Wednesday, 10 July 2019

ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే !

ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే !

హైదరాబాద్
10 జులై 2019 
డా. జి వి పూర్ణచందు గారూ !
 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సమాచార పత్రం అందింది. ధన్యవాదాలు. 

'తెలుగు నేలపైన మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ' ను ఈ సభల థీమ్ గా ఎంచుకున్నందుకు ముందుగా నిర్వాహక సంఘానికి అభినందనలు.

ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) కన్వీనర్ గా ఈ సందర్భంగా ఒక ముఖ్య అంశాన్ని మీ దృష్టికి తీసుకుని రావడం అవసరమని అనుకుంటున్నాను. 

ఆంధ్రప్రదేశ్ ముస్లింల మాతృభాష ఉర్దు. రాష్ట్రంలో ఉర్దూ వికాశానికి అవకాశాలు రోజురోజుకూ కృశించిపోతూ వుండడంతో  ఈ ప్రాంతంలోని ముస్లింలకు తెలుగు  పొట్టకూటి భాషగా  మొదలయ్యి  క్రమంగా మాతృభాషగా మారిపోతున్నది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన అనేకమంది  జానపద  కళా రూపాలు,  కవిత్వం, కథ నవల, వ్యాస ప్రక్రియలల్లో తెలుగును సుసంపన్నం చేశారన్నది చేస్తున్నారన్నది మీకు తెలియని విషయం కాదు. 

తెలుగు నేల మీద మాట్లాడుతున్న అనేక భాషల ప్రస్తావన మీ సమాచార పత్రంలో వుంది. "కొన్ని మాతృభాషలు మాట్లాడే వ్యక్తుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీరి తరువాత ఆ భాష పూర్తిగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోన్న పరిస్థితి" అని మీరు వ్యక్తం చేసిన ఆవేదన మహత్తరమైనది. 

రాష్ట్రంలో అంతరించిపోతున్న భాషల్లో ఉర్దూ కూడా ఒకటి. ఉర్దూ భాష ఔన్నత్యం గురించి వివరంగా చెప్పడానికి  ఇది సందర్భం కానప్పటికీ ఒక అంశాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావలసి వున్నది. ఇప్పుడు మనం ఆదరిస్తున్న ఆధునిక భావాలను జాతియోద్యమ కాలంలో ముందుకు తెచ్చిన ఘనత ఉర్దూ భాషది. The Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind అనే  Progressive Writers' Movement of India or Progressive Writers' Association ద్వార 1932లో ఇది ఆరంభమయింది. ఇప్పుడు మనం ఆధునిక భావాలను ఆదర్శంగా  పేర్కొంటూ ఉర్దూ భాషను తన చావుకు వదిలివేయడం భావ్యం కాదు.  ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే అనే మానవ జీవన శాస్త్ర సూత్రం మీకు తెలియనిది కాదు. 

మీ సమాచార పత్రంలో ఉర్దూ భాష ప్రస్తావన లేకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. మరో అంశం ఏమంటే ప్రపంచ తెలుగు రచయితల సంఘం వ్యవస్థాపక కార్యవర్గంలో హిందూయేతరుల పేరు ఒక్కటీ కనిపించలేదు. తెలుగు భాష అంటే ఆంధ్రప్రదేశ్  డయాస్పోరాకు చెందిన  హిందువుల భాష అని  ప్రపంచ తెలుగు రచయితల సంఘం భావిస్తుంటే  తెలుగు భాషకు అంతకన్నా చారిత్రక అపచారం మరొకటి వుండదు.  తెలుగును మత భాషగా మార్చకండి. తెలుగు సమాజంలోని ప్రధాన స్రవంతి మాత్రమేగాక ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీలు కూడా తెలుగు భాషనే  మాట్లాడుతారు. అంతేకాదు, సంఖ్యరీత్యానూ ఉపస్రవంతి ప్రధాన స్రవంతికన్నా చాలా పెద్దది. మఈ కార్యవర్గంలో సోషల్ ఇంజినీరింగ్ పూర్తిగా లోపించింది. ఉపస్రవంతిని మినహాయించడం భాషా సాహిత్యరంగాల్లో సామాజిక మహాపచారం. 

సభ్యత్వ రుసుము రెండు వేల రూపాయలు చాలా ఎక్కువగా వుంది.  ప్రతినిధులు తమ వసతిని ఏర్పాట్లు తామే చేసుకోవాలని మరో షరతు పెట్టారు. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని మీరు ఎగువ మధ్యతరగతి వ్యవహారంగా మార్చడమేగాకుండా, సామాన్యుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారనిపిస్తున్నది.  సామాన్య తెలుగు భాషాభిమానులు సహితం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించగలరు. 

2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా యునెస్కో చేసిన  ప్రకటనకు స్పందించి ఈ మహాకార్యాన్ని చేపట్టినందుకు మీకు ఇంకోసారి అభినందనలు.  మీ ప్రయత్నం విజయవంతం కావాలని  కోరుకుంటాను. 

అభినందనలతో 
ఉష యస్ డానీ
Writer, Journalist, Social Analyst, communal harmony volunteer, Political Commentator and Humorist

No comments:

Post a Comment