Sunday 30 April 2023

Communism is different from communist-parties


 Communism is different from communist-parties

కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు

డానీ 

 

పీకాక్ క్లాసిక్స్  సంపాదకుడు ఎ. గాంధి వ్యాసం  ‘సిపిఐ : తల ఎత్తుకుని నడుస్తుందా?’ (ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ 15 ఏప్రిల్ 2023)  మీద స్థూలంగా ఏకాభిప్రాయం వుంది. అయితే భారత కమ్యూనిస్టు పార్టిలు చేసిన మరికొన్ని ప్రధానమైన తప్పుల్ని పేర్కొనడం ఈ వ్యాసం మరిచింది. వాటిల్లో కొన్నింటిని అయినా ఈ సందర్భంగా పేర్కోవాల్సిన అవసరం వుంది. 

          చర్చలోనికి వెళ్ళడానికి ముందు ఒక అంశాన్ని స్పష్టం చేయాలి. కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు. ప్రపంచంలో ఎక్కడయినా సరే అణగారిన సమూహాలు తమ కష్టాలనుండి విముక్తి చెందడానికి సమానత్వాన్ని కోరుకుంటాయి. వాళ్ళకు కార్ల్ మార్క్స్ తెలియకపోవచ్చు, కమ్యూనిస్టు ప్రణాళిక తెలియకపోవచ్చు. స్వభావసిధ్ధంగానే వాళ్లు సమానత్వాన్ని అభిమానిస్తారు. వాళ్ళను ‘ఆర్గానిక్ కమ్యూనిస్టులు’ అనాలి. కమ్యూనిస్టు పార్టి అనేది ఒక వ్యవస్థ. ఆ పార్టీల నాయకులు ఆర్గానిక్ కమ్యూనిస్టులు అంతటి సాత్వికులు కాదు. 

బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టు పార్టి 1920లో ‘ఇండియన్ కమ్యూనిస్టు పార్టిగా’ తాష్కెంట్ లో పుట్టింది. ఖిలాఫత్ ఉద్యమం నుండి ఉత్తేజితులైన కొందరు ముస్లిం యువకులు దీని స్థాపనకు చొరవ తీసుకున్నారు. 1925 డిసెంబరు 26న కాన్పూరు సభలో దీనిని ‘కమ్యూనిస్టు పార్టి ఆఫ్ ఇండియా’ (సిపిఐ)గా మార్చారు. ఒక అంతర్జాతీయ సంస్థకు దేశీయ శాఖగా వుండడం గొప్ప ఆదర్శం అనుకుని వుండవచ్చుగానీ ఇదొక పెద్ద జాతీయ తప్పిదం. ఒక వైపు, భారత కమ్యూనిస్టు పార్టీల నాయకుల్ని అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులు నియంత్రించడానికీ, మరోవైపు, సృజనాత్మకత లోపించిన భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులు కీలక సందర్భాల్లో అంతర్జాతీయ నాయకులు ఇచ్చే ‘రోడ్ మ్యాప్’ల మీద ఆధారపడడానికీ ఈ పేరు  తోడ్పడింది. 

కొంతకాలం రష్యామార్గం, కొంతకాలం చైనా మార్గం అంటూ ఒక శతాబ్దం గడిపేశారే తప్ప భారత మార్గం ఒకదాన్ని రూపొందించాలనే స్వతంత్ర ఆలోచనే భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఇప్పటి వరకు రాలేదు. అంతర్జాతీయ నాయకులు సహితం సిపిఐ నాయకుల డొల్లతనాన్ని తమకు అనుకూలంగా బాగా వాడుకున్నారు. జాతియోద్యమంలో  స్వాతంత్ర్య సిధ్ధికి నిర్ణయాత్మక ఘట్టంగా మారిన క్విట్ ఇండియా ఉద్యమంలో సిపిఐ పాల్గొనకుండ రజనీ ఫామే దత్ లాంటి బ్రిటీష్ కమ్యూనిస్టు నాయకులు తప్పుదోవ పట్టించారు. రెండవ ప్రపంచ యుధ్ధంలో రష్యాకు  బ్రిటన్  మిత్రపక్షంగా మారినందున ఇండియాలో కమ్యూనిస్టు పార్టిలు బ్రిటీష్ వ్యతిరేక పోరాటం చేయడం తప్పు అన్నారు. 

చైనాలో ఇలాంటి సందర్భాలొచ్చినపుడు మావో ఇలా  చేయలేదు. మనకు క్విట్ ఇండియా ఉద్యమం సాగుతున్న కాలంలోనే చైనాలో జపాన్ యుధ్ధం (1937-1945) సాగింది. ఆ సమయంలో మావో నాయకత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టి అక్కడి సన్ యాట్ సేన్  జాతీయ ప్రభుత్వంతో కలిసి జపాన్ మీద పోరాడింది. అక్కడ మావో అలా జాతీయ నాయకుడనిపించుకున్నాడు; ఇక్కడ మనోళ్ళు జాతి వ్యతిరేకులని విమర్శలు ఎదుర్కొన్నారు. 

ఇంతాచేసి అటు స్టాలిన్ గానీ, ఇటు మావోగానీ భారత కమ్యూనిస్టు నాయకుల్ని పెద్దగా గౌరవించింది ఏమీలేదు. స్టాలిన్ సిపిఐ ప్రతినిధి బృందంతో కాస్సేపయినా కూర్చొని  మాట్లాడాడుగాని సిపిఐ ఎంఎల్ (నక్సలైట్ల)  ప్రతినిధి బృందాన్ని మావో కనీసం కలవనైనా కలవలేదు. 

భారత శాసనవ్యవస్థ ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్న కాలంలో,  1948 ఫిబ్రవరి-మార్చిలో  కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టి రెండవ కాంగ్రెస్ లో  బిటీ రణదివే అట్టహాసంగా ‘సాయుధపోరాట’ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కోల్పోయిన పరువును తిరిగిపొందడానికి  కావచ్చు, లేదా చైనా నుండి అందుకున్న కొత్త ఉత్తేజంతో కావచ్చు సిపిఐ ఇలాంటి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. 

నిజానికి అప్పుటికి ఏడాదిన్నర ముందు నుండే  నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు జిల్లాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సాయుధపోరాటాన్ని సాగిస్తోంది.  విచిత్రంగా,  సిపిఐ జాతీయ సమితి సాయుధపోరాట పిలుపు ఇచ్చిన ఏడు నెలల్లోపే తెలంగాణ  రాష్ట్ర సమితి  పోరాట విరమణ ప్రకటన చేసింది. ఎవరి లక్ష్యాలు నెరవేరినట్టు తెలంగాణ  రాష్ట్ర సమితి  భావించిందీ? అనేది ఇప్పటికీ పరిశీలనాంశమే. 

          నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయడం ఇటు భారత అటు నిజాం సంస్థానాల్లోని పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల అవసరం. దాని కోసం వాళ్ళు పది మార్గాల్లో పది పార్టీలు పది సంస్థల ద్వార ప్రయత్నించారు; వారు ఎంచుకున్న వారిలో కాంగ్రెస్ పార్టి, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం వగయిరాలున్నాయి. ఆ జాబితాలో కమ్యూనిస్టు పార్టి కూడ ఒకటి. తమ కార్యకలాపాలు నల్గొండ,  వరంగల్ (అప్పటికి ఖమ్మం జిల్లా లేదు) జిల్లాల్లోని కొన్ని తాలూకాల్లో కొనసాగాయని సిపిఐ చెప్పుకోవచ్చు.  నిజాం మెడలు వంచి ఇండియన్ యూనియన్ లో చేర్చింది తామే అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం మాత్రం అతిశయోక్తి. 

నిజాం విలీనంతో భారత -నిజాం పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల ఆర్ధిక అవసరం తీరింది. ఆర్యసమాజ్ ఆశయం నెరవేరింది. కాంగ్రెస్ రాజకీయ లక్ష్యం పూర్తయింది. కమ్యూనిస్టులు ప్రచారం చేసిన ‘తెలంగాణలో రైతుకూలీ రాజ్యం’ మాత్రం రాలేదు. ఎవరిది విజయం? ఎవరిది పరాజయం? ఆర్యసమాజ్ సాంస్కృతిక లక్ష్యానికీ, కాంగ్రెస్ రాజకీయ లక్ష్యానికి, భారత -నిజాం పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల ఆర్ధిక పథకాలకు కమ్యూనిస్టు పార్టి పరోక్షంగా ఆమోదాంశాన్ని కలగజేసిందంటే ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. 

మనశాసనకర్తలు భూస్వాములు పెట్టుబడీదారుల్ని ప్రోత్సహిస్తుంటారని (Crony Capitalism) మనం సాధారణంగా అనుకుంటూ వుంటాము. అది తప్పు. భూస్వాములు-పెట్టుబడీదారులే శాసన వ్యవస్థను ఏర్పాటు చేస్తారనే ( crony legislature) వాస్తవం ఇటీవల మరీ నగ్నంగా బయటపడిపోయింది. 1952 నాటి తొలి సార్వత్రిక ఎన్నికల్లో  నల్లగొండ నుంచి పోటీచేసిన రావి నారాయణ రెడ్డికి  జవహర్ లాల్ నెహ్రూకన్నా అధిక ఓట్లు పడ్డాయని కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికి గొప్పగా చెప్పుకుంటుంటాయి. సకాలంలో పోరాట విరమణ చేసి, తమ ఆర్ధిక ప్రయోజనాలను నెరవేర్చి పెట్టినందుకు భూస్వాములు-పెట్టుబడీదారులు సిపిఐకి ఇచ్చిన బహుమానం అది అంటే చాలా మందికి మింగుడు పడదు. 

బ్రిటీష్ ఇండియాలో దాదాపు 560 ప్రిన్స్లి స్టేట్స్ వుండగా నిజాం సంస్థానంలో మాత్రమే ఎందుకు కమ్యూనిస్టు పార్టి సాయుధ పోరాటం చేసిందీ? అన్నది ఎవరికయినా రావలసిన ప్రశ్న. ఆ సంస్థానాలకన్నా నిజాం పరిపాలన క్రూరమైనది అనవచ్చు. అది ఒక తార్కిక సమర్ధన కావచ్చుగానీ వాస్తవం కాదు. విద్యా, వైద్య-ఆరోగ్య, నీటిపారుదలా, రైల్వే, విద్యుత్తు తదితర రంగాలన్నింటిలోనూ నిజాం మిగిలిన సంస్థానాలన్నింటికన్నా చాలా ముందున్నది. త్రివాన్కూర్ సంస్థానంలోని పున్నప్రా, వాయలార్ గ్రామాల్లో 1946లో ఒక పోరాటం సాగిందిగానీ దాన్ని  నిజాం సంస్థానంలో సాగిన పోరాటంతో పోల్చలేము. కమ్యూనిస్టు పార్టి నిజాం సంస్థానంలో మాత్రమే తెగబడి సాయుధ పోరాటం చేయడానికి ఇంకా బయటపడని ఏంకేదో కారణం వుండాలి! 

దాదాపు వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే భారత కమ్యూనిస్టు పార్టీ సాగించిన సాయుధ పోరాటం కేవలం నిజాంను గద్దెదించడం కోసమేనా? ‘ముస్లిం’ నిజాం సంస్థానాన్ని ’హిందూ’ ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాలనే ’హిందూత్వ’ కార్యక్రమానికి ఆర్యసమాజ్ సూత్రధారిగావుంటే కమ్యూనిస్టు పార్టీ పాత్రధారిగా వుండిందా? కమ్యూనిస్టు పార్టీలోని అతివాదులు నిజాం మీద సాయుధ పోరాటం చేయాలన్నారు. నిజాం గద్దె దిగగానే మితవాదులు సాయుధ పోరాట విరమణ చేయమన్నారు. ఇద్దరూ ఒకే మతవాదాన్ని చెరోవైపు నుండి కొనసాగించారా? 

తెలంగాణలో కమ్యూనిస్టుపార్టి సాయుధపోరాట విరమణ చేయడాన్ని ఆనాటి కామ్రేడ్స్ అసోసియేషన్  ప్రముఖులు మఖ్ధూం మోహియుద్దీన్, దేవులపల్లి వేంకటేశ్వరావు (డివి) తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళూ మరికొందరు కలిసి 1951 వరకు ఆ పోరాటాన్ని సాగించారు. తెలంగాణ ప్రజల సాయుధపోరాట చరిత్ర (1946-1951) శీర్షికతో డివి రెండు భాగాల గ్రంధం రాశారు. ఆ గ్రంధం 1988 జులై నాటి తొలి ముద్రణ మొదటి భాగం 590-91వ పేజీల్లో చాలా ఆసక్తికర పరిశీలనలు వున్నాయి. 

నిజాం ఫ్యూడజలిజాన్ని వ్యతిరేకించడంలో మతం ప్రభావం బాగా పనిచేసిందని వారు చాలా స్పష్టంగా వివరించారు. “ఫ్యూడల్ వ్యతిరేకతకన్నా ముస్లిం వ్యతిరేకతే (కమ్యూనిస్టు)  పార్టీ నాయకత్వంలో ప్రధానంగా పనిచేసింది. హిందూ భూస్వాములు సహజంగా నిజాంకు వ్యతిరేకంగా వుంటారు కనుక వారి భూముల్ని (పేదలకు) పంచకుడదని వారు  (కమ్యూనిస్టు  పార్టీ నాయకులు) వాదించారు”. తెలంగాణలో “విప్లవోద్యమం ముందుకు వచ్చిందంటే ఇక్కడి పార్టి దీని కొరకు చేసిన కృషి ఫలితమే. తక్కినచోట్ల (హిందువులు అధినేతలుగావున్న సంస్థానాల్లో)   ముందుకు పోలేదంటే అక్కడి పార్టి దాని కోసం కృషి చేయకపోవడమే కారణం. వాస్తవ పరిస్థితి అనుకూలంగా లేక కృషి చేయలేదా? అనుకూలంగా వుండి కూడ కృషి చేయలేదా? అంటే ఉండి కూడ కృషి చేయలేదనే చెప్పవలసి వుంటుంది”. వంటి చేదు నిజాలు ఈ పుస్తకంలో వున్నాయి. 

ముస్లింలు అనేకాదు; భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఏ అస్తిత్వ సమూహాలూ నచ్చవు. ఒక ‘అమూర్త’ శ్రామిక వర్గం గురించి మాత్రం వాళ్ళు తరచూ మాట్లాడుతుంటారు. ‘అమూర్తం’ కనుక ఆ శ్రామిక వర్గం ఎప్పటికీ ఎవరికీ కనిపించదు.  సమాజంలో శ్రామికవర్గం కూడ ఏదో ఒక అస్తిత్వంలో వుండితీరుతుందంటే  వాళ్ళు ఒప్పుకోరు. “మనుషుల సామాజిక అస్థిత్వమే  వాళ్ళ చైతన్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మార్క్స్ మాటలు కమ్యూనిస్టు పార్టీల నాయకులకు కూడ వర్తిస్తాయి. 

అధికారంలో లేనపుడు కమ్యూనిస్టుపార్టీలు శ్రామిక అనుకుల విధానాలను వల్లెవేస్తుంటాయి. 1990వ దశకంలో వచ్చిన నూతన ఆర్ధిక విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటాయి. శాసన సభలో ప్రవేశించడానికి నూతన ఆర్ధిక విధానాన్ని సమర్ధించే రాజకీయ పార్టీలతో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయి. ఇది అక్కడితో ఆగదు. అధికారంలోనికి వచ్చాక  నూతన ఆర్ధిక విధానాలనే కమ్యూనిస్టు పార్టీలు అమలు చేస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానిస్తాయి. ఇవన్నీ బహిరంగం అయిపోయాక కార్మికవర్గంతో సహా సకల అస్తిత్వ సమూహాలు కమ్యూనిస్టు పార్టీలను వదిలేస్తున్నాయి; వదిలేశాయి.  వీటి ఫలితాలను ఇప్పుడు మనం పార్లమెంటరీ రాజకీయ రంగంలో చూస్తున్నాము. 

రాజకీయ రంగం వేరు; మేధోరంగంవేరు. భారత మేధోరంగంలో కమ్యూనిజం ప్రభావం ఇప్పటికీ చాలా బలంగా కొనసాగుతోంది. రాజకీయ, ఆర్ధిక, సాంఘీక, సాహిత్య విమర్శను కమ్యూనిస్టు అభిమానులు గొప్పగా అభివృధ్ధి చేశారు. ఎస్టి, ఎస్సీలు, బిసిలు, మైనారిటీలు, మహిళలు తమ హక్కుల గురించి మాట్లాడే చొరవను కమ్యూనిస్టు పార్టీలే ఇచ్చాయి. ఈ సంస్థల తొలి నాయకులందరూ పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులే. ఇప్పటికీ వాళ్ళ వాదనల్లో మార్క్సియన్ మెధడాలజీ యే బలంగా కనిపిస్తుంది. 

దేశానికి ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తున్నదని అణగారిన సమూహాలు భయపడుతున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడడం ఆందోళనకర అంశమే. అయితే, ఆర్గానిక్ కమ్యూనిస్టులు సమీప భవిష్యత్తులో ఏకమై  చారిత్రక అవసరంగా ఒక కొత్త కమ్యూనిస్టు పార్టిని ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే, ఇటీవలి కాలంలో మరొక్కసారి ప్రజల్లో కమ్యూనిజం మీద అభిమానం పెరుగుతున్నట్టు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్ల సమస్యల్లా అన్యవర్గ ధోరణులున్న కమ్యూనిస్టు పార్టీల నాయకులతోనే! 

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు మొబైల్ : 9010757776)    

ప్రచురణ : ఆంధ్రజ్యోతి ఏడిట్ పేజీ 26 ఏప్రిల్ 2023

https://www.andhrajyothy.com/2023/editorial/communism-is-different-communist-parties-are-different-1056725.html

నిన్న రెండు పండుగలు; ఈరోజు ఇంకో ఆనందం

 నిన్న రెండు పండుగలు; ఈరోజు ఇంకో ఆనందం



 

ఏప్రిల్ 22 లెనిన్ పుట్టిన రోజు. ఈ ఏడాది అదే రోజు రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ అంటే ఉపవాసాల పండుగ అనుకుంటారు ఎక్కువమంది. ఫిత్ర అంటే దానం. ఈదుల్ ఫిత్ర్ అంటే దానాల పండుగ. 

 

పారీస్ కమ్యూన్ ని చూసే మార్క్స్ ఉప్పొంగిపోయాడు. 1917 అక్టోబరు విప్లవాన్ని చూసుంటే ఎగిరి గంతులేసేవాడు. మార్క్స్ తాత్విక, సమాజ  రచనలకు ఒక శాస్త్రీయ సమర్ధనను సమకూర్చినవాడు పెడ్రిక్ ఏంగిల్స్. వాటిని నిజం చేసి చూపినవాడు లెనిన్. మార్క్సిజాన్ని లెనిన్ అభివృధ్ధి చేశాడంటే అతిశయోక్తికాదు. అది మార్క్స్ ను తక్కువచేయడం అంతకన్నా కాదు.  విప్లవోద్యమంలో లెనిన్ నాకు ఛెంఘీజ్ ఖాన్ లాంటి ఒక జానపద హీరోలా కనిపిస్తాడు. ప్యారీస్ లో ప్రవాసం వుండి రష్యాకు తిరిగొచ్చిన ఆరు నెలల్లోనే అక్టోబరు విప్లవాన్ని పూర్తి చేసిన ఘనుడతను. Petrograd / Saint Petersburg / Winter Palaceల మీద జరిపిన ప్రధాన దాడికి లియోన్ ట్రాస్కీకి   నాయకత్వం అప్పచెప్పడంలో లెనిన్ ప్రయోగించిన తెలివిడి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

ఈరోజు నాకు ఇంకో ఆనందం కలిగింది. మా ఇంటికి హాష్మీ అనే ఓ యువకుడు వచ్చాడు. ఎంబిబిఎస్ చదువుతున్నాడు. డాక్టర్ జక్కుల రమేష్, అమలెందుల కొడుకు; సీనియర్ కామ్రేడ్ భార్గవశ్రీ మనవడు. 

 

విజయవాడలో కమ్యూనిస్టు కానివాడు మనిషికాదు అనే రోజులు కొన్ని వుండేవి. అప్పట్లో యువకులు మా యింటికి దాదాపు ప్రతిరోజూ వస్తుండేవారు. ఇప్పుడు ఆరోజులు పోయాయి. యువకులు కాదుకదా సాటితరం కూడ అరుదుగా వస్తున్నది.

 

హాష్మీకి బోలెడు కమ్యూనిస్టు పరిజ్ఞానం వుంది. నా రచనలంటే చాలా యిష్టం వుంది. నన్ను కలవాలని కోరితే తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు.

 

అణగారిన సమూహాలకు కమ్యూనిజం ప్రాణరక్షణ ఔషధం; ఎటొచ్చీ కమ్యూనిస్టు పార్టీల నాయకులే ప్రజల అంచనాలు  నమ్మకాలు ఆకాంక్షల్ని వమ్ముచేశారు అని చాలాసార్లు అన్నాను. ఇప్పుడు విఫల కమ్యూనిస్టు నాయకులు అంటున్నదేమంటే కొత్త తరాలు తమతో రావడం లేదని. అది తప్పుడు ఆరోపణ. కొత్తతరాల్నే కాదు పాతతరాల్ని ఉత్తేజపరిచే నాయకులు కూడ ఇప్పుడు మనకు లేరు.

 

కొత్త తరాలు గత తరాలకన్నా విస్తారంగా, లోతుగా చదువుతున్నాయి. వాళ్ళను సమీకరించే వాళ్లు లేరు.

 

హాష్మీ ఫార్మల్ చదువుతోపాటూ ఇన్ ఫార్మల్ పుస్తకాలు చాలా చదువుతున్నాడు. చిన్న వయస్సులోనే మంచి సామాజిక పరిశీలన కూడ చేస్తున్నాడు. నిన్న వాళ్ళింట్లో “ఈరోజు డానీ గారికి రెండు పండుగలు; రంజాన్ ప్లస్  లెనిన్ పుట్టిన రోజు” అన్నాట్ట. ఈ పోలిక నాకు చాలా బాగా నచ్చింది. తనకు లెనిన్ మాత్రమేకాదు ట్రాట్స్కి కూడ తెలుసు. అనేక సామాజిక పరిణామాలను  తను పరిశీలిస్తున్న తీరు చాలా ఆసక్తిగా వున్నాయి.

 

మూడవ తరాన్ని కూడ ఆకర్షిస్తున్నానని తెలిసి చాలా ఆనందం వేసింది.

All Good wishes to Hashmi.  

 

23 ఏప్రిల్ 2023

Puchchalapalli Sundariah Resignation

 Puchchalapalli Sundariah



పుచ్చలపల్లి సుందరయ్యగారు

సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి పదవికీ
పోలిట్ బ్యూరో బాధ్యతలకు
1975 ఆగస్టు 22న రాజీనామా చేశారు.
దానికి వారు పేర్కొన్న ప్రధాన కారణం ఇది.
" అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడడమనే సాకుతో సామ్రాజ్యవాద అనుకూల, అర్ధసైనిక (పారా మిలటరి), ఫాసిస్టు అయిన ఆర్ ఎస్ ఎస్ కు గుండెకాయగావున్న జనసంఘ్ తో కలిసి సమిష్టి పోరాటాలు చేయాలని మన పార్టి కేంద్ర కమిటి మెజారిటీ తీర్మానించింది".
(మన కేంద్ర కమిటి సభ్యుల్లో 70 శాతం పైగా జనసంఘం (నేటి బిజెపి) వైపే వున్నారు. నా వైపు కనీసం 30 శాతం కూడ లేరు)
"మన కేంద్ర కమిటి చేసిన తీర్మానం మన పార్టికీ, ఇటు మన దేశంలోనూ, అటు విదేశాలలోనూ వుండే ప్రజాస్వామిక సమూహాలకు నష్టదాయకమనీ, ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల నుండి మనం వేరుపడిపోవడానికి ఇది దారి తీస్తుందని నేను భావిస్తున్నాను".

Saturday 29 April 2023

*అలా 40 ఏళ్ళు గడిచిపోయాయి*

 *అలా 40 ఏళ్ళు గడిచిపోయాయి*

 


మనమంతా  కలిసి  పోరాడితే మరీ నెల  రోజుల్లో కాకపోయినా రెండు మూడు నెలల్లో అయినా విప్లవం  విజయవంతం అవుతుందనే నమ్మకంతో చెమాటోడ్చే వాళ్ళం. సాహసాలు  దుస్సాహసాలు చేసేవాళ్ళం.

 

ఇలాంటి అనుభవం నా దాంపత్య  జీవితం లోనూ వుంది. ప్రతి రోజు పూటకు  ఒకసారి నేను అజిత  దెబ్బలాడుకుంటాము. వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారి అయినా విడిపోవాలనుకుంటాము. అలా అనుకుంటూనే 40 ఏళ్ళు గడిచిపోయాయి.

 


పీపుల్స్ వార్ పార్టీకి కృష్ణాజిల్లాలో పూర్తి స్థాయి  కమిటీ  ఎప్పుడూ లేదు. అడహాక్ కమిటీలే  ఉండేవి. ఆ కమిటీ బాధ్యులుగా వున్న వివి కృష్ణారావు  గారు ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ కు వెళ్లిపోయారు. అంత వరకు జిల్లా రాడికల్ యూత్ లీగ్ అధ్యక్షునిగావున్న నేను జిల్లా పార్టీ అడహాక్ కార్యదర్శి గా మారాను.

 

రైతుల సమస్యలు చెప్పుకోవడానికి ఏలూరి భీమయ్య వస్తుండేవారు. అయన  జిల్లా రైతు  కూలి సంఘం  కార్యదర్శి. వారిది శివాపురం  గ్రామం.  మనిషి చాలా నిరాడంబరంగా ఉండేవారు. నేను టేబుల్ మీద  రాసుకుంటుంటే నా గదిలోనికి వచ్చి  నేల  మీద  కూర్చునే వారు.

 

ఒకసారి శివపురంలో జిల్లా రాజకీయ పాఠశాల, బహిరంగ  సభ  జరిగాయి. అక్కడ  మొదటిసారి భీమయ్య కుమార్తె అజితను  చూసాను.

 

శివపురం  తెలంగాణ ఆంధ్ర  సరిహద్దుల్లో వున్న కుగ్రామం. మధిర దగ్గర  ప్రవహించే వైరా  వాగు మీద అప్పటికి వంతెన  లేదు. ఆ గ్రామానికి రైలు బస్సు సాకర్యం  ఇప్పటికీ లేదు. తెలంగాణ పోలీసుల నుండి తప్పించుకోవాల్సి వచ్చినపుడు నక్సల్ నేతలు వ్యూహాత్మాకంగా శివపురంలో షెల్టర్ తీసుకునేవారు. తెలంగాణ రైతాంగా పోరాట  కాలం  నుండి కొండపల్లి  సీతారామయ్యకు  ఆ గ్రామంలో అభిమానులు  ఎక్కువ. జిల్లాలో పీపుల్స్ వార్ వాళ్ళు ఎవరు  అరెస్టు అయినా శివపురం  వాళ్ళే కోర్టులో జామిను ఇచ్చేవారు.

 

తరువాత  కొంతకాలనికి  తన  కుమార్తెను పార్టీలో ఇవ్వాలని భావిస్తున్నట్టు భీమయ్య  చెప్పగా కొండపల్లి సీతారామయ్యగారు నా పేరు సూచించారట. పార్టీ రీజినల్ కమిటీ కార్యదర్శి ఈ విషయాన్ని నాకు చెప్పారు. ముందు  తనతో  నేరుగా మాట్లాడి తన  అభిప్రాయం తెలుసుకోవాలి  అన్నాను. పార్టీ ఆర్ సి మాకు విజయవాడలో పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది.

 

          “నువ్వు నాకు నచ్చావు. అయితే, నాకు ఉద్యోగం లేదు; నిలకడగా ఉద్యోగం చేసే  ఆసక్తి లేదు. ఆస్తిలేదు.  ఉద్యమాలంటూ ఊర్లు పట్టుకుని తిరుగుతాను. నానుండి ఎలాంటి ఆదాయాన్ని ఆశించకు. పిల్లలు పుడితే వాళ్ళ పెంపకం చదువు వగయిరా భారం కూడ  నీదే. అన్నింటికన్నా ముఖ్యమైనది  నాకు ఇంతకు  ముందే పెళ్లి అయింది. అది మతాంతర వివాహం. మా పెళ్లి ఆమె పెద్దలకు  నచ్చలేదు. పెళ్లయిన  నెల రోజులకే  ఆమె బలవన్మరణం పాలయింది. ఇక నీ ఇష్టం” అన్నాను.

 

తను  నాషరతులు అన్నింటికీ ఒప్పుకుంది. విప్లవ భావుకతను ఆమెకు ఆ స్థాయిలో నింపేశారు వాళ్ళ నాన్న. కొండపల్లి సీతారామయ్య నిప్పుల్లో దుకమన్నా  దూకడానికి భీమయ్య సిద్ధం. వాళ్ళ నాన్న గాడిదను  చేసుకోమన్నా చేసుకోవడానికి  అజిత  సిద్ధం. అలా ఉండేది  కమిట్ మెంట్.

 

పెళ్లి ఇంకో రెండు రోజులు ఉందనగా భీమయ్యగారు  కమ్మ సామాజిక వర్గానికి చెందినవారనీ అయన  14   ఎకరాల మధ్యతరగతి రైతు అనీ అజిత  ఆయనకు ఏకైక  సంతానం అనీ అర్ధం  అయింది.

 

భీమాయ్యగారే  ఇష్టంగా పెళ్లి చేయడంతో ఆయన  బంధువులు ఎక్కువ మంది మా పెళ్ళికి హాజరయ్యారు. నన్ను గౌరవ ప్రదంగా తమ  సమూహంలో  కలుపుకున్నారు. మాది ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ గా మారింది. ఏలూరివారు  చెరుకూరివారు కొమ్మినేనివారు, లగడపాటివారు అలా చాలా పెద్దది అజిత బలగం.

 

అసలు  సమస్యలు పెళ్లి తరువాత  మొదలయ్యాయి. నా ఆదాయం తక్కువ నామీద ఆధారపడినవాళ్ళు  ఎక్కువ. మా ఇంటిలో అజితకు  తాను అనుకున్నదానికన్నా ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి.

 

ఉద్యమాలు, ఇంటి మీద దాడులు, అరెస్టులు. కొన్ని సందర్భాల్లో పోలీసులు నన్ను ఎక్కడ పెట్టారో కూడ తెలీని పరిస్థితి. పత్రికల్లో ‘డానీ ఎక్కడ?’ అనే వార్తలు. తను నిరంతరం ఒక ఉత్కంఠ కు గురయ్యేది. ఉద్యమాల్లో వున్నప్పుడు తిండి దొరక్కపోవడమేకాదు కొన్ని సందర్భాల్లో అపరిశుభ్ర వాతావరణాల్లో ఉండాల్సి వస్తుంది. దురదలు  అలెర్జీలు వస్తాయి. వాటిని భరించాల్సింది ఆమెనే.

 

ఇదిగాక  నేను వ్యక్తిగతంగా  పెట్టిన ఇబ్బందులున్నాయి. నాకు భోజనం వడ్డించడం అంత సులువుకాదు. ఏమాత్రం తేడా వచ్చినా చాలా చికాకు  పెడతాను. పోపు మాడిండనో, పప్పు వండలేదనో  తగవు  పడతాను. ఆమెకు వేపుళ్ళు రోటి పచ్చళ్ళు  ఇష్టం. నాకు అవి పడవు. సంసారంలో ఇవన్నీ తగవులే.

 

సమాజంలో అందరికి వున్నట్టే కవులు, రచయితలు, ఉద్యమకారులకు కూడ రోజుకు 24 గంటలే  ఉంటాయి. చదవడానికో రాయడానికో ఉద్యమాల్లో తిరగడానికో మీటింగుల్లో మాట్లాడడానికో వాళ్ళు వెచ్చించే  సమయం మొత్తం న్యాయంగా వాళ్ళ భార్యలకు చెందవలసినదే. ఇలా వాళ్ళ భార్యలు వ్యక్తిగత జీవితాన్ని కొంత కోల్పోవలసివుంటుంది.   ఇది గుర్తింపుపేని త్యాగం. వచ్చిన కీర్తి మొత్తం భర్త  ఖాతా  లోనికి పడుతుంది గానీ భార్య ఖాతాలో పడదు. ఈ కారణంగాను దాంపత్యంలో కొన్ని ఘర్షణ లు ఉంటాయి.

 

మా పెళ్ళి విజయవాడ ప్రెస్ క్లబ్ లో 27 ఏప్రిల్ 1983న జరిగింది. అప్పట్లో ఉద్యమకారులు పెళ్ళికి ఫొటోలు తీసుకునే సాంప్రదాయం లేదు. ఒక ఏడాది తరువాత మేమిద్దరం తొలి ఫొటో తీసుకున్నాము. మా పెళ్ళికి చలసాని  ప్రసాద్ పురోహితుడు. చలసాని పార్టీలో వంద  పెళ్లిళ్లు చేశాడు. వారిలో 99 జంటలు  విడిపోయాయి. “మీరిద్దరూ విడిపోతే నాది ఒక రికార్డు అవుతుంది” అనేవాడు చలసాని. “ఆ 100 మందిలో 99  మంది పురుషులు  హిందువులు. వాళ్ళు విడిపోయినా  వాళ్లను ఎవ్వరూ ఏమి అనరు. నేను ఒక్కడ్ని విడాకులిస్తే మాత్రం మొత్తం ముస్లిం సమాజాన్ని బోను ఎక్కిస్తారు” అనేవాడిని.

 

డబ్బు విషయంలో  అజిత  ఎన్నడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ప్రయాణాలకు నేను పెట్టే ఖర్చుల్ని  ఎప్పుడూ అడగలేదు. 2008లో ఓ రోజు ఫోన్ చేసి ఆఫీస్ వాతావరణం బాగోలేదు అన్నాను. తక్షణం  రిజైన్ చేసి వచ్చేయి. నిన్ను గుర్తించని  వాళ్ళదగ్గర పని చేయవల్సిన అవసరం లేదు అనేసింది. ఇంట్లో అంత  సపోర్ట్ దొరకడంతో  నేను రిజైన్ చేసేసాను. తన మీద నమ్మకంతో మరి కొన్ని సందర్భాల్లో కూడ ఉద్యోగాలు మానేశాను.

 

మేమిద్దరం చిన్న చిన్న విషయాల మీద పెద్ద పెద్దగా దెబ్బలాడుకుంటాం. అయితే, మతం కులం  ఎన్నడూ మా మధ్య వివాదంగా  మారలేదు. మావాళ్లు తనను కలుపుకున్నారు. వాళ్ళవాళ్ళూ నన్ను కలుపుకున్నారు. మా పిల్లల్ని హిందువులు అడిగారు; ముస్లింలు అడిగారు.

 

తన  డిమాండ్ ఒక్కటే. నేను ఎప్పటికీ కమ్యూనిస్టు గా ఉండాలి. పీపుల్స్ వార్ లోనే వుంటే మరీ మంచిది అనుకునేది. ఇప్పుడు ఆ పార్టియే లేదు.

 

2004 నవంబరులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పీపుల్స్ వార్ ను శాంతి చర్చలకు పిలిచింది. ఆ చర్చలకు వచ్చిన ముగ్గురు ప్రతినిధుల్లో సుధాకర్ కూడా వున్నాడు. సుధాకర్ పార్టీలో నాకు జూనియర్; అజితకు స్టూడెంట్స్ వింగ్ లో సీనియర్. సుధాకర్ అప్పట్లో  ఆంధ్రా-ఒరిస్సా బార్డర్ (ఏవోబి) కమిటికి కార్యదర్శి. తనను  ఒరిస్సా బార్డర్ లో దించమని సుధాకర్ నన్ను కోరాడు. అప్పుడు నేను పీపుల్స్ వార్ లోనూ లేను; విరసంలోనూ లేను. నేనూ అజిత తోడుగా వెళ్ళి సుధాకర్ ను ఏవోబిలో  దించివచ్చాము. నక్సల్స్ కు ఏ సహాయం చేసినా అది తన తండ్రికి అర్పిస్తున్న నివాళి అనుకుంటుంది. వాళ్ళూ అంతే; తనను తమ మనిషి అనుకుంటారు.

 

“నేను డానీకి స్పాన్సర్ ని” అనుకుంటుంది అజిత. ఆ పొసేసివ్ నెస్ ఆ పొగరువల్ల కొన్ని ఇబ్బందులున్నా అది  ఆమెకు దక్కడం  న్యాయం.

 

అజిత  ఈజ్ గ్రేట్!

 

శివాపురం

27 ఏప్రిల్ 2023

Friday 21 April 2023

I was the Bodygaurd to Konadapalli Seetharamayya

 కొండపల్లి సీతారామయ్యకు బాడీగార్డ్ గా వున్నాను 



విప్లవ రాజకీయాల్లో నాకు ఇష్టమైన నాయకుడు కొండపల్లి సీతారాయయ్య. 

ఉద్యమంలో గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు. అనేక త్యాగాలు చేశారు. విప్లవ సిధ్ధాంత స్థాయిని పెంచారు. ఆ తరపు విద్యార్ధి, నిరుద్యోగ యువతకు గొప్ప ఉత్తేజాన్నిచ్చారు.   కవులు కళాకారులు మేధావుల్ని గొప్పగా ఆకట్టుకున్నారు. 

ఆయన చదువుకున్నవాళ్లతో ఒకలా మాట్లాడేవారు. నిరక్షరాశ్యులతో ఇంకోలా మాట్లాడేవారు. ఇద్దర్నీ అపారంగా ఆకట్టుకునేవారు.  పార్టి డాక్యుమెంట్లే కాకుండ కృష్ణ, విశ్వేశ్వరయ్య, శ్యామ్  తదితర పేర్లతో సిధ్ధాంత వ్యాసాలు రాసేవారు.  

ఆయన పొలిటికల్ క్లాసు వినడం ఒక గొప్ప అనుభవం. ఎంత సంక్లిష్టమైన  రాజకీయ అంశాన్ని అయినా సరే చందమామ కథలా చాలా తేలిక పదాలతో చాలా అందంగా చెప్పేవారు. మంచి హాస్య ప్రియుడు. చాలా సౌమ్యులు చిన్న స్థాయి కార్యకర్తను కూడ మీరు అనేవారు. 

విప్లవ పార్టీకి సిధ్ధాంత బలం వుండాలి, ఆయుధ పరిజ్ఞానం వుండాలి. ఆర్ధిక అండను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త తరాన్ని నిరంతరం సమీకరిస్తూవుండాలి. రహాస్య పనివిధానాన్ని రూపొందిస్తూ వుండాలి. టెక్ జాగ్రత్తలు పాటిస్తూ వుండాలి. న్యాయనిపుణుల సహకారాన్ని తీసుకుంటూ వుండాలి. ఇతర రాష్ట్రాల విప్లవ నాయకులతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగిస్తూ వుండాలి. ఈ రంగాలన్నింటిలోనూ కేఎస్ నిపుణుడు. అన్ని రంగాల్లో సెలబ్రెటీలుగా వుంటున్న వారు ఆయనకు వీరాభిమానులుగా వుండేవారు. ఆయన కాల్చే చార్మినార్ సిగరెట్టు ప్యాకెట్టు గుల్ల మీద చీటీ రాసి పంపితే విజయవాడ డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు విడుదల చేసేవారు. 

తెలంగాణ సాయుధపొరాటంలో కమ్యూనిస్టు పార్టికి  నాయకత్వం వహించినవారు భూస్వామ్యవర్గానికి చెందిన వారనీ, వాళ్ళకు కమ్యూనిజం ఒక సరదాయేగానీ ప్రాణరక్షణ మందు కాదు అనేవారు కొండపల్లి. అందుకే కీలక సమయంలో కమ్యూనిస్టు పార్టి సాయుధపోరాట విరమణ ప్రకటన చేసిందనేవారు. ఆ సందర్భంగా ఒక జానపద కథ చెప్పేవారు. 

చైనా యువరాజుకు డ్రాగాన్ చూడాలనే ఒక కోరిక వుండేదట. డ్రాగాన్ నిజ జీవికాదు. ఒక జానపద పక్షి. మొసలిలా, కొండచిలువలా వుంటుంది. నోట్లో నుండి మంటలు చిమ్ముతుంటుంది. ఓ రాత్రిపూట  డ్రాగాన్ రాజకోటకు వచ్చి అక్కడున్న భటునితో  "మీ యువరాజు నన్ను చూడాలని ఉబలాటపడుతున్నాడు. అతని కోరిక తీరుద్దామని స్వయంగా నేనే వచ్చాను. పోయి మీ యువరాజుకు చెప్పు" అందిట. భటుడు వెళ్ళి యువరాజుని నిద్రలేపి "మీ కోసం డ్రాగాన్ వచ్చింది యువరాజా! కోటగుమ్మంలో వుంది " అన్నాడట. డ్రాగాన్ వచ్చిందన్న మాట వినగానే యువరాజు భయపడి గుండె ఆగి చనిపోయాట్ట.  తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించినవారు ఏదో కమ్యూనిజం అంటే సరదాపడ్డారు గానీ, నిజంగా కమ్యూనిజం వచ్చేస్తున్నదని తెలియగానే వాళ్ళ గుండె ఆగిపోయింది. అని కథను ముగించేవారు. 

పామరులతో మాట్లాడే సమయంలో జానపద కథలు చెప్పేసాంప్రదాయం విప్లవోద్యమంలో అనాదిగా వుంది. భగత్ సింగ్ కూడ జానపదకథలు చెప్పేవాడు. మావో సరేసరి. రైతులతో మాట్లాడే సమయంలో 'చందమామ' కథలతోనే రాజకీయాలు చెప్పేవాడు. 

దీన్ని నా మరో గురువు  త్రిపురనేని మధుసూదనరావు కొంచెం మోడిఫై చేశారు. బహిరంగ సభల్లో జనాన్ని ఉత్తేజపరచాలి. పొలిటికల్ క్లాసుల్లో స్టూడెంట్స్ ను చైతన్యపరచాలి అనేవారు. 

ఒక దశలో నేను గోదావరి జిల్లాల ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని రోజుల తరబడి తత్వశాస్త్రం పాఠాలు చెప్పాల్సివచ్చింది. వాళ్ళల్లో అత్యధికులు నిరక్షరాశ్యులు. నా వేషభాషల్లో ఇంగ్లీషు ప్రభావం ఎక్కువగా వుండేది. వాళ్ళకు మామూలుగా  పాఠం  చెప్పడమే కష్టం. ఏకంగా తత్వశాస్త్రం చెప్పడం అంటే మరీ పెద్ద సవాలు. తరుణోపాయంగా కేఎస్ ను అనుకరించడానికి ప్రయత్నించాను. వారికీ ఆ విషయం తెలుసు. నేను చెప్పిన పాఠాల్ని టేపులో రికార్డ్  చేయించి తెప్పించుకుని విన్నారట. కొంచెం మెచ్చుకుని కొన్ని సూచనలు మార్పులు  కూడ నాకు కొరియర్ చేత పంపించారు.  

భారత సమాజంలో కుల విశ్లేషణకు చాలా దగ్గరగా వెళ్ళిన ఎంఎల్ నాయకుడు కొండపల్లి. వ్యవసాయిన విప్లవం పుస్తకంలో  కులమే వర్గం అనలేదు గానీ దాదాపుగా అన్నంత పనిచేశాడు.

"ఎస్సి గద్దర్ ను మహాకళాకారుడ్ని చేశాము. బిసి అల్లం రాజయ్యను మహారచయితను చేశాము. ముస్లిం డానీ చేత తత్త్వశాస్త్రం పాఠాలు చెప్పిస్తున్నాము. ఇది సామాజిక రంగంలో మన కాంట్రిబ్యూషన్" అన్నారట ఒక సందర్భంలో. 

స్విడిష్ రచయిత Jan Myrdal ఇండియాకు వచ్చి కొండపల్లి సీతారామయ్యను కలిసినపుడు కొరియర్ గా, బాడీగార్డ్ గా నేనే వున్నాను. నాకు కలిసి వచ్చిన అదృష్టాల్లో అదొకటి. ఇద్దరం రిక్షాల్లో, బస్సుల్లో ప్రయాణించేవాళ్లం. ఆయన  తల మీద ఒక వెల వుండేది. భయం తెలీని మనిషి.  

తన కూతుర్ని పార్టీలో ఇవ్వాలని ఏలూరి భీమయ్య అన్నప్పుడు  మీ కృష్ణాజిల్లాలో డానీ వున్నాడుగా అని సూచించింది ఆయనే. నా ఉద్యమ జీవితంలోనే  కాక నా దాంపత్యజీవితంలోనూ వారి పాత్ర వుంది. 

నివాళులు అర్పించే సమయంలో వాళ్ల పరిమితుల్ని కూడ చెప్పుకోవాలి. 

1920-30 ప్రాంతంలో మావో చైనాలో రూపొందించిన  నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలోనే నడవాలని భారత ఎంఎల్ పార్టీలన్నీ భావించాయి. కేసె్ కూడ భావించారు. ఇందులో రెండు తప్పులున్నాయి. మొదటిది; మనకు మావో  ఛైర్మన్  అయ్యాడు. రెండోది; మనం మన సమాజాన్ని విశ్లేషించి మనదైన విప్లవ పంథాను రూపొందించుకునే అవకాశాన్ని కోల్పోయాము. . 

"దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గల నూతన ప్రజాస్వామిక  విప్లవం"  మన లక్ష్యం అనేవారు. ఈ నినాదానికి ఇప్పుడు ప్రాసంగికత వుందనుకోను. ఇప్పుడూ అదే నినాదం ఇస్తున్నారో మార్చుకున్నారో నాకు తెలీదు. 

కేఎస్ ను ఒకసారి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి, ఇంకోసారి సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పార్టి బహిష్కరించాయి. 

తెలంగాణ సాయుధపోరాట విరమణ అనేది ఇప్పటికీ విశ్లేషించుకోవాల్సిన అవసరం వుంది. అప్పుడు రంగంలో ఐదారు జట్లు వున్నాయి. అందులో కమ్యూనిస్టు పార్టి ఒకటి మాత్రమే.  కాంగ్రెస్ కు ఒక నేరేటివ్ వుంది. ఆర్యసమాజ్ కు ఒక నేరేటివ్ వుంది. నిజాం ఎస్టేట్ లో విద్యావంతులైన ఉదారవాదులకు మరో నేరేటివ్ వుంది. నిజానికి వాళ్లందరికన్నా నిజాంలో కమ్యూనిస్టుల ప్రాబల్యమే తక్కువ. పోరాటం నల్గొండ, వరంగల్ జిల్లాలు దాటలేదు. మనం మొత్తం  వ్యవహారాన్ని. కమ్యూనిస్టు పార్టి దృష్టి నుండే చూసున్నాం.

మరో అంశం ఏమంటే మనం ఆర్ధిక వ్యవస్థను రాజకీయాలు ప్రమోట్ చేస్తాయి (Crony Capitalism) అనే భావంతో వుంటాం. నిజానికి ఆర్ధిక వ్యవస్థే రాజకీయాలను నియంత్రిస్తుంది (Crony Legislature) అని గుర్తించం. నిజాం-తెలంగాణ రాజకీయాలను ఏ ఆర్ధిక పరిణామాలు నియంత్రించాయని ప్రశ్నించుకుంటే మనమ గతంలో ఎన్నడూ ఊహించని అనేక వాస్తవాలు బయట పడతాయి. 

20 ఏప్రిల్ 2023

Tuesday 18 April 2023

మృతసంస్కృతి మనల్ని ఆవహిస్తున్నది

 మృతసంస్కృతి మనల్ని ఆవహిస్తున్నది

 

మనం మూల సమాజాన్ని (source society) చాలా గొప్పగా విశ్లేషిస్తాము. లక్ష్య సమాజాన్ని (Task Society) కూడ చాలా అందంగా  ఆవిష్కరిస్తాము. దాన్ని సాధించే మార్గం ఏమిటీ? అనే ప్రశ్నకు సాధారణంగా మన దగ్గర సమాధానం వుండదు.

 

వర్తమాన భారత దేశంలో మతసామరస్యం ఎలా సాధ్యం అవుతుందీ? కుల / వర్ణ నిర్మూలన ఎలా జరుగుతుంది? వర్గ నిర్మూలన జరిగి సామ్యవాద సమాజం ఎలా ఏర్పడుతుంది? ఇవన్నీ చాలా కాలంగా మౌలిక ప్రశ్నలు. ఇప్పుడు వీటికి సమాధానాలు కావాలి? దాటవేత కుదరదు. ఒక చారిత్రక సందర్భంలో సమాజం విసిరిన సవాళ్ళను  దాటవేయడం మేధోదారిద్ర్యం. అలాంటి ఒక మృతసంస్కృతి (Dying culture) మనల్ని ఆవహిస్తున్నది అనిపిస్తున్నది.

 

కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు (లాల్ నీల్) ఏకం కావాలనే ప్రతిపాదన చాలాకాలంగా వుంది. కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు, ముస్లింలు (లాల్ నీల్ హర్యాలి) ఏకం కావాలనే ప్రతిపాదన కూడ కొంతకాలంగా వుంది. సామాజికంగా ఎస్టి, ఎస్సి, బిసి, మైనారిటీలు ఏకం కావాలని మనం తరచూ అంటుంటాం.

 

ఇప్పటి వరకు ఇవన్నీ కొందరు ఆలోచనాపరుల ఆశలుగానే వుంటున్నాయిగానీ ఈ ఆషయాలు దిగువ శ్రేణులకు చేరడంలేదు. దిగువ శ్రేణులు ఎవరికి వారుగానే వుంటున్నాయి. పైగా కులద్వేషాలు, మత ద్వేషాలు చాలా బాహాటంగా వ్యక్తం అవుతున్నాయి.

 

సామాజికవర్గాలన్నీ సామాజిక రంగంలో ఒకలా, రాజకీయ రంగంలో ఇంకోలా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనాపరుల  ప్రతిపాదనలు దిగువశ్రేణులకు చేరకపోతే రాజకీయ రంగంలో మార్పురాదు. మనువాద ఫాసిజాన్ని సాయుధపోరాటం ద్వార కూడ ఓడించవచ్చు అనే ఆలోచనలు కొందరికి వుండవచ్చుగానీ దానికి సమీప భవిష్యత్తులో అవకాశాలు లేవు.  మనువాద ఫాసిజాన్ని ప్రజాస్వామిక పార్లమెంటరీ ఎన్నికల్లోనే ఓడించాలి. ఇంకా చెప్పాలంటే 2024 లోక్ సభ ఎన్నికల్లోనే ఓడించాలి. అందుకు మనం ఏం చేయాలీ? మన Plan of action ఎలా వుండాలి? అనే అంశం మీద సభ్యులు సూచనలు చేస్తే చాలా బాగుంటుంది.

 

చర్చలో చురుగ్గా పాల్గొనండి. చర్చను ఆసక్తికరంగా సాగించండి.

Monday 17 April 2023

*MTF Whats App గ్రూపు పేరు గురించి వివరణ*

 *MTF Whats App గ్రూపు పేరు గురించి వివరణ*

*ముస్లిం ఆలోచనాపరుల వేదిక Whats App Group* పేరును మారిస్తే బాగుంటుందని కొందరు మిత్రులు సూచిస్తున్నారు.

 

ఈ గ్రూపులో ముస్లిమేతర ఆలోచనాపరులు కూడ వుండడంవల్ల అందరికీ ప్రాతినిధ్యం వహించేలా పేరు వుండాలని వారంటున్నారు. ‘సామరస్య జనవేదిక’ అనే కొత్త పేరును కొందరు  సూచించారు. వాళ్ళ సూచనలోని సెంటిమెంట్ నాకు అర్ధం అయింది. అందులో ఒక సమంజసమైన హేతువు వుంది.

 

మన సమాజంలో ప్రతి అంశానికీ అందుకు భిన్నమైన, కొన్ని సందర్భాలలో అందుకు పూర్తి విరుధ్ధమైన నేరేటివ్స్ కూడ వుంటాయి.

 

ప్రతి రోజూ నాకు కనీసం వందకు పైగా  గ్రూపుల నుండి Whats App మెసేజులు వస్తుంటాయి. వాటిల్లో ఓ నాలుగయిదింటికి ముస్లిం సంబంధిత పేర్లు వుంటాయి. ముగిలినవన్నీ కమ్యూనిస్టు, అంబేడ్కరిస్టు, ఫూలేయిస్టు, లేకుంటే అమరుల పేర్లతో వుంటాయి. ఇటీవల అన్ని రాజకీయ పార్టిలేగాక, ఆయా పార్టీల నాయకులు, వాళ్ళ అభిమానులు సహితం వాట్స్ యాప్ గ్రూపులు నడుపుతున్నారు. ఈ గ్రూపులన్నింటిలోనూ ముస్లిమేతరులున్నట్టే ముస్లింలు కూడ వుంటారు. అయినప్పటికీ ముస్లీమ్లు సామాజిక ఉద్యమాల్లో పాల్గొనరు అనే నేరేటివ్ బలంగా ప్రచారంలో కొనసాగుతూవుంది.

 

ఖిలాఫత్ ఉద్యమంతో ప్రభావితమైన యువ ముస్లింలే భారత దేశంలో తొలి కమ్యూనిస్టు పార్టి (ఇండియన్ కమ్యూనిస్టు పార్టి)ని స్థాపించారనీ, కోరమండల్, మలబారు తీరాల్లో మొదలైన మోప్లా ముస్లిం కౌలురైతుల తిరుగుబాటు తరువాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీగా మారిందని తెలిసినవాళ్లు ఎందరూ? అభ్యుదయ రచయితల ఉద్యమాన్ని మొదలెట్టింది ముస్లింలని ఎంతమందికి తెలుసూ? ఆ ఉద్యమంపేరే Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind. తెలంగాణ సాయుధరైతాంగ పోరాటానికి మేధో సరస్సుగా పనిచేసిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’లో దేవులపల్లి వేంకటేశ్వరరావు, రాజ్ బహద్దూర్ గౌర్ వంటి ఇద్దరు ముగ్గురుతప్ప మిగిలిన వారందరూ ముస్లింలే. జాతియోద్యమంలో స్వాతంత్ర్య సాధనకు  నిర్ణయాత్మక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ కాంగ్రెస అధ్యక్షుడు  మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఎవరయినా గుర్తు పెట్టుకున్నారా? అంతేందుకు, ముస్లింలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కోరుతూ 2001లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ముస్లిం ఉద్యమం సాగిందని, దాని ప్రభావంతోనే వైయస్ రాజశేఖర రెడ్డి బిసి-ఇ కేటగిరిలో ముస్లింలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో  5 శాతం కోటా వాగ్దానం చేసినట్టు ఎవరికయినా గుర్తుందా?

 

నేను వ్యక్తిగతంగా 1977  నుండి సామాజిక జీవితంలో వున్నాను. కొన్ని ఎస్టి, ఎస్సి, బిసి ఉద్యమాలకు, ప్రపంచ బ్యాంకు వ్యతిరేక ఆందోళకు నేరుగా నాయకత్వం వహించాను. చాలామంది నన్ను కారంచేడు ఉద్యమ నాయక బృందంలో ఒకడిగా వున్నాను అనుకుంటుంటారు.  ప్రభుత్వం ఉదారంగా వున్నప్పుడు ఆ ఉద్యమానికి అరడజనుకు పైగా  నాయకులున్నారు. నిర్బంధం మొదలుకాగానే భయపడి వాళ్ళంతా శిబిరం వదిలి వెళ్ళిపోయారు. ముఖ్యంగా 1985 సెప్టెంబరు 11 నుండి ఆక్టోబరు మొదటి వారంలో ప్రభుత్వం పునరావాస  ప్యాకేజీని ప్రకటించే వరకు కారంచెడు ఉద్యమానాకి కేంద్ర కార్యాలయమైన చీరాల విజయనగర్ శిబిరానికి నేను ఏకైక నాయకునిగా వున్నాను.

 

ఇవేమీ నా గొప్ప కోసం ఇప్పుడు రాయడంలేదు. ముస్లిం రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా విజయవాడలో జరిగిన భారీ బహిరంగ సభకు  ఫూలే- అంబేడ్కరిస్టు మేధావి ఒకర్ని ముఖ్యఅతిధిగా ఆహ్వానించాము.  “హిందూ అగ్రవర్ణాలు శూద్రుల్ని వెలివేశారు, దళితుల్ని ముట్టుకోరాదన్నారు. ముస్లింలు వచ్చి మమ్మల్ని ఆలింగనం చేసుకున్నారు. అందుకే మావాళ్లు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈనాటి భారత ముస్లింలలో అత్యధికులు పూర్వ- ఎస్టి, ఎస్సి బిసిలు. సాంఘీక వివక్షను అనుభవిస్తున్న  కారంణంగా వాళ్ళందరికీ రిజర్వేషన్లు కల్పించాలి ” అంటూ ఆవేశంగా ప్రసంగించారు.  

 

గుజరాత్ లో నరేంద్ర మోదీజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ మేధావి తన దృక్పథాన్ని మార్చుకున్నారు. బిసి అభిమానంతో సందర్భం వచ్చినప్పుడెల్లా తన మేధోశక్తిని మోదీజీ కోసం వెచ్చిస్తున్నారు. అది వారి ఇష్టం. అయితే వారు అంతటితో ఆగలేదు; తన కలాన్ని ముస్లిం వ్యతిరేకతను, ఇస్లాంఫోబియాను పెంచడానికి ఉపయోగిస్తున్నారు. గుజరాత్ మారణకాండలో బిసిలు పాల్గోవడాన్ని సమర్ధిస్తూ వారు ఆ రోజుల్లోనే ఒక చిత్రమైన వాదన చేశారు. తమను దగ్గరికి  తీసుకోలేదనే కసితో  బిసిలు ముస్లింల మీద  దాడి చేశారని సిధ్ధాంతీకరించారు. (ద హిందూ దినపత్రిక మార్చి 27, 2002). ముస్లింలు ధార్మిక అంశాలకే పరిమిత మవుతారు, సామాజిక అంశాలను పట్టించుకోరు అనే ఆరోపణను ఇటీవల వారు గట్టిగానే ప్రచారంలో పెడుతున్నారు.  ఇలాంటి దుష్ప్రచారాలకు  ఒక ప్రాక్టికల్ సమాధానం చెప్పాల్సిన అవసరం ముందుకు వచ్చింది.

 

ఎస్సీ సంఘాలు ప్రతి సంవత్సరం కారంచెడు, చుండూరు హాత్యాకాండ దినాలు జరుపుతుంటారు. గతాన్ని తలచుకుని భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకుంటుంటారు. హషీంపుర, మలియాన, గుజరాత్ మారణ హోమాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ముస్లింలకు కొన్ని కొత్త వేదికలు కావాలి. 

 

ముస్లింలు అడ్మిన్ గా  ఒక అభ్యుదయ గ్రూపు వుండాల్సిన అవసరం అలా ముందుకొచ్చింది. ఇతరులు అడ్మిన్ లుగా వున్న గ్రూపుల్లో ముస్లింలు వుంటున్నట్టు ముస్లింలు అడ్మిన్లుగావున్న గ్రూపుల్లోనూ ఇతరులు వుంటారు. వుంటున్నారు కూడ. ఇదే సామరస్యం. ఇచ్చి పుచ్చుకోవడం. *ముస్లింల అభ్యుదయ ఆలోచనలు ముస్లింల పేరుతోనే ప్రజల్లోనికి వెళ్ళాలి*.

 

జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటి 1981 సెప్టెంబరు ఆఖరు వారంలో  చైనా సుప్రసిధ్ధ రచయిత లూసన్ (Lu Xun) శత జయంతోత్సవాలను రెండు రోజుల పాటు   నిర్వహించింది. దానికి నన్నూ ఒక వక్తగా పిలిచారు. సాధారణంగా మనం ఏదైనా సభలకు వక్తగా వెళ్ళినపుడు మనకు తెలిసిన నాలుగు అంశాలు మాట్లాడేస్తుంటాము. లేదా play to the gallery వంటి సమ్మొహ విద్యలు  ప్రదర్శిస్తుంటాము. అది యూనివర్శిటీ కనుక పూటకు మూడు అంశాలు చొప్పున రెండు రోజులకు 12 అంశాలనూ వర్గీకరించి ఎవరు ఏ అంశం మీద ఎంత సేపు మాట్లాడాలో వగయిరా నిర్దిష్టమైన వివరాలతో క్యూ షీట్ పంపించారు. నేను ఉపన్యాసాన్ని పాయింట్ల వారీగా రాసుకుని వెళ్ళి సమయపాలన పాటించి అకడమిక్ గా మాట్లాడింది అదే మొదటి సారి. అప్పటి నుండి అదే క్రమశిక్షణను పాటిస్తున్నాను. ఏ అంశం మీద మాట్లాడాలీ? ఏ కోణాన్ని స్పృజించాలి? దానికి ప్రాసంగికత ఏమిటీ?  ఎంత సేపు మాట్లాడాలీ? అనే వివరాలు లేకుండా నేను సభల్లో మాట్లాడను. ఒక వేళ సమయం తక్కువగా వుంటే ఆ మూడు నాలుగు అంశాల సబ్ హెడ్డింగ్స్ వివరించి ముగించేస్తాను.

 

అలాంటి అకడమిక్ క్రమశిక్షణ మన గ్రూపు సభ్యుల్లో కొందరికి వుంటుంది. కొందరికి వుండదు. కొందరు ఇతర అంశాల్లో నిపుణులైనప్పటికీ గ్రూపు లక్ష్యాల మీద వాళ్ళకు ఆసక్తి వుండకపోవచ్చు, టాస్క్ గా ఇచ్చిన టాపిక్ మీద వాళ్ళకు అవగాహన లేకపోవచ్చు. కొందరు సందర్భం ఏదైనాసరే తమకు తెలిసిన ‘ఆవు వ్యాసం’ రాసేస్తుంటారు. కొందరు తమ  రచనల ప్రమోషన్ కోసం అన్ని గ్రూపుల్ని వాడుకుంటుంటారు. కొందరు మనం అనుకుంటున్నట్టు అసలు ఆలోచనాపరులే కాకపోవచ్చు. కొందరు తమకు ఇష్టమైనవన్నీ పోస్టుల్లో పెడుతుంటారు.  పెళ్ళిరోజు ఫొటోలు, పుట్టిన రోజు ఫంక్షన్ ఫొటోలు. ఇంట్లో ఆ రోజు వండిన కూర ఫొటో లు కూడ పెడుతుంటారు. వాటిని డిలీట్ చేస్తే కొందరికి ఆగ్రహం కలుగుతుంది; వుంచితే మరి కొందరికి చిరాకు కలుగుతుంది. ఈ రెండు కారణాలవల్లనూ  కొందరు గ్రూపు నుండి తప్పుకుంటుంటారు. కొందరు తమ సూచనలకు ఆమోదం రాకపోయినా అలుగుతారు.

 

చర్చకు పెట్టిన అంశం మీద చాలా తక్కువ మంది మాత్రమే  మాట్లాడుతారు. మాట్లాడలేనివాళ్లు మౌనంగా చూస్తుంటాడు. అసలు ఇది  తమ క్రీడా మైదానం కాదని అర్ధమైనవాళ్ళు  స్వఛ్ఛందంగా  వెళ్లిపోతారు. ఇది అన్ని గ్రూపుల్లోనూ విజయవాడ ట్రాఫిక్ లా కొనసాగుతూనే వుంటుంది. వడబోత కార్యక్రమం పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా సోర్స్ సమూహం నిరాశ చెంది  టాస్క్ ను మరచి  గ్రూపును మూసెయ్యరాదు.

 

వరద వచ్చినపుడు ముందు చెత్త వస్తుంది. వరద పెరిగినపుడు చెత్త వుండమన్నా వుండదు; కొట్టుకుని పోతుంది. గోదావరి గట్టున పుట్టాను. ఇది నాకు ప్రకృతి జ్ఞానం నుండి సహజంగా అబ్బిన సామాజిక జ్ఞానం.

 

ఎప్పటికప్పుడు ప్రకటించిన టాస్క్ మీద సభ్యులు మాట్లాడగలిగితే మేధోమధనం జరుగుతుంది. లేకపోతే సీరియస్ నెస్ పోయి గ్రూపు చప్పబడిపోతుంది.

 

అయినా, ఐదేళ్ళుగా నిరాఘాటంగా కొనసాగుతూ మేధోరంగంలో తన ఉనికిని చాటుకుంటున్న సంస్థకు పేరు మార్చాల్సిన పనేమున్నదీ? MTF కు మొదటి నుండి FaceBook page, Messenger Group మాత్రమేగాక Whats App Group కూడ వున్నాయి. నేను దీనిని ఇటీవల ముస్లిమేతరులకు కూడ Extend చేశాను. అదొక్కటే మార్పు.

 

*గ్రూపు పేరుమారదు;  అదే వుంటుంది*.

 

డానీ, కన్వీనర్ MTF


Sunday 16 April 2023

జాతిని కష్టాలనుండి బయటపడేసే మార్గాలను సూచించగలగడమే ఆలోచనాపరులు చెయ్యాల్సిన పని*.

 *జాతిని కష్టాలనుండి బయటపడేసే మార్గాలను సూచించగలగడమే ఆలోచనాపరులు చెయ్యాల్సిన పని*.  

 

మిత్రులారా !

 

*MTF Whats App Group ను నాలుగు  లక్ష్యాలతో ఎర్పాటు చేశాము*.

 

*మొదటిది;  ధార్మిక రంగం*లో విస్తరిస్తున్న ముస్లిం/ఇస్లాం ఫోబియాను తొలగించడం.

 

*రెండోది; సామాజిక రంగం*లో విభిన్న మత సమూహాల మధ్య సామరస్యతను నెలకొల్పడం.

 

*మూడవది; సమస్త అణగారిన సమూహాల ప్రజాసంఘాలు* ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనగా ఏర్పాటు కావడానికి సహకరించడం.  

 

*నాలుగవది; రాజకీయ రంగం*లో సంఘపరివార శక్తుల్ని ఓడించడానికి   2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన ఏర్పాటు కావడానికి తోడ్పడం.

 

*ఈ నాలుగు లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వ్యూహాలు, ఎత్తుగడలు, సూచనలు మాత్రమే ఈ గ్రూపులో పోస్టు చేయండి*.

 

చరిత్ర అంటే గతం కాదు; వర్తమానం కూడ కాదు; అది భవిష్యత్తు. ఈ నాలుగు లక్ష్యాల సాధన కోసం ఎక్కడయినా చరిత్ర ఉపయోగ పడుతుందంటే కొంచెంఉటంకించండి. తప్పుకాదు. అంతేతప్ప మీకు తెలిసిన చరిత్రను అందరికీ చెప్పే ప్రయత్నం  వద్దు.

 

ఈ గ్రూపులో ఔత్సాహిక  యాక్టివిస్టులే కాక, సామాజిక సేవలో అపార అనుభవం కలవారూ వున్నారు. అంచేత ఒకరికొకరు కొత్తగా జ్ఞానోదయం కలిగించే ప్రయత్నాలు చేయవద్దు.

 

*ఇందులో నాలుగు లక్ష్యాల మీద తప్ప ఇంకోమాట వద్దేవద్దు*.  ఈ నాలుగు లక్ష్యాల సాధనకు ఉత్తేజాన్నిచ్చే పోస్టులు, లింకులు పెట్టవచ్చు.

 

కొందరు తమ రాజకీయ పార్టీలు / సంస్థల  కార్యక్రమాలను పెడుతున్నారు. వీటి కోసం వేరే గ్రూపులున్నాయి. వాటిల్లో చేరి పోస్టులు పెట్టుకోండి.

కొందరు Amazing videos పెడుతున్నారు, కొందరు ఏకంగా కమ్మర్షియల్ యాడ్లు కూడా పెడుతున్నారు. ఇవి ఆలోచనాపరులు చేయతగ్గ పనులు కాదు. ఇవి మీ స్థాయిని తగ్గిస్తాయి. ఆలోచనాపరులుగా వుండ కూడదనుకుంటే స్వఛ్ఛందంగా LEFT  అయిపోయే సౌకర్యం మీకు ఎలాగూ వుంది.

 

ఇందులో ధార్మిక అంశాల్ని కూడ చర్చించవద్దు.

 

మీరు పోస్ట్ పెట్టే ముందు మీ సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు నాలుగు లక్ష్యాల్లో దేని గురించో పేర్కొంటే మేధోమధనం స్థాయి పెరుగుతుంది.

 

కష్టాల గురించి అందరూ  మాట్లాడుతారు. *జాతిని కష్టాలనుండి బయటపడేసే మార్గాలను సూచించగలగడమే ఆలోచనాపరులు చెయ్యాల్సిన పని*.  

 

*డానీ. MTF Convener*