Monday, 29 August 2022

Danny had a revolutionary life – Lakshmi Narasiah G

 Danny had a revolutionary life – Lakshmi Narasiah G

డానీది విప్లవకర జీవితం.

-        గుంటూరు లక్ష్మి నరసయ్య

 27-08-2022

డానీది విప్లవకర జీవితం.

రాజకీయంగా తన జీవితంలో అతి ముఖ్య భాగం మావోయిస్టు గా గడిచింది. అందులో భాగంగానే విప్లవోద్యమం తరుపున కారంచేడు ఉద్యమం లో, చుండూరు ఉద్యమం లో భాగస్వామి అయ్యాడు.ఉద్యమ సారధుల్లో ఒకడుగా వున్నాడు.

ఇప్పటికీ అతను కామ్రేడే.

నేను ఇంటర్ చదువుతూ రాడికల్ విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఆయన రాడికల్ నాయకుడు.కోస్తా జిల్లాలకు పార్టీ తరుపు మేధావి.విరసం లో గట్టి వాయిస్.

ప్రస్తుతం బహుజన ఉద్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. మేధావిగా ముస్లిం సమాజాన్ని సరైన దారిలో నడిపే కీ రోల్ ను పోషిస్తున్నాడు.

ఇతను తెలుగు జర్నలిజం మీద తనదైన ముద్ర వేసిన మేధావి, ఆలోచనాపరుడని చెప్పక తప్పదు.

చరిత్ర, రాజకీయాలు, తత్వశాస్త్రం మీద ఆశ్చర్యం కొలిపే పట్టు వున్నవాడు.సిద్ధాంతాన్ని సమకాలీన జీవితానికి ఆపాదించడంలో  నిష్ణాతుడు. దారిలో ఎన్నో రచనలు చేశాడు.చేస్తున్నాడు.గొప్ప ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇస్తున్నాడు.

డానీ కథలు చదువుతుంటే ఇతను మిగతా వ్యాపకాలన్నీ వదిలి కథలు మాత్రమే రాసి ఉంటే తెలుగు సాహిత్యానికి గొప్ప కధకుడు లభించి వుండేవాడనిపిస్తుంది.అంత మంచి కధలవి.తన సాహిత్య విమర్శకూ అదే స్థాయి ఉంది.

బేసిక్ గా ఆకర్షణీయమైన నెరేటివ్ టెక్నిక్ ఉన్నవాడితను. మాటల్లో గానీ రచనలో గానీ సహజమైన చమక్కులు చొప్పించడంలో నేర్పరి. చక్కని సంభాషణ  పండించగలడు.వెరీ గుడ్ కాన్వర్జేషనలిస్ట్.

డానీ మతాంతర వివాహం చేసుకుని ఇప్పటి వరకూ దాన్ని నిలుపుకోగలగడమూ నా దృష్టిలో గొప్పే.

తాను ఇక్కడిదాకా ఇప్పటిదాకా ఇలా ప్రయాణించడంలో ఎదుర్కొన్న కష్టాలు, సంఘర్షణలూ ఎన్నో ఉన్నాయని చాలామందికి తెలుసు.

నేను ఎక్కువగా ఆయన్ని కలవని మాట నిజమే గానీ కలిసినప్పుడూ కలవనప్పుడు కూడా తనను ఆత్మీయ అన్నగా భావించుకుంటాను.

అన్నను గురించి రాయడానికి చాలా ఉంది. ప్రస్తుతం ఇది చాలనుకుంటా.

ఈరోజు తన Birthday.

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలన్నా .

Wish you a wonderful life ahead.

Thursday, 25 August 2022

Society Means Solidarity

Society Means Solidarity

సమాజం అంటే సంఘీభావం

అహమ్మద్ మొహియుద్దీన్  ఖాన్ యజ్దానీ (డానీ)

 

నాకు పదేళ్ళు రావడానికి ముందు జీవితం గురించి పెద్దగా గుర్తులేదు.

 

మాది సౌకర్యంగా బతికిన కుటుంబం. రెండు ఇళ్ళు వుండేవి. నాన్నకు మెయిన్ రోడ్డులో బాగా నడుస్తున్న సైకిల్ షాపు వుండేది. టైర్ రీ- ట్రేడింగ్ కార్ఖానా వుండేది. ఉమ్మడిలో నరసాపురం-అంతర్వేది మధ్య నడిచే లాంచి ఒకటి వుండేది.

 

తెల్లటి పట్టు జుబ్బా, చుడీదార్ షరాయి, మెడలో ముత్యాల హారం, వెండి కంచంలో భోజనం, వెండి గ్లాసులో నీళ్ళు, గ్రామ్ ఫోనులో పాటలు వినడం వగయిరాలు అలా అలా అప్పుడప్పుడు కళ్ళలో మెరిసే మసక మసక జ్ఞాపకాలు.

 

ప్రమాదాలు ఎప్పుడూ నా నీడలా వుండేవి. పాము ఒకటి వచ్చి మంచం మీద నా తల కింద పడుకోవడం, చేద బరువు లాగలేక నేను నూతిలో జారి పడిపోవడం వంటివి ఆ ప్రమాదాల్లో కొన్ని మాత్రమే. ఈ ప్రమాదాల పరంపర నన్ను తరువాతి కాలంలోనూ వెంటాడింది.

 

నా బయోలాజికల్ బర్త్ ఇయర్ 1951 ఐతే, నా సోషల్ బర్త్ ఇయర్ 1961. సమాజం నాకు అర్ధమవడం మొదలయింది అప్పటి నుండే. ఆ తరువాత  జరిగిన ప్రతి సంఘటన ప్రతి క్షణం నాకు గుర్తుంది.

 

వరదల్లో మా లాంచి కొట్టుకుపోయింది. అగ్నిప్రమాదంలో కార్ఖానా  బూడిదయిపోయింది. మానాన్న రోడ్డున పడ్డారు. పూలమ్మిన చోట కట్టెలమ్మడానికి ధైర్యం చాలక ఆయన  పంజాబ్ లోని పారిశ్రామిక పట్టణం లూధియాన పారిపోయారు. మూడేళ్ళ తరువాత 1964లో ఆయన తిరిగివచ్చారు. అప్పటికే నాకు చాలా జీవిత అనుభవం వచ్చేసింది. ఆ మూడేళ్ళు నేను అర్ధ అనాధగా బతికాను. అందరు అనాధల్లాగే పదో ఏట అర్ధ బాల కార్మికునిగా మారాను. నేను అప్పర్ ప్రైమరీ బోర్డు స్కూల్ లో చదువుతూ ఒక బట్టల షాపులో కొన్ని గంటలు పని చేసేవాడిని. నా రోజు కూలి బేడ; రెండు అణాలు. అణా అంటే రూపాయిలో పదహారవ వంతు. ఇప్పటి భాషలో సిక్స్ నయా పైసే.

 

అప్పట్లో రెండు అణాలకు మా చిన్ని జీవితాల్లో  చాలా వచ్చేవి. ఒక అణా పెట్టి బెల్లం, అర్ధఅణా పెట్టి టీ పొట్లం కొనేవాడిని. మరో అర్ధ అణాను పాకెట్ మనీ కింద తమ్ముడికి ఇచ్చేసే వాడిని. మా తమ్ముడికి నా అంత శరీర ధారుఢ్యం వుండేది కాదు. వాడిది కొంచెం సున్నిత మనస్తత్వం. నాకొచ్చే కూలీ డబ్బుల్లో నా కోసం ఏమీ వుంచుకోకుండా మొత్తం ఇంట్లో ఇచ్చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఆనందానికి కొత్త అర్ధం, దాన్ని ఆస్వాదించడానికి కొత్త మార్గాలు నాకు తెలియరావడం మొదలయింది.  

 

బాల కార్మికుడ్ని కావడాన ఏమో ఈలోకంలో పిల్లలు, వృధ్ధులు ఎలా బతుకుతారనే భయం సందేహం నన్ను తరచూ వెంటాడుతుండేవి. మార్క్స్ పేరు గానీ, కమ్యూనిజం పదంగానీ అప్పటికి నాకు బొత్తిగా తెలీదు.  బహుశ నేను ఆర్గానిక్ సోషలిస్టుని. 

 

ఈ గడ్డు కాలంలో  మా కథానాయకి మా అమ్మ. ఆమె ధైర్యాన్నీ, తెగువను చెప్పడానికి పదాలు చాలవు. నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారని తెలిసినప్పుడు ఒక పూట ఏడ్చింది. మరునాడు కళ్ళు తుడుచుకుంది. ఆ తరువాత ఎన్నడూ ఏడ్వలేదు.  మా ఇంట్లో ఫర్నిచర్ మొత్తం అయినకాడికి చుట్టుపక్కలవాళ్లకు అమ్మేసి ముందు మా నాన్న బకాయిల్ని తీర్చేసింది. కార్చూబీ (జరీ పనితనం) చీరలు, లెహంగాలు కూడ అమ్మేసింది. నా వెండి పళ్ళెం, వెండి గ్లాసును అమ్ముతున్నప్పుడు ఆమె కొంచెం ఎక్కువే బాధపడింది. నాకో సంజాయిషీ కూడ ఇచ్చుకుంది. “అప్పులు లేకపోతే మన ఇంట్లో మనం మన ఇష్టం వచ్చినట్టు వుంటాం.  అప్పులున్నవాళ్ళది బానిస బతుకు!” అంది.  

 

ఎందుకోగానీ వెండి పళ్ళెం, వెండి గ్లాసు సంఘటన మా అమ్మను చాలాకాలం వెంటాడింది. 22 ఏళ్ల తరువాత కూడ నా భార్యతో ఆ సంఘటనను గుర్తు చేసుకుని “వాడి ఆనందాన్ని చెడగొట్టాను” అంటూ బాధపడింది. 

 

సంసారాన్ని నడపడానికి తన ముందు రెండు ఆప్షన్లున్నాయి. తను ఎవరి ఇంట్లో అయినా పనికి పోవడం, లేదా నన్ను ఎక్కడయినా పనిలో పెట్టడం. అవి రెండూ ఆమెకు ఇష్టంలేదు. “నువ్వు చదువుకోవాలి. ఇంగ్లీషు మాట్లాడాలి” అని ఆజ్ఞాపించింది.

 

అప్పట్లో కిరాణా సరుకుల్ని శంఖు (కోన్) ఆకారంలో  పొట్లాలు కట్టి ఇచ్చేవారు. కొత్తగా కాగితపు సంచుల్లో ఇచ్చే పధ్ధతి వచ్చింది. మా అమ్మ పగలూ రాత్రి చాలా కష్టపడి కాగితపు సంచులు తయారు చేసేది. అలా ఆ కొత్త టెక్నాలజీతో మా కుటుంబం గడిచేది.

 

ఒకసారి భోజనం చేస్తే మళ్ళీ ఎప్పుడు తింటామో తెలియని రోజులు అనేకం వుండేవి. ఆకలి వేస్తున్నదని తను ఏదిపడితే అది తినేది కాదు, మమ్మల్నీ తిననిచ్చేదీ కాదు. కట్టెలపొయ్యి మీదనే ప్రతి పూట వేడి అన్నం ఎప్పటికప్పుడు వండి పెట్టేది. పేదరికం వలన కక్కుర్తి అలవాట్లు వస్తాయని జాగ్రత్తగా వుండాలని అనేకసార్లు హెచ్చరించేది. శుభకార్యాలకు, ఇతరుల ఇళ్ళకు వెళ్ళినపుడు ఆబగా తినరాదని మితంగా తినాలనీ పదిసార్లు చెప్పి పంపేది.

 

నేనూ, తమ్ముడు, చెల్లెలు (అప్పటికి) మేము ముగ్గురం.  మమ్మల్ని చాలా ప్రెజెంటబుల్ గా వుంచేది. డబ్బుల్ని పొదుపు చేసి మంచి బట్టలు కొనేది. నాకు రోజూ తొడుక్కోవడానికి హవాయి (రబ్బరు) చెప్పులు వుండేవి. శుభకార్యాల్లో తొడుక్కోవడానికి తోలు చెప్పులు కూడ వుండేవి. గత జీవిత వైభవాన్ని తిరిగి అందుకోవడానికి తను అనుక్షణం తపిస్తూ వుండేది. పండుగ రోజుల్లో భోషానం తెరచి రంగూన్ పింగాణీ డిన్నర్ సెట్ ను బయటికి తీసి మాకు భోజనం పెట్టేది. మళ్ళీ వాటిని శుభ్రంగా కడిగి లోపల పెట్టేసేది. శుభకార్యం కాగానే కొత్త బట్టల్ని, తోలు చెప్పుల్ని బీరువాలో దాచేసేది.

 

నా హెయిర్ స్టైలిస్టు, కాస్ట్యూమ్ డిజైనర్ మా అమ్మే!. నా అపెరల్ ఏ స్థాయిలో వుండేదంటే మాకన్నా ఆర్ధికంగా ఎంతో మెరుగ్గావున్నవాళ్ళు సహితం కొంచెం ఆశ్చర్యం, అసూయ చెందేలా వుండేది.

 

ఇంట్లో రాత్రి అన్నం కూరలు మిగిలిపోతే ఎవరయినా సాధారణంగా మరునాడు పేదలకు ఇచ్చేస్తుంటారు. మా అమ్మ అలాకాదు; రాత్రి భోజనాలు చేయగానే మిగిలిన అన్నం, కూరల్ని ఎవరో ఒకర్ని పిలిచి ఇచ్చేసేది. “రేపు అన్నం సద్దిది అయిపోతుంది. అది వాళ్లకు అవమానం. ఇప్పుడే ఇచ్చేస్తే  వేడివేడిగా సంతోషంతో తింటారుకదా” అనేది. ఒక్క చేప ఇగురు తప్ప మరేదీ మరునాటికి వుంచేదికాదు. వడ్డించడంలోనూ ఆమెది గొప్ప నైపుణ్యం. ఒకసారి చేప ముల్లు గొంతులో అడ్డంపడి నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అప్పటి నుండి చేప తినాలంటే భయం వేసేది. అంచేత, ముళ్ళు చాలా తక్కువగా వుండే పొట్ట ముక్కల్ని నాకు ప్రత్యేకంగా వడ్డించేది. 

 

మా అమ్మ యాజమాన్య నైపుణ్యం గురించి చెప్పుకుంటూ పోతే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’, ‘పర్సనాలిటీ డెవలప్ మెంట్’  ‘జీవితంలో ఏటికి ఎదురీదడం’ వంటి అంశాల మీద నాలుగు పుస్తకాలు రాయవచ్చు.

 

రాత్రుళ్ళు మా అమ్మ, మా చెల్లి ఒక మంచం మీద, నేనూ మా తమ్ముడు ఇంకో మంచం మీద పడుకునేవాళ్ళం. పెంకులు నేయించడానికి డబ్బులు లేకపోవడంతో మా పడక గది వర్షాకాలం కారుతూ వుండేది. నెమ్మదిగా మా తమ్ముడూ, నేను మా అమ్మ మంచం మీదికి చేరుకునేవాళ్లం. వర్షపు నీరు కారుతుంటే ముగ్గురం మా అమ్మను గట్టిగా కరుచుకుని పడుకునేవాళ్లం. నాలుగు శరీరాలు- ఒక ఆత్మ. ఆ పేదరికపు రోజుల్లో నేను ఆస్వాదించిన గొప్ప విలాసం; సంఘీభావం.  అందులో ఒక ఆలంబన, మనకోసం మరొకరున్నారనే ధీమా, రేపు మంచి రోజులొస్తాయనే నమ్మకం, మనం మనుషులమనే ఎరుక ఒక్కటేమిటీ అనేకం వున్నాయి.  

 

సంఘీభావం లేని ఐశ్వర్యం పేదరికం కన్నా పెద్ద శాపం. సంఘీభావంగల పేదరికం ఐశ్వర్యంకన్నా గొప్ప వరం.

 

“మీరంటే మాకు ఇష్టం’  అని ఎవరయినా నా మీద ప్రేమాభిమానాల్ని   వ్యక్తం చేసినపుడు గొప్ప భావోద్వేగానికి లోనైపోతాను. ఆ వర్షాకాలపు రాత్రుళ్ళు, కప్పు నుండి కారుతున్న నీరు, ఒక మంచం, నాలుగు శరీరాలు, ఒక ఆత్మ గుర్తుకు వస్తాయి. లోకంలో భావోద్వేగాలతో మనల్ని ప్రేమించేవారు ఒక్కరున్నా అది మహత్తర విషయం. ఇలాంటి సంఘీభావం కోసం, ఇలాంటి విలాసాన్ని ఆస్వాదించడం కోసం నేను చాలాసార్లు తపించాను. చాలా ప్రయాణాలు చేశాను.

 

సంఘీభావమే సమాజ లక్షణం. యంత్ర యుగంలో మనుషులు సంఘీభావంతో కాకుండ జంతు ప్రపంచంలోలా గుంపులుగా జీవిస్తున్నారు. మన తరం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇదే. ఈ మహమ్మారి నుండి తప్పించుకోకపోతే మానవజాతి అంతరించిపోతుంది.

 

ఉద్యమ నాయకులు తమకే ఆచరణసాధ్యంకాని అనేక అందమైన రాజకీయ లక్ష్యాల గురించి తరచూ మాట్లాడుతుంటారు. నిజం చెపితే నిష్టూరంగా వుంటుందిగానీ ఆ రాజకీయ లక్ష్యాల సాధన మార్గాల గురించి వాళ్ళకూ లోతుగా  తెలీదు. తెలియని లక్ష్యాలను సాధించడం ఎవరికీ సాధ్యమూ కాదు. ‘దున్నేవానికే భూమి లక్ష్యంతో సాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగా కలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని’ జయప్రదం చేయాలి అనే కార్యక్రమాన్ని రూపొందించిన వారికే దాని అర్ధం పూర్తిగా తెలియదు అని నాకు గట్టి అనుమానం. ఇక వినేవాళ్ళకు ఏం అర్ధం అవుతుందీ? అయినప్పటికీ, నిండా నూరేళ్ళు దాటినా ఇప్పటికీ వాళ్ళు ఆ మాటల్నే  వల్లె వేస్తుంటారు.

 

అయితే, ఉద్యమ కాలంలో ఉద్యమ అభిమానుల మధ్య సంఘీభావం చాలా వున్నత స్థాయిలో వుంటుంది.. అధికారికంగా సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పడనప్పటికీ, సామ్యవాద ఉద్యమ కాలంలో ప్రజలు తాత్కాలికంగా అయినా ఒకరకం సామ్యవాద వాతావరణాన్ని, అనుబంధాల్ని ఆస్వాదిస్తుంటారు. ఆ భావోద్వేగంలో కొందరు అస్తుల్ని వదులుకుంటారు; కొందరు కులమత భేషజాలను వదిలేసుకుంటారు. ఉద్యమ అభిమానులంతా ఒక కుటుంబంగా మారిపోతారు. ఒకరి కోసం మరొకరు చనిపోవడానికి సిధ్ధపడేంతగా ఆ సంఘీభావం వుంటుంది. మనుషుల మధ్య సంఘీభావం ఆ స్థాయిలో వున్నప్పుడు కుల మత వర్గ తెగ లింగ వర్ణ ప్రాంత విబేధాలు ఏవీ పని చేయవు.  ఉద్యమాలు బలహీన పడిపోయినపుడు ఈ తాత్కాలిక సామ్యవాద వాతావరణం, అనుబంధాలు  కూడ బలహీనపడిపోయి మళ్ళీ కుల మత వర్గ తెగ లింగ వర్ణ ప్రాంత  విబేధాలు బలపడిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నది ఇదే.

 

సంఘీభావాన్ని ఆస్వాదించ్వడానికి నేను నిరంతరం తపిస్తూ వుంటాను. ఎక్కడ ఏ ఉద్యమం సాగుతున్నా అక్కడికి వెళతాను. నావల్ల ఆ ఉద్యమాలకు ఏమేరకు మేలు జరుగుతుంది అనే దానికన్నా ఆ ఉద్యమంలో  వాళ్ళు ఏ స్థాయిలో సంఘీభావాన్ని ఆస్వాదిస్తున్నారు అనేది నాకు చాలా ముఖ్యం. అది నన్ను రీ-చార్జ్ చేస్తుంది. జిందగీ అభీ బాకీ హై అనిపిస్తుంది.  అలాంటి జీవన విలాసాన్ని నేను వదులుకోలేను.

         

27 ఆగస్టు 2022

అజితా కుటీరము, విజయవాడ

 

ఆ రోజుల్లో మా అమ్మచెప్పిన ఒక మాట నాకు కష్టాలొచ్చిన ప్రతిసారీ గుర్తుకు వస్తుంది.  “తప్పకుండా మనకు మంచిరోజులు వస్తాయి (ఈన్షాల్లా). మనం వాటిని చూడాలి.  అయితే అప్పటి వరకు మనం బతికి వుండాలి. బతికి వుండాలంటే ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి”. ఆరోగ్యానికి తన చాలా ప్రాధాన్యత ఇచ్చేది. తను 84వ ఏట ఉదయాన్నే లేచి నమాజ్ చేసుకుని పాలు తాగి పడుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండ నిద్రలోనే చనిపోయింది. అనారోగ్య కారణాలతో తను హాస్పిటల్ లో ఒక్కరోజు కూడ లేదు. చనిపోవడానికి రెండేళ్ళు ముందు మాత్రం నిమోనియాతో ఓ నాలుగురోజులు హాస్పిటల్ లో వుంది.

 

తనను దగ్గరగా చూడడంవల్ల నాకు అర్ధం అయ్యింది ఏమంటే రాగాలు అంత సులువుగారావు; మన అజాగ్రత్తవల్ల వాటిని  తెచ్చుకుంటాము. 70 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు హాస్పిటల్ లో చేరేంత అనారోగ్యం రాకూడదనేది నా ఒరిజినల్ ప్రణాళిక. నా టార్గెట్ పూర్తికావడానికి మరో నాలుగు నెలలు వుండగా కోవిడ్ దాన్ని భగ్నం చేసింది.

 

(నేను 1981లో JNUలో ఇంగ్లీషులో ప్రసంగించానని తెలిసినపుడు మా అమ్మ ఆనందానికి హద్దులు లేవు. 1990లో నన్ను ఇబ్బంది పెట్టాలని యాజమాన్యం వారు ఆంధ్రభూమి నుండి డెక్కన్ క్రానికల్ కు బదిలీ చేశారు. ఇది నాకు వరంగా మారింది. తన కొడుకు ఇంగ్లీషులో కథలు రాస్తాడని విని తెగ సంబర పడిపోయింది మా అమ్మ. ఒక దశలో నా తెలుగు ఆర్టికల్స్ ‘మున్సిఫ్ డైలీ’లో  ఉర్దూలో అచ్చు అయ్యేవి. ఈ పరిణామం మా అమ్మను చాలా ఆనందాన్నిచ్చింది.  ఇవన్నీ చాలా చిన్న విషయాలని చాలా మంది భావించవచ్చు. నాకు ఇవి చాలా పెద్ద విషయాలు. సెట్ అప్, కన్ఫ్రంటేషన్  దశల్లో కష్టాల పాలైన పాత్రకు రిజల్యూషన్ దశలో అయినా ఆనందాన్ని ఇవ్వకపోతే ఆ మనిషికి జీవితానికి స్క్రీన్ ప్లే రాయడం తెలిదని అర్ధం

 

వైద్యం గురించి ఆలోచకుండ జబ్బు గురించి మాత్రమే మాట్లాడేవాళ్లంటే నాకు పరమ చికాకు. కష్టాల గురించి తెగ ఏకరువు పెట్టేవాళ్ళన్నా నాకు పడదు. కష్టాల నుండి బయటపడే మార్గాల్ని వెతకడమే మనిషి పని. అదే జీవనపోరాటం. మనిషి అన్నాక కష్టాలు వస్తాయి. కష్టాలను అధిగమించే మార్గాల్ని నిరంతరం వెతుకుతూ వుండాలి. కష్టాల్లోనూ కొన్ని ఆనందాలుంటాయి. వాటిని ఆస్వాదించాలి. జీవనపోరాటమే జీవన సౌందర్యం. “People who laugh the most are the ones who suffered the most” – Maxim Gorky.