బలహీనవర్గాలపై సర్జికల్ దాడి!
పెద్ద నోట్ల రద్దు గమ్యం కార్పొరేట్ సంస్థలు గమనం బ్యాంకులు
-
డానీ
ఏనుక్కు కనిపించే దంతాలు వేరు, నమిలే దంతాలు వేరు. కేంద్ర ప్రభుత్వానిది ఏనుగు దంతాల వ్యవహారం. పెద్ద
నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని పైకి చెప్పినదానికీ ఇప్పుడు జరుగుతున్నదానికీ పొంతనలేదు.
ఈ వ్యవహారంలో కనిపించనివేవో కొన్ని వున్నట్టు ఎవరికైనా సులువుగానే అర్ధం అవుతోంది.
మన అదృష్టం ఏమంటే ఆ కనిపించని దంతాలు కూడా ఇప్పుడు క్రమంగా బయట పడుతున్నాయి.
నవంబరు 8 రాత్రి పెద్ద నోట్లను
రద్దు చేస్తున్నపుడు ప్రధాని మోదీ నల్లకుబేరుల
పనిపడదాం, దేశసంపదను పేదలకు ఉపయోగపడేలా చేద్దాం అని పిలుపు ఇచ్చారు. ఉగ్రవాదం, తీవ్రవాదాల్ని అంతంచేద్దాం, పాకిస్తాన్ ఆగడాలకు
అడ్డుకట్ట వేద్దాం అనేది ఇందులోని ఉపకార్యక్రమం. ఈ మహత్తర లక్ష్యాల సాధనకోసం దేశప్రజలు ఓ యాభై
రోజులు కొంచెం కష్టపడాలి, కొన్ని త్యాగాలు చేయాలని వారు కోరారు.
నల్లకుబేరుల అక్రమ ఆస్తుల్ని స్వాధీనం
చేసుకుని ఆ సంపదతో దేశ ప్రజలు అందరికీ ఆహార, వస్త్ర, నివాస, విద్యా, వైద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించే లక్ష్యం ప్రభుత్వానికి వుండి
యాభైరోజులు కాదు ఐదు వందల రోజుల మహాయజ్ఞాన్ని జరుపుతానన్నా మద్దతు ఇవ్వాల్సిందే. ప్రధాని
కోరినట్టు దేశప్రజలు త్యాగాలు చేశారు. కష్టాల్ని అనుభవించారు. 50 రోజుల గడువు ముగిసిపోయింది.
ఆ పైన ఇంకో పక్షం రోజులు కూడా దాటిపోయాయి. దేశ సంపదను పేదలకు ఉపయోగపడేలా చేసే కార్యక్రమాన్నికేంద్ర ప్రభుత్వం
ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశ్యం వున్నట్టు కూడా సంకేతాలు కనిపించడంలేదు.
నవంబరు 8 నాటికి దేశంలో చెలామణిలో
వున్న 1000, 500, నోట్ల విలువ 14.86 లక్షల కోట్ల రూపాయలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
లెఖ్ఖతేల్చి చెప్పింది. కరెన్సీ నోట్లను విడుదల చేసేదీ, శిధిలమైపోయిన నోట్లను తిరిగి
తీసుకునేది ఆర్బీఐయే కనుక ఆ లెఖ్ఖ చాలా కఛ్ఛితమైనదై వుండాలి. డిసెంబరు 30 గడువు ముగిసేలోగా
తమ వద్ద 15.36 లక్షల కోట్ల రూపాయల పెద్ద నోట్లు
జమ అయినట్టు బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకుల్లో
జమ కాకుండా ఇంకొంత డబ్బు బయట వున్నట్టు ప్రభుత్వమే అంచనా వేస్తోంది. అక్కడక్కడా పెద్దనోట్లను
తగులబెట్టినట్టూ, మురుగుకాల్వలు, చెత్తకుండీల్లో పడేసినట్టూ వార్తలు వచ్చాయి. కరెన్సీ
నోట్ల రిజర్వు బ్యాంకు లెఖ్ఖలే తప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం మాత్రమే కాదు; దిగ్భ్రాంతి
కలిగించే విషయం.
రెండు నెలల క్రితం ప్రధాని మోదీ
మన్ కీ బాత్ లో మాట్లాడుతూ సవాసౌకరోడ్ జనాభాలో నల్లకుబేరులు సవాలాఖ్ మాత్రమే అని బల్లగుద్ది
చెప్పారు. వాళ్ళెవరో ఆదాయపు పన్ను శాఖకు కఛ్ఛితంగా తెలిసే వుంటుంది.
ఒకలక్షా పాతిక వేల మంది మీద తనిఖీలు, సోదాలు దాడులు నిర్వహిస్తే సరిపోయేదానికి నూట పాతిక కోట్ల మందిని హింసించడం
ఏ మేరకు న్యాయం?
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆదాయపు పన్ను శాఖ దేశవ్యాప్తంగా 1,156 చోట్ల తనిఖీలు, సోదాలు దాడులు
నిర్వహించి వెలికితీసిన నల్లధనం 5,343
కోట్లు!. ఇందులో
నగదుగా దొరికింది రూ.609.39 కోట్లు
మాత్రమే. అందులో రూ. 114.1 కోట్లు కొత్త నోట్ల రూపంలో దొరికాయట. నగదుగా దొరికిన దాంట్లో
అత్యధిక భాగం తమిళనాడులోనివే. ఈ వెలికితీతల్లో ఆదాయపుపన్నుశాఖ సామర్ధ్యంగాకన్నా రాజకీయ
అవసరమే ఎక్కువగా పనిచేసిందనే ఆరోపణ కొట్టివేయదగిందేమీకాదు. తమిళనాడులో జయలలిత అనంతర
రాజకీయ పరిణామాలకూ, అక్కడ బయటపడిన నల్లధనానికీ సంబంధం లేదని చెప్పడం కష్టం.
తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని
వెలికి తీస్తామని దేశప్రజలందర్ని బ్యాంకుల ముందు దాదాపు బిచ్చగాళ్ళుగా మార్చి పట్టుకున్నది
అందులో అరశాతం! కొండను తవ్వి ఎలకను కూడా పట్టుకోలేకపోవడం అంటే ఇదే.
రెండు నెలల్లోనే ఉగ్రవాదం 60 శాతం తగ్గిందని,
ఛత్తీస్ గఢ్లో తీవ్రవాదుల కార్యకలాపాలు తగ్గాయనీ, హవాలా
లావాదేవీలు 50 శాతం పడిపోయాయనీ, పాకిస్థాన్లో భారత్ కోసం దొంగనోట్లు ముద్రించే రెండు ప్రింటింగ్ ప్రెస్‌లు ఇటీవల మూతబడ్డాయని
కేంద్ర అణువిద్యుత్, అంతరిక్ష శాఖల మంత్రి జితేంద్రసింగ్ పెద్ద నోట్ల రద్దుపై ఒక ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల
చేశారు.
ఉగ్ర, తీవ్రవాదాలు చెలం చెప్పినట్టు
పాల్ రాబ్సన్ సంగీతం లాంటివి. ఒక్కోసారి వాటి శబ్దమే వినిపించదు. ఇంకోసారి చెవులు మూసుకున్నా
వినిపించేంత హోరుగా మారిపోతాయి. అంచేత ఉగ్ర,
తీవ్రవాదాల పెరుగుదల తగ్గుదలల్ని ఒక నెలలోనో
రెండు నెలల్లోనో అంచనా వేయడం తప్పు. చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏమంటే భారత దేశపు
పెద్ద నోట్లతోపాటూ, పాక్ దేశపు పెద్ద నోట్లు కూడా నిన్న మొన్నటి వరకూ ఇంగ్లండ్ హ్యాంప్ షైర్ కు చెందిన డె లా రూయి అనే సెక్యూరిటీ ప్రెస్సులోనే
ప్రింటు అయ్యేవి. వైరి దేశాల పెద్ద నోట్లు
ఒకే చోట అచ్చు అవుతుంటే జరిగే దుష్ఫలితాలను ఊహించుకోవచ్చు.
పెద్ద నోట్ల రద్దు లక్ష్యాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖామంత్రి
యం వెంకయ్య నాయుడు రెండు రోజుల క్రితం పరోక్షంగా వెల్లడించారు. “ఆదాయపు పన్ను చెల్లింపుదారుల పరిధిలోకి ఎక్కువమంది వస్తే పన్ను తగ్గుతుంది. బ్యాంకుల్లో నగదు జమ పెరిగితే వడ్డీ రేట్లూ తగ్గుతాయి’’ అని వారన్నారు.
ఇప్పుడు
స్పాట్ లైట్ బ్యాంకుల
మీద పడింది గనుక వాటి పనివిధానాన్ని స్థూలంగా అయినా తెలుసుకోవాల్సి వుంది. సాధారణంగా బ్యాంకులకు రెండు విధాలుగా
ఆదాయం వస్తుంది. మొదటిది, సేవా రుసుము ద్వార వచ్చే ఆదాయం. రెండోది, రుణాల మీద వచ్చే
వడ్డీకీ, డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీకీ మధ్య వ్వత్యాసం వల్ల వచ్చే ఆదాయం. నగదు రహితమే
తమ విధానం అని ప్రభుత్వం ప్రకటించింది కనుక ఇక ముందు ఆన్ లైన్ ద్వారానో, క్రెడిట్
, డిబిట్ కార్డుల ద్వారానో మాత్రమే ఆర్ధిక లావాదేవీలు సాగుతాయి. సేవా రుసుమును తగ్గించినా
ఈ విభాగంలో బ్యాంకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
బ్యాంకులు సేకరించే డిపాజిట్లకూ, అవి ఇచ్చే
రుణాలకూ మధ్య ఒక నిర్ణిత నిష్పత్తి వుంటుంది. దాన్నే ఎల్డీఆర్ అంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగవేయడంతో అనేక బ్యాంకులు
దివాళ తీసే స్థితికి చేరుకున్నాయి. మోదీ ప్రధాన
మంత్రిగాకన్నా బ్యాంకుల డిపాజిట్ల సేకరణ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా సమర్ధంగా పనిచేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ఫలితంగా
బ్యాంకుల్లో 15 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చాయి. ఈ దన్నుతో తక్కువ వడ్డీకి కొత్త
రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఉవ్విళ్ళూరుతున్నాయి.
బ్యాంకులు
ఇచ్చే రుణాలకు ఒక సామాజికార్ధిక వర్గీకరణ వుంటుంది. బ్యాంకు ఖాతాదారుల్లో మూడు విభాగాలుంటాయి.
మొదటిది, పేదవర్గాలు. రెండోది మధ్యతరగతి వర్గాలు. మూడోది. వాణిజ్య సంస్థలు, కార్పొరేట్లు.
పేదవర్గాల బ్యాంకు అకౌంట్లు కేవలం లాంఛనమే. గ్యాస్ సబ్సిడీ, వృధ్ధాప్య పెన్షన్ మొదలయిన
ప్రభుత్వ సహాయాన్ని పొందడానికే అవి వుంటాయి. వాణిజ్య సంస్థలు, కార్పొరేట్లు ఎప్పుడూ
బ్యాంకుల్లో డిపాజిట్లు చేయవు. అవి భారీ రుణాలను తీసుకుంటాయి. ఇక బ్యాంకుల్లో డిపాజిట్లు
చేసేది మధ్యతరగతి వర్గం మాత్రమే. మరో మాటల్లో చెప్పాలంటే చేపలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాయి.
తిమింగిలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి. బ్యాంకూ రుణాల ఎగవేతదారుల్లో విజయ్ మాల్య పేరు
ఈమధ్య ప్రముఖంగా వినిపిస్తోందిగానీ లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిల ఖాతాల్లో అంబానీలు,
ఆడానీలు కూడా వుంటారు.
తమ
లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి పవిత్ర వ్యవస్థల్ని అడ్డుగా పెట్టుకోవడం మోదీ ప్రభుత్వం
చేస్తున్న రక్షణాత్మక వ్యూహం. బ్యాంకుల ముందు ప్రజలు పడుతున్న కష్టాలను ఎవరయినా ప్రస్తావిస్తే
“సరిహద్దుల్లో మన సైనికులు పడుతున్న కష్టాలకన్నా అవి గొప్పవా?” అని మోదీ భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ఎత్తుగడలు ఒకటి రెండుసార్లు బాగానే పనిచేస్తాయి. అతిగావాడితే ప్రజలు ఆ పవిత్ర
సంస్థల మీద కూడా విమర్శలు కురిపించే ప్రమాదం వుంటుంది. పబ్లిక్ డిబేట్ లోనికి న్యాయస్థానాలు
వచ్చాక జనానికి న్యాయమూర్తుల మీద మునుపటి గౌరవం పోయింది. సైనిక వ్యవస్థ పవిత్రత కూడా
ఇప్పుడు ఇలాంటి ముప్పును
ఎదుర్కొంటోంది.
రెండు
నెలల క్రితం వరకు రిజర్వుబ్యాంకును చాలామంది ఓ పవిత్ర సంస్థగానే భావించేవారు. ఎద్ద నోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ
రిజర్వ్ బ్యాంకును అడ్డుపెట్టుకోవడం మొదలెట్టింది. ఇప్పుడు రిజర్వు బ్యాంకు పబ్లిక్ డిబేట్ లోనికి వచ్చేసింది. అంబానీ, ఆడానీ, మహేంద్రా
వంటి భారీ కార్పొరేట్ సంస్థల మాజీ ఉద్యోగులు, మిలిందా బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ
ఆర్ధిక విధాన నిర్ణయ సంస్థల ప్రతినిధులు రిజర్వు బ్యాంకు డైరెక్టర్లుగా వుంటారని ఇప్పుడు
అందరికీ తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం అంటే కార్పొరేట్ల యొక్క, కార్పొరేట్ల ద్వార,
కార్పొరేట్ల కొరకు అనేమాట జనం లోనికి వెళ్ళిపోయింది.
నల్లధనం
కరెన్సీరూపంలో వుంటుందని ప్రచారం చేయడంలోనే మోదీ అవగాహనలోని డొల్లతనం బయటపడిపోయింది.
నల్ల కుబేరులంటే రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ
కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు అని చిన్నపిల్లలు కూడా చెపుతారు. వాళ్లంతా
నల్ల కుబేరులు కాకపోవచ్చుకానీ నల్లకుబేరులంతావాళ్ళే. గత రెండు
నెలల కాలంలో అరెస్టయిన నల్లకుబేరుల్ని వేళ్ళ మీద లెఖ్ఖపెట్టవచ్చు. మరి లక్షల మంది ఏమైపొయారో
మోదీ ప్రభుత్వమే చెప్పాలి.
నోట్ల
రద్దు ప్రకటన ద్వార మోదీ ప్రభుత్వం మరో కీలక వాగ్దానం నుండి దేశప్రజల దృష్టిని మళ్ళీంచ
దలిచింది. దేశంలో వున్న నల్లడబ్బుగాక విదేశీ బ్యాంకుల్లో
కూడా మన దేశపు అవినీతిపరుల నల్లడబ్బు వుంటుంది. డిపాజిట్టు నిబంధనల ప్రకారం ఆ వివరాలను
విదేశీ బ్యాంకులు ప్రకటించవు. ఇలాంటి సందర్భాల్లో పన్ను ఎగవేతదారుల స్వర్గంగా స్విస్
బ్యాంకుల్ని పేర్కొంటూంటారు. అక్కడ కూడా ఎంత డబ్బు వుందో ఎవరి దగ్గరా అంచనాలు లేనప్పటికీ
ఆ డబ్బును వెనక్కి తీసుకువస్తామని గత ఎన్నికల్లో బీజేపి వాగ్దానం చేసింది. అధికారాన్ని
చేపట్టిన తరువాత కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వాగ్దానాన్ని పునర్ఉద్ఘాటించారు. ఆ డబ్బును
వెనక్కి తీసుకుని వస్తే ప్రతి భారతీయ పౌరుడికి 15 లక్షల రూపాయల చొప్పున ఆయాచితంగా ఇవ్వవచ్చని
కూడా వారు మరీ చెప్పారు. సాక్షాత్తు ప్రధాని వేసిన లెఖ్ఖల ప్రకారం స్విస్ బ్యాంకులో
18 కోట్ల కోట్లు భారత నల్లధనం నిల్వలు వున్నాయని అర్ధం. అక్కడ అంత ధనం వుందని తెలిసి కూడా దాన్నీ వెనక్కు
తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎందుకు జంకుతున్నదో
దేశప్రజలకు ప్రధాని మోదీ వివరణ ఇవ్వాల్సే వుంది. ఎందుకంటే ప్రధాని తాత్సారం చేసేకొద్దీ
ఒక్కో భారతీయుడు 15 లక్షల రూపాయల్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాడు. తలసరి 15 లక్షల
రూపాయలు అనేది ఏ విధంగానూ చిన్న విషయం కాదు.
నోట్ల రద్దు సందర్భంగా మోదీ మన్
కి బాత్ లా ఆయన భక్తులు సోషల్ మీడియాలో సాగించిన వుధృత ప్రచారాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి
వుంది. 50 రోజుల దీక్ష తరువాత దేశంలో పెట్రోలు లీటరు పది రూపాయలకే ఇస్తారని, వంట గ్యాస్ ఉచితంగా సరఫరా చేస్తారనీ, పతి ఒక్కరికీ నివాసం,
విద్యా, వైద్యం వగయిరాలు అందిస్తారని. మొత్తంగా మోదీ ఒక భూతల స్వర్గాన్ని నిర్మిస్తున్నారన్నట్టు
ఆ ప్రచారం సాగింది.
మోదీ భక్తుల ప్రచారం చాలా చిత్రంగా
వుంటుంది. అది ఏదో అధికారిక ప్రకటన లానే వుంటుంది. కానీ, దానికి ఎలాంటి బాధ్యతలూ వుండవు.
స్విస్ బ్యాంకు నుండి నల్లధనం తెస్తే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తాయని మోదీజీ
అంచనా వేశారేతప్ప తెచ్చి పంచుతామని చెప్పలేదే అని ఇప్పుడు వాళ్ళు గడుసుగా అడుగుతున్నారు.
పెద్ద నోట్ల రద్దు విషయమూ అంతే. గత నెల రోజుల్లో పెట్రోలు ధర రెండుసార్లు పెరిగింది.
మార్కెట్లో నగదు లేనికారణంగానూ,
వున్న నోట్లు మరీ పెద్దవి కావడానూ, దేశంలో
చిరువ్యాపారం కుప్పకూలిపోయింది. క్యాష్ లెస్ కొనుగోళ్ళ వల్ల మాల్స్ లో అమ్మకాలు విపరీతంగా
పెరిగిపోయి, సాంప్రదాయ కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు దెబ్బతిన్నాయి. పచ్చి సరుకు
అయినకాడికి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. వీటి ధరలు పడిపోయాయి. గత రెండేళ్ళుగా కంది,
మిర్చి ధర మెరుగ్గా వుండడంతో ఈ ఏడాది ఆ రెండు పంటల విస్తీర్ణం విపరీతంగా పెరిగింది.
తిరా పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్ కుప్పకూలిపోయింది. అప్పుడే కొందరు కేంద్రమంత్రులు కొందరు వీటిని చూపించి ధరలు తగ్గుముఖం పట్టాయి అనే ప్రచారం
మొదలెట్టారు. కంది, మిర్చీ రైతుల కన్నీళ్ళని కూడా తమ విజయంగా చెప్పుకోవడం ఎలాంటి మానసిక
స్థితీ?
పెద్ద నోట్ల రద్దు తరువాత నిరుపేదలు, చిరు వ్యాపారులు, చేతి వృత్తులవాళ్ళు
దెబ్బతిన్నారు. నగదు మీద మాత్రమే జీవితాలు నడిచే కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలు,
బిచ్చగాళ్ళు, కమ్మర్షియల్ సెక్స్ వర్కర్లు కుదేలయిపోయారు. కార్పొరేట్లు బాగుపడ్డాయి. ఫలితాలనుబట్టి పథకాలకు
పేర్లు పెట్టడం మంచి సాంప్రదాయమే అనికునేదయితే మోదీ మార్కు పెద్ద నోట్ల రద్దు పథకం
బలహీనవర్గాలపై సర్జికల్ దాడి! మరికొంచెం వివరాల్లోనికి వెళితే కులమతతెగల పరంగా సాగుతున్న
ఆర్ధిక అణిచివేతనూ మనం గమనించవచ్చు.
(రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776
హైదరాబాద్
17 జనవరి 2017
ప్రచురణ
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ , 18 జనవరి 2017, 18-01-2017 02:16:18
http://www.andhrajyothy.com/artical?SID=358554
Writer Word Count : 1292
– 9117 – 10441
Published Word Count : 1017
– 7138 - 8137