Sunday, 11 October 2020

Abhijnana Shaakuntalam - Story Synopsis : Telugu Wikipedia

 Abhijnana Shaakuntalam - Story Synopsis Telugu Wikipedia

 అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)

 కథా సంగ్రహం

హస్తినాపురానికి రాజు దుష్యంతుడు. అతను ఒక రోజు వేటకు వెళతాడు. ఒక జింకను వెంటాడుతూ కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ తపోవనంలో కణ్వ మహర్షి దత్తపుత్రిక శకుంతలను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. 

ఆ సమయంలో ఒక తుమ్మెద శకుంతలను ఇబ్బంది పెడుతుంటుంది. దుష్యంతుడు పాలిస్తున్న రాజ్యంలో శకుంతల వంటి అందగత్తెను తుమ్మెదలు బాధించడం ఏమిటంటూ చెలికత్తెలు ఆటపట్టిస్తారు. ఆమాటలు విన్న దుష్యంతుడు తుమ్మెదల్ని తరిమి కొడతారు. దుష్యంతుడ్ని చూసిన శకుంతల కూడ అతని ప్రేమలో పడుతుంది. 

శకుంతల పేరుకు ఒక చరిత్ర వుంది. కొన్నేళ్ల క్రితం విశ్వామిత్రునికి తపోభగం కలిగించడానికి ఇంద్రుడు మేనకను పంపుతాడు. అలా మేనక విశ్వామిత్రులకు ఒక పాప పుడుతుంది. అయితే, ఆ పాపను వదిలి మేనక ఒక వైపు విశ్వామిత్రుడు మరోవైపు పోతారు. ఆ పసిపాపను శాకుంతలములు అనే పక్షులు కాపాడుతాయి. ఆ పాపను కణ్వుడు తెచ్చి పెంచుతాడు. శాకుంతలములు కాపాడిన పాప కనుక శకుంతల అని పేరు పెడతాడు. ఆ పాప పెరిగి పెద్దద్దై గొప్ప అందగత్తె అవుతుంది. 

జాతకం ప్రకారం శకుంతలను దుష్టగ్రహాలు పీడిస్తుంటాయి. ఆ గ్రహాల్ని శాంతింపచేయడానికి కణ్వుడు సోమతీర్థానికి వెళుతాడు. రాక్షస మూకలు, ఏనుగుల గుంపులు భీభత్సం సృష్టించకుండ తపోవనాన్ని సంరక్షించాలని మునులు దుష్యంతుడ్ని కోరుతారు. రాజు కొన్నాళ్ళు అక్కడే విడిది చేస్తాడు. శకుంతల అతనికి అతిథి మర్యాదలు చేస్తుంటుంది. ఆ క్రమంలో వాళ్ళిద్దరు మరింత దగ్గరై గాంధర్వ వివాహం  చేసుకుంటారు. 

కొన్ని రోజుల  తరువాత దుష్యంతుడు హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. కణ్వుడు లేని సమయంలో అతని కూతురిని తీసుకుని వెళ్లడం సాంప్రదాయం కాదనుకుంటాడు. గుర్తుగా తన పేరు చెక్కివున్న ఒక వజ్రపు వుంగరాన్ని శకుంతలకు ఇస్తాడు. దాని మీద  ఎన్ని అక్షరాలున్నవో అని రోజులు గడవక ముందే తన మనుషుల్ని పంపుతానంటాడు. కణ్వుని ఆశిస్సులతో శకుంతలను  సాదరంగా హస్తినకు రప్పించుకుంటానంటాడు. 

శకుంతల అనుక్షణం దుష్యంతుడినే తలుచుకుంటూ ఈలోకాన్ని మరచిపోతుంది. ఒక రోజు దుర్వాసుడు వచ్చి బిక్షం అడుగుతాడు. పరధ్యానంలోవున్న శకుంతల ముని రాకను  గమనించదు. దుర్వాసుడు రెండోసారి అరుస్తాడు. అప్పుడూ శకుంతల గమనించదు. తనకు జరిగినపరాభవానికి దుర్వాసుడు రగిలిపోతాడు. శకుంతల  ఎవరి గురించి ఆలోచిస్తున్నదో  అతనే ఆమెను పూర్తిగా మరిచిపోవాలని శపిస్తాడు. ముని తనను శపించిన విషయం కూడ శకుంతలకు తెలీదు. శకుంతల చెలికత్తెలు వెళ్ళీ మునిని శాపవిముక్తి చేయమని ప్రాధేయపడతారు.  దుష్యంతుడు శకుంతలను మరిచిపోయినా జ్ఞాపికను చూపగానే అతనికి తిరిగి జ్ఞాపకం వస్తుంది అంటాడు దుర్వాసుడు. శకుంతల దగ్గర ఎలాగూ ఉంగరం భద్రంగా వుంది కనుక ఇక ముని శాపం ప్రభావం లేనట్టేనని చెలికత్తెలు భావిస్తారు. ముని శాపం విషయాన్ని శకుంతలకు చెప్పరు. 

కణ్వుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేనాటికి శకుంతల గర్భం దాల్చి వుంటుంది. దుష్యంతుని వంటి సద్గుణాల రాజు అల్లునిగా దొరికినందుకు అతను సంతోషిస్తాడు.  ఇద్దరు శిష్యులను తోడుగా ఇచ్చి శకుంతలను దుష్యంతుని దగ్గరకు పంపుతాడు. 

దారిలో శచీతీర్థం దగ్గర పడవలో పోతూ  నదిని మొక్కుకుంటుంది  శకుంతల. ఆ సమయంలో, దుష్యంతుని జ్ఞాపిక అయిన ఆమె వేలి వుంగరం ఆమెకు తెలియకుండానే నదిలో జారిపోతుంది.  దుర్వాసుని శాపం ప్రకారం ఏనాడో శకుంతలను మరిచిపోయిన దుష్యంతుడు ఆమె ఎదురుగా వచ్చి నిలబడినా గుర్తు పట్టలేడు. స్వార్ధపరులైన స్త్రీలు భోగపరాయణుల్ని తేనెలొలుకు కల్ల మాటలతో ఆకర్షిస్తారని నిందించి  రాజసభలో ఆమెను అవమానిస్తాడు.   కణ్వుని శిష్యులు కూడ శకుంతలను నిర్దయతో వదిలిపోతారు. 

నిస్సహయురాలైన శకుంతలను ఆమె తల్లియైన మేనక ఆదుకుంటుంది. ఒక అప్సరసను పంపి శకుంతలను కశ్యప ముని తపోవనానికి చేరుస్తుంది. అక్కడే ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది శకుంతల. అతడే భరతుడు. 

శకుంతల జారవిడిచిన ఉంగరాన్ని ఒక ఎర్రని చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరికి దొరుకుతుంది. ఆ జాలరి  కూర వండడానికి చేపను కోసినపుడు దాని కడుపులో వుంగరం బయటపడుతుంది. ఆ వుంగరం అనేక మలుపులు తిరిగి దుష్యంతునికి చేరుతుంది. దాన్ని చూడగానే దుష్యంతునికి శాపవిమోచన జరిగి గతం అంతా గుర్తుకు వస్తుంది. శకుంతలకు తాను చేసిన అన్యాయం తెలిసివచ్చి కుమిలిపోతాడు. విచారంలో మునిగి రాజ్యంలో ఉత్సవాలన్నింటినీ రద్దు చేసే స్తాడు. 

ఇంద్రుని సూచన మేరకు కశ్యపుని తపోవనానికి వెళ్ళిన దుష్యంతునికి సింహపు కూనలతో ఆడుకుంటున్న భరతుడు కనిపిస్తాడు. అతను తన కొడుకే అని పోల్చుకుంటాడు. అక్కడే శకుంతలను కూడ కలిసి అందరి ముందు క్షమాపణ కోరుతాడు. శకుంతల అతన్ని మన్నిస్తుంది. కశ్యపుని ఆశిస్సులతో శకుంతల, భారతుడ్ని వెంట బెట్టుకుని దుష్యంతుడు హస్తినపురికి ప్రయాణమౌతాడు.

అలా కథ సుఖాంతం అవుతుంది.

 

వికీపీడియాలో కాళిదాసు నాటకం  అభిజ్ఞాన శాకుంతలం కథా సంగ్రహం రాశాను. ఆశక్తిగలవారు కింది లింకులో చదవవచ్చు.

  (కథా సంగ్రహం రాసింది – ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ))


https://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A4%E0%B0%B2%E0%B0%AE%E0%B1%81



Saturday, 10 October 2020

Abhijnana Shaakuntalam - Danny Notes

 hijnana Shaakuntalam

అభిజ్ఞాన శాకుంతలం (నాటకం)

శకుంతలను అర్థంచేసుకోవడం (Understanding Shaakuntala)

 

మూలం :మహాకవి కాళిదాసు.

తెలుగు అనువాదం : కందుకూరి వీరేశలింగం (1889).

రెండవ ముద్రణ – 1931

 

https://ia801604.us.archive.org/3/items/in.ernet.dli.2015.371792/2015.371792.Shrii-Shaakuntala.pdf

 

Notes

1.               నాందీ (P. 7)

2.                “శివుండిడు మీకు భద్రముల్”. (P. 7)

3.                సూత్రధారుడు, నటి. – ప్రస్తానం (P. 7)

4.               ప్రధమాంకం ఆరంభం. (P. 9)

5.               తపోవనము (P. 9)

6.                హస్తినాపురానికి రాజైన  దుష్యంతుడు ఒక రోజు వేటకు వెళతాడు. ఒక

జింకను తరుముతూ కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గరికి వస్తాడు. (P. 9)

7.                ఆశ్రమ మృగల్ని వేటాడరాదని వైఖానస ముని హెచ్చరిస్తాడు. (P.10)

8.                ఆ సమయంలో కణ్వమహర్షి ఆశ్రమంలో వుండడు.  (P. 12)

9.                శకుంతలను పీడిస్తున్న దుష్టగ్రహాల్ని శాంతింప చేయడానికి  సోమతీర్థానికి  వెళ్ళివుంటాడు. (P. 12)

10.           తపోవనంలో దర్పాన్ని ప్రదర్శించ కూడదనే ఉద్దేశ్యంతో

దుష్యంతుడు విల్లు, బాణాలతోపాటూ తన ఆభరణాలను కూడ తీసి సూతుడుకి ఇస్తాడు. (P.13)

11.           అత్యంత సౌందర్యరాశి యైన శకుంతల ప్రవేశం. చెలికత్తెలతో కలిసి

పూలచెట్ల పాదులకు నీళ్ళు పోస్తుంటుంది. (P.14)

12.           శకుంతల జాకెట్టు (స్తన వల్కలము) చాలా బిగుతుగా వుంటుంది. తన

చెలికత్తె అనసూయను వదులు చేయమంటుంది. (P.15)

13.           శకుంతలను చెట్లు కూడ ప్రేమిస్తుంటాయి. శకుంతల పక్కన

నిలబడితే వాటి ప్రకాశం పెరుగుతుంది. గల్ర్ ఫ్రెండ్‍ పక్కనుంటే అబ్బాయిల ముఖమ వెలిగిపోయినట్టు. ఇదంతా దుష్యంతుడు ఒక చెట్టు చాటున నిలబడి చూస్తుంటాడు. (P.16)

14.           శకుంతలకు పెళ్లి చేసే ప్రయత్నాల్లో కణ్వముని వున్నట్టు తెలుస్తుంది. (P.18)

15.           దుష్యంతుడు తొలి చూపు లోనే శకుంతలతో ప్రేమలో పడిపోతాడు. అయితే అతనికి ఒక సందేహం వస్తుంది.

16.           “ఈమె .. కణ్వునకు స్వజాతీయమైన భార్యయందు బుట్టినది కాకుండ వచ్చునా?” అని  (P.18)

17.           ఇంతలో ఒక తుమ్మెద పువ్వును వదిలి శకుంతల ముఖం మీద వాలుతుంది. (P.19)

18.           రక్షించమని చెలికత్తెల్ని కోరుతుంది. దేశాన్ని రక్షించే దుష్యంతున్ని పిలువు అంటారు చెలికత్తెలు. (P.19)

19.           ఇదే అదను అనుకుని దుష్యంతుడు బయటికి వచ్చి తుమ్న్మెదను తతిమికొడతాడు. (P.20)

20.           అయితే, తానే మహరాజు అని చెప్పుకోడు. ధర్మాదికారినని చెప్పుకుంటాడు. (P.21)

21.           కాశ్యప ముని ఆజన్మబ్రహ్మచారి అయినపుడు శకుంతల అతనికి కూతురెలా అయ్యిందని అడుగుతాడు. కౌశికుడనే వంశ నామం గల  రాజర్షి వదిలేసిన కూతురే శకుంతల అని చెలికత్తెలు చెపుతారు. ఆమెను కణ్వ ముని పెంచాడని వివరిస్తారు. (P.22)

22.           వదిలివేయడం గురించి రాజు మళ్ళీ అడుగుతాడు.  (P.22)

23.           విశామిత్రుని ఉగ్ర  తపస్సును చూసి భయపడిన  దేవతలు తపో భంగం చేయమని  మేనకను నియమించారు. (P.23)

24.           ఉన్మాదాన్ని పుట్టించే మేనక నాట్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిగ్రహాన్ని కోల్పోతాడు. ఫలితంగ వాళ్ళకు ఒక  అమ్మాయి పుడుతుంది. ఆ పసిపిల్లను మేనక విశామిత్రుడు ఇద్దరూ వదిలిపోతారు. హంసలు ఆ పిల్లకు నీళ్ళు తాపుతాయి. హంసలు కాపాడిన పిల్ల గాబట్టి ఆమెకు శాకుంతల అని పేరు పెడతాడు కణ్వ ముని. (P.23)

25.           దుష్యంతుడు బాగా మనసు పారేసుకున్నాడు. శకుంతల కూడ తన గురించి అలాగే తలుస్తున్నదని భావిస్తుంటాడు. (P.26)

26.           మృగ విహారి అయిన దుష్యంత మహారాజు వేటకు వస్తున్నట్టు ప్రకటన చేస్తారు. ఒక ఏనుగు మునుల ఆశ్రమం వైపుకు వస్తుంది.

27.           దుష్యంతుడ్ని వదిలి వెళ్ళడానికి ఇష్టంలేని శకుంతల వెనక్కి చూస్తూ నడుస్తుంటుంది. (P.27)

28.           ఏనుగు వ్యవహారం చూడడానికి దుష్యంతుడు బయలుదేరుతాడు. (P.27)

29.         ప్రధమాంకం ముగింపు. (P.27)

30.         ద్వితీయాంకము (P.29)

31.         ప్రదేశం ఆశ్రమారణ్యం (P.29)

32.           విదూషకుడు ప్రవేశం. (P.29)

33.           తాపస కన్య శకుంతల కనిపించిన తరువాత దుష్యంతుడు రాచకార్యాల;ని మరచిపోయాడు. (P.29)

34.           విదూషకుడు, దుష్యంతుడు శకుంతల గురించి మాట్లాడుకుంటారు. (P.30-35)

35.           శకుంతల ఎవరో ఒక అరణ్యవాసి అయిన తపస్వి చేతులో పడక ముందే ఆమెను వెంటనే దక్కించుకోవాలని విదూషకుడు సలహా ఇస్తాడు. (P.36)

36.           మరోవైపు  యజ్ఞాలకు భగం కలగ కుండ రక్షణ కల్పించాలని దుష్యంతుడ్ని మునులు కోరుతారు. (P.39)

37.           ఇంతలో దుష్యంతునికి తల్లి నుండి పిలుపు వస్తుంది. ఒకవైపు శకుంతల, మరోవైపు తల్లి. ఎటు పోవాలో తేల్చుకోలేడు.  (P.40)

38.           విదూషకుడ్ని తల్లి దగ్గరికి పంపించి దుష్యంతుడు ముని ఆశ్రమంలో వుండిపోతాడు. (P. 41)

39.         తృతియాంకము (P. 42)

40.         ప్రదేశం – తాపసాశ్రమము(P. 42)

41.           శకుంతలకు తాపంతో   ‘గాల్పు’ కొడుతుంది. (P. 42)

42.           దుష్యంతుడు మన్మధావస్థకు గురవుతాడు. (P. 42)

43.           ప్రియురాలి దర్శనము కంటే తనకు శరణ్యం లేదనుకుంటాడు. (P. 44)

44.           శకుంతలకు పూలపాన్పు ఏర్పాటు చేసి చెలికత్తెలు సపర్యలు చేస్తుంటారు. (P. 45)

45.           దుష్యంతుడు ఒక చెట్టు చాటున దాగి వాళ్ళ  మాటలను వింటుంటాడు. (P. 45)

46.           విరహ లక్షణాలు శకుంతలలో కనిపిస్తుంటాయి. (P. 46)

47.           రాజేంద్రుని ప్రేమలో పడినట్టు శకుంతల చెపుతుంది. (P. 47)

48.           తను రాజేంద్రుడ్ని కలిసే మార్గాన్ని చూడమంటుంది. (P. 48)

49.           దుష్యంతునికి మదన లేఖ రాయమని వారంటారు. (P. 49)

50.           దుష్యంతుడు తనను ఆదరించడేమోనని శకుంతల శంకిస్తుంది. (P. 49)

51.           తనలాంటి అందగత్తెల్ని ఎవరూ వదులుకోరని చెలికత్తెలు చెపుతారు. (P. 49)

52.           లేత తామరాకు మీద శకుంతల ఒక గీతాన్ని రాస్తుంది. (P. 50)

53.           ఇదే అదునుగా దుష్యంతుడు శకుంతల పక్కకు చేరుతాడు. (P. 50)

54.            యాపన్నులయినవారి దుఃఖోపశమనం రాజు ధర్మము కదా? అని పియంవద అడుగుతుంది. (P. 51)

55.           కామదేవునివల్ల అవస్థలు పడుతున్న శకుంతలను అనుగ్రహించి తన బతుకును నిలుపమని కోరుతుంది. (P. 51)

56.           అంతఃపుర కాంతలకు దూరంగా వుండడం చేత విరహానికి గురైన రాజును అవకాశం దొరికిందని అలా నిర్బంధించరాదని శకుంతల అంటుంది. (P. 51)

57.           రాజులు బహుకాంతా ప్రియులని విన్నామని అలా కాకుండ తమ ప్రియ సఖికి దుఖఃము కలుగకుండ ఆదరించాలని ప్రియంవద కోరుతుంది. (P. 52)

58.           సఖులు వెళ్ళిపోతుంటే శకుంతల తనను ఒంటరిగా వదిలి వెళ్ళవద్దంటుంది. (P. 52)

59.           భూమికంతటికిని రక్షకుడయినవాడే తన చెంత వున్నప్పుడు భయం దేనికంటూ సఖులు వెళ్ళిపోతారు. (P. 52)

60.           శకుంతల లేచివేళ్లిపోబోతుంది. (P. 53)

61.            దుష్యంతుడు బలవంతంగా శకుంతలను దగ్గరకు లాక్కుంటాడు. (P. 53)

62.           సౌశీల్యమును కాపాడుము అంటుంది శకుంతల. (P. 53)

63.           గౌతమి అక్కడికి వస్తుంది. దుష్యంతుడు మళ్ళీ చెట్ల మాటున దాక్కుంటాడు. (P. 54)

64.           మనసులోని కోరిక తీరడానికి అనాయాసంగా అవకాశం వస్తే పిరికితనంతో కోల్పోయినందుకు శకుంతల పశ్చాత్తాప పడుతుంది. (P. 55)

65.           ప్రియురాలు అనుభవించి వదిలి వెళ్ళిన ఆ పూల పక్కనే దుష్యంతుడు కాస్సేపు కూర్చుంటాడు. (P. 55)

66.           ఇంతలో అతనికి పిలుపు వస్తుంది. (P. 56)

67.         చతుర్ధాంకము (P. 57)

68.         రంగము – రుషి వనము. (P. 57)

69.           అంకాల విరామ కాలంలో శకుంతల దుష్యంతుడు గాంధార వివాహం చేసుకున్నారు. (P. 57)

70.           కొద్ది కాలమైన తరువాత దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. (P. 57)

71.           గుర్తుగా తన పేరు చెక్కిన ఉంగరాన్ని శకుంతలకు  ఇచ్చి బయలుదేరుతాడు. (P. 57)

72.           కణ్వుడు లేని సమయంలో ఆమెను తీసుకుని వెళ్ళడం సబబు కాదని దుష్యంతుడు  భావిస్తాడు.  (P. 57)

73.           ఆ రాజు అంతఃపురానికి చేరుకున్న తరువాత ఇక్కడి వృత్తాంతాన్ని గుర్తు పెట్టుకుంటాడా? అనే సందేహం వస్తుంది ఆనసూయకు. (P. 57)

74.           శకుంతల వివాహం జరిగిపోయిందని తెలిసి కణ్వ మహాముని ఎలా స్పందిస్తారోనని ప్రియంవదకు అనుమానం వస్తుంది. (P. 57)

75.           గుణవంతునికి కన్యను ఇవ్వాలనేది ఆయన సంకల్పము గనుక ఆయన ఆనందిస్తారని అనసూయ అంటుంది. (P. 57)

76.           “ఓహో! ఇదిగో నేను వచ్చినాడను” అనే దుర్వాస మహర్షి గొంతు వినిపిస్తుంది. (P. 58)

77.           “ఓసీ! అతిథిని బరాభవించితివి” అని మళ్ళీ దుర్వాసుని గొంతు కోపంగా వినిపిస్తుంది. (P. 58)

78.           తెర మీద శకుంతల, దుర్వాసుడు ఇద్దరూ కనిపించరు.  (P. 58)

79.           అనసూయ ప్రియంవదల సంభాషణల ద్వార మనకు అర్థం అయ్యేది ఏమంటే  (P. 58)

80.           శకుంతల భర్త గురించి దీర్ఘ ఆలోచనలో మునిగి ఉంది. (P. 58)

81.           స్వతహాగా కోపిష్టియైన దుర్వాస మహాముని అప్పుడే ఆశ్రమానికి వచ్చి బిక్షం అడుగుతాడు. పరధ్యానంలో ఉన్న శకుంతల దుర్వాసుని రాకను గమనించదు. (P. 58)

82.           రెండుసార్లు పిలిచినా  శకుంతల స్పందించకపోవడంతో  దుర్వాసుడు కోపంతో ఉగిపోతాడు. (P. 58)

83.           శకుంతల  ఎవరి గురించి ఆలోచిస్తున్నదో  అతనే ఆమెను పూర్తిగా మరిచిపోవాలని శపిస్తాడు. (P. 58)

84.           తన్మయంలోవున్న శకుంతల  దుర్వాసుడు తనను శపించాడన్న  విషయాన్ని కూడా గమనించదు.  (P. 58)

85.           శకుంతలకు ముంచుకొచ్చిన ఉపద్రవాన్ని అనసూయ, ప్రియంవద గమనిస్తారు.  కోపంతో ఊగిపోతూ పోతున్న దుర్వాసుని వెంట పరుగెడుతారు. (P. 59)

86.           ప్రియంవద ముని పాదాల మీద పడి శకుంతలను క్షమించమని కోరుతుంది. (P. 59)

87.           తన శాపం వృధాకాదని దుష్యంతుడు శకుంతలను మరచిపోకతప్పదని అంటాడు.   అయితే ఆనవాలుగా ఇచ్చిన ఆభరణాన్ని చూపగానే శాప విముక్తి జరుగుతుందంటాడు. (P. 59)

88.           శకుంతల దగ్గర ఉంగరం వుంది కనుక సమస్య పరిష్కారం అయిపోయినట్టు చెలికత్తెలు భావిస్తారు. మృదు స్వభావి అయిన శకుంతలకు దుర్వాసుని శాపం విషయాన్ని చెప్పరాదని నిర్ణయించుకుంటారు. (P. 59)

89.           విష్కంభము (P. 60)

90.           రంగము - రుష్యాశ్రమ ప్రాంతం. (P. 60)

91.           కణ్వుని శిష్యుడు గురువు దగ్గరికి బయలు దేరుతుంటాడు. (P. 60)

92.           రాజధానికి వెళ్ళిన తరువాత దుష్యంతుడు ఒక్క లేఖ కూడ రాయకపోవడంతో  శకుంతల బెంగపెట్టుకుంటుంది. (P. 61)

93.           అనసూయ అంతకన్నా ఎక్కువగా బాధపడుతుంటుంది. (P. 61)

94.           దుర్వాసుని శాపమే పనిచేస్తున్నదని ఆమెకు అనుమానం వస్తుంది. (P. 61)

95.           అంతలోనే ప్రియంవద అక్కడికి వస్తుంది. ఒక అశరీరవాణి ద్వార శకుంతల దుష్యంతుల వివాహం గురించి కణ్వ మునికి తెలిసిందనీ. మంచి వరుడ్ని ఎంచుకున్నందుకు అతను సంతోషించి శకుంతలను భర్త దగ్గరికి పంపుతున్నారని చెపుతుంది. (P. 62)

96.           రుషుల భార్యలు వచ్చి శకుంతలను ఆశీర్వదిస్తారు. (P. 63)

97.           కూతుర్ని అత్తారింటికి పంపుతున్నప్పుడు పెంచిన తపోదనులకే ఇలా వుంటే కన్న తల్లిదండ్రులు ఎంతగా తల్లిడిల్లిపోతారోకదా? అని కణ్వుడు ఉద్వేగానికి లోనవుతాడు. (P. 65)

98.           భర్త దగ్గరికి వెళ్ళాలనే ఆతృత ఆశ్రమాన్ని విడిచిపొతున్నాననే దుఃఖం ఒకేసారి శకుంతలను ఆవహించాయి. (P. 67)

99.           శకుంతల పూల మొక్కల దగ్గర, పాదుల దగ్గర  వీడ్కోలు తీసుకుంటున్నది. వాటికి రోజూ నీళ్లు పోసే బాధ్యతను సఖులకు అప్పచెపుతున్నది. (P. 68)

100.      మమ్మల్ని ఎబరికి అప్పచెప్పి వెళతావు అని చెలికత్తెలు కన్నీరుమున్నీరు అయ్యారు. (P. 68)

101.      లేళ్ళ  వద్ద శకుంతల వీడ్కోలు తీసుకున్నది. (P. 69)

102.      అత్తారింటికి వెళుతున్న అమ్మాయితో బంధుజనులు ఉదక ప్రదేశము వరకే  రావాలని  శాస్త్రము అని ఒక శిష్యుడు గుర్తుచేస్తాడు. (P. 69)

103.    పంచమాంకము (P. 74)

104.    రాజమందిరము (P. 74)

105.      సంగీత శాల నుండి పాత వినిపిస్తోంది. (P. 74)

106.      హంసపదిక పాతపడుతోంది. (P. 74)

107.      దుష్యంతుడు పాటను ఆస్వాదిస్తున్నాడు. (P. 74)

108.      హంసపదికను తాను ఒకప్పుడు ప్రేమించానని దుష్యంతుడు విదూషకునితో అంటాడు. (P. 75)

109.      ఈ సందర్భంగా వసుమతి దేవి విషయం ప్రస్తావనకు వస్తుంది. (P. 75)

110.      ప్రియజన వియోగముతో  ఏమీ తోచనివానిగా వున్నానని బాధపడ్తాడు. (P. 75)

111.      ఒక భటుడు వచ్చి కణ్వ ముని సందేశాన్ని తీసుకుని కొందరు స్త్రీలు వచ్చినట్టు చెపుతాడు. (P. 76)

112.      వాళ్ళను సకల మర్యాదలతో తీసుకుని రావాలని దుష్యంతుడు అజ్ఞాపిస్తాడు. (P. 76)

113.      రాజాస్థానంలో ప్రవేశిస్తుంటే శకుంతల కుడికన్ను అదురుతుంది. (P. 78)

114.      శకుంతలను చూసి దుష్యంతుడు ఆకర్షితుడు అవుతాడు. (P. 79)

115.      పరకళత్రమును దేరి చూడరాదని తమాయించుకుంటాడు. (P. 79)

116.      కణ్వుని సందేంశం ఏమిటని  అడుగుతాడు దుష్వంతుడు. (P. 80)

117.      “రాజా! నువ్వు యోగ్యుడవు కనుక మా పుత్రికను వివాహమాడడాన్ని అంగీకరించాను. (P. 80)

118.      మీ ఇద్దరి కలయిక ఫలితంగా గర్భిణియిన శకుంతలను సహధర్మాచరణమునకు స్వీకరించు” అనే సందేశాన్ని వినిపిస్తారు శిష్యులు. (P. 80)

119.      ఏం మాట్లాడుతున్నారూ?  మీ మానినిని నేను ఇంతకు ముందు పెళ్ళిచేసుకున్నానా? (P. 81)

120.      శకుంతల వేసుకున్న మేలు ముసుగును గౌతమి తొలగిస్తుంది. (P. 82)

121.      శకుంతల అందానికి రాజు ముగ్దుడు అవుతాడుగానీ, ఆమెను పెళ్ళి చేసుకున్న విషయం అతనికి గుర్తుకు రాదు. (P. 82)

122.      పైగా గర్భవతిని భార్యగా అంగీకరించడం కుదరదు అంటాడు. శకుంతల భీతిల్లిపోతుంది. (P. 82)

123.      తపోవనంలో మోసపు మాటలు చెప్పి నన్ను పెళ్ళి చేసుకుని ఇప్పుడు ఇలా నిరాకరీంచడం తగునా? అని అడుగుతుంది. (P. 83)

124.      దుష్యంతుడు పాపము శమించుగాక అంటూ చెవులు మూసుకుంటాడు. (P. 83)

125.      సందేహ నివారణ కోసం తన వుంగరపు వేలును చూపిస్తుంది శకుంతల. (P. 83)

126.      ఆ వేలికి వుంగరం లేదని రాజు అంటాడు. (P. 83)

127.      శకుంతల హతాశురాలవుతుంది.  (P. 83)

128.      శచీతీర్థంలో పడవలో నదిని దాటుతుండగ జారిపడిపోయి వుంటుందని గౌతమి అంటుంది.  (P. 83)

129.      మరో ప్రయత్నంగా శకుంతల ఒక లేడిపిల్ల వుదంతాన్ని చెపుతుంది. (P. 84)

130.      అది కూడ దుష్యంతునికి గుర్తుకురాదు. (P. 84)

131.      పైగా, స్వార్ధపరులైన స్త్రీలు భోగపరాయణుల్ని తేనెలొలుకు కల్ల మాటలతో ఆకర్షిస్తారని నిందించి అవమానిస్తాడు.   (P. 84)

132.      తేనె మాటలు విషపు హృదయం గల దుష్యంతుడ్ని నమ్మినందుకు స్వఛ్ఛంద సంచారిణిగా నిలబడాల్సి వచ్చిందని శకుంతల ఏడుస్తుంది. (P. 85)

133.      రాజు చేతిలో మోసపోయాను. ఇక మీరూ నన్ను వదిలి పోతారా? శకుంతల ఏడుస్తుంది. (P. 85)

134.      వివాహిత పతి ఇంట దాసిగా అయినా వుండాల్సిందే అంటూ శకుంతలను వదిలి కణ్వుని శిష్యులు వెళ్ళిపోతారు. (P. 87)

135.      శకుంతలను ఆస్థాన పురోహితుడు తీసుకునిపోతాడు. (P. 87)

136.      జీవితం మీద విరక్తితొ శకుంతల చనిపోవాలనుకుంటుంది. (P. 87)

137.      పురోహితుడు ఒగరుస్తూ రాజు దగ్గరికి తిరిగి వస్తాడు. (P. 88)

138.      శకుంతల గట్టిగా ఏడుస్తుంటే దివి నుండి ఒక అప్సరస దిగివచ్చి ఆమెను వెంట తీసుకుని పోయిందని చెపుతాడు. (P. 88)

139.      ఏమి జరుగుతున్నదో రాజుకు అర్థం కాదు. (P. 88)

140.      మనసు వ్యాకులముగా వుండడంతో రాజు పడక గదికి పోతాడు. (P. 88)

141.      పంచమ షష్టాంగ మధ్యనుండు భాగము. (P. 89)

142.      రంగము – రాజమందిర ద్వారము (P. 89)

143.      పురితలవరి శ్యాలకుడు ఒక జాలరిని బంధించి తీసుకునివస్తాడు. (P. 89)

144.      రాజు పేరు చెక్కివున్న ఉంగరాన్ని దొంగిలించాడని నేరారోపణ చేస్తాడు. (P. 89)

145.      తన వలలో ఒక ఎర్రని చేపపడిందనీ వండుకుని తినడానికి  దాన్ని కోస్తే  కడుపులో ఈ ఉంగరం దొరికిందని జాలరి చెపుతాడు. (P. 90)

146.      శ్ల్యకుడు తిరిగివచ్చి జాలరిని విడిచి పెట్టడమేగాక  ఉంగరం వెలను బహుమానంగా ఇస్తాడు. (P. 91)

147.      ఉంగరాన్ని చూడగానే ఇష్ట జనులు గుర్తుకు వచ్చి రాజు కంట నీరు పెట్టుకున్నాడని శ్యాల్యకుడు చెపుతాడు. (P. 91)

148.      షష్టాంకము (P. 92)

149.      రంగము – ప్రమదావనం (P. 92)

150.      సానుమతి  అనే అప్సర ఆకాశంలో విహరిస్తూ వుంటుంది.  (P. 92)

151.      ఆమె మేనకకు చుట్టము. అలా శకుంతలకు  బంధువు. (P. 92)

152.      శకుంతలను కాపాడమని సానుమతిని మేనక పంపుతుంది. (P. 92)

153.      వసంతోత్సవ సమయమైనా  రాజగృహంలో సంబరాల జాడ వుండదు.  (P. 92)

154.      ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలని అప్సరస నేల మీదకు దిగుతుంది. (P. 93)

155.      ఉద్యానవనానికి కాపాలాకాసే స్త్రీలు వస్తారు.  వాళ్లు వసంతోత్సవ సన్నాహాలు మొదలెడతారు.  (P. 93)

156.      కంచుకీ అనేవాడు ప్రవేశీంచి రాజు వసంతోత్సావాలను నిషేధించాడని చెపుతాడు. (P. 94)

157.      శకుంతలను విడనాడారని  రాజును లోకులు నిందిస్తున్నారు. (P. 95)

158.      పశ్ఛాత్తాపంతో  బాధపడుతున్న రాజు దేశంలో సంబరాలను రద్దు చేశాడని చెపుతాడు. (P. 95)

159.      దుష్యంతుడు ప్రవేశిస్తాడు. పశ్ఛాత్తాపంతో విచారంగా వుంటాడు. (P. 96)

160.      రాజు మంచివాడని అప్సరస గుర్తిస్తుంది. (P. 96)

161.      దుష్యంతుడు రాచకార్యాలు నెరపే ఆసక్తిని కూడ కోల్పోతాడు. (P. 98)

162.      శకుంతలకు ఇష్టమయిన ప్రదేశాల్లొ కూర్చోవడానికి ఆసక్తి చూపుతాడు. (P. 98)

163.      అప్సరస వాళ్ల వెనుకే వెళుతుంటుంది. (P. 98)

164.      దుష్యంతుని ఆవేదనను శకుంతలకు చెప్పాలనుకుంటుంది. (P. 98)

165.       తను నిరాకరించినపుడు  శకుంతల ఎంతటి మానసిక వేదనకు గురయ్యిందో ఊహించుకుంటూ దుష్యంతుడు బాధపడతాడు. (P. 99)

166.       శకుంతల త్వరలోనే రాజుని కలుస్తుందంటాడు విదూషకుడు. (P. 99)

167.      రావలసినది రాక మానదు. ఈ ఉంగరం దొరికినట్టే శంకుంతల కూడా కలుస్తుంది అంటాడు. (P. 100)

168.      ఏ సందర్భంలో తను శకుంతలకు ఉంగరం ఇచ్చాడొ దుష్యంతుడు చెపుతాడు. (P. 100)

169.      ఉంగరం మీద  రాసిన తన పేరులోని అక్షరాలను రోజుకోకటి చొప్పున  చదువుతూ పూర్తి చేసేలోగా శకుంతలను రాజధానికి తీసుకుని రావడానికి జనాన్ని పంపుతాను అని చెప్పాను అంటాడు. (P. 101)

170.      అంతటి సుకుమారి అయిన శకుంతల వేలిని వదిలి నదిలోనికి ఎందుకు దూకావని ఉంగరాన్ని నిందిస్తాడు. (P. 102)

171.      అంతలో శకుంతల చిత్రపటాన్ని తీసుకుని చతురిక వస్తుంది. (P. 102)

172.      రాజు దానిని తదేకంగా చూస్తుంటాడు. (P. 102)

173.      రాజుని చూస్తూ మనుషుల్లో పశ్ఛాత్తాపంవల్ల ప్రేమ పెరుగుతుంది. గర్వం తగ్గుతుంది అనుకుంటుంది అప్సరస. (P. 102)

174.      చిత్రపటంలో శకుంతల అందం మీద కొంత చర్చ జరుగుతుంది. (P. 103)

175.      శకుంతల సజీవంగా తన ముందుకు వచ్చి నిలబడినట్టు రాజు భ్రమిస్తాడు. (P. 104)

176.      అంతలో ఒక తుమ్మెద వచ్చి శకుంతల చిత్రపటం మీద వాలుతుంది. (P. 105)

177.       తన ప్రేయసి చిత్రపటం మీద వాలినందుకు రాజు ఆ తుమ్మెద మీద మీద చాలా కోపపడతాడు. (P. 105)

178.      ఇక్కడ వసుమతీదేవీ అనే ఒక పాత్ర ప్రస్తావన వస్తుంది. (P. 106)

179.      వసుమతీదేవీ వస్తున్నదని తెలిసి దుష్యంతుడు కంగారుగా శకుంతల చిత్రపటాన్ని దాచేస్తాడు. (P. 106)

180.      “హృదయము వేరొకరి మీద గలిగి యున్ననూ పూర్వ గౌరవమును నిలుపుతున్నాడు” అనుకుంటుంది అప్సరస. (P. 106)

181.      (దుష్యంతునికి వసుమతీదేవీ పెద్ద భార్య అన్నట్టుగా వుంటుంది సన్నివేశం. అయితే ఆ పాత్ర రంగం మీదికి రాదు) (P. 106)

182.      ఇక్కడ ధనమిత్రుడనే ఒక సముద్ర వ్యాపారి వుదంతం వస్తుంది. (P. 107)

183.      ఓడ మునిగి ధనమిత్రుడు చనిపోతాడు. అతనికి అనేక మంది భార్యలున్నప్పటికీ  సంతానం లేదు. సంతానం లేక చనిపోయినవారి సంపదను రాజుకు స్వాధీనం చేయాలి. (P. 107)

184.      ఆ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేస్తాడు. ఆ విషయం తెలిసి దుష్యంతుడు ఆ ఉత్తర్వుల్ని ఆపేస్తాడు. (P. 107)

185.      ధనమిత్రుడి భార్యల్లో ఎవరైనా గర్భంతో వున్నారేమో కనుక్కోమంటాడు. (P. 107)

186.      “గర్భస్థ శిశువునూ దండ్రి ధనమున కర్హమైనదే “ అంటాడు. (P. 108)

187.      అలా రాజ్యంలో చాటింపు వేయమంటాడు. (P. 108)

188.      సంతానం లేక తాను చనిపోతే  బూరు వంశ సంపద అకాలమున విత్తనములు చల్లిన భూమిలా మారిపోతుందంటాడు. (P. 108)

189.      దీపంవున్నా చీకటిలో బతుకుతున్న రాజుని చూసి సానుమతి కరిగిపోతుంది. (P. 109)

190.      ఈ విషయాన్ని శకుంతలకు చెప్పడానికి బయలుదేరుతుంది.

191.      మాఢవ్యూని ఆర్తనాదం వినిపిస్తుంది. (P. 109)

192.      ఓ భూతం వచ్చి మాఢవ్యుణ్ణి ఎత్తుకు పోయి ఒక ఎత్తైన చెట్టు చిటారు కొమ్మకు వేలాడ దీసిందని ఒకడు వచ్చి చెపుతాడు. (P. 109)

193.      ఆ భూతాన్ని చంపడానికి బిల్లంబులతో బయలుదేరుతాడు దుష్యంతుడు. (P. 109)

194.      అది భూతం కాదు; ఇంద్రుని రథసారధి మాతలి. రాజు మనస్సును విషాదం నుండి మరర్చాలని అలా చేస్తాడు. (P. 111)

195.      కాలనేమి రాక్షస గణాన్ని సంహరించాలని ఇంద్రుడు ఆదేశించినట్టు వాళ్ళు చెపుతారు. (P. 111)

196.      ఇంద్రును ఆజ్ఞమేరకు రథాన్నెక్కి  కాలనేమి రాక్షస గణాన్ని అంతం చేయడానికి బయలుదేరుతాడు దుష్యంతుడు. (P. 112)

197.      సప్తమాంకం (P. 113)

198.      దుష్యంతుడు, మాతలి కలిసి ఆకాశ మార్గాన పోతుంటారు. (P. 113)

199.      స్వర్గపురి మీదుగా  మేఘమార్గం లోనికి  ప్రవేశిస్తారు. (P. 114)

200.      ఇద్దరూ మనుకింపురుష పర్వతం మీద దిగుతారు.  (P. 115)

201.      మారీచాశ్రమం వైపుకు పోతారు. (P. 116)

202.      దుష్యంతుడ్ని అశోక వృక్షం దగ్గర కూర్చోబెట్టి   ఇంద్రుని తండ్రిని కలవడానికి పోతాడు మాతాలి. (P. 117)

203.      ఒక సింహపు పిల్లతో ఆడుకుంటూ  బాల భరతుడు ప్రవేశిస్తాడు. అతనితోపాటు ఇద్దరు తాపస్త్రీలు వుంటారు. (P. 118)

204.      సింహపుపిల్లతో ఆడుకుంటున్న బాలుడ్ని చూసి దుష్యంతునికి తండ్రి ప్రేమ కలుగుతుంది. (P. 118)

205.      సింహపు పిల్లను విడిచిపెట్తకపోతే దాని తల్లి సింహం వస్తుందని తాపస్త్రీలు హెచ్చరిస్తారు. బాల భరతుడు  భయపడడు. (P. 118)

206.      బాల భరతుని చేతిలో చక్రవర్తి లక్షనాలు కనిపిస్తాయి దుష్యంతునికి. (P. 118)

207.      తాపస్త్రీలు వదలమని చెప్పినా బాలభరతుడు ఆ సింహపు పిల్లను వదలడు. (P. 119)

208.      భరతుడ్ని “మహర్షి కుమారా!” అని సంభోదించి పెద్దలు చెప్పినట్టు ఆ సింహపు పిల్లను వదులు అంటాడు దుష్యంతుడు. (P. 119)

209.      ఆ పిల్లవాడు మహర్షి కుమారుడు కాదని చెపుతారు తాపస్త్రీలు. (P. 119)

210.      స్థాన విశ్వాసము వల్ల మహర్షి కుమారుడు అని భావించానని చెపుతాడు దుష్యంతుడు. (P. 120)

211.      దుష్యంతుడు, బాలభరతుడు ఒకే రూపంలో వున్నారని  గమనించి తాపస్త్రీలు ఆశ్చర్యపోతారు. (P. 120)

212.      ఆ పిల్లవాడు తన కుమారుడనే భావం కలుగుతుంది దుష్యంతునికి (P. 120)

213.      ఆ పిల్లవాడి కులమేదని అడుగుతాడు దుష్యంతుడు. (P. 120)

214.      పూరు వశం అంటారు వాళ్ళు. (P. 120)

215.      ఇదెలా సాధ్యం అని అడుగుతాడు రాజు. (P. 120)

216.      అప్సరసలు తెచ్చి ఆ తపోవనంలో ప్రసవం కానిచ్చారు అంటారు వాళ్ళు. (P. 120)

217.      దుష్యంతునిలో ఆశ చిగురిస్తుంది. (P. 120)

218.      ఆ పిల్లవాడి తల్లి శకుంతల అనే భావం కలుగుతుంది.  (P. 120)

219.      ఆ బాలుని తల్లి ఏ రాజర్షి భార్య అని అడుగుతాడు. (P. 120)

220.      ధర్మపత్నిని విడిచిపెట్టివారి పేరును ఉఛ్ఛరించరాదు అంటారువారు. (P. 121)

221.      ఆ మాటలు దుష్యంతునికి గుచ్చుకుంటాయి.  అయినప్పటికీ, ఏదో విధంగా ఆ పిల్లాడి తల్లి పేరు తెలుసుకోవాలనుకుంటాడు. (P. 121)

222.      పరస్త్రీ పేరు అడగడం భావ్యం కాదని  జంకుతాడు. (P. 121)

223.      అంతలో ఇంకో తాపస్త్రీ  భరతుడు ఆడుకోవడానికి నెమలి బొమ్మను తెస్తుంది. (P. 121)

224.      వాళ్లు నెమలిని శకుంతల అంటారు. (P. 121)

225.      శకుంతల పేరు వినగానే భరతుడు మా అమ్మ వచ్చిందా? అంటాడు. (P. 121)

226.      ఆపిల్లవాడి తల్లి పేరు కూడ శకుంతల కావడంతో దుష్యంతునిలో ఆతృత మరీ పెరుగుతుంది (P. 121)

227.      ఈ పెనుగులాటలో భరతుని మణికట్టుకు వున్న తాయత్తు తెగిపడిపోతుంది. (P. 121)

228.      దాన్ని దుష్యంతుడు తీయబోతాడు. (P. 121)

229.      తాపస్త్రీలు అతన్ని వారిస్తారు. (P. 121)

230.      అది మహత్తుగల తాయత్తు అనీ, తల్లిదండ్రులుతప్ప మరొకరు ముట్టుకుంటే అది పామై కరుస్తుంది అంటారు. (P. 121)

231.      అప్పటికే దుష్యంతుడు తాయత్తును ఆ పిల్లవాడికి అందిస్తాడు. అది పాముగా మారదు. . (P. 121)

232.      భరతుడు తన కుమారుడే అని దుష్యంతునికి అర్థం అవుతుంది. (P. 121)

233.      అప్పుడే అక్కడికి శకుంతల వస్తుంది. (P. 122)

234.      దుష్యంతుడ్ని చూసి ఆశ్చర్యపోతుంది శకుంతల. (P. 123)

235.      దుష్యంతుడు శకుంతల పాదాల మీదపడి క్షమాపణలు కోరుతాడు. (P. 124)

236.      దుష్యంతుడు శకుంతల ఏకం అవుతారు (P. 124)

237.      వుంగరాన్ని మళ్ళీ ఇవ్వబోతాడు రాజు. శకుంతల వద్దంటుంది. (P. 125)

238.      మాతలి వచ్చి వాళ్ళను కశ్యపుని దగ్గరకు తీసుకునిపోతాడు. (P. 125)

239.      కశ్యపుడు వాళ్ళందర్నీ ఆశీర్వదిస్తాడు. (P. 126)

240.      దుర్వాస ముని శాపంవల్ల రాజు  శకుంతలను మరచిపోయాడని వివరిస్తాడు కశ్యపుడు. (P. 127)

241.      దుర్వాశుడు శపించడానికి కారణం తనేనని ఈ వ్యవహారంలో దుష్యంతుని తప్పు ఏమాత్రం లేదని శకుంతల గుర్తిస్తుంది. (P. 128)

242.      శకుంతల దుష్యంతులు ఏకమయ్యారన్ని కణ్వమహర్షికి వర్తమానం పంపిస్తారు. (P. 129)

243.      శకుంతల, భరతులతో కలిసి ఇంద్రుని రథంలో హస్తినాపురానికి వెళ్ళడానికి  దుష్యంతుడు సిధ్ధం అవుతాడు. (P. 129)

244.      ఏమికావాలో కోరుకోమని కశ్యపుడు అడిగినపుడు తను అప్పటికే చాలా సంతోషంగా వున్నానని చెపుతాడు దుష్యంతుడు. (P. 130)

245.      కశ్యపుడు ఎలాగో కోరుకోమన్నారు గాబట్టి రాజులు ఎల్లప్పుడూ ప్రజల హితం కోసమే పాలన చేయాలంటూ భరత వాక్యాన్ని చదువుతాడు దుష్యంతుడు. (P. 130)

246.      సంపూర్ణము (P. 130)

11 అక్టోబరు  2020