నాలోని కథకునికి “పోరాట మిత్రులు’
చాలా అన్యాయం చేశారు.
చాలా అన్యాయం చేశారు.
డియర్ సురేష్,
గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ ఇంటర్వ్యూ కు నీ అనువాదాన్ని
ఇప్పుడే చదివాను. ఆంధ్రజ్యోతిలో నీ వ్యాసం లింకు ఎందుకో ఓపెన్ కావడం లేదు. అది కూడ చదవాలని
ఎదురు చూస్తున్నాను.
మార్క్వెజ్ ఇంటర్వ్యూ
చదువుతున్నప్పుడు నా జీవితంలోని అనేక అంశాలు
గుర్తుకు వచ్చాయి. మొదటిది మా అమ్మమ్మ. ఆమెకు జానపద కథలు అనేకం వచ్చు. రోజూ మాకు నిద్రపోయే
ముందు ఒక కథ చెప్పేది. వాటిల్లో దయ్యాలు, భూతాలు మాయలు మంత్రాలు అన్నీ వుండేవి.
అలా మా సమీప బంధువుల్లో ముహమ్మద్ షరీఫ్ అని ఒకడు వుండేవాడు.
వాడు ఈ లోకంలో కన్నా ఇతర గ్రహాల్లో ఎక్కువగా వుండేవాడు. “ఎరా నిన్న కనిపించలేదేంటీ?”
అని అడిగితే “చంద్రలోకానికి వెళ్ళానుగా. చంద్రుని
కూతుర్ని పెళ్ళిచేసుకున్నాను” అని మొదలెట్టేవాడు. తీరిక వుంటే ఒక గంటకు పైగా ఆ కథను
నడిపించేవాడు. అలా రోజుకో ఎపిసోడ్ అల్లేసే వాడు. ఆ కథల్లో మా ఉర్లో వాళ్లందరి పాత్రలూ
కేరికేచర్లుగా వుండేవి. అంతటి కల్పన శక్తి గల మనుషుల్ని
నేను ఇంత వరకు చూడలేదు.
నేను
1980లో జప్తు అని ఒక కథ రాశాను. అందులో మా అమ్మమ్మ, ముహమ్మద్ షరీఫ్ ల ప్రభావంతో రాసిన
అభూత కల్పన దృశ్యాలు వుంటాయి. గోర్కి ‘దాంకో మండే గుడెలు’ కూడ నాకు ఒక ప్రేరణ. ప్రచురణ
కోసం సృజనకు పంపించాను. ఆ కథను సృజన సాహితీ మిత్రులు రెండుసార్లు చదివి అంతిమంగా తిరస్కరించారు.
కథా వస్తువు బాగుంది శిల్పం బాగోలేదనో, శిల్పం బాగుంది కథా వస్తువు బాగోలేదనో కారణాలు
చెప్పారు. అంతిమంగా వాళ్ళు చెప్పింది ఏమంటే పోరాట కథలు రాయాలని. ఆ రోజుల్లో పోరాట కథలు
రాసే ప్రాంతీయ, భౌగోళిక అవకాశం కేవలం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అల్లం రాజయ్యకే
వుంది. ఆ పిదప బిఎస్ రాములుకు వుంది. మరి ఇతర ప్రాంతాల వాళ్ళు ఏం రాయాలీ? అనేది సందేహంగానే
వుండిపోయింది. ఆ సమయానికి అది ఒక మంచికథ అని
నేను భావించాను. అచ్చుకాకపోవడంతో నేను చాలా నిరుత్సాహ పడ్డాను. కుంగుబాటుకు కూడ గురయ్యాను.
అప్పటికి
నాకు మార్క్వెజ్ తెలీదు. మ్యాజికల్ రియలిజం కూడా తెలీదు. తెలిసుంటే గట్టిగానే వాదించి
వుండేవాడిని. అలా నాలోని కథకునికి నా విరసం
“పోరాట ప్రాంత మిత్రులు’ చాలా అన్యాయం చేశారు. దాదాపు 35 యేళ్ల తరువాత కొంచెం శైలి
మార్చి ‘మదరసా మేకపిల్ల’ రాశాను. నేను 1980 నుండే మ్యాజికల్ రియలిజం శైలిని కొనసాగించి
వుంటే చాలా బాగుండేదని అప్పుడప్పుడు బాధగా వుంటుంది.
ఆంధ్రజ్యోతి వ్యాసం కూడ పంపితే ఆనందిస్తాను.
మిత్రుడు
డానీ
No comments:
Post a Comment