సర్,
ఈ వ్యాసాన్ని ‘సాక్షి’లో ప్రచురణకు పరిశీలించండి.
మీకు కుదరని పక్షంలో ఆ విషయాన్ని నాకు సాధ్యమయినంత త్వరగా
తెలియపరచండి.
మరో పబ్లిషర్ ను సంప్రదిస్తాను.
-
డానీ
We know the enemy but not the Friends
*శత్రువు తెలుసు; మిత్రులెవరో తెలీదు!!*
డానీ
సమాజ విశ్లేషకులు
వర్తమాన భారత
సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణిస్తున్నారు. ఇది కార్పొరేట్ మతతత్త్వ
నియంతృత్వం (Corporate Communal Dictatorship-CCD) అనే భావన ఇప్పుడు క్రమంగా
బలాన్ని పుంజుకుంటోంది. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ
విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బిజెపి నాయకత్వంలోని
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఏ).
ఈ వ్యవస్థ మారాలని అత్యధికులు
ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది; కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వ రాజ్యాన్ని
కూల్చి, ఎన్డీయేను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరిష్కారం. అయితే, ఆచరణ అంత సులువుకాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ
ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే
మాటకు అర్ధాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా అన్వయించుకోవచ్చు.
లేత ఎరుపు నుండి
ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో
సాగిన ఉద్యమాలన్నీ పౌరసమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని
రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా
వెలిగిన పౌరసమాజాన్ని కూడ ఇప్పుడు సిసిడి కలుషితం చేసేసింది. సమానత్వ, సహోదర, సామ్యవాద భావాల నుండి సమాజాన్ని తప్పించే
పనిలో పడింది. దీనిని శుధ్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.
బహుళ పార్టీల
పార్లమెంటరి ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం వుంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే
లోక్ సభ ఎన్నికల్లో మనకు నచ్చని పార్టీనో,
కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ
కూడ కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు వుంటారు. వాళ్ళలో ఓ 70 కోట్ల
మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం
చేసే బృహత్తర పథకాన్ని రచించి కఛ్ఛితంగా ఫలితాలను సాధించే కార్యాచరణ ఒకటి వుండాలి.
అయితే,
ప్రజాస్వామ్యం పేదదికాదు; పేదోళ్ళది అంతకన్నా కాదు. రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి
నడిపే నియంతృత్వంగా ప్రజాస్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పారడాక్సీ! ఈ
వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి! (Manufacturing Consent) అన్నమాట.
ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.
అయితే, సమాజం
చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సిసిడి ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమనుతాము
అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు
పలకలేదు. 2014 నుండి 2024 వరకు జరిగిన
మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్ డి కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం
మాత్రమే. అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు ఎన్
డి కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్ధం ఏమిటీ? ఎన్ డి కూటమి తన
స్వంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యతవల్ల మాత్రమే గెలుస్తున్నది.
ఈ గణాంకాలను
చూసినపుడు ఎవరికైనా వచ్చే ఆలోచన ఏమంటే విపక్షాలు ఏకం అయితే ఎన్డీ కూటమిని ఓడించడం
సులువు అని. గణితశాస్త్రం ప్రకారం ఇది వాస్తవం. గానీ, విపక్షాలను ఏకం చేయడం రాజకీయంగా
అంతసులువు కాదు. ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ
తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి.
మరోవైపు, ఎన్డీ కూటమి ఎకశిలా సదృశ్యంగా సమైక్యంగా వుంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్
వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీష్ కుమార్ వంటి
సోషలిస్టులు కూడ వుంటారు. అయినా, అందరూ ఒక్కటై వుంటారు. అది వాళ్ళ విజయరహాస్యం.
విపక్షాలను ఏకం
చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ
ఎన్నికలకు ముందు ఎద్దేలు కర్ణాటక (మేలుకో
కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుంబిగించింది.
ఎన్నికలకు సంబంధించిన సూక్ష్మ అంశాలను కూడ వదలకుండ గొప్ప వ్యూహరచన చేసింది. ఆశించిన
ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నాలజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో వున్న
బిజెపి ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగావున్నాసరే ఎన్నికల్లో ఓడిపోయింది.
ప్రతిపక్షంగావున్న కాంగ్రెస్ కు ఓట్లు స్వల్పంగా (4-5 శాతం) పెరిగినాసరే, సీట్లు భారీగా పెరిగి, అధికారాన్ని
చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగావున్నచోటనే ఎద్దేలు కర్ణాటక ప్రత్యేక
దృష్టిపెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆ సంస్థ
ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బిజెపి తన ఆధిక్యాన్ని చాటుకుంది. కాంగ్రెస్ కు 9
స్థానాలు దక్కితే బిజెపి 19 స్థానాలు కైవశం చేసుకుంది.
ఎద్దేలు కర్ణాటక
ఉత్తేజంతో 2023 తెలంగాణ ఎన్నికల్లో, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, అలాగే 2024
లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ మేలుకో తెలంగాణ, మేలుకో ఆంధ్రప్రదేశ్, భారత్
బచావో పేర్లతో కొందరు కొంత కృషి చేశారు. తెలంగాణలో
బిఆర్ ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అయితే, అందులో ఈ
పౌరసంస్థల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ
సంస్థలు చురుగ్గా పనిచేసిన హైదరాబాద్ నగరంలో అధికార బిఆర్ ఎస్ బలం తగ్గకపోగా
పెరిగింది. అంటే నెగటివ్ ఎఫెక్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడ మేలుకో ఆంధ్రప్రదేశ్, భారత్
బచావో ప్రభావం అస్సలు లేదు. పైగా, ప్రతిపక్షంగావున్న ఎన్డీ కూటమి అధికారాన్ని
చేపట్టింది. అంతేగాక ఏపి, తెలంగాణల్లో ఎన్డీ
కూటమి లోక్ సభ స్థానాలు పెరిగాయి. ఇదంతా నెగటివ్
ఎఫెక్ట్.
ఇందులో రెండు అంశాల్ని గమనించవచ్చు. మొదటిది; ఈ ఎన్నికలు
అన్నింట్లోనూ ప్రజలు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టిల బలాన్ని తగ్గించారు.
రెండోది; కీలకమైన లోక్ సభ ఎన్నికల్ని పౌర సంఘాలు ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి.
రాబోయే 2029 లోక్ సభ
ఎన్నికల్లో ఎన్డీ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం
ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి. ఇదొక
సానుకూల సంకేతం. అయితే, జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రత్యేకత వుంది. ఎన్డీ
కూటమికి ప్రతిపక్షం లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంచేత అధికార కూటమికి వ్యతిరేకంగా,
ప్రతిపక్షాలతో ఐక్య కార్యాచరణ కమిటీలను
ఏర్పరచడానికి ఇక్కడి నేల అనువుగాలేదు. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా వుంటున్న
ఇండియా కూటమి కాలుమోపడానికి ఇక్కడ చోటు కనిపించడం లేదు. అంచేత ఇక్కడ జీరో నుండి
మొదలెట్టాలి.
తొలి అడుగులో, వామపక్ష
(మార్క్స్), సామాజికన్యాయ (అంబేడ్కర్) ఆదర్శాలుగల
రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సిసిడి, ఎన్డీ
కూటమికి బాధిత సమూహాలు అనేకం వున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం వుంటుంది.
ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మతసామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బిసిలు, ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు
ఆధిపత్యకులాల్లోని పేదలు, ఉదారవాదులకూ వారివైన ప్రత్యేక లక్ష్యాలు వుంటాయి. ఇలా
విభిన్న లక్ష్యాలున్న సమూహాలన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి.
ఇంతటి బాహుబలి
ప్రాజెక్టును ఒక్కసారిగా చేపట్టలేనప్పుడు దాన్ని క్యాప్సూల్స్ గా మార్చి
వంతులవారీగా పూర్తిచేయడం ఒక ఆచరణ సాధ్యమైన మార్గం. అలా, మొదటి దశలో ఆంధ్రప్రదేశ్
లోని వామపక్షాలన్నింటినీ ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది ఇప్పుడు ముందుకు వచ్చిన ఒక
ప్రతిపాదన. ఆ వెంటనే సామాజికన్యాయ పార్టీలను కలపాలనేది లక్ష్యం. నిజానికి ఇదేమీ కొత్తది కాదు. ఇలాంటి వేదికలు
ఇప్పటికే వున్నాయి. వాటికి ఒక విచిత్ర లక్షణం వుంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల
తరువాత అవి కలిసి వుంటాయి. ఎన్నికల సమయంలో ఎవరి ఎత్తుగడలు వారివి; ఎవరి పొత్తులు
వారివి. అంచేత, ఇప్పటి జేఏసిలు ఏవీ ఎన్నికలకు పనికిరావు. పైగా, లోక్ సభ వ్యూహాల్ని
పార్టీల కేంద్ర కమిటీలు రచిస్తాయి, రాష్ట్ర కమిటీలు వాటిని ఆచరిస్తాయి. అందుచేత, ఈ
విషయాల్లో రాష్ట్ర కమిటీలు చేయగలిగింది కూడ ఏమీ వుండదు. లోక్ సభ ఎన్నికల మీద
గురిపెట్టి రాష్ట్ర కమిటీలతో మాట్లాడి ఊరుకుంటే
పెద్ద ప్రయోజనమూ వుండదు.
ఎవర్ని, ఎందుకు
ఓడించాలనుకుంటున్నామో ప్రకటిస్తే సరిపోదు. ఎవర్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నామో స్పష్టంగా
ప్రజల ముందు పెట్టాలి. దానికి అనుగుణంగా కలిసి వచ్చే శక్తుల్ని పార్టిల్ని అక్కున
చేర్చుకోవాలి. కలిసిరాని శక్తుల్ని పార్టిల్ని నిర్మొహమాటంగా విమర్శించాలి.
లోక్ సభ ఎన్నికల్లో
ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని
సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధోమధనం సాగాలి.
9 నవంబరు 2025
(వామపక్ష సామాజిక ప్రజాస్వామ్య లౌకిక శక్తుల
కూటమి కోసం
9 నవంబరు 2025 రాత్రి నిర్వహించిన జూమ్
మీటింగులో చేసిన ప్రసంగానికి పూర్తిపాఠం)
No comments:
Post a Comment