Monday, 23 September 2013

Chandrababu - Barometer of Alliance Politics

చంద్రబాబు : కూటమి రాజకీయాల భారమితి
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

        కవిత్వానికేకాదు, రాజకీయాలకు అనర్హమైనదీ ఏదీలేదు. ఒకే మాట, ఒకే భార్య, ఒకే భర్త, అనే మాటలు కూటమి రాజకీయాల్లో పనికిరావు. అన్యోన్య దాంపత్యం అనుకున్న కాపురం పెటాకులు కావచ్చు. అంత వరకు తిట్టిన తిట్లు తిట్టకుండ తిట్టుకున్న వాళ్ళు కలిసి కొత్త కాపురం పెట్టవచ్చు; రహాస్యంగానో, బహిరంగంగానో!

        స్వాతంత్రం వచ్చిన తొలి రెండు దశాబ్దాల్లో ఓటర్లకు పెద్ద ఆప్షన్లు వుండేవికావు. అయితే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టు. ఇందులో సింహ భాగం సహజంగా కాంగ్రెస్ దే. మూడవ శిబిరంగా భారతీయ జనసంఘ్ వుండేదిగాని దాని ప్రభావం ఢిల్లీ, తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో, అదీ చాలా పరిమితంగా మాత్రమే వుండేది. 1967 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, జనసంఘ్ చేతులు కలిపి కాంగ్రెస్ అధిపత్యాన్ని తొలిసారిగా దెబ్బతీశారు. డెబ్భయ్యవ దశకపు అత్యయిక పరిస్థితి, ఒక్క సిపిఐని మినహా,  దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేసింది.   1977 నాటి ఎన్నికల్లో, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతాపార్టీగా మారి అధికారాన్ని దక్కించుకున్నాయి.

        రాజకీయాల్లో ప్రతీదీ కొన్ని కొత్త విలువలతోనే ప్రవేశిస్తుంది. అయితే, ప్రకటించుకున్న విలువల్ని కోల్పోవడానికి దానికి ఎంతో కాలం పట్టదు.  స్వంత విలువలంటూ లేకపోతే, ఇంకొకరిని విమర్శిస్తూ చేపట్టిన అధికారం, ఎక్కువ కాలం కొనసాగదు. అత్యయిక పరిస్థితి నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆవిర్భవించిన జనతాపార్టీ తనదైన స్వంత పంథాలేక  మూడున్నరేళ్లలోనే ప్రాభవాన్ని కోల్పోయింది.

        జనతా పార్టీ వైఫల్యాలతో, 1980 ఎన్నికల్లో ఇందిరాగాంధి తిరిగి అధికారాన్ని చేపట్టగా, ఇందిరాగాంధి హత్యవల్ల వచ్చిన సానుభూతితో, 1984 ఎన్నికల్లో రాజీవ్ గాంధి విజయం సాధించారు. ఆ తరువాత, ఇప్పటి వరకు భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడా  లోక్ సభలో మేజిక్ ఫిగర్ 273కు చేరుకోలేదు. కూటమి రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కూటమి రాజకీయాల్లో ఆదర్శాలు తక్కువ. అవకాశవాదాలు ఎక్కువ.

        ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబుకు ఒక ప్రత్యేకత వుంది. కూటమి రాజకీయాల్లో వారు స్పెషలిస్టు ప్లేయరు. 1994 ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన  యన్టీ రామారావును ఏడాది తిరక్క ముందే గద్దెదించి అధికారంలో కొనసాగిన చరిత్రవారిది. ఎడమ పక్కన లెఫ్టిస్టు కమ్యూనిస్టుల్నీ, కుడిపక్కన రైటిస్టు బీజేపినీ పెట్టుకుని ఈ ఫీట్ ను సాధించారువారు. కూటముల ఏర్పాటు నైపుణ్యాన్ని ఆ తరువాతి కాలంలో  జాతీయ రాజకీయాల్లోనూ నాలుగైదు సందర్భాల్లో ప్రదర్శించారు చంద్రబాబు.    

        సమాజం తరచుగా, అతి వేగంగా పెనుమార్పులకు గురికాడాన్ని మనం ఇరాన్ లో చూడవచ్చు. అంచేత, ప్రపంచ గాలి ఎటువైపుకు వీస్తుందో తెలుసుకోవడానికి సమాజశాస్త్రవేత్తలు ఇరాన్ వైపు చూస్తారు. వాళ్లకు ఇరాన్ ఒక సమాజ భారమితి. ఇరాన్ ఆధునిక పోకడలకు పోతుంటే, ప్రపంచంలో పశ్చిమ గాలి వీస్తున్నదని అర్ధం. ఇరాన్ సాంప్రదాయ పునరుధ్ధరణకు పూనుకుంటుంటే ప్రపంచంలో తూర్పు గాలి వీస్తున్నదని అర్ధం. 

        రాష్ట్ర రాజకీయాల్లో ఏ గాలి వీచబోతున్నదో  తెలుసుకోవాలంటే చంద్రబాబు వైపు చూడాలి. రాబోయే పరిణామాలకు ముందుగా స్పందించే గుణం ఆయనకుంది.   ఒక విధంగా ఆయన కూటమి రాజకీయాల భారమితి. అయితే, ఆయన పెరట్లో కోకిల తొందరపడి ముందే కూస్తుంది. చాలాసార్లు తప్పుడు సంకేతాలూ ఇస్తుంది.

        ప్రపంచ వ్యాప్తంగా ఐటీ బూమ్ కొనసాగుతున్నప్పుడు చంద్రబాబు దాన్నీ సకాలంలో గట్టిగా పట్టుకున్నారు.  అది కలకాలం కొనసాగుతుందని భావించారు. దేశంలో వ్యవసాయం అంతరించి, మూడు, నాలుగు తరాల సాంకేతిక నైపుణ్యం వచ్చి పారిశ్రామికరంగం పరుగులు పెడుతుందని ప్రపంచబ్యాంకు చేసిన ప్రచారానికి ఆయన ఆకర్షితులయ్యారు. చంద్రబాబు అధికారానికి 2020 వరకు ధోకా లేదంటూ ప్రపంచబ్యాంకు ప్రాయోజిత సర్వేసంస్థలు తయారుచేసిన నివేదికల్నీ వారు నమ్మేరు. రాజధాని నగరం హైదరాబాద్ లో, దక్షణ, తూర్పు, ఉత్తర మండలాల్ని పక్కనపెట్టి, పశ్చిమ మండలంలో తన కలల సైబర్ రాజధానిని నిర్మించారు.

        అన్నీ అనుకూలంగా వున్న కాలంలో చంద్రబాబు అనుకున్నవన్నీ జరిగాయి. జాతీయ రాజకీయాల్లో దేవేగౌడ, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పాయిలను ప్రధానుల్ని చేయడానికి చంద్రబాబు తిప్పిన చక్రం పనిచేసింది. దేవేగౌడ, ఐకే గుజ్రాల్ లను ప్రధానుల్ని చేయడానికి కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పుడు పెద్ద విమర్శలు రాలేదుగానీ, వాజ్ పాయికి మద్దతు పలికినపుడు మాత్రం చంద్రబాబు లౌకిక పార్శ్వం విమర్శలకు గురైంది. ముస్లింల మనోభావాల్ని దెబ్బతీశారంటూ అప్పటి  భారీ పరిశ్రమల మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకున్నారు. అయితే, వాజ్ పాయిని సమర్ధించడం చంద్రబాబుకు రాజకీయంగా కలిసి వచ్చింది. కార్గిల్ సెంటిమెంటు వాజ్ ప్రభుత్వాన్ని  1999 ఎన్నికల్లో గెలిపించగా, వాజ్ పాయిని నమ్ముకున్న చంద్రబాబు ఆ ఏడాది జమిలిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కారు.

        టిడిపి_బీజేపి రాజకీయ దాంపత్యానికి నరేంద్ర మోదీతో సమస్యలు మొదలయ్యాయి. 2002 లో సాగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా నరేంద్ర మోదీని చంద్రబాబు స్వల్పంగా విమర్శించినప్పటికీ బీజేపీతో దోస్తీని వదలలేదు. దీని ఫలితం 2004 ఎన్నికల్లో కనిపించింది. కార్గిల్ యుధ్ధం అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ గెలిపించగా, నరేంద్ర మోదీ మార్కు గుజరాత్ అల్లర్లు అటు వాజ్ పాయినీ, ఇటు చంద్రబాబునీ ఓడించాయి.

        అన్నీ ప్రతికూలంగా వున్న కాలంలో ఎన్ని అనుకున్నా ఏవీ జరగవు. అలిపిరిలో నక్సలైట్ల బాంబు పేలుడు తరువాత, తన మీద సానుభూతి పవనాలు వీస్తాయని నమ్మి 2004లో ముందస్తు ఎన్నికలుకు వెళ్ళారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం ప్రపంచ బ్యాంకు అప్పటి ఛైర్మన్ జేమ్స్ వుల్ఫెన్షోన్ ను తలపించేది. సబ్సిడీ అన్న పదమే వారికి నచ్చేదికాదు. సాధారణంగా పాలకుల పేరే నగరాలకు వస్తుంది. చంద్రబాబు విషయంలో ఇది తలకిందులయింది.  హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి ఇష్టపడేవారు.  అరవై ఆరేళ్ళ స్వాతంత్రం తరువాత కూడా సగం మందికి ఆహార భద్రతలేని దేశంలో హైటెక్ పాలన ఎక్కువ కాలం నిలబడదు. చంద్రబాబు విషయంలోనూ అదే జరిగింది.

        అధికారాన్ని కోల్పోయాక చంద్రబాబు భారమితి దిక్కు మార్చింది. వారు అంతవరకు ప్రేమించినవాటిని దూరంగా పెట్టారు. అంతవరకు ద్వేషించిన వాటిని అక్కున చేర్చుకోవడం మొదలెట్టారు. బీజేపీతో దోస్తీకి కటిఫ్ చెప్పారు. సమైక్యతను చాటిచెప్పిన నోటితోనే రాష్ట్ర విభజనకు సరదాపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి  రాత పూర్వకంగా రాసిచ్చారు. సబ్సిడీ పేరు చెపితేనే మండిపడే వ్యక్తి ఆల్ ఫ్రీ బాబు గా మారిపోయారు.   అయినా వారిమీద హైటెక్ ముద్ర పోలేదు. 2009లో వరుసగా రెండో ఓటమిని చవిచూశారు.

        మతవాద రాజకీయాలు కొన్ని ఓట్లను సంపాదించిపెట్టేమాట నిజమే. కానీ, భారతీయుల్లో అత్యధికులు మతాన్ని ఎంతగా అభిమానిస్తారో, మతవాద రాజకీయాల్ని అంతగా ద్వేషిస్తారు. ఆందుకే, అప్పటివరకు మతవాద శిబిరంలో అతివాదిగావున్న లాల్ కిషన్ అడవాణీ 2005 లో కరాచి వెళ్ళి సాక్షాత్తు మహమ్మదాలీ జిన్నా సమాధి దగ్గర నిలబడి పాకిస్తాన్ నిర్మాతను లౌకికవాది అని కొనియాడి వచ్చారు. అలా చేయకుంటే భారతదేశంలో ప్రధాని అభ్యర్ధికి ఆమోదాంశం రాదని వారికి తెలుసు. లౌకిక స్వరూపాన్ని సంతరించుకోవడానికి చంద్రబాబు కూడా అడవాణీ బాటలోనే నడిచారు. బీజేపీతో జట్టు కట్టినందుకు 2011 నాటి టీడిపి మహానాడులో వారు ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. భవిష్యత్తులో బీజేపీతో కలిసేదిలేదని మరీ ఒట్టేశారు.
ఆ తరువాత కాంగ్రెస్ మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు చంద్రబాబు. రాష్ట్రంలో సంఖ్యా బలం సరిపోక సతమతమౌతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగుతున్నదంటే అది చంద్రబాబు పరోక్షసహకరమనే చెప్పాలి.  2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వాన యూపియే ప్రభుత్వం ఏర్పాటుకావడానికి అవసరమైతే సెక్యులరిజం ప్రాతిపదికన మద్దతు ఇస్తామని  టెన్ జన్ పథ్ కు తెలుగుదేశం అధినేత సంకేతాలు పంపించారని కూడా వార్తలు వచ్చాయి.

        కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని తెలిపిన తరువాత చంద్రబాబు భారమితి మళ్ళీ దిక్కులు మార్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడంవల్ల, తెలంగాణాలో టిఆర్ ఎస్, సీమాంధ్రలో జగన్ కాంగ్రెస్ బలపడి, తమ పార్టీ మాత్రం రెండు ప్రాంతాల్లోనూ  దెబ్బతినే పరిస్థితులొచ్చాయని తెలుగుదేశం అధినేత భావిస్తున్నారు. నేరుగా సమైక్య నినాదం అందుకోకున్నా అలాంటి అర్ధమే వచ్చేవిధంగా "ఆత్మగౌరవ" యాత్ర మొదలెట్టారు. ఈలోపులో, నరేంద్ర మోడీ, చంద్రబాబు మళ్ళీ రాజకీయ డేటింగ్ మొదలెట్టారని వార్తలు గుప్పుమన్నాయి. టిడీపి వర్గాలు గట్టిగా ఖండించకపోవడాన్ని చూస్తుంటే, ఇవి నిప్పులేని పొగ కాకపోవచ్చు!

        సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల వ్యవధి వుంది. ఈ లోపులో చంద్రబాబు భారమితి మరెన్నో ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదు!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
 20 సెప్టెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
 24 సెప్టెంబరు 2013
<lang=eng>http://www.suryaa.com/opinion/edit-page/article-153817


Chandrababu -  Barometer of Alliance Politics  

1 comment:

  1. AN EXTRA ORDINARY AND IMPARTIAL POLITICAL ANALYST,DANNY.

    ReplyDelete