కాలధార
*గ్రౌండ్ జీరో నాసిక్ !*
*డానీ*
*సమాజ, రాజకీయ విశ్లేషకులు*
మొదటి
కేసు జ్యోతిష్య బాబా అశోక్ ఖరాత్ కు సంబంధించింది. ఈ బాబాకు జాతకాలు చెప్పడమేగాక జాతకాలు
మార్చగల దిట్ట అని పేరుండేది. మహారాష్ట్రకు
చెందిన చెందిన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు నాసిక్ వెళ్ళి బాబా ఆశిస్సులు పొందేవారు. బాబా ఫొటోలు కొన్నింటిలో సాక్షాత్తు దేశ ప్రధాని,
హొంమంత్రి కూడ వున్నారంటే వారి పరపతి ఏ స్థాయిలో వుండేదో ఊహించుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి,
మంత్రులు బాబాకు భక్తులు వంటివారు.
బాబా అశోక్
ఖరాత్ కు మహిళా శిష్యుల మీద ప్రత్యేక ఆసక్తి వుండేది. సోషల్ మీడియాలో ముస్లింల మీద,
ముస్లిం మహిళల హిజాబ్ -బుర్ఖాల మీద, ఈద్ నమాజుల మీద తెగ విమర్శలు కురిపించి చెలరేగిపోయే
మహిళా ఇన్ ఫ్లూయన్సర్లు తరచూ బాబా సేవలో తరించేవారు. మహారాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్
పర్సన్ రూపాలి చాకన్కర్ బాబాకు ప్రియమైన శిష్యురాలు.
బాబా ఆశీస్సులతోనే తాను రాజకీయాల్లో అగ్రస్థానానికి ఎదిగానని వారు సగర్వంగా చెప్పుకునేవారు.
అందరి
జాతకాలు చెప్పే బాబాగారికి తన జాతకం అర్ధం కాలేదు. మార్చి మూడవ వారంలో వారి జాతకం తలకిందులు అయ్యింది.
బాబా తనను మూడేళ్ళుగా వేధిస్తున్నట్టు ఓ మహిళ
సాక్ష్యాలతో సహా పిర్యాదు చేసింది. ఇదే అదనుగా, బాబా అనేక మంది సెలబ్రిటి మహిళలతో అతి
సన్నిహితంగా వున్న ఫొటోలు, వీడియోలు డజన్లకొద్దీ వెలుగులోనికి వచ్చాయి. వారందరితో బాబా
ప్రత్యేక పూజల పేరుతో ‘వైట్ రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్’ జరిపేవారట. వీటిని ఇప్పుడు అశోక్ ఖరాత్ ఫైల్స్ అంటున్నారు.
తమ వీడియోలు
బయటికి రావడంతో సోషల్ మీడియా మహిళా ఇన్ ఫ్లూయన్సర్లు తమ అకౌంట్లను హఠాత్తుగా మూసేసుకున్నారు. రూపాలి చాకన్కర్ వీడియోలు సహితం
బయటికి రావడంతో ఆమె కూడ తన పదవికి రాజీనామా చేశారు. మరో వైపు, మహారాష్ట్ర మంత్రులు
కొందరి శృంగార లీలల వీడియాలు సహితం బయటికి
రావడంతో ప్రభుత్వమే నైతిక సంక్షోభంలో పడింది. మార్చి నాలుగవ వారంలో బాబాను అరెస్టు
చేశారు.
డిజిటల్ టెక్నాలజీ పెరిగి స్పై కెమేరాలు అందుబాటు
లోనికి రావడంతో అనేకమంది బాబాల వెకిలిచేష్టలు, శృంగార సరసాల వీడియోలు
ఈమధ్య పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. హిందూరాష్ట్రం ఏర్పరచాలని ఉవ్విళ్ళూరుతున్న సమూహాలను
ఇవి తీవ్ర నైతిక సంక్షోభంలో పడేస్తున్నాయి.
మతాన్ని సాంప్రదాయవాదులు
చాలా పవిత్రమైన వ్యవహారంగా భావిస్తారు. ఈ నియమం హిందూమతానికి కూడ వర్తిస్తుంది. ఎంతటి
హిందువులు అయినాసరే వారికి ఇలాంటి వికారపు
చేష్టలు నచ్చవు. పడవు.
వర్షం
రావడానికి ముందు మెరుపులు మెరిసినట్టు, కీలకమైన
ఎన్నికలకు ముందు మన దేశంలో టెర్రరిస్టు దాడులు,
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ సంఘటనలు జరుగుతుంటాయి. మెరుపులు మెరిసినపుడు కొన్ని శ్లోకాలు
చదివినట్టు ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ‘హిందువువులు ప్రమాదంలో వున్నారు” అని కొందరు
గట్టిగా నినాదాలు చేస్తుంటారు. ఇలాంటి నినాదాలు
ఇవ్వడం కోసమే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయనే నిందకూడ లేకపోలేదు.
ప్రస్తుతం
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగానూ యధాతధంగా పాత ఫార్మూలానే
రిపీట్ చేశారు. అయితే, ఈసారి సీన్ రివర్స్ అయింది. బాబాలు,
స్వామీజీల వికారపు చేష్టల వీడియోలు అనేకం
బయటికి వచ్చాయి. కాషాయ దళాల్ని ఇబ్బందుల్లో పడేశాయి.
ఇలా
వుండగా నాసిక్ లో ఇంకో సంచలన కథనం చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) లో జిహాదీ కుట్ర జరిగిందనేది
ఆ కథనం సారాంశం. కొంతమంది ముస్లిం స్టాఫ్ అక్కడి
హిందూ అమ్మాయిల్ని లైంగికంగా వేదిస్తున్నారనీ, ఇస్లాం ను స్వీకరించాలని వత్తిడి తెస్తున్నారు
అనేది ఆ కథనాల సారాంశం. అక్కడ హెచ్ ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్న ‘నిదా ఖాన్’ ఈ కుట్రకు సూత్రధారి అనీ,
కార్పొరేట్ కంపెనీలో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి విదేశాల నుండి భారీ నిధులు
వస్తున్నాయి అనేవి ఈ కేసులో కీలక ఆరోపణలు.
ఎన్నికల
వేళ 'హిందూ ఖతరేమే హై ' అని ఓటర్లను భయపెట్టడానికి కాసుకుని కూర్చున్న మీడియా సేనాధిపతులకు
నాసిక్ టిసిఎస్ కేసు లడ్డూలా దొరికింది. బాబా
అశోక్ ఖరాత్ అఘాయిత్యాలను ప్రజలు మరచిపోయేలా చేయడానికి, ఐదురాష్ట్రాల ఎన్నికల్లో –
ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో - హిందూ ఓట్ బ్యాంకును
ఆకర్షించడానికీ ఇంతకన్నా గొప్ప ఛాన్సు వుంటుందా? అని వారు మురిసిపోయారు.
మాస్టర్ మైండ్
నిదా ఖాన్ అనగానే గోదీ మీడియా న్యూస్ రీడర్లు,
యాంకర్లు వారం రోజులపాటు రెచ్చిపోయారు. సాక్షాత్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనికి కార్పొరేట్ జిహాద్ అని
పేరు పెట్టారు. పోలీసులు రంగంలోనికి దిగి కొందర్ని అదుపులోనికి తీసుకున్నారు.
ఈ
ప్రచారం మీద టిసిఎస్ స్పందించింది. తమ నాస్తిక్ యూనిట్ లో నిదా ఖాన్ అనే ఆమె పనిచేయడం లేదనీ, తమ యూనిట్ ఆపరేషన్స్ మేనేజర్
పేరు అశ్వినీ చైనానీ అనీ, ఆమె హిందువు అని ఒక వివరణ విడుదల చేసింది. నిదా ఖాన్ అనే అనే ఆమె గతంలో తమ దగ్గర పనిచేసిందనీ, అప్పుడు
కూడ ఆమె హెచ్ ఆర్ కాదనీ, ఒక సాధారణ టెలీ కాలర్ మాత్రమేనని, ఆమె ప్రస్తుతం నాసిక్ లోనే
లేదనీ, పెళ్ళి చేసుకుని ముంబాయిలో వుంటూ పై చదువులు చదువుకుంటున్నదని కూడ వివరణ ఇచ్చింది.
గోదీ
మీడియాకు ఈ వివరణలతో పనిలేదు. దేశంలో హిందూ
సమాజానికి ముస్లింలు ముప్పుగా మారిపోయారు అని ప్రచారం చేయడమే వారి వృత్తి. ఈ ప్రచారం ఫలితంగా చాలా మంది మనసుల్లో నాటుకున్న
విషయం ఏమంటే, దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతున్నది. అదిచాలక, పెద్ద ఎత్తున హిందూ అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుని
వాళ్లను ముస్లింలుగా మార్చేస్తున్నారు- అని.
భారతదేశానికి
స్వాతంత్ర్యం వచ్చినపుడు దేశ జనాభాలో ముస్లింలు
15 శాతం; ఇప్పుడూ వాళ్ళు 15 శాతమే. డెభ్భయి అయిదేళ్ళ అమృత కాలంలో ముస్లిం జనాభా ఒక్కశాతం
కూడ పెరగలేదు. ప్రణాళికా బధ్ధంగా కుటుంబాలను రూపొందించుకున్నవారు ఒకరిద్దరు పిల్లలతోనే
సరిపెట్టేసుకుంటున్నారు.
మరో ఆసక్తికర
అంశం ఏమంటే, అందుబాటులో వున్న అధికారిక వైద్య రికార్డుల ప్రకారం హిందూ స్త్రీలకన్నా
ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు 25 శాతం ఎక్కువ. మన దేశంలో హిందూ స్త్రీల ఫెర్టిలిటీ
రేటు రెండు అయితే ముస్లిం స్త్రీల ఫెర్టిలిటీ రేటు 2.5. దేశంలో ముస్లిం జనాభాను పెంచే
కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే ముస్లిం యువకులు హిందూ స్త్రీలను పెళ్ళి చేసుకోవడంకన్నా
ముస్లిం స్త్రీలను పెళ్ళి చేసుకుంటేనే ప్రయోజనం
ఎక్కువ. ఫెర్టిలిటీ రేటు ఎక్కువ కనుక ఎక్కువమంది ‘ముస్లింలను’ కనవచ్చు.
ఇలా
వుండగా, బాబా అశోక్ ఖరాత్ కేసులో ప్రధాన సాక్షి,
అతని అనుచరుడు జితేంద్ర షెల్కే, అతని భార్య
అనురాధల్ని రెండ్రోజుల క్రితం ఒక కారు నాసిక్ లో నడిరోడ్డు మీద చంపేసింది. ఇప్పుడు
ఆ కేసులో ప్రధాన సాక్షులు చనిపోయారు కనుక బాబాగారు సగౌరవంగా విడుదలై బయటికి వస్తారు.
అభిమానులు వారికి దండలేసి సాదరంగా ఆహ్వానించి మేళ తాళాలతో ఊరేగిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడ వారిని వున్నత పదవులతో
సత్కరిస్తుంది.
ఐదు
రాష్ట్రాల ఎన్నికలు, డిలిమిటేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడం, బాబా అశోక్ ఖరాత్ బండారం బయట పడడం, అదే నాసిక్ లో కార్పొరేట్ జిహాద్
కేసు నడవడం, అక్కడే బాబా అశోక్ ఖరాత్ కేసులో
ప్రధాన సాక్షిని కారు చంపేయడం ..... ఇవన్నీ విడివిడి సంఘటనలా? యాధృఛ్ఛికంగా జరిగిన సంఘటనలేనా? లేక వీటి మధ్య ఒక అంతస్సంబంధం వుందా? ఇవి ఇప్పుడు
ఎవరికయినా రావలసిన సందేహాలు.
కార్పొరేట్
జిహాద్ కేసు కోర్టులో నిరూపణ కావచ్చు; కాకపోవచ్చు. కానీ అరెస్టు చేసిన వారిని జైళ్ళ నుండి ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరూ చెప్పలేరు.
ఈలోగా ముస్లింలను రిక్రూట్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు జంకుతాయి. లవ్ జిహాద్
జరుగుతుందనికాదు; ప్రభుత్వం తమ మీద కక్ష కడుతుందని. ఇది అసలు ప్రమాదం. పాలకుల లక్ష్యం
కూడా అదే. దేశంలో ముస్లింలకు ఎవ్వరూ చదువు చెప్పకూడదు; చదువుకున్నా ఉద్యోగాలు ఇవ్వకూడదు;
పెళ్ళికి అమ్మాయిల్ని ఇవ్వకూడదు; పని ఇవ్వకుడదు, వాళ్ళ దగ్గర ఏవీ కొనకూడదు. ముస్లింలకు
బిచ్చం కూడ ఇవ్వకూడదు. అసలు జనాభా లెఖ్ఖల్లో వాళ్ళ పేరు నమోదు కాకూడదు. ఇదీ ఇప్పుడు
నడుస్తున్న నియమం.
ప్రచురణ : తెలుగుప్రభ. నెట్ 22-04-2026
రచన : 21-04-2026
.png)

.png)
