Saturday, 18 January 2020

Tragedy in the Education System


Tragedy in the Education System 
ఇదొక విద్యా విషాదం
డానీ

            నరసాపురం ఎంబేరు మన్నారుస్వామివార్ల కోవెల దగ్గర పిలక పంతులుగా పిలిచే అగ్నిహోత్రావధాన్లు (గురువుగారికి నమస్కారం) గారి  దగ్గర  నేను అక్షరాభ్యాసం చేశాను. వారి దగ్గరే చిన బాలశిక్ష చదివి నరసాపురం టేలరు హైస్కూలు బ్రాంచి స్కూలులో చేరాను. అక్కడ ఐదు వరకు చదివిన తరువాత టేలరుపేట మునిసిపల్ అప్పర్ ప్రైమరీ స్కూలులో 6వ తరగతి నుండి 8వ వరకు చదివాను. అప్పట్లో దాన్ని శిష్ ట్లా సూర్యనారాయణ (గురువుగారికి నమస్కారం) స్కూలు అనేవారు. అప్పట్లో ఎమిదవ తరగతికి థర్డ్ ఫామ్, ఎయిత్ స్టాండర్డ్  అనే రెండు బోధనా పధ్ధతులు వుండేవి.   పబ్లిక్ ఎగ్జామ్ కనుక ఎయిత్ స్టాండర్డ్  కు థర్డ్ ఫామ్ కన్నా  అదనపు విలువ వుండేది. ఎయిత్ స్టాండర్డ్  పాసైన వారికి ఎలిమెంటరీ స్కూలు టీచర్లు, పోస్ట్ మ్యాన్లు, నర్సులు, కాంపౌండర్లు వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు. 1963-64 విద్యా సంవత్సరంలో ఎయిత్ స్టాండర్డ్  కామన్ ఎగ్జామ్ లో పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో నాది రెండవ ర్యాంకు.

            నరసాపురంలో  రెండే హైస్కూళ్ళు వుండేవి; టేలర్ హైస్కూలు, మిషన్ హైస్కూలు. టేలర్ హైస్కూలులో అల్లూరి శ్రీరామరాజు చదవగా, మిషన్ హైస్కూలులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు చదివారు. అదీ ఆ స్కూళ్ళ గొప్పతనం. అప్పట్లో టేలర్ హైస్కూలుకన్నా మిషన్ హైస్కూలు ప్రభ వెలిగిపోతూ వుంది. అంతర్జాతీయ విద్యావేత్త డిబి బర్ట్ వంశీకులు దాన్ని నిర్వహిస్తూ వుండేవారు.  మిషన్ హైస్కూలుకు అనుబంధంగావున్న ఎలిమెంటరీ స్కూలులో మా నాన్న మూడో తరగతి చదివారట. ఆపాటి చదువుకే ఆయన ఇంగ్లీషులో సంతకం పెట్టేవారు. ఉత్తరాల మీద ఇంగ్లీషులో అడ్రస్సులు రాసేవారు. బ్యాంకుల్లో రైల్వేస్టేషన్లలో అప్లికేషన్లు పూర్తిచేసే పనులు కూడ ఇంగ్లీషులో చేసేవారు.    పైగా వారి ఇంగ్లీషు రాత చాలా అందంగా వుండేది. నన్ను కూడ అక్కడ చేర్చాలని ఆయన కోరిక. అప్పటి హెడ్మాష్టారు బూల అజరయ్య (గురువుగారికి నమస్కారం) గారితోనూ మానాన్నకు చిన్న అనుబంధం ఏదో వుండేది. కానీ, మా ఎయిత్ స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే నాటికి మిషన్ హైస్కూలులో  9వ తరగతికి చెందిన నాలుగు సెక్షన్లూ  నిండిపోయాయి. సెక్షనుకు యాభై మందికి మించి తీసుకోవడానికి వీల్లేదు. ఇతర పట్టణాలకు పంపి చదివించే స్తోమత మా కుటుంబానికి లేదు.

            బూల అజరయ్య (గురువుగారికి నమస్కారం)  గారి సలహాతో మా నాన్న ఏలూరు వెళ్ళీ డిఇవోను కలిశారు. నాకు మెరిట్ స్టూడెంట్ గా సీటు ఇవ్వాలని డిఇవో సిఫారసు లేఖ ఇచ్చారు. అలా  రోల్ నెంబరు 51తో మిషన్ హైస్కూలు 9వ తరగతి ‘ఏ’ సెక్షన్ లో చేరాను. ఆ రోజుల్లో ‘ఏ’ సెక్షన్ అంటే అదో గొప్ప. నాలాగే ఎయిత్ స్టాండర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో కోడి వీర వేంకట సత్యనారాయణకు కూడ పెద్ద ర్యాంకు వచ్చింది. అతన్నీ డిఇవో సిఫార్సు చేశారు. తన రోల్ నెంబరు 52.  అప్పట్లో ఎస్ ఎస్ ఎల్ సి గ్రూపు పరీక్షల్ని తెలుగులోగానీ ఇంగ్లీషులోగానీ రాసే వీలుండేది. అయితే మాది తెలుగు మీడియమే.  

            మిషన్ హైస్కూలులోనే 9, 10, 11 చదివాను. అదే సెక్షను అదే బెంచి. అదే టీమ్. ఎడమ పక్క అమ్మనమంచి కృష్ణశాస్త్రి, కుడి పక్క పిట్టా కాల్విన్ విక్టర్ బాబ్. మధ్యలో నేను. మూడు మతాల సామరస్యం.  అదొక మినీ ఇండియా. మాది ఎస్.ఎస్‍.ఎల్.సి. 1966-67 బ్యాచి.

            మా కుటుంబం అల్పాదాయ వర్గం గాబట్టి నాకు హైస్కూలులో హాఫ్ ఫీ వుండేది. అదిగాక ఎయిత్ స్టాండర్డ్  మార్కుల మీద నాకు 9వ తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు. 9వ తరగతి  మార్కుల మీద 10 వ తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు. 10వ తరగతి  మార్కుల మీద 11వ తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు. ఎస్ ఎస్ ఎల్ సి మార్కుల మీద కాలేజీలో మళ్ళీ మెరిట్ స్కాలర్ షిప్పు ఇచ్చారు. హైస్కూలులో కాంపోజిట్ మేథమెటిక్స్ చదివాను; కాలేజీలో మేథ్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ చదివాను.  నికరంగా జరిగిందేమిటంటే నా చదువు కోసం నా పేరెంట్స్ కట్టిన ఫీజులన్నీ మెరిట్ స్కాలర్ షిప్పుల రూపంలో తిరిగి వచ్చేశాయి.  

            మా టీచర్లకు సబ్జెక్ట్స్ మీద అపారమైన పట్టువుండేది. విద్యార్ధుల మీద అంతులేని వాత్సల్యం వుండేది. విద్వాన్ పేరి రామారావు గారి తెలుగు పాఠాలు, కేఎన్ ఆర్, వి. త్రివేంగళా చార్యుల మేథ్స్ పాఠాలు. జోస్యుల వేంకటేశ్వర రావు గారి సైన్సు పాఠాలు, బెంజిమన్, అబ్రహం, జాన్ మాష్టర్ల సోషల్ స్టడీస్, భౌగోళిక శాస్త్రం, బూల అజరయ్యగారి ఇంగ్లీషు నాన్ డిటైల్స్ పాఠం, సంజీవరావు గారి ఇంగ్లీషు పాఠాలు నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతూనే వుంటాయి (గురువులందరికీ నమస్కారం).  ఇంగ్లీషు భాష syntax లో జాతీయ స్థాయి గుర్తింపువున్న థియోడర్ (గురువుగారికి నమస్కారం)  మాస్టారు అక్కడే పని చేసేవారు. సంజీవరావు మాస్టారు (గురువుగారికి నమస్కారం)  అయితే “even the dog can bark in English if I teach” అని సగర్వంగా ప్రకటించేవారు.   

            హెడ్మాష్టారు బూల అజరయ్యగారు (గురువుగారికి నమస్కారం) నా ఎస్.ఎస్‍.ఎల్.సి. మార్కుల పుస్తకంలో “He will be a scientist or a social worker” అని రాశారు. అప్పటికి నాకు నిండా పదహారేళ్ళు కూడ లేవు. ఆ వయసులోనే వారికి నా భవిష్యత్తు మీద అలాంటి అంచన ఎలా వచ్చిందన్నది నాకు ఇప్పటికీ అశ్చర్యమే.

            దాదాపు నలభై ఎనిమిదేళ్ళ తరువాత 2015లో అమ్మనమంచి కృష్ణశాస్త్రి పుట్టిన రోజు సందర్భంగా  నరసాపురం వెళ్ళినపుడు పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి నా తరగతి గదికి వెళ్ళాను. మా జమానాలో నరసాపురం పరిసరాల్లోని పెద్ద కుటుంబాల పిల్లలందరూ మా స్కూలులో వుండేవారు. మొగల్తూరు రాజులు సహా, బ్రాహ్మణులు, క్షత్రీయులు,  వైశ్యులు, కాపులు, ముస్లింలు, క్రైస్తవులు, ఈడిగలతో క్లాస్ రూములు ధగధగ్గ లాడిపోయేవి. అన్నట్టు మా ఊరి క్రైస్తవుల్లో కొన్ని కుటుంబాలు చాలా సంపన్నులు. విద్యా, వైద్య రంగాల్ని వాళ్ళే శాసించేవారు.   

            ఇప్పటి మా తరగతి గదిలోని దృశ్యం చూసి తల్లడిల్లిపోయాను సెక్షనులో పట్టుమని పదిహేను మంది పిల్లలు కూడా లేరు. వాళ్ళు కూడ సోమాలియా నుండి దిగి వచ్చినట్టు బక్కచిక్కిపోయి చింపిరి బట్టలతో వున్నారు. ప్రాబల్యం గల కులాలన్నీ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు  పోగా నిరుపేద ఎస్సీలు ఎస్టీలు కొందరు బిసిలు మాత్రమే ఇప్పుడు మిగిలారు. వాళ్ళు కూడ మధ్యహ్న భోజనం కోసమో ఉడకేసిన  కోడిగుడ్ల కోసమో స్కూలుకు వస్తున్నారని నాకు అనిపించింది. 

            ఇంగ్లీషు మీడియం ప్రైవేటు స్కూళ్ళు మా మిషన్ హైస్కూలును తినేశాయి.  ప్రభుత్వ స్కూలు అన్నా. ఎయిడెడ్ స్కూలు అన్నా ఇప్పుడు నిరుపేద ఎస్సీలు ఎస్టీలు  బిసిల బాల ఆశ్రయాలుగా మారిపోయాయి. అలనాటి విద్యా వైభవం శిధిలమైపోయింది.


తెలుగు మాధ్యమం ద్వార ఇంగ్లీషు నేర్పే పని దశాబ్దాలుగా చేస్తున్నారు. ఫలితాలు రాలేదు. ఇప్పుడు ఇంగ్లీషు మాధ్యమం ద్వార ఒక ప్రయత్నం చేయనియ్యండి.