ముస్లిం
అస్తిత్వవాదానికి అంతర్గత చేటు
ఇంటాబయటా స్కైబాబా అసందర్భ గందరగోళం
-
డానీ
29.మతసామరస్య
జీవితం
నేను ప్రతి శుక్రవారం మసీదుకు వెళతాను. రంజాన్ నెలలో
ఉపవాసాలు వుంటాను. మరీ ఆరోగ్యం అనుమతించని కారణంగా రెండేళ్ళుగా చివరి వారం రోజులుమాత్రమే
ఉపవాసం వుండగలుగుతున్నాను. మా అమ్మానాన్నల్ని
ఖననం చేసిన ఖబరస్తాన్ కు షబే ఖదర్ రోజు వెళ్ళాలనుకుంటాను. ఎప్పుడు విజయవాడ
వెళ్ళినా ఆ ఖబరస్తాన్ ముందు ఆగి సలామ్
చేస్తాను.
మా ఇంట్లో రంజాన్ పండుగను వేడుకగా జరుపుకుంటాము.
దీనికి ఒక సెంటిమెంట్ కూడా వుంది. 2004లో ప్రభుత్వంతో చర్చలకు వచ్చిన ఒక నక్సలైట్
నాయకుడ్ని నేనూ అజిత ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో సురక్షితంగా దింపి వచ్చాము.
దండకారణ్యంలో అజితకు పాల్సిపారిమ్ మలేరియా, డెంగూ సోకాయి. తీవ్రఅనారోగ్యం
పాలయ్యింది. రోగం ముదిరి బ్లాక్ వాటర్ దశమొదలై సమస్త అవయవాలు దెబ్బతిన్నాయి. ఆదశకు చేరుకున్నాక బతికినవాళ్ళు అప్పటికి భారత
దేశంలో ఎవ్వరూ లేరు. తను చనిపోతుందని నవంబరు 16న కొందరు డాక్టర్లు ప్రకటించారు.
ఆరోజు రంజాన్ పండుగ. వారం రోజుల ఉత్కంఠ తరువాత ఒక వైద్యశాస్త్ర అద్భుతంగా అజిత
బతికింది. ఆ సందర్భంగా కేర్-బంజారా
హాస్పిటల్ కు వచ్చి మాకు ధైర్యాన్ని
ఇచ్చిన ఆత్మీయుల్ని ఏడాదికి ఒకసారైనా కలుద్దామనుకున్నాము. మా కుటుంబ సభ్యులుతప్ప
అప్పుడు వచ్చి పలకరించినవాళ్ళు, ఆర్ధికంగా ఆదుకున్నవాళ్ళు అందరూ హిందూ సమాజానికి
చెందినవాళ్ళే. అలా మా ఇంట్లో రంజాన్ పండుగ హిందూ అతిధులతోనే జరుగుతుంది. దీన్నే
ఈద్ మిలాప్ అనుకోవచ్చు.
పరోటా, పాయా, ఒక కూరగాయకూర, పెరుగు, యాపిల్ నా సహేరీ
మెను. ఇఫ్తార్ తరువాత తెలంగాణలో హలీమ్ తిన్నట్టు ఆంధ్రాలో గెంజి తాగుతారు. అది
కేరళ-తమిళ సాంప్రదాయం. ఏది వండాలో ఎలా వండాలో
అనే విషయాల్లో నాకు ఇతరులకు చికాకు కల్పించేంత నిర్ధిష్ట అభిరుచి వుంది. నా
కోసం వంట చేయడం అంత ఈజీ వ్యవహారంకానప్పటికీ రంజాన్ నెలలో నా సహేరీ, ఇఫ్తార్ ఏర్పాట్లు మా
అత్తగారే చూసుకుంటారు.
వాళ్ల నాన్న కమ్యూనిస్టు కావడాన అజితకు పూజలూ వగయిరా
అలవాటు లేదు. వినాయక చవితి, దశరా, దీపావళి సందర్భంగా ఇంట్లో మా అత్తగారు
పిండివంటలు చేస్తారు. జనవరి 15 అజిత పుట్టిన రోజు కూడా కావడంతో సంక్రాంతిని మా
ఇంట్లో బాగా ఎంజాయ్ చేస్తాం. అత్తగారు బిర్లా టెంపుల్ కు వెళతానంటే
తీసుకుపోతాను. కారు ప్రయాణం మధ్యలో ఏ దైనా
గుడికి వెళ్ళి వస్తానంటే రోడ్డు మీద వెయిట్ చేస్తాను.
పాత్రికేయ వృత్తిలో భాగంగా అనేక హిందూ దేవాలయాలకు
వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆలయ మర్యాదలతో గర్భగుడి వరకు
వెళ్ళిన సందర్భాలున్నాయి. బొట్టు పెట్టినా, హారతి ఇచ్చినా, శఠగోపం పెట్టినా
నిరాకరించలేదు. నాస్తిక హేతువాద ఉపన్యాసాలు దంచలేదు. ఎంతో నిష్టగా చేయడంవల్ల
కాబోలు గుళ్ళలో ప్రసాదాలు చాలా రుచిగా వుంటాయి. తిరుపతి వేంకటేశ్వరస్వామి, అన్నవరం
సత్యనారాయణస్వామివార్ల ప్రసాదాలు మళ్ళీ మళ్ళీ అడిగి తినాలనిపిస్తాయి. నరసాపురం
పెద్ద దర్గాలో ఉర్సు సందర్భంగా చేసే ఉత్తిపలావు కూడా ఎంతో రుచిగా వుండేది. నరసాపురం పాత బజారులో చిన్న మసీదు పక్కనున్న హజ్రత్ ఖాంజాన్ ఖాన్ దర్గాలోని
వలీవుల్లా మా పూర్వీకులే. ఆ నేపథ్యంలోనే మా ఇంటిపేర్ల చివర జర్రానీ అనే గౌరవనామం
వచ్చిచేరింది. నేను రచయితను కావడంవల్ల ఆ దర్గా స్థలపురాణం రాయమంటూ చనిపోయే వరకూ మా
అమ్మ పోరుతూనే వుండేది.
సేవాధర్మంగానో, స్నేహ ధర్మంగానో హిందూ యాగాలు, పూజలు,
అంత్యక్రియలు వంటివాటికి కూడా కొన్ని
సందర్భాల్లో ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
మంగళగిరి గుడిలో ఒకసారి, గుంటూరు గుడిలో ఇంకోసారి ఇద్దరు స్నేహితుల ప్రేమ వివాహం
కోసం అమ్మాయిల తండ్రిగా మారి కన్యాదానం చేశాను.
క్రైస్తవ, శిక్కు, జైన, జొరాస్ట్రియన్ సమూహాలతోనూ
నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. రాజస్థాన్ కు చెందిన హరిప్రసాద్ ఖండేల్ వాల్ ఇంట్లో
ఏడాదిన్నర వున్నాను. టోటల్లీ వేగన్. ఆ
కాలంలో కోడికూర కాదుకదా కోడిగుడ్డు కూడా
తినలేదు. ఓసారి వేసవిలో విజయవాడ వచ్చిన ఓ జైన గురువుకు గాల్పు కొడితే హాస్పిటల్ లో
చేర్చారు. జైన గురువుల ఆహార నియమాలు చాలా కఠినంగా వుంటాయి. ఆ నాలుగు రోజులు వారికి
ఆహార సరఫరాను పర్యవేక్షించే పనిని హరిభాయ్ నాకు అప్పచెప్పారు. విజయవాడ ఒన్ టౌన్
బంగారుకొట్ల బజార్ లోని బాలాజీ మందిరంలో జరిగే హోళీ వేడుకల్లో భంగు తాగడం భలే
సరదాగా వుండేది.
Pulihora and Palaavu
శ్రీరామ నవమి, వినాయక చవితి, దసరా సందర్భంగా ఆ
తొమ్మిది రోజులూ నాటకాలు, బుర్రకథలు చూస్తూ ఆ పందిళ్ళలోనే వుండేవాళ్ళం. ఆ
పందిళ్ళలో ముస్లీం వ్యాపారులు పగటి పూట నౌబత్ ఖానా ఏర్పాటు చేసేవారు. అప్పట్లో శ్రీరామ నవమికి రామాలయంలో భోగం మేళం
కూడా పెట్టేవారు. మాపేటలోని ముస్లిం మహిళల కోసం ఒక పూట పర్దాలు కట్టి ప్రత్యేక
మేళం ఏర్పాటు చేసేవారు. సంక్రాంతి, శివరాత్రి, అంతర్వేది ఉత్సవాల్లో ఉత్సాహంగా
పాల్గొనేవాళ్ళం. నరసాపురం కనకదుర్గ గుడి పూజారి కొడుకు (తరువాత తనే పూజారి
అయ్యాడు) మాకు మంచి దోస్తు. శనివారం సాయంత్రాలు కనకదుర్గ గుడి దగ్గర చేరేవాళ్ళం.
అక్కడ కొబ్బరి చెక్కలు, అరటి పండ్లు తినడం ఒక సరదా. మా నాటక సమాజంలో నేనుతప్ప మిగిలినవాళ్ళందరూ
హిందువులే. మాది పులిహోర-పలావు అనుబంధం.
కారంచేడు ఉద్యమ కాలంలో నా షెల్టర్, భోజన వసతి మాదిగ సామాజికవర్గం,
క్రైస్తవుల ఇళ్లలో వుండేది.
Beef and Pork
ముస్లింలు బీఫ్ తింటారనేది అందరికీ తెలిసిన విషయమే.
నరసాపురం టేలర్ పేట మసీదు సమూహం బీఫ్ తినదు. పేద ముస్లింలతోపాటూ, చాకలి, కాపు
సామాజికవర్గాలకు (ఉండవల్లి చల్లమ్మ) చెందిన పేద హిందువులు కూడా మా ఇళ్ళల్లో
పనిచేసేవాళ్ళు. నాకు 22 యేళ్ళు వచ్చే వరకు ఐదు తరాలు ఒకేచోట కలిసి జీవించాం. ఇళ్ళల్లో
హిందువులు పనిచేస్తుండడంవల్ల మావాళ్ళు బీఫ్ తినడం మానేశారో, లేక ఓ ఆరుతరాల ముందే
మావాళ్ళు స్వచ్చందంగానే అలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలీదు. ఇతర పట్టణాలలోని మా
బంధువులు బీఫ్ తింటారు. వాళ్ల ఇళ్ళకు వెళ్ళినపుడు కూడా అలవాటు లేనికారణంగా మేము బీఫ్
తినేవాళ్ళంకాదు.
నక్సలైట్ గా క్రియాశీలంగావున్న కాలంలో అలవాటులేనివి
కూడా తినాల్సివచ్చేది. విప్లవ జీవితంలో నాగుపాముల్ని కూర వండుకుని తినేవాళ్ళూ
తారసపడ్డారు. గ్రామాలకు తరలండి కార్యక్రమం (విలేజ్ క్యాంపేయిన్) లో మేము అన్నం,
కూరలు అడుక్కునేవాళ్ళం. అలాంటి సందర్భాల్లో గొడ్డుమాసం అనే ఏముందీ పంది మాసం కూడా
ఒకసారి నా ప్లేటులోనికి వచ్చేసింది. కృష్ణాజిల్లా కాటూరు గ్రామంలో ఒకసారి
ఎరుకలవారి పెళ్ళికి పిలిచారు. పందిపలావు వండారు. అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాననేది
మీ ఊహకు వదిలేస్తున్నాను.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆదివాసులతో నా అనుబంధం గర్వకారణమైనది.
ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షుడిగావున్నప్పుడు బొక్కా పరంజ్యోతి, గోసాల
ఆశీర్వాదంలతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా యానాది సంఘాల సమాఖ్యను నెలకొల్పి
నెల్లూరులో యానాదుల మహాసభ నిర్వహించాము.
అయితే, ఇతరులు చెట్లనీ పుట్టలని పూజిస్తారని నేను
వాటిని పూజించను. గౌరవించడం వేరు; విశ్వసించడం వేరు. సందర్భం ఏదయినా నియమం మాత్రం
ఒక్కటే. ఇతర మతస్తులు పవిత్రంగా భావించే వాటినీ గౌరవిస్తాను. వాళ్ళు మహాత్యంగా
భావించే వేటినీ విశ్వశించను. నా ధార్మిక
విశ్వాసం చాలా చిన్నది; “లా ఇలాహా ఇల్లల్లా’. అంతే.
30. సిధ్ధాంత
సామరస్య ఉద్యమం
Marx and Ambedkar
మా రెండవవాడు యూరప్ టూర్ కు వెళ్ళినపుడు ఈఫిల్ టవర్,
పీసా టవర్, రోమ్ కోలాసియమ్ వగయిరాలు చూసినా చూడకపోయినా లండన్ హెగైట్ శ్మశానంలో
కార్ల్ మార్క్స్ సమాధిని తప్పక చూసి రమ్మన్నాను. నేను ముహమ్మద్ ప్రవక్తను
అభిమానించినంతగా కార్ల్ మార్క్స్ ను గౌరవిస్తాను.
ముస్లింవాదానికి సామ్యవాదం తోడుకావాలనేది నా అభిప్రాయం. యూదుడయిన మార్క్స్ కు ఇస్లాం మీద ఎలాంటి
అభిప్రాయాలుండేవి అనేవి ఇక్కడ అప్రస్తుతం. ఆయన ప్రతిపాదించిన కమ్యూనిజం
మహత్తరమైనది. పీడిత సమూహాలకు అవసరమైనది.
అంబేడ్కర్ విషయామూ అంతే. భారత ముస్లీంలకు అంబేడ్కర్
తో కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. అలాంటి కొన్ని అంశాలను మినహాయిస్తే
అంబేడ్కర్ ప్రతిపాదించిన దళిత విముక్తి సిధ్ధాంతం ఇతర పీడిత వర్గాలకు కూడా
మహత్తరమైనది.
RGB Movement
లాల్ సలామ్, హర్యాలీ సలామ్, నీల్ సలామ్ నా సామాజిక
సామరస్య సిధ్ధాంతం. రెడ్, గ్రీన్ అండ్ బ్లూ (RGB). శ్రామికులు, ఆదివాసులు, దళితులు, ముస్లింలు
కలిసి నడిచినపుడే ఎవరికయినా విముక్తి సాధ్యం అవుతుంది. విడిగావుంటే ఎవరికీ
విముక్తి దక్కదు. ఆర్జీబీ ఉద్యమం నేటి అవసరం. భాగవతంలో, తనను చంపుతారనే భయంతో దేవకి పిల్లల్ని పుట్టగానే కంసుడు చంపేసినట్టు,
బైబిల్ కథల్లో, పోటీ చక్రవర్తి పుడుతున్నాడనే భయంతో రోమన్ చక్రవర్తి హీరోద్
బెత్లెహేమ్ లోని పిల్లలందర్నీ చంపేసినట్టు (The Massacre of the Innocents) భారత దేశంలో శ్రామికులు, ఆదివాసులు, దళితులు,
ముస్లింలతో ఒక సమాఖ్య ఏర్పడే అవకాశాల్ని పురిట్లోనే సంధికొట్టడానికి అంతర్జాతీయంగా భారీ కుట్రలు సాగుతున్నాయి.
31. ముస్లిం సమాజానికి అంతర్గత ముప్పుపై ఐదు ప్రశ్నలు
. ఈచర్చను ముగించడానికి ముందు స్కైబాబా ముందు ఐదు ప్రశ్నలు వుంచుతున్నాను.
వాటికి సమాధానాల్ని వారు నాకు చెప్పనక్కర లేదు. బహిరంగంగా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కు చెపితేచాలు.
1.
తాను ముస్లిం అని ప్రకటించుకున్నా
వారితో వివాదంలేదు. తాను ముస్లిం కాదని ప్రకటించుకున్నా వారితో వివాదంలేదు. ముస్లీం పదానికి
వారిస్తున్న నిర్వచనం ఏమిటీ అనేదే వివాదం.
పరిష్కారం – ఇప్పుడయినా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ముందు వారు ముస్లిం
పదాన్ని నిర్వచించాలి.
2.
వారు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని పాటిస్తున్నానన్నా వివాదంలేదు.
వారు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని పాటించనన్నా
వివాదంలేదు. ఇతరులు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని
కోల్పోయారు అనడంతోనే వివాదం.
పరిష్కారం - ఇప్పుడయినా ఫేస్ బుక్
ఫ్రెండ్స్ ముందు వారు ముస్లిమీయత/ ఇస్లామీయతల్ని
వివరించడమేగాక వాటిని కోల్పోవడం అంటే ఏమిటో చెప్పాలి.
3.
ముస్లింలకు విద్యా ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న
తెలంగాణ రాష్ట్ర సమితి హామీ అమలు కోసం వారు
ఉద్యమిస్తున్నా వివాదంలేదు. ఉద్యమించలేనని ప్రకటించినా వివాదంలేదు. ముస్లింలకు
ఆధునిక విద్యను అందించడానికి తాను రాత్రింబవళ్ళు కష్టపడిపోతున్నట్టు చెప్పుకోవడంతోనే
వివాదం.
పరిష్కారం - ఇప్పుడయినా
ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ముందు వారు విధ్యాఉపాధి రంగాల్లో ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్
సాధన కోసం ఏం చేస్తున్నారో వివరించాలి.
4.
తెలంగాణ పోలీసులు సాగించిన బూటకపు కాల్పులకు మత స్వభావం వుందని
వారు చెప్పినా వివాదంలేదు. మత స్వభావం లేదని
వారు నిర్ధారించినా వివాదంలేదు. ఏ ప్రభుత్వంలో అయినా ఎన్ కౌంటర్లు ఇలాగేవుంటాయని
వారు సమర్ధిస్తేనే వివాదం.
పరిష్కారం - ఇప్పుడయినా
ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ముందు వారు తెలంగాణలో సాగిన ఎన్ కౌంట్లర్ల స్వభావాన్ని వివరించాలి.
5.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తదితర
పథకాల్లో ముస్లింల వాటా ఎంత అని వారు అడిగినా వివాదంలేదు. అడగలేనని చేతులెత్తేసినా వివాదంలేదు. తాను తెలంగాణ పేద ముస్లింల ప్రతినిధినని చెప్పుకోవడంతోనే
వివాదం.
పరిష్కారం - ఇప్పుడయినా ఫేస్ బుక్
ఫ్రెండ్స్ ముందు వారు తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో
ముస్లింల వాటా సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని వివరించాలి.
ముగింపు
ముస్లిం సమాజం గురించి
బయటి ప్రపంచానికి ఎంతోకొంత అవగాహన కల్పించడానికీ, వాళ్ళకు ముస్లిం సమాజం మీద
సద్భావనను పెంచడానికీ ఈ సంవాదం ఒక అవకాశంగా కలిసివచ్చింది. అంతేతప్ప ఈ సంవాదాలవల్ల
స్కైబాబాకు జ్ఞానోదయం అయిపోతుందని నాకు ఏ దశలోనూ
నమ్మకంలేదు. నా నమ్మకం తప్పని స్కైబాబా నిరూపిస్తే నాకన్నా ఆనందించేవారు మరొకరు వుండరు.
భారత ముస్లిం సమాజాన్ని బలహీన పరిచే ప్రయత్నాలు రాజ్య
ప్రాయోజిత కార్యక్రమాలుగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పథకం రెండు వైపుల నుండి రెండు
విధాలుగా పనిచేస్తుంది. ఒకవైపు, కులవ్యవస్థ సాగించే అణిచివేత నుండి బయటపడడానికి
ఇస్లాంను స్వీకరించిన విశాల పీడిత సముహాలని తిరిగి వెనక్కి తీసుకుపోయేందుకు
ప్రయత్నిస్తుంది. మరోవైపు, ముస్లిం సమాజంలోనే కులచిచ్చును పెట్టేందుకు
ప్రయత్నిస్తుంది.
ముస్లింల వెనుకబాటుతనానికి వాళ్ళ అంతర్గత సంస్కృతే కారణమని
ప్రచారం చేసే రచయితల్నీ, పాపులర్ ఇస్లాం పేరుతో ముస్లిం సమాజంలో బహుదేవతారాధనను, విగ్రహారాధనను ప్రవేశపెట్టే ఆలోచనాపరుల్నీ అన్ని
విధాలా ప్రోత్సహించడానికి జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక వందల సంస్థలు ఆత్రంగా
ఎదురు చూస్తున్నాయి. అమేరికన్ ఫ్యామిలీ అసోసియేషన్, అమేరికన్ ఫ్రీడం లా సెంటర్,
అమేరికన్ పబ్లిక్ పాలసీ అలయన్స్, అమేరికన్స్ ఫర్ పీస్ అండ్ టోలరెన్స్, కన్సర్నెడ్
విమెన్ ఫర్ అమేరిక, అమేరికన్ ఫ్రీడమ్ డిఫెన్స్ ఇనీషియేటివ్, ఇంగ్లీష్ డిఫెన్స్
లీగ్, ఆబ్ స్ట్రాక్షన్ ఫండ్, యాక్ట్ ఫర్ అమేరిక, అలేఘనీ ఫౌండేషన్, సారా స్కైఫ్
ఫౌండేషన్, అమేరికన్ సెంటర్ ఫర్ లా అండ్ జస్టీస్ వంటివి వీటిల్లో కొన్ని మాత్రమే. మొస్సద్
మానసిక పుత్రులుగా పుట్టిన ఈ సంస్థలన్నీ ‘ప్రగతిశీల అభ్యుదయ
వేదిక’ల రూపంలో అనేక దేశాల్లో విస్తరిస్తున్నాయి. భారీ నిధులు కేటాయించి
పీఠాలు, పరిశోధన సంస్థలూ, ప్రచురణ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ముస్లిం మిల్లత్
(సౌభ్రాతృత్వం) ను వీలైనంతగా లోపలి నుండి బలహీనపరచాలనేది వీటి లక్ష్యం.
స్కైబాబా గతంలో ఒక సందర్భంలో
ముస్లిం సమాజాన్ని “అరే వో సూవర్ కే ఔలాద్! (ఒరేయ్! పంది సంతతి)” అని సంభోదించారు.
కరడుగట్టిన హిందూత్వవాదులు సహితం ఇప్పటి వరకు ముస్లింలని ఇంతటి మాట అనలేదు. ముస్లిం సమాజానికి అసహనం ఎక్కువ అని చాలామంది
అనుకుంటారు. నిజానికి దానికి సహనం చాలా ఎక్కువ. స్కైబాబా విషయంలో సంయమనం పాటించడమే దానికి గొప్ప
ఉదాహరణ. ఒక పిచ్చోడి వెర్రి ప్రేలాపన అనుకుని వారిని ముస్లీం సమాజం మన్నించేసింది.
మొస్సద్
మానసపుత్రుల్లో ఫార్మర్ ముస్లిమ్స్ యునైటెడ్ అనే సంస్థ ఇటీవలి
కాలంలో చాలా చురుగ్గా పనిచేస్తోంది. ముస్లిం సమాజం మీద ఇక్కడ స్కైబాబా
చేస్తున్న వాదనలు వంటివాటినే అది పశ్చిమ
దేశాల్లో చేస్తూవుంటుంది. ఈ భావసారూప్యం యాధృఛ్ఛికం అయితే వేరే
విషయంగానీ కానీ, ఇది సంస్థాగతమని తేలితే మాత్రం భవిష్యత్తులో భారత ముస్లీం
సమాజం వారి విషయంలో అంత సంయమనాన్ని
పాటించకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఆచార్య జయశంకర్ ఒకమాట అనేవారు; “బయటివాడు అడ్డుపడితే పొలిమేర వరకు తరిమి
కొడతాం. మనవాడే అడ్డుపడితే వెయ్యి అడుగుల లోతు గొయ్యి తవ్వి అడ్దంగా పాతిపెడతాం”!
ఈ మాట ముస్లిం సమాజానికి కూడా ఆదర్శమే.
(అయిపోయింది)
PS
PS
Sky Baba – Love and Hate Story.
షేక్
యూసుఫ్ బాబ (స్కైబాబ)తో నాది లవ్
అండ్ హేట్ స్టోరీ.
తెలంగాణ పేదముస్లిం జీవితాల్లోని దయనీయ స్థితిగతుల్ని, సున్నిత భావోద్వేగాల్ని తెలుగు కథా సాహిత్యంలో తను హృద్యంగా
ప్రతిఫలించాడు. ముస్లీం సమస్యల మీద తరచూ స్పందించడంతోపాటూ,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలోనూ క్రీయాశీలంగా పాల్గొన్నాడు. ప్రచురణకర్తగా ముస్లిం సమస్యలపై
డజనుకు పైగా పుస్తకాలు
ప్రచురించాడు. నిరుద్యోగాన్నీ,
అనారోగ్యాన్నీ, ఆర్ధిక ఇబ్బందుల్నీ లెఖ్ఖచేయక
ముస్లింల సభ ఎక్కడ జరుగుతున్నా భజాన సంచి వేసుకుని వెళ్ళిపోతాడు. ఇవన్నీ నేను అతనిలో
గొప్పగా మెచ్చుకునే అంశాలు. ఈ సదభిప్రాయంతోనే మేమిద్దరం అనేక సభలు సమావేశాల్లో కలిసి పాలుపంచుకోవడమేగాక,
కొన్ని సంస్థల్లో కలిసి పనిచేశాం.
అయితే, స్కైబాబతో
నేను తీవ్రంగా విభేదించే
అంశాలు కూడా కొన్నున్నాయి. సాంప్రదాయ ముస్లిం సమూహాలను లోపల నుండి
కాకపోయినా దగ్గర నుండి కూడా స్కైబాబ చూడలేదు. అతను పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మురికివాడల్లో
నివశించే అతిపేద ముస్లిం సమూహాలను దగ్గరగా చూశాడు. కటిక పేదరికం మూలంగా ఆ సమూహాల్లో
నిరక్షరాశ్యతతోపాటూ చేతబడులు, భూతవైద్యాలు వంటి అనేక క్షుద్ర సాంప్రదాయాలు కూడా వుంటాయి.
వాటి వ్యతిరేక ప్రభావం అతని మీద బలంగావుంది. బహుశ అతను క్షుద్రసాంప్రదాయాలవల్ల వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడివుంటాడు.
క్షుద్ర సాంప్రదాయాలు
ఎక్కడున్నా ఖండించాల్సిందే. అయితే, పేద ముస్లీం సమూహాల్లోని క్షుద్ర సాంప్రదాయాల్ని
చూసి అదే ఇస్లాం అని స్కైబాబా భ్రమపడతాడు. ఆ క్రమంలో క్షుద్ర సాంప్రదాయాలతోపాటూ ఇస్లాం
మీద కూడా దండెత్తాలనుకుంటాడు. క్షుద్ర సాంప్రదాయాలు ఇస్లాంకు కూడా వ్యతిరేకం అని చెప్పినా
అతను వినడు. అరబిక్ ఇస్లాంను రుద్దుతున్నారని ఇంకో ఆరోపణ చేస్తాడు. పోనీ తనదైన పధ్ధతుల్లో నాస్తికునిగానో హేతువాదిగానో కొనసాగుతాడా? అంటే అదీ చేయడు. తనను ముస్లిం ప్రతినిధిగా
ప్రకటించుకోవడానికి ఆసక్తి చూపుతుంటాడు. ఇస్లాం లేకుండా ముస్లింలు వుండరన్న సామాజిక
వాస్తవాన్ని అతను జీర్ణించుకోలేడు. నాస్థిక, హేతువాదాలకు కాలం చెల్లాకే దళిత, ముస్లీం
తదితర అస్థిత్వవాదాలు ఆవిర్భవించాయన్న చారిత్రక వాస్తవాన్ని కూడా అతను గుర్తించడు.
స్కైబాబా మతసామరస్యం గురించి కూడా తరచూ గొప్పగా చెపుతుంటాడుగానీ
అక్కడా అతన్ని అదే గందరగోళం వెంటాడుతూ వుంటుంది. మతసామరస్యంతో హిందువులను పెళ్ళిచేసుకున్న
ముస్లింలని మెచ్చుకోవాల్సిన సందర్భాల్లో సహితం "వాళ్ళు ముస్లిమేతరుల్ని పెళ్ళాడి ముస్లిమీయతకు దూరమయ్యారు" (ముస్లీంవాద సాహిత్యంపై చర్చ, వార్త దిన పత్రిక రచన పేజీ, 11-11-2017) అని ఫత్వాలు జారీ చేస్తాడు. ముస్లిమీయతను
పొందడం అంటే ఏమిటో, కోల్పోవడం అంటే ఏమిటో వివరించాల్సివచ్చినపుడు మాత్రం భయంతో వణికిపోతాడు.
ముస్లిం అస్థిత్వాన్ని
వదులుకోలేక, ఇస్లాంను అంగీకరించలేక, ఇంకో మతాన్ని స్వీకరించలేక, నాస్తికునిగా ప్రకటించుకోలేక,
మతసామరస్యాన్ని మెచ్చుకోలేక, మతాచారాలను పాటించలేక మేధోరంగంలో ఒక గందరగోళ స్థితిలో
అతను కొనసాగుతుంటాడు.
భారత ముస్లిం
సమాజాన్ని స్కైబాబా అతిశయంతో “అరే ఓ సూవర్ కే ఔలాద్!” అని సంభోదించిన సందర్భాలున్నాయి.
కరడుగట్టిన హిందూత్వ నాయకులు సహితం ఇప్పటి
వరకు అంతటి సాహసం చేయలేదు. ఇలాంటి ప్రకటనలు, రచనలవల్ల ఇతర సమూహాల్లో ముస్లిం-ఇస్లాం
ప్రతిష్ట దెబ్బతింటుంది కనుక దాన్ని సరిదిద్దాల్సిన అవసరం వుందనీ భావించాను. 2007లో వార్త
దిన పత్రిక రచన పేజీలో ఒకసారి. 2016లో సాక్షి దినపత్రిక
సాహిత్య పేజీలో ఇంకోసారి, దానికి కొనసాగింపుగా సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మరోసారి మేమిద్దరం
బాహాటంగా తలపడ్డాం. అస్మదీయులతో అంత తీవ్రంగా తలపడివుండాల్సింది కాదని మా ఇద్దరి ఉమ్మడిమిత్రులు కొందరు భావించారు. వాళ్ళ
సూచనను నేనూ ఒప్పుకుంటాను.
నిజానికి
ఆ చర్చల్లో స్కైబాబ నాకు కేవలం గమనం మాత్రమేగానీ గమ్యంకాదు. బయటి నుండి
నిరంతరం అనైతిక సాంస్కృతిక దాడిని ఎదుర్కొంటున్న ముస్లిం సమాజానికి తిరిగి ఆమోదాంశాన్ని సాధించడమే
నా అసలు లక్ష్యం.
ఇస్లాం గురించీ,
ముస్లిం సమాజం గురించీ నాలుగు మంచిమాటలు చెపుతానంటే ప్రధాన స్రవంతి మీడియా అవకాశం కల్పించదు.
మీడియాకు వివాదమంటేనే
ఇష్టం. అది దాని రూపం. ముస్లీం
సమాజానికి ఆమోదాంశాన్ని చేకూర్చే బాధ్యతను నెరవేర్చడానికి నేను ఈ వివాద రూపాన్నే ఎంచుకుని ప్రధాన స్రవంతి మీడియాను ఉపయోగించుకున్నాను. వివాదం వంకతో ఇస్లాం గురించీ, ముస్లిం
సమాజం గురించీ నాలుగు మంచిమాటలు బయటి ప్రపంచానికి చెప్పగలిగాను.
పైగా,
take the center-stage అనే ఎత్తుగడ ఎలానూ
వుంది. మిత్రత్త్వంగానైనా, శతృత్త్వంగానైనా
ముస్లీం ఆలోచనాపరులు ఎప్పుడూ వెలుగులో
వుండాలి, వార్తల్లో నిలవాలి అనేదే మన
వ్యూహం కావాలి. దానినే నేను పాటించాను!. ఈ క్రమంలో స్కైబాబకు కూడా ఇస్లాం గురించీ
అవగాహన పెరిగితే అది వ్యక్తిగతంగా నాకేకాక సువిశాల ముస్లిం సమాజానికి కూడా తప్పక బోనస్
అవుతుంది.