Wednesday, 1 April 2026

ఒక శకం ముగిసింది – మరో శకం మొదలు కావాలి

 కాలధార

 

ఒక శకం ముగిసింది – మరో శకం మొదలు కావాలి

 

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు



02-04-2026 Teluguprabha

 

దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఆపరేషన్ కగార్ కు నిర్దేశించిన గడువు మార్చి 31కి ఒక రోజు ముందే లక్ష్యాన్ని సాధించుకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ విజయం మాత్రమే కాదు; మావోయిస్టుల పరాజయం కూడ.

 

          మనదేశంలో  అనేక రకాల కమ్యూనిస్టు పార్టీలున్నాయి.  పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పూర్తిగా అంకితమైనవి వున్నాయి. ఎన్నికల్లో పాల్గొంటూనే వీలున్నప్పుడు సాయుధపోరాటాన్ని కూడ చేస్తామనేవి  వున్నాయి. సాయుధపోరాటం మొదలెట్టడానికి సరైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నవి వున్నాయి. ఆ రెండు పనులు కాకుండా ఇంకేవో పనులు చేస్తున్నవీ వున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామిక ఎన్నికల్ని బహిష్కరించి  సాయుధపోరాటం మాత్రమే సమాజంలో మార్పును తెస్తుందని నమ్మే  ఏకైక పార్టి సిపిఐ- మావోయిస్టు. అలా దానికో ప్రత్యేకత వుంది.  

 

          మనదేశంలో భూస్వామ్య ప్రధాన వ్యవస్థ పెట్టుబడీదారీ ప్రధాన వ్యవస్థగా మారడంలో కమ్యూనిస్టుల కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. దేశంలో ప్రజాస్వామ్య భావాల వ్యాప్తికి కూడ కమ్యూనిస్టు పార్టీలు దోహదపడ్డాయి. అప్పట్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ  సాగిస్తున్న రైతాంగ సాయుధ పోరాటాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతోనే రాజ్యాంగంలో అనేక ఆదర్శాలను పొందుపరిచారంటే  అతిశయోక్తికాదు. ఆ తరువాత భూపరిమితి చట్టాలు, రాజాస్థానాలు-రాజభరణాల రద్దు, కార్మిక హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలోసోషలిస్టు”, “సెక్యులర్ఆదర్శాల చేర్పు తదితర అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పాత్ర ప్రధానంగా ఉన్నది. అలాగే ఉనికివాద ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించలేదుగానీ, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి, మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో పనిచేసినవారే.

 కమ్యూనిస్టుల ప్రభావంవున్న రాష్ట్రాల్లో కులనిర్మూలనో, మత నిర్మూలనో జరగలేదుగానీ కమ్యూనిస్టు సంఘాల్లో కులసామరస్యం, మత సామరస్యం కొనసాగింది. కులాంతర, మతాంతర వివాహాలను ప్రత్యేకంగా  ప్రోత్సాహించకపోయినా ఆమోదం లభించింది.  తెలుగు సాహిత్యం మీద వామపక్ష ప్రభావం మరీ ఎక్కువ. కవులు కథకులు నవలాకారులు కమ్యూనిస్టు సంఘాల్లో వున్నాలేకపోయినా తెలుగు కవిత్వం, కథా నవల తదితర ప్రక్రియలన్నీ పీడితుల పక్షమే వహించాయి; వహిస్తున్నాయి. ఇవన్నీ కమ్యూనిస్టులు సాధించిన చారిత్రక సామాజిక సాంస్కృతిక  విజయాలే. వీటినీ ఎవరూ కాదలేరు.

అయితే, భారత సమాజానికి సంబంధించిన మౌలిక స్వభావాలను విశ్లేషించడంలో కమ్యూనిస్టు పార్టీలు విఫలమయ్యాయి. భారత సమాజం కులసమాజం; మతసమాజం; తెగ సమాజం.  ఈ ప్రాతిపదిక మీదనే ఆర్ధిక పంపకాలు సౌకర్యాలు వుంటాయి. ఆ చట్రమే రాజకీయాధికారాన్ని నిర్ణయిస్తుంది. కులం, మతం, లింగం, భాష, ప్రాంతం అన్నింటిలోనూ వర్గ ప్రభావం వుంటుందన్న వాస్తవాన్ని గుర్తించడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులకు వందేళ్ళు సరిపోలేదు. ఇది తెలియక జరిగిన తప్పా? లేక ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన కుట్రా? అనే అంశాల  మీద ఇప్పటికీ చర్చలు సాగుతూనే వున్నాయి.

ఉత్పత్తి విధానం నుండే ఉపరితల అంశాలు ఆవిర్భవిస్తాయనే సిధ్ధాంతంలో తప్పేమీలేదుగానీ, ఆ తరువాత ఆ ఉపరితల అంశాలు స్వతంత్రంగానూ, సృజనాత్మకంగానూ నిరంతరం అభివృధ్ధి చెందుతుంటాయి అనే అంశం మీద కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో అవగాహన లోపించింది.

పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య తదితర తొలితరం కమ్యూనిస్టు నాయకులకు వ్యవసాయం, నీటి పారుదల, డ్రైనేజి  రంగాల మీద సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ. వ్యవసాయం ప్రధానంగా వున్న కాలంలో వాళ్ళ అభిప్రాయాలకు ఒక విలువ వుండేది.  కమ్యూనిస్టేతరులు కూడ వాళ్ళ ప్రతిభను గుర్తించి మెచ్చుకునేవారు.

1990వ దశకం ప్రపంచాన్ని పునర్ వ్యవస్థీకరించింది. ముందు తూర్పు యూరప్ పతనమైంది. ఆ పిదప రష్యాయే ముక్కలైంది.  కమ్యూనిజానికి ఆమోదాంశం ఇరుకున పడింది. ఇలాంటి అవకాశం కోసం  ఎదురుచూస్తున్న కుడిపక్ష తీవ్రవాదం  (రైట్ ఎక్స్ ట్రీమిజం) ప్రపంచ వ్యాప్తంగా చెలరేగింది.  లాల్ కిషన్ అడవాణి రథయాత్రలు, బాబ్రీమసీదు కూల్చివేత ఒక క్రమంలో జరిగాయి.  సరళీకృత, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఆర్ధిక విధానాలు ప్రవేశించాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పడింది.  ఐటి విప్లవం చెలరేగింది. పబ్లిక్ రంగాన్ని ప్రైవేటురంగం అధిగమించింది. గ్రామాల్లో రైతుకూలీలు అంతరించడం మొదలైంది. పట్టణాల్లో కార్మికుల అర్ధం మారిపోయింది. అస్థిర కార్మికులు (ప్రికారియేట్)  పుట్టుకొచ్చారు. గిగ్ వర్కర్లు, సర్విస్ సెక్టార్ జిడిపిలో 70 శాతానికి చేరుకున్నారు. వ్యవసాయం, పారిశ్రామికరంగం జిడిపీలో చెరో 16 శాతానికి పరిమితమైపోయాయి.

అవన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. సమస్తరంగాలలో కొత్త విలువలు ప్రవేశించాయి. ఇది ‘1990 అనంతర కల్లోలం’.  పాత కూర్పుకు సరిపోయిన సిద్ధాంత-రాజకీయ పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయవు. మార్పుల్ని కమ్యూనిస్టు పార్టీల కొత్త నాయకత్వం సరిగ్గా విశ్లేషించుకోలేక పోయింది.

 

          ఇంగ్లండ్ లో పుట్టిన కమ్యూనిస్టు సిధ్ధాంతం రష్యా, చైనా, వియత్నాం తదితర దేశాల్లో సోషలిస్టు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అక్కడి విప్లవాలకు నాయకత్వం వహించినవారు కమ్యూనిస్టు-సోషలిస్టు  మౌలిక సూత్రాలను తమ దేశ వాస్తవ పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించి ఫలితాలను సాధించారు. అలాంటి సృజనాత్మకత భారత కమ్యూనిస్టు నాయకుల్లో మొదటి నుండీ లోపించింది.  అయితే రష్యామార్గం, కాకుంటే చైనా మార్గం అన్నట్టుగానే వ్యవహరించారు.

 

          2004లో మావోయిస్టు పార్టి అని పేరు పెట్టుకోవడం అంటేనే తాము 1920 -40ల నాటి చైనా విప్లవ పధ్ధతుల్ని అనుసరిస్తామని చెప్పుకోవడమే. సాంప్రదాయిక మార్క్సిస్టు చట్రం ప్రకారం భూస్వామ్య వ్యవస్థ పెట్టుబడీదారీ వ్య్వస్థగా మారుతుంది. ఆ తరువాత పెట్టుబడీదారీ వ్య్వస్థ సోషలిస్టు వ్యవస్థగా మారుతుంది. అంతిమంగా కమ్యూనిస్టు వ్య్వస్థగా మారుతుంది. ఈ చట్రం తమ దేశానికి అమరదని 1920లలో మావో గుర్తించాడు. భూస్వామ్య సమాజాన్ని నేరుగా సోషలిస్టు దేశంగా మార్చడానికి 1940లో నూతన ప్రజాస్వామిక విప్లవం అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించాడు. అది చైనాలో సఫలం అయినట్టు కొన్నాళ్ళు కనిపించింది. ఆ తరువాత అక్కడ పెట్టుబడీదారీ వ్యవస్థ పునర్జన్మ ఎత్తిందీ. ఇదెలా జరిగింది? అనే అంశం మీద ఇప్పుడు విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

 

వీటిని మావోయిస్టుపార్టి పట్టించుకోలేదు. ఆ పార్టి ఇప్పటికీ మన సమాజాన్ని 1920ల నాటి  చైనాలా అర్ధవలస – అర్ధభూస్వామ్య వ్యస్థగానే పరిగణిస్తుంది. “దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవ విజయం ఇరుసుగా గలిగిన నూతనప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం” లక్ష్యంగా పెట్టుకుంది.  అది కాలం చెల్లిన కార్యక్రమం కనుక మన దేశ పీడిత ప్రజలు దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా 4,839 మంది నక్సలైట్లు లొంగిపోయారు.  లొంగిపోవడానికి నిరాకరించిన 706 మందిని పోలీసులు ఎన్కౌంటర్లలో హతమార్చామని హోంమంత్రి పార్లమెంటులో ప్రకటించడం. విడ్డూరం. వాళ్ళ మీద న్యాయ  ప్రక్రియ జరపకుండా హతమార్చడం ఏమిటీ? రాజ్యాంగ బద్ధ్ధమేనా?

 

ఉద్యమాల్లో చేరినవాళ్ళు జీవితకాలం అందులోనే వుండిపోతారనే నియమం ఏమీలేదు. వెళ్ళిపోయేవారు తక్కువగానూ, వచ్చి చేరేవారు ఎక్కువగానూ వుంటే ఆ ఉద్యమాలు ముందుకు సాగుతున్నట్టు లెఖ్ఖ. వెళ్ళిపోయేవారు ఎక్కువగానూ వచ్చిచేరేవారు తక్కువగానూ వుంటే ఆ ఉద్యమాలు వెనక్కు తగ్గుతున్నట్టు లెఖ్ఖ.  ఈ ప్రమాణాల ప్రకారం మావోయిస్టు పార్టి విస్తరిస్తోందో అంతరిస్తోందో ఎవరికివారు అంచనా వేసుకోవచ్చు.

 

          మావోయిస్టు పార్టి అంచనాలతో సంబంధం లేకుండానే భారత సమాజం కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ (CCD) గా మారిపోయింది. ఇందులో మూడు విభాగాలున్నాయి. ఒక్కో విభాగానికి అనేక సమూహాలు  బాధితులుగా వుంటారు. మూడు విభాగాలకు కలిపి మరిన్ని సమూహాలు  బాధితులు వుంటాయి. కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను ఓడించే ఒక కార్యక్రమాన్ని ఎవరో ఒకరు ఇప్పుడు రూపొందించాలి. అప్పుడు మాత్రమే ఒక నూతన ఐక్య సంఘటన ఏర్పడి సమాజాన్ని మారుస్తుంది.

 

డానీ

సమాజ, రాజకీయ  విశ్లేషకులు

 

1 ఏప్రిల్ 2026