NDA got less %-of Votes but got more seats!!!
*ఎన్‌డిఏకు ఓట్లు తక్కువ సీట్లు ఎక్కువ* 822 Words
*డానీ*
*సమాజ విశ్లేషకులు*
బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే ఎన్నికల వ్యూరచన సామర్ధ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. నితీష్ కుమార్ రేపు 20న రికార్డుస్థాయిలో పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ఎన్నికలు ఇండియా బ్లాక్ / మహా ఘట్ బంధన్ బలహీనతల్ని, తేజస్వీయాదవ్ అతిఉత్సాహాన్నీ, రాహుల్ గాంధి మంద్రస్థాయి ప్రతిస్పందననీ మరోసారి చాటి చెప్పాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఉద్యమాన్ని సాగించినంత వుధృతంగా బీహార్ ఓటర్లను ఆకట్టుకునే పని చేయలేకపోయారు.
సంఘపరివారంలో వందకు పైగా సంఘాలున్నాయి. విహెచ్పి, భజరంగ్ దళ్, ఆయోధ్య రామాలయ నిర్మాణ కమిటి వంటి ధార్మిక సంఘాలేగాక పసిపిల్లల నుండి అంధుల వరకు అనేక రకాల సంఘాలు ఇందులో వుంటాయి. ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టి సమూహాల్లో పని చేయడానికి కూడ వేరువేరు సంఘాలున్నాయి. వీటన్నింటి రాజకీయ వేదిక బిజెపి. ఇవన్నీ ఏకశిలాసదృశ్యంగా మనసా వాచా కర్మణ ఒకే ఆలోచన ఒకే లక్ష్యంతో తమతమ రంగాల్లో బిజెపి గెలుపు కోసం కృషి చేస్తుంటాయి. దేశంలోని మెగా కార్పొరేట్లు అవసరానికి మించిన నిధుల్ని వాటికి సరఫరా చేస్తుంటాయి. దేశంలో అత్యంత ధనిక పార్టి బిజెపి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పార్టీ నడిపే సోషల్ మీడియాలు, వారి అభిమానులైన ‘అన్ – సోషల్’ మీడియా హౌస్ లు సహజంగానే విపక్షాలను అప్రతిష్టపాలు చేయడం కోసం, బిజెపిని గెలిపించడం కోసం 24/ 366 రోజులు పనిచేస్తుంటాయి. ఇది సంఘపరివారం విజయ రహాస్యం. అదొక ఉమ్మడి కుటుంబం.
మరోవైపు, బిజెపి ప్రత్యర్ధులకు సిధ్ధాంతపరంగా ఏక సమైక్యతా సూత్రం ఏమీలేదు. వాళ్ళకు ఒక బైండింగ్ వైర్ లేదు. ఒక పదం కోసం, ఒక్కోసారి ఒక్క అక్షరం కోసం, ఒక్క సీటు కోసం అవి హోరాహోరీగా కొట్లాడుకుని వీధులకు ఎక్కుతుంటాయి. పైగా నాలుగున్నరేళ్ళు పూర్తి విశ్రాంతి తీసుకుని ఎన్నికలకు ఆరు నెలలు ముందు మాత్రమే మేలుకుంటాయి. వీటికి కూడ కొన్ని ప్రజాసంఘాలుంటాయి. వాటిల్లో ఎక్కువ భాగం లెటర్ హెడ్ సంస్థలు. నేల మీద నిలబడి ప్రజల్లో పనిచేసేవి చాలా తక్కువ. బిజెపి-ఎన్డిఏలను వ్యతిరేకించేవారు సహితం ఇండియా బ్లాక్ / మహాఘట్ బంధన్ అంతఃకలహాలను చూసి అసహ్యించుకుంటారు.
తొమ్మిదిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ మీద సహజంగానే ఎంతో కొంత అసంతృప్తి కూడ వుంటుంది. ఈసారి మహిళా ఓటర్లు గుర్రుగా వున్నారనే మాట బీహార్‌లో వినిపించింది. అంతే, ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ కింద అక్టోబరు 6 నుండి ఒక్కో మహిళ అకౌంట్లో పది వేల రూపాయల చొప్పున వేసేశారు నితీష్. ఈ పథకం కింద డిబిటి పధ్ధతిలో ఒక కోటి 40 లక్షల మహిళల ఖాతాల్లోనికి 14 వేల కోట్ల రూపాయలు జమ చేశారని అంచనా. నిజానికి, బిహార్‌లో అక్టోబరు 6 నుండే ఎన్నికల కోడ్ అమల్లోనికి వచ్చింది. ఇది ఒక విధంగా ‘ఓటుకు నగదు’ పథకం. ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలను ఎన్నికల కమీషన్ అడ్డుకోవాలి. అలా జరగలేదు.
స్వేఛ్చ, సమానత్వం, సోదభావాలను ప్రధాన ఆదర్శాలుగా ప్రకటించిన భారత రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీజీ నెత్తి మీద పెట్టుకుంటారు. వీలున్నప్పుడెల్లా “సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్” తమ విధానం అంటుంటారు. కానీ, వారి పార్టి మాత్రం దేశం మొత్తం మీద ఒక్క సీటు కూడ ముస్లింలకు కేటాయించదు. ముస్లింలను అణిచివేస్తున్నామనే సంకేతాలు ఇస్తే హిందూ సమాజంలోని ఛాందస సమూహం తమకు ఓటేస్తుందనేది ఆ పార్టి ఎత్తుగడ. ఇది ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టికి సానుకూల ఫలితాలను ఇస్తోంది.
మరోవైపు, ముస్లింలకు ప్రానిథ్యం వహిస్తున్న ఎంఐఎంను తమలో చేర్చుకోవడానికి బిజెపి వ్యతిరేక మహాఘట్ బంధన్ (ఇండియా బ్లాక్) కూడ భయపడింది. ఎంఐఎంతో జతకడితే సంఘపరివారం తమను మొత్తంగా ‘గడ్డాలు టోపీల కూటమి’ అంటుందని వాటికి భయం. మరోవైపు, బిజెపి సోషల్ మీడియా ఆ పార్టిని ‘బిజెపి బి-టీమ్’గా ముద్రవేసి ప్రచారం చేసింది. 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నియోజకవర్గంలో బిజెపితో అంత హోరాహోరీగా పోరాడిన పార్టీని మీడియా సహితం బిజెపి-బిటీమ్ అంటుండడం విచిత్రం.
2020 బిహార్ ఎన్నికల్లో ఎంఐఎం 20 చోట్ల పోటీచేసి 5 స్థానాలు గెలుచుకుంది. 243 సీట్లున్న రాష్ట్రంలో 20 చోట్ల మాత్రమే పోటీ చేసిన పార్టీని బి-టీమ్ అనడం అంత సమంజసంగా అనిపించదు. అయితే, ఈసారి ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే సీమాంచల్ నుండి ఎన్నికయిన ఎంఐఎం అభ్యర్ధి బిహార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన సంకేతాలను ఎన్డీఏ కూటమి తనకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్డీఏ కు అనుకూలంగానే అసద్ అలాంటి సంకేతాలిచ్చారనే విమర్శలూ వున్నాయి.
బిజెపి-బీ-టీమ్ నింద నుండి బయటపడడానికి ఈసారి ఎంఐఎం బీహార్ లో మహాఘట్ బంధన్ లో చేరడానికి చాలా ప్రయత్నించింది. తమకు 6 సీట్లు ఇచ్చినా సర్దుకుంటామని అభ్యర్ధించింది. ఈ ప్రతిపాదనను ఆర్జెడి తేజస్వీ యాదవ్ గట్టిగా తిరస్క్రించారు. ఫలితంగా ఎంఐఎం గ్రాండ్ డెమోక్రాటిక్ అలయన్స్ (జిడిఎ)ను ఏర్పాటు చేసింది.
బిజెపితో వైరాన్ని కొనసాగించి మరిన్ని ఇబ్బందుల్ని కొనితెచ్చుకోవడంకన్నా దానికి అణిగిమణిగి వుండడమే మేలనే ధోరణి కూడ ఈసారి బీహార్ ముస్లిం సామాజికవర్గంలో కనిపించింది. ఇదొక కొత్త ధోరణి.
*ఓట్లు తక్కువ; సీట్లు ఎక్కువ!!!*
పార్లమెంటరీ ప్రాజాస్వామ్యంలో ఇప్పుడున్న పధ్ధతిలో ఎన్ని సీట్లు గెలుచుకున్నారన్నదే ప్రామాణికంగానీ, ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు మద్దతు పలికారన్నది కొలమానం కాదు. ఆర్జెడికి ఒక కోటి 80 లక్షల ఓట్లు (23 శాతం) వచ్చాయి గానీ సీట్లు 25 మాత్రమే వచ్చాయి. బిజెపికి 96 లక్షల ఓట్లు, అంటే ఆర్జెడికన్నా రెండున్నర శాతం తక్కువ ఓట్లు వచ్చినా 91 సీట్లు వచ్చాయి. జెడియుకు 90 లక్షల ఓట్లు వచ్చాయి (19 శాతం) 84 సీట్లు వచ్చాయి. 9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్ కు 5 సీట్లు వస్తే, 5 శాతం ఓట్లు మాత్రమే వచ్చిన ఎల్ జేపికి 20 సీట్లు దక్కాయి. ఇక్కడ ఓట్లకూ సీట్లకూ పొంతనలేదు. ఎన్డీఏ పక్షాలకు తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావడం, మహాఘట్ బంధన్ పక్షాలకు ఎక్కువ శాతం ఓట్లు వచ్చినా తక్కువ శాతం సీట్లు రావడం ఆశ్చర్యం మాత్రమేకాదు కొత్త అనుమానాలకూ ఆస్కారం ఇచ్చింది. .
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవో చాలామందికి గుర్తుండవు. సిబిఐ, ఇడి, ఐటి, ఎన్ ఐఏలు, ఎన్నికల కమీషన్ లను మాత్రమేగాక అవసరం అయితే సుప్రీంకోర్టును సహితం బిజెపి తన భాగస్వామ్య పక్షాలుగా మార్చుకోగలదు. దాని సామర్ధ్యం అపారమైనది.
భారత ఎన్నికల కమీషన్ (ఇసిఐ) బీహార్ ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించింది. సరిగ్గా ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరిట అది లక్షల మందిని ఓటర్ల జాబితానుండి తీసేసింది. మరికొన్ని లక్షల మందిని కొత్తగా చేర్చింది. ఎన్డీ కూటమికి వ్యతిరేకంగా ఓట్లేస్తారనే సమూహాలను జాబితానుండి తొలగించారనీ, ఎన్డీ కూటమికి అనుకూలురైన వారిని కొత్తగా చేర్చారని ఆరోపణలున్నాయి. భారత ఎన్నికల ప్రధాన అధికారీ గ్యానేష్ కుమార్ ఈ వ్యూహాన్ని రచించి అమలు చేశారని రాహుల్ గాంధీ గణాంకాలతో సహా చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని తేలిగ్గా కొట్టివేయలేం.
1980-90ల నాటి మాట. స్వదేశీ పిచ్ ల మీద ఇండియాకన్నా పాకిస్తాన్ మెరుగైన ఫలితాలను సాధిస్తున్న కాలంలో ఒక స్పోర్ట్స్ ప్రతినిధి 'లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్ ను ఒక చిత్రమైన ప్రశ్నవేశాడు. ఇండియా టీమ్ లోనికి పాకిస్తాన్ టీమ్ నుండి ఒక ప్లేయర్ ను తీసుకోవాల్సి వస్తే తన ప్రాధాన్యత ఎవరూ? అని అడిగాడు. దానికి గవాస్కర్ అంతకన్నా చిత్రమైన సమాధానం చెప్పాడు. "నేను ఏ పాకిస్తానీ ఆటగాడిని ఎంచుకోను. నిజానికి, నేను భారత జట్టులోకి పాకిస్తానీ అంపైర్‌ను తీసుకుంటాను!" అనే అర్ధం వచ్చేలా సమాధానం చెప్పాడు. ఆటగాళ్లకన్నా అంపైర్ల తప్పుడు నిర్ణయాలవల్ల పాకిస్తాన్ గెలుస్తున్నది అని చెప్పడం గవాస్కర్ ఉద్దేశ్యం. బిహార్ ఎన్నికల ఫలితాలను చూసేక గవాస్కర్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నికల ప్రధానాధికారులు వుంటే చాలు మోదీజీ-అమిత్ షాజీల జోడి ఎన్ని విజయాలనైనా సాధించగలదు.
17-11-2025




.png)