Friday, 25 January 2019

Is 2019 elections are a ‘Crusaders’

Is 2019 elections are a ‘Crusaders’  
2019 ఎన్నికలు ఒక ‘మతయుధ్ధం’
-        డానీ

మనం తరచుగా పొరబడే పదాలు మతం, మతతత్వం.  రెండు వేరు. మతం ఒక సమూహపు విశ్వాసాల సమాహారం. మతతత్వం రెండు మత సమూహాల మధ్య సంబంధం. మతం మనిషి పుట్టుకకు ముందు, చావు తరువాత ఉంటుందనుకునే వ్యవహారాల మీద విశ్వాసం. మతతత్వం ఇహలోక ప్రయోజనాల కోసం జరిపే సంఘటన. మతం భౌతిక జీవనానికి దూరంగా వుంటుంది. మతతత్వం భౌతిక సమాజంలోని వర్గవైరుధ్యాల పైన, వర్గ పాలన పైన ఆధారపడి వుంటుంది. ప్రతి మతం జాలి దయ నీతి న్యాయం త్యాగం ప్రేమ సౌభ్రాతృత్వం వంటి సాధారణ మానవీయ విలువలను బోధిస్తుంది. మతత్వం పరమతస్తుల మీద ద్వేషాన్ని రగిలిస్తుంది. మతం అంతర్గత వ్యవహారం. మతతత్వం బాహ్యాత్మక వ్యవహారం. మతం నైతికం. మతతత్వం రాజకీయార్ధికం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం మతం ముసుగు కప్పుకున్న రాజకీయమే మతతత్వం.

దేశంలోని ప్రతి ఒక్కరూ గతంలోకన్నా మరింత స్పష్టంగా ఈ రెండు పదాల మధ్య తేడాను తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే భారతీయ జనతా పార్టి అధ్యక్షులు అమిత్ షా 2019 లోక్ సభ ఎన్నికల్ని మతయుధ్ధం అని ప్రకటించారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జనవరి రెండవ వారంలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ వచ్చే సాధారణ ఎన్నికల్ని వారు మూడవ పానిపట్టు యుధ్ధంతో పోల్చారు. ఓటమి అనేదే తెలియకుండా 131 వరుస యుధ్ధాలను గెలిచిన మరాఠాలు ఆ ఒక్క యుధ్ధంలో ఓడిపోయిన కారణంగా “మనం” భారీ మూల్యాన్ని చెల్లించడమేగాక రెండు వందల సంవత్సరాలు వలస పాలనలో బానిసలుగా బతకాల్సి వచ్చిందన్నారు.

ఇంతకీ అమిత్ షా వర్తమాన రాజకీయాల్లోనికి మూడవ పానిపట్టు యుధ్ధాన్ని ఎందుకు చర్చకు తెచ్చారూ?  అన్నది ఎవరికైనా రావలసిన సందేహమే.

18వ శతాబ్దం ఆరంభంలో ఔరంగజేబ్ మరణం తరువాత భారత ఉపఖండంలో ఒకవైపు మొఘల్ సామ్రాజ్య పతనం, మరోవైపు పూణే రాజధానిగా పీష్వాల సామ్రాజ్య విస్తరణ ఆరంభమయ్యాయి.  పీష్వా బాలాజీ బాజీ రావు హయంలో మరాఠా సామ్రాజం ఉత్తరాన సట్లెజ్ నది వరకు  విస్తరించింది. మొఘల్ పాదుషా అలీ గోహర్  షా ఆలం – 2 ను దాదాపు ఢిల్లీ నగరానికే పరిమితం చేసేశారు

సేనాధిపతి సదాశివరావు భావు నాయకత్వంలోని పీష్వా బలగాలు ఓటమి అనేదే తెలియకుండా ఉత్తర దిక్కుకు సాగిపోయాయి. ఈ క్రమంలో  వాళ్ళు ఆఫ్ఘన్ చక్రవర్తి అహమద్ షా అబ్దలి దుర్రానీ కుమారుడు  తైమూర్ షాహ దుర్రాని సదొజయి ని లాహోర్ నుండి తరిమి కొట్టారు. బాలాజీ బాజీ రావు కుమారుడు విశ్వాస్ రావును ఢిల్లీ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడ్ని చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు.

సరిగ్గా ఆసమయంలో తన కొడుక్కి పంజాబ్ లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అహమద్ షా అబ్దాలి దుర్రానీ సట్లెజ్ నదిని దాటి వచ్చాడు. రాజపుత్రులు, జాట్ లు దుర్రానీ సేనలకు అండగా నిలిచారు. భారత ఉపఖండ చరిత్రలో మూడు మహాయుధ్ధాలకు రణక్షేత్రంగా పానిపట్టు నిలిచింది. 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుధ్ధంలో ఇబ్రాహీం లోడీ సేనల్ని బాబర్ జయించాడు. 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుధ్ధంలో హేమచంద్ర విక్రమాదిత్యుడ్ని  అక్బర్ సైన్యం ఓడించించింది. 1761 జనవరి 14న ఆరంభమయిన మూడవ పానిపట్టు యుధ్ధంలో అహమద్ షా అబ్దాలి దుర్రానీ సేనలు పీష్వా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాయి. హోరాహోరిగా సాగిన ఈ యుధ్ధంలో సేనాధిపతి సదాశివరావు భావు తోపాటు యువరాజు  విశ్వాస్ రావు కూడా తొలిరోజే  నేలకొరిగారు.

భారత ఉపఖండంలోని తూర్పు ప్రాంతంలో అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయిన రోజులవి. పశ్చిమ ప్రాంతంలో పీష్వాలు ఆస్వాదించిన 131 వరస విజయల ఉత్సాహం మొత్తం మూడవ పానిపట్టు యుధ్ధంలో తొలి రోజే ఆవిరైపోయింది. పీష్వా సామ్రాజ్య పతనం ఆరంభ అయింది. రెండవ బాజీ రావు కాలంలో 1818లో జరిగిన భీమా కోరేగావ్ యుధ్ధంతో పీష్వాల పాలన పూర్తిగా అంతరించిపోయింది. అలా అప్పుడు అంతరించిపోయిన పీష్వాల హిందూత్వ పాలనను 2014లో నరేంద్ర మోదీ పునరుధ్ధరించారని సంఘపరివారం సగర్వంగా చెప్పుకుంటున్నది.

భీమా - కోరేగావ్ యుధ్ధ ద్విశతాబ్ది విజయోత్సవాలు గత ఏడాది జనవరి 1న ఘనంగా జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం సామాజికవర్గాలు,  వామపక్ష పార్టీలకు చెందిన లక్షలాది మంది కార్యకర్తలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన మహర్లు వీరోచిత పోరాటం చేసి పీష్వా సామ్రాజ్యాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర నిర్వర్తించారనే వాస్తవాన్ని ఈతరంవాళ్ళకు తెలియకూడదని పూణే అగ్రకులాల వాళ్ళు భావించారు.  కోరేగావ్, పూణె పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లలో అనేక గ్రామాలు ద్వంసం అయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. కొందరు చనిపోయారు. అందరికీ తెలిసిన ఆ అల్లర్ల దోషుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వేచ్చగా వదిలి పెట్టి  వరవరరావు తదితర ఆలోచనాపరులు, పౌరహక్కుల కార్యకర్తల మీద తప్పుడు కేసులు సృష్టించి జైల్లో పెట్టింది. బీఆర్ అంబేడ్కర్ మనుమరాలి భర్త ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డేను ఇటీవల ఈ కేసులో కొత్త నిందితునిగా చేర్చారు. ఆయన్ని కూడా అరెస్టు చేయడానికి రంగం సిధ్ధమైవుంది.  ఇవన్నీచూస్తున్న వారికి భీమా - కోరేగావ్ యుధ్ధం గతం కాదని అది వర్తమానమని సులువుగానే అర్థం అవుతుంది.  

వర్తమానాన్ని గతం గానూ, గతాన్ని వర్తమానం గానూ మార్చడం సంఘపరివారానికి పుట్టుకతో అబ్బిన విద్య. అమిత్ షా అలాంటి దురాలోచనతోనే 2019 సాధారణ ఎన్నికల్ని మూడవ పానిపట్టు యుధ్ధంతో పోల్చారు. లోక్ సభ ఎన్నికల్ని “విరుధ్ధ ధర్మాల మధ్య యుధ్ధం” అన్నారు.

అమిత్ షా  మాటల అంతరార్ధం ఏమంటే, నాటి మొఘలాయి సామ్రాజ్యం వున్నంత బలహీన స్థితిలో ఇప్పుడు నూట ముఫ్ఫయి యేళ్ళ వృధ్ధ కాంగ్రెస్‍ వుంది. అలనాడు కొన ఊపిరితోవున్న షా ఆలం పాలనకు రాజపుత్రులు, జాట్ లు ఊపిరులూదినట్టు ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు రాహుల్ గాంధీకు దన్నుగా నిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్  తదితరుల్ని దృష్టిలో పెట్టుకుని వారు ఆ మాటలు అని వుంటారు. కాంగ్రెస్ కేంద్రంగా ఐక్యమవుతున్న ప్రజాకూటమి అహమద్ షా అబ్దాలి దుర్రానీ సేన అనేది వారి అన్వయం.  2019 ఎన్నికల్లో ఓడిపోతే  “మనం” మళ్ళీ రెండు వందల సంవత్సరాలు బానిసలై పోతామని అమిత్ షా గట్టిగా హెచ్చరించారు. వీటన్నింటి సారాంశం ఏమంటే ఎన్నికల రూపంలో హిందూ-ముస్లిం సమూహాల మధ్య మతయుధ్ధం జరగబోతున్నదని వారు స్పష్టంగా చెప్పదలిచారు.

ప్రజాస్వామిక సమాజంలో పార్లమెంటు ఎన్నికల్ని మధ్యయుగాల యుధ్ధాలతో పోల్చడం ఒక తప్పు. వాటిని మతయుధ్ధంగా వర్ణించడం అంతకన్నా పెద్దతప్పు. పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామిక యుగంలో అధికార పార్టి అధినేత ఇంత బాహాటంగా మతయుధ్ధాన్ని ప్రకటించినపుడు దేశవ్యాప్తంగా  నిరసనలు వెల్లువెత్తాలి. కానీ, అలా జరగలేదు. సుదీర్ఘ కాలపు నిరాశ నిస్పృహలు మనల్ని కుంగదీశేశాయి. మన చర్మం స్పర్శను కోల్పోయింది. మన కళ్ళు మూసుకుపోయాయి. మన మెడళ్ళు మొద్దు బారిపోయాయి.
 
“మనం ఎంత కాలం వైరుధ్యాల జీవితాన్ని కొనసాగిద్దాం? మన సాంఘిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఇంకా ఎంత కాలం నిరాకరిద్దాం?  ఈ విలువల్ని దీర్ఘకాలం నిరాకరిస్తూ పోతే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనమే ప్రమాదం లోనికి నెట్టినవాళ్లం అవుతాము. సాధ్యమైనంత త్వరగా మనం వైరుధ్యాల్ని తొలగించి తీరాలి. అలా చేయకపోతే, ఈరోజు ఈ రాజ్యంగ పరిషత్తు ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సమాజంలోని అసమానత్వ బాధితులు అందరూ కలిసి పేల్చి వేస్తారు” అంటూ రాజ్యంగ పరిషత్తు సమావేశాల చివరి రోజైన నవంబరు 25, 1949న చేసిన ప్రసంగం చివర్లో అంబేడ్కర్ అన్న హెచ్చరిక ఇప్పటికీ సజీవంగానే వుంది.  
 
(రచయిత సీనియర్ జర్నలిస్టు, ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్) 
మొబైలు : 9010757776 
 
రచన :18 జనవరి 2019

ప్రచురణ : ప్రజాపాలన దినపత్రిక, 25 జనవరి 2019
ప్రజాపక్షం దినపత్రిక, 27 జనవరి 2019
http://epaper.prajapaksham.in/epaper/edition/368/hyderabad-main/page/4

3. ఆంధ్రజ్యోతి దినపత్రిక, 05 ఫిబ్రవరి 2019
https://epaper.andhrajyothy.com/c/36416879

Thursday, 24 January 2019

Congress will go alone in AP elections; who is the beneficiary


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు వల్ల ఎవరికి లాభం?

డానీ
          ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగు తున్నాయి. లోక్ సభ-అసెంబ్లీ జమిలి ఎన్నికలకు మూడు నెలల గడువు మాత్రమే వుండడంతో ప్రతి రోజూ ఓ కొత్త ఉత్కంఠ చోటు చేసుకుంటున్నది. వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీతో పొత్తు వుండదని కాంగ్రెస్ ప్రకటించడం ఇప్పుడు కొత్త సంచలనం.
          ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల బాధ్యులు ఊమెన్ చాండి బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఇటీవల జరిగిన  ఎన్నికల్లో టిడిపి, తెలంగాణ ప్రజా సమితి, సిపిఐలతో కలిసి కాంగ్రెస్ ‘ప్రజాకూటమి’ని నిర్మించింది. అలాంటి కూటమి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలోనూ ఏర్పడుతుందని అందరు భావిస్తున్న తరుణంలో ఊమెన్ చాండి ప్రకటన కొత్త సంచలనం రేపింది. అయితే, ఒక దూరదృష్టితో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందనే వాదన కూడా వినిపిస్తోంది.
కాంగ్రెస్-టిడిపి పొత్తును తెలంగాణ ఓటర్లు తిప్పికొట్టారు. అదనపు ఓట్లు పడకపోగా అసలు కాంగ్రెస్‍ ఓటు బ్యాంకుకే అక్కడ పెద్ద గండి పడింది. రెండు పార్టీలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.  ఏపీలో అలాంటి పరిస్థితి రానివ్వకూడదని ఇటు కాంగ్రెస్‍ అటు టిడిపి కూడా భావిస్తున్నాయి. 
ఏపీలో చంద్రబాబు అధికారాన్ని నిలబెట్టడానికి  టిడిపి సాంప్రదాయ ఓట్లు  కాంగ్రెస్ కు బదిలీ అయినా కావచ్చుగానీ, కాంగ్రెస్‍ సాంప్రదాయ ఓట్లు మాత్రం టిడిపికి బదిలి అయ్యే అవకాశాలు లేవు. అలాంటి పరిస్థితే వస్తే, కాంగ్రెస్‍ సాంప్రదాయ ఓటర్లు జగన్ కు మద్దతు పలికే అవకాశాలున్నాయి. చంద్రబాబుకన్నా జగన్ తమకు దగ్గరివాడని వాళ్లు భావిస్తారు. కాంగ్రెస్‍ ఒంటరిగా పోటీ చేయాలనుకోవడానికి ఇదొక కారణం.
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండనప్పటికీ జాతీయంగా బీజేపీకి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మాత్రం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమతోనే ఉంటారని ఊమెన్ చాండి స్పష్టం చేయడం ఇంకో విశేషం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ యునైటెడ్ఇండియాపేరిట ఇటీవల కోల్ కటాలో నిర్వహించిన ర్యాలీ ప్రభావంతోనే కాంగ్రెస్ ఇలాంటి  ద్విముఖ వ్యూహాన్ని రచిస్తున్నదని అనుకోవచ్చు.

బిజెపి నాయకత్వంలోని ఎన్ డిఏ భాగస్వామ్యపక్షాలు కాని ప్రముఖుల్లో  కేసిఆర్, నవీన్ పట్నాయక్, జగన్  తప్ప  విపక్ష నాయకులు 23 మంది కోల్ కటా ర్యాలీలో పాల్గొని నరేంద్ర మోదీ పాలనపై యుద్ధభేరి మోగించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణాముల్ కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్‍. అయినప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీకి కాంగ్రెస్‍ తన ప్రతినిధుల్ని పంపించి జాతీయ ప్రయోజనాల కోసం  రాజకీయాల్లో  పట్టువిడుపులకు   తాను సిధ్ధమని గట్టి సంకేతాలు ఇచ్చింది. ఊమన్ చాండీ ప్రకటన వచ్చిన మరునాడే చంద్రబాబు స్పందించారు. “దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకోవడం, రాజ్యాంగాన్ని రక్షించడం” బీజేపీయేతర 23 పార్టీల ఉమ్మడి అజెండా అన్నారు.
జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీలతో ఒక కూటమిని ఏర్పరచగల సత్తా వున్న బహుకొద్ది మందిలో చంద్రబాబు ఒకరు. ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో వారికి మాత్రమే ఆ సత్తా వుందని చెప్పినా  అతిశయోక్తికాదు. ఆ విభాగంలో చంద్రబాబు సేవల్ని పూర్తిగా వాడుకోవాలని కాంగ్రెస్‍ భావిస్తోంది. కాంగ్రెస్‍ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల చంద్రబాబుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడానికి కారణం అదే.
అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక భాగస్వాములకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి  లోక్ సభ ఎన్నికల్లో తన ప్రాధాన్యతను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‍ ముందుకు సాగుతోంది. ఇంతకు ముందు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో రాహుల్ గాంధి ఈ విధానానికి కట్టుబడే ఉదారంగా వ్యవహరించారు. దీన్ని వారు తన తల్లి సోనియా గాంధీ నుండి నేర్చుకున్నారని కాంగ్రెస్‍ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. 2004 ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి కావడానికి తనకు సమస్త అవకాశాలున్నా సోనియా గాంధి  వాటిని వాడుకోలేదు. అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేశారు. 2009 ఎన్నికల తరువాత రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తారని గట్టిగా ప్రచారం జరిగినా పెద్ద పదవులు స్వీకరించడానికి అతనికి ఇంకా సమయం వుందంటూ  మళ్ళీ  మన్మోహన్ సింగ్ కే పట్టంకట్టారు.
ఇప్పటికీ రాహుల్ గాంధీ  అలాంటి ఆలోచనతోనే వున్నారని ఏఐసిసి వర్గాలు అంటుంటాయి. కర్ణాటకలో కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినట్టు లోక్ సభ ఎన్నికల తరువాత సందర్భాన్ని బట్టి మమతా బెనర్జీనో, మాయావతినో ప్రధాన మంత్రి చేయడానికి కూడా రాహుల్ గాంధీ వెనుకాడరు అని ఓ కాంగ్రెస్‍ సీనియర్ నేత తన మనోభావాల్ని పంచుకున్నారు. 2024 నాటికి అనుభవమూ, సమస్త అవకాశాలూ తనకు అనుకూలంగా వుండాలనే సుదీర్ఘ ప్రణాళికతో రాహుల్ గాంధీ వున్నారనేది ఆయన అభిప్రాయం. ఈ ఎన్నికల్లో మాత్రం బిజెపిని ఓడించాలన్నదే రాహుల్ ప్రధాన లక్ష్యం అంటూ  వీలు కుదిరితే ప్రధాని అవుతారు కాకుంటే ఇంకో ఐదేళ్ళు ఆగుతారు  అన్నారాయన. 
ఏపిలో కాంగ్రెస్‍ విడిగా పోటీ చేయాలనుకోవడానికి ఇంకో కారణం కూడా వుంది.  గత ఎన్నికల్లో టిడిపికి ఒక కోటి యాభై ఏడు లక్షల ఓట్లు రాగా వైసిపికి ఒక కోటి ముఫ్ఫయి అయిదు లక్షల ఓట్లు పడ్డాయి. తేడా 22 లక్షల ఓట్లు మాత్రమే. అంటే. 4.63 శాతం. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీకి ఓ 12 లక్షల ఓట్లు తగ్గితే గెలుపు తమదే అనే ధీమాలో వైసిపి వుంది. గతంలో టిడిపితో పొత్తులోవున్న బిజేపి, పవన్ కళ్యాణ్ ఈసారి విడిగా పోటీలో వున్నారు. అదీగాక ఐదేళ్ళ పాలన వల్ల అధికార పార్టీ మీద ప్రజల్లో అసంతృప్తి కూడా వుంటుంది.  ఎన్నికల అరిథమెటిక్స్  ప్రకారం ఏపీలో ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు అటు అధికార పార్టీకీ, ఇటు ప్రతిపక్షాలకు కూడా కీలకంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్ ! ఇక్కడ ప్రతి ఓటూ కౌంటే!.
మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా ఏమీలేదు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రాష్ట్ర విభజన ఆక్రోశం మొత్తాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వెళ్లగక్కారు.  ఆ పార్టీకి ప్రస్తుతం ఒక్క శాసన సభ్యుడు కూడా లేడు. పార్టీకి జవసత్వాలు పోయగల ఆర్ధిక స్తోమత కూడా లేదు. ప్రత్యేక తరహా హోదా కోసం ఉద్యమం సాగినపుడు కాంగ్రెస్ ప్రాధాన్యం ఒకటి రెండు నెలలు కొంచెం పెరిగినట్టు కనిపించినా అది కొనసాగలేదు. అయినప్పటికీ, కాంగ్రెస్‍ కు ఎంతో కొంత ఓటు బ్యాంకు ఇప్పటికీ వుంది. ప్రియాంక గాంధీని ఏఐసిసి ప్రధాన మంత్రిగా నియమించడంతో కాంగ్రెస్ అభిమానుల్లో సహజంగానే కొంత ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ శాంత స్వభావానికి, ప్రియాంక గాంధి వేగం తోడయితే కాంగ్రెస్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయని వాళ్ళు ఆశిస్తున్నారు. పైగా, కాంగ్రెస్ కు సెక్యూలర్ పార్టి అనే పేరుంది. పార్టీ ఏమాత్రం పుంజుకున్నా మైనారిటీలు, మతసామరస్యవాదులు అటుగా చూసే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల వరకు అధికార పార్టి వ్యతిరేక (యాంటి కుంబెన్సీ) ఓట్లు  ప్రత్యర్ధులకు పోకుండా కాంగ్రెస్ కు పడినా చాలనే వ్యూహంతో ఆ రెండు పార్టీలు వున్నాయి.  
రాజకీయ పొత్తులకు ఏపీలో ఇంకో కోణం కూడా వుంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర రావు మీడియాతో మాట్లడుతూ “పక్కరాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మనకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు. మనం కూడా తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం” అన్నారు. సామాన్య జనంతో సహా మీడియా సహితం కేసిఆర్ ప్రకటనను “ప్రతీకారం తీర్చుకుంటాం” అనే అర్ధంలో అన్వయం చేసుకుంది.  వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఏపీలో జగన్ తో కలిసి చంద్రబాబును ఓడించడానికి కృషి చేస్తుందని కొందరు అన్వయించుకున్నారు. కానీ తరచి చూస్తే, కేసిఆర్ మాటలకు వేరే ఫలితాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో  టిఆర్ ఎస్‍ గెలుపు అనివార్యం అయినప్పటికీ 80 శాతం సీట్లు దక్కించుకోవడం మాత్రం ఆశ్చర్యకరమే. దానికి ప్రధాన కారణం చంద్రబాబు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి కేసిఆర్ కు తిరుగులేని మెజారిటీని సమకూర్చారు. ఇది చంద్రబాబు నుండి కేసిఆర్ కు అందిన గిఫ్ట్. కేసిఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే తార్కికంగా ఏం చేయాలీ? ఆంధ్రప్రదేశ్ లో జగన్ తో కలిసి  చంద్రబాబును మళ్ళీ గెలిపించాలి అనే అర్థం వస్తుంది!.
చంద్రబాబును తెలంగాణ ఓటర్లు ఎలా చూస్తారో కేసిఆర్ ను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అలానే చూస్తారు. ఈ మర్మం తెలియని జగన్ టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను తన నివాసానికి ఆహ్వానించి భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశాలను చర్చించారు. జగన్, కేటిఆర్ సమావేశం ఏపీలో సహజంగానే టిడిపికి రిటర్న్ గిఫ్ట్ గా మారింది. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ సాధించిన సానుకూలత కొంచెం తగ్గి టిడిపి సానుకూలత కొంచెం మెరుగుపడింది. 
కోల్ కటాలో విపక్షాల ర్యాలీకి  రెండు రోజులు ముందు ఈ సమావేశం జరగడంతో జగన్ రాజకీయాలు కొత్త అర్ధాన్ని సంతరించుకున్నాయి. కోల్ కటాలో విపక్షాలు ‘మోదీ హటావో’ నినాదాలు ఇస్తుంటే హైదరాబాద్ లో జగన్, కేసిఆర్ ‘మోదీ బచావో’ వ్యూహాలు రచిస్తున్నారనే భావన  ప్రచారం లోనికి వచ్చింది. ఇప్పటి వరకు జగన్ కు విశ్వసనీయమైన మద్దతుదార్లుగా వుంటున్న మైనార్టీ, దళిత వర్గాల్లో కొత్తగా అనుమానాలు మొలకెత్తాయి.  
రాజకీయాల్లో చంద్రబాబు తిరిగినన్ని మలుపులు మరెవరూ  తిరిగి వుండరు. అయితే, ఈ విషయంలో జగన్ కూ చంద్రబాబుకు ఒక చిన్న తేడా వుంది. చంద్రబాబు రాజకీయ మార్పులన్నింటినీ బాహాటంగానే చేశారు. మోదీని నెత్తిన పెట్టుకుని ఊరేగినపుడు ఆయన్ను ప్రతిరోజూ పొగడ్తలతో ముంచేసేవారు. మోదీతో విభేదించాక  ఆయన్ను ప్రతిరోజూ విమర్శిస్తూనే  వున్నారు. మోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే తమ ధ్యేయం అని బాహాటంగా అంటున్నారు. జగన్ అలా కాదు. వచ్చే ఎన్నికల్లో మోదీని వ్యతిరేకిస్తానని వారు గట్టిగా చెప్పలేకపోతున్నారు. పోనీ, మోదీని సమర్ధిస్తానని కూడా వారు నోరు విప్పి చెప్పుకోలేక పోతున్నారు. రాజకీయాల్లో ఇదొక దయనీయ స్థితి.
(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్) 
రచన : 23 జనవరి 2019
ప్రచురణ : తెలుగు బిబిసి 23 జనవరి 2019
https://www.bbc.com/telugu/india-46988989