Sunday, 4 December 2022

Padala Shyamasundara Rao

 పడాల శ్యామ సుందరరావు గారితో నాకు కొంత పరిచయం వుంది.

నా 21వ యేట 1972లో ‘ప్రగతి’ అనే నాటిక రాశాను. దానికి దర్శకత్వం వహించడానికి ధవళా సత్యంగారు ఒప్పుకున్నారు. కళాసాహిత్యరంగంలో నేను మొదటిసారిగా గురువుగారు అని పిలిచింది ధవళా సత్యంగారినే. వారు ఎంజి రామారావు గారిని గురువుగా భావించేవారు.
సత్యంగారూ, రామారావుగారూ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ కళాకారులతో ‘యుగసంధి’ నాటికను, ‘ఎర్రమట్టి’ నాటకాన్నీ రూపొందించారు. అది సిపిఐ అనుబంధ సంస్థ. సిపిఐ జిల్లా నాయకులు డివిఎస్ వర్మగారూ, పట్టణ పార్టి నాయకులు పడాల శ్యామ సుందరరావుగారూ అప్పుడప్పుడు మా రిహార్సల్ రూంకు వస్తుండేవారు. అలా నేను కొన్నాళ్ళు సిపిఐకు దగ్గరయ్యాను.
ఉమ్మడి మద్రాసు శాసనసభకు 1952లో జరిగిన ఎన్నికల్లో శ్యామ సుందరరావుగారూ నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అప్పట్లో కొన్ని నియోజకవర్గాలకు ఇద్దరేసి శాసన సభ్యులు వుండేవారు. ఎస్సీ అభ్యర్ధుల్ని విడిగా ఎన్నుకునే విధానం వుండేది.
1953 అక్టోబరు 1న కొత్తగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక 1955 లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో కమ్యూనిస్టు పార్టి సాగించిన వర్గ పోరాటంగా ఆ ఎన్నికలను చెప్పుకోవచ్చు. 196 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ తరువాత 1956 నవంబరు 1న హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 1957లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రాప్రాంతం వారిని శాసన సభలో కొనసాగిస్తూ, కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులకు రెండున్నరేళ్ళు బోనస్ పదవీకాలం దొరికింది. అప్పుడు గెలిచినవారి జాబితాలో పడాల శ్యామ సుందరరావుగారు వున్నట్టు నాకు కఛ్ఛితంగా తెలీదు. తరువాత 1962లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆచంట నుండి మళ్ళీ శాసనసభకు ఎన్నికయ్యారు.
పడాల శ్యామ సుందరరావుగారికి బర్మా-రంగూన్ నేపథ్యం వుందని తెలుసు. తూర్పు, పశ్చిమ గోదావరి డెల్టా ప్రాంతానికి అప్పట్లో బర్మా-రంగూన్ లతో వాణిజ్య సంబంధాలు వుండేవి. నరసాపురంలోని మాధవాయిపాలెం అప్పట్లో పెద్ద రేవు పట్టణం. చేనేత వస్త్రాలు, జీడిపప్పు, లేసు ఎగుమతి అయ్యేవి. బర్మా కలప, చిట్టిముత్యాలు రకం బాసుమతి బియ్యం దిగుమతి అయ్యేవి. మాధవాయిపాలెం రేవు నుండి వచ్చాయి గాబట్టి విదేషాల్లో చేనేత వస్త్రాలను అప్పట్లో మాధోపల్లెమ్స్’ అనేవారు. మాంచెస్టర్ మిల్లుల ఉత్పత్తులకు మాధోపల్లెమ్స్ పోటీగా మారుతున్నాయని బ్రిటీష్ పార్లమెంటు ఆందోళన వ్యవక్తం చేసిన రోజులున్నాయి.
మా నాన్నగారి తాతగారు అహ్మద్ షరీఫ్ గారు రంగూన్ లో పెద్ద వ్యాపారి. ఇక్కడి నుండి అనేక మందిని రంగూన్ తీసుకుని వెళ్ళారు. ఈ ప్రాంతంలో ‘రంగూన్ రౌడీ’ అనే నాటకం చాలా పాపులర్. ప్రతి ఇంట్లో బర్మాటేకు భోషాణాలు, పందిరి మంచాలు, రందురందుల బొమ్మలతో కూడిన పెద్దపెద్ద టేకు పళ్ళేలు వుండేవి. ఈ ప్రాంతంలో నగిషీలు చెక్కిన బర్మా ద్వారబందాలు పెద్ద ఆకర్షణగా వుండేవి. ఆ ఇళ్ళన్నీ శిధిలమై కూలిపోయినా ఆ ద్వారబందాల ధర హైదరాబాద్ బంజారా హిల్స్, జూబిలీహిల్స్ లో లక్షల రూపాయల్లో పలికేది.
గోదావరి డెల్టా ప్రాంతం నుండి బర్మా వలస వెళ్ళిన వారికి రెండవ ప్రపంచ యుధ్ధం నరకాన్ని చూపించింది. అక్షరాజ్యాల్లోని జపాన్, మిత్రపక్షాల్లోని బ్రిటన్ లకు బర్మా యుధ్ధభూమిగా మారింది. అడవిదారిన పడి దారిలో దొరికిన కందమూల ఫలాలు తింటూ బాంబుల పేలుళ్ళ మధ్య కాలిన్డకన స్వగ్రామాలకు చేరుకున్నారు. వంద మంది ఒక బృదంగా బయలు దేరితే పదిమంది కూడ గమ్యానికి చేరుకోలేకపోయారు. మా పరివారంలోనూ అలా వచ్చినవారున్నారు.
నరసాపురం నియోజకవర్గంలో అప్పట్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగావుండేది. సిపిఐ, సిపిఎం నాయకులే కాకుండ కాంగ్రెస్ లో పెద్ద నాయకులైన అల్లూరి సత్యనారాయణ రాజు, పరకాల శేషావతారం కూడ పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులే.
నరసాపురానికి 25 కిలోమీటర్ల దూరంలోవున్న కాళీపట్నంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి నాయకత్వంలో 1950లలో కొన్నాళ్ళు భూపోరాటం సాగింది. (ప్రస్తుతం ఈగ్రామం కత్తిపూడి-ఒంగోలు జాతీయరహదారి 216కు కొంచెం పక్కగా వుంటుంది) గోదావరి డెల్టా ప్రాంతంలో సాగిన భూపోరాటాల్లో అది ముఖ్యమైనది. కమ్యూనిస్టు పార్టీలో నరసాపురం ప్రాంతం నుండి జాతీయ స్థాయినాయకునిగా ఎదిగిన ఉద్దరాజు రామంతోపాటు ఈ పోరాటంలో పడాల శ్యామ సుందరరావు తదితరులు క్రియాశీలంగా పాల్గొన్నారు.
శ్యామ సుందరరావుగారిలో పూర్వ శాసన సభ్యులనే అహం ఏమాత్రం వుండేదికాదు. చాలా నిరాడంబరంగా వుండేవారు. మా బోటివాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అప్పుడప్పుడు కొత్త తరాలకు రాజకీయ పాఠాలు చెప్పేవారు. అలాంటి ఒక క్లాసుకు కూడ నేను హాజరయ్యాను. యువజన విభాగంలో నన్ను పనిచేయమనేవారు. నేను ఎక్కువ రోజులు పనిచేయలేదుగానీ నరసాపురం పట్టణ యువజన విభాగానికి కొన్ని రోజులు కార్యదర్శిగా వున్నాను.
ఆ రోజుల్లో నాకు పరిచయమయిన ఎంజీ రామారావుగారు, ధవళా సత్యంగారూ, పడాల శ్యామ సుందరరావుగారు, డివిఎస్ వర్మగారు చాలా గొప్పవారు. ఆ పరంపరలో ‘మాభూమి’ నాటక కర్త సుకర సత్యనారాయణగారూ పరిచయం అయ్యారు. వీళ్లంతా నాకు 25 ఏళ్ళ లోపే పరిచయం కావడం ఒక అదృష్టంగా భావిస్తాను. నా ఆలోచనా తీరుని మలచడంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీరందరి ప్రభావం వుంది.
20 నవంబరు 2022
హైదరాబాద్

Friday, 2 December 2022

Gurajada Vs Gurajada Cultural Federation

Gurajada Vs Gurajada Cultural Federation  

*గురజాడ వేరుగురజాడ సాహితీ సమాఖ్య వేరు*

*డానీ*

          తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు మీద నిరంతరం ఒక చర్చ సాగుతూనే వుంటుంది. అందులో సమర్ధనలు విమర్శలు ఎన్నివున్నా అవన్నీ గురజాడ సాహిత్య ప్రభావశీలతకు నిదర్శనం. ఒక సందర్భంలో మాక్సిమ్ గోర్కిరష్యన్ రచయితలందరూ గోగోల్ఓవర్ కోటునుండి జారిపడ్డవారేఅన్నాడు. అలా తెలుగు సాహిత్యంలో ఒక పేరు చెపాల్సి వస్తే గురజాడ గుర్తుకొస్తాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ స్థానం అలాంటిది

సాహిత్యంలో సాధారణంగా రెండు దృక్పథాలు వుంటాయి. మొదటి దృక్పథం గతం, యధాస్థితి గొప్పవని చెపుతుంది. రెండవ దృక్పథం వర్తమాన సమాజంలోని అణగారిన సమూహాల ఆకాంక్షలి, వాళ్ళు కోరుకుంటున్న మార్పుల్ని గొప్పవని చెపుతుంది. గురజాడ అప్పారావు రెండవ పరిధిని కూడ  దాటాడు. రానున్న సమాజంలో జరగబోయే  తప్పుల్ని కూడ ఎత్తి చూపాడు.  ఆయన కన్యాశుల్కం రాసే కాలానికి ఆధునిక నియత విద్య అప్పుడే మొదలయింది. హైస్కూళ్ళూ, కాలేజీలు అక్కడక్కడా కొత్తగా వస్తున్నాయి. ఆధునిక ఇంగ్లీషు నియత విద్య మూలంగా సౌజన్యారావు పంతులువంటి సంస్కారులు మాత్రమేగాక గిరీశం వంటి కపటులు కూడ పుడతారు అని చెప్పడంలో గురజాడ ముందుచూపు వుంది. మధురవాణి పాత్రను మలిచిన తీరును మెచ్చుకోకుండా వుండడం సాధ్యంకాదు. అయితే, గురజాడ ముందుచూపు, భవిష్యత్ తరానికి  హెచ్చరిక గిరీశం పాత్రలోవుంది.   

వర్తమాన సాహిత్యంలో రకం సమతుల్యత కనిపించడంలేదు. తెలంగాణ ఉద్యమంతో సహా ఉనికివాద సాహిత్యాలనింటిలోనూ లోపం కనిపిస్తోంది. రిజర్వేషన్ల వల్ల విద్యా, ఉపాధి రంగాల్లో అణగారిన సమూహాలకు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కలిగినా రాజకీయరంగంలో వాళ్లు ఆరు రకాల చెంచాలుగా తయారవుతారని మాన్యశ్రీ కాన్షీరామ్ ఏకంగా ఒక పుస్తకమే రాశాడు. చెంచాయుగం పరిణామాల్ని సాహిత్యంలో ప్రతిఫలించినవారు లేరు. ఉద్యమకారుల్ని, విప్లవకారుల్ని వాళ్ళ పోరాట తత్త్వాన్ని త్యాగాల్ని తప్పనిసరిగా   మెచ్చుకోవాలి. అందులో సందేహంలేదు. అయితే, ఉద్యమాల్లో వస్తున్న రాబోతున్న పెడధోరణుల్ని కూడ సాహిత్యం ప్రతిఫలించాలి. అలా జరగడం లేదు. అయితే పొగుడుతున్నారు; లేకుంటే తిట్టిపోస్తున్నారు. కొత్తదాన్ని ఆహ్వానించాలి; అందులోనూ రెగ్యులేషన్స్ వుండాలి.

 

*గురజాడ గురించి మరికొంత*

          గురజాడ  అప్పారావు బ్రాహ్మణ సమాజం గురించి మాత్రమే  రాశాడు అని పెదవి విరిచేవాళ్ళూ, అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్ళూ వున్నారు. ఒక రచనను సామాజిక కోణంలో చూసే విధానం అది కాదునవలలో  ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ మొత్తం కథనాన్ని ముంబాయి కంబల్లా హిల్స్  ఆల్టా మౌంట్ రోడ్ లోని 27 అంతస్తుల ముఖేశ్ అంబానీ నివాస గృహం 'అంటీలియా'లోనే నడపవచ్చు. అంతమాత్రాన దాన్ని కార్పొరేట్ అనుకూల కథ అనలేం. అనకూడదు. ఒక్క కార్మిక పాత్ర కూడ లేకుండ కార్మిక దృక్పథంతో రచన చేయవచ్చు. అలాగే, మొత్తం కార్మిక పాత్రలతోనే కార్మిక వ్యతిరేక రచన చేయవచ్చు. కథను రచయిత దృక్పథం తో రాశాడు అన్నది ముఖ్యం. స్థలం, కాలం, సందర్భం, పాత్రలు అనేవి కథాంశానికి (టాపిక్) సంబంధించిన అంశాలు. వాటి మీద రచయిత దృక్పథం ఏమిటీ అనేదే వస్తువు.

గురజాడ అప్పారావు ప్రధానంగా బ్రాహ్మణ పాత్రలతో, నాటి బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలో రచనలు చేశాడు. కానీ, కన్యాశుల్కాన్నీ, బాల్యవివాహాలని విమర్శించాడు; వితంతు పునర్వివాహాలను సమర్ధించాడుఅది అతని దృక్పథం. అందుకే కాలానికి ఆధునికుడు అయ్యాడు

          ఆహారం నిద్ర లానే సంభోగం కూడ ఒక కీలక శరీరధర్మం.  ఒక స్త్రీ ఒక పురుషుడు జీవితకాల భాగస్వాములుగా మారి, దాంపత్య వ్యవస్థలో ప్రవేశించి, ఇనుప తలుపుల్ని శాశ్వితంగా మూసివేసిన  తరువాత   మాత్రమే సంభోగ అవసరాలు తీర్చుకోవాలనే కఠిన నిబంధన వున్నప్పుడు సమాజంలో  సరుకు సంభోగాన్నీ సరఫరా చేయడానికి వాణిజ్య వేశ్య (public prostitution) వ్యవస్థ పుట్టుకు వస్తుంది.    ఇదొక అనివార్య ఏర్పాటు.

          కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఏంగిల్స్  ఇద్దరూ ఇంచుమించు  ఇలాంటి అభిప్రాయాన్నే కమ్యూనిస్టు ప్రణాళికలోని 'శ్రామికులు - కమ్యూనిస్టులు'   అనే అధ్యాయంలో  చెప్పారు. గురజాడ కూడ హేతువునే పాటించాడనిపిస్తోందిబాల్య వివాహాలు, బాల్య వితంతువులు, వితంతు పునర్వివాహాలు, కన్యాశుల్కం వగయిరా అంశాల మీద  ఒక నాటకాన్ని రాస్తున్నప్పుడు ఒక వేశ్యపాత్ర కేంద్రబిందువుగా వుండాలని భావించాడు. ‘కన్యాశుల్కం నాటకంలో స్త్రీపురుష సంబంధాలు’ అనే అంశం మీద ఒక విస్తృత పరిశోధనా గ్రంధం రాయవచ్చు

          ఇటువైపు పాతివ్రత్యం, ఏకపత్నీవ్రతం వున్నంత వరకు అటువైపు వాణిజ్య వేశ్యావ్య వస్థ వుంటుంది. గురజాడ ఒక్కడేకాదు; కుటుంబ వ్యవస్థలోని లోపాలను  చిత్రించాలనుకున్న అంతర్జాతీయ స్థాయి  రచయితలు ఎక్కువ మంది  వేశ్య పాత్రల్ని కేంద్ర బిందువుగా మార్చుకున్నారు.    

ఆలోచనాపరులందరికీ స్థలకాల, సామాజికవర్గ, ఆర్ధిక ఉపాధి తదితర పరిమితులు ఏదో ఒక స్థాయిలో వుంటాయి. వాళ్ళు కొన్నింటిని అధిగమిస్తారు; కొన్నింటిని అధిగమించలేరు. మరి కొన్నింటిని ఉపేక్షిస్తారు. గురజాడ ఎస్ రాయవరంలో పుట్టారు, చీపురుపల్లిలో చదివారు. అప్పుడేకాదు ఇప్పుడు కూడ ప్రాంతంలో ఆదివాసుల ప్రభావం ఎక్కువ. అప్పటికే 70-80 ఏళ్లుగా ప్రాంతంలో ఆదివాసుల పితూరీ, తిరుగుబాట్లు సాగుతున్నాయి. అయినప్పటికీ గురజాడ రచనల్లో ఆదివాసులు కనిపించరు. అలాగే, విజయనగరం పరిసరాల్లో చెరుకు ఫ్యాక్టరీలు వచ్చాయి. ఆధునిక కార్మికులు తయారయ్యారు. వీరి గురించీ గురజాడ రచనల్లో ప్రస్తావన లేదు. గురజాడ ఉద్దేశ్యపూర్వకంగానే రెండు సమూహాలను వదిలేశాడా? లేక యాదృఛ్ఛికంగా అలా జరిగిందా? మనకు తెలీదు.  

ఇలాంటి  పరిమితుల్ని గురజాడ ఒక్కని మీద మాత్రమే వేసి వదిలేయడం తప్పు. ముందే చెప్పినట్టు పరిమితులనేవి అందరికీ వుంటాయి. ఆధునిక భారత ముస్లిం సంస్కర్తగా భావించే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మీద కూడ ఇలాంటి విమర్శ ఒకటుంది. ఆయన స్థాపించిన అలీగడ్ ముస్లిం యూనివర్శిటీ ఆరంభ దశలో  అష్రాఫ్ (ఓసి) ముస్లింలను మాత్రమే ప్రోత్సహించారనీ, అజ్లాఫ్, అర్జాల్, పస్మందా (బిసి) ముస్లింలను నిర్లక్ష్యం చేశారనీ ఒక విమర్శవుంది. అయితే, తరువాతి కాలంలో క్యాప్ను తీసేసి  అలీగడ్ ముస్లిం యూనివర్శిటీలో అందరికీ అవకాశాలు కల్పించారు.

 న్యాయం, స్వేచ్చా, సమానత్వం, సోదరభావాలను భారత రాజ్యాంగం ఆదర్శాలుగా పొదిగిన బాబా సాహెబ్ అంబేడ్కర్ మీద కూడ కొన్ని సమూహాలకు కొన్ని రకాల  అసంతృప్తులు వున్నాయిఆయనమహర్ రెజిమెంట్’  పునరుధ్ధరణ కోసం కోసం పోరాడారుగానీచామర్ రెంజిమెంట్పునరుధ్ధరణను  గట్టిగా కోరలేదనేవారూ కొందరు వున్నారు. నిజానికి అంబేడ్కర్ సంస్కరణలవల్ల మాల సామాజికవర్గమేగాక మాదిగ సామాజికవర్గం కూడ గొప్పగా లబ్దిపొందింది అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఇంకా చెప్పాలంటే దేశంలో ప్రజాస్వామిక సమూహాలన్నింటికీ అంబేడ్కర్ కృషి వల్ల చాలా మేలు జరిగింది. 

గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య  ఏడాది గురజాడ పురస్కారాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం మీద తెలుగు సోషల్ మీడియాలో  ఒక  వివాదం గట్టిగానే సాగింది. ఆధునికుడయిన గురజాడ పేరిట ఇచ్చే అవార్డును ఛాందసులుగా ముద్రపడిన చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడం తగదని కొందరు వాదిస్తే, అసలు గురజాడ తమ సామాజికవర్గం గురించి, తమ సంస్కృతి గురించీ పట్టించుకోని ఛాందసునిగా ఇంకో సమూహం వాదించింది

మనకు తెలియాల్సింది ఏమంటే గురజాడ వేరు; గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య  వేరుగురజాడ ఛాందసుల్ని విమర్శించాడు; గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య  ఛాందసుల్ని అభిమానిస్తోంది. మనకు గురజాడ తోనే పని, పడేరహనేదో గురజాడ సాహితీ సాంస్కృతిక సమాఖ్య  అండ్ చాగంటి కోటేశ్వరరావు

3 డిసెంబరు 2022