Communal Ideology in Revolutionary Literature
విప్లవ సాహిత్యంలో మతభావజాలం
ఉషా యస్ డానీ
కామ్రేడ్స్! మిత్రులారా! ఇప్పటి పాఠం
శీర్షిక ’విప్లవ సాహిత్యంలో మతభావజాలం”.
నిజానికి ఈ చర్చ దాదాపుగా ఒక దశబ్ద కాలంగా రకరకాల పధ్ధతుల్లో అనేక చోట్ల
సాగుతోంది. అయితే, విప్లవ సమూహాలు ఒక పాఠంగా దీన్ని చర్చంచడం ఇదే మొదటిసారి. గత నెలలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత మనలోని
మతభావజాలాల్ని పరిశీలించుకోవాల్సిన అవసరం మరింత ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటి వరకు ఈ అధ్యాయానికి ఒక సిలబస్ అంటూ ఏమీ తయారుకాలేదు. అయినప్పటికీ మా పరిధుల్లో ఒక క్రమంలో కొన్ని విషయాలను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తాము.
కళాసాహిత్యమేధోరంగాల్లో వర్గపోరాటం చేస్తానని విరసం తన లక్ష్య ప్రకటనలో
పేర్కొంది. మతభావజాలం అనేది ఏ వర్గాల్ని ప్రతిబింబిస్తుందీ? వాటి మీద విరసం తన
లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి వర్గపోరాటం చేయాలి? అనేది ఇవ్వాల్టి పాఠానికి
స్థూలంగా లక్ష్యం.
సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలిస్తుంది అని మీకందరికీ తెలుసు. అంచేత నేను సమాజం
నుండి మొదలెట్టి సాహిత్యానికి వస్తాను. సాహిత్యంలో మతతత్త్వ ప్రతిఫలనాన్ని నా తరువాత ఎస్ ఎఫ్ షరీఫ్ మరింత వివరంగా మాట్లాడుతాడు.
మతభావజాలాల ప్రమాదాన్ని అర్ధం చేసుకోవడానికి మనం మీరట్, ఉత్తరప్రదేశ్, భివాండి
వంటి సుదూర ప్రదేశాలకు వెళ్ళాల్సిన పనిలేదు.
మనం ఇప్పుడు కృష్ణాజిల్లాలో
వున్నాం కనుక ఇక్కడి నుండే సమాజంపై మతభావజలం ప్రభావాన్ని అధ్యయనం చేయవచ్చు.
మీకు లారీలు, ట్రక్కులు తెలుసు. అరిగిపోయిన టైర్లను రీ-ట్రేడ్ చేస్తారనీ
తెలుసు. పచ్చి రబ్బరు తీసుకువచ్చి వేడి మీద అచ్చుల్లో పోసి పాత టైర్లకు కొత్త బటన్
గ్రిప్ తయారు చేస్తారని కూడా మీలో కొందరికి తెలిసి వుండవచ్చు. ట్యూబుల్లో
గాలి కొట్టడం, పంక్చర్లు వేయడం మొదలు, రీట్రేడింగ్ వరకు ఈ రంగంలో అత్యధికులు
ముస్లింలే వుంటారు. అలాగే, మోటారు మెకానిక్కుల్లోనూ ముస్లింలే ఎక్కువ.
అసలు మెకానిక్ అనేదే మన దేశంలో ముస్లీంకు పర్యాయ పదంగా మారిపోయింది. వ్యవసాయమే
ప్రధాన ఆర్ధికకార్యకలాపంగా వున్న కాలంలో మనకు కమ్మరి, కుమ్మరి, సాలే, కంసాలి,
మంగలి, చాకలి వంటి అనేక సాంప్రదాయ వృత్తులున్నాయి. వాటి ఆధారంగా ఏర్పడిన
కులాలున్నాయి. ఆ కులాలన్నీ లోహార్, హజామ్, ధోబీ తదితర పేర్లతో ముస్లిం సమాజంలోనూ వున్నాయి. ఆధునిక యంత్ర యుగం
ఆరంభమయ్యాక వాచీలు, గొడుగులు, తాళాలు వగయిరా రిపేర్లు, బేకరీ,
దర్జీపని వంటి కొత్త వృత్తులు వచ్చాయి. కొత్తగా ఏర్పడిన సేవా రంగంలో
ముస్లింలు ఎక్కువగావున్నట్టు
గమనించవచ్చు. చివరకు అత్యాధునిక కంప్యూటర్ల హార్డ్ వేర్ రంగంలోనూ రిపేరర్లుగా ముస్లింలే
ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1958లో బస్సు రవాణాని జాతీయం చేసిన తరువాత
ప్రభుత్వరంగంలో నాలుగైదు చోట్ల భారీ రీ-ట్రేడింగ్ కేంద్రాలు వచ్చాయి. ప్రతి డిపోలోనూ మెకానికల్ విభాగాలు వచ్చాయి. ఇంకొంతకాలం డొంక రూట్లలో బసులు తిరిగేవి. కొన్ని నగరాల్లో సిటీ బస్సులు వుండేవి. క్రమంగా అన్నీ
జాతీయం అయిపోయాయి. ఆ తరువాత మెకానిక్కులు లారీల మీద ఆధార పడి బతికేవారు. ఇప్పుడు యంఆర్ ఎఫ్, టీవిఎస్ వంటి కార్పొరేట్ సంస్థలు ప్రీ-క్యూర్డ్
రబ్బర్ ను సరఫరాచేస్తున్నాయి. ఇది రెడీ మేడ్ వ్యవహారం లాంటిది. దానికి కార్మికుని
నైపుణ్యంతో పనిలేదు.
పంక్చర్ షాపు పెట్టుకోవడానికి పెట్టుబడితో పెద్దగా పనిలేదు. రెండు మూడు పనిముట్లు వుంటే చాలు. రీట్రేడింగ్ వర్కుషాపు
పెట్టుకోవడానికి కుడా స్వల్ప పెట్టుబడి సరిపోయేది. ఇప్పుడు ప్రీ క్యూర్డ్ రబ్బర్ బటన్ కు ఏజెన్సీ
తీసుకోవాలంటే భారీ పెట్టుబడులు కావాలి. అప్పుడు ఆ రంగం నుండి మెకానిక్కులు
తప్పుకుంటారు. భారీ పెట్టుబడులు పెట్టగలిగినవాళ్ళు మాత్రమే వస్తారు. దానితో ఈ రంగంలో సాంప్రదాయికంగా పనిచేస్తున్న
వాళ్ళు వృత్తిని కోల్పోయారు. దీన్నే మనం ఆర్ధికరంగంలో మాస్
డిస్ ప్లేస్ మెంట్ అంటే జీవనోపాధి నుండి మూకుమ్మడి గెంటివేత అంటున్నాం.
కొత్తగా పెట్టుబడులతో వచ్చినవాళ్లకూ వృత్తిని కోల్పోయే వాళ్లకూ మధ్య సహజంగానే ఘర్షణ
మొదలవుతుంది. వృత్తిని కోల్పోయే వాళ్లు ముస్లీములయి, కొత్తగా పెట్టుబడులతో
వస్తున్నవాళ్ళు ముస్లిమేతరులు అయితే ఆ ఘర్షణ మతరూపాన్ని కూడా సంతరించుకుంటుంది. అనేక సందర్భాల్లో ఆర్ధిక ఘర్షణలు సాంస్కృతిక ఘర్షణలుగా
కనిపిస్తాయి.
సాంప్రదాయిక వృత్తుల నుండి, జీవనోపాధి నుండి ముస్లిం కార్మికుల గెంటివేత అనే క్రమం నగరాల్లో ఎప్పుడో మొదలయిపోయింది. అది
గుడివాడవంటి పట్టణాలకూ విస్తరించి. రేపు కైకలూరు వంటి గ్రామాలకూ పాకుతుంది.
ఇప్పుడు మనం జాతీయ స్థాయికి వెళుదాం. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చనిపోయినపుడు రెండు వస్తువులకు
తెగ ప్రాచూర్యం వచ్చింది. మొదటిది, టీయన్ టీ బాంబు. రెండోది, లొట్టో బూట్లు. ఎల్ టీటిఇ ఆత్మాహుతి దళం రాజీవ్
గాంధీని టీయన్ టీ బాంబుతో చంపేసింది. ఆయన శరీరం తునాతునకలయి గుర్తు పట్టడానికి
కూడా వీలు లేకుండాపోయింది. చివరకు లొట్టో బూట్ల ఆధారంగా రాజీవ్ గాంధీ శరీరాన్ని గుర్తుపట్టారు. రాజీవ్ భార్య సోనియా గాంధీ ఈ కేసు
పరిశోధనా బృందాన్ని కలిసి తన భర్త జ్ఞాపకార్ధం లొట్టో బూట్లను తనకు ఇచ్చేయమని కోరారు. అలా అప్పట్లో లొట్టో బూట్లకు తెగ
బ్రాండ్ వాల్యూ వచ్చేసింది.
లొట్టో తరహా బూట్లను పొలియూరెథానే (పీయూ) ఫోమ్ తో తయారు చేస్తారు. వీటిని తయారు చేసే ఓ అరడజను అంతర్జాతీయ బ్రాండ్లు ఇప్పుడు మన దేశంలోనికి వచ్చేశాయి. క్రికెట్ పేరుతోనో,
టెన్నిస్ పేరుతోనో, ప్రధాని తొడిగే రేంజ్ అనో వీటికి ఒక క్రేజ్ వచ్చింది.
ఇప్పుడు మనం పియూ ఫోమ్ భారత సమాజంలో తెచ్చిన అనర్ధాలను చూద్దాం. దేశంలో చెప్పులు బూట్లు ఆగ్రా, కాన్పూర్, కలకత్తాలో
తయారవుతాయని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. బ్రాండు పేర్లు బాటా, కరోనా, ఫ్లెక్స్
వగయిరా ఏదైనా సరే తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరకు పాదరక్షలు
ఈ పట్టణాల్లోనే తయారవుతాయి. విజయవాడలో కూడా కొన్నేళ్ల క్రితం చెప్పుల
పరిశ్రమ అభివృధ్ధి చెందింది. తోలును పరిశుభ్రం చేయడం, తోలు వస్తువుల తయారీ వంటివి
ఇతర కులస్తుల చేతుల్లోవున్నా తోలు
వ్యాపారం మాత్రం దాదాపు ముస్లింల చేతుల్లోనే వుంటుంది. ఉత్తరప్రదేశ్ ముస్లీంలదీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన లబ్బీలదీ ఈ రంగంలో పైచేయిగా వుండేది. తోలు వ్యాపారం చేసే ముస్లింలని లబ్బాలు అంటారు. విజయవాడ బందరు రోడ్డుల్లో
లబ్బీపేట పేడుతో ఒక పెద్ద వాడ వుంది.
సాంప్రదాయ చెప్పుల తయారీ చాలా సులువు. ఏ సాయంత్రమో ఒక వెయ్యి రూపాయలు పెట్టి
ముడిసరుకు తెచ్చుకుంటే మరునాడు ఇంట్లో పగలు చెప్పులు కుట్టి సాయంత్రానికి అమ్మేసి కూలీ డబ్బులు సంపాదించుకోవచ్చు. పీయూ ఫోమ్ యూనిట్
పెట్టాలంటే భారీ పెట్టుబడి కావాలి. పియూ
ఫోమ్ రాకతో సాంప్రదాయ తోలు చెప్పుల వాడకం
తగ్గిపోయింది. అక్కడ భారీ సంఖ్యలో డిస్ ప్లేస్ మెంట్ సాగింది. ఇక్కడ కుడా కొత్త పాత సమూహాలకు మధ్య సంఘర్షణ మొదలయింది. పాత సమూహం ఆర్ధికంగా బలహీనమైనది అయితే కొత్త సమూహం ఆర్ధికంగా బలమైనది.
పాత సమూహం సామాజికంగా ముస్లీంలు అయితే, కొత్త సమూహం సామాజికంగా ముస్లిమేతరులకు చెందింది. తోళ్ల పరిశ్రమలో
మొదలయ్యే ఆర్ధిక ఘర్షణలు కాస్పూర్,
ఆగ్రాల్లో తరచూ మతకల్లోలాలుగా బయటపడుతుంటాయి. ఇప్పుడు విజయవాడలో లబ్బీపేట పేరును వేంకటేశ్వరపురంగా మార్చే ప్రయత్నాలు
సాగుతున్నాయి. ఉపరితలంలో ఇది కేవలం ఒక పేట పేరు మార్చడంగా మనకు కనిపించవచ్చు.
నిజానికి దీన్ని ఆర్ధికరంగంలో మారుతున్న ఆధిపత్యానికి సంకేతంగా మనం గమనించాలి.
గత దశాబ్దంలో సాగిన పంజాబ్ కల్లోలానికి కారణం ఏమిటీ? ఆపరేషన్ బ్లూస్టర్
భింద్రేన్ వాలా కోసం మాత్రమే జరిగిందా? సాంస్కృతికం , రాజకీయం అనేవి ఉపరితల అంశాలు మాత్రమే కదా? మరి వాటి పునాది సంగతి ఏమిటీ? భారతదేశంలో భారీ పరిశ్రమలు ఎవరి చేతుల్లో వున్నాయి? మధ్యతరహా
పరిశ్రమలు ఎవరిచేతుల్లో వున్నాయి? చిన్నతరహా లేదా అనుబంధ పరిశ్రమలు ఎవరి చేతుల్లో వున్నాయి? సేవారంగం ఎవరి చేతుల్లో వుందీ? అనేవి ఇక్కడ కీలకమైన అంశాలు. ఆటోమోబైలు రంగంలో పెద్ద కంపెనీలు
ఇతరుల చేతుల్లో వున్నా వాటి విడిభాగాల తయారీ రంగం అంటే ఆధారిత పరిశ్రమలు లూధియాన, అమృతసర్, జలంధర్ నగరాల్లో దాదాపు శిక్కుల చేతుల్లో వున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు తమ వాణిజ్య విస్తరణలో భాగంగా చిన్న చిన్న విడిభాగాలను తయారు
చేసుకునే అవకాశం కూడా చిన్న కంపెనీలకు ఇవ్వకపోతే ఏం జరుగుతుందీ? పెద్ద కంపెనీల యాజమాన్యం మత అధిక సంఖ్యాకుల సమూహం అయ్యి,
చిన్న కంపెనీల యాజమాన్యం మత అల్ప సంఖ్యాకుల సమూహం అయినపుడు జరిగేదేమిటీ? ఇవి మత
ఘర్షణలా? సాంద్రీభూత ఆర్ధిక వ్యక్తీకరణలా?
వరసపెట్టి ఒక్కో రంగం నుండి మతఅల్పసంఖ్యాక వర్గాలను గెంటివేస్తుండడాన్ని, వాళ్లకు జీవనోపాధి అనేదే లేకుండా చేయడాన్ని సాహిత్యం ఎట్లా ప్రతిఫలించింది? మరీ ముఖ్యంగా వామపక్ష, విప్లవ సాహిత్యాలు ఎలా ప్రతిఫలించాలి? ఎలా ప్రతిఫలించాయి? అనేది ఈరోజు
మన పరిశీలనాంశం. ప్రస్తుతానికి రాజకీయాలను కాస్సేపు పక్కన పెట్టి సాహిత్యం సమాజానికి చేసే మేలేమిటీ?
అసలు సమాజం అంటే ఏమిటీ? వంటి ప్రాణప్రదమైన అంశాలను
పరికిద్దాం.
చాలామందికి వుండే సాధారణ అభిప్రాయం ఏమంటే సమాజం అంటే గుంపుగా బతకడం అని. అది అర్ధసత్యం
మాత్రమే. మనుషులేకాదు ఏనుగులు, పందులు, చీమలు కూడా గుంపులుగానే బతుకుతాయి. మనిషి కూడా
గుంపులుగానే బతుకుతాడుగానీ అదే సమాజ లక్షణంకాదు. సమాజశాస్త్రంలో మొట్టమొదటి పాఠం
ఏమంటే మనిషికీ వ్యక్తికీ మధ్యనున్న తేడాను గుర్తించడం. సమాజ విశ్లేషకులు దీన్ని మ్యాన్ అండ్ ఇండివిడ్యువల్ అంటారు. ఇలాంటి విభజన ఏ ఇతర జీవజాలంలోనూ లేదు.
ఇతర జీవజాలం చేసినట్టే మనిషి కూడా తన జాతిని అభివృధ్ధి చేస్తాడు. తన జాతి
భౌతిక అవసరాలను తీర్చడానికి భౌతిక వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. వస్తు ఉత్పత్తి
అనేది ఇతర జీవజాలంలో వుండదు. కొన్ని పక్షులు గూళ్ళు కడతాయి, కొన్ని చేపలు గుడ్లు పెట్టడానికి ప్రత్యేక స్థలాలకు వెళతాయి.
అవి అంత వరకే. ఒక పథకం ప్రకారం ఉత్పత్తి చేయడం, ఉత్పత్తి కోసం పరికరాలను వాడడం, ఉత్పత్తిని
సులభతరం, వేగవంతం చేయడం కోసం నిరంతరం కొత్త పరికరాలను సృష్టించడం మనిషి మాత్రమే
చేసేపని. ఇంతటి సంక్లిష్ట ఉత్పత్తి
క్రమంలో మనుషుల మధ్య సంక్లిష్ట సంబంధాలు ఏర్పడతాయి.
ఒక మనిషికి స్త్రీలందరూ ఒకటికాదు. ఒకామె తల్లి అయితే, ఇంకోకామె ప్రియురాలు
అవుతుంది. మరోకామె భార్య అవుతుంది. ఇంకొకరు చెల్లి, అక్క, పిన్ని, వదిన. అత్త,
అమ్మయ్య, నాయనమ్మ, సహాధ్యాయురాలు, సహౌద్యోగినీ ఇలా అనంతంగా సాగుతాయి స్త్రీ పురుష
సంభంధాలు. పురుషునికీ పురుషునికీ మధ్య, స్తీలకూ స్త్రీలకు మధ్య కూడా అనంతమైన
సంబంధాలుంటాయి. మనుషులు అలాంటి ఒక నిర్ధిష్ట చట్రం లోపలే మరో మనిషితో సంబంధ
బాంధవ్యాలను కొనసాగించగలుగుతారు. ఈ సాలెగూడు లాంటి సంబంధాల మధ్య జీవించడాన్నే సమాజం అంటారు. ఇందులో
అంతస్తుల దొంతర వుంటుంది. తన కన్నా పైవాళ్ళు, కిందివాళ్ళు, సమానులూ వుంటారు.
ఎవరెవరితో ఎలా వ్యవహరించాలనేదే సామాజిక చైతన్యం.
శారీరకధర్మం వుంటే చాలు జంతువులు మనుగడ సాగించేస్తాయి. మనిషికి అలా కుదరదు.
శరీరకధర్మంతోపాటూ సామాజికధర్మాలు కూడా తెలియాలి. శరీరకధర్మాలవల్ల మనిషి జంతు-మానవుడు
మాత్రమే కాగలడుగానీ వ్యక్తికాలేడు. టార్జన్లకూ పిచ్చివాళ్లకూ వ్యక్తిత్వం వుండదు. సామాజిక
ధర్మాలు తెలియజెప్పడం కోసమే ”మనిషి పిల్లల్ని’ సాకాలి. ఈ సాకే పనిని తల్లి చేస్తుంది. సమాజం
చేస్తుంది. రాజ్యం చేస్తుంది. సాహిత్యం కూడా చేస్తుంది. అందుకే కొడవటిగంటి
కుటుంబరావు “సాహిత్యం మానవ హృదయ నిర్మాత” అన్నారు. మనిషి అద్దం ముందు నిలబడి
సింగారించుకున్నట్టు సాహిత్యంలో తననుతాను చూసుకుని సంస్కరించుకుంటాడు.
విప్లవ సాహిత్యంలో మతభావజాలం ఎలా కొనసాగుతున్నదో చెప్పడానికి ముందు అంతకన్నా
ముఖ్యమైన రెండు అంశాలను మీ దృష్టికి తెస్తాను. సాహిత్యంలో ఇప్పుడు రెండు రకాల
మతపక్షపాతం కొనసాగుతోంది. ఇందులో మొదటిది ఒక మతం సమూహ అస్థిత్వాన్నే గుర్తించకపోవడం. సాహిత్యంలో వాళ్ల ప్రస్తావనే
లేకపోవడం. సామ దాన బేధ దండోపాయాలకన్నా ప్రమాదకరమైన ఉపాయం అసలు పట్టించుకోకపోవడం. మనం సృష్టింఛే సాహిత్యంలో అన్ని
పాత్రలూ ముస్లిమేతరులవే వుంటాయి. ముస్లింలు ఎక్కడా వుండరు. మన సాహిత్యం ద్వార తమను తాము సంస్కరించుకునే
అవకాశం ముస్లింలకు మనం ఏ మేరకు ఇచ్చాం? మనం ముస్లిం సమూహానికేకాదు ఏకంగా సాహిత్య ధర్మానికి కూడా అన్యాయం చేస్తున్నాం.
సాహిత్యం
సమాజాన్ని ప్రతిబింబించాలని మనమే ఒక నిర్వచనం ఇచ్చుకున్నాం. నిజానికి మన సాహిత్యం భారత
ముస్లిం సమాజాన్ని లేదా తెలుగు ముస్లీం సమాజాన్ని ప్రతిబింబించడంలేదు. సమస్త ప్రమాణాల
ప్రకారం మనది సాహిత్యమే; సమాజంతప్ప. మరోమాటల్లో చెప్పాలంటే మనది సమాజంలేని సాహిత్యం.
అది మత మైనారిటీల చిన్న సమాజమే కావచ్చుగానీ
సమాజాన్ని మినహాయించిన సాహిత్యాన్ని అసలు సాహిత్యం
అనవచ్చునా? ఇదీ ఈరోజు మన ముందున్న పెద్ద ప్రశ్న.
మన చరిత్ర పుస్తకాల్లో సింధూనాగరీకత గురించి చెపుతారుకానీ గోదావరీ నాగరీకత,
కృష్ణా నాగరీకత, కావేరీ నాగరీకతల గురించి చెప్పరు. పశ్చిమోత్తర భారత ఉపఖండం చరిత్రే భారతదేశ చరిత్ర అయిపోనట్లే మెజార్టీ మతమైన వైదీకమతం, దానిని సమర్ధించే సాహిత్యమే
భారత సాహిత్యంగా చెలామణి అయిపోతున్నది. ఈ అపచారం రాజకీయాల్లో జరిగింది. చరిత్ర రచనలో జరిగింది. సాహిత్యంలో జరుగుతున్నది. వామపక్ష
విప్లవ సాహిత్యాలు సహితం దీనికి మినహాయింపుకాదు.
వైదీకధర్మం శూద్రులకు వేదపఠనాన్ని నిషేధించినట్లే సాహిత్యంలో ఒక రకమైన నిషేధం
మైనారిటీల మీద వున్నది. ఎన్ని ముస్లిం, క్రిస్టియన్, శిక్కు తదితర
అల్పసంఖ్యాకవర్గాల పాత్రలు మనకు మన కథానవలల్లో కనిపిస్తాయి?. అరుదైన సందర్భాల్లో అల్పసంఖ్యాకవర్గాల పాత్రలు మనకు కనిపించేమాట కూడా వాస్తవం.
సాధారణంగా వాళ్లను అపహాస్యం చేయడానికో, వాళ్ళు మొరటువాళ్లని చెప్పడానికో వాటి చిత్రీకరణ సాగుతుంటుంది. సమయాభావంవల్ల
నేను ఇంక ఆ వివరాల్లోనికి వెళ్లను. అయితే మనం కొనసాగిస్తున్న ఈ ధోరణివల్ల జరిగే ఒక అనర్ధాన్ని మాత్రం మీ ముందు
వుంచుతాను.
మనమంతా విప్లవాన్నీ కోరుకుంటున్నాం. నూతన ప్రజాస్వామిక వ్యవస్థను
నిర్మించాలనుకుంటున్నాం. ఆ కొత్త వ్యవస్థలో ప్రవేశం అధికసంఖ్యాక మతానికేనా? మత
అల్పసంఖ్యాకులకు ప్రవేశంలేదా? వాళ్లకు ప్రవేశం నిషిధ్ధమైతే మరి వాళ్ళేం చేయాలీ? వాళ్ళు
మనతో కలిసి ప్రయాణం చేయడానికి మనం చేస్తున్నదేమిటీ? నేను లేవనెత్తుతున్న ప్రశ్నలు
కొంచెం ఇబ్బందిగా వున్నట్టున్నాయి. మరోలా ఈ అంశాన్ని పరిశీలిద్దాం. ఆరెస్సెస్ వంటి
సంస్థలు, బీజేపీ వంటి పార్టీలు మతఅల్పసంఖ్యాక సమూహాలులేని భారతదేశాన్ని
నిర్మించాలనుకుంటున్నాయి. మనం కూడా మతఅల్పసంఖ్యాక సమూహాలులేని వ్యవస్థను
నిర్మించాలనుకుంటున్నామా? ఓసారి ఆలోచించండి.
ఇక సైధ్ధాంతపరమైన సమస్యలు. మతఅల్పసంఖ్యాక సమూహాల విముక్తి అనేది కమ్యూనిస్టుల
కార్యక్రమమా? కాదా? అనేది కొందరి సందేహాలు. కమ్యూనిస్టులు వర్గం గురించి
మాట్లాడాలిగానీ మతం గురించి మాట్లాడకూడదని మరికొందరి ఆదేశాలు. వామపక్షాలు, విప్లవకారులు మత వ్యవహారాలకు
దూరంగా వుండడమే మంచిదని ఇంకొందరి హెచ్చరికలు. ఇటు హిందూమతం అటు ఇస్లాంలకు
కమ్యూనిస్టులు సమాన దూరం పాటించాలని మరికొందరి తరుణోపాయం.
ఇలాంటి సందేహాలు, ఆదేశాలు, హెచ్చరికలు,
ఉపాయాల ద్వార వీళ్లంతా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజంలో కొన్ని సమస్యలకు
గతితార్కిక చారిత్రక భౌతికవాదం పరిధిలో పరిష్కారం లేదని!. అలాగే, ప్రపంచమంతా
మతరహితంగా మారిన తరువాతనే కమ్యూనిస్టు విప్లవం ఆరంభం అవుతుందనీ!. మార్క్సిస్టు
మహోపాధ్యాయుల మీద ఇంతటి ఘోరమైన నిందల్ని నేను రానివ్వదలచలేదు. చరిత్రగతిలో సమాజంలో
ఉత్పన్నమయ్యే అనేకానేక సమస్యలకు పరిష్కారాలన్నీ ఒక కేటలాగ్ లా, డాక్టర్ల ప్రిస్
స్క్రిప్షన్ లా మార్క్సిస్టు గ్రంధాల్లో సిధ్ధంగా వుంటాయని మనం భావించకూడదు. మనం
మన సృజనాత్మకతను ఉపయోగించి మార్క్సిస్టు మౌలిక ఆదేశాలను కొత్త సమస్యల
పరిష్కారానికి అన్వయించాలి. అలా
చేయకపోవడంవల్ల మనం రెండు తప్పులు చేస్తాము. మొదటిది; వర్తమాన సమస్యను
పరిష్కరించకుండా పలాయనం చిత్తగిస్తాము. రెండోది, చలనశీలమైన మార్క్సిస్టు సూత్రాలని
జడపదార్ధంగా మార్చేస్తాము.
ఇప్పుడు మన ముందున్న సమస్య మత అల్పసంఖ్యాక సమూహాల సమస్యను ఎలా అర్ధం
చేసుకోవాలి? దానికి మార్క్సిస్టు పరిష్కారం ఏమిటీ? అనేది.
ఈ సమస్య పరిష్కారానికి మార్క్సిస్టు మహోపాధ్యాయుల రచనల నుండి నేను అర్ధం
చేసుకున్న వాటినే ఇప్పుడు మీ ముందు
పెడుతున్నాను. కార్ల్ మార్క్స్ మీద లెనిన్ రాసిన రెండు వ్యాసాలు ప్రస్తుత నా ప్రతిపాదనకు ప్రధాన ఆధారం. అవి
మార్క్సిజం పునాదులు, కార్ల్ మార్క్స్ బోధనలు.
వర్గం, పాలితవర్గం, పాలకవర్గం, వర్గ సంఘర్షణ, సామ్యవాదం వంటి భావనలు కార్ల్
మార్క్స్ కన్నా ముందే తాత్వికరంగంలో వాడుకలో వున్నాయి. సమాజ చలనానికి ఇంధనం వర్గ
సంఘర్షణ అని చెప్పినవారు కుడా వున్నారు. కార్ల్ మార్క్స్ వీటిని కొనసాగిస్తూ మూడు అద్భుతమైన నిర్ధారణలు చేశాడు. వాటిల్లో
మొదటిది వర్గ సంఘర్షణలో కార్మికవర్గం నిర్వర్తించే పాత్రే సమాజ చలన శక్తి
అనేది. రెండవది; సమాజంలో ప్రతి సమూహం కూడా
తన ఉనికిని కాపాడుకోవాలనుకుంటుంది; ఒక్క కార్మికవర్గంతప్ప. తనను తాను
రద్దుచేసుకోవడం ద్వార వర్గ సమాజాన్నే రద్దు చేసే శక్తి అవకాశం కార్మికవర్గానికే
వుంటుంది. మూడోది; పెట్టుబదీదారీ
నియంతృత్వానికి విరుగుడుగా కార్మికవర్గ నియంతృత్వాన్ని స్థాపించినపుడే వర్గ రహిత
సమాజం ఏర్పడుతుంది.
ఇక్కడ మళ్ళీ ఒక సమస్య ముందుకు వస్తుంది. కార్మికవర్గం అంటే ఎవరూ? అని.
ఇప్పటికీ చాలామంది కమ్యూనిస్టులు కార్మికవర్గం అంటే ఫ్యాక్టరీ కార్మికులు అనే
అభిప్రాయంతోనే వున్నారు. విప్లవకమ్యూనిస్టులు కారంచేడు బాధితులయిన దళితుల పక్షం వహించినపుడు కొందరు కమ్యూనిస్టులు ఘాటైన
విమర్శలే చేశారు; కులపోరాటాలతో
మార్క్సిస్టులకు పనేంటీ? అని. కారంచేడు బాధితులు కులపరంగా మాదిగలు; మతపరంగా
క్రైస్తవులు. దాడిచేసినవారు కులపరంగా కమ్మ సామాజికవర్గం, మతపరంగా హిందువులు.
కార్మికవర్గం అంటే ఫ్యాక్టరీ కార్మికులు మాత్రమే అనే బండ అభిప్రాయాన్ని మావో తునాతునకలు చేశాడు.
రైతు కూలీలతో సామ్యవాద సమాజాన్ని నిర్మించి చూపాడు. అంచేత మనం బాధితులు, పీడితులు, కష్టజీవులు,
కష్టాల్లోవున్నవారు, ఆపదలో వున్నవారు అనే విసృత అర్ధంలో కార్మికవర్గాన్ని చూడాల్సి
వుంటుంది. నిజానికి ఈ వివరణ కమ్యూనిస్టు ప్రణాళికలోనే వుంది. కమ్యూనిస్టు ప్రణాళిక
“The history of all hitherto existing society is the
history of class struggles” అనే ప్రకటనతో మొదలవుతుంది. ఇంతవరకు మనకు తెలిసిన చరిత్ర
అంతా వర్గపోరాటాల చరిత్రే అంటే అర్ధం ఏమిటీ?
ఫ్యాక్టరీ కార్మికులు ఆవిర్భవించదానికి ముందు నుండే
వర్గపోరాటం అనేక రూపాల్లో సాగిందీ అనంటే ఫ్యాక్టరీ కార్మికులు
ఆవిర్భవించిన తరువాత కూడా వర్గపోరాటం అనేక రూపాల్లో సాగుతుందని అర్ధం చేసుకోవాల్సి
వుంటుంది. బహుశ, మనలో ఇలాంటి అవగాహన కల్పించడానికే
మన సీనియర్ కామ్రేడ్ కేవి రమణా రెడ్డి 1985 నాటి గద్వాల సభల్లో ‘మతవర్గతత్త్వం’ అనే
ఒక కొత్త ప్రతిపాదన చేశారు. ఆ అంశాన్ని మనం విస్తృతంగా చర్చించి అవగాహన పెంచుకోవాల్సిన
అవసరంవుంది.
ఒక దేశాన్నీ పీడక దేశంగానో, పీడిత దేశంగానో నిర్ణయించే సాంప్రదాయం మనకుంది. బ్రిటీష్,
ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశాలను వలసవాదులుగా నిర్ధారించి వాళ్ళ మీద జాతీయ ఉద్యమాన్ని
నడిపిన చరిత్ర మనకుంది. వర్తమాన ప్రపంచాన్ని మావో మూడు ప్రపంచాలుగా విభజించి, వాటిల్లో
మూడవ ప్రపంచ దేశాలని పిడిత దేశాలుగా నిర్ధారించి వాటికి మద్దతు ప్రకటించాడు. అమేరికాను
అగ్రరాజ్యంగా, ప్రపంచపోలీసుగా, సామ్రాజ్యవాద దేశంగా మనం భావిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా
పోరాడుతున్నాం. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యవున్న
ఒక మత సమూహం తక్కువ సంఖ్యవున్న మరో మత సమూహాన్నీ రాజకీయార్ధిక, సాంస్కృతిక రంగాల్లో
మన కళ్ల ముందు అణిచివేస్తుంటే పీడకులెవరో పీడితులెవరో
ఒక నిర్ధారణ చేసి ప్రకటించడానికి తటపటాయిస్తున్నాం. పైగా మత సమూహాల మధ్య వర్గ విభజన
చేయడానికి కమ్యూనిజం ఒప్పుకోదని కొందరు చేస్తున్న వాదన మనసుకు బాధకలిగిస్తోంది. ఇది విచారకరం. ఇది కమ్యూనిజానికి అప్రదిష్ట!. కులపోరాటాలు,
మతపోరాటాలు అన్నీ సారాంశంలో ఆర్ధికపోరాటాలే. ఆర్ధిక పోరాటాలంటే వర్గపోరాటాలే.
మత అల్పసంఖ్యావర్గాల్ని కమ్యూనిస్టులు సకాలంలో బాధితులుగా గుర్తిస్తే ఆ పోరాటాలు
కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాగుతాయి. అలా గుర్తించక పోతే వాళ్ల పోరాటాలు కమ్యూనిస్టు
పార్టీలకు బయట సాగుతాయి. అదే జరిగితే మతఅల్పసంఖ్యాకుల
వాదం కమ్యూనిస్టు వ్యతిరేక దృక్పధాన్ని స్వీకరించినా ఆశ్చర్యం ఏమీలేదు. భారత కమ్యునిస్టులు
కులము, మతము, తెగలు అని మడి కట్టుకుని కూర్చోకుండా దళిత, ఆదివాసి, మతఅల్పసంఖ్యాకుల
వాదాల్ని బలపరచాల్సిందే. ఈ పని సకాలంలో జరక్కపోతే
పీడితులు ఒక పక్షం, కమ్యూనిస్టు పార్టీలు ఇంకో పక్షం అయిపోతాయి. వీటి పర్యావసానాలు
ఇరుపక్షాలకూ నష్టమే చేస్తాయి. పీడితులు కమ్యూనిస్టు పార్టీలని విశ్వసించాలి. కమ్యూనిస్టు
పార్టీలు పీడితుల పక్షం వహించాలి.
మిత్రులారా! ఇప్పుడు నేను మన సమాజంలో జరుగుతున్న ప్రధాన సాంస్కృతిక పరిణామాల్ని
మీ ముందుకు తెస్తున్నాను. ఇవన్నీ మన సాహిత్యంలో
విసృతంగా ప్రతిఫలించాలనేది నా ఆశ.
దేశంలో పరిపాలన చేసే ప్రభుత్వానికి మార్గదర్శకాలను సూచించడానికి మనకు ఒక రాజ్యాంగం
వుంది. భారత రాజ్యాంగంలోని మంచిచెడుల చర్చను పక్కన పెట్టినా అసలు ఆ రాజ్యాంగాన్నయినా
ప్రభుత్వం సజావుగా అమలు చేస్తున్నదా? అనేది
అనుమానమే. మరోవైపు, దేశంలో ఇంకో రాజ్యాంగం బలంగా అమలవుతోంది. దాని పేరు మనుస్మృతి.
అసలు మనుస్మృతినే స్వతంత్ర భారత దేశ రాజ్యాంగంగా ప్రకటించాలని హిందూత్వ శక్తులు మొదటి
నుండీ గట్టిగా వాదిస్తున్నాయి. అది కుదరకపోవడంతో దొడ్డిదారిన మనుస్మృతిని అమలు పరుస్తున్నాయి.
ఇంతకీ మనుస్మృతి ఏం చెపుతోందీ? మరీ ముఖ్యంగా, మత అల్పసంఖ్యాక సమూహాలతో ఎలా వ్యవహరించాలని
అది ఆదేశిస్తోందీ? అనేది క్లుప్తంగా అయినా తెలుసుకోవడం చారిత్రక అవసరం.
మనుస్మృతి అంటే ఒక్కమాటలో కులవ్యవస్థను సమర్ధించడం. దీనినే హిందూత్వ, హిందూమతవాదం,
బ్రాహ్మణవాదం అంటున్నారు. దీన్ని బ్రాహ్మణవాదం అని ఎందుకు అంటారంటే మనుస్మృతి ప్రతిపాదించే
కులవ్యవస్థలో ప్రామాణిక కొలమానం బ్రాహ్మణ కులమే. మనువు వాదన ప్రకారం వాళ్ళు నేరుగా
దేవుని వారసులు. వాళ్ళే ప్రధమ వర్ణం. బ్రాహ్మణులు
తమకు దగ్గరగా అనుమతించిన సమూహాలను అగ్రవర్ణాలుగానూ,
దూరంగా వుంచే సమూహాలను నిమ్నవర్ణాలుగానూ మనువు చాలా స్పష్టంగా స్కేలుపెట్టి కొలిచి మరీ వర్గీకరించాడు. ఇక్కడ ఇంకో తిరకాసు వుంది. వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ
కులం ఒక్కటే స్థిరమైనది (Constant). మిగిలిన వర్ణాలు అస్థిరమైనవి (Variable). మనకు
క్షత్రీయ, వైశ్య, శూద్రవర్ణాలు కూడా వున్నట్టు తెలుసు. ఈ ముడు వర్ణాలు మారుతుంటాయి.
యుధ్ధం చేసి రాజ్యాన్ని పరిరక్షీంచేవాళ్ళూ పాలించేవాళ్ళు క్షత్రీయులు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాళ్ళు వైశ్యులు.
సేవలు అందించేవాళ్ళు శూద్రులు. వర్ణవ్యవస్థకు బయట ఇంకో రెండు సమూహాలున్నాయి. దళితులు,
ఆదివాసీలు. వాళ్ళను అసలు మనుషులుగానే గుర్తించలేదు మనువు.
ఈ వ్యవహారం సజావుగా సాగదనీ, అనేక మార్పులు వస్తాయనీ మనువుకు కూడా తెలుసు. మనువుకు
సంబంధించి క్షత్రీయ వర్ణం అంటే సూర్యవంశం, చంద్రవంశం మాత్రమే. వీళ్ళిద్దరూ కాకుండా
మరో సమూహం యుధ్ధం ద్వార అధికారాన్ని చేజిక్కించుకుంటే
ఏం చేయాలీ? బ్రాహ్మణుల సాంస్కృతిక ఆధిపత్యాన్ని గౌరవిస్తే వాళ్ళను ఇతర క్షత్రీయులుగా గురించవచ్చు. అయితే ఈ
క్షత్రీయ హోదా తాత్కాలికమే. ఈ ఇతర క్షత్రీయులు మరో సమూహం చేతిలో ఓడిపోయి అధికారాన్ని
కోల్పోగానే వాళ్ళు క్షత్రీయ హోదాను కూడా కోల్పోతారు. మనువు అంతటితో ఆగడు అధికారాన్ని
కోల్పోయిన ఆ ఇతర క్షత్రీయుల్ని శూద్రులుగా మార్చాలి అంటాడు. శూద్రులుగా మార్చడం అంటే ఏమిటీ? ఆ వివరాలు కూడా మనువే చెప్పాడు. వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి.
కొత్తగా సంపద పెంచుకోకుండా పరిమితులు విధించాలి. వాళ్ళను సేవకులుగా మార్చాలి. మళ్ళీ యుధ్ధం చేసి అధికారాన్ని
చేపట్టే అవకాశాలు లేకుండా వాళ్ళు ఆయుధాలు పట్టుకోకుండా కట్తడి చేయాలి.
కామ్రేడ్స్! భారత ఉపఖండాన్ని రెండు మూడు శతాబ్దాలపాటు ముస్లింలు పాలించారని మనకు
తెలుసు. వాళ్ళు మనువు చెప్పిన క్షత్రీయులు కాదు. ‘ఇతర’ క్షత్రీయులు. అక్బర్ అయినా,
ఔరంగజేబ్ అయినా పాలిస్తున్నంత కాలం క్షత్రీయులే. అయితే, 1857లో అధికారాన్ని కోల్పోయిన
తరువాత వాళ్ళను ఏంచేయాలీ? శూద్రులుగా మార్చాలి. శూద్రులుగా మార్చడం అంటే వాళ్ళకు స్వంత
ఆస్తిలేకుండా చేయాలి. వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల్నీ,
వక్ఫ్ వంటి సమిష్టి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. ఎక్కడయినా
ముస్లింల ఆస్థి పెరుగుతూవుంటే అక్కడ మతకల్లోలాలు రేపి వాళ్ళ అస్థుల్ని ద్వంసం
చేయాలి. భారత దేశం అంతటా ఇప్పుడు జరుగుతున్నది
అదే. జాతి చిహ్నాలను ధ్వంసం చేయడం ద్వార గెలుపును ప్రకటించుకోవడం కూడా పురాతన సాంప్రదాయమే.
బాబ్రీ మసీదు కూల్చివేతను ఏదో ఒక కట్టడం కూల్చివేతగా భావిస్తే మనం తప్పు చేస్తున్నట్టే.
బాబ్రీ మసీదును భారత ముస్లీంల జాతి చిహ్నంగా మార్చి, దాన్ని కూల్చివేసి ఇక మీరంతా మా
బానిసలు అని వాళ్ళు ప్రకటించ దలిచారు. సరిగ్గా
పురాతన పధ్ధతుల్లో ఆశ్వమేధయాగాలు జరుపుతున్నారు. దీన్ని మన సాహిత్యం ప్రతిఫలించాలా
వద్దా?
ముస్లింలని నవశూద్రులుగా మార్చాలనే విషయంలోనూ ఒక తిరకాసుంది. వర్తమాన శూద్ర సమూహం
మనువు ఊహించినట్టు లేదు. అందులో ఒక భాగం ఆర్ధికాభివృధ్ధిని సాధించి పెత్తందారీ కులాలుగా
మారిపోయింది. ఇంకో భాగం ఆర్ధికంగా మరింత కిందికి దిగజారింది. ఆ తరువాత ఐదవ వర్ణంగా
దళితులున్నారు. ఇప్పుడు ముస్లింలని ఆదివాసుల పక్కనైనా పెట్టాలి. లేదా ఆరోవవర్ణంగానైనా
మార్చాలి. ఇప్పుడు జరుగుతున్నదదే. ఇలాంటి సందర్భంలో
మన పాత్ర ఏమిటీ? మనం ముస్లిం సమాజం పక్షాన నిలబడాలనేది నా ప్రతిపాదన. నా ప్రతిపాదనని
మీరు సమర్ధిస్తారనే నమ్మకంతో ముగిస్తాను.
ఇంతవరకు నా ప్రసంగాన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ
అవకాశాన్ని ఇచ్చినందుకు విరసం నాయకత్వానికి కృతజ్ఞతలు.
విరసం గుడివాడ పాఠశాలలో 14 జనవరి1993న జరిగిన ’విప్లవసాహిత్యంలో మత భావజాలం’ పాఠానికి
అధ్యక్షోపన్యాసం ఆధారంగా.
(నా ప్రసంగ పాఠం టేపును విని అక్షర రూపం ఇచ్చిన ప్రముఖ
దళిత కవి కలైకూరి ప్రసాద్ కు కృతజ్ఞతలు)