Saturday, 26 April 2014

Gulam Yazdani - A Memory

Gulam Yazdani - A Memory 


గులాం యజ్దానీ – ఒక అనుబంధం  

డానీ

                     విఖ్యాత చరిత్రకారుడు గులాం యజ్దానీ పై  డా. ద్యావనపల్లి సత్యనారాయణగారి  వ్యాసం తెలంగాణ చరిత్ర పితామహుడుఈరోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో  (http://www.andhrajyothy.com/node/88452) వచ్చింది. గులాం యజ్దానీగారిని నేను ఎన్నడూ చూడలేదు. అయితే, వారితో నాకు ఓ దూరపు  అనుబంధంవుంది.

          మా తాతగారి పేరు గులాం మొహిద్దీన్ ఖాన్ గారు. వారి అన్నగారు గులాం గౌస్ ఖాన్ గారు.  మా తాతగారు నరసాపురంలో స్థిరపడగా, వారి అన్నగారు నిజాం సంస్థానం  రెవెన్యూ విభాగంలో కొలతల ఉద్యోగి (ఓవర్ సీర్) గా స్థిరపడ్డారు. మా పెదతాతగారి పెద్దల్లుడు అబ్దుల్ సత్తార్ పాషా నిజాం సంస్థానంలో ఉన్నతాధికారి. వారు నిజామాబాద్ పరిసరాల్లో తహశీలుదారుగా పనిచేశారో  అంతకన్నా పెద్ద హోదాలో పనిచేశారోగానీ వారిని మా ఇళ్లల్లో గవర్నర్ సాబ్ అని పిలిచేవారు. వారు మా నాన్నగారికి పెద్ద బావగారు.  న్యాయశాఖ మాజీమంత్రి ఆసిఫ్ పాషాగారు  అబ్దుల్ సత్తార్ పాషాగారికి స్వయాన అల్లుడు. ఆసిఫ్ పాషా నాకు మేనత్త కొడుకు.

మా కుటుంబంలో మౌలానా హజ్రత్ గారని ఒక ధార్మిక గురువుగారు వుండేవారు. వారు ఆరు నెలలు నరసాపురంలోనూ, ఆరు నెలలు హైదరాబాద్ లోనూ వుండేవారు. ఆ కాలంలో, మా కుటుంబంలో ఎవరు పుట్టినా మౌలానా హజ్రత్ గారే పేర్లు నిర్ణయించేవారు. సాంప్రదాయ వంశం (బతికి చెడిన కుటుంబం అనేది దీనికి మరోపేరు) కావడాన మా కుటుంబంలో పేర్లు అనేక సమీకరణలతో వుంటాయి. గులాం మొహిద్దీన్ ఖాన్ ఆసిఫ్, గులాం గౌస్ ఖాన్ షానవాజ్, గులాం మొహిద్దీన్ ఖాన్ దుర్రానీ, గులాం మొహిద్దీన్ ఖాన్ సమ్దానీ, లియాఖత్ అలీ ఖాన్ రబ్బానీ ఇలా వుంటాయి.

1951లో నేను పుట్టినపుడు, మౌలానా హజ్రత్ గారు హైదరాబాద్ లో వున్నారు. పిల్లాడికి పేరు సూచించమని మా అమ్మ వారికి ఉత్తరం రాసిందట. వారు యజ్దానీ అని పెట్టమన్నారట.  మా హైదరాబాద్ దాయాదులకు గులాం యజ్దానీ గారు చాలా సన్నిహితులు.

ఇతర సమీకరణలు అన్నీ సరిచేసుకుని చివరకు నా పేరు అహమ్మద్ మొహిద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ అయింది. నాపేరులో అహమ్మద్ అనేది మా నాయనమ్మగారి తండ్రి అహమ్మద్ షరీఫ్ గారి పేరు. వీరే నరసాపురం టేలర్ పేట మసీదు వీధి వ్యవస్థాపకులు.  మొహిద్దీన్ అనేది మా తాతగారు గులాం మొహిద్దీన్ ఖాన్ గారి పేరు. ఖాన్ అనేది మా తెగ పేరు. జర్రానీ అనేది మా వంశం పేరు. నరసాపురం పాతబజారు, పఠాన్ వీధిలోని సూఫీ గురువు హజ్రత్ ఖాన్ జాన్ ఖాన్ దర్గావల్ల మా వంశానికి  ఆ పేరు వచ్చింది. (ఆ దర్గా చరిత్ర రాయాలనేది నా కోరికల్లో ఒకటి) ఇక మిగిలిన యజ్దానీ ఒక్కటే నా స్వంత నాపేరు.

యజ్దానీ అనేది కాలక్రమేణ ఉఛ్ఛరణ సౌలభ్యం కోసం  యస్ డానీ అయ్యింది. నా పేరు నేపథ్యాన్ని తొలిసారిగా నాకు గుర్తు చేసింది కేవి రమణా రెడ్డిగారు. యజ్దానీ అంత మంచి పేరుని ఇలా ముక్కలు చేశారా? అని వాపోయారాయన. కేవీయార్ ఇచ్చిన ప్రేరణతోనే, నా పేరు వెనక వున్న చరిత్రను తవ్వే పనిచేశాను. యంటీ ఖాన్ సాబ్ కూడా పహలే యే దానీ థే! అబ్ డాన్ బన్ గయేఅంటూ ఆటపట్టిస్తుంటారు.   


26 April 2014

Thursday, 24 April 2014

Thank God I am not Communist!

దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా
చేసినందుకు నీకు ధన్యవాదాలు!

డానీ


ప్రతి ఘర్షణలో, మేధో సంఘర్షణలో రెండు సామాజికవర్గాలుంటాయి. వాటిల్లో తప్పని సరిగా ఒకటి బలమైనది, మరొకటి బలహీనమైనది వుంటుంది. ఒకటి పీడిస్తుంది. మరొకటి పీడితురాలిగా వుంటుంది.  మనం ఎప్పుడయినా చేయాల్సింది పీడితుల పక్షం నిలబడడమే! ఇలా నిలబడాలంటే చాలా నైతిక స్థైర్యంకావాలి.

                        పెత్తందారీ కులాలు. వెనుకబడిన కులాల మధ్య వివాదం మొదలయితే నేను  వెనుకబడిన కులాల పక్షం వహిస్తాను. వెనుకబడిన కులాలు, దళితుల మధ్య వివాదం మొదలయితే నేను  దళితుల పక్షం వహిస్తాను. దళితుల్లో మాలలు, మాదిగల మధ్య వివాదం మొదలయితే నేను మాదిగలపక్షం వహిస్తాను. హిందువులకు శిక్కులకు మధ్య వివాదం మొదలయితే నేను శిక్కులపక్షం వహిస్తాను. హిందువులకు క్రైస్తవులకు మధ్య వివాదం మొదలయితే నేను క్రైస్తవుల పక్షం వహిస్తాను. తెలంగాణకు సీమాంధ్రకూ మధ్య వివాదం మొదలయితే నేను తెలంగాణ పక్షం వహిస్తాను. తీరాంధ్రకూ, రాయలసీమకూ మధ్య వివాదం మొదలయితే నేను రాయలసీమ పక్షం వహిస్తాను.

  పురుషులకూ, స్త్రీలకు మధ్య మధ్య వివాదం మొదలయితే నేను స్త్రీల పక్షాన నిలబడతాను. కార్మికులకూ యజమానులకూ మధ్య వివాదం మొదలయితే నేను కార్మికుల పక్షాన నిలబడతాను. ఉత్తరాదికీ దక్షనాదికీ మధ్య వివాదం మొదలయితే నేను దక్షణాది పక్షాన నిలబడతాను. ప్రపంచదేశాల మధ్య వివాదం మొదలయితే నేను మూడవ ప్రపంచదేశాల పక్షాన నిలబడతాను.

                        ఇవన్నీ నేను దాదాపు మూడు దశాబ్దాలుగా చేస్తూనే వున్నాను. ఇక ముందు కూడా చేస్తాను. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది నన్ను లౌకికవాది, ప్రజాస్వామికవాది అంటూ మెచుకుంటూ కూడా వుంటారు. కానీ, హిందువులకు ముస్లింలకు మధ్య వివాదం మొదలయినపుడు ముస్లింల పక్షం వహిస్తే  వెంటనే నేను కొందరి దృష్టిలో మతవాది అయిపోతున్నాను.  మరి కొందరయితే నాకు కమ్యూనిజం మూల సూత్రాలు నేర్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది విషాదం.  నిజానికి  ముస్లిం సమాజంలోనూ అష్రాఫ్, అజ్లాఫ్. అర్జాల్  లమధ్య వివాదం మొదలయినా నేను అజ్లాఫ్. అర్జాల్  ల పక్షం వహిస్తాను.

                        కష్టకాలంలో పీడితుల పక్షాన నిలబడడానికి కమ్యూనిస్టు సిధ్ధాంతం అడ్డంకిగా మారితే అది అసలు కమ్యూనిజమేకాదు. దాన్నే కమ్యునిజమని ఎవరైనా చెలాయించదలిస్తే అలాంటి కమ్యూనిజం నాకు అక్కరలేదు. అసలు విషయం ఏమంటే భారతదేశంలో  కమ్యూనిజంతో పనిలేనివాళ్ళంతా, పీడిత జీవితం తెలియనివాళ్ళంతా కమ్యునిస్టు నాయకులుగా చెలామణి అయిపోతున్నారు. దేవుడా! నన్ను కమ్యూనిస్టు కాకుండా చేసినందుకు నీకు ధన్యవాదాలు!


24 April 2014

Wednesday, 23 April 2014

గురువులూ మీకు వందనం!

My Teachers in Journalism

పాత్రికేయ గురువులూ మీకు వందనం!
డానీ

నోటికి అన్నమే తింటున్నారా? అనే అరుణ్ సాగర్ పోస్టింగ్ (https://www.facebook.com/arun.sagar.9440?fref=nf) చూశాక రెండు విషయాలు రాయాలనిపించింది. అతని ఆవేదన నా జర్నలిజం కెరీర్ లో కొన్ని మైలురాళ్ళని గుర్తుతెచ్చింది. ముఖ్యంగా, నా గురువుల్ని తలుచుకోవాలనిపించింది.

       నాకు అప్పర్ ప్రైమరీ స్కూలు దశ నుండే రాయడం అలవాటు అయింది. నియతవిద్య  మానేశాక 1973లో రాసిన ప్రగతి నాటికకు  పరిషత్తు నాటకాల్లో మంచి గుర్తింపు వచ్చింది. రచయితగా నేను యవ్వనంలో ప్రవేశించింది 1978 లో విప్లవ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాతే. ఉపస్రవంతి పత్రికల్లో ఎనిమిదేళ్ళపాటు రచనావ్యాసంగాన్ని కొనశాగించాక 1986 జనవరిలో ప్రధాన స్రవంతి పత్రికల్లో  ప్రవేశించాను.  ప్రధాన స్రవంతి పత్రికల్లో   నా తొలి వ్యాసం ఉదయంలో అచ్చయింది. అప్పట్లో ఆ పత్రిక్కి ఏబీకే ప్రసాద్ సంపాదకుడు. ఆయనే నాకు తొలి బ్రేక్ ఇచ్చారు. మాది ఏబికే ప్రసాద్ కల్ట్ అని చెప్పుకోవడానికి నేను ఇప్పటికీ గర్వపడతాను.

                     విప్లవ పత్రికల రచనల్లో భావోద్వేగానికి పెద్దపీట వేస్తారు. ప్రధాన స్రవంతి పత్రికల్లో ఆవేశం పాళ్లను తగ్గించి, నిష్కామంగా రాయాలి; కనీసం రాస్తున్నట్టు వుండాలి. ఈ కిటుకుని నేను మిత్రులు కే శ్రీనివాస్ (ఇప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్)  దగ్గర చేతులుకట్టుకుని నేర్చుకున్నాను. కొన్ని టాపిక్స్ చెప్పి పనికట్టుకుని నాతో రాయించింది వేమన వసంత లక్ష్మీ.

                     ఇంకో మూడేళ్ళు ప్రధాన స్రవంతి పత్రికల్లో ఎడిట్ పేజీ ఆర్టికల్స్ రాసిన అనుభవం తరువాత 1988లో ప్రేమ కొద్దీ ఆంధ్రభూమితో వర్కింగ్ జర్నలిస్టుగా మారాను. అప్పుడూ ఆ వుద్యోగం ఇచ్చింది ఏబీకే ప్రసాద్. అప్పటి మా బ్యూరో చీఫ్ సతీష్ చందర్. 1990లో నన్ను డక్కన్ క్రానికల్ కు మార్చారు. అప్పుడు మా బ్యూరో చీఫ్ కే శ్రీరాములుగారు. నాకు తొలి ప్రమోషన్ ఇప్పించింది శ్రీరాములుగారే!  డక్కన్ క్రానికల్ లో పనిచేస్తున్నపుడు ఎడిషన్ ఇన్ చార్జి బీ. జయప్రకాశ్ రెడ్డి నను చాలా ప్రోత్సహించారు.

 1991లో నేను ఆంధ్రజ్యోతిలో చేరాను. దీనికి సమన్వయకర్తలు రావి రాంప్రసాద్, త్రిపురనేని శ్రీనివాస్. అక్కడ ఎడిషన్ ఇన్ చార్జి యూయస్ ఎన్ రాజుగారు.  2003లో నేను సీటీవి ద్వార టెలివిజన్ జర్నలిజంలో చేరాను. దాని ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య. జీయం ధనేకుల సుందరయ్య. 

                     ఇందులో విశేషం ఏమంటే నేను గురువులుగా పేర్కొన్న వాళ్ళలో కొందరు నాకన్నా వయసులో చిన్నవారు. మినహాయింపులేకుండా నా గురువులందరూ నా మీద వాత్సల్యాన్నే చూపించారు. వాళ్ళకు గురుదక్షణగా అన్నట్టు నేను కూడా నా శిష్యపరంపర మీద వాత్సల్యాన్నే ప్రదర్శిస్తూ వచ్చాను.

                     అయితే, దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘకాలంలో ఎంతటి మిత్రులతో అయినా మధ్యలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. నాకు నా గురువుల్లో కొందరితో అలాంటి సంఘటనలు కూడా వున్నాయి.  ఇలాంటి సందర్భాల్లో నేను ఎన్నడూ నా గురువులకు ప్రత్యర్ధిగా నిలబడదలచలేదు. నాకు కొంచెం నష్ఠం జరిగినాసరే అస్త్రసన్యాసంచేసి అక్కడి నుండి తప్పుకునేవాడిని. (తోక ముడిచేవాడిని అన్నా తప్పుకాదు)  అసలు నా గురువులకు వ్యతిరేకంగా వాళ్ళ పరోక్షంలో మాట్లాడడం కూడా నాకు రుచించదు; ఏవో కొన్ని సరదా మాటలుతప్ప.

                     ఏడాది క్రితం నా గురువు ఒకరు నన్ను కలవడానికి  ఎన్-టీవీ ఆఫీసుకు వచ్చారు. వారి చొక్కా చిరిగివుంది. దాన్ని దాయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు నేను కొత్త బట్టలు వేసుకుని ఆఫీసుకు వచ్చాను. జీవితంలో ఇంతటి కాంట్రాస్టు ప్రత్యక్షంగా ఎదురయితే నేను భరించలేను. ఒంటి మీద చొక్కా తీసేసి ఇచ్చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఇలాంటి నాటకీయ ఆలోచనలు వస్తుంటాయి. కానీ తమాయించు కున్నాను. వారు కొన్ని డబ్బులు కావాలన్నారు. పర్సు చేతికి ఇచ్చి తీసుకోండి అన్నాను. వారు అందులో నుండి రెండువేలో, మూడు వేలో తీసుకుని ఇది చాలు అన్నారు. ఫస్ట్  వీక్ లో తిరిగి ఇచ్చేస్తానని రెండు మూడుసార్లు అన్నారు. మీకు నేను అప్పు ఇవ్వడంలేదు మీరు తిరిగి ఇవ్వడానికి. ఈ విషయాన్ని నేను ఇక్కడితో మరిచిపోతాను. మీరూ మరిచిపొండి. ఎప్పుడయినా ఇబ్బందిగా వుంటే నా దగ్గరికి రండి. మొఖమాటపడవద్దు. నా దగ్గర గొప్పగా డబ్బులు వుండవు. అయినా  వున్నది సర్దుకుందాం అన్నాను.

తల్లిదండ్రులు దయనీయ స్థితిలో వుంటే ఆ పాపం పిల్లలదే అయినట్టు గురువులు దయనీయ స్థితిలోవుంటే ఆ పాపం శిష్యులదే!


ఏప్రిల్ 24, 20014

Tuesday, 1 April 2014

బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి

వర్తమానం
బీజేపి, టిడిపి మళ్ళీ పెళ్ళి
డానీ
      
       బీజేపి, టిడిపి పొత్తు కుదిరినట్టు ఇరువైపుల నుండి బలమైన సంకేతాలు వస్తున్నాయి. పొత్తుల చర్చలు, అభ్యర్ధుల ఎంపిక కసరత్తుల నుండి రాష్ట్రానికి చెందిన బీజేపి సీనియర్ నేత స్వచ్చందఘా తప్పుకోవడంవల్ల ఆ పార్టి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకరో, రాజ్యసభాపక్ష నేత అరుణ్ జైట్లో టిడిపితో పాటూ పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు వ్యవహారంకూడా వచ్చేవారం ప్రకటించే అవకాశాలున్నాయి.

నిజానికి టిడిపి, బీజీపి పొత్తు ఎప్పుడో  పొడవాల్సింది. నరేంద్ర మోదీని బీజేపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన మరుక్షణం నుండే చంద్రబాబు పొత్తు దిశగా కదలడం మొదలెట్టారు. పంచాయితీ ఎన్నికల్లో టీడీపి ముందంజ వేయగానే కాంగ్రెస్  జగన్ కు బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చిందనీ,  తాను రాజ్ నాథ్ సింగ్ ను కలవగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి  తెలంగాణ ఏర్పాటును ప్రకటించిందనీ, తాను నరేంద్ర మోదీని  కలవగానే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చంద్రబాబు చాలాసార్లు అంటున్నారు. అయితే, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ బీజేపి సభ్యులు ప్రదర్శించిన అతిఉత్సాహం టీడిపీని ముఖ్యంగా సీమాంధ్ర తమ్ముళ్లని ఇరుకున పెట్టేసింది. తమకు జరిగిన అన్యాయానికి ప్రతిగా సీమాంధ్ర ఏకంగా భారతదేశం నుండి విడిపోతుందని కొందరు ఎస్-తమ్ముళ్ళు ఆవేశంగా ప్రకటించగా, బీజేపిని సీమాంధ్ర ద్రోహిగా  ప్రకటించాలని మరికొందరు ఎస్-తమ్ముళ్ళు ఆక్రోశం వెళ్ళగక్కారు. హఠాత్తుగా రాజకీయవాతావరణం వేడేక్కడంతో టిడిపి-బీజేపి రాజకీయ సహజీవనం నెలన్నర రోజులు వాయిదా పడింది. ఇప్పుడు వాతావరణం మళ్ళీ పొత్తులకు అనుకూలంగా మారుతోంది.

        బీజేపి-టిడిపి పొత్తు ఒక విధంగా ఓడలు, బండ్లు లాంటిది.  సీమాంధ్రలో బీజేపి భారాన్ని టీడిపి మోస్తే, తెలంగాణలో టీడిపి భారాన్ని బీజేపి మోయాల్సివుంటుంది.  ప్రస్తుతం బీజేపికి సీమాంధ్రలో ఎమ్మెల్యేలుగానీ, ఎంపీలుగానీ లేరు. అక్కడ కాలుమోపాలంటే మోదీ ఇమేజితోపాటూ టీడిపితో పొత్తు అనివార్యమని బీజేపి భావిస్తోంది. పైగా సీమాంధ్రలో ఇప్పుడు అన్నిపార్టీలకన్నా టిడిపి ముందంజలో వున్నట్టు కనిపిస్తోంది. జగన్ పార్టి గతంకన్నా బలహీనపడుతున్నట్టు సంకేతాలు వస్తుండడంతో టిడీపీతో కలిసి ఎన్నికలకు పోవడమే మంచిదని కమలనాధులు భావిస్తున్నారు.

తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ టీడీపిని బలహీనపర్చడమే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. అధినేత మీద నమ్మకం కుదరని టి-తమ్ముళ్ళు ఎన్టీఆర్ భవన్ ను వదిలి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిలో బీజేపి అండలేనిదే తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించే స్థితిలోలేదు.  ఈ నేపథ్యంలో సీమాంధ్రలో అయినా, తెలంగాణలో అయినా తాము కలిసి నడిస్తేనే ఇద్దరికీ శ్రేయస్కరం అనే అభిప్రాయం టిడిపి, బీజేపి రెండింటికీ వుంది.

టిడిపి-బీజేపి అనుబంధానికి దాదాపు దశాబ్దంన్నర చరిత్రవుంది. 1996  ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో  చక్రంతిప్పి  యునైటేడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, 1998ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో  చక్రం తిప్పడానికి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా  ఢిల్లీ విమానం ఎక్కిన చంద్రబాబు బీజేపి అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పాయిని ప్రధానిని చేసి, ఎన్డీయే కన్వీనర్ గా హైదరాబాద్ లో విమానం దిగారు.

దేవేగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానుల్ని చేయడానికి చంద్రబాబు కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు పెద్దగా విమర్శలు రాలేదుగానీ, వాజ్ పాయికి మద్దతు పలికినపుడు మాత్రం చంద్రబాబు లౌకికపార్శ్వం విమర్శలకు గురైంది. తమ మనోభావాల్ని దెబ్బతీశారంటూ ముస్లిం సామాజికవర్గం టిడిపి మీద గట్టిగానే నిరసన వ్యక్తం చేసింది. అప్పటి భారీ పరిశ్రమల మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ మనస్థాపం చెంది  ఏకంగా రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. అయితే, వాజ్ పాయిని సమర్ధించడం చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చింది. 1999ఎన్నికల్లో కార్గిల్ సెంటిమెంటు వాజ్ పాయి ప్రభుత్వాన్ని  గెలిపించగా, వాజ్ పాయిని నమ్ముకున్న చంద్రబాబు ఆ ఏడాది జమిలిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు. ఎన్నికల్లోచంద్రబాబు టీడిపిని గట్టెక్కించిన  సందర్భం ఇప్పటికి అదొక్కటే!

        ఇప్పుడు పునరేకీకరణకు ప్రధాన ఆకర్షణగా మారిన నరేంద్ర మోదీ వల్లనే అప్పట్లో టిడిపి_బీజేపి రాజకీయ దాంపత్యానికి సమస్యలు మొదలయ్యాయి. 2002 లో సాగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీని చంద్రబాబు విమర్శించినప్పటికీ.  బీజేపీతో దోస్తీని మాత్రం వదలలేదు. దీని ఫలితం 2004 ఎన్నికల్లో కనిపించింది. కార్గిల్ యుధ్ధం అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ  1999 ఎన్నికల్లో గెలిపించినట్టు, నరేంద్ర మోదీ మార్కు గుజరాత్ అల్లర్లు అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ కూడా ఆ తరువాతి ఎన్నికల్లో అధికారం నుండి తప్పించాయి. 

        అలిపిరిలో నక్సలైట్ల బాంబు పేలుడు తరువాత, తన మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయని చంద్రభాబు గట్టిగా నమ్మారు. దానితో, 2004లో ముందస్తు ఎన్నికలుకు వెళ్ళారు. తనతోపాటు ఎన్డీయేను కూడా  ముందస్తు ఎన్నికలకు సిధ్ధం చేశారు. తమ హయాంలో దేశం వెలిగిపోతున్నదనే భ్రమలోవున్న బీజేపి, 2020వరకు  తానే హైటెక్కు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని గట్టి నమ్మకంతోవున్న చంద్రబాబు ఇద్దరూ ఆ ఎన్నికల్లో భంగపడ్డారు. నిర్ణిత కాలవ్యవధికన్నా ముందుగానే అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పచెప్పారు.

        2004 జమిలి ఎన్నికల్లో అనూహ్య పరాజయం తరువాత రాష్ట్రంలో టిడిపి, బీజేపిల మధ్య కొంతకాలం పరస్పరం తిట్ల పర్వం కొనసాగింది. టిడీపి హైటెక్కు పోకడలవల్లనే తమపార్టీ ఓడిపోయిందని బీజేపి నేతలు, బీజేపి మీద వ్యతిరేకతవల్లనే తమ పార్టి ఓడిపోయిందని టిడీపి నేతలు విమర్శించుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీలు లాఛనంగా రాజకీయ విడాకులు తీసుకున్నాయి.        2009 ఎన్నికల్లో రెండుపార్టీలు విడివిడిగానే పోటిచేశాయి. అయినా పెద్దగా మార్పురాలేదు.

మతవాద రాజకీయాలు కొన్ని ఓట్లను సంపాదించిపెట్టేమాట నిజమే. కానీ, భారతీయుల్లో అత్యధికులు మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, మతవాద రాజకీయాల్ని అంతగా ద్వేషిస్తారు.

మతవాద శిబిరంలో చాలాకాలం అతివాదిగా కొనశాగిన లాల్ కిషన్ అడవాణీజీకి 2005 లో ఒక విషయం అర్ధం అయింది. ఇంతకాలం తన బలానికి కారణం అనుకుంటున్న మతవాద ముద్రే భారత ప్రధాని కావడానికి తనకు ప్రధాన అడ్దంకిగా మారిందని  భావించారు. దానితో, మతవాద ముద్రను తొలగించుకోవడానికి కరాచి వెళ్ళి సాక్షాత్తు మహమ్మదాలీ జిన్నా సమాధి దగ్గర నిలబడి పాకిస్తాన్ నిర్మాతను లౌకికవాది అని కొనియాడి వచ్చారు.

        ఆ తరువాత ఆరేళ్ళకు చంద్రబాబు కూడా అడవాణి మార్గంలో పాపప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టారు. బీజేపీతో అంటకాగిన గుర్తుల్ని చెరిపేసుకుని లౌకిక స్వరూపాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నించారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించడం తప్పేనని ఒప్పుకుని  2011 మే 28నటీడిపి మహానాడు వేదిక నుండి వారు ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో కలిసేదిలేదని మరీ ఒట్టేసి వాగ్దానం చేశారు.  ఒక దశలో లౌకిక రాజకీయాలు ప్రాతిపదికగా యూపియే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి కూడా వారు సిధ్ధమయినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇవన్నీ జగన్ కు బెయిలు రాకముందు,  నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిడానికి ముందు నాటి పరిణామాలు.   

రాజకీయాల్లో శాశ్విత శత్రులు వుండనట్టు, శాశ్విత వాగ్దానాలూ వుండవు, తరువాత మోదిఫికేషన్, నమో, మోదీ మానియా దేశరాజకీయాల్ని హోరెత్తించడం మొదలేట్టిన తరువాత చంద్రబాబు తన పాలసీని మరోమారు మార్చుకున్నారు. బీజేపీతో సాధ్యమైనంత త్వరగా పొత్తు కుదుర్చుకుంటేనేగానీ తెలంగాణలో కేసిఆర్ దగ్గరికి పొతున్న తమ్ముళ్లని ఆపలేమని వారు అనుకుంటున్నారు. అలాగే, చంద్రబాబుతో పొత్తు వుంటేనే సీమాంధ్రలో పార్టీ పున:ప్రవేశానికి మార్గం సుగమం అవుతుందని బీజేపి నమ్మతోంది. ఆ నేపథ్యంలో టీడిపి, బీజేపి రాజకీయ పునర్వివాహాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 9010 75 7776


హైదరాబాద్‌
 20 మార్చి 2014
ప్రచురణ :