Tuesday, 2 April 2024

Happy Birthday Arun!

 

హ్యాపీ బర్త్ డే అరుణ్ !

           

 

మీ పెద్దబ్బాయి (అరుణ్ ఇక్బాల్ ఖాన్ చౌదరి)కి ఇంతటి టెక్నికల్  నాలెడ్జి ఎక్కడి నుండి వచ్చిందని సినీరంగానికి చెందినవారు చాలామంది నన్ను అడుగుతుంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడుగా అంటుంటాను. అలా కొన్ని లక్షల మంది పాసయ్యారు. కానీ, మీవాడు చాలా స్పెషల్ అంటుంటే ఎందుకోగానీ నాకు మా అబ్బా గుర్తుకొస్తారు.

 

మానాన్న గొప్ప మెకానిక్. పాడైపోయిన యంత్రాలను మెకానిక్కులు బాగు చేస్తారు. అది సాధారణ విషయం.  మా అబ్బా అక్కడితో ఆగేవారుకాదు. అప్పట్లో ఇనుము కొరత కారణంగా కొత్త యంత్రాలు దొరికేవికావు. మా అబ్బా అనేక యంత్రాలను ప్రతిసృష్టి చేసేసేవారు. మొదటితరం యంత్రాలతో ఒక ఆట ఆడుకునేవారు. స్టేట్ జాబర్ హ్యాండ్ ప్రింటింగ్ మిషిన్ ను థ్రెడిల్ గా మార్చేస్తే ప్రింటింగ్ ప్రెస్సులవాళ్లు అనేకమంది మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళేవారు. ఆయన చేతుల్లో ఏదో మ్యాజిక్ వంటిది వుండేది. షీటు పట్టుకుని గేజ్ చెప్పేసేవారు. తీగ వంచి టెంపర్ చెప్పేసేవారు.

 

నాటి యంత్రాలన్నా, నేటి కంప్యూటర్లన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్సితో కూడ తంటాలు పడుతున్నాను. మన కాలపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నిరంతరం అప్ డేట్ గా వుండాలి.

నిజానికి మా నాన్నతోపాటూ నేనూ మెకానిక్ అయ్యుండాల్సింది. మా అమ్మీ పడనివ్వలేదు. బాగా చదువుకుని, చొక్కాను ప్యాంటు లోపలికి దోపుకుని, బూటూ, టై పెట్టుకుని ఇంగ్లీషు మాట్లాడాలి అని ఆదేశించింది.  మా అమ్మీ వాళ్ళ నాన్న ఆ రోజుల్లో ఇంగ్లీషు మాట్లాడేవాడట. నన్నూ అలా చూడాలని ఆమె కోరిక.

 

మా పెద్దాడు ఇంజినీరింగ్ పూర్తిచేశాక డెల్, సత్యం కంప్యూటర్స్, నిపుణ వంటి పెద్ద సంస్థల్లో పనిచేశాడు. వాడి జీతం నా జీతంకన్నా మూడు రెట్లు ఎక్కువగా వుండేది. హఠాత్తుగా ఓ రోజు ఉద్యోగం మానేస్తున్నానని చెప్పాడు. వాడి జీవితం నా జీవితం అంత రొమాంటిక్ గా లేదట!. రొటీన్ గా, విసుగ్గా వుంటున్నదన్నాడు. నేను కాదనలేదు. వోలటైల్ రంగంగా పేరుగాంచిన సినిమా రంగానికి వెళతానన్నాడు. దాన్నీ కాదన లేదు.

 

“నీకు ఎలా జీవించాలని వుంటే అలా జీవించు. ఏ రంగంలో అయినా సరే సాధనతోనే నైపుణ్యం వస్తుంది. ఒక నిబధ్ధతతో నిరంతరం సాధన చేస్తుంటే ఏ రంగంలో అయినాసరే తప్పక విజయం లభిస్తుంది” అన్నాను. నిజానికి ఈ మాటలు నావికావు. 1970ల మొదట్లో మానాన్న నాతో అన్న మాటలివి.  నేను కాలేజీ చదువు మీద ఆసక్తిని కోల్పోయి పాఠ్యపుస్తకాలు పక్కన పడేసి ఇతర పుస్తకాలు చదువుతూ, నాటకాలు వేస్తూ  రాస్తూ, స్టీల్ ఫ్యాక్టరీ, జై ఆంధ్రా ఉద్యమాలంటూ  తిరుగుతున్నప్పుడు మా అమ్మ చాలా పెద్ద తగువు పెట్టుకుంది. అప్పుడు మానాన్న నా పక్షాన నిలబడ్డారు. ఏదైతే ఏముందీ? ఏ రంగంలో అయినాసరే గొప్పవాళ్ళు కావడమే ముఖ్యం అన్నారు.

 

నా ముందుతరంవాళ్ళే నాకు అంతగా నైతిక మద్దతు ఇచ్చినపుడు నేను నా తరువాతి తరానికి అడ్డం కాకూడదనుకున్నాను. ఈ గొప్పతనమూ నాది కాదు; మానాన్నది. నేను కేవలం ఒక సాంప్రదాయాన్ని కొనసాగించాను. మానాన్న చెప్పిన మాటల్ని నా కొడుకులకు అప్పచెప్పాను.

 

ఒక విధంగా అరుణ్ కు గ్రాఫిక్స్ మీద ఆసక్తిని కలిగించింది వాడి తల్లి అజిత. అరుణ్ కు చిన్నతనంలోనే బొమ్మలి గీసే ఆసక్తి వుంది.  వాడికి చాలా చిన్న వయసులో అజిత ఫొటో షాప్ నేర్పింది.  వాడిప్పుడు VFX సూపర్ వైజర్ స్థాయికి ఎదిగాడు. VFX స్టూడియో ప్రమోటర్ కూడ అయ్యాడు.

 

ముందు శ్రీ ప్రకాష్ అనే ఓ అంతర్జాతీయ స్థాయి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ దగ్గర  పనిచేశాడు. కమల్ హాసన్ ‘ఈనాడు’ “ఉన్నైపోలు ఒరువన్’ తో సినిమా కెమేరా – ఎడిటింగ్  విభాగంలో చేరాడు. ఆ సినిమాకు ఒక ప్రత్యేకత వుంది. ఇండియాలో తొలిసారిగా డిజిటల్ (రెడ్) కెమేరాను వాడారు. అలా వాడు సినిమాలకు డిజిటల్ కెమేరాను వాడిన తొలి భారతీయుడు అయ్యాడు. అదో రికార్డు. ఇప్పటికీ చాలామంది తనను ‘రెడ్ అరుణ్’ అంటారు. తన రెండో సినిమా నాగార్జున ‘గగనం’. ఆ సినిమాకు డిజిటల్ టెక్నాలజీ సూపర్ వైజర్ గా పనిచేశాడు. తన పనితనానికి చాలా పేరొచ్చింది.

 

చాలా తక్కువ వయస్సులో ఎక్కువ పేరు వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. వాడికీ అలాంటి ఇబ్బందులొచ్చాయి. వాడికి రెగ్యులర్ డిఓపిగా పనిచేయడం ఇష్టం వుండదు.  ఎప్పుడూ కొత్తగా పనిచేయాలనుకుంటాడు. ప్రయోగాలంటే చాలా ఇష్టం. కష్టకాలంలోనూ సాంకేతిక ప్రయోగాలు ఆపలేదు. ప్రయోగాల్లో డబ్బు ఖర్చు మాత్రమే కాకుండా కొన్ని ప్రమాదాల్లో   ప్రాణాపాయాలు సహితం తెచ్చుకున్నాడు.  భారతదేశానికి డ్రోన్లు రాని రోజుల్లో స్వయంగా డ్రోన్ తయారు చేసి ‘ఆగడు’ సినిమాలో వాడాడు. అమరావతి కన్ స్ట్రక్షన్ ‘టైమ్ లాప్స్ వీడియో’ తీసిందీ వాడే.  ‘ఫిదా’ సినిమాలో వాడు తీసిన కొన్ని షాట్లకు మంచి పేరొచ్చింది.

 

రాంగోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’లో ప్రయోగాత్మకంగా వాడు తీసిన ‘ఫ్లో క్యామ్ షాట్’ సినిమాటోగ్రఫీని ఒక మెట్టు పెంచింది. ఇప్పటికీ అలాంటి షాట్లను ‘అరుణ్ షాట్’ అంటారు. సాధారణంగా ఎవ్వరినీ మెచ్చుకోని ఆర్జీవి ఒక మీడియా సమావేశంలో అరుణ్ ను చాలా మెచ్చుకున్నారు. (థ్యాంక్స్ సర్!)

 

తరువాత హాలివుడ్ కు వెళ్ళి మోషన్ క్యాప్చరింగ్ మీద దృష్టి పెట్టాడు. బాలివుడ్ లో కొన్ని సినిమాలకు పనిచేశాడు. కొన్ని సినిమాలకు VFX సూపర్ వైజర్ గా పనిచేయడమేగాక హైదరాబాద్ లో  VFX స్టూడియోను సెటప్ చేసుకున్నాడు. ఓ భారీ బడ్జెట్  తెలుగు సినిమాకు VFX  సూపర్ వైజర్ గా ఇటీవల న్యూజిలాండ్ లో ఓ నాలుగు నెలలు పనిచేసి వచ్చాడు. ఓ భారీ బాలివుడ్ సినిమాకు నెల రోజులుగా డెహ్రాడూన్ లో పనిచేస్తున్నాడు.

 

ఈ రోజు వాడి బర్త్ డే.

 

హ్యాపీ బర్త్ డే అరుణ్ !

No comments:

Post a Comment