ప్యాకేజీనా? ప్రత్యేక తరహా హోదానా?
- డానీ
కొత్త ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదా సాధన కోసం మొదలయిన అలజడి ప్రాణత్యాగం స్థాయికి చేరుకుంది. తిరుపతిలో మునికోటి ఆత్మాహుతి సెగలు
మఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని తాకాయి. వారు కేంద్ర మంత్రులతో “తాడో పేడో” తేల్చుకుందామని చెప్పినట్టూ, తన పార్టీ ఎంపీలకు గట్టిగా ముందుకు పోవాలని ఆదేశాలు ఇచ్చినట్టూ మీడియా లీకులు వచ్చాయి.
కొత్త రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ప్రత్యేక తరహా హోదాపై సియం కార్యాలయం నుండి అనేక లీకులు వచ్చాయి. “కేంద్రం ప్రత్యేక తరహా హోదా ఇచ్చేలా లేదు”. “వాళ్ళకు ఏవో రాజకీయ ఇబ్బందులున్నాయి”
“ఆమేర ఇతర మార్గాల్లో మనకు నిధులు అందించే అవకాశాలున్నాయి”. “స్నేహంగా వుంటూనే సాధించుకుందాం?” అని చంద్రబాబు తన పార్టీ ముఖ్యులతో అంటున్నారనేది వాటి సారాశం. ఇప్పుడు
“స్నేహంగా వుండే వైఖరి”ని మార్చుకుంటున్నట్టు
కొత్త లీకులు వచ్చాయి.
మోదీ ప్రభుత్వం మీద చంద్రబాబు స్నేహపూర్వక వైఖరిని వదులుకోదలిస్తే ఆ విషయాన్ని లీకుల ద్వార కాకుండా బాహాటంగానే ప్రకటించవచ్చు. కీలకమైన సమయంలో కర్ణుని అస్త్రాలు పనిచేయనట్టు కీలకమైన సమయంలో చంద్రబాబు గొంతు మూగబోతుంది. చంద్రబాబు గొప్ప రాజకీయ నిర్వాహకులేగానీ రాజకీయవేత్త కాదు. రాజకీయవేత్తలు తమ అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెపుతారు. ఒక సందర్భం వచ్చినపుడు యన్టీ రామారావు చేసినట్టు “కేంద్రం ఒక మిధ్య” అని ప్రకటించి జనం లోనికి వెళ్ళే తెగువ చంద్రబాబుకు లేదు.
విపక్షాలు ఉద్యమాలు చేస్తే తనకు కేంద్రంతో బేరసారాలడే శక్తి వస్తుందని చంద్రబాబు భావిస్తారు. ఆ మేరకు వారు విపక్షాల్ని ఉసిగొల్పుతారు. విపక్షాల భుజాల మీద తుపాకీ మోపి కేంద్రానికి గురి పెట్టాలనుకుంటారు.
ఇప్పుడు విజయవాడ సియంఓ నుండి వస్తున్న లీకుల సారాంశం ఇదే. ఇందులో ఇంకో వైచిత్రి వుంది. విపక్షాలు, ప్రజాసంఘాలు పట్టించుకోకపోతే పట్టించుకోవడంలేదని
సియంవో వర్గాలు నిందిస్తాయి. పట్టించుకుంటే రాజకీయ డ్రామా చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే నిందిస్తారు. అనుమానం
వున్నవాళ్ళు జగన్ ఢిల్లీ దీక్ష మీద అచ్చెంనాయుడు తదితర టిడిపి నేతల వ్యాఖ్యానాలు చూడవచ్చు.
ఇలాంటి సంక్షుభిత సందర్భాల్లో ఉపయోగించుకోవడంతప్ప సాధారణ సందర్భాల్లో చంద్రబాబు విపక్షాలనీ, ప్రజా సంఘాలనీ, సంఘ సేవకుల్నీ, గౌరవించడం పెద్దమాట; కనీసం వాళ్ళ అభిప్రాయాలు విన్న సందర్భాలేమైనా వున్నాయా? అంటే సమాధానం లేవనే వస్తుంది. యన్టీ రామారావు చనిపోయిన తరువాత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ -టిడిపి పెట్టారు. ఆమెను కూడా పిలవాల్సివస్తుందనే వంకతో చంద్రబాబు ఆకాలంలో ఏకంగా అఖిలపక్ష సమావేశాల్నే రద్దుచేశారు.
విపక్షాలు, సంఘసేవకులు, పౌరహక్కులు-మానవ హక్కుల వాళ్ళు, మార్క్సిస్టుల మీద ఈసారి కూడా చంద్రబాబు వైఖరిలో మార్పులేదు. అమరావతి భూసేకరణపై ప్రముఖ సంఘసేవకులు
అన్నా హజారే నాలుగు నెలల క్రితం స్పందించారు.
బహుళ పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మించవద్దని కోరుతూ
ఆయన చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఏప్రిల్ రెండవ వారంలో తుళ్ళూరు పరిసర ప్రాంతాలని సందర్శించిన
ప్రముఖ ఉద్యమకారిణీ మేధాపాట్కర్ అక్కడ ల్యాండ్ పూలింగ్
జరుగుతున్న తీరును తప్పుపట్టారు. ఈ రెండు పరిణామాల మీదా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు అప్పట్లో లీకులు వచ్చాయి. రాష్ట్ర ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నెలల తరబడి పోరాడుతున్నప్పుడు రాని సామాజిక ఉద్యమకారులు ఇప్పుడెందుకు వచ్చారూ? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారనేది ఆ లీకుల సారాంశం.
సమైక్య ఉద్యమం ప్రస్తావన వచ్చింది కనుక దాన్ని ఇంకోసారి అంచనా వేయాల్సివున్నది.
2004 ఎన్నికల నాటికే తెలుగుప్రజలు విడిపోక తప్పదనే అభిప్రాయం రెండు ప్రాంతాల్లోనూ బలపడింది. అప్పటి చర్చ విభజన న్యాయబధ్ధంగా ఎలా జరగాలి అన్నది మాత్రమే;
విభజన జరగాలా? వద్దా? అన్నదికాదు. ఆ ఎన్నికల్లో సమైక్యవాదిగా వున్న టిడిపీ ఓడిపోయి, విభజనవాదులతో పొత్తుకుదుర్చుకున్న
కాంగ్రెస్ కు భారీ ఆధిక్యత రావడమే దీనికి నిదర్శనం. జనం విభజనను కోరుకుంటున్నారని గమనించిన చంద్రబాబు 2009 ఎన్నికల్లో కేసిఆర్ తో పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తును కూడా జనం బలపరిచారు. ఆ ఎన్నికల్లో టిడిపీకి ఆధిక్యం దక్కలేదుగానీ, ఆ పార్టీ సీట్ల సంఖ్యా, ఓట్ల సంఖ్యా గణనీయంగా పెరిగాయి. రోశయయ హయాంలో శాసనసభ, అఖిలపక్ష సమావేశం రెండూ విభజనకు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. వీటి ఆధారంగా, కేంద్రప్రభుత్వం విభజన ప్రక్రియ మొదలెట్టింది.
విభజన ప్రక్రియను న్యాయబధ్ధంగా జరుపుకునే విధివిధానాలని రూపొందించుకోవాల్సిన తరుణంలో హైదరాబాద్ తో వాణిజ్య, వ్యాపార, భూసంబంధాలున్న ఆంధ్రా కార్పొరేట్ సంస్థలు రంగప్రవేశం చేశాయి. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించగలమని నమ్ముతూ వచ్చిన ఆంధ్రా కార్పొరేట్ ప్రతినిధులు విభజన నిర్ణయంతో ఖంగుతిన్నారు. హైదరాబాద్ సౌఖ్యానికీ, ఆదాయానికీ అలవాటుపడ్డ ఆంధ్రా ఎన్జీవోలు వీరికి పాత్రధారులుగా దొరికారు. ఇద్దరూ కలిసి ఒక బూటకపు సమైక్యవాద భావోద్వేగాన్ని సృష్టించి జనం మీదికి వదిలారు. ప్రభుత్వాధినేత కూడా తోడుకావడంతో డబ్బు ధారాళంగా పారి మీడియాకు ప్రాయోజిత కార్యక్రమంగా మారి కొన్నాళ్ళు ఒక పెద్ద ఉద్యమం సాగుతున్న భ్రాంతిని కల్పించింది. విభజన ప్రక్రియను న్యాయబధ్ధంగా జరుపుకోవాలనే ప్రజల వాస్తవ కోరిక ఈ హోరులో మరుగున
పడిపోయింది. దానివల్ల విభజిత రాష్ట్రానికి అంచనా వేయలేనంత నష్టం జరిగింది. జరుగుతోంది.
ప్రజలు తెలివైనవాళ్ళు. గత ఎన్నికల్లో వాళ్ళు ఎవర్ని గెలిపించారు అనే విషయంకన్నా వాళ్ళు ఎవర్ని చిత్తుగా ఓడించారనేదే కీలకమైనది. అలా వాళ్ళు సమైక్యవాద నినాదాన్ని సమాధి చేసేశారు. అప్పట్లో కొందరికి కొన్నాళ్ళు హైదరాబాద్ లోని ఆంధ్రా ఎన్జీవో నాయకులు ఉద్యమ వీరులుగా కనిపించివుండవచ్చు.
గత పదిహేను నెలలుగా వాళ్ల పనితీరును, వాళ్ల కోరికల చిట్టాను చూసిన వాళ్ళకు ఇప్పుడు అలాంటి భ్రమలు వుండేవకాశం లేదు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదాను మించిన ప్యాకేజీ వస్తున్నదని ఇప్పుడు కొత్త లీకులు వస్తున్నాయి. ప్రత్యేక తరహా హోదా అనేది సార్వజనీన రాయితీ. ప్యాకేజీలకు అలాంటి సార్వజనీనత వుండదు. దానివల్ల, ప్రాయోజిత పెట్టుబడీదారీ విధానాలకు సానుకూల వాతావరణం
పెరుగుతుంది. ప్రభుత్వానికి దగ్గరగా వున్న సంస్థలు మాత్రమే లబ్ది పొందగలుగుతాయి.
అంతిమంగా ఇది బలహీన సామాజికవర్గాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం చర్చించాల్సింది ఈ అంశం మీదనే.
(రచయిత ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్)
మొబైల్ : 9010757776
హైదరాబాద్
12-8-2015
ప్రచురణ :
సాక్షి డైలీ, ఏపీ ఎడిషన్, 17-8-2015
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/17082015/Details.aspx?id=2881778&boxid=25654300