Is 2019
elections are a ‘Crusaders’
2019 ఎన్నికలు ఒక ‘మతయుధ్ధం’
-
డానీ
మనం తరచుగా
పొరబడే పదాలు మతం, మతతత్వం. రెండు వేరు. మతం
ఒక సమూహపు విశ్వాసాల సమాహారం. మతతత్వం రెండు మత సమూహాల మధ్య సంబంధం. మతం మనిషి పుట్టుకకు
ముందు, చావు తరువాత ఉంటుందనుకునే వ్యవహారాల మీద విశ్వాసం. మతతత్వం ఇహలోక ప్రయోజనాల
కోసం జరిపే సంఘటన. మతం భౌతిక జీవనానికి దూరంగా వుంటుంది. మతతత్వం భౌతిక సమాజంలోని వర్గవైరుధ్యాల
పైన, వర్గ పాలన పైన ఆధారపడి వుంటుంది. ప్రతి మతం జాలి దయ నీతి న్యాయం త్యాగం ప్రేమ
సౌభ్రాతృత్వం వంటి సాధారణ మానవీయ విలువలను బోధిస్తుంది. మతత్వం పరమతస్తుల మీద ద్వేషాన్ని
రగిలిస్తుంది. మతం అంతర్గత వ్యవహారం. మతతత్వం బాహ్యాత్మక వ్యవహారం. మతం నైతికం. మతతత్వం
రాజకీయార్ధికం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం మతం ముసుగు కప్పుకున్న
రాజకీయమే మతతత్వం.
దేశంలోని ప్రతి
ఒక్కరూ గతంలోకన్నా మరింత స్పష్టంగా ఈ రెండు పదాల మధ్య తేడాను తెలుసుకోవాల్సిన సందర్భం
ఇది. ఎందుకంటే భారతీయ జనతా పార్టి అధ్యక్షులు అమిత్ షా 2019 లోక్ సభ ఎన్నికల్ని మతయుధ్ధం
అని ప్రకటించారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జనవరి రెండవ వారంలో జరిగిన బిజెపి జాతీయ
కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ వచ్చే సాధారణ ఎన్నికల్ని వారు మూడవ పానిపట్టు యుధ్ధంతో
పోల్చారు. ఓటమి అనేదే తెలియకుండా 131 వరుస యుధ్ధాలను గెలిచిన మరాఠాలు ఆ ఒక్క యుధ్ధంలో
ఓడిపోయిన కారణంగా “మనం” భారీ మూల్యాన్ని చెల్లించడమేగాక రెండు వందల సంవత్సరాలు వలస
పాలనలో బానిసలుగా బతకాల్సి వచ్చిందన్నారు.
ఇంతకీ అమిత్
షా వర్తమాన రాజకీయాల్లోనికి మూడవ పానిపట్టు యుధ్ధాన్ని ఎందుకు చర్చకు తెచ్చారూ? అన్నది ఎవరికైనా రావలసిన సందేహమే.
18వ శతాబ్దం
ఆరంభంలో ఔరంగజేబ్ మరణం తరువాత భారత ఉపఖండంలో ఒకవైపు మొఘల్ సామ్రాజ్య పతనం, మరోవైపు
పూణే రాజధానిగా పీష్వాల సామ్రాజ్య విస్తరణ ఆరంభమయ్యాయి. పీష్వా బాలాజీ బాజీ రావు హయంలో మరాఠా సామ్రాజం ఉత్తరాన
సట్లెజ్ నది వరకు విస్తరించింది. మొఘల్ పాదుషా
అలీ గోహర్ షా ఆలం – 2 ను దాదాపు ఢిల్లీ నగరానికే
పరిమితం చేసేశారు
సేనాధిపతి
సదాశివరావు భావు నాయకత్వంలోని పీష్వా బలగాలు ఓటమి అనేదే తెలియకుండా ఉత్తర దిక్కుకు
సాగిపోయాయి. ఈ క్రమంలో వాళ్ళు ఆఫ్ఘన్ చక్రవర్తి
అహమద్ షా అబ్దలి దుర్రానీ కుమారుడు తైమూర్
షాహ దుర్రాని సదొజయి ని లాహోర్ నుండి తరిమి కొట్టారు. బాలాజీ బాజీ రావు కుమారుడు విశ్వాస్
రావును ఢిల్లీ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడ్ని చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు.
సరిగ్గా ఆసమయంలో
తన కొడుక్కి పంజాబ్ లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అహమద్ షా అబ్దాలి
దుర్రానీ సట్లెజ్ నదిని దాటి వచ్చాడు. రాజపుత్రులు, జాట్ లు దుర్రానీ సేనలకు అండగా
నిలిచారు. భారత ఉపఖండ చరిత్రలో మూడు మహాయుధ్ధాలకు రణక్షేత్రంగా పానిపట్టు నిలిచింది.
1526లో జరిగిన మొదటి పానిపట్టు యుధ్ధంలో ఇబ్రాహీం లోడీ సేనల్ని బాబర్ జయించాడు.
1556లో జరిగిన రెండవ పానిపట్టు యుధ్ధంలో హేమచంద్ర విక్రమాదిత్యుడ్ని అక్బర్ సైన్యం ఓడించించింది. 1761 జనవరి 14న ఆరంభమయిన
మూడవ పానిపట్టు యుధ్ధంలో అహమద్ షా అబ్దాలి దుర్రానీ సేనలు పీష్వా ఆధిపత్యానికి అడ్డుకట్ట
వేశాయి. హోరాహోరిగా సాగిన ఈ యుధ్ధంలో సేనాధిపతి సదాశివరావు భావు తోపాటు యువరాజు విశ్వాస్ రావు కూడా తొలిరోజే నేలకొరిగారు.
భారత ఉపఖండంలోని
తూర్పు ప్రాంతంలో అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలయిన రోజులవి. పశ్చిమ ప్రాంతంలో
పీష్వాలు ఆస్వాదించిన 131 వరస విజయల ఉత్సాహం మొత్తం మూడవ పానిపట్టు యుధ్ధంలో తొలి రోజే
ఆవిరైపోయింది. పీష్వా సామ్రాజ్య పతనం ఆరంభ అయింది. రెండవ బాజీ రావు కాలంలో 1818లో జరిగిన
భీమా కోరేగావ్ యుధ్ధంతో పీష్వాల పాలన పూర్తిగా అంతరించిపోయింది. అలా అప్పుడు అంతరించిపోయిన
పీష్వాల హిందూత్వ పాలనను 2014లో నరేంద్ర మోదీ పునరుధ్ధరించారని సంఘపరివారం సగర్వంగా
చెప్పుకుంటున్నది.
భీమా - కోరేగావ్
యుధ్ధ ద్విశతాబ్ది విజయోత్సవాలు గత ఏడాది జనవరి 1న ఘనంగా జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి,
ముస్లిం సామాజికవర్గాలు, వామపక్ష పార్టీలకు
చెందిన లక్షలాది మంది కార్యకర్తలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్రిటీష్ ఈస్ట్
ఇండియా కంపెనీ సైన్యంలో చేరిన మహర్లు వీరోచిత పోరాటం చేసి పీష్వా సామ్రాజ్యాన్ని కూల్చివేయడంలో
కీలక పాత్ర నిర్వర్తించారనే వాస్తవాన్ని ఈతరంవాళ్ళకు తెలియకూడదని పూణే అగ్రకులాల వాళ్ళు
భావించారు. కోరేగావ్, పూణె పరిసర ప్రాంతాల్లో
అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లలో అనేక గ్రామాలు ద్వంసం అయ్యాయి. అనేక మంది గాయపడ్డారు.
కొందరు చనిపోయారు. అందరికీ తెలిసిన ఆ అల్లర్ల దోషుల్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వేచ్చగా
వదిలి పెట్టి వరవరరావు తదితర ఆలోచనాపరులు,
పౌరహక్కుల కార్యకర్తల మీద తప్పుడు కేసులు సృష్టించి జైల్లో పెట్టింది. బీఆర్ అంబేడ్కర్
మనుమరాలి భర్త ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డేను ఇటీవల ఈ కేసులో కొత్త నిందితునిగా చేర్చారు.
ఆయన్ని కూడా అరెస్టు చేయడానికి రంగం సిధ్ధమైవుంది. ఇవన్నీచూస్తున్న వారికి భీమా - కోరేగావ్ యుధ్ధం గతం
కాదని అది వర్తమానమని సులువుగానే అర్థం అవుతుంది.
వర్తమానాన్ని
గతం గానూ, గతాన్ని వర్తమానం గానూ మార్చడం సంఘపరివారానికి పుట్టుకతో అబ్బిన విద్య. అమిత్
షా అలాంటి దురాలోచనతోనే 2019 సాధారణ ఎన్నికల్ని మూడవ పానిపట్టు యుధ్ధంతో పోల్చారు.
లోక్ సభ ఎన్నికల్ని “విరుధ్ధ ధర్మాల మధ్య యుధ్ధం” అన్నారు.
అమిత్ షా మాటల అంతరార్ధం ఏమంటే, నాటి మొఘలాయి సామ్రాజ్యం
వున్నంత బలహీన స్థితిలో ఇప్పుడు నూట ముఫ్ఫయి యేళ్ళ వృధ్ధ కాంగ్రెస్ వుంది. అలనాడు
కొన ఊపిరితోవున్న షా ఆలం పాలనకు రాజపుత్రులు, జాట్ లు ఊపిరులూదినట్టు ఇప్పుడు కొందరు
రాజకీయ నాయకులు రాహుల్ గాంధీకు దన్నుగా నిలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ,
లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ తదితరుల్ని
దృష్టిలో పెట్టుకుని వారు ఆ మాటలు అని వుంటారు. కాంగ్రెస్ కేంద్రంగా ఐక్యమవుతున్న ప్రజాకూటమి
అహమద్ షా అబ్దాలి దుర్రానీ సేన అనేది వారి అన్వయం. 2019 ఎన్నికల్లో ఓడిపోతే “మనం” మళ్ళీ రెండు వందల సంవత్సరాలు బానిసలై పోతామని
అమిత్ షా గట్టిగా హెచ్చరించారు. వీటన్నింటి సారాంశం ఏమంటే ఎన్నికల రూపంలో హిందూ-ముస్లిం
సమూహాల మధ్య మతయుధ్ధం జరగబోతున్నదని వారు స్పష్టంగా చెప్పదలిచారు.
ప్రజాస్వామిక
సమాజంలో పార్లమెంటు ఎన్నికల్ని మధ్యయుగాల యుధ్ధాలతో పోల్చడం ఒక తప్పు. వాటిని మతయుధ్ధంగా
వర్ణించడం అంతకన్నా పెద్దతప్పు. పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామిక యుగంలో అధికార
పార్టి అధినేత ఇంత బాహాటంగా మతయుధ్ధాన్ని ప్రకటించినపుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాలి. కానీ, అలా జరగలేదు. సుదీర్ఘ
కాలపు నిరాశ నిస్పృహలు మనల్ని కుంగదీశేశాయి. మన చర్మం స్పర్శను కోల్పోయింది. మన కళ్ళు
మూసుకుపోయాయి. మన మెడళ్ళు మొద్దు బారిపోయాయి.
“మనం ఎంత కాలం ఈ వైరుధ్యాల జీవితాన్ని కొనసాగిద్దాం? మన సాంఘిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఇంకా ఎంత కాలం నిరాకరిద్దాం? ఈ విలువల్ని దీర్ఘకాలం నిరాకరిస్తూ పోతే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనమే ప్రమాదం లోనికి నెట్టినవాళ్లం అవుతాము. సాధ్యమైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాల్ని తొలగించి తీరాలి.
అలా చేయకపోతే, ఈరోజు ఈ రాజ్యంగ పరిషత్తు ఎంతో కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని సమాజంలోని అసమానత్వ బాధితులు అందరూ కలిసి పేల్చి
వేస్తారు” అంటూ రాజ్యంగ పరిషత్తు సమావేశాల చివరి రోజైన నవంబరు 25, 1949న
చేసిన ప్రసంగం చివర్లో అంబేడ్కర్ అన్న హెచ్చరిక ఇప్పటికీ సజీవంగానే వుంది.
(రచయిత సీనియర్ జర్నలిస్టు, ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైలు : 9010757776
రచన :18 జనవరి 2019
ప్రచురణ : ప్రజాపాలన దినపత్రిక, 25 జనవరి 2019
ప్రజాపక్షం దినపత్రిక, 27 జనవరి 2019
http://epaper.prajapaksham.in/epaper/edition/368/hyderabad-main/page/4
3. ఆంధ్రజ్యోతి దినపత్రిక, 05 ఫిబ్రవరి 2019
https://epaper.andhrajyothy.com/c/36416879
I totally agree with this article, yes, indian democracy is really in danger. No second opinion.
ReplyDeleteThank you Sir.
Delete