Sunday, 4 December 2022

Padala Shyamasundara Rao

 పడాల శ్యామ సుందరరావు గారితో నాకు కొంత పరిచయం వుంది.

నా 21వ యేట 1972లో ‘ప్రగతి’ అనే నాటిక రాశాను. దానికి దర్శకత్వం వహించడానికి ధవళా సత్యంగారు ఒప్పుకున్నారు. కళాసాహిత్యరంగంలో నేను మొదటిసారిగా గురువుగారు అని పిలిచింది ధవళా సత్యంగారినే. వారు ఎంజి రామారావు గారిని గురువుగా భావించేవారు.
సత్యంగారూ, రామారావుగారూ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ కళాకారులతో ‘యుగసంధి’ నాటికను, ‘ఎర్రమట్టి’ నాటకాన్నీ రూపొందించారు. అది సిపిఐ అనుబంధ సంస్థ. సిపిఐ జిల్లా నాయకులు డివిఎస్ వర్మగారూ, పట్టణ పార్టి నాయకులు పడాల శ్యామ సుందరరావుగారూ అప్పుడప్పుడు మా రిహార్సల్ రూంకు వస్తుండేవారు. అలా నేను కొన్నాళ్ళు సిపిఐకు దగ్గరయ్యాను.
ఉమ్మడి మద్రాసు శాసనసభకు 1952లో జరిగిన ఎన్నికల్లో శ్యామ సుందరరావుగారూ నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అప్పట్లో కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరేసి శాసన సభ్యులు వుండేవారు. ఎస్సీ అభ్యర్ధుల్ని విడిగా ఎన్నుకునే విధానం వుండేది.
1953 అక్టోబరు 1న కొత్తగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక 1955 లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో కమ్యూనిస్టు పార్టి సాగించిన వర్గ పోరాటంగా ఆ ఎన్నికలను చెప్పుకోవచ్చు. 196 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తరువాత 1956 నవంబరు 1న హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1957లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రాప్రాంతం వారిని శాసన సభలో కొనసాగిస్తూ, కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులకు రెండున్నరేళ్ళు బోనస్ పదవీకాలం దొరికింది. అప్పుడు గెలిచినవారి జాబితాలో పడాల శ్యామ సుందరరావుగారు వున్నట్టు నాకు కఛ్ఛితంగా తెలీదు. తరువాత 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆచంట నుండి మళ్ళీ శాసనసభకు ఎన్నికయ్యారు.
పడాల శ్యామ సుందరరావుగారికి బర్మా-రంగూన్ నేపథ్యం వుందని తెలుసు. తూర్పు, పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతానికి అప్పట్లో బర్మా-రంగూన్ లతో వాణిజ్య సంబంధాలు వుండేవి. నరసాపురంలోని మాధవాయిపాలెం అప్పట్లో పెద్ద రేవు పట్టణం. చేనేత వస్త్రాలు, జీడిపప్పు, లేసు ఎగుమతి అయ్యేవి. బర్మా కలప, చిట్టిముత్యాలు రకం బాసుమతి బియ్యం దిగుమతి అయ్యేవి. మాధవాయిపాలెం రేవు నుండి వచ్చాయి గాబట్టి విదేషాల్లో చేనేత వస్త్రాలను అప్పట్లో మాధోపల్లెమ్స్’ అనేవారు. మాంచెస్టర్ మిల్లుల ఉత్పత్తులకు మాధోపల్లెమ్స్ పోటీగా మారుతున్నాయని బ్రిటీష్ పార్లమెంటు ఆందోళన వ్యవక్తం చేసిన రోజులున్నాయి.
మా నాన్నగారి తాతగారు అహ్మద్ షరీఫ్ గారు రంగూన్ లో పెద్ద వ్యాపారి. ఇక్కడి నుండి అనేక మందిని రంగూన్ తీసుకుని వెళ్ళారు. ఈ ప్రాంతంలో ‘రంగూన్ రౌడీ’ అనే నాటకం చాలా పాపులర్. ప్రతి ఇంట్లో బర్మాటేకు భోషాణాలు, పందిరి మంచాలు, రందురందుల బొమ్మలతో కూడిన పెద్దపెద్ద టేకు పళ్ళేలు వుండేవి. ఈ ప్రాంతంలో నగిషీలు చెక్కిన బర్మా ద్వారబందాలు పెద్ద ఆకర్షణగా వుండేవి. ఆ ఇళ్ళన్నీ శిధిలమై కూలిపోయినా ఆ ద్వారబందాల ధర హైదరాబాద్ బంజారా హిల్స్, జూబిలీహిల్స్ లో లక్షల రూపాయల్లో పలికేది.
గోదావరి డెల్టా ప్రాంతం నుండి బర్మా వలస వెళ్ళిన వారికి రెండవ ప్రపంచ యుధ్ధం నరకాన్ని చూపించింది. అక్షరాజ్యాల్లోని జపాన్, మిత్రపక్షాల్లోని బ్రిటన్ లకు బర్మా యుధ్ధభూమిగా మారింది. అడవిదారిన పడి దారిలో దొరికిన కందమూల ఫలాలు తింటూ బాంబుల పేలుళ్ళ మధ్య కాలిన్డకన స్వగ్రామాలకు చేరుకున్నారు. వంద మంది ఒక బృదంగా బయలు దేరితే పదిమంది కూడ గమ్యానికి చేరుకోలేకపోయారు. మా పరివారంలోనూ అలా వచ్చినవారున్నారు.
నరసాపురం నియోజకవర్గంలో అప్పట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగావుండేది. సిపిఐ, సిపిఎం నాయకులే కాకుండ కాంగ్రెస్ లో పెద్ద నాయకులైన అల్లూరి సత్యనారాయణ రాజు, పరకాల శేషావతారం కూడ పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులే.
నరసాపురానికి 25 కిలోమీటర్ల దూరంలోవున్న కాళీపట్నంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి నాయకత్వంలో 1950లలో కొన్నాళ్ళు భూపోరాటం సాగింది. (ప్రస్తుతం ఈగ్రామం కత్తిపూడి-ఒంగోలు జాతీయరహదారి 216కు కొంచెం పక్కగా వుంటుంది) గోదావరి డెల్టా ప్రాంతంలో సాగిన భూపోరాటాల్లో అది ముఖ్యమైనది. కమ్యూనిస్టు పార్టీలో నరసాపురం ప్రాంతం నుండి జాతీయ స్థాయినాయకునిగా ఎదిగిన ఉద్దరాజు రామంతోపాటు ఈ పోరాటంలో పడాల శ్యామ సుందరరావు తదితరులు క్రియాశీలంగా పాల్గొన్నారు.
శ్యామ సుందరరావుగారిలో పూర్వ శాసన సభ్యులనే అహం ఏమాత్రం వుండేదికాదు. చాలా నిరాడంబరంగా వుండేవారు. మా బోటివాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అప్పుడప్పుడు కొత్త తరాలకు రాజకీయ పాఠాలు చెప్పేవారు. అలాంటి ఒక క్లాసుకు కూడ నేను హాజరయ్యాను. యువజన విభాగంలో నన్ను పనిచేయమనేవారు. నేను ఎక్కువ రోజులు పనిచేయలేదుగానీ నరసాపురం పట్టణ యువజన విభాగానికి కొన్ని రోజులు కార్యదర్శిగా వున్నాను.
ఆ రోజుల్లో నాకు పరిచయమయిన ఎంజీ రామారావుగారు, ధవళా సత్యంగారూ, పడాల శ్యామ సుందరరావుగారు, డివిఎస్ వర్మగారు చాలా గొప్పవారు. ఆ పరంపరలో ‘మాభూమి’ నాటక కర్త సుకర సత్యనారాయణగారూ పరిచయం అయ్యారు. వీళ్లంతా నాకు 25 ఏళ్ళ లోపే పరిచయం కావడం ఒక అదృష్టంగా భావిస్తాను. నా ఆలోచనా తీరుని మలచడంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీరందరి ప్రభావం వుంది.
20 నవంబరు 2022
హైదరాబాద్

No comments:

Post a Comment