Wednesday, 13 December 2023

Only Two Speakers per One Crore Population. Save the Speakers !

 Only Two  Speakers per One Crore Population. Save the Speakers ! 

కోటి మందికి ఇద్దరు వక్తలు మాత్రమే వున్నారు!

వాళ్ళను జాగ్రత్తగా చూసుకోండి!

 

మీటింగులు పెట్టే వాళ్ళకు చాలా కష్టాలు వుంటాయి. సమాజం చెడిపోతున్నదనీ, ఒకనాటి ఉద్యమ అభిమానులు దారి తప్పుతున్నారనీ వాళ్ళు ఆవేదన చెందుతుంటారు. ఎదైనా కరెంట్ టాపిక్ మీద మీటింగు పెట్టి, ఓ మంచి వక్తను పిలిపించి ఉపన్యాసం ఇప్పిస్తే కొంచెం మార్పు వస్తుందని వాళ్ళు తపిస్తుంటారు.

 

 అయితే, ఇది అంత సులువుకాదు.  కరెంట్ టాపిక్ ఎంచుకోవాలి. హాలు బుక్ చేయాలి. ప్రస్తుతం కొంచెం వెలుగులో వున్నవాళ్లలో ఒకర్ని స్పీకర్ గా ఎంచుకోవాలి. జనాన్ని పిలవాలి. ఓ వారం పది రోజులు చాలా ఉత్కంఠ, ఆందోళన వుంటుంది. నాలుగైదు వేల రూపాయలు సులువుగా ఖర్చు అవుతుంది. దానికి దాతల్ని పట్టుకోవాలి.  సభను ఏసీ హాలులో పెడితే ఖర్చు రెట్టింపు అవుతుంది. స్నాక్స్, భోజనం పెడితే అది అదనపు ఖర్చు. ఇది గాక మెయిన్ స్పీకర్లకు ప్రయాణ ఖర్చులు, విడిది ఏర్పాట్లూ చూడాలి.

 

అలాగే, స్పీకర్లకూ వాళ్ళ ఇబ్బందులు వారికుంటాయి.

 

ఈమధ్య నన్ను మీటింగులకు పిలిచేవాళ్ళు ఎక్కువయ్యారు. వాటిని ఒప్పుకోవడంలో చాలా ఇబ్బందులున్నాయి.

 

ఓ ముఫ్ఫయి ఏళ్ల క్రితం అయితే రైలు జనరల్ కంపార్టుమెంటులో విజయవాడ నుండి కలకత్తాకు అక్కడి నుండి  పాట్నాకు వెళ్ళి బహిరంగ సభల్లో హిందీ ప్రసంగాలు చేసేవాడిని.  ప్రయాణ ఖర్చులు కూడ ట్రైన్ బయలుదేరే సమయానికి చేతిలో పడేవి. అంత వరకు ఒక ఉత్కంఠ. ఐదారు గంటలు నిలబడి ప్రయాణం చేస్తేనేగానీ కూర్చోవడానికి సీటు దొరికేదికాదు. మరోవైపు,  ఓ పదిమంది బృందం వుండి దగ్గర ఊర్లయితే టిక్కెట్టు లేకుండానే ప్రయాణించేసేసే వాళ్లం. ఇంటిఉ నుండి రైల్వేస్టేషన్ కూ, రైల్వేస్టేషన్  నుండి ఇంటికీ  మాట్లాడుకుంటూ నడిచి వచ్చేసేవాళ్ళం. కొన్ని మీటింగుల మీద పోలీసుల  లాఠీచార్జి జరిగేది. తప్పించుకోవడానికి గోడలు దూకేసేవాళ్ళం. ఒక్కోసారి టిక్కెట్ లేస్ ట్రావెలర్స్ గా అరెస్టులు చేసేవారు. అప్పట్లో టీసీలు మంచివారు. కాస్సేపు కోర్చోబెట్టి వదిలేసేవారు.  ఇప్పుడు ఆ కాలం పోయింది. టీసీలు  మారిపోయారు. మన శరీరాల్లో మునుపటి శక్తీ పోయింది. 

 

ఎప్పుడయినా ఒక  బర్నింగ్ సోషల్ పొలిటికల్ టాపిక్ మీద మాట్లాడడం నాకు ఇష్టం. పుస్తకాలకు ముందు మాటలు రాయడం మీద నాకు ఆసక్తి లేదు. ఇన్నేళ్ళలో ఓ రెండు పుస్తకాలకు మాత్రమే నేను ముందు మాటలు రాశాను. అరుదుగాతప్ప, పుస్తకావిష్కరణ సభల్లో ప్రసంగించడం నాకు అంతగా నచ్చదు. ఎందుకంటే, వాటిల్లో ఆల్ పాజిటివ్ అంశాలే మాట్లాడాలనీ, రాయాలనీ రచయితలు ఆశిస్తారు. అది కోరుకోవడంకాదు; అది పైకి చెప్పని  ఒక ఆంక్ష.

 

జేమ్స్ జాయిస్ ‘యుల్లిసిస్’ కన్నా, హెచ్ జీ వేల్స్ ‘1984’ కన్నా ఇదే గొప్ప రచన అంటేనే వారికి సంతృప్తి కలుగుతుంది. లోపాలను మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు. Christopher Caudwell లా "H. G. Wells: A Study in Utopianism", "George Bernard Shaw: A Study of the Bourgeois Superman" వంటి వ్యాసాలు రాస్తే సదరు రచయితలు అసహనంతో రగిలిపోతారు. తమ రాజ్యంలో సదరు సాహిత్య విమర్శకుడు మళ్ళీ వేదిక ఎక్కకుండ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా సెంటిమెంట్లను ప్రయోగించడానికి కూడ వెనుకాడరు.

 

మరోవైపు, తెలుగులో సాహిత్య విమర్శ పెరగలేదని చాలామంది అంటుంటారు. నా గురువుగారైన త్రిపురనేని మధుసూదనరావుగారు పుస్తక సమీక్ష వేరు; సాహిత్య విమర్శ వేరు అనేవారు.  ప్రచురణకర్తలు పుస్తకాలను అమ్ముకోవడానికి వాటిల్లోని మంచి వాక్యాలను వెనుక అట్ట మీద వేస్తారు. కొన్ని పత్రికల్లోనూ సమీక్షలు రాయించుకుంటారు. సాహిత్య విమర్శ అంతకన్నా పెద్ద పని చేయాలి. సమాజ విమర్శే సాహిత్య విమర్శ. అది “సాహిత్యంలో వర్గపోరాటం” అనేవారు.

 

పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గిపోతున్నారంటే రచనల్లో క్వాలిటీ లేకపోవడమే కారణమని అంటే చాలామంది అంగీకరించరు. పైగా, మార్క్సిస్టులు రాసే సీరియస్ స్టఫ్ కు తెలుగులో పాఠకులు మరీ తక్కువ. ఆపైన, ఈ కొద్దిమందిలోనూ పార్టీలు, గ్రూపులు వంటి  శాఖాబేధాలుంటాయి.  ఒక్క అక్షరం తేడా వచ్చినా వర్గపోరాటం జరిగిపోతుంది.

 

ఏదో ఒ సందర్భలో పెట్టే సభల్లో పదిమందిలో మనమూ ఒక వక్త అయితే ఉన్నఫళంగా (haphazard) ప్రాప్తకాలజ్ఞత (spontaneity)ను వుపయోగించి ఏవో పది వాక్యాలు ఓ ఐదారు నిముషాలు మాట్లాడేయవచ్చు. కానీ, ఒక ప్రత్యేక అంశం మీద ఓ అరగంట మాట్లాడాలంటే కనీసం మూడు నాలుగు రోజులు ఆ అంశం గురించి రివిజన్ చేసుకోవాలి. క్లాసు చెప్పాలంటే ఇంకా శ్రమ్పడాలి.  పుస్తకావిష్కరణ సభ అయితే ముందు దాన్ని  చదవాలి. బయటి ఊరయితే ఇంకో రెండు రోజులు రానూ పోనూ ప్రయాణాలు చేయాలి. మొత్తం ఐదురోజులు. ఇది సమయానికి సంబందించిన విషయం.

 

ఆపైన ఆర్ధిక సమస్యలూ వుంటాయి.  కార్యక్రమానికి ముందు రోజున నేను ఎక్కడ వుంటానో నాకే తెలియదు. గత కొంత కాలంగా నేను పది రోజులు విజయవాడలో, పది రోజులు హైదరాబాద్ లో  వుంటున్నాను. నేను విజయవాడలో వుంటాననుకొని విజయవాడ,  గుంటూరు వాళ్ళు పిలుస్తారు. అప్పుడు నేను హైదరాబాద్లో వుంటాను. హైదరాబాద్ లో వుంటాననుకొని అక్కడి వాళ్ళు పిలుస్తుంటారు. అప్పుడు నేను ఎక్కడో ఇంకోచోట వుండవచ్చు.

 

నెల రోజులు ముందుగా ప్లాన్ చేసుకుంటే తప్ప రైలు ప్రయాణం కుదిరేలా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రయాణానికి రానూపోనూ ఏసి బస్ ఫేర్, క్యాబ్స్ చార్జీలు కలిపి మూడువేల రూపాయలు అవుతాయి. నేను ఏదైన సిటీకి వచ్చినపుడు నన్ను కలవడానికి కొందరు స్థానిక మిత్రులు, సాహిత్య అభిమానులు  వస్తారు. విడిది దానికి అనువుగా వుండాలి. లాడ్జింగ్ బోర్డింగ్ లకు ఇంకో రెండు వేల రూపాయలు సులువుగా అవుతాయి. అంటే, మొత్తం ఐదు వేల రూపాయలు.

 

కొందరు ఈ అమౌంట్ ను ముందుగానే నా బ్యాంకు అకౌంట్ లో వేస్తున్నారు. కొందరు 3 వేల రూపాయలు నా  బ్యాంకు అకౌంట్ లో వేసి, హోటల్, భోజనం వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం. కొందరు ప్రయాణ ఖర్చులు ఇస్తున్నారు; వసతి ఏర్పాటు చేయడం లేదు. ఇంకొందరు రెండూ చేయడంలేదు. ఆపాటి దానికోసం మూడు నాలుగు రోజులు శ్రమించి, జేబులో డబ్బులు వేసుకుని వెళ్ళి ప్రసంగించాలా? అనిపిస్తుంది.

 

నాకేమీ స్వంతానికి డబ్బులు వద్దు; మెరుగైన లాజిస్టిక్స్ ఏర్పాటు చేయండి  చాలూ అన్నా కొందరు సిధ్ధంగా లేరు. నేనే ఖర్చులు పెట్టుకుని వెళ్ళేంత ఆసక్తి గానీ ఆదాయంగానీ నాకు లేవు.

 

ఈ మధ్య ఒక పట్టణంలో ఒకరు మీటింగుకు పిలిచారు. వాళ్ళు ప్రయాణ ఖర్చులు ఇచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వుంచారు. కనీసం  వాష్ రూం కూడ ఏర్పాటు చేయలేదు. ఆరుబయలు పొమ్మన్నారు. ఆ అరుబయల్లో స్త్రీలు ఆ పని కానిస్తున్నారు.   

 

ఇప్పుడు నేనేమయినా 1980ల నాటి హోల్ టైమర్ నా? ఆరోగ్యం, భోజనం విషయాల్లో నేను అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేస్తాను. ఎండగా వుంటే మధ్యాహ్నం కూడ స్నానం చేస్తాను. దీర్ఘ కాలంగా సివోపిడి  (వుబ్బసం)తో బాఢపడుతున్న  కారణంగా నా ప్రసంగానికి ముందు కొన్ని శ్వాసకోశ  వ్యాయామాలు చేయాలి. వేడి నీళ్ళ స్నానం చేయాలి. వెచ్చని నీటిలో ఉప్పు కలిపి గార్గిలింగ్ చేయాలి. లేకుంటే గొంతు పెగలదు. నేను ప్రధాన వక్తగా వుండే ప్రతి సభకూ మంచి ఫీల్ కోసం కొత్త బట్టలు వేసుకుంటాను. నాకు అదో అదనపు ఖర్చు.

 

నేను టాకింక్ పాయింట్స్ రాసుకుని ప్రింటెడ్ కాపీతో ఫుల్లీ ఎక్యూప్డ్ గా ఉపన్యసించడానికి వస్తాను. తప్పని సరిగా పోడియం, స్టాండ్ మైక్ వుండాలి. లేకుంటే ఒక చేతిలో ప్రింట్ అవుట్లు, ఇంకో చేతిలో మైకు ఇస్తే  చేతుల్ని కట్టిపడేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. నాలుగు రోజుల కష్టం కనుక దానికి గుర్తుగా వీడియో క్లిప్ వుండాలి అనుకుంటాను.   

 

చాలా మంది వీటిని అస్సలు పట్టించుకోరు. పట్టించుకోండి ప్లీజ్  అంటే “మీరు మారిపోయారు సార్!” అంటారు నిందా పూర్వకంగా. అవును నేను మారిపోయాను. కాదన్నదెవరూ? అప్పుడు నా వయస్సు 27. ఇప్పుడు దాన్ని తిరగెయ్యాలి. కాలం అంతగా మారిపోయింది.  

 

ఉద్యమాలను అధ్యయనం చేయడానికి నేను సుదూర ప్రాంతాలకు కూడ పోతుంటాను. అప్పుడూ భారీగానే ప్రయాణ ఖర్చులు అవుతుంటాయి. అవి నా ఆసక్తికి సంబంధించిన అంశం.  అప్పుడు అన్ని రకాల కష్టాలు పడడానికి నేను మానసికంగా సిధ్ధంగా వుంటాను. ఆ ప్రయాణాల కోసం ముందుగా డబ్బులు పోగేసుకుంటాను. కొన్ని సందర్భాలలో కొందరు మిత్రులు కొంత కాంట్రిబ్యూట్ కూడ చేస్తారు. కొందరు మిత్రులు లాజిస్టిక్స్ ఏర్పాట్లూ చేస్తారు. ఇటీవల నేను మణిపూర్ బాధితుల్ని పరామర్శించడానికి ఐజ్వాల్ వెళ్ళినప్పుడు స్థానిక లాజిస్టిక్స్ వడ్డే జయచంద్ర ఏర్పాటు చేశారు. విమానయాన ఖర్చుల్ని ఫేస్ బుక్ ఫ్రెండ్ ఒకామె పెట్టుకుంది.

 

అనేక సభల్లో అనేక ప్రసంగాలు చేసేశాను; అనేక అంశాల మీద అనేక వ్యాసాలు రాసేశాను. ప్రస్తుతం నాకయితే మీటింగుల్లో ప్రసంగించాలనే వ్యక్తిగత ఆసక్తి ఏమాత్రం లేదు. సభల్లో వేదిక కింద ప్రేక్షకుడిగా వుండి కొత్తవాళ్ళ ప్రసంగాలు వినడం ఇష్టంగా వుంటోంది.  

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సామాజిక అంశాల మీద మాట్లాడే   మంచి వక్తలు అనదగ్గవాళ్ళు ఓ 20 మంది కూడ వుండరు.  కోటి మందికి ఇద్దరు స్పీకర్లు అన్నమాట. వాళ్ళనయినా కొంచెం కంఫర్ట్ జోన్ లో వుంచండి. స్పీకర్లకు కనీస లాజిస్టిక్స్ ను సమకూర్చడం కూడ అలవాటు చేసుకోవాలని మాత్రమే సభల నిర్వాహకులకు నా మనవి. 

 

11 డిసెంబరు 2023

No comments:

Post a Comment