ఎగువ రాష్ట్రాల నీటి యుధ్ధం
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
దంపతుల మధ్య పొసగనప్పుడు విడాకులు వినా మార్గంలేదు. అంతవరకు బాగానేవుంది. విడాకులంటే, జీవిత భాగస్వామిని రోడ్దు మీద వదిలేయడం కాదుకదా! విడాకుల లాంఛనాలు, పరిహారాల విషయంలో ప్రతి ప్రజాసమూహానికీ సాంప్రదాయికంగా తమవైన విధివిధానాలున్నాయి.
మనం రాజకీయాల్ని పట్టించుకున్నంతగా, సామాజిక అంశాన్ని పట్టించుకోవడంలేదుగానీ, రాష్ట్ర విభజన అంశం రగులు తున్నట్టుగానే, గత మూడేళ్లుగా దాంపత్య విభజన అంశం కూడా నలుగుతోంది. ఇవి రెండూ సంబంధంలేని రెండు భిన్న విషయాలని చాలామంది అనుకోవచ్చు. స్వభావంలోనూ, విధివిధానాల్లోనూ ఇవి ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అంశాలని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సరైన సమయంలో ప్రారంభిస్తామని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబరులో ప్రకటిస్తున్న సమయంలోనే వివాహ చట్టాల్ని సవరించాలంటూ వివిధ మహిళా సంఘాలు జాతీయ స్థాయిలో ఆందోళన సాగిస్తున్నాయి. ఆ మేరకు, అప్పటి కేంద్ర న్యాయశాఖామంత్రి వీరప్ప మెయిలీ వివాహ చట్టాల సవరణ బిల్లు _ 2010 ని రూపొందించి, పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, వివాహ చట్ట సవరణ అంశాలు రెండూ గత మూడేళ్ళుగా జాతీయ రాజకీయాల్లో నలుగుతూనే వున్నాయి. యూపియే సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, జులై 30న ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకారం తెలుపగా, ఆగస్టు 26న వివాహ చట్టాల (సవరణ) బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
తరచిచూస్తే ఈ రెండు అంశాల మధ్య అనేక పోలికలు కనిపిస్తాయి. వీటిల్లో, ఒకటి రాష్ట్ర విభజనకాగా, మరొకటి దాంపత్య విభజన. రాష్ట్ర విభజనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పెద్ద ఎత్తున అందోళనలు జరిగాయి; జరుగుతున్నాయి. వివాహ సవరణ బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగానూ ఆందోళనలు జరిగాయిగానీ అవి అంత హడావిడి సృష్టించలేదు. రాష్ట్ర విభజన ఉద్యమాల్లో భావోద్వేగాలే బలంగా పనిచేయగా, వివాహ సవరణ బిల్లు ఆందోళనలో హేతుబధ్ధత ప్రధానంగా పనిచేసింది. చివరకు, రాష్ట్ర విభజన అంశంపై, ఇప్పటికి, పార్టీల స్థాయిలో మాత్రమే నిర్ణయం జరగ్గా, వివాహ సవరణ బిల్లు రాజ్యసభ అమొదాన్ని కూడా పొంది చట్టంగా మారిపోయింది.
ఈ రెండు పరిణామాలను గమనిస్తే, మనకు రెండు అంశాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. రాజకీయ పొరాటంకన్నా, మహిళలు సాగించిన ఆందోళనే సత్వర ఫలితాలని సాధించిందనీ, మొదటిదానికన్నా రెండోది అనేక విధాలుగా శాస్త్రీయమైనదనీ!
దాంపత్య విభజన సమయంలోనో, ఆ తరువాతో భార్యకు భరణం ఇవ్వడం అనేది పాత సాంప్రదాయమే. భార్యకు భారీగా భరణాలు ఇవ్వాల్సివచ్చిన కేసులు కూడా అనేకం వున్నాయి. వివాహం తరువాత, దాంపత్య కాలంలో, పెరిగిన స్థిర చరాస్తుల్లో భార్యకు సగం వాటా ఇవ్వాలని గతంలో కొన్ని న్యాయస్థానాలు తీర్పు చెప్పివున్నాయి. కొత్త చట్టం మరో అడుగు ముందుకు వేసింది. వివాహానికి ముందే భర్తకు వారసత్వంగా వచ్చిన స్థిరాస్తిలోనూ భార్యకు వాటా ఇవ్వాలని కొత్త చట్టం నిర్దేశించింది. వివాహ చట్టాల్లో నిస్సందేహంగా ఇది గొప్ప ముందంజ. రాష్ట్రాల విభజనల్లోనూ ఇలాంటి విలువలు రావల్సిన అవసరం వుంది.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపియే సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ విభజనకు పచ్చ జెండా వూపినతరువాత, తెలంగాణ ప్రాంతాంలో ఉత్సాహం, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో నైరాశ్యం కనిపించడంలో అసహజమైనదేదీలేదు. రాయలసీమ, తీరాంధ్ర ప్రజలు ఇప్పటికీ సమైక్యాంధ్ర నినాదమే చేస్తూ వుండడమే బాధాకరం. రాయలాంధ్రులు ప్రత్యామ్నాయాల గురించి హేతుబధ్ధంగా ఆలోచించాలి
సమైక్యాంధ్ర అనే నినాదంపై వివాదాన్ని పక్కన పెడితే, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాల్లో సాగుతున్న ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కర్నూలులో జరిగిన కార్యక్రమంలో లక్ష మందికి పైగా పాల్గొన్నారు. విజయవాడలో, అనంతపురంలో కూడా ఇలాంటి భారీ ప్రదర్శనలు జరిగాయి. ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బధం పెరిగినపుడు ఉద్యమకారులు ప్రజల మధ్యనే ప్రవాస జీవితం గడుపుతారు. ఉద్యమాల్లో చేసిన మోసాలు బయటపడి ప్రజలు తిరగబడినప్పుడు ప్రజాప్రతినిధులు పలాయన జీవితం గడుపుతారు. ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్నది ఇదే! ఇన్నాళ్ళు సీట్లు, ఓట్ల ప్యాకేజీ రాజకీయాలు జరిపినవాళ్ళు ప్రస్తుతం ప్రజలకు భయపడి ఢిల్లీలో శరణర్ధులుగా వున్నారు. సాంప్రదాయక నాయకులు ఇప్పుడు సీమాంధ్రలోలేరు. సాంప్రదాయేతర ఆలోచనాపరులు చెప్పే మాటల్నీ వినే స్థితిలో అక్కడి ప్రజలు లేరు. ఇదో నిస్పృహ విన్యాసం!
నీళ్లు, నిధులు, నియామకాల సమస్య గురించి రాయలాంధ్ర ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రతి మాటా అక్షరాలా నిజం. దానికి సమైక్యాంధ్రా యే పరిష్కారం అనడమే అమాయికంగా వుంది. రోగం వాస్తవం. మందు బూటకం.
సీమాంధ్రులకు ఈ గోసాయి చిట్కాలను అక్కడి నాటు వైద్యులు అలవాటు చేశారు. 2009 లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను ఆరంభిస్తున్నట్టు ప్రకటించినప్పుడు, సీమాంధ్రులు అప్రమత్తం అయివుండాల్సింది. విభజనని ఆమోదించడానికి తమ షరతులను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి, వాటి సాధన కోసం ఈ నాలుగేళ్ళూ పొరాడి వుండాల్సింది. కానీ, అలా జరగలేదు. "చావుకు పెడితే లంఖణానికి దిగివస్తాడు" అన్నట్టు, "సమైక్యాంధ్రా అంటే కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి మన కోరికలన్నీ నేరవేరుస్తుంది" అని అక్కడి నాటు వైద్యులు నూరిపోశారు. భూతవైద్యులకు అలవాటు పడినవాళ్లకు ఆధునిక మానసిక వైద్య నిపుణులు ఆనరుకదా!
మహమ్మారి జబ్బులకు ఎక్కువ రోజులు గోసాయి చిట్కాలు వాడితే, జబ్బు ముదిరి ప్రాణహాని ప్రమాదం ముంచుకు రావచ్చు.
ప్రస్తుతం, రాయలాంధ్రలో సాగుతున్న ఆందోళనను గమనిస్తే, తీరాంధ్ర వాళ్లకన్నా రాయలసీమవాళ్ళు వివేకాన్ని ప్రదర్శిస్తున్నారనిపిస్తోంది. రాయలసీమవాళ్ళ దగ్గర ప్లాన్_బీ, ప్లాన్_సీ, ప్లాన్_డీ లు కూడా వున్నట్టు కనిపిస్తోంది. మొదటిది, వాళ్ళు రాష్ట్రాన్ని సమైక్యాంగా వుంచాలని కోరుతున్నారు. రెండోది, రాయలసీమను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటున్నారు. మూడోది, రాష్ట్ర విభజన తప్పదనుకుంటే, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు. నాలుగోది, ఒకవేళ రాయలసీమను తీరాంధ్రతో కలిపి రాయలాంధ్ర చేయాలనుకుంటే, రాయలసీమకు రాజధాని నగరం ఇవ్వడంతోపాటూ, నికరజలాల వ్యవహారం తేల్చాలి అంటున్నారు.
విషాదం ఏమంటే తీరాంధ్రుల దగ్గర ప్లాన్ _వన్ తప్ప మరేదీలేదు. సాక్షాత్తు శ్రీరాముడు అంతటివాడే అంబులపొదిలో పది బాణాలు పెట్టుకుని యుధ్ధానికి వెళ్ళినట్టు చదువుకున్నవాళ్లకు, ఉద్యమానికి నాలుగు ఆప్షన్లన్నా వుండాలనే ఇంగితం లేకపోవడం అన్యాయం. ప్రస్తుతం రాయలసీమ ప్రజలు చేస్తున్న వాదనలు వంటివి రేపు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చేయవచ్చు.
ఇప్పుడు, రాయలసీమ, తీరాంధ్ర ప్రజలు చేయాల్సింది ఏమంటే, సమైక్యాంధ్ర చిట్కాని పక్కనపెట్టి, ప్రత్యామ్నాయాలను రూపొందించాలి. సిడబ్ల్యూసి ప్రకటన వచ్చాక, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ ఒకదాన్ని ప్రతిపాదించారు. తరువాత ఎందుకో వారు మౌనంగా వుండిపోయారు. తెలుగుదేశం అధినేత చేసే ఇతర వివాదాస్పద వ్యాఖ్యల్ని అలావుంచినా, నిజానికి ఈ ప్యాకేజి కొంచెం ఆచరణాత్మకమైనదే! దాన్ని సాధించడానికి కేంద్రం మీద వత్తిడి తేవాలి. ఆ ప్యాకేజీలో, అవసరాన్నిబట్టి, ఇతర అంశాల్ని కూడా చేర్చవచ్చు, రాష్ట్రాన్ని సమైక్యాంగా వుంచాలనే మాటతప్ప!
కుప్ప తగలబడి ఒకరు ఏడుస్తుంటే, పేలాలు ఏరుకుని ఆనందించేవాళ్ళు మరొకరుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇరుప్రాంతాల ప్రజలు తీవ్ర భావోద్వేగాల్లో మునిగివున్న సందర్భాన్ని చూసుకుని, ఎగువనవున్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలు కృష్ణాజలాల హైజాక్ కు వలలు పన్నుతున్నాయి. కృష్ణా జలాల ట్రిబ్యునల్_2 గా పిలిచే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ముందు ఆ రెండు రాష్ట్రాలు వింతపోకడలు పోతున్నాయి.
గతంలో బచావత్ ట్రిబ్యూనల్ కృష్ణా నికర జలాలను చివరి చుక్జ్క వరకు మూడు రాష్ట్రాలకు పంచేసి, మిగులు జలాలను వినియోగించుకునే సౌకర్యాన్ని దిగివ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వదిలేసింది. ఈ మిగులు జలాల ఆధారంగానే, గత రేండు దశాబ్దాల్లో మన రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు మిగులు జలాల్లో తమకూ వాటలు కావాలని ఎగువ రాష్ట్రాలు వాదించడం కొత్త పరిణామం. దాని కోసం అవి ఎంచుకున్న సమయం మరీ అమానవీయం!
మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాదనలు ఏ స్థాయికి చేరాయంటే, రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపును అవి అడ్డంగా నిరాకరిస్తున్నాయి. రాయలసీమలో కృష్ణా ఆరగాణి ప్రాంతం (క్యాచ్ మెంట్ ఏరియా) లేనందువల్ల కృష్ణాజలాల్లో రాయలసీమకు వాటాలేదని వాదిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్ లోకన్నా తమ రాష్ట్రాల్లో కరువు ఎక్కువగా వుందికనుక, గతంలో, ఆంధ్రప్రదెశ్ కు కేటాయించిన నికరజలాల్ని తగ్గించి, వాటిని తమకు కేటాయించాలని వింతవాదనని ముందుకు తెచ్చాయి. "నికర జలాలైనా, మిగులు జలాలైనా మా అవసరాలన్నీ తీరిన తర్వాతే కిందకు వదులుతాం" అని ఆ రెండు రాష్ట్రాలు ఆగస్టు 27న ట్రిబ్యూనల్ ముందే తెగేసి చెప్పాయి.
సచివాలయంతో సబంధం వున్నవాళ్ళను ఎవర్ని అడిగినా 1982లో ఏడు నెలలు పాలించిన భవనం వెంకట్రామ్ ది అత్యంత బలహీన ప్రభుత్వం అని అంటారు. కానీ, అది నిజం కాదనిపిస్తోంది. భవనం వెంకట్రామ్ ప్రభుత్వంకన్నా బలహీనమైన ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం. హైదరాబాద్ లో మన ప్రభుత్వం పనిచేస్తున్న తీరు చూశాక, ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యూనల్ ముందు మన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఏపాటి వాదన వినిపించివుంటారో ఊహించడం కష్టంకాదు.
మనం ఇప్పుడు అన్నవస్త్రాల గురించి ఆరాటపడుతున్నాం. ఎగువరాష్ట్రాలు వున్న వస్త్రాలనే ఎత్తుకుపోయే పనిలో వున్నాయి! తెలంగాణ, తీరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఇప్పుడు ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించాల్సి వుంది. మూడు ప్రాంతాలూ సమైక్యంగా ఎగువరాష్ట్రాలపై నీటి యుధ్ధం చేయాల్సిన తరుణం వచ్చేసింది. దాయాదుల పోరు ఆ తరువాత కూడా కొనసాగించవచ్చు!!
(ఈ వ్యాసకర్త రాష్ట్ర విభజనను సంపూర్ణగా సమర్ధిస్తాడు. పంపకాల్లో, రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలకు న్యాయం చేయడానికీ మరింతగా కృషి చేస్తాడు.)
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ ః 90102 34336
హైదరాబాద్
30 ఆగస్టు 2013
ప్రచురణ :
సూర్య దినపత్రిక 1 సెప్టెంబరు 2013
A rational thought.A wise man must follow his advice.
ReplyDelete