జీవోలు వున్నాయనీ, వాటికి విదేశాల నుండి నిధులు వస్తున్నాయనీ వారు ప్రస్పుటంగానే ఒక సంకేతాన్ని బలంగా ప్రజల్లోనికి పంపాలనుకున్నారు. ఇంకొంచెం తరచి చూస్తే క్రైస్తవ మిషనరీలు, ముస్లీం మదరసాలను వారు పరోక్షంగా ప్రస్తావించారని తెలుసుకోవడం కష్టమేమీకాదు.

బీజేపి, సంఘీ, ఓడిషా, క్రైస్తవ మిషనరీల ప్రస్తావన వచ్చిందంటే ఎవరికయినా క్రైస్తవ ఫాదర్  గ్రాహమ్ స్టేయిన్స్ హత్య కేసు గుర్తుకొస్తుంది. ఆస్ట్డేలియాకు చెందిన క్రైస్తవ సేవకుడు గ్రాహమ్ స్టేయిన్స్ భార్యాబిడ్డలతో భారత దేశానికి వచ్చి ఒడిషాలోని మయూర్ భంజ్, కేంఝోర్ జిల్లాల్లో ఆదివాసుల అభివృధ్ధికోసం పాటుపడ్డాడు. ప్రాంతంలో వేగంగా వ్యాపిస్తున్న కుష్టురోగ నివారణకు కృషిచేశాడు.       అయితే, గ్రాహమ్ స్టేయిన్స్ రెండు జిల్లాలోని ఆదివాసుల్ని క్రైస్తవులుగా మతమార్పిడి చేస్తున్నాడని  సంఘీయులు ప్రచారం చేసేవారు. అటల్ బీహారీ వాజ్ పాయి ప్రధానిగా వున్న కాలంలో  భజరంగ్ దళ్ కార్యకర్తలు అతన్ని హత్య చేశారు. 1999 జనవరి 23 రాత్రి కేంఝోర్ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్ళి మయూర్ భంజ్ తిరిగివస్తూ దారిమధ్యలో అలసిపోయి  రోడ్డు పక్కన వ్యాన్ నిలిపి అందులో తన ఇద్దరు కొడుకులతో పాటూ నిద్రపోయాడు. ఇదే అదనుగా  స్థానిక భజరంగ్ దళ్ నాయకుడు  దారాసింగ్  యాభైమంది అనుచరులతో  వ్యాన్ మీద దాడిచేసి, నిప్పుపెట్టి, ఇద్దరు చిన్న పిల్లలతోసహా స్టేయిన్స్ ను సజీవ దహనం చేశాడు. కేసులో ఒడిషా కోర్టు దారాసింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. స్టేయిన్స్ చనిపోయిన తరువాత కూడా  ఆయన భార్య గ్లాడిస్ ప్రాంతంలోనే కుష్టురోగులకు పైద్య సేవలు కొనసాగించింది. ఓడిషా ప్రభుత్వ సిఫార్సు మేరకు 2004లో భారత ప్రభుత్వం గ్లాడిస్ ను ప్రద్మశ్రీ బిరుదుతో సన్మానించింది

తమ మీద వచ్చే నిందల్ని తప్పించుకోవడానికి అధికారపార్టీలు తరచు చేసే వాదన ఒకటి వుంటుంది. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలకు కూడా ముఖ్యమంత్రినో, ప్రధానినో బాధ్యుల్ని చేయడం సరికాదని వారంటుంటారు. కారంచేడు నరమేధానికీ, చుండూరు దురాగతానికీ అప్పటి ముఖ్యమంత్రులు యన్ టీ రామారావు, యన్ జనార్దన రెడ్డి నేరుగా బాధ్యులు కాకపోవచ్చు. కానీ అప్పుడు వాళ్ళు పదవుల్లో వుండడంవల్లనే వాళ్ల సామాజికవర్గానికి చెందిన స్థానికులకు దాడి చేసే తెగువ వచ్చిందనేది మాత్రం ఎవ్వరూ  కాదనలేని నిజం.

ప్రధాని బార్గడ్  ప్రసంగంలో ఒక సున్నితమైన అంశం వుంది. కొంచెం విశ్లేషణ చేస్తే సంఘీయుల దృష్టిని వారు  క్రైస్తవ, ముస్లిం సేవాసంస్థల మీదికి మళ్ళీస్తున్నారని  సులువుగానే అర్ధం అవుతుంది. కేంద్రంలో అధికార పార్టి మొదలు, స్థానికంగా అధికారుల వరకుభరోసాను అందించడంవల్లనే దాద్రీలో అఖ్లాఖ్ హత్య జరిగిందని గుర్తు చేసుకుంటే భారత సమాజంలో సమీపభవిష్యత్తులో జరగనున్న పరిణామాల్ని ఊహించడం కష్టం కాదు.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ కార్యకర్త)

మొబైల్ నెం. 9010757776

Hyderabad 
23-2-2016

ప్రచురణ 
సాక్షి దినపత్రిక ఎడిట్ పేజి 24-2-2016
http://epaper.sakshi.com/730296/Hyderabad-Main/24-02-2016#page/4