పడాల శ్యామ సుందరరావు గారితో నాకు కొంత పరిచయం వుంది.
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Sunday, 4 December 2022
Padala Shyamasundara Rao
Friday, 2 December 2022
Gurajada Vs Gurajada Cultural Federation
Gurajada
Vs Gurajada Cultural Federation
*గురజాడ వేరు, గురజాడ సాహితీ సమాఖ్య వేరు*
*డానీ*
తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు మీద నిరంతరం ఒక చర్చ సాగుతూనే వుంటుంది. అందులో సమర్ధనలు విమర్శలు ఎన్నివున్నా అవన్నీ గురజాడ సాహిత్య ప్రభావశీలతకు నిదర్శనం. ఒక సందర్భంలో మాక్సిమ్ గోర్కి “రష్యన్ రచయితలందరూ గోగోల్ ‘ఓవర్ కోటు’ నుండి జారిపడ్డవారే” అన్నాడు. అలా తెలుగు సాహిత్యంలో ఒక పేరు చెపాల్సి వస్తే గురజాడ గుర్తుకొస్తాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ స్థానం అలాంటిది.
సాహిత్యంలో సాధారణంగా రెండు దృక్పథాలు వుంటాయి. మొదటి దృక్పథం గతం, యధాస్థితి గొప్పవని చెపుతుంది. రెండవ దృక్పథం వర్తమాన సమాజంలోని అణగారిన సమూహాల ఆకాంక్షలి, వాళ్ళు కోరుకుంటున్న మార్పుల్ని గొప్పవని చెపుతుంది. గురజాడ అప్పారావు రెండవ పరిధిని కూడ దాటాడు. రానున్న సమాజంలో జరగబోయే తప్పుల్ని కూడ ఎత్తి చూపాడు. ఆయన కన్యాశుల్కం రాసే కాలానికి ఆధునిక నియత విద్య అప్పుడే మొదలయింది. హైస్కూళ్ళూ, కాలేజీలు అక్కడక్కడా కొత్తగా వస్తున్నాయి. ఆధునిక ఇంగ్లీషు నియత విద్య మూలంగా సౌజన్యారావు పంతులువంటి సంస్కారులు మాత్రమేగాక గిరీశం వంటి కపటులు కూడ పుడతారు అని చెప్పడంలో గురజాడ ముందుచూపు వుంది. మధురవాణి పాత్రను మలిచిన తీరును మెచ్చుకోకుండా వుండడం సాధ్యంకాదు. అయితే, గురజాడ ముందుచూపు, భవిష్యత్ తరానికి హెచ్చరిక గిరీశం పాత్రలోవుంది.
వర్తమాన సాహిత్యంలో ఈ రకం సమతుల్యత కనిపించడంలేదు. తెలంగాణ ఉద్యమంతో సహా ఉనికివాద సాహిత్యాలనింటిలోనూ ఈ లోపం కనిపిస్తోంది. రిజర్వేషన్ల వల్ల విద్యా, ఉపాధి రంగాల్లో అణగారిన సమూహాలకు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కలిగినా రాజకీయరంగంలో వాళ్లు ఆరు రకాల చెంచాలుగా తయారవుతారని మాన్యశ్రీ కాన్షీరామ్ ఏకంగా ఒక పుస్తకమే రాశాడు. ఈ చెంచాయుగం పరిణామాల్ని సాహిత్యంలో ప్రతిఫలించినవారు లేరు. ఉద్యమకారుల్ని, విప్లవకారుల్ని వాళ్ళ పోరాట తత్త్వాన్ని త్యాగాల్ని తప్పనిసరిగా మెచ్చుకోవాలి. అందులో సందేహంలేదు. అయితే, ఆ ఉద్యమాల్లో వస్తున్న రాబోతున్న పెడధోరణుల్ని కూడ సాహిత్యం ప్రతిఫలించాలి. అలా జరగడం లేదు. అయితే పొగుడుతున్నారు; లేకుంటే తిట్టిపోస్తున్నారు. కొత్తదాన్ని ఆహ్వానించాలి; అందులోనూ రెగ్యులేషన్స్ వుండాలి.
*గురజాడ గురించి మరికొంత*
గురజాడ అప్పారావు బ్రాహ్మణ సమాజం గురించి మాత్రమే రాశాడు అని పెదవి విరిచేవాళ్ళూ, అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళూ వున్నారు. ఒక రచనను సామాజిక కోణంలో చూసే విధానం అది కాదు. నవలలో ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ మొత్తం కథనాన్ని ముంబాయి కంబల్లా హిల్స్ ఆల్టా మౌంట్ రోడ్ లోని 27 అంతస్తుల ముఖేశ్ అంబానీ నివాస గృహం 'అంటీలియా'లోనే నడపవచ్చు. అంతమాత్రాన దాన్ని కార్పొరేట్ అనుకూల కథ అనలేం. అనకూడదు. ఒక్క కార్మిక పాత్ర కూడ
లేకుండ కార్మిక దృక్పథంతో రచన చేయవచ్చు. అలాగే, మొత్తం కార్మిక పాత్రలతోనే కార్మిక
వ్యతిరేక రచన చేయవచ్చు. కథను రచయిత ఏ దృక్పథం తో రాశాడు అన్నది ముఖ్యం. స్థలం, కాలం, సందర్భం, పాత్రలు అనేవి కథాంశానికి (టాపిక్) సంబంధించిన అంశాలు. వాటి మీద రచయిత దృక్పథం ఏమిటీ అనేదే వస్తువు.
గురజాడ అప్పారావు ప్రధానంగా బ్రాహ్మణ పాత్రలతో, నాటి బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలో రచనలు చేశాడు. కానీ, కన్యాశుల్కాన్నీ, బాల్యవివాహాలని విమర్శించాడు; వితంతు పునర్వివాహాలను సమర్ధించాడు. అది అతని దృక్పథం. అందుకే ఆ కాలానికి ఆధునికుడు అయ్యాడు.
ఆహారం నిద్ర లానే సంభోగం కూడ ఒక కీలక శరీరధర్మం.
ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాల భాగస్వాములుగా మారి, దాంపత్య వ్యవస్థలో ప్రవేశించి, ఇనుప తలుపుల్ని శాశ్వితంగా మూసివేసిన తరువాత మాత్రమే సంభోగ అవసరాలు తీర్చుకోవాలనే కఠిన నిబంధన వున్నప్పుడు సమాజంలో సరుకు సంభోగాన్నీ సరఫరా చేయడానికి వాణిజ్య వేశ్య (public
prostitution) వ్యవస్థ పుట్టుకు వస్తుంది. ఇదొక అనివార్య ఏర్పాటు.
కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఏంగిల్స్ ఇద్దరూ ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాన్నే కమ్యూనిస్టు ప్రణాళికలోని 'శ్రామికులు - కమ్యూనిస్టులు' అనే అధ్యాయంలో చెప్పారు. గురజాడ కూడ ఈ హేతువునే పాటించాడనిపిస్తోంది. బాల్య వివాహాలు, బాల్య వితంతువులు, వితంతు పునర్వివాహాలు, కన్యాశుల్కం వగయిరా అంశాల మీద ఒక నాటకాన్ని రాస్తున్నప్పుడు ఒక వేశ్యపాత్ర కేంద్రబిందువుగా వుండాలని భావించాడు. ‘కన్యాశుల్కం నాటకంలో స్త్రీపురుష సంబంధాలు’ అనే అంశం మీద ఒక విస్తృత పరిశోధనా గ్రంధం రాయవచ్చు.
ఇటువైపు పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం
వున్నంత వరకు అటువైపు వాణిజ్య వేశ్యావ్య వస్థ వుంటుంది. గురజాడ ఒక్కడేకాదు; కుటుంబ వ్యవస్థలోని లోపాలను చిత్రించాలనుకున్న అంతర్జాతీయ స్థాయి రచయితలు ఎక్కువ మంది వేశ్య పాత్రల్ని కేంద్ర బిందువుగా మార్చుకున్నారు.
ఆలోచనాపరులందరికీ స్థలకాల, సామాజికవర్గ, ఆర్ధిక ఉపాధి తదితర పరిమితులు ఏదో ఒక స్థాయిలో వుంటాయి. వాళ్ళు కొన్నింటిని అధిగమిస్తారు; కొన్నింటిని అధిగమించలేరు. మరి కొన్నింటిని ఉపేక్షిస్తారు. గురజాడ ఎస్ రాయవరంలో పుట్టారు, చీపురుపల్లిలో చదివారు. అప్పుడేకాదు ఇప్పుడు కూడ ఈ ప్రాంతంలో ఆదివాసుల ప్రభావం ఎక్కువ. అప్పటికే ఓ
70-80 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఆదివాసుల పితూరీ, తిరుగుబాట్లు సాగుతున్నాయి. అయినప్పటికీ గురజాడ రచనల్లో ఆదివాసులు కనిపించరు. అలాగే, విజయనగరం పరిసరాల్లో చెరుకు ఫ్యాక్టరీలు వచ్చాయి. ఆధునిక కార్మికులు తయారయ్యారు. వీరి గురించీ గురజాడ రచనల్లో ప్రస్తావన లేదు. గురజాడ ఉద్దేశ్యపూర్వకంగానే ఆ రెండు సమూహాలను వదిలేశాడా? లేక యాదృఛ్ఛికంగా అలా జరిగిందా? మనకు తెలీదు.
ఇలాంటి
పరిమితుల్ని గురజాడ ఒక్కని మీద మాత్రమే వేసి వదిలేయడం తప్పు. ముందే చెప్పినట్టు పరిమితులనేవి అందరికీ వుంటాయి. ఆధునిక భారత ముస్లిం సంస్కర్తగా భావించే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మీద కూడ ఇలాంటి విమర్శ ఒకటుంది. ఆయన స్థాపించిన అలీగడ్ ముస్లిం యూనివర్శిటీ ఆరంభ దశలో అష్రాఫ్ (ఓసి) ముస్లింలను మాత్రమే ప్రోత్సహించారనీ, అజ్లాఫ్, అర్జాల్, పస్మందా (బిసి) ముస్లింలను నిర్లక్ష్యం చేశారనీ ఒక విమర్శవుంది. అయితే, తరువాతి కాలంలో ఆ ‘క్యాప్’ను తీసేసి అలీగడ్ ముస్లిం యూనివర్శిటీలో అందరికీ అవకాశాలు కల్పించారు.
న్యాయం, స్వేచ్చా, సమానత్వం, సోదరభావాలను భారత రాజ్యాంగం ఆదర్శాలుగా పొదిగిన బాబా సాహెబ్ అంబేడ్కర్ మీద కూడ కొన్ని సమూహాలకు కొన్ని రకాల అసంతృప్తులు వున్నాయి. ఆయన ‘మహర్ రెజిమెంట్’ పునరుధ్ధరణ కోసం కోసం పోరాడారుగానీ ‘చామర్ రెంజిమెంట్’ పునరుధ్ధరణను గట్టిగా కోరలేదనేవారూ కొందరు వున్నారు. నిజానికి అంబేడ్కర్ సంస్కరణలవల్ల మాల సామాజికవర్గమేగాక మాదిగ సామాజికవర్గం కూడ గొప్పగా లబ్దిపొందింది అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఇంకా చెప్పాలంటే దేశంలో ప్రజాస్వామిక సమూహాలన్నింటికీ అంబేడ్కర్ కృషి వల్ల చాలా మేలు జరిగింది.
గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఈ ఏడాది గురజాడ పురస్కారాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం మీద తెలుగు సోషల్ మీడియాలో ఒక వివాదం గట్టిగానే సాగింది. ఆధునికుడయిన గురజాడ పేరిట ఇచ్చే అవార్డును ఛాందసులుగా ముద్రపడిన చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం తగదని కొందరు వాదిస్తే, అసలు గురజాడ తమ సామాజికవర్గం గురించి, తమ సంస్కృతి గురించీ పట్టించుకోని ఛాందసునిగా ఇంకో సమూహం వాదించింది.
మనకు తెలియాల్సింది ఏమంటే గురజాడ వేరు; గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య
వేరు. గురజాడ ఛాందసుల్ని విమర్శించాడు; గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య
ఛాందసుల్ని అభిమానిస్తోంది. మనకు గురజాడ తోనే పని, పడేరహనేదో గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య
అండ్ చాగంటి కోటేశ్వరరావు.
3 డిసెంబరు
2022