Wednesday, 10 July 2019

Story behind the ’Pen Name’ Usha S Danny


Story behind the ’Pen Name’ Usha S Danny
For Katta Kavitha (Nava Telangana)  
03 February 2018

          పుస్తకాలు చదివే అలవాటు పదో యేట ఐదవ తరగతిలోనే అబ్బింది. పదమూడవ ఏట ఎనిమిదవ తరగతిలోవుండగా టీచర్స్ డే రోజు కోసం చిన్న స్కిట్ రాసాను. మా డ్రిల్లు మాస్టారు సహకారంతో నా క్లాస్ మేట్ తో కలిసి దాన్ని  ప్రదర్శించాము. తరువాత అడపాడడపా కథలు రాస్తుండే వాడిని. అవి మా ఊర్లోని స్థానిక వార పత్రికల్లో అచ్చయ్యేవి. ఒకటి రెండు కథలు కాలేజీ మేగజైన్లోనూ అచ్చయ్యాయి. 1973లో నేను రాసినప్రగతి నాటిక రచయితగా నాకు ఒక గుర్తింపును తెచ్చింది. దానికి ధవళా సత్యంగారు దర్శకులు.  ప్రముఖ నాటక రచయిత ఎం జీ రామారావు (ఎర్రమట్టి, యుగసంధి) నన్ను ప్రోత్సహించారు.
          ముస్లిం పేర్లని ఇతరులు సరిగ్గా పలకరు. నిజాం సంస్థానం విషయం వేరు. ఆంధ్రా తీరప్రాంతానికి చెందిన నేను పేరు విషయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను. అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దాని జర్రానీ నా పూర్తి పేరు. క్లాస్ మేట్స్ ఖాన్ అని పిలిచేవారు. బంధుమిత్రులు యజ్దానీ అని పిలిచేవారు. నరసాపురం ప్రాంతంలో ముస్లిమేతరులు యజ్దానీ అని పిలవడానికి ఇబ్బందిపడి నా పేరును రకరకాలుగా ఉచ్చరించే వారు. బ్రాహ్మణులు “యజ్ఞాని” అనేవారు. చివరకు అది యస్ దానీ గా స్థిరపడిపోయింది.
అప్పట్లో నేను కొంతకాలం  చిన్నపాటి స్ట్రీట్ ఫైటర్ గానూ వుండేవాడిని. నా యాటిట్యూడ్ ని బట్టి ఫ్రెండ్స్ నన్ను డానీ అనడం మొదలెట్టారు. ముస్లిం పేరుతో తెలుగు రాస్తే పాఠకులు  చదవరేమో అనే అనుమానం కూడా ఒకటి అప్పట్లో నన్ను పీకుతూ వుండేది. అదీగాక, రచనలు రచయితల  వ్యక్తిగత ఆస్తి కాకూడదు అనే వాదన కూడా విప్లవోద్యమంలో వుండేది. అందువల్ల ఒక్కో రచనను ఒక్కో పేరుతో రాసేవాడిని. 
          నా కలం పేరుకు వ్యక్తిగత కారణం కూడా వుంది. నేను చొప్పరపు ఉషారాణి ఇష్టపడ్డాము. మేమిద్దరం 1978 ఆగస్టు 26 విజయవాడలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. ఆమె నరసాపురం విమెన్స్ కాలేజీలో చిన్న ఉద్యోగం చేస్తుండేది. ప్రగతిశీల మహిళా సంఘం (PWO)లో వుండేది. నా దగ్గరకు రావడానికి ముందే ఆమె చనిపోయింది.  ఉష మరణంతో నేను  తీవ్ర కుంగుబాటుకు గురయ్యాను. నన్ను పరామర్శించడానికి వచ్చిన ఆమె స్నేహితులు కొందరు PWO అనేది ఒక విప్లవ సంఘం అని చెప్పారు. నేను అభ్యుదయ రచయితను గాబట్టి విప్లవ సంఘాలకు నా కలం మద్దతు ఇవ్వాలన్నారు.  అలా చేయడంవల్లఉష ఆత్మకు శాంతి కలుగుతుంది; మీరు కుంగుబాటు నుండి బయటపడతారు; మీ రచనలకు ఒక సార్ధకత కలుగుతుంది అన్నారు. వాళ్ళ సూచనలు నాకు బాగా నచ్చాయి. నేను కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని నక్సలైటు గ్రూపులోచేరాను. దాన్ని అప్పట్లో సీవోసి అనేవారు. అదే తరువాతి కాలంలో పీపుల్స్ వార్ గా మారింది.
కొంత కాలం పీపుల్స్ వార్ లో హోల్ టైమర్ గా వున్న తరువాత 1981లో నేను పార్ట్ టైమర్ గా మారాను. చెకోస్లావేకియా కమ్యూనిస్టు నాయకుడు, అంతర్జాతీయ జర్నలిస్టు జూలియస్ ఫ్యూజిక్ మీద నేను రాసిన పుస్తకం ఆవిష్కరణ ఆ ఏడాది మే 1న జరిగింది. రచయితగా నా పేరుకు ఉష పేరు జోడించాలనిపించింది.  నేనూ, ఆర్టిస్టు తాడి మోహన్ రాత్రి చిన్న కసరత్తు చేసిఉషా యస్ డానీ అనే కలం పేరును ఖరారు చేశాము. పేరు ఎంతగా ప్రాచూర్యాన్ని పొందిందంటే 1988లో ఆంధ్రభూమి దినపత్రికలో నా అప్పాయింట్ మెంట్ ఆర్డరును సహితంఉషా యస్ డానీ పేరుతోనే ఇచ్చారు.
           నా కలం పేరుతో కొన్ని తమాషా ఇబ్బందులు కూడా వచ్చాయి. 1982 జనవరి 19 దేశమంతటా ఒక రోజు సార్వత్రిక సమ్మె జరిగింది. అప్పటి పీపుల్స్ వార్ ప్రాంతీయ నాయకునిగా సమ్మెను జయప్రదం చేయాలంటూ  ప్రజలకు ఒక బహిరంగ విజ్ఞాపన చేశాను.  నా ప్రకటన ప్రాముఖ్యం రీత్యా  ఈనాడు దినపత్రిక మెయిన్ ఎడిషన్ ప్రంట్ పేజీ పతాక శీర్షికలో వేసింది. అయితే పేజీ ఇన్ చార్జి ఎవరో నా పేరులో ఉష అని వుండడం వలన అది మహిళ పేరు అనుకొనిఉషా ఎస్  రాణి గా సవరించి ప్రచురించాడు. దానివల్ల ఒక లాభమూ జరిగింది. ఇంటెలిజెన్స్ పోలీసులు  అమ్మాయి ఆచూకీ కనుక్కోలేక కొంత కాలం చాలా ఇబ్బంది పడ్డారు.
          అస్తిత్వవాద ఉద్యమాలు మొదలయ్యాక నేను ముస్లిం అని ప్రకటించుకోవడం ఒక కొత్త విలువగా మారింది. అంచేత ఇటీవల నా పేరుతో రచనలు చేస్తున్నాను. సాహిత్య ప్రక్రియలవరకు ఇప్పటికీఉషా యస్ డానీగా రాయడమే నాకు ఇష్టం.
జీతానికి పాత్రికేయం చేస్తున్నపుడు సంస్థాగతంగా కొన్ని ఆబ్లిగేషన్స్ వుంటాయి. అనేక సందర్భాలలో నేనూ అలాంటి ఆబ్లిగేషన్స్ ను పాటించాను. ఆబ్లిగేషన్స్ వున్నప్పుడెల్లా రకరకాల పేర్లతో రాశాను. గానీ,   ఉషా యస్ డానీగా రాశానంటే మాత్రం ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేవని అర్థం. ఆ కలం పేరు పవిత్రతను నేను ఇప్పటి వరకు కాపాడుతూనే వున్నాను.
పేరు మాత్రమే తెలిసి మనిషి తెలియనివారు నన్ను ఒక మహిళ అనుకునేవారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఫారిన్ లాంగ్వేజెస్ విభాగం 1981 సెప్టెంబరు చివర్లో లూసన్ (Lu Xun) శత జయంతి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా జరిపింది. ఆ ఉత్సవాల్లో  నేను కూడా ఒక వక్త. సదస్సులో నన్ను వేదిక మీదికి ఆహ్వానించిన ప్రొఫెసర్ ఒకామే  నా కలం పేరు, నా పేపర్ టైటిల్ ప్రకటించి  We welcome her to the dais” అన్నారు. మొదట్లో కొన్ని ఇలాంటి అనుభవాలూ కలిగాయి.
//EOM//

ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే !

ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే !

హైదరాబాద్
10 జులై 2019 
డా. జి వి పూర్ణచందు గారూ !
 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సమాచార పత్రం అందింది. ధన్యవాదాలు. 

'తెలుగు నేలపైన మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ' ను ఈ సభల థీమ్ గా ఎంచుకున్నందుకు ముందుగా నిర్వాహక సంఘానికి అభినందనలు.

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) కన్వీనర్ గా ఈ సందర్భంగా ఒక ముఖ్య అంశాన్ని మీ దృష్టికి తీసుకుని రావడం అవసరమని అనుకుంటున్నాను. 

ఆంధ్రప్రదేశ్ ముస్లింల మాతృభాష ఉర్దు. రాష్ట్రంలో ఉర్దూ వికాశానికి అవకాశాలు రోజురోజుకూ కృశించిపోతూ వుండడంతో  ఈ ప్రాంతంలోని ముస్లింలకు తెలుగు  పొట్టకూటి భాషగా  మొదలయ్యి  క్రమంగా మాతృభాషగా మారిపోతున్నది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన అనేకమంది  జానపద  కళా రూపాలు,  కవిత్వం, కథ నవల, వ్యాస ప్రక్రియలల్లో తెలుగును సుసంపన్నం చేశారన్నది చేస్తున్నారన్నది మీకు తెలియని విషయం కాదు. 

తెలుగు నేల మీద మాట్లాడుతున్న అనేక భాషల ప్రస్తావన మీ సమాచార పత్రంలో వుంది. "కొన్ని మాతృభాషలు మాట్లాడే వ్యక్తుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీరి తరువాత ఆ భాష పూర్తిగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోన్న పరిస్థితి" అని మీరు వ్యక్తం చేసిన ఆవేదన మహత్తరమైనది. 

రాష్ట్రంలో అంతరించిపోతున్న భాషల్లో ఉర్దూ కూడా ఒకటి. ఉర్దూ భాష ఔన్నత్యం గురించి వివరంగా చెప్పడానికి  ఇది సందర్భం కానప్పటికీ ఒక అంశాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావలసి వున్నది. ఇప్పుడు మనం ఆదరిస్తున్న ఆధునిక భావాలను జాతియోద్యమ కాలంలో ముందుకు తెచ్చిన ఘనత ఉర్దూ భాషది. The Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind అనే  Progressive Writers' Movement of India or Progressive Writers' Association ద్వార 1932లో ఇది ఆరంభమయింది. ఇప్పుడు మనం ఆధునిక భావాలను ఆదర్శంగా  పేర్కొంటూ ఉర్దూ భాషను తన చావుకు వదిలివేయడం భావ్యం కాదు.  ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే అనే మానవ జీవన శాస్త్ర సూత్రం మీకు తెలియనిది కాదు. 

మీ సమాచార పత్రంలో ఉర్దూ భాష ప్రస్తావన లేకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. మరో అంశం ఏమంటే ప్రపంచ తెలుగు రచయితల సంఘం వ్యవస్థాపక కార్యవర్గంలో హిందూయేతరుల పేరు ఒక్కటీ కనిపించలేదు. తెలుగు భాష అంటే ఆంధ్రప్రదేశ్  డయాస్పోరాకు చెందిన  హిందువుల భాష అని  ప్రపంచ తెలుగు రచయితల సంఘం భావిస్తుంటే  తెలుగు భాషకు అంతకన్నా చారిత్రక అపచారం మరొకటి వుండదు.  తెలుగును మత భాషగా మార్చకండి. తెలుగు సమాజంలోని ప్రధాన స్రవంతి మాత్రమేగాక ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీలు కూడా తెలుగు భాషనే  మాట్లాడుతారు. అంతేకాదు, సంఖ్యరీత్యానూ ఉపస్రవంతి ప్రధాన స్రవంతికన్నా చాలా పెద్దది. మఈ కార్యవర్గంలో సోషల్ ఇంజినీరింగ్ పూర్తిగా లోపించింది. ఉపస్రవంతిని మినహాయించడం భాషా సాహిత్యరంగాల్లో సామాజిక మహాపచారం. 

సభ్యత్వ రుసుము రెండు వేల రూపాయలు చాలా ఎక్కువగా వుంది.  ప్రతినిధులు తమ వసతిని ఏర్పాట్లు తామే చేసుకోవాలని మరో షరతు పెట్టారు. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని మీరు ఎగువ మధ్యతరగతి వ్యవహారంగా మార్చడమేగాకుండా, సామాన్యుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారనిపిస్తున్నది.  సామాన్య తెలుగు భాషాభిమానులు సహితం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించగలరు. 

2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా యునెస్కో చేసిన  ప్రకటనకు స్పందించి ఈ మహాకార్యాన్ని చేపట్టినందుకు మీకు ఇంకోసారి అభినందనలు.  మీ ప్రయత్నం విజయవంతం కావాలని  కోరుకుంటాను. 

అభినందనలతో 
ఉష యస్ డానీ
Writer, Journalist, Social Analyst, communal harmony volunteer, Political Commentator and Humorist