Tuesday, 2 April 2024

Happy Birthday Arun!

 

హ్యాపీ బర్త్ డే అరుణ్ !

           

 

మీ పెద్దబ్బాయి (అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి)కి ఇంతటి టెక్నికల్  నాలెడ్జి ఎక్కడి నుండి వచ్చిందని సినీరంగానికి చెందినవారు చాలామంది నన్ను అడుగుతుంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడుగా అంటుంటాను. అలా కొన్ని లక్షల మంది పాసయ్యారు. కానీ, మీవాడు చాలా స్పెషల్ అంటుంటే ఎందుకోగానీ నాకు మా అబ్బా గుర్తుకొస్తారు.

 

మానాన్న గొప్ప మెకానిక్. పాడైపోయిన యంత్రాలను మెకానిక్కులు బాగు చేస్తారు. అది సాధారణ విషయం.  మా అబ్బా అక్కడితో ఆగేవారుకాదు. అప్పట్లో ఇనుము కొరత కారణంగా కొత్త యంత్రాలు దొరికేవికావు. మా అబ్బా అనేక యంత్రాలను ప్రతిసృష్టి చేసేసేవారు. మొదటితరం యంత్రాలతో ఒక ఆట ఆడుకునేవారు. స్టేట్ జాబర్ హ్యాండ్ ప్రింటింగ్ మిషిన్ ను థ్రెడిల్ గా మార్చేస్తే ప్రింటింగ్ ప్రెస్సులవాళ్లు అనేకమంది మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవారు. ఆయన చేతుల్లో ఏదో మ్యాజిక్ వంటిది వుండేది. షీటు పట్టుకుని గేజ్ చెప్పేసేవారు. తీగ వంచి టెంపర్ చెప్పేసేవారు.

 

నాటి యంత్రాలన్నా, నేటి కంప్యూటర్లన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్సితో కూడ తంటాలు పడుతున్నాను. మన కాలపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నిరంతరం అప్ డేట్ గా వుండాలి.

నిజానికి మా నాన్నతోపాటూ నేనూ మెకానిక్ అయ్యుండాల్సింది. మా అమ్మీ పడనివ్వలేదు. బాగా చదువుకుని, చొక్కాను ప్యాంటు లోపలికి దోపుకుని, బూటూ, టై పెట్టుకుని ఇంగ్లీషు మాట్లాడాలి అని ఆదేశించింది.  మా అమ్మీ వాళ్ళ నాన్న ఆ రోజుల్లో ఇంగ్లీషు మాట్లాడేవాడట. నన్నూ అలా చూడాలని ఆమె కోరిక.

 

మా పెద్దాడు ఇంజినీరింగ్ పూర్తిచేశాక డెల్, సత్యం కంప్యూటర్స్, నిపుణ వంటి పెద్ద సంస్థల్లో పనిచేశాడు. వాడి జీతం నా జీతంకన్నా మూడు రెట్లు ఎక్కువగా వుండేది. హఠాత్తుగా ఓ రోజు ఉద్యోగం మానేస్తున్నానని చెప్పాడు. వాడి జీవితం నా జీవితం అంత రొమాంటిక్ గా లేదట!. రొటీన్ గా, విసుగ్గా వుంటున్నదన్నాడు. నేను కాదనలేదు. వోలటైల్ రంగంగా పేరుగాంచిన సినిమా రంగానికి వెళతానన్నాడు. దాన్నీ కాదన లేదు.

 

“నీకు ఎలా జీవించాలని వుంటే అలా జీవించు. ఏ రంగంలో అయినా సరే సాధనతోనే నైపుణ్యం వస్తుంది. ఒక నిబధ్ధతతో నిరంతరం సాధన చేస్తుంటే ఏ రంగంలో అయినాసరే తప్పక విజయం లభిస్తుంది” అన్నాను. నిజానికి ఈ మాటలు నావికావు. 1970ల మొదట్లో మానాన్న నాతో అన్న మాటలివి.  నేను కాలేజీ చదువు మీద ఆసక్తిని కోల్పోయి పాఠ్యపుస్తకాలు పక్కన పడేసి ఇతర పుస్తకాలు చదువుతూ, నాటకాలు వేస్తూ  రాస్తూ, స్టీల్ ఫ్యాక్టరీ, జై ఆంధ్రా ఉద్యమాలంటూ  తిరుగుతున్నప్పుడు మా అమ్మ చాలా పెద్ద తగువు పెట్టుకుంది. అప్పుడు మానాన్న నా పక్షాన నిలబడ్డారు. ఏదైతే ఏముందీ? ఏ రంగంలో అయినాసరే గొప్పవాళ్ళు కావడమే ముఖ్యం అన్నారు.

 

నా ముందుతరంవాళ్ళే నాకు అంతగా నైతిక మద్దతు ఇచ్చినపుడు నేను నా తరువాతి తరానికి అడ్డం కాకూడదనుకున్నాను. ఈ గొప్పతనమూ నాది కాదు; మానాన్నది. నేను కేవలం ఒక సాంప్రదాయాన్ని కొనసాగించాను. మానాన్న చెప్పిన మాటల్ని నా కొడుకులకు అప్పచెప్పాను.

 

ఒక విధంగా అరుణ్ కు గ్రాఫిక్స్ మీద ఆసక్తిని కలిగించింది వాడి తల్లి అజిత. అరుణ్ కు చిన్నతనంలోనే బొమ్మలి గీసే ఆసక్తి వుంది.  వాడికి చాలా చిన్న వయసులో అజిత ఫొటో షాప్ నేర్పింది.  వాడిప్పుడు VFX సూపర్ వైజర్ స్థాయికి ఎదిగాడు. VFX స్టూడియో ప్రమోటర్ కూడ అయ్యాడు.

 

ముందు శ్రీ ప్రకాష్ అనే ఓ అంతర్జాతీయ స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ దగ్గర  పనిచేశాడు. కమల్ హాసన్ ‘ఈనాడు’ “ఉన్నైపోలు ఒరువన్’ తో సినిమా కెమేరా – ఎడిటింగ్  విభాగంలో చేరాడు. ఆ సినిమాకు ఒక ప్రత్యేకత వుంది. ఇండియాలో తొలిసారిగా డిజిటల్ (రెడ్) కెమేరాను వాడారు. అలా వాడు సినిమాలకు డిజిటల్ కెమేరాను వాడిన తొలి భారతీయుడు అయ్యాడు. అదో రికార్డు. ఇప్పటికీ చాలామంది తనను ‘రెడ్ అరుణ్’ అంటారు. తన రెండో సినిమా నాగార్జున ‘గగనం’. ఆ సినిమాకు డిజిటల్ టెక్నాలజీ సూపర్ వైజర్ గా పనిచేశాడు. తన పనితనానికి చాలా పేరొచ్చింది.

 

చాలా తక్కువ వయస్సులో ఎక్కువ పేరు వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. వాడికీ అలాంటి ఇబ్బందులొచ్చాయి. వాడికి రెగ్యులర్ డిఓపిగా పనిచేయడం ఇష్టం వుండదు.  ఎప్పుడూ కొత్తగా పనిచేయాలనుకుంటాడు. ప్రయోగాలంటే చాలా ఇష్టం. కష్టకాలంలోనూ సాంకేతిక ప్రయోగాలు ఆపలేదు. ప్రయోగాల్లో డబ్బు ఖర్చు మాత్రమే కాకుండా కొన్ని ప్రమాదాల్లో   ప్రాణాపాయాలు సహితం తెచ్చుకున్నాడు.  భారతదేశానికి డ్రోన్లు రాని రోజుల్లో స్వయంగా డ్రోన్ తయారు చేసి ‘ఆగడు’ సినిమాలో వాడాడు. అమరావతి కన్ స్ట్రక్షన్ ‘టైమ్ లాప్స్ వీడియో’ తీసిందీ వాడే.  ‘ఫిదా’ సినిమాలో వాడు తీసిన కొన్ని షాట్లకు మంచి పేరొచ్చింది.

 

రాంగోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’లో ప్రయోగాత్మకంగా వాడు తీసిన ‘ఫ్లో క్యామ్ షాట్’ సినిమాటోగ్రఫీని ఒక మెట్టు పెంచింది. ఇప్పటికీ అలాంటి షాట్లను ‘అరుణ్ షాట్’ అంటారు. సాధారణంగా ఎవ్వరినీ మెచ్చుకోని ఆర్జీవి ఒక మీడియా సమావేశంలో అరుణ్ ను చాలా మెచ్చుకున్నారు. (థ్యాంక్స్ సర్!)

 

తరువాత హాలివుడ్ కు వెళ్ళి మోషన్ క్యాప్చరింగ్ మీద దృష్టి పెట్టాడు. బాలివుడ్ లో కొన్ని సినిమాలకు పనిచేశాడు. కొన్ని సినిమాలకు VFX సూపర్ వైజర్ గా పనిచేయడమేగాక హైదరాబాద్ లో  VFX స్టూడియోను సెటప్ చేసుకున్నాడు. ఓ భారీ బడ్జెట్  తెలుగు సినిమాకు VFX  సూపర్ వైజర్ గా ఇటీవల న్యూజిలాండ్ లో ఓ నాలుగు నెలలు పనిచేసి వచ్చాడు. ఓ భారీ బాలివుడ్ సినిమాకు నెల రోజులుగా డెహ్రాడూన్ లో పనిచేస్తున్నాడు.

 

ఈ రోజు వాడి బర్త్ డే.

 

హ్యాపీ బర్త్ డే అరుణ్ !

Monday, 1 April 2024

The real Controversy is Gujarati Crony Democracy!

 *The real Controversy is Gujarati Crony Democracy!*

*అసలు సమస్య ఆశ్రిత గుజరాతీవాదం!* 

(నా వ్యాసం 'అసలు సమస్య ఆశ్రిత గుజరాతీవాదం!'  ను ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. పత్రికాధిపతులకు, ఎడిటర్ కు, ఎడిట్ పేజీ నిర్వాహకులకు ధన్యవాదాలు. 

ఎడిట్ పేజీ ఆర్టికల్స్ లో స్థలాభావంవల్ల ఒకటి రెండు పేరాల్ని తగ్గించడం సహజం. పూర్తి వ్యాసం చదవాలనుకునేవారు ఇక్కడ చదువుకోవచ్చు.) 

-        -  ఉష ఎస్ డానీ 

*అసలు సమస్య ఆశ్రిత గుజరాతీవాదం!* 



మన జాతీయ రాజకీయాల్లో ‘ప్రాదేశిక జాతీయవాదం’  ‘సాంస్కృతిక జాతీయవాదం’ అనేవి ప్రధాన చర్చనీయాంశాలు. 

ఆధునిక భారతదేశ రాజకీయ పరిణామాలకు పునాది 1857. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా  భారత స్వాతంత్ర్య ప్రధమ పోరాటం సాగిన సంవత్సరమది. ఆ పోరాటం విజయవంతం కాకపోయినప్పటికీ, సామాజికరంగంలో అదొక కొత్త సమీకరణల్ని ముందుకు తీసుకుని వచ్చింది. బ్రిటీష్ వలస వ్యతిరేకపోరాట కాలంలో హిందూ ముస్లీంల మధ్య ప్రగాఢ ఐక్యత ఏర్పడింది. ప్రాదేశిక జాతీయవాదం (Territorial Nationalism) అనే భావన చాలా బలంగా ముందుకు వచ్చింది. భారతదేశ సరిహద్దుల లోపల నివశించేవారందరూ ఒకే జాతి అనేది దీని సారాంశం. దాని పేరు భారతజాతి / హిందూజాతి. 

హిందూ ముస్లిం సమూహాలు భారీ సంఖ్యలో  ఢిల్లీ ఎర్రకోట ముందు నిలబడి, 80 యేళ్ళు దాటిన  వృధ్ధ చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్ ను స్వాతంత్ర్య ఉద్యమంలో తమకు నాయకత్వం వహించమని ముక్తకంఠంతో కోరడం ఒక గొప్ప చారిత్రాత్మక  ఘట్టం. ప్రజల కోరిక మేరకు జాఫర్ ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అందుకు శిక్షగా  రంగూన్ లో హౌస్ అరెస్టులో వుండి 1862లో చనిపోయాడు.  ఆ తరువాత ఆరంభమయిన జాతియోద్యమం భారత స్వాతంత్ర్య ప్రధమ పోరాటం నుండి  ‘ప్రాదేశిక జాతీయవాదం’ను ఆదర్శంగా స్వీకరించింది. 

యూరప్ ఖండంలో ఒక క్రమపధ్ధతిలో  భాషా ప్రయుక్త దేశాలు (Linguistic countries) ఏర్పడ్డాయి. భారతదేశ భౌగోళిక సామాజిక స్థితిగతులు  యూరప్ కు భిన్నం.  భారత రాజ్యాంగపు 8వ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు నిచ్చింది. అలా గుర్తింపు పొందని భాషలు దేశంలో వందకు పైగా   వుంటాయని అంచనా. 

1947 ఆగస్టు 15న దేశానికి  స్వాతంత్ర్యం వచ్చాక కూడ అనేక ప్రాంతాలు భారత్ లో చేరాయి. 1947లో జునాగడ్, 1948లో నిజాం సంస్థానం, 1949లో మణిపూర్, కూచ్ బిహార్, త్రిపుర, 1954లో ఫ్రెంచ్ కాలనీలైన   పాండుచెర్రి, కారైకోల్, మహె, యానాం, అదే ఏడాది పోర్చుగీసు కాలనీలైన దాద్రా, నగర్ హవేలీ,  1961లో మరో పోర్చుగీసు కాలనీలయిన గోవా, డయ్యూ, డామన్, అంతిమంగా  1975లో సిక్కీం భారత్ లో చేరాయి.    

గతంలొ ఎవరు ఎక్కడ నివాసంవున్నా ప్రస్తుతం భారతదేశంలో విలీనమై నివశిస్తున్నారు కనుక వీరందరూ భారతీయులే అనేది ప్రాదేశిక జాతీయవాదం అవగాహన. భారతదేశం ఒక ఉపఖండం. ఇక్కడ  భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడే అవకాశాలు మాత్రమే వుంటాయిగానీ, యూరప్ లా భాషా ప్రయుక్త దేశం అయ్యే అవకాశాలు లేవు. పాకిస్తాన్ ను  ఉర్దూ భాషా ప్రయుక్త దేశంగా మార్చాలనుకున్నప్పుడు ఆ దేశం రెండు ముక్కలయింది. భాషా ప్రాతిపదికగా  ఇప్పుడు మరిన్ని ముక్కలు అవ్వడానికి సిధ్ధంగావుంది. 

ఉర్దూ మహాకవి ముహమ్మద్‍ అల్లమా ఇక్బాల్  1904లో ‘సారే జహా సే అఛ్ఛా హిందూసితా హమారా’ (ప్రపంచంలో మహోన్నతమైనది మన హిందూదేశము) అనే పల్లవితో  సుప్రసిధ్ధ జాతీయ గీతాన్ని రాశారు. అందులోని ఒక చరణంలో “మనం హిందువులం మనది హిందూదేశము” (హింద్వీ హై హమ్ – వతన్ హై హిందూస్తాన్ హమారా”) అంటారు. ఇందులోని హిందూ, హిందూస్తాన్, వగయిరా పదాల్ని  ప్రాదేశిక జాతీయవాద దృక్పథంతో రాశారు. ఇప్పుడు హిందూమతంగా ప్రచారంలో వున్నది అప్పట్లో సనాతనధర్మం పేరుతో వుండేది. హిందూ పదం జాతి పేరుగా  వుండేది. ప్రాదేశిక జాతీయవాదం ప్రకారం దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు సహా అందరూ హిందువులే! 

వినాయక్ దామోదర్ సావర్కర్ 1922లో ‘హిందూత్వ ఆవశ్యకతలు’ పేరుతో ఒక సిధ్ధాంత గ్రంధాన్ని రాశారు. దీన్ని 1923లో ‘హిందూత్వ – హిందువు అంటే ఎవరూ?’ అనే పేరుతో   ప్రచురించారు. సావర్కర్  పుస్తకానికి రెండు ప్రత్యేకతలున్నాయి. మొదటిది; హిందూ పదానికి ప్రాదేశిక అర్ధాన్ని తొలగించి మతపరమైన  అర్ధాన్ని ఇచ్చారు.  రెండోది; హిందూమత సమూహపు రాజకీయార్ధిక సాంస్కృతిక ఆధిపత్యాన్ని సూచించడానికి ‘హిందూత్వ’ అనే కొత్త పదాన్ని ప్రయోగించారు.   

హిందువుల్ని విమర్శించడానికి  ‘హిందువేతరులు’ ‘హిందూత్వ’ అంటున్నారని మనలో చాలామంది తరచూ అపోహ పడుతుంటారు. నిజానికి ఆ పదం సావర్కర్ స్వీయసృష్టి. అక్కడి నుండి మన రాజకీయాల్లో సాంస్కృతిక జాతీయవాదం (Cultural Nationalism) ప్రవేశించింది. హిందూమత ప్రాతిపదికగా జాతి నిర్మాణం దీని లక్ష్యం. అంచేత దీన్ని హిందూజాతీయవాదం అనవచ్చు. 

సావర్కర్ ప్రతిపాదించిన ద్విజాతి సిధ్ధాంతం, హిందూ జాతీయవాదం  ప్రేరణతో హిందువులకు రాజ్యాధికారాన్ని సాధించే లక్ష్యంతో 1925లో ఆరెస్సెస్ ఏర్పడింది. ఆ సంస్థ రెండవ సర్సంగ్ ఛాలక్ గురూజీ ఎంఎస్  గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే గ్రంధంలో హిందూదేశానికి మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో స్పష్టంగా వివరించారు. తలనుండి పుట్టినా, ఛాతీ నుండి పుట్టినా, ఉదరభాగం నుండి పుట్టినా కాళ్ళ నుండి పుట్టినా  నాలుగు వర్ణాలూ ఒకే విరాట్ పురుషుని దేహం నుండి పుట్టాయి కనుక అవన్నీ పవిత్రమైనవి సమానమైనవి అనేది వారి వివరణ.  వర్ణాల్లో ఒకటి ఎక్కువ అనీ మరొకటి తక్కువ అని భావించడం, హిందూ సమాజంలో నిచ్చెనమెట్ల వ్యవస్థ వుందని చెప్పడం తప్పు అంటూ వారు హిందూ ఐక్యతను బోధించారు.  

మరోవైపు, ముస్లింలు భారతదేశంలో పుట్టి, ఇక్కడే బతికి, ఇక్కడే చనిపోయినా  భారతదేశం వారికి   పితృభూమి, కర్మభూమి మాత్రమే కాగలదుగానీ పుణ్యభూమి మాత్రం కాదు. కాబట్టి వారు “అన్యులు” అనేది గోల్వాల్కర్  సూత్రీకరణ. ఇదే ప్రమాణం క్రైస్తవులు, కమ్యూనిస్టులకు కూడ వర్తిస్తుందని వారొక సిధ్ధాంతాన్ని అభివృధ్ధి చేశారు. వారు అక్కడితో ఆగకుండ  “ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు హిందూదేశానికి అంతర్గత ముప్పు” అని ప్రకటించారు.  

సమాజంలో వ్యష్టి ప్రయోజనాలని పరిరక్షించాలనే ప్రజాస్వామ్యం,  సమిష్టి ప్రయోజనాలను కాపాడాలనే సామ్యవాదం రెండూ భారత సమాజానికి పనికిరావని ఎంఎస్  గోల్వాల్కర్ ప్రగాఢ అభిప్రాయం. ధనవంతులు-పేదలు, యజమానులు - శ్రామికులు అనే సామాజికార్ధిక  విభజన వారికి నచ్చేదికాదు.  నాలుగు వర్ణాలవారు ఎవరి హక్కుల్నివారు ఆస్వాదిస్తూ, ఎవరి బాధ్యతల్నివారు నిర్వర్తించే వర్ణవ్యవస్థే ప్రపంచంలో నిలిచి వెలుగుతుందని వారు  ప్రవచించారు. 

దేశం బలపడడానికి ఆర్ధిక రంగంలో  హిందూ పెట్టుబడీదారుల్ని ప్రోత్సహించాలనే మాట గోల్వార్కర్ నాటికే వుంది. అయితే, దేశంలో సామ్యవాద భావాలు, కమ్యూనిస్టు పార్టీల ప్రభావం బలంగావున్న కారణంగా అప్పట్లో ఆరెస్సెస్ దాని రాజకీయ విభాగాలయిన జనసంఘ్, బిజెపిలు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. 

1990వ దశకం ఆరంభంలో  తూర్పు యూరప్, రష్యాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు పతనం అయ్యాక, గ్యాట్ ఒప్పందాలు కుదిరాక, సరళీకృత ఆర్ధిక విధానం రంగప్రవేశం చేశాక సంఘపరివారం సాంస్కృతిక జాతీయవాదానికి ఆర్ధిక జాతీయవాదాన్ని జత చేసింది.    ఈ ఘనత అప్పటి బిజెపి అధ్యక్షులు లాల్ కిషన్ అడవాణికి దక్కుతుంది.  ఆ తరువాత దేశంలోని బడా పెట్టుబడిదారీ సంస్థలు ఆరెస్సెస్, బిజెపిలను ప్రోత్సహించడం మొదలెట్టాయి. ఈ ఫార్మూలా రెండు పక్షాలకూ ప్రయోజనకారిగా మారింది. ఇరువురూ ఒక అవగాహనతో ఒకరినొకరు సమర్ధించుకుంటూ ఒకరు ఆర్ధికరంగంలో, మరొకరు రాజకీయ రంగంలో బలపడ్డారు. 

నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీ 2001 చివర్లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక సాంస్కృతిక జాతీయవాదం, ఆర్ధిక జాతీయవాదం కొత్త పుంతలు తొక్కాయి.  నరేంద్ర మోదీజీ చొరవతో గుజరాత్ లో హిందూ జాతీయవాదం గుజరాత్ జాతీయవాదంగా, గుజరాత్  ఆర్ధిక జాతీయవాదంగా కొత్త శక్తిని పుంజుకుంది.  గుజరాత్ మోడల్ నే భారతదేశ మోడల్ గా మార్చడానికి  గుజరాతీ మెగా కార్పొరేట్లు గుజరాత్ ముఖ్యమంత్రిని దేశప్రధానిగా మార్చుకున్నారు. 

మోదీజీ ప్రధాని అయ్యాక గుజరాత్ మెగా కార్పోరేట్లకు భారీ మేళ్ళు జరిగాయన్న అభిప్రాయం బలంగా వుంది. దీనినే చాలామంది ప్రయోజిత పెట్టుబడీదారీ వ్యవస్థ (క్రోనీ కేపిటలిజం) అంటున్నారు. అందుకు భిన్నంగా,  గుజరాత్ మెగా కార్పోరేట్లే తమ ధనబలాన్నీ, మీడియా బలాన్నీ   ప్రయోగించి తమకు అనుకూలురైన మోదీజీని దేశప్రధాని కుర్చీలో కూర్చోబెట్టుకున్నారనే వాదనా వుంది. దీనినే ప్రాయోజిత ప్రజాస్వామ్యం (క్రోనీ డెమోక్రసీ) అంటున్నారు. 

రాజకీయార్ధికరంగాల్లో ఇటీవలి పరిణామాల్ని లోతుగా గమనిస్తే దేశంలో ప్రయోజిత ప్రజాస్వామ్యం కొనసాగుతున్నదనే వాదనకే బలం చేకూరుతోంది. క్రోనీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్థంభాలయిన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థల పనితీరు  ప్రాయోజిత కార్యక్రమాలుగా మారిపోయాయని అర్ధం. క్రోనీ డెమోక్రసీ అనేది కొత్త సిధ్ధాంతం ఏమీకాదు. మనం పెద్దగా పట్టించుకోలేదుగానీ మార్క్సిస్టు మూల సూత్రాల్లోనే ఈ ప్రస్తావన వున్నది. “పెట్టుబడీదారీ వ్యవస్థ తన ప్రయోజనాలకు అనుకూలమైన పార్లమెంటరీ వ్యవస్థను రూపొందించుకున్నది” అని కార్ల్ మార్ల్స్ అన్నాడు.  పెట్టుబడీదారీదారులు  తమ ప్రయోజనాలను నెరవేర్చిపెట్టే రాజకీయ నాయకుల్ని దేశాధినేతలుగా నియమించుకునేందుకు ఇది అవకాశం ఇస్తుంది. గుజరాతీ మెగా కార్పొరేట్లు  తమ ప్రతినిధిని దేశాధినేత స్థానంలో పెట్టుకునే స్థాయికి ఇప్పుడు ఇది అభివృధ్ధి చెందింది. 

ఉత్తర భారతదేశం, దక్షణ భారతదేశాన్ని అణిచివేస్తున్నదనే వాదనలు  గోల్వార్కర్ (1966) నాటికే వున్నాయి. దక్షణాదికి చెందిన ఆది శంకరాచార్యను తాము ఎంతగా గౌరవిస్తున్నారో వారు చాలా వివరంగా చెప్పుకొచ్చారు.  అయినప్పటికీ ఆ వివాదం తరచూ రాజుకుంటూనేవుంది. దక్షణాది ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడా బిజేపి ప్రభుత్వంలేకపోవడం దీనికి ఒక సంకేతం. ఇప్పుడు ఉత్తరాది వ్యతిరేకతతోపాటూ గుజరాతీ వ్యతిరేకత కూడ దేశమంతటా క్రమంగా పుంజుకుంటున్నది.    

ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని సామాజికంగా వెలివేస్తున్నాం, ఆర్ధికంగా అణిచివేస్తున్నాం, రాజకీయంగా దూరంగా పెడుతున్నాం అని చెప్పడం ద్వార  ‘కరడుగట్టిన హిందూత్వవాదుల్ని’ రెచ్చగొట్టే ప్రయత్నాలు సంఘపరివారం నిత్యం చేస్తున్నది. మరోవైపు, అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వార సామరస్య హిందువులను సహితం సంతృప్తిపరచే  ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి ముసుగులు ఎన్ని కప్పినా కేంద్ర ప్రభుత్వ  గుజరాతీ పక్షపాతం ఇప్పుడు అందరికీ స్పష్టంగానే కనిపిస్తున్నది.  జాగ్రత్తగా గమనిస్తే ఉత్తర - దక్షణ వివాదంకన్నా, గుజరాతీ వ్యతిరేక వివాదం దేశంలో వేగంగా రగులుకుంటున్నది. 

ఉషా ఎస్ డానీ

సామాజిక విశ్లేషకులు

9010757776

29 మార్చి 2024 

https://www.andhrajyothy.com/2024/editorial/the-real-problem-is-dependent-gujaratiism-1233954.html 

https://epaper.andhrajyothy.com/Hyderabad?eid=34&edate=02/04/2024&pgid=712081&device=desktop&view=2