Saturday, 17 October 2026

కపట మార్క్సిస్టులు విప్లవాలకు నాయకత్వం వహించలేరు

కపట మార్క్సిస్టులు విప్లవాలకు నాయకత్వం వహించలేరు

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

 ‘విప్లవోద్యమం :  కామ్రేడ్ కేఎస్ తదుపరి నాయకత్వం’ శీర్షికతో ఎన్ రవి  రాసిన వ్యాసాన్ని అరుణతార 2026 అక్టోబరు సంచికలో  ప్రచురించింది. నక్సలైటు ఉద్యమం ముగియడం మీద ఇటీవల నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని ఖండించడానికి రాసిన వ్యాసం ఇది. నా రచనల మీద వచ్చే కామెంట్లు, వ్యాసాలను సాధారణంగా పట్టించుకోను. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి స్పందించినపుడు మాత్రం ఒకసారి ప్రతిస్పందించాను. జంతర్ మంతర్ వద్ద జెన్ –జీ నిరసనల్నివిజయవంతంగా  నిర్వహించి, సింహాసనాన్ని వణికించి  దేశప్రజల్లో నియంతల పట్ల  భయాన్ని పోగొట్టినపుడు దళిత అభిజిత్ దీప్కే నేటి హీరో అని ప్రకటించాను.  దాన్ని ఖండిస్తూ ఓ కిరాయి కోటిగారు; సింహాసనం వణకలేదు; ప్రజాస్వామ్య విలువలతో ప్రతిస్పందించిందని ఓ వ్యాసం రాశారు. దాన్నీ పట్టించుకోలేదు. 


నక్సలైట్ ఉద్యమంలో ఎన్ రవి ఏ కీలక బాధ్యతలు నిర్వహించారో నాకు  తెలీదు. అలాంటివాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాను. వారి వ్యాసం అరుణతారలో వచ్చింది కనుక పట్టించుకోవాల్సివచ్చింది. ఇది నేను అరుణతారకు ఇస్తున్న గౌరవం; రవికి ఏమాత్రం కాదు.

 

కేఎస్, టిఎన్, సిపి, వీరన్న, లింపియావో, ఎంఎం, రవూఫ్ తదితర నాయకుల పేర్లతో నక్సలైట్ గ్రూపుల్ని సంభోదించే సాంప్రదాయం మనకు మొదటి నుండీ వుంది.  ఇంతకు  ముందు పీపుల్స్ వార్ ను కేఎస్ వర్గం అనేవారు; ఆ తరువాత గణపతి వర్గం అంటున్నారు. వర్గం అన్నప్పుడు ఒక్కడు అనికాదు ఒక బృందం అనే అర్ధం. అది ఏకవచనం కాదు; బహువచనం. ఇంత చిన్న వివరణ ఇవ్వడానికి ఒక వ్యాసం రాయాల్సిన పనిలేదు.

 

దాదాపు కాలి బూడిద అయిపోయిన విప్లవోద్యమాన్ని ఫీనిక్స్  పక్షిలా ప్రాణం పోసి ఏపుగా పెంచిన ఘనత కొండపల్లి సీతారామయ్యది. ఈ మాటను నాకన్నా ముందే చాలామంది చాలాసార్లు అన్నారు. నాకూ అదే అభిప్రాయం వుంది. దానికి కొనసాగింపుగా, “ఏపుగా పెరిగిన విప్లవోద్యమాన్ని కాల్చి బూడిద చేసిన ఘనత గణపతిది” అన్నాను. ఆ పని చేసింది గణపతి ఒక్కరేకాదు; నల్లా ఆదిరెడ్డి, చెరుకూరి రాజ్ కుమార్, మల్లోజుల కోటేశ్వరరావు, నంబాళ కేశవరావు, మల్లా రాజిరెడ్డిలతో కూడిన సమిష్టి నాయకత్వం ఈ పనిచేసింది అని జాబితాను పెంచారు ఎన్ రవి. ఒక్కరు చేసినా అరడజను మంది చేసినా జరిగింది ఒక్కటే. మల్లోజుల వేణుగోపాల్ తదితరులు నిర్వహించిన లొంగుబాటు జాతరకు ఈ నాయకత్వ బృందానికి సంబంధం లేదందామా? ఈ ప్రపంచంలో సంబంధం లేకుండా ఏదైనా వుంటుందా? ఆంటాలజీ!

 

‍ అతిశయోక్తులతో కేఎస్ ను నేను ఎన్నడూ పొగడలేదు. ఆయన్ను రాతలో విమర్శించిన సందర్భాలూ వున్నాయి.  ప్రతి ఒక్కరికీ ఒక చారిత్రక పరిమితి వుంటుంది. స్వయంగా కార్ల్ మార్క్స్ కు సామ్రాజ్యవాదం గురించి తెలీదు. ఆ విషయాన్ని లెనిన్ మాత్రమే చెప్పగలడు. ఇద్దరి కాలాలు వేరుకనుక. నా అంచనా మేరకు 1990ల ఆరంభం వరకే కేఎస్ పరిమితి. ఒకవేళ 1990 తరువాత కూడ ఆయన ఉద్యమ నాయకత్వంలో కొనసాగి వుంటే కొత్త ప్రపంచాన్ని అర్ధం చేసుకుని కొత్త సవాళ్లను అధిగమించేవారేమో  అన్నది ఒక ఊహాగానం మాత్రమే. హైపోథీసిస్.

 

1990ల ముందు కాలాన్ని కేఎస్ స్థూలంగా సరిగ్గానే విశ్లేషించారు. గణపతి బృందానికి వుండాల్సింది 1990ల తరువాతి కాలానికి సంబంధించిన లోతైన అవగాహన. అది వారికి లేదు. రవి వ్యాసంలోనే ఈ విమర్శలకు అనేక రుజువులున్నాయి.. “దేశంలో ఎన్నో ఆర్ధిక, సామాజిక మార్పులు సంభవిస్తున్నాయని గుర్తిస్తూ వాటిని అధ్యయనం చేయడానికి ప్రయత్నం జరిగిందిగానీ ఆ అధ్యయనంగానీ, దానికి అనుగుణంగా సాగాల్సిన ఆచరణగానీ మారిన పరిస్థితులకు సరిపోలలేదు”. “పార్టి నాయకత్వం సమిష్టిగానే విఫ్లలం అయ్యింది” .  “గత దశాబ్దకాలంలో ఓటమి తరువాత ఓటమిని ఎదుర్కొంటూ చివరకు సాయుధ ఉద్యమమే లేకుండా పోయింది” వంటి నిర్ధారణలు రవి వ్యాసంలో అనేకం కనిపిస్తాయి.

 

ఇంతకూ ఈ వ్యాసకర్త నాతో ఎక్కడ విభేదిస్తున్నట్టూ?  గణపతి ఒక్కరే కాదు; నాయకత్వంలో అందరూ విఫలం అయ్యారు అని చెప్పాడానికి మాత్రమే రవి ఈ వ్యాసం రాసినట్టున్నారు. రవి చేస్తున్న సవరణతో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నేను ఆమోదిస్తున్నాను. నా విమర్శల్ని ఆయన మరో మాటల్లో బలపరుస్తున్నారు. ధన్యవాదాలు రవి గారు!

 

ఇన్నాళ్ళూ నేను ఉద్యమానికి గర్భస్రావం జరిగిందనే భావనలో వున్నాను. ఈమధ్య తెలిసిన వివరాలు ఏమంటే మల్లోజుల బృందం ఉద్యమ గర్భసంచిని సహితం తొలగించి వచ్చిందట. దీనికి రవి చెప్పే సమిష్టి నాయకత్వం సమిష్టిగా బాధ్యత వహించదా?  

 

వ్యవస్థ భరించలేనంతగా కుళ్ళిపోయినప్పుడెల్లా యువతరం తిరగబడడం కొత్తదేమీకాదు. 1960-70లల్లో చెలరేగిన నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపింది బేబీ బూమర్సే. (నేను ఆ తరానికి చెందినవాడిని) 2026లో బేబి బూమర్స్ ల సాయుధ ఉద్యమం ముగియడం జెన్ జీలు నిరసనోద్యమాన్ని చేపట్టడం యాధ్డిఛ్ఛికం కాదు. అదొక చరిత్ర క్రమం. మళ్ళీ ఆంటాలజీ! ఒకటి ముగిసి మరొకటి మొదలవుతుంది.

 

సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక రంగాల్లో 1990లలో ఏర్పడిన కొత్త పరిణామాల సిండ్రోమ్ ను పీపుల్స్ వార్, / మావోయిస్టు పార్టిలు అధ్యయనం చేసి రూపొందించిన కొత్త సిధ్ధాంతాల డొల్లతనాన్ని అర్ధం చేసుకోవడానికి కూడ రవి వ్యాసంలో అనేక ఆధారాలున్నాయి.

 

సాంస్కృతిక అంశాల మీద నక్సలైట్ నాయకుల నిర్లిప్త వైఖరికి ప్రతిస్పందనగా అస్తిత్వ/ఉనికివాద ఉద్యమాలు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాల వ్యవస్థాపకులు నక్సలైట్/కమ్యూనిస్టు ఉద్యమాల నుండి వచ్చినవారే.  “మేమెంతో మాకంతా”, “జిస్కీ జిత్ని సంఖ్యాభారీ; ఉస్కి ఉత్ని హిస్సెదారి” నినాదాలు ఇచ్చారు వాళ్ళు.  “ప్రతి ఒక్కరికీ వారి శ్రమకు  తగినట్లుగా”అలాగే  “ప్రతి ఒక్కరి నుండి వారి సామర్థ్యానికి తగినట్లుగా, ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు తగినట్లుగా!” అనే సామ్యవాద సమాజపు నియమాలకు వర్తమాన  పరావర్తనాలే ఆ నినాదాలు. ఆ మాత్రం ఇంగితం పీపుల్స్ వార్ సమిష్టి నాయకులకు లేదు. బేబీ బూమర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమాల్లో చేరారు. వీటిని అడ్డుకోవడానికి  చాలా బలహీనమైన సిధ్ధాంతాలని పీపుల్స్ వార్ రూపొందించింది..

 

“(అస్తిత్వవాద)  పోరాటాలను బ్రాహ్మణీయ ఫ్యూడల్ భావజాలంతోపాటూ, సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా, దానితోపాటు ఆ సంస్కృతికి పునాదిగా నిలచిన వ్యవస్థను కూలదోసే వర్గపోరాటంగా మలచినపుడు మాత్రమే అది సాధ్యపడుతుందనే సైధ్ధాంతిక పోరాటం చేయవలసివస్తున్నది”.

 

పెద్ద పెద్ద గంభీర పదాలు తప్ప ఇందులో ఏ సిధ్ధాంతమూ లేదు. పోనీ ఆ సిధ్ధాంతాన్ని వాళ్లు ఆచరించిన దాఖలాలూ లేవు. ఇంగ్లీషువాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి మధ్యమధ్యలో లాటిన్ పదాలు వాడుతారు. ఈ ఆస్థాన మార్క్సిస్టు సిధ్ధాంతవేత్తలు సంస్కృత పదాలను తెగ వాడుతారు. నేల మీదికి తీసుకునివస్తే ఈ సిధ్ధాంతం బలం ఏమిటో తేలిపోతుంది.

 

“కోటాలు కాదు; ఎర్రకోట కావాలి” అంటూ మహత్తర నినాదాన్ని రంగంల్లోనికి దించారు. “ఇప్పుడు కోటాలు కావాలి; అంతిమంగా ఎర్రకోట కూడ కావాలి” అనవచ్చుగా. ఎర్రకోటను స్వాధీనం చేసుకోవడానికి మీకు ఎన్నేళ్ళు కావాలీ? వందేళ్ళు సరిపోతాయా? ఇది జరిగి నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. ఎర్రకోట కాదుకదా వున్న అబూజ్ మడ్ కూడ వదులుకుని సమూహంగా లొంగిపోయారు. మీరు చెప్పింది సాకారం చేసే దమ్ము మీకు లేనపుడు కోటాలు వద్దనే బూటకపు ప్రగల్భాలు దేనికీ? పైగా “ఇవన్నీ ఈ కాలంలో జరిగిన ప్రధాన సైధ్ధాంతిక పురోగతులలో కొన్ని మాత్రమే” అని ఘనంగా ముక్తాయింపు. ఇదా ప్రధాన సైధ్ధాంతిక పురోగతి!

 

అస్తిత్వవాద సమూహాల సామాజిక న్యాయం అంశం ముందుకు వచ్చినపుడు బేబీ బూమర్స్ సాయుధ ఉద్యమం నుండి బయటికి వచ్చి  వారి పక్షం వహించారు. 1984 ఢిల్లీ అల్లర్లు, 1985 కారంచెడు  హత్యాకాండ సమయంలోనే ఈ పరిణామాల్లో భాగం అయ్యాను. ఆపిదప బిఎస్ రాములు, గుంటూరు లక్షీ నరసయ్య, ఖాదర్ మొహియుద్దీన్, ఉసా  తదితరులు 1990లకు ముందే అస్థిత్వవాదులుగా ముందుకు వచ్చారు.

 

గణపతికి మద్దతుగా రవి ఒక హాస్యాస్పద అంశాన్ని ముందుకు తెచ్చారు. 1970లలో ప్రజాసంఘాలలో సభ్యత్వానికి కూడ మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానాన్ని ఆమోదించాలనే నియమం వుండేది. ఇలాంటి “అతివాద” విధానాన్ని తొలగించి గణపతి ప్రజాసంఘాల్లో సభ్యత్వాన్ని సరళీకృతం చేశారని రవి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కీలక ప్రశ్న ఏమంటే, సభ్యత్వాన్ని  సరళీకృతం చేసిన తరువాత ప్రజలు గుంపులు గుంపులుగా  వచ్చి చేరారా? లేక వున్నవాళ్ళే గుంపులు గుంపులుగా  దూరమైపోయారా?  రెండవదే జరిగింది అని చరిత్ర చెపుతోంది. ఈ మాత్రం దానికి గేట్లు ఎత్తేశామని గొప్పలు చెప్పుకోవడం దేనికీ?  రవి మీద వ్యక్తిగతంగా సాఫ్ట్ కార్నర్ వుంది. వారు ఇంత అమాయకులని తెలీదు. అమాయకులు ఇతరులకు సిధ్ధాంతాలను బోధించే దుస్సహసాలకు పాల్పడ కూడదు!

 

ముస్లిం, శిక్కు సమూహాలకు దృశ్యమానత (vigibility) ఎక్కువ. వంద మందిలో పది మంది వున్నాసరే వాళ్ళే ప్రముఖంగా కనిపిస్తారు. హిందూ-ముస్లిం బైనరీ మీద దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు తాము ఏం చేస్తే ఏ నిందవస్తుందోననే సెల్ఫ్ సెన్సారింగ్, సెల్ఫ్ రిస్ట్రైనింగ్ మోడ్ లో ముస్లిం సమాజం దాదాపు పుష్కర కాలంగా మసులుకుంటున్నది. “జబ్ జబ్ మోదీ డరేగా – తబ్ తబ్ హిందూ ముస్లిం కరేగా” అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో జెన్-జీ బొద్దింకలు ముందుకు తెచ్చిన నినాదం ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది.  

హిందూ - ముస్లీం బైనరీ మీద దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడయినా పీపుల్స్ వార్ / మావోయిస్టు పార్టి లోతుగా విశ్లేషించాయా?  కేవి రమణా రెడ్డి, కే బాలగోపాల్ వంటి కొందరు ఆలోచనాపరులు  ఆ మేధోమధనం గావించారు. పార్టీ లైన్ ఏమిటీ? అది ముఖ్యమైన ప్రశ్న.

మార్క్స్ ఏంగిల్స్ కమ్యూనిస్టు మానిఫెస్టో రాసే కాలంలో భార్యాభర్తలతో తొలి శ్రమ విభజన మొదలయిందని అన్నారు. ఓ 35 యేళ్ళ తరువాత ఏంగిల్స్ ‘కుటుంబము – వ్యక్తిగత ఆస్తి – రాజ్యాల పుట్టుక’ పుస్తకంలో దాంపత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశాడు. భర్త పెట్టుబడీదారీ వర్గం, భార్య శామికవర్గం అని నిర్ధారించాడు. వాళ్ల మధ్య వర్గ శతృత్వం కూడ వుంటుంది అన్నాడు.

వర్తమాన ఇండియాలో హిందూ సమాజం పెట్టుబడీదారీవర్గం; ముస్లిం సమాజం శ్రామికవర్గం, శిక్కులు శ్రామిక వర్గం, క్రైస్తవులు శ్రామికవర్గం బౌధ్ధులు శ్రామికవర్గం అని ఈ మహా మార్క్సిస్టు సిధ్ధాంతవేత్తలు  ఎప్పుడయినా తేల్చి చెప్పగలిగారా?  అలాగే మైదానవాసులు పెట్టుబడీదారీవర్గం; అడవివాసులు శ్రామికవర్గం అనాలి. పెత్తందారీకులాలు పెట్టుబడీదారీవర్గం; ఎస్సి, బీసిలను శ్రామిక వర్గం అనాలి. వీళ్ళు అనలేరు. కానీ, వీరికి అపర మార్క్సిస్టులుగా కీర్తి మాత్రం కావాలి. ఒక విధంగా వీళ్ళే మార్క్సిజంలో పోరాట స్వభావాన్ని నీరుగార్చి అందమైన మాటల గారడీగా మారుస్తున్నారు.

హిందూ- ముస్లిం బైనరీని గుర్తింపచేయడానికే కమ్యూనిస్టు పార్టీల మీద నేను తరచూ విమర్శల్ని ఎక్కుపెడుతున్నానని తెలియని వారు ఇప్పుడు ఎవరూ వుండరు. ఆ విషయం మిగిలినవారికన్నా రవికి ఇంకా బాగా తెలుసు.  విప్లవ విద్యార్ధి సంఘం యాభై యేళ్ళ సదస్సు సందర్భంగా వేదిక మీద ఆదివాసులు, ముస్లింలకు దక్కిన ప్రాతినిధ్యం ఎంత అని అడిగినపుడు చాలా రచ్చ జరిగింది. దాని నిర్వాహకుల్లో రవి ఒకరు. వారు చాలా తెలివైనవారు. ఆ సంఘటనను మరచిపోలేదు. మొత్తం వ్యాసంలో ముస్లిం అనే పదం మనకు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు, శిక్కులు, క్రైస్తవులు, బౌధ్ధులు  అనే పదాలూ కూడ వారి వ్యాసంలో మనకు కనిపించవు. ఇంకా తరచిచూస్తే ఎక్కడా ఆదివాసులు అనే పదం కూడ కనిపించదు. జాతులు అంటారేతప్ప వాళ్లెవరో చెప్పరు. వెరసి వీరొక కపట మార్క్సిస్టు! కపట మార్క్సిస్టులు విప్లవాభిమానులు, ఉద్యమ నాయకులు, ఉద్యమ అధికార ప్రతినిధులు అయిపోతే నాకో గట్టినమ్మకం కలుగుతోంది. వెయ్యేళ్లకు కూడ వీరు ఏమీ సాధించలేరు. ఐ యామ్ ష్యూర్ !  

15-10-2026


నా మీద ఎన్ రవి వ్యాసాన్ని అరుణతార ప్రచురించింది కనుక 

దానికి నా ఖండననూ అరుణతార  ప్రచురిస్తే అదొక మంచి సాంప్రదాయం అవుతుంది. 

గతంలో బిఎస్ రాములు వ్యాసాన్ని నేను చాలా తీవ్ర పదజాలంతో  ఖండించినపుడు కూడ అరుణతార ప్రచురించింది. 

రవి మీద నాకు సాప్ట్ కార్నర్ వుంది. ఎక్కడా తీవ్ర పదజాలాన్ని వాడలేదు.  చర్చనీయాంశానికి కట్టుబడే వ్యాసం రాశాను.

నా విమర్శ ఒక్కటే  -

1990 వరకు మాత్రమే సమాజాన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు అర్ధం చేసుకోగలిగాయి. దాన్ని సమర్ధంగా ఉద్యమ విజయంగా మార్చుకున్నాయా లేదా అన్నది వేరే అంశం. 

1990 తరువాత మారిపోయిన ప్రపంచాన్ని పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టీ మాత్రమే కాదు దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టి నాయకుడు కూడ అర్ధం చేసుకోలేకపోయారు. దానికి గణపతి మినహాయింపుకాదు. 

గణపతి చాలా ప్రయత్నించారు అని నాలుగు ఉదాహరణలు ఇచ్చిన ఎన్ రవి అంతిమంగా అవేవీ ఫలించలేదని ఆ వ్యాసంలో నాలుగుసార్లు అన్నారు. 

ఆ విఫలయత్న  వివరణ ప్రపంచానికి కావాలి. 

1990 తరువాత భారత రాజకీయార్ధిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా రూపుదిద్దుకున్న హిందూ-ముస్లిం బైనరీనీ పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టి కప్పిపుచ్చిందనే అభిప్రాయం నాకు బలంగా వుంది. 

ఒకవేళ నా వ్యాసాన్ని ప్రచురించరాదని అరుణతార సంపాదకవర్గం భావిస్తే ఆ విషయాన్ని వెంటనే నాకు తెలియపరచండి. 

నేను మరో పబ్లిషర్ కు పంపిస్తాను. 

అరుణతార కాకపోతే మరో మార్గంలో అయినా నా రచన పాఠకుల దగ్గరికి వెళ్ళాలి.

-డానీ 

Friday, 16 October 2026

ON Books

 

Books

పుస్తకాలు

 

ఇరవై అరలున్న నా పుస్తకాల గది నుండి ఆరు అరలున్న గదిలోనికి మారాల్సి వచ్చింది. ఆర్ధికంగా ఇది అనివార్యం.  నా పుస్తకాల కలెక్షన్లలో 70 శాతం తీసివేయాలి. తప్పదు. వేటిని వుంచుకోవాలీ? వేటిని వదులుకోవాలీ? అనేది చాలా పెద్ద సవాలు.  

 

బెడ్ టైమ్ కథలతో నాకు సాహిత్యంతో ఒక అనుబంధం ఏర్పడింది. మా అమ్మమ్మ ప్రతిరాత్రి అరేబియన్ నైట్స్ తదితర కథలు చెప్పేది. అప్పట్లోనే మా ఇంటికి షయా ఉర్దు పత్రిక వచ్చేది. అందులో గాడిద కథ వుండేది. వారంవారం మా అమ్మమ్మ దాన్ని చదివి వినిపించేది. అది ఏక్ గసర్గుజిస్ట్’ అనీ దాని రచయిత కిషన్ చందర్ అనీ నాకు ఓ ఇరవై ఏళ్ల తరువాత తెలిసింది.

 

మిడిల్ స్కూలులో పుష్పలత టీచర్, యూసుఫ్ మాస్టారు కూడ క్లాసులో చాలా ఆసక్తి కలిగించేలా జాపద కథలు చెప్పేవాళ్ళు వాళ్ల ప్రభావంతోనే అనుకుంటాను నేను లైబ్రరీకి వెళ్ళి చందమామ మాస పత్రికతోపాటు పిల్లల బొమ్మల కథలు అనేకం చదివేవాడిని. వాటి పబ్లిషర్లు రాజమండ్రివారు అని గుర్తుంది.  

 

ఆరేళ్ళు ఉర్దూ-అరబ్బి వాతావరణంలో పెరిగి తెలుగు స్కూలుకు వచ్చినవాడిని. పైగా నాకు భీకర ఉబ్బసం వుండేది. నా ఉఛ్ఛారణను తోటి విద్యార్ఢులు ఆట పట్టించేవాళ్ళు. నేను టెక్ట్స్ పుస్తకాలతో పాటు లైబ్రరీ పుస్తకాలు కూడ చదవడమేగాక, ఎనిమిదో తరగతిలోనే ఒక చిన స్కిట్ రాసి ప్రదర్శించాక నాకో చిన్న గుర్తింపు వచ్చింది. అవమానాలు తగ్గాయి. పుస్తకాలు నాకు చేసిన తొలి మేలు ఇది.

 

పుస్తకాలు నాకు ఇంకో మేలు కూడ చేశాయి. నేను అప్పడు హాఫ్ ఆర్ఫన్ ని. అప్పుల బాధ భరించలేక మానాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మా అమ్మీ కుటుంబ భారాన్నీ తన భుజాలకు ఎత్తుకుంది. మమ్మల్ని సాకింది. చదివించింది.  కొన్నిరాత్రుళ్ళు అన్నం వుండేది కాదు. ఆ విషయం మాకు చెప్పలేక మా అమ్మ హజ్రత్ ఉమర్ కాలపు ఒక కథ చెప్పేది. వారు ప్రతిరాత్రి దేశప్రజల స్థితిగతుల్ని తెలుసుకోవడానికి నగరంలో సంచరిస్తుంటారు. ఉరి చివర ఒక చెట్టు కింద ఒకామె పొయ్యి మీద కుండపెట్టి వంట చేస్తుంటుంది. పిల్లలు ఆతృతగా ఆకలితో ఎదురుచూస్తుంటారు. ఎప్పటికీ వంట పూర్తికాదు. వాళ్ళు అలిసి నిద్రపోతారు. పిల్లలు నిద్రపోయాక తల్లి పొయ్యి ఆర్పి తనుకూడా వాళ్ల పక్కన నిద్రపోతుంది. ఇదంతా చూస్తున్న హజ్రత్ ఉమార్ దగ్గరకు వెళ్ళి ఆ కుండ మీదున్న మూత తీసి చూస్తారు. అందులో నీళ్ళు మాత్రమే వుంటాయి.

 

ఈ కథ మా అమ్మ చెప్పిందంటే అన్నం వండలేదని అర్ధం. ఆ మాట నేరుగా చెప్పలేక కథ చెప్పేది. మరునాడు నేను వెళ్ళి పనిలో చేరాను. నేను చదువుకోవాలని, ఇంగ్లీషు మాట్లాడాలని  మా అమ్మ గట్టిగా చెప్పేది కనుక చదువు మానకుండ పార్ట్ టైమ్ బాల కార్మికుడిగా మారాను. ఆకలంత సహజంగా, అన్నమంత అవసరంగా, జీవించే మార్గాన్ని చూపించే మార్గదర్శిగా నా జీవితంలోనికి అలా సాహిత్యం ప్రవేశించింది.

 

మా అమ్మను సంతోషపెట్టాలని నేను కూడ  సాహిత్యాన్నే వాడాను. లైబ్రరీలో చదివిన లవకుశలు, బాల చంద్రుడు, బాలవర్ధిరాజు, అభిమన్యుడి కథల్ని మా అమ్మకు వినిపించే వాడిని. ఈ కథలు అన్నింటిలోనూ ప్రధాన పాత్రలకు తండ్రులు దూరంగా వుంటారు. తల్లి దగ్గరే పెరుగుతుంటారు.  నేను ఆ కథల్ని ఎందుకు చెపుతున్నానో మా అమ్మకు తెలుసు. “మనకు కూడ మంచిరోజులు వస్తాయి. అప్పటి వరకు మనం ఆరోగ్యంతో బతికి వుండాలి” అనేది.  ఈ ఆరోగ్య పాలన కూడ మా ఇద్దరి జీవన విధానంలో భాగం అయ్యింది. అలా సాహిత్యం వినియోగ వస్తువు అయిపోయియింది.

 

యుక్తవయస్సు  వచ్చాక మా తరం అంతా డిటెక్టివ్ నవలలు, సెక్స్ పుస్తకాలు అద్దెకు తీసుకుని చదివేవారు. నేనూ చదివానుగానీ చాలా తక్కువ కాలం. మా ప్రాంతంలో ఒక్క రూపాయికి సెక్స్ దొరికేది. దానికోసం అద్దె కట్టి పుస్తకాలు చదవడం దండగ అనిపించేది.

 

నరసాపురం, పాలకొల్లులో సాంఘీక నాటకాల బృందాలు చాలా వుండేవి. కాలేజీ నాటికల్లోనేగాక బయట పరిషత్తు నాటికల్లోనూ నటించాను. మేము భమిడిపాటి రాధాకృష్ట వంటి పెద్ద రచయితల నాటకాలు వేసేవాళ్ళం. కొన్ని బృందాలు  స్వంతంగానే రాసి ప్రదర్శించేవి. మా మధ్య పోటీ వచ్చి మేమే స్వంతంగా ఒక నాటిక రాయాల్సి వచ్చింది. మా టీమ్ ఆ బాధ్యతను నాకే అప్పచెప్పింది. నాకు అప్పటికే ఇంగ్లీషు సాహిత్యంతో కొంత పరిచయం వుంది. అకడమిక్ గా ఛార్లెస్ డికెన్స్ ను ఎలాగూ చదివాను. పెర్ల్ ఎస్. బక్, సోమర్ సెట్ మామ్  నవలలు కొన్ని చదివాను. అలా ఒక కొత్త ప్లాట్ తో ‘ప్రగతి’ నాటిక రాశాను. దానికి ధవళా సత్యంగారు దర్శకత్వం వహించారు. సాహిత్యరంగంలో వారు నాకు తొలిగురువు. వారి గురువు ఎం.జీ. రామారావుగారు. వారు నా నాటికకు అవసరమైన  పాట రాసిచ్చారు. ఆ నాటిక చాలా పెద్ద హిట్టు అయ్యింది. అలా కమ్యూనిస్టు సమూహాలతో పరిచయం ఏర్పడింది. ఒకసారి ఎంజీ రామారావుగారు నాకు గోర్కి అమ్మ పుస్తకాన్ని బహూకరించారు. అది నా సాహిత్య దృక్పథాన్నే మార్చేసింది. మా అమ్మమ్మలా పాఠకుడ్ని ఒళ్ళో పెట్టుకుని కథ చెపుతాడు గోర్కి. ఈ సామర్ధ్యం ఇతరుల్లో మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది.  

 

రాడికల్ గా మారాక నాకు తెగ నచ్చిన రచయిత జాక్ లండన్. మా ఇద్దరి జీవితాల్లోనూ చాలా పోలికలున్నాయి. పగలంతా కొట్లాటలు తన్నుకోవడాలు. గాయాలు. రాత్రంతా సాహిత్య సృజన. ఈ విషయాన్ని ఆశ్చర్యకరంగా కాళీ పట్నం రామారావుగారు గుర్తించారు. వారొకసారి నన్నూ కలవడానికి ప్రత్యేకించి వచ్చి  “మీలో ఒక జాక్ లండన్  వున్నాడండి’ అన్నారు. చాలా ఆనందం వేసింది. రాసే సమయంలో రచయిత ఒక యుధ్ధానికి సిధ్ధపడాలి. పురాణ కవుల్లో నాకు తిక్కన శైలి ఇష్టం.

 

యువ రచయితలు తొలి రోజుల్లో గుర్తింపు సమస్యను ఎదుర్కొంటుంటారు. నేను చాలా అదృష్టవంతుడ్ని నాకు ఆ సంక్షోభం ఎప్పుడూ రాలేదు. మొదట్లోనే ధవళా సత్యం, ఎంజి రామారావు వంటి వారి సాంగత్యం లభించింది.  కాళోజీ వంటి ఉద్దండులు నా ‘ప్రహ్లాదుడు’ కథను ఆకాశానికి ఎత్తేశారు. కాళీపట్నం రామారావు విషయం ఇంతకు ముందే చెప్పాను. రావి శాస్త్రిగారు ‘కృపాణ్’ కథను చదివి చలసాని ప్రసాద్ తో “ఇలా రేసే వారు విరసంలో ఇంకా వున్నారా?” అన్నారట. నా పుస్తకావిష్కరణ సభలో వరవరరావు “డానీ ఒక హీరో” అని ప్రకటించారు. అంతకన్నా గుర్తింపేమిటీ? అభిమానంతో నా గురించి కొన్ని మంచి వాక్యాలు రాసిన వారున్నారు. రావులపాటి సీతారామ్ నా ‘మదరసా మేకపిల్ల’  ముందు మాటలో చాలా గొప్ప మాటలు చెప్పాడు. అలాగే,  గుంటూరు లక్ష్మీ నరసయ్య నా పుట్టిన రోజు రైటప్ లో చాలా మంచి మాటలు రాశాడు. ఖాదర్ కూడ ‘పుట్టుమచ్చ’ ముందు మాటలో నా గురించి విలువైన మాటలు అన్నాడు. అందరికీ ధన్యవాదాలు.

 

ఒకటి రెండు కవితలు రాసినప్పటికీ కవిత్వం నా కప్ ఆఫ్ టీ కాదు. పైగా పద్యం అంతరించిపోయినట్టు కవిత్వం ప్రక్రియ కూడ సమీప భవిష్యత్తులో అంతరించిపోతుందనే అభిప్రాయం నాకెక్కడో వుంది. కథల్ని కూడ రొటీన్ గా మార్చేస్తున్నారు. ఓ గైడీ మాపాసా, ఓ సాదత్ హసన్ మంటోలా మన కథలు ఈ తరం వాళ్లకే ఎందుకు గుర్తుండడంలేదు?.  చెఖోవ్, లూసన్ అంతటి తెలివిని మన తరం  ఎందుకు ప్రదర్శించలేకపోతున్నదీ?

Thursday, 8 October 2026

Tupakulaguem

 Tupakulagudem (also spelled Thupakulagudem) most commonly refers to the Sammakka Sagar Barrage in Telangana or a rural village in Andhra Pradesh. [1, 2]

1. Sammakka Sagar Barrage (Tupakulagudem Barrage) — Telangana
  • Location: Built across the Godavari River near Tupakulagudem village, Eturnagaram Mandal, Mulugu district, Telangana

Sunday, 4 October 2026

సార్వత్రిక పౌరస్మృతి* *రాజ్యాంగ బహుళత్వాన్ని రద్దు చేద్దామా?*

UCC Controversy


*సార్వత్రిక పౌరస్మృతి* 

*రాజ్యాంగ బహుళత్వాన్ని రద్దు చేద్దామా?*

నా వ్యాసాన్ని ప్రచురించిన తెలుగు ప్రభకు ధన్యవాదాలు 

*డానీ*

*సమాజ విశ్లేషకులు*





బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే సార్వత్రిక పౌరస్మృతిని (యూసిసి) అమలు చేస్తామన్న నమ్మకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు.  సార్వత్రిక పౌరస్మృతి అంటే వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, సంరక్షణ వంటి కుటుంబ–వ్యక్తిగత చట్టాలను మతభేదం లేకుండా ఒకే న్యాయవ్యవస్థలోకి

తీసుకుని రావడం. “అందరికీ ఒకే చట్టం”, “చట్టం ముందు అందరూ సమానం” అనే మాటలు వినడానికి ఎంతో ఆకర్షణీయంగా ఆదర్శంగా ఉంటాయి. కానీ అసలు ప్రశ్న అక్కడితో ఆగదు. ఆ చట్టాన్ని ఎవరు రూపొందిస్తారు? ఏ సామాజికవర్గాల  సాంప్రదాయాన్ని ప్రమాణికంగా తీసుకుంటారు? ఇతర సమాజాలపై దాన్ని ఎలా ప్రయోగిస్తారు? అనేవే యూసిసిలో ప్రధాన

వివాదం. 


వ్యక్తిగత చట్టం ఎక్కడి నుంచి వచ్చింది?


ప్రతి మతసమూహం తనదైన ప్రత్యేక  సంస్కృతిని కలిగివుంటుంది. ఇది బాహ్య వైవిధ్యం.

అలాగే, అంతర్గతంగానూ అనేక సమూహాల మధ్య భిన్నత్వం వుంటుంది. ఇది అంతర్గత వైవిధ్యం. సమాజంలో సాంస్కృతికంగా ఇంతటి వైవిధ్యం వున్నప్పుడు సార్వత్రిక నేరస్మృతిని విధించినట్టు  సార్వత్రిక పౌరస్మృతిని విధించడం సాధ్యం కాదు.  మనదేశంలో

ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయిన కొత్తలోనే ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం చెలరేగింది. స్థానిక సాంస్కృతిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని కంపెనీ పాలకులకు అర్ధం అయింది. మతం ఆధారంగా కుటుంబ వ్యవహారాలను నియంత్రించే చట్టపరమైన పద్ధతి రూపొందింది. కంపెనీ బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ 1772లో జుడీషీయల్ ప్లాన్ రూపొందించాడు.  సాంప్రదాయాలు ఆచారాల విషయంలో హిందువులకు “శాస్త్రాల్ని,

ముస్లింలకు ఖురాన్ ను,  వర్తింపచేయాలని న్యాయస్థానాలను ఆదేశించాడు. హిందూ ధర్మశాస్త్రాలు అనేకం వున్నప్పటికీ మనుధర్మశాస్త్రాన్ని ప్రమాణికంగా భావించేవారు.  ఆ క్రమంలో ఆంగ్లో-హిందూ లా, ఆంగ్లో-ముహమ్మడన్ లా రూపొందాయి. బ్రిటీష్ భాషాశాస్త్రవేత్త విలియం జోన్స్ 1794లో Institutes of Hindu Law; or the Ordinances of Manu. పేరుతో

మనుస్మృతిని ఇంగ్లీషులోనికి అనువదించాడు.  


హిందూ సమాజాన్ని ఒక వృత్తంలో ఏడు వృత్తాలుగా సమాంతరంగానూ  చూపించవచ్చు. పిరమిడ్ ఆకారంలో నిలువుగానూ చూపించవచ్చు. శిఖరభాగంలో బ్రాహ్మణులు, ఆ కింద క్షత్రీయులు, దాని కింద  వైశ్యులు, దాని కింద ఎగువ శూద్రులు, దాని కింద దిగున శూద్రులు. ఈ ఐదు అంతస్తులనే చాలామంది వర్ణవ్యవస్థ అంటున్నారు. ఆ కింద దళితులు వుంటున్నారు..

కొంతకాలం క్రితం వరకు ఆదివాసులు హిందూ వ్యవస్థకు భిన్నంగావుండేవారు. ఇటీవల జనాభా లెఖ్ఖల్లో ఆరుమతాల్ని మాత్రమే గుర్తిస్తూ ఆదివాసుల్ని హిందూ సమూహపు  గ్రౌండ్ ఫ్లోర్ లో చేర్చారు. దీన్ని  కాగితాల మీద చూస్తే పెద్ద విశేషంగా  అనిపించదు.  కానీ సమాజంలో ఆ రెండు సమూహాలను కలిపినపుడు కొన్ని వివాదాలు చెలరేగుతాయి. ఉదాహరణకు మణిపూర్ లో మెయితీలు, కుకీ జోలు ఒకే సామాజికవర్గం అంటే కుకీ జోలు అంగీకరించకపోవచ్చు.


నాడు వారెన్ హేస్టింగ్స్ అనుసరించిన విధానాన్నే రాజ్యాంగ సభ కూడా అనుసరించింది. ఎవరి మతం వారిదీ, ఎవరి ఆరాధనారూపాలు వారివి, ఎవరి సాంస్కృతిక వ్యవహారాలు వారివి అనే అనే నిర్ధారణకు వచ్చింది. మత స్వేఛ్ఛను రాజ్యాంగ బధ్ధం చేసింది. ఉమ్మడి పౌరస్మృతి అంశం కూడ  రాజ్యాంగసభలో చర్చకు వచ్చింది. ఆ తేనెతుట్టెను కదపడం ఇష్టంలేక దాన్ని ఆదేశిక సూత్రాల్లో   44వ అధీకరణంగా పెట్టేశారు. 


రాజ్యాంగం నాలుగవ షెడ్యూలు లోని  ఆదేశిక సూత్రాల్లో 36 నుండి 51 వరకు16 అధీకరణలున్నాయి. ఆర్టికల్ 38 సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం గురించి చెబుతుంది. ఆర్టికల్ 39 సంపద, ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణను నిరోధించడం, సామాజిక వనరులను సామాన్య మేలు కోసం వినియోగించడం గురించి చెబుతుంది. ఆర్టికల్ 41 పని, విద్య, ప్రజా సహాయం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ ఆదేశాలను పాటిస్తున్నారా? వాటిని పాటించకుండా నేరుగా ఆర్టికల్ 44 చెప్పిందని ఆచరిస్తామనడం సబబేనా? 


కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్

370) రద్దు, ఉమ్మడి పౌరస్మృతి (ఆర్టికల్ 44) అమలు అనే డిమాండు  బిజెపి మాతృసంస్థ అయిన జనసంఘ్ కాలం నుండే వున్నాయి. 1980లలొ బాబ్రీమసీదు కూల్చివేత అంశాన్ని కూడా చేర్చుకున్నారు. కాస్త గమనించి చూస్తే ఇవి మూడూ సారాంశంలో ముస్లిం వేధింపు విధానాలని ఎవరికయినా అర్ధం అవుతుంది. లోక్ సభ ఎన్నికలప్పుడు ఈ డిమాండ్లను బిజెపి ముందుకు తెస్తుంటుంది. వీటిల్లో రెండు నెరవేరాయి. 2029 ఎన్నికలకు ఉమ్మడి పౌరస్మృతిని ముందుకు తెచ్చారు. 


ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి బిజెపి చేస్తున్న వాదన ఒక్కటే.   ముస్లిం స్త్రీల మీద సాగుతున్న అణిచివేతను  అడ్డుకుంటామని. ఇస్లామిక్ పౌరస్మృతిలో తండ్రి ఆస్తిలో కుమార్తెకు ఒకవాటా, కుమారుడికి రెండు వాటాలు ఇస్తారు. ఆ ఒక్క అంశాన్నే విడిగా చూస్తే ఇది  అన్యాయంగానే కనిపిస్తుంది. దీనికో సమర్ధన కూడ వుంది. కుమార్తె పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోతుంది. వృధ్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూడాల్సిన నైతిక బాధ్యత కొడుకులది.  అంతేకాదు,  కుమార్తె వివాహ సందర్భంలో కట్నకానుకలు  కూడ ఇవ్వాల్సి వుంటుంది. కనుక కొడుకులకు రెట్టింపు వాటా ఇవ్వాలనే సమర్ధన వుంది. ఇది అసమంజసం ఏమీకాదు. చట్త ప్రకారం వరకట్న నిషేధం వుంది. అది ఆచరణలో లేదని ఏ ఒక్కరయినా నమ్ముతారా? 


ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం 7వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాము.  ఆ సమయంలో, స్త్రీలకు ఆస్తిహక్కు, నిర్బంధ విద్య, విడాకులు ఇచ్చే సదుపాయం, వితంతు పునర్వివాహం వంటి సంస్కరణల్ని ఇస్లాం చేపట్టింది. ఈ మహిళా సంస్కరణలు అనేక ఇతర సమూహాల్లో వెయ్యేళ్ళ తరువాతకు గానీ చర్చకు రాలేదు. 


ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి మీద సంతానానికేకాక, భార్య, తల్లిదండ్రులు, సోదరులు, ఇతరులకు కూడ భిన్నమైన నిష్పత్తుల్లో వారసత్వ హక్కు వస్తుంది. ఈ వాటాల్ని లెక్కగట్టి పంపకాలు జరపడం చాలా చాలా సంక్లిష్ట వ్యవహారం.. 9వ శతాబ్దంలో   పర్షియన్,

ఇస్లామిక్, భారతీయ, గ్రీకు, బాబిలోనియన్ గణితశాస్త్రాల నుండి ఆల్ జీబ్రా విభాగాన్ని అభివృధ్ధి చేసిన అల్-ఖ్వారిజ్మీ  ఇస్లామిక్   ఆస్తి పంపకాల సమస్యను పరిష్కరించాడు. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో విరివిగా వాడుతున్న అల్గారిథమ్స్ అతని పేరు నుండే పుట్టింది.  


          ముస్లిం సమాజాన్ని అదుపు చేయడానికి ఈ చట్టాన్ని తెస్తున్నట్టు బిజెపి పెద్దలు చెపుతున్నప్పటికీ ఇది ఆదివాసుల మీద తీవ్ర ప్రభావాన్ని వేసే ప్రమాదం వుంది. బయటి ప్రపంచానికి అర్ధంకానంత తీవ్ర వైవిధ్యం ఆదివాసుల్లో వుంటుంది. అసలు వాళ్లను పితృస్వామిక సమాజం అనడం కూడ కుదరదు. అది దాదాపుగా మాతృస్వామిక సమాజం. వాళ్ల మీద ఏకీకృత పౌరస్మృతిని రుద్దడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.  భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూళ్ళలో ప్రత్యేక గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా రక్షణలను కల్పిస్తున్నాయి. అంతేకాదు, నాగాలాండ్‌కు 371ఏ అధీకరణం ద్వార, మిజోరాంకు 371జి ద్వార ప్రత్యేక నిబంధనలు మత, సామాజిక ఆచారాలు, కొన్ని న్యాయపద్ధతులు, భూమి యాజమాన్యం వంటి అంశాల్లో ప్రత్యేక రక్షణలు వున్నాయి. వీటన్నింటినీ రద్దుచేయడానికే ఉమ్మడి పౌరస్మృతిని తెస్తున్నట్టు ఆదివాసి సమాహాలు ఐదారేళ్ల క్రితమే గుర్తించాయి. ఝార్కండ్ లో చాలా పెద్ద సభ నిర్వహించి ఉమ్మడి పౌరస్మృతిని తిరస్కరిస్తున్నట్టు తీర్మానాలు చేశాయి.  ఈ కారణంగానే, తొలిసారిగా ఉత్తరాఖండ్ లో తీసుకునివచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టంలో మాదివాసులు, మరికొన్ని సమూహాలకు మినహాయింపునిచ్చారు. కొన్ని సమూహాలను మినహాయిస్తే దానిని ఉమ్మడి పౌరస్మృతి అని ఎలా అంటారో అమిత్ షా చెప్పాలి. 


ముస్లింలు ఎక్కువమందిని పెళ్ళిచేసుకుని, ఎక్కువ మంది పిల్లల్ని కనేస్తున్నారనే ఆరోపణలతో ఒక ప్రచారం సాగుతోంది. “హమ్ పాంచ్, హమారే పచ్చీస్” నిందను నరేందర్ మోదీ స్వయంగా ప్రచారంలో పెట్టారు. జనాభా లెఖ్ఖలు దీన్ని సమర్ధిస్తున్నాయా? ప్రస్తుతం మనదేశంలో చనిపోతున్నవాళ్లకన్నా పుడుతున్నవాళ్ళు తక్కువ. టోటల్ ఫెర్టిలిటీ రేటు  రుణంగా మారిపోతున్న దశలో  ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్లను సన్మానించాలి. ఇలా

నిందలేస్తారా? ఇస్లాంలో బహుభార్యత్వానికి ఆమోదంవున్న విషయం వాస్తవం. కానీ, దాన్ని ఆచరిస్తున్నదెంతమందీ? దాదాపుగా అది ఆచరణలో లేదు.   అధికారికంగా బహు భార్యలు వున్నవారిని మనం ఎంతమందిని చూశాం అని ప్రశ్నించుకుంటే ఈ వాదనలోని డొల్లతనం అర్ధం అవుతుంది. 


జె4న్ జీ ఉద్యమం ఒక నినాదాన్ని ముందుకు తెచ్చింది. – “జబ్ నరేంద్ర మోదీ డర్తా హై; హిందూ ముస్లిం కర్తాహై”. ఈ వ్యూహం  ఎన్నికల్లో తమకు లాభిస్తుందని బిజెపి నమ్ముతోంది.

అది ఉమ్మడి పౌరస్మృతికి కూడ వర్తిస్తుంది.  ఉమ్మడి పౌరస్మృతిని తెస్తామంటే అది రాజ్యాంగం కోరుకున్న సామాజిక బహుళత్వాన్ని నిరాకరించడమే అవుతుంది. 


05-10-2026


ఇక్కడో చిక్కు వుంది.  మొత్తం హిందూ సమాజం మనుస్మృతిని సివిల్ కోడ్ గా ఏకగ్రీవంగా అంగీకరిస్తుందని చెప్పగలమా?  ఇంతకన్న పెద్ద చిక్కు ప్రశ్న  ఏమంటే అసలు ‘హిందూ సమాజం పరిధి, పరిమితి ఏమిటీ అనేది.  శ్రీధర్ వెంకటేశ్ కేట్కర్ 1909లో రాసిన *History

of Caste in India*లో కుల వర్గీకరణను విశ్లేషిస్తూ బ్రాహ్మణులను కేంద్ర బిందువుగా తీసుకుని

వివిధ వర్ణాలు, కులాలతో హిందూసమాజనిర్మాణం జరిగిందని వివరించారు. అంబేడ్కర్ కూడా హిందూ సమాజాన్ని ఏకశిలా సమూహంగా చూడలేదు, కులం అనేది “దడికట్టిన వర్గం”, “నిచ్చెనమెట్ల వ్యవస్థ” అన్నాడు.


మను పౌరస్మృతిని  బీఆర్ అంబేడ్కర్ మొదటి నుండీ తీవ్రంగా విమర్శించేవాడు.

మహాద్  చెరువు నీటి ఉద్యమ కాలంలో 19127 డిసెంబరు 25న ఆయన  మనుస్మృతి ప్రతిని ప్రతీకాత్మకంగా దహనం చేశాడు. స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలతో మనుస్మృతిని ఎదుర్కోవాలని ఆయన భావించేవాడు. కాలక్రమంలో అవే భారత రాజ్యాంగ ప్రధాన ఆదర్శాలుగా మారాయి. ఈ పరిణామం మనువాదులకు కూడ తెలుసు. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినపుడు  ఆరెస్సెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దాని పత్రిక ఆర్గనైజర్ 1950 ఫిబ్రవరి 6 నాటి సంచికలో

మనువు తమ తమ హృదయాలను పాలిస్తుంటాడు అని ప్రకటించింది. 


భారత ముస్లిం సమాజంలోనూ అంతస్తులున్నాయి. అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ అనే  వర్గ విభజన వుంది. అజ్లాఫ్, అర్జాల్ సమూహాలను ఉత్తరాదిన పాస్మందా ముస్లింలు అంటున్నారు. దక్షణాదిన చాలా పేర్లున్నాయి.  నూర్ బాషా, దూదేకుల, లద్దాఫ్ వంటివి.  వాళ్ళు సామాజికంగా హిందూ ఓబిసిలతో సమానం. అయితే,. ఇక్కడ ఒక తేడావుంది. హిందూ సమూహంలో వర్ణ వర్గీకరణకు ధార్మిక సమర్ధన వున్నట్టు,  ఇస్లాంలో ధార్మిక సమర్ధనలేదు. కానీ, ఆచరణ వుంది.

ఆ మేరకు సాంస్కృతిక వైవిధ్యం కూడ వుంది. 

Wednesday, 23 September 2026

September 17 - Everyone has their Own History.

 September 17 360 Degrees

 

*సెప్టెంబరు 17, ఎవరి చరిత్ర వారిది*

*నిజాం రాజు చివరి సంవత్సరం*

*డానీ*

*సమాజ విశ్లేషకులు*



నిజాం చరిత్రలో  ఎవరికి ఎలా కావాలో అలా కనిపించే  రోజు సెప్టెంబరు 17.  విలీనం, విమోచన, విద్రోహం, ప్రజాపాలన వగయిరా  చాలా పేర్లతో చాలామంది దాన్ని పిలుస్తున్నారు. ఒక బిందువు దగ్గరుండే డిగ్రీలలో ప్రతిదానికీ  ఓ నేరేటివ్ ను ఎంచుకుని  సెప్టెంబరు 17 మీద ఓ 360 అధ్యాయాల చరిత్రను రాయవచ్చు. 

నిజాం పరిపాలన చట్రం మూడు అంతస్తుల దొంతర. కింద దేశ్ ముఖ్ లు, పైన నిజాం అనే  పరిపాన చట్రమే బహుళ ప్రచారంలోవుంది. ఆపైన బ్రిటీష్ రెసిడెంట్ వుండేవాడని చాలామందికి  తెలీదు. నిజాం సంస్థానంలో బ్రిటీష్ రెసిడెంట్ ను గుర్తించినవాడు  తుర్రేబాజ్ ఖాన్. సిపాయిల తిరుగుబాటు సమయంలో  కోఠీలోని రెసిడెంట్ భవనం మీద దాడిచేశాడు.   ఈ మూడు అంతస్తుల పరిపాలన నిర్మాణ  చట్రం తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం మీద అప్పటి కమ్యూనిస్టు నాయకులు రాసిన  పుస్తకాల్లోనూ కనిపించదు. 

మత ప్రమాణాలతో చూస్తే మూడు అంతస్తుల్లోనూ  మూడు మతాల ప్రాబల్యం కనిపిస్తుంది. పరిపాలన కింది అంతస్తుల్లో హిందూ  జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు కనిపిస్తారు. ఆపై అంతస్తులో ముస్లింల ప్రాబల్యం కనిపిస్తుంది. అన్నింటికన్నా పైన కనిపించని  అంతస్తులో  ఆంగ్లేయ క్రైస్తవుల ప్రాబల్యం కనిపిస్తుంది. కింది అంతస్తులో ముస్లిం జాగీర్దార్లు  అస్సలు లేరనికాదు. వాళ్ల సంఖ్యా చాలా చిన్నది, విసునూరు, ఎర్రపహాడ్ జాగీర్దార్లతో పోలిస్తే వాళ్ల స్థాయి కూడా చాలా చిన్నది. ముస్లిం జాగీర్దార్లకు వ్యతిరేకంగా అక్కడి రైతులు పోరాడారు అనే మాట కూడ మనకు ఎక్కడా వినిపించదు. ఇది కూడ ఒక నేరేటివ్. 

          1527 వరకు ఈ ప్రాంతాన్ని ఖిల్జి, తుగ్లక, బహమనీ వంశాలు పాలించాయి. కులీ కుతుబ్ షాహీలు 1687 వరకు దాదాపు 160 యేళ్ళు పాలించారు. ఆ తరువాత కొంత కాలం మొఘలులు ఢిల్లీనుండి నేరుగా  పాలించారు.. 1724లో ఆసఫ్ జాహీ పాలన మొదయింది. దీనే నిజాం పాలన అంటున్నాం. ఇది ఇంకో  224 ఏళ్ళుసాగి 1948లో సంస్థానం ఇండియాలో విలీనం కావడంతో ముగిసింది. 

 కులీ కుతుబ్ షాహీల పాలన గురించి ఎవరికీ పెద్దగా విమర్శలు, ఆరోపణలు లేవు. ఆసఫ్ జాహీల 160 సంవత్సరాల పాలనలో ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ వరకూ పెద్దగా విమర్శలు లేవు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో  విమర్శలున్నాయి. అందులోనూ ఎక్కువ వివాదాస్పదమైనది చివరి ఏడాది మాత్రమే. స్పష్టంగా చెప్పాలంటే ఇండియాకు స్వాతంత్ర వచ్చి అందులో విలీనం కావడానికి  నిజాం తిరస్కరించిన తరువాతే వివాదాలు పెరిగాయి. నేరేటివ్స్ మారిపోయాయి.

నిజాం ఒక రాజు. సంస్థానాధీశుడు. సంస్థానాధీశులకుండే రాజరిక దుర్లక్షణాలన్నీ అతనికి వున్నాయి. వాళ్లకు ఉండాల్సిన అవసరంలేని కొన్ని గొప్ప లక్షణాలు కూడ  అతనికి వున్నాయి. నీటి పారుదలా, డ్రైనేజి,  విద్యుత్తు, రోడ్లు, రైల్వే, విమానయాన, వైద్య, విద్య, పారిశ్రామికవాడలు తదితర  మౌలిక  సదుపాయాలన్నింటినీ గొప్ప నాణ్యతతో  ఇప్పటికీ గుర్తు ఉండిపోయేలా  ఏర్పాటు చేశాడు.  ఆదిఆంధ్ర భాగ్యరెడ్డి వర్మను ప్రోత్సహించాడు. అంబెడ్కర్ కు స్కాలర్షిప్ అందించాడు. శాంతి నికేతన్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చాడు. 20  వ శతాబ్దం ఆరంభంలోనే రాబోయే వందేళ్లలో హైదరాబాద్ లో  పెరిగే జనాభాకు సరిపడా తాగునీటి  సదుపాయం కల్పించాడు. 

          ఇరవయ్యవ శతాబ్దం తొలి దశాబ్దంలోనే నిజాం సంస్థానంలో ఆర్యసమాజ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. 1927లో మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఆవిర్భవించింది. కొంచెం అటూఇటుగా సంస్థానంలో హిందూ మహాసభ కూడ  ప్రవేశించింది. 1938లో పారా మిలటరీ సంస్థగా రజాకార్ మొదలయ్యింది. గ్రామీణ ప్రాంతంలో దేశ్ ముఖ్ లు, జాగీర్దార్లకు బాసటగా నిలబడడం దీని ప్రధాన బాధ్యత. రజాకార్లలో హిందూ ముస్లింలు కూడ వుండేవారు. వాళ్లను దేశ్ ముఖ్ లు, జాగీర్దార్లు పోషించేవారు. 

మహాత్మా గాంధీ హంతకుడైన, హిందూమహాసభ నాయకుడు  నాథురాం గాడ్సే 1930లలో కొంతకాలం నిజాం సంస్థానంలోనూ  పనిచేశాడు.  1922  లో ఆంధ్ర జనసంఘం ఏర్పడి 1930 లో ఆంధ్రా మహాసభగా మారింది. అది క్రమంగా కమ్యూనిస్టు పార్టీ  ప్రభావం లోనికి వెళ్ళింది.  ఆర్యసమాజ్ కు చెందిన స్వామి రామానంద తీర్థ కాంగ్రెస్  రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ప్రగతిశీలురైన ముస్లింలు హైదరాబాద్  కేంద్రంగా కామ్రేడ్స్  అసోసియేషన్స్ గా ఏర్పడి పనిచేయడం మొదలెట్టారు. ఇందులో ముస్లిమేతర సభ్యులు ఇద్దరు ముగ్గురు మాత్రమే.  ఒక విధంగా ఇది వామపక్ష భావాలుగల ముస్లీం ఆలోచనాపరుల సంస్థ. ప్రగతిశీల భావాలుగల ముస్లింలు కూడ సంస్థానంలో వుండేవుంటారు.  తెలంగాణలో తొలి అమరుడు బందగి. చివరి అమరుడు పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్. రజాకార్లు అతన్ని అతి క్రూరంగా  హత్యచేశారని తెలిసిన తరువాత మాత్రమే నెహ్రు పోలీస్ యాక్షన్ కు అనుమతి ఇచ్చాడని అంటారు.

 

రెండవ ప్రపంచ యుధ్ధం ముగిసే నాటికి బ్రిటీష్ ఇండియాకు స్వాతంత్ర్యం రాబోతున్న విషయం ఖాయం అయిపోయింది. నిజాం సంస్థానంలో హిందూమహాసభ, ఆర్య సమాజ్, జాతీయ కాంగ్రెస్,  కమ్యూనిస్టులు, ఆంధ్రమహాసభ క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.  హిందూ మహాసభ, ఆర్య సమాజ్ ల లక్ష్యం ముస్లిం రాజు పాలనను అంతం చేయడం. కాంగ్రెస్ లక్ష్యం సంస్థానాన్ని బ్రిటీష్ ఇండియాలో విలీనం చేయడం. కమ్యూనిస్టుల లక్ష్యం తెలంగాణలో (నిజాం సంస్థానంలో కాదు) రైతు కూలీ రాజ్యాన్ని స్థాపించడం. అప్పటి విద్యావంతులైన పెత్తందారీ కులాల ఉమ్మడి కుటుంబాల్లో ఈ నాలుగు సంస్థల ప్రతినిధులు ఉండేవారు. ఉర్దూ ముస్లీం సమాజంలోని ప్రజాస్వామికవాదుల కార్యకలాపాలను చరిత్ర నమోదు చేయలేదు.

ఇలా ఉండగా అప్పటి నల్గొండజిల్లాలోని  కడివెండి గ్రామంలో విసునూరు దేశ్  ముఖ్  రామచంద్ర రెడ్డి  మనుషులు కమ్యూనిస్టు కార్యకర్త  దొడ్డి కొమరయ్యను 1946 జులై హత్యచేశారు. ఇది తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ సాయుధ పోరాట ఆరంభానికి  దారితీసింది. 

పోరాటం మొదలయిన ఆరు నెలల తరువాత 1946 డిసెంబరు లో ఖాసిం రజ్వీ రజాకార్ల నాయకుడయ్యాడు. అప్పటికే బ్రిటీష్ ఇండియాలో స్వాతంత్ర్యం వస్తున్నదనే విషయం రూఢీ అయ్య్యి రాజ్యాంగ సభ ఏర్పడింది. నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ను కూడ ప్రవేశ పెట్టారు. నిజాంను స్వతంత్ర దేశంగా నిబెట్టడం రజ్వీ ముందున్న  సవాళ్ళలో కీలకమైనది.  దాన్ని సామరస్యంగా సమర్ధంగా  సాధించడం చేతకాక విఫలుడై,  నిస్పృహకు గురై అంతులేని అరాచకాలకు పాల్పడి అత్యంత వివాదాస్పదుడిగా మారాడు. 

ఏగుడ్డివానికీ అర్ధంకాని ఏనుగులా నిజాం సంస్థానం ఎవరికీ పూర్తిగా అర్ధం కాదు. ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఆంధ్ర భాషలతో ఇతర అనేక భాషల్ని మాట్లాడేవారు నిజాంలో నివశించేవారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద పుస్తకాలు రాసిన కమ్యూనిస్టు రచయితలు ప్రధానంగా తెలుగు భాషకు సంబంధించిన వారు. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పనిచేసినవారు. వీరికి ఆనాటి పరిణామాల గురించి పాక్షికంగా మాత్రమే తెలుసు. భౌగోళికంగా చెప్పాలంటే, ఆంధ్రాప్రాంతం (ఉమ్మడి మద్రాసు రాష్ట్రం)తో  సరిహద్దుగల వరంగల్, నల్గొండజిల్లాలలోనే వీరి కార్యకలాపాలు వుండేవి. అప్పట్లో వచ్చిన తెలుగేతర సాహిత్యం గురించి కూడ వీరికి తెలియదు. వీరికి ఆంధ్రాప్రాంతం నుండి నిజాం సంస్థానంలోనికి వచ్చిన పోలీస్ యాక్షన్ గురించి మాత్రమే తెలుసు. మహారాష్ట్ర ప్రాంతం నుండి నిజాం సంస్థానంలోనికి వచ్చిన పోలీస్ యాక్షన్ గురించి దాదాపు తెలియదు. ఆంధ్రాప్రాంతం నుండి నిజాం సంస్థానంలోనికి వచ్చిన సైన్యంకన్నా, మహారాష్ట్ర ప్రాంతం నుండి లోపలికి దూసుకువచ్చిన సైన్యం చాలా అరాచకాలు చేసింది. పది రెట్లు ఎక్కవ మందిని హతమార్చింది. వాళ్ళలో అత్యధికులు ముస్లింలు. తెలంగాణ పోరాటం ముగిసిన పాతికేళ్ల తరువాత రాసిన పుస్తకాలలోనూ మనకు హైదరాబాద్ ముస్లింల మీద సాగిన నరమేధం ప్రస్తావన కనిపించదు. దేవులపల్లి వెంకటేశ్వరరావు పుస్తకంలో మాత్రం కమ్యూనిస్టు పార్టీలో ఏదో ఒక స్థాయిలో ముస్లిం వ్యతిరేకత వుండిందనే మాట కనిపిస్తుంది.

1948 సెప్టెంబరు 17న నిజాం ప్రజలు ముస్లిం నవాబు నిరంకుశ పాలన నుండి విమోచన చెందారని ఆర్యసమాజ్, హిందూమహాసభ సంతోషించాయి. నిజాం సంస్థానం ఇండియాలో విలీనం అయ్యిందని  కాంగ్రెస్ సంతోషించింది. నిజాం ఎస్టేట్ లో ప్రజాపాలన వస్తుందని ప్రజాస్వామికవాదులు సంతోషించారు. కమ్యూనిస్టుపార్టి / ఆంధ్రామహాసభ పోరాట విరమణ ప్రకటించి  ప్రజా విద్రోహానికి పాల్పడిందని అతివాద కమ్యూనిస్టులు ఆవేదన చెందారు. 

ఇండియాలో నైజాం ఎస్టేట్ విలీనం అయ్యాక 16 నెలల పాటు మిలటరీ గవర్నర్ పాలన సాగింది. ఆ తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ను భారీ గౌరవ వేతనంతో రాజ్ ప్రముఖ్ గా నియమించారు. 1956 అక్టోబరు 31 వరకు ఆ పదవిలో ఆయన కొనసాగారు. ఆ తరువాత కూడ రాజ్ ప్రముఖ్ (కొత్తగా గవర్నర్ ) కొనసాగమని కోరినా, నిజాం సంస్థాన్ని భాషా ప్రాతిపదికగా ముడు ముక్కలు చేయడంతో మనస్తాపం చెంది తప్పుకున్నారు. అలా విమోచన సిధ్ధాంతం గాలికి ఎగిరిపోయింది. 

 

*చరిత్ర – గతం – వర్తమానం – భవిష్యత్తు*.

చరిత్ర రచన లక్ష్యం గతాన్ని తలవడమో, వర్తమానాన్ని విమర్శించడమోకాదు. భవిష్యత్తు నిర్మాణం కోసం గతంలో అందుబాటులోవున్న పరికరాలను వెతకడం. మనం నిర్మించాలనుకుంటున్న భవిష్యత్తును బట్టే చరిత్ర రచన సాగుతుంది. మతసామరస్య సమాజాన్ని నిర్మించాలనుకుంటే, దానికి, చరిత్రలో ఒక దారి కనిపిస్తుంది. మతఘర్షణ సమాజాన్ని కొనసాగించాలనుకుంటే దానికీ చరిత్రలో ఒక దారి కనిపిస్తుంది. ఈ రెండు రకాల ఆలోచనా ధోరణులు మనకు వర్తమాన సమాజంలో కనిపిస్తాయి. ముందు మనం ఏ శిబిరంలో వుండాలనుకుంటున్నామో తేల్చుకుంటే దానికి అనువైన చరిత్ర మనకు దర్శన మిస్తుంది.

 

హిందూ ముస్లిం బైనరితో చరిత్రను చూసేవారు ఎర్రపహడ్  దొర‌ జెన్నారెడ్డి ప్రతాప రెడ్డి, విసునూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి తదితరులకు పూర్తిగా క్షమాభిక్ష ప్రకటించి నిజాం నవాబును మాత్రమే బోను ఎక్కిస్తుంటారు. 1938లో రజాకార్లు పుట్టినప్పటి నుండే నిజాం సంస్థానంలో ప్రజల మీద ముస్లిం దుండగుల ఆగడాలు మొదలయ్యాయని చెపుతారు.  బండెనక బండికట్టి పాటలో జెన్నారెడ్డి  దొర‌  పేరును తొలగించి నైజాము సర్కరొడ  అని తగిలిస్తారు. ఇలా ఎవరి సిధ్ధాంతం వారిది.

– 24-09-2026

Published 30-09-2026