Thursday 17 October 2024

ఏపి అధికార భాష తెలుగు; తెలంగాణ అధికార భాష తెలంగాణ

 *ఏపి అధికార భాష తెలుగు; తెలంగాణ అధికార భాష తెలంగాణ*

డియర్ జిలుకర శ్రీనివాస్! స్కైబాబ!
ఉద్యమ అభినందనలతో,

మూడు నెలలుగా నేను వేరే పనుల్లో వుండిపోవడంవల్ల అవార్డులు, అవకాశాలు, ఆంథొలాజీల విషయంలో తెలుగు సాహిత్యంలో ప్రాంతీయ వివాదం ఒకటి సాగుతున్నట్టు నాకు చాలా అలస్యంగా తెలిసింది.
‘తెలంగాణ రచయితల ఆత్మగౌరవ పోరాట వేదిక’ ఏర్పడిందని స్కైబాబ వాల్ మీద చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. నేను వెంటనే ఫోన్ చేసి మీ ఇద్దరితో మాట్లాడాను. తెలుగును ప్రాంతాలవారీగా ‘ఆంధ్రా-తెలుగు’, ‘తెలంగాణ - తెలుగు’ అంటూ మీరు చేసిన విభజన నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఇలాంటి విభజనవల్ల ఎవరికీ ప్రయోజనమూ లేదు.
గత శతాబ్దకాలంలో ఆంధ్రా ప్రాంతం ఐదు రాష్ట్రాల్లో వుంది. మేము మద్రాసు ప్రెసిడెన్సీలోవున్నా, మద్రాసు స్టేట్ లోవున్నా, ఆంధ్రా స్టేట్లో వున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వున్నా, ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్ లో వున్నా మాది ఎలాగూ ఆంధ్రా ప్రాంతమే. ఉత్తర ప్రదేశ్ భాష ఉత్తరా కాదు; మధ్యప్రదేశ్ భాష మధ్యా కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంత భాష ఆంధ్రా అనడం సరికాదు.
మా చిన్న తనంలో పండిత వర్గాలకు మాత్రమే విద్య అందుబాటులో వుండేది. వాళ్ళు ఆంధ్రభాష పదాన్ని వాడేవారు. జనబాహుళ్యం ఎప్పుడూ తెలుగు అని మాత్రమే అనేది. జనబాహుళ్యానికి విద్య అందుబాటులోనికి వచ్చాక ఆంధ్రాపదం భాషగా దాదాపు అంతరించిపోయి ఇప్పుడు తెలుగు పదమే ప్రాచూర్యంలో వుంది. స్కూళ్ళ టైమ్ టేబుల్ లోనూ ఇంగ్లీషు పీరియడ్, హిందీ పీరియడ్ వున్నట్టు తెలుగు పీరియడ్ వుండేది. ఆంధ్రా పీరియడ్ అనేది మేము కనీసం ఊహించలేనిది.
మీరు కొంచెం వెనక్కు చూసుకుంటే నిజాం ప్రిన్సిలీ ఎస్టేట్ లోనూ 1920-1948 వరకు అన్నీ ఆంధ్రా పేరుతోనే సాగాయి. ఆంధ్రా జనసంఘం, ఆంధ్రా మహాసభ, శ్రీకృష్ణదేవరాంధ్రాయ గ్రంధాలయం, రాజరాజ నరేంద్రాంధ్రా గ్రంధాలయం వగయిరాలు.
తెలంగాణ భాషను తెలుగుకు సంబంధించిన ఒకానొక యాస అనుకునే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వుంది. ఇది మీకు నచ్చకపోవచ్చు తెలుగుకు ఉత్తరాంధ్రాలో, మధ్య ఆంధ్రాలో, దక్షణాంధ్రాలో, రాయలసీమలో కూడా భిన్నమైన యాసలున్నాయి. ఇంకాస్త లోతుకు వెళితే జిల్లాకో రెండు మూడు యాసలూ వినపడతాయి. “మా యాసే మా స్వతంత్ర సంపూర్ణ భాష” అనుకునే హక్కు ఎవరికయినా వుంటుంది. అది ప్రజాస్వామిక హక్కు కనుక దాన్ని నేనూ గౌరవిస్తాను. అలా తెలంగాణ భాష డిమాండునూ గౌరవిస్తాను.
కానీ, మాది ఆంధ్రా తెలుగు భాష అని మీరు అనడం సరికాదు. మీ పిల్లలకు మీరు స్వేఛ్ఛగా పేర్లు పెట్టుకోవచ్చు. పక్కింటి పిల్లల పేర్లు కూడా మీరే నిర్ణయించడం సబబు కాదు. దీని మీద అభ్యంతరం తెలుపుతూ ఒక సమగ్ర వ్యాసం రాసి ఓ ప్రధాన పత్రికకు పంపించాను. ఈలోగా నా ఆలోచన మారింది. దానితో నా వ్యాసం ప్రచురణను ఆపేయమని ఆ పత్రిక నిర్వాహకుల్ని కోరాను. వారూ అంగీకరించారు.
నా వ్యాసం విరమణకు మూడు కారణాలున్నాయి. మొదటిది; ఈ వివాదంలో నాకు Locus Standi లేదు. మీ కొత్త సిధ్ధాంతాలు వాదనలవల్ల వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టము ఏమీలేదు. కాకపోతే భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ప్రస్తుతం నాలుగవ స్థానంలో వుంది. దానికి ఆ స్థాయి పోవచ్చు.
అవార్డులు, అవకాశాలు, ఆంథొలాజీల విషయంలో నాకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం నాకు ఎన్నడూ లేదు. నేను రాసినవన్నీ అచ్చు అవుతూనే వున్నాయి. నా కథా సంకలనం, నా వ్యాసాల సంకలనాలు వేస్తామని కొందరు పబ్లిషర్లు ముందుకొచ్చి ఆఫర్లు చేసినా నేను నా బద్దకం కొద్దీ వాటి మాన్యువల్ కాపీని తయారు చేసి ఇవ్వలేకపోయాను. మీటింగుల్లో ప్రసంగించమని పిలుస్తున్నా కొన్నింటికి వెళ్ళడం లేదు. ఎక్కువ కాలం విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల్లో వుండడం మూలంగా కావచ్చు అవార్డులు సన్మానాల విషయంలో నాకు ఎప్పుడూ ఎలాంటి ఆసక్తి లేదు.
రెండవ కారణం; సాహిత్యం నా ఏకైక కార్యక్షేత్రం కాదు; నాకు ఇంకా ఇతర వ్యాపకాలూ వున్నాయి. సమాజ విశ్లేషకునిగా, క్రియాశీల సమాజ కార్యకర్తగానూ వుండడం నాకు ఇష్టం.
మూడవ కారణం; సాహిత్యంలో మీకు అన్యాయం జరుగుతున్నదని మీరు ఆవేదన చెందుతున్నారు. నేను ప్రతి సందర్భంలోనూ బాధితుల పక్షాన్నే వుంటూ వచ్చాను. ఇప్పుడూ మీ పక్షాన్నే వుంటాను.
అధికార భాష అనే కాన్సెప్ట్ మీద కూడ నాకు కొన్ని తీవ్ర అభ్యంతరాలున్నాయి. అది ఇతర భాషల్ని అణిచివేస్తుందని నేను భావిస్తాను. అటు తెలంగాలో అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయినా రాజ్యాంగ స్కేడ్యూలులోని భాషలన్నింటికీ జన సమూహాలుంటారు. అవిగాక స్కేడ్యూలులో లేని అనేక స్థానిక భాషలు మాట్లాడే సమూహాలూ వుంటాయి; ఆదివాసి, గిరిజన భాషలు వంటివి. వాటన్నింటి ఉనికిని కూడ మనం గుర్తు పెట్టుకోవాలి. వారిని మనం సముచితంగా గౌరవించాలి. ఆ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని మనం సక్రమంగా నెరవేర్చడం లేదని నా పరిశీలన.
గుజరాతీ పెట్టుబడి – సంస్కృతి జమిలిగా ఇటు తెలంగాణను, అటు అంధ్రప్రదేశ్ ను క్రమంగా కమ్ముకుంటున్నాయి. సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తలు, పౌరసమాజం ఇప్పుడు ఈ అంశం మీద దృష్టి సారిస్తే రెండు రాష్ట్రాలకూ కొంత మేలు జరగవచ్చు! మనం అటు దిశగానూ ఆలోచిద్దాం.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పడిన ఫజల్ అలీ కమీషన్ తెలుగు తెలంగాణ భాషలు ఒకటేనని భావించింది. అలా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు త్న ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి మరీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సహకరించారు. తరువాతి కాలంలో తేడాలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014 ద్వార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ అదే పేరుతో కొనసాగుతోంది. దాని అధికార భాషగా తెలుగు కూడ కొనసాగుతోంది.
కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాని అధికార భాషగానూ తెలుగునే కొనసాగిస్తున్నారు. ఉద్యమ కాలంలో “పుంటి కూర –గోంగూర, అనిపికాయ-సొరకాయ” అంటూ కేసిఆర్ తెలుగును గేలి చేసేవారు. మరి వారెందుకు తెలంగాణ భాషను అధికార భాషగా ప్రకటించలేదో తెలీదు. పైగా వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు తెలంగాణ ఒక్కటే అని ప్రకటించారు. ఇదే ఇప్పటి వివాదానికి తక్షణ ప్రకోపము అని నాకు అనిపిస్తోంది.
కేసిఆర్ నీళ్ళు, నిధులు, నియామకాల్లో వాటా అంటూ ఉద్యమించారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మీరు అవార్డులు, అవకాశాలు, ఆంథాలజీల్లో వాటా కోసం పోరాడుతున్నారు. ఇది సహజమైన పరిణామమే అని నేను భావిస్తున్నాను.
తెలంగాణ రాష్ట్ర అధికార భాషగా తెలుగును తీసివేసి తెలంగాణను గుర్తించాలని మీరు ఆందోళన చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద, ప్రత్యేకించి కేంద్ర హోంశాఖ మీద వత్తిడి తెచ్చి రాజ్యాంగం 8వ స్కెడ్యూలులో తెలంగాణ భాషను చేర్పించుకోవచ్చు. ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చే భారతీయ జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ వంటి సంస్థలు కూడ విధనపరంగా 8వ స్కెడ్యూలును అనుసరిస్తాయి. అలా ఈ తెలుగు-తెలంగాణ భాషా వివాదం చట్టపరంగా పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను.
తెలంగాణ భాషకు రాజ్యాంగ గుర్తింపు కోసం మీరు చేసే పోరాటానికి నా సంపూర్ణ సంఘీభావం వుంటుంది.
మీ మిత్రుడు
డానీ
విజయవాడ, 15 అక్టోబరు 2024