Wednesday, 2 March 2016

Intolerance and Communal Harmony

Intolerance and Communal Harmony 
అసహనం  సామరస్యం
-     -   డానీ

ప్రభుత్వ దండన ప్రవేశిస్తే సామరస్యం సమరంగా మారిపోతుంది. మతవ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగావుంటే చాలు. భారతీయులు స్వతహాగానే మత సామరస్యవాదులు. రాజకీయ పార్టీలే ఆర్ధిక ప్రయోజనాల కోసం తరచూ ప్రజల అలోచనల్లో విషం చిమ్ముతున్నాయి. ఇదే అసలు ముప్పు.
దేశంలో అసహన వాతావరణం పెరుగుతున్నదనే చర్చ మొదలయ్యాక వర్తమాన మేధో రంగంలో రెండు ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మొదటిది;మతసామరస్యాన్ని ఎలా సాధించాలి?  రెండోది - కులమతాలకూ కమ్యూనిస్టులు, హేతువాదులు, నాస్త్తికులకూ సంబంధం ఏమిటి? అనేది.
1
అస్థిత్వంలోవున్న ప్రతిదాన్నీ ముందు మనం గుర్తించాలి. ఒకవేళ వాటిని మన సమాజంలో  లేకుండా చేయాలనుకున్నా, మార్చాలనుకున్నా, సంస్కరించాలనుకున్నా ముందు వాటి అస్థిత్వాన్ని గుర్తించాలి. జబ్బే లేదనుకునేవాడు ఎన్నటికీ  వైద్యం చేయలేడు. మతం, భాష, తెగలు వంటివి అన్నిదేశాల్లోనూ వున్నట్టే భారతదేశంలోనూ వున్నాయి. ఈజిప్టులో పిరమిడ్లులా కులం అనేది భారత సమాజపు ప్రత్యేకత. అదొక  వాస్తవం. కులమతాలను నిరాకరించడం కళ్ళు, చెవులూ మూసుకోవడం రెండూ ఒక్కటే.

2
నాస్తికులు దేవుడి అస్థిత్వాన్ని గుర్తించరు. హేతువాదులు పురాణాలు, కులమతాలను ఒప్పుకోరుసాంస్కృతిక వ్యవహారాల్లో కమ్యూనిస్టులదీ దాదాపు అదే ధోరణి. కార్ల్ మార్క్స్ శ్రామికులు, శ్రామికుల వర్గపోరాటం, శ్రామికవర్గ నియంతృత్వం గురించి మాట్లాడాడు. శ్రామికులు అనేది తాత్విక నైరూప్య (abstract) ప్రత్యయం. అది కుల మత తెగ వర్ణ ప్రాంత లింగ తదితర సాంస్కృతిక రూపాలలోనే వ్యక్తమౌతుంది. సామాజిక గుణాలేవీలేని నైరూప్య శ్రామికుడ్ని వెతికే పనిలో భారత కమ్యూనిస్టు పార్టీలు  దాదాపు శతాబ్దకాలంగా నిమగ్నమై వున్నాయి. వాళ్ళు శ్రామికుడ్ని కనుగొన్న తరువాత శ్రామికవర్గ నియంతృత్వం గురించి మాట్లాడవచ్చు.

3
మన చుట్టూ మార్క్సిజంగా చెలామణి అవుతున్నదంతా మార్క్సిజంకాదు. తనకన్నా ముందుకాలంలో వెలుగులోనికి వచ్చిన అనేక భావనల్ని మార్క్స్ పరిమిత అర్ధంలో మెచ్చుకున్నాడు. మార్క్స్ తానుగా కొత్తగా ప్రతిపాదించిందీ, విప్లవకరమైనదీ శ్రామికవర్గ నియంతృత్త్వం. మార్క్స్ ప్రతిపాదనని భారత సమాజానికి సృజనాత్మకంగా అన్వయించి శ్రామికవర్గ నియంతృత్త్వాన్ని సాధిస్తామని ప్రకటించిన రాజకీయ సంస్థ, పార్టీ ఏదైనాగానీ ఇప్పటి వరకు లేదు.

4
మానవజాతి నాగరీకత సాంస్కృతిక వికాసాన్ని పొందుతున్న తొలినాళ్లలో మతభావనలు పుట్టాయి. తరువాత అవి వ్యవస్థీకృతమయ్యాయి. అత్యున్నత భావోద్వేగాల భూమి కనుక మతాలన్నీ ఆసియా ఖండంలోనే ఆవిర్భవించాయి. విదేశీమతాలనే నిందల్ని ఎదుర్కొంటున్న క్రైస్తవం, ఇస్లాం పుట్టింది కూడా ఆసియా ఖండంలోనే. ఇవి జరిగి కూడా  వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయా మతసమూహాలు తమ మతాల్ని నైతిక శాస్త్రం (మోరల్ సైన్సు)గా చూస్తుంటాయి. వాటిని ఆధునిక పరికరాలతో కొలవడం అసమంజసం. పాలను గిద్దలు, లీటర్లతో కొలవాలిగానీ గజాలు, మీటర్లతోకాదు.

5
లౌకికత్త్వం అనే భావానికి చాలామంది మతరహిత అనే అర్ధం చెపుతున్నారు. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, శిక్కు తదితర మత సమూహాలు ఏవీ అన్వయాన్ని అంగీకరించవు. దేశంలో దాదాపు డజనున్నర మతాలున్నప్పుడు ప్రభుత్వం మతాతీతంగా వ్యవహరించాలనేది మంచి ప్రతిపాదనే. అయితే, ప్రజలు కూడా మతాతీతంగా వ్యవహరించాలనడం అసాధ్యమైన కోరిక. ప్రజల మధ్యన వుండాల్సింది మతసామరస్యం; ఇతర మతాలను గౌరవించడం. ఇతరమతాల ఉనికిని గౌరవించడం.

6
మతసమాజంలో అయినా సరే దేవుడ్ని నమ్మేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు సహజంగా సున్నిత మనస్కులు, అమాయకులు అనేక సందర్భాలలో నిస్సహాయులు అయ్యుంటారు. నిజానికి అలాంటివాళ్ళతో సమాజానికి జరిగే ఇబ్బంది కూడా ఏమీ వుండదు. ఆస్తికుల మధ్య ఘర్షనేకాదు ఐక్యత కూడా వుంటుంది. దేవుడ్ని నమ్మేవాళ్ళు వాళ్లవాళ్ల దేవుళ్ళని నమ్మే సాటివాళ్ళని కూడా సూత్రప్రాయంగా గౌరవిస్తారు. సంక్షుభిత ఆర్ధికవ్యవస్థలో, కుంగుబాటు (Depression)  జాతి జబ్బుగా మారిన సమాజంలో  మతం మత్తు మాత్రమేకాదు అదొక మందు కూడా.

7
మతం వేరు; మతతత్త్వం వేరు. మతం ఒక విశ్వాసం. మతతత్త్వం ఒక రాజకీయ ఆయుధం. మతం సాంస్కృతికం; మతతత్వం ఆర్ధికం. ప్రతిమతంలోనూ ధనవంతులూ పేదలూ ఇద్దరూ వుంటారు. వాళ్ళ మధ్యన ఆర్ధిక ఘర్షణ కూడా వుంటుంది. తమ మతంలోని పేదల్లో రగులుతున్న అసంతృప్తిని దారిమళ్ళించడానికి ధనికవర్గాలు మతతత్వాన్నీ ఆశ్రయిస్తాయి. పొరుగు మతసమాజం రాయితీల రూపంలో దేశ సంపదను తినేస్తుండడంవల్లనే తమ మతసమాజంలో పేదరికం కొనసాగుతున్నదనే ఒక అబధ్ధాన్ని ప్రచారం చేస్తుంటాయి. దానితో రెండు మతసమూహాల్లోని పేదల మధ్య అపోహలు చెలరేగుతాయి. అవి అప్పుడప్పుడు మతకల్లోలాలుగా మారుతుంటాయి. ఆర్ధిక సంస్కరణల లక్ష్యం ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేయడమేకనుక లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కూడా మతతత్త్వాన్ని పెంచుతాయి. ఎందుకంటే మతతత్త్వం లక్ష్యం కూడా ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేయడమే.  ఆర్ధిక సంస్కరణల యుగంలో ప్రభుత్వాలు చేసే ప్రధాన కార్యకలాపం సహజ వనరుల్ని దేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం. ప్రభుత్వాలు చేసే విదేశీసేవల్ని సహజంగానే స్వదేశీయులు తప్పుపడతారు. స్వదేశీయుల్ని తప్పుదోవపట్టించడానికీ పాలకవర్గాలే తరచూ ఒక ఆవేశపూరిత దేశభక్తి నినాదాలు చేస్తుంటాయి. అలాంటి బూటకపు నినాదాలు ఇస్తేనే విదేశీ సేవల్ని ముమ్మరంగా చేయడం సాధ్యం అవుతుంది. పైగా తాము చేసే విదేశీ సేవల్ని బయటపెట్టే శక్తుల్ని దేశద్రోహులుగా చిత్రీంచడం సులువవుతుంది. క్రమంలో ఇంకో ప్రమాదం కూడా జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఆశ్రయించే సంస్థలు, పార్టీలకు మద్దతు పెరిగితే సమాజంలో అల్లరి మూకలు సోషల్, మోరల్ పోలీసులుగా మారిపోయి అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయి. దీనికి మతం మతం అనే మినహాయింపేమీలేదు. అన్ని మతతత్త్వాలూ ఒకేపనిచేస్తాయి. అలాంటి దురాగతాల్ని మనం ఇప్పటికే చూస్తున్నాం. మతసామరస్యం అనేది ఆయా సామాజికవర్గాలు స్వయంనియంత్రణతో, పరస్పర అంగీకారంతో సాధించుకోవాల్సిన అంశం. అంతేతప్పా, రాజ్యం, ప్రభుత్వం, చట్టం, పోలీసులు, తుపాకులు, జైళ్ళు, ఉరికొయ్యల వంటి దండోయాలతో  సాధించేదికాదు. ప్రభుత్వ దండన ప్రవేశిస్తే సామరస్యం సమరంగా మారిపోతుంది. మతవ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగావుంటే చాలు. భారతీయులు స్వతహాగానే మత సామరస్యవాదులు. రాజకీయ పార్టీలే ఆర్ధిక ప్రయోజనాల కోసం తరచూ ప్రజల అలోచనల్లో  విషం చిమ్ముతున్నాయి. ఇదే అసలు ముప్పు.


8
మన సమాజంలో అసహన వాతావరణం పెరిగిపోతున్నదన్న విషయన్ని అందరికన్నా ముందుగా గుర్తించి హెచ్చరించింది  సాక్షాత్తు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 2015 అక్టోబరు 7 రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన అంశాన్ని మొదటిసారి ప్రస్తావించారు. రెండు వారాల తరువాత మళ్ళీ వారే తన స్వగ్రామంలో జరిగిన ఇంకో పుస్తకావిష్కరణ సభలో ఇదే విషయాన్ని  ప్రస్తావించారు. భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ  ప్రసంగంలోనూ రాష్ట్రపతి మళ్ళీ అంశాన్ని ప్రధానంగా హెచ్చరించారు. 155 యేళ్ళ భారతీయ శిక్షాస్మృతికి 21 శతాబ్దంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సవరణలు చేయాల్సిన అవసరం వుందని ఇప్పుడు ఇంకో కొత్త చర్చను వేదిక మీదికి తెచ్చిందీ వారే. రాష్ట్రపతి ఒక ప్రణాళీక ప్రకారం ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను గుర్తు చేస్తున్నారని అనిపిస్తోంది.   గోమాంసం తింటున్నారనే అనుమానంతో  దాద్రీలో అఖ్లాఖ్ అనే ముస్లింను  భజరంగ్ దళ్ కార్యకర్తలు హత్యచేసిన నేపథ్యంలో అసహన వాతావరణం ప్రమాదకరంగా పెరుగుతున్నదని గుర్తుచేశారనీ, జేయన్ యూ విధ్యార్ధి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మీద దేశద్రోహం నేరం మోపిన నేపథ్యంలో శిక్షాస్మృతిని సంస్కరించాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి నొక్కి చెప్పారనీ అనిపిస్తోంది.

ఏమంటున్నారు? అనేదానికన్నా ఎవరంటున్నారు? అనేదానిపైనే మనం ఎక్కువగా అలోచిస్తున్నాం. అదే మాటను రాష్ట్రపతి అంటే ఒక అర్ధాన్నీ షారుఖ్ ఖానో  ఆమీర్ ఖానో  అంటే ఇంకో అర్ధాన్నీ ఇస్తున్నాం.

9
భిన్న మతాల మధ్య ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయం, వ్యతిరేకాభిప్రాయాలు, అపోహలు అనేకం వుంటాయిమతసామరస్యమంటే భావసారూప్యమున్న అంశాలను పాటించడం. భిన్నాభిప్రాయాలున్న అంశాలను అంగీకరించడం. తీవ్ర వ్యతిరేకాభిప్రాయమున్న అంశాలను పక్కన పెట్టడం; ఏమాత్రం వీలున్నా వాటిని వదులుకోవడం. హిందువులకు విగ్రహారాధన మౌలిక అంశం. ముస్లింలకు విగ్రహారాధన నిరాకరణ మౌలిక అంశం. అవి మారవు గనుక వాటి వునికిని పరస్పరం గౌరవించుకోవాలిహిందూ భక్తుల భావోద్వేగాలకు తీవ్ర అభ్యంతరం వున్నప్పుడు భారత ముస్లింలు గోమాసం ముట్టుకోకూడదుఅలాగే ఇస్లామిక్ భావోద్వేగాలకు తీవ్ర అభ్యంతరంవున్న అంశాలను వదులుకోవడానికి హిందు సమాజం కూడా సిధ్ధంకావాలి. భారత ముస్లిం, దళితక్రైస్తవ తదితర సామాజికవర్గాలు పేదరికంవల్ల బీఫ్ తింటున్నాయనే వాదన ఒకటుంది. అప్పుడు కూడా బీఫ్ విభాగంలోని గోమాంసాన్ని పక్కన పెట్టి గేదే, దున్నపోతు, ఎద్దు మాంసాల్ని ఎంచుకోవచ్చు. అలాంటి ప్రత్యామ్నాయాలు ఇప్పటికే వున్నాయి. కుత్రిమ రక్తం, కుత్రిమ మాంసం మార్కెట్ లోనికి వచ్చేసిన  21 శతాబ్దంలో మనం గోమాసం గురించి చర్చించడం విషాదం!

10
మతసామరస్యానికి ప్రధాన అడ్డంకి ఉగ్రవాదం. ప్రస్తుతం అన్ని మతాల్లోనూ తరతమ స్థాయిల్లో ఉగ్రవాదం కొనసాగుతోంది. సహజవనరుల నుండి, వాణిజ్య వ్యాపారాల నుండి,  పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతోసహా వివిధ సామాజికవ్యవస్థల నుండి వెలివేసేసే కొద్దీ మత అల్పసంఖ్యాక సమూహాల ఉగ్రవాదం పుట్టుకొస్తుందనీ, మత అల్పసంఖ్యాక సమూహాల సంతుష్టీకరణ కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థ గుల్ల అవుతున్నదనే అపోహలు పెరిగేకొద్దీ మత అధికసంఖ్యాక సమూహాల ఉగ్రవాదం ఆవిర్భవిస్తుందనేది దాదాపుగా నిర్ధారణ అయిన అంశం. ఈ వెలివేతల్నీ, అపోహల్నీ నివారించడం అన్ని మత సమూహాల ప్రధమ కర్తవ్యం కావాలి.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
మొబైల్ : 9010757776

హైదరాబాద్
27 ఫిబ్రవరి 2016

ప్రచురణ
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ  03-03-2016

No comments:

Post a Comment