ఎరువుల సబ్సిడి నగదు బదిలి ఎవరి కోసం ?
డానీ
వ్యవసాయరంగంలో ఎరువులకు ఇచ్చే సబ్సిడిని ఇక ముందు రైతులకు
నేరుగా నగదుగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఒక ఆర్డినెన్స్
జూన్ నెలలో విడుదల అయ్యింది. అది పార్లమెంటు
ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో చట్ట రూపం దాల్చింది. ఈ చట్టాన్ని టిఆర్ ఎస్
తోపాటు కొన్ని ఎన్డీఏ పక్షాలు కూడ వ్యతిరేకిస్తున్నాయి. అనేక రైతుసంఘాలు ఈ చట్టానికి
వ్యతిరేకంగా జాతీయబంద్ కూడ నిర్వహించాయి. కేంద్రంలో
అధికార బిజెపికి మేధోసరోవరంగా భావించే ఆరెస్సెస్ అనుబంధ సంస్థలైన భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ కూడ వ్యవసాయరంగ
సంస్కరణల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బధ్ధశతృవులుగా కనిపిస్తున్న అధికార వైసిపి, ప్రతిపక్ష
టిడిపి విచిత్రంగా ఈ బిల్లును పార్లమెంటు వుభయసభల్లోనూ బలపరిచాయి.
ఇన్ పుట్ సబ్సిడీని ఎరువుల కంపెనీలకు ఇచ్చే విధానాన్నీ 2010లో అప్పటి
ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరంభించారు. దీనిని న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడి (NBS) అంటారు.
ప్రతి ఆర్ధిక సంవత్సరం ఆరంభంలో ఒక కేజీ ఎరువుకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం
ప్రకటిస్తుంది. ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాక ఆ వ్యవసాయ సంవత్సరంలో జరిగిన ఎరువుల నికర
వినియోగాన్ని లెఖ్ఖలు కట్టి ఆ మొత్తాన్ని ఎరువుల కంపెనీలకు చెల్లిస్తారు. ప్రస్తుత
ఆర్ధిక సంవత్సరంలో కేజి నత్రజని (N)కి రూ. 18.78, ఫాస్పేట్ (P)కు రూ. 14.88, పొటాష్
(K)కు రూ. 10.16, సల్ఫర్ (S)కు రూ. 2.34 చొప్పున సబ్సిడి చెల్లిస్తున్నారు.
ఎన్ బిఎస్ ఆరంభం అయినప్పటి నుండీ ఈ పథకం మీద అనేక విమర్శలేగాక
పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు కూడ ఆరోపణలు వున్నాయి. ఈ పథకంలో సబ్సిడీని చెల్లించే ప్రభుత్వానికి ఎరువుల
గరిష్ట చిల్లర ధర (MRP)ను నిర్ణయించే అధికారం లేదు. మన దేశంలో నత్రజని నిల్వలు కొంతమేర వున్నప్పటికీ
ఫాస్పేట్, పొటాష్ ఉత్పత్తి నామమాత్రం. వీటిని
విదేశాల నుండి దిగుమతి చేసుకోక తప్పదు. వీటి ధరల్ని రసాయన ఎరువుల ఉత్పత్తిదారుల అంతర్జాతీయ
సమాఖ్య నిర్ణయిస్తుంది. ఎరువుల సంస్థలు ఈ అవకాశాన్ని వాడుకొని ఎంఆర్ పిని విచ్చలవిడిగా
పెంచేస్తున్నాయి. ఎన్ బిఎస్ లో 5 వేల కోట్ల
రూపాయల కుంభకోణం జరిగినట్టు 2013లోనే సమాజ్ వాది సభ్యుడు నరేష్ అగర్వాల్ లోక్ సభలో
ఆరోపించారు. గరిష్ట రిటైలు ధరను అదుపు చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని అప్పటి రసాయన
ఎరువుల శాఖామంత్రి శ్రీకాంత్ కుమార్ జెనె పార్లమెంటులో చేతులు ఎత్తేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల కంపెనీలకు చెల్లించిన సబ్సిడీ
మొత్తం రూ. 69,197.96 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 73,435.21 కోట్లకు
పెరిగింది. సాలీన 6 శాతం పెరుగుదల చొప్పున ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ మొత్తం 82
వేల కోట్ల రూపాయలకన్నా ఎక్కువగా వుంటుందని అంచనా. ఇందులో దాదాపు 75 శాతం అంటే 62 వేల కోట్లు యూరియాకు
ఇచ్చే సబ్సిడియే వుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన దేశంలో యూరియాను మోతాదుకు
మించి వాడుతారు. యూరియా సాలీన జాతీయ వినియోగం
25 లక్షల మెట్రిక్ టన్నులు. అయితే, అందులో పంజాబ్ రాష్ట్ర వినియోగం 3.75 లక్షల మెట్రిక్
టన్నులు. అంటే 15 శాతం. ఈ నేపథ్యంలోనే వ్యవసాయరంగ సంస్కరణల మీద పంజాబ్, హర్యాణ రైతులు
అందరికన్నా ముందుగా ఆందోళన బాటపట్టారు. ఇప్పటి వరకు ఎన్డిఏలో భాగస్వామ్య పక్షంగావున్న
శిరోమణి అకాళీ దళ్ (బాదల్) పంజాబ్ రైతుల ఆందోళన
ప్రభావంతో అధికార కూటమి నుండి తప్పుకుంది.
ఎస్ ఏడి (బాదల్) అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్
భార్య హర్ సిమ్రత్ కౌర్ కెబినెట్ హోదా గల ఫుడ్
ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రి పదవికి రాజీనామ చేశారు.
వాడుక భాషలో నగదు బదిలీ పథకంగా ప్రచారంలో వున్న ఈ పథకం అసలు
పేరు డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ (DBT). రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం
కిసాన్ సమ్మాన్ నిధి యోజన (KSNY) పథకాన్ని చేపట్టింది. అందులో భాగంగా వ్యవసాయదారులకు
కిసాన్ క్రెడిట్ కార్డుల్ని (KCC) జారీ చేశారు.
ఇప్పుడు ఆ ఖాతాల్లోనికి ఎరువుల సబ్సిడి నగదును బదిలీ చేస్తారు. దీనినే కేంద్ర ప్రభుత్వం
ఘనంగా ‘ఈ-వ్యాలెట్’ అంటోంది.
ఇంతకీ ఏ ప్రయోజనాన్ని ఆశించి కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ
పథకాన్ని చేపట్టిందన్నది ఎవరికయినా ఆసక్తికర సందేహం. ఏ రాజకీయ పార్టి అయినా రాజకీయ
ప్రయోజనాన్ని అశించే కొత్త పథకాలను రూపొందిస్తాయి. ఈ పథకంవల్ల వ్యవసాయదారులకు కొత్తగా
వచ్చే ఆర్థిక ప్రయోజనం ఏమీలేదు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా ఎరువుల కంపెనీలకు చెల్లించకుండ రైతుల చేతుల మీదుగా అందించడం ఒక్కటే
మార్పు. అలా చేయడంవల్ల ప్రభుత్వం తమ కోసం ఎంత ఖర్చు పెడుతున్నతో రైతులకు ప్రత్యక్షంగా
తెలిసి వస్తుంది. అది తమకు రాజకీయంగా లాభిస్తుందని అధికార పార్టి భావిస్తోంది. పైగా,
ఆర్ధిక రంగంలో జిడిపి రుణాత్మక పెరుగుదల నమోదవుతున్న కాలంలో తన ఇమేజ్ ను పెంచుకోవడానికి
రైతుల మద్దతు చాలా అవసరం అని కేంద్రంలోని అధికారపార్టి భావిస్తున్నది.
జనాభాలో 58 శాతానికి, శ్రామికుల్లో 50 శాతానికి బతుకుతెరువు కల్పిస్తున్న వ్యవస్థ వ్యవసాయ రంగమే. మన దేశంలో
వ్యవసాయ యోగ్యమైన భూమి 39 కోట్ల 46 లక్షల ఎకరాలు వుంది. అంటే 15 కోట్ల 97 లక్షల హెక్టార్లు.
దేశంలో కమతాల సంఖ్య 14 కోట్ల 60 లక్షల హెక్టార్లు. ఆ లెఖ్ఖన కమతాల సగటు విస్తీర్ణం
హెక్టారుకన్నా తక్కువ. భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 18 శాతం.
కమతాల సంఖ్య 14 కోట్ల 60 లక్షలు అంటున్నప్పటికీ కిసాన్ క్రెడిట్
కార్డులు పొందిన వారు 9 కోట్ల 85 లక్షలు మాత్రమే వున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలతోపాటు
ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్ సక్రమంగా లేవనే నెపంతో 4 కోట్ల
75 లక్షల మంది వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయలేదు. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులు వున్న వారికి మాత్రమే
ఎరువుల సబ్సిడి కింద ఖరీఫ్, రబీ పంటలకు కలిపి
హెక్టారుకు 5 వేల రూపాయలు నగదు బదిలీ అవుతాయి.
ఇక్కడే ఈ పథకంలో ఒక కిటుకు వుంది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడి
(NBS) ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీ మొత్తం 82 వేల కోట్లు అవుతుంది.
కానీ, కెసిసి కార్డులున్న 9 కోట్ల 85 లక్షల మందికి 5 వేల రూపాయల చొప్పున చెల్లిస్తే
ఆ మొత్తం 49 వేల 250 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే మొదటి అడుగులోనే కేంద్ర
ప్రభుత్వానికి 32 వేల 750 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఇకముందు వ్యవసాయదారులు గరిష్ట
రిటైలు ధర చెల్లించి ఎరువులు కొనాలి. గరిష్ట రిటైలు ధర ఎంత పెట్టాలనేది ఎరువుల కంపెనీల
ఇష్టం.
డైరెక్ట్ బెనిఫిట్ ఆఫ్ ట్రాన్స్ ఫర్ (DBT) స్కీం కష్టాలకు
ఇది ఆరంభం మాత్రమే. ఈ స్కీమ్ వల్ల వ్యవసాయరంగం ఎదుర్కొనే కష్టాలు చాలా వున్నాయి. వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు మూడు రకాలు. భూ యజమానులైవుండి
సాగు కూడా చేసేవారు మొదటి రకం. భూ యజమానులైవుండి సాగు చేయనివారు రెండవ రకం, భూ యజమానులు
కాకపోయినా సాగు చేసేవారు మూడవ రకం. ఈ మూడవ రకాన్నే కౌలు వ్యవసాయదారులు అంటున్నాం. వీరిలో
మొదటి రకం 20 శాతం మాత్రమే. రెండవ రకానికి
చెందిన వారు 80 శాతం. కౌలు రైతులూ 80 శాతం.
ఎన్ బిఎస్ విధానంలో ఎరువులు సబ్సిడీ ధరకు దొరికేవి కనుక కౌలు
రైతులకు దాని ప్రయోజనం దక్కేది. భూమి వాళ్ళ
పేరునే వుంటుంది కనుక, DBT స్కీంలో మొదటి రెండు రకాల వారికి మాత్రమే ఎరువుల సబ్సిడి
నగదుగా ఈ-వాలెట్ లోనికి బదిలీ అవుతుంది. అంటే,
80 శాతం భూ యజమానులు వ్యవసాయం చేయకుండానే ఇన్ పుట్ సబ్సిడీని పొందుతారు. కౌలు రైతులు వ్యవసాయం చేసినా ఇన్ పుట్ సబ్సిడీని
పొందలేరు. మరో మాటల్లో చెప్పాలంటే, సాగు రైతుల నోరు కొట్టి ఎరువుల కంపెనీలకు లాభాలు
నింపిపెట్టే పథకం ఇది.
(రచయిత సీనియర్ పాత్రికేయుడు;
సమాజ విశ్లేషకులు. మొబైలు : 9010757776)
రచన : 27 సెప్టెంబరు 2020
ప్రచురణ :
సార్,
ఈ వ్యాసాన్నిఆంధ్రజ్యోతి ఎడిట్
పేజీలో ప్రచురించగలరు. ప్రచురణకు స్వీకరించని పక్షంలో వెంటనే తెలుపగలరు. మరో ప్రచురణ
సంస్థకు పంపిస్తాను.
-
డానీ