Saturday, 30 November 2013

Irresponsible Political Parties

Irresponsible Political Parties

కృష్ణా ట్రిబ్యూనల్ కొత్త విలన్
విభజన సందట్లో బాధ్యతల విస్మరణ
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
        ఏ గుడ్డివాడికీ అర్ధంకాని ఏనుగులా తయారయ్యింది ఆంధ్రప్రదేశ్ విభజన.  మన నాయకులుగా చెలామణి అవుతున్నవాళ్ళు ఎవరికి ఎప్పుడు ఏది తోస్తే అది చెప్పేయడమే తప్ప, సమస్య మీద ఒక్కరికీ ఒక సమగ్ర దృష్టి వున్నట్టు కనిపించడంలేదు. 

        విభజన పూర్వ అధ్యాయంలో అదృష్టవంతులు ఇద్దరే; తెలంగాణలో కేసిఆర్, సీమాంధ్రలో సియం కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది, అనేక సంఘాలు, పార్టీలు, అనేక పధ్ధతుల్లో కొనసాగించినా ఆ క్రెడిట్ అంతా ఇప్పుడు కేసిఆర్ ఖాతాలో పడిపోతోంది. పదేళ్ల పాలనలో తాము చేస్తున్న ఏకైక మహత్కార్యంలా భావిస్తున్న సోనియా - రాహుల్ - మన్మోహన్ సింగ్  ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణవాదులు ఏది కోరితే అది ఇవ్వడానికి సిధ్ధం అన్నట్టు ప్రవర్తిస్తోంది. విభజనను సమర్ధించేవాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం తీరు బాధగా వుంది.  సముద్రం నుండి వచ్చే తుపాన్లను నేనేమీ చేయలేనుగానీ, కేంద్రం నుండి వచ్చే తుపాన్లను మాత్రం అడ్డుకుంటాఅనే ఒకే ఒక్క వెంటిలేటర్ తో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రాణం నిలబెట్టుకుంటోంది.

        సీమాంధ్ర ప్రజల భౌతిక సమస్యల్ని పక్కన పెట్టి, వాటిక్లి పరిష్కార మార్గాల్ని విస్మరి<చి, భాషాసంస్కృతుల  గురించి, భావోద్వేగాల్ని రెచ్చగొట్టినవాళ్లంతా ఇప్పుడు ట్రావెల్ బ్యాగులు సర్దుకుంటున్నారు.   సీమాంధ్ర మంత్రులు ఢిల్లీలో  కేంద్రమంత్రుల బృందంతో సాగిస్తున్న చర్చల వివరాలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. వందేళ్ల క్రితం గురజాడ అప్పారావు మనోళ్ళు వఠ్ఠి వెధవాయిలోయి అన్న మాటలకు ఇప్పుడు ప్రాసంగికత పెరిగినట్టు అనిపిస్తోంది.

        సీమాంధ్ర నేతలు మాత్రం హైదరాబాద్ ను యుటీ చేయాలనే సింగిల్ పాయింట్ ప్రోగ్రాంనే ఇప్పటికీ కోనసాగిస్తున్నారు.  కేంద్రమంత్రి జేడీ శీలం అయితే తెలంగాణవాళ్ళు ఏది అడిగినా ఇచ్చేస్తాం. కానీ, హైదరాబాద్ ను మాత్రం యూటీ చెయ్యండి అంటూ ఢిల్లీలో తెలంగాణ కేంద్రమంత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు,  అన్ని సంకేతాలు సానుకూలంగా వుండడంతో, హైఅదరాబాద్ తో కూడిన పది జిల్లాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన సంపూర్ణ రాష్ట్రం కావాలని తెలంగాణవాదులు  పట్టుబిగిస్తున్నారు.

        మనుషులకున్న చిత్రమైన లక్షణం ఏమంటే, తమకు అనుకూలమైన విషయాల్ని  మరెవ్వరూ  మార్చడానికి వీలులేని భగవద్గీత శ్లోకాలుగానో,  బైబిల్ వాక్యాలుగానో,  ఖురాన్ ఆయతులుగానో ప్రచారం చేస్తారు. 10, 17, 119”  అంటూ కేసిఆర్ చేస్తున్న డిమాండుగానీ, సమైక్యాంధ్రాకు 371 డి సహజ కవచకుండలంఅంటూ లగడపాటి రాజగోపాల్ గానీ చేస్తున్న ప్రచారంగానీ ఈ కోవలోకే వస్తాయి.  మారనిది ప్రపంచంలో ఏదీ వుండదు;. అజ్ఞానంతప్ప.

        తెలంగాణలో 17 లోక్ సభ, 119 అసెంబ్లీ స్థానాలు 2007లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా వచ్చాయి.  వాటిని మార్చడం కష్టసాధ్యం సావచ్చుగానీ, అసాధ్యం ఏమీకాదు.  అసలు విషయం ఏమంటే, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 7  అసెంబ్లీ నియోజకవర్గాలే వుండాలనే నియమం ఏమీలేదు. అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి వాటిని మార్చుకోవచ్చు. దానికి గొప్ప ఉదాహరణ నాగాలాండ్. ఆ రాష్ట్ర జనాభా 20 లక్షలు. 11 జిల్లాలు. రాష్ట్రం మొత్తానికి వున్నది  ఒకే ఒక లోక్ సభ నియోజకవర్గం.  అందులో,  ఏకంగా 60 అసెంభ్లీ సిగ్మెంట్లున్నాయి.  అలాగే, ఉత్తరప్రదేశ్ లో అత్యల్పంగా ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంభ్లీ సిగ్మెంట్లు మాత్రమే వున్నాయి. బీహార్ లో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి 6 అసెంభ్లీ సిగ్మెంట్లు వుండగా, ఢిల్లీలో 10  అసెంభ్లీ సిగ్మెంట్లు వున్నాయి.

        భద్రాచలం డివిజన్, మునగాల, అశ్వారావుపేట ప్రాంతాల్ని తిరిగి సీమాంధ్రలో కలపాలనడంలో తెలివిడి ఏమీలేదు. 1 నవంబరు 1956 కు ముందు అవి సీమాంధ్రలోనే వున్నాయి గాభట్టీ ఏలాగూ అవి తిరిగివస్తాయి.  తెలివైనవాళ్ళు అడగాల్సింది అది కాదు. పోలవరం, పులిచింతల ముంపు ప్రాంతాలు సీమాంధ్రలో వుండేలా కొత్త రాష్ట్ర సరిహద్దుల్ని నిర్ణయించాలి అని కోరడం అర్ధవంతంగా వుంటుంది. ఇందులో కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు వుండవచ్చు. ఎందుకంటే ప్రస్తుతమున్న డిజైను ప్రకారం పోలవరం ముంపు ప్రాతం కేవలం భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో మాత్రమే లేదు. పాల్వంచ రెవెన్యూ  డివిజన్ లోనూ ముంపు ప్రాంతం వుంది. పాల్వంచ రెవెన్యూ  డివిజన్ లోని  ముంపు ప్రాంతాన్ని పొందాలంటే, దానికి సరిపడా భూభాగాన్ని భద్రాచలం డివిజన్  నుండి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి వుంటుంది. దానికి, ఇరువర్గాలూ సిధ్ధపడాలి.  ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామిని సీమాంధ్రులు త్యాగం చేయాల్సి రావచ్చు.  కుచ్ ఖోకర్ పానా హై. కుచ్ పాకర్ ఖోనా హై.

        పోలవరం ప్రస్తావనను తెచ్చినప్పుడెల్లా ఈ వ్యాసకర్త కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు, విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది. పోలవరం ప్రాజెక్టును సమర్ధించడానికి ప్రధాన కారణం అది తీరాంధ్ర నేల మీద నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు. గోదావరి జలాల్ని పోలవరం ప్రాజెక్టు ద్వార కృష్ణా డెల్టాకు మళ్ళిస్తే, ఆ మేరకు ఆదా అయిన కృష్ణా జలాల్ని శ్రీశైలం ప్రాజెక్టు ద్వార రాయలసీమకు అందించాలనేది ప్రతిపాదన. రాయలసీమకు జలన్యాయం జరక్కపోతే రాష్ట్రంలో మరో కుంపటిని రగిలించినట్టే.  ఇందులో విషాదం ఏమంటే, రాయలసీమకు చెందిన నాయకులు కూడా పోలవరాన్ని తీరాంధ్ర ప్రాజెక్టుగా భావించి విమర్శించడం.

        పోలవరం ప్రాజెక్టులో అన్నింటికన్నా ప్రధాన సమస్య  నిర్వాసితులది, వాళ్లకు పునరావాసానిది. నిర్వాసితుల్లో అత్యధికులు ఆదివాసులు. మైదాన ప్రాంతాల్లో పునరావాస ప్యాకేజిని రూపొందించినంత సులువుగా ఆదివాసులకు పునరావాస ప్యాకేజిని రూపొందించడం  సాధ్యంకాదు.  పోలవరం మాత్రమేకాదు, ఏ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అయినా అంతిమ నిర్ణయం నిర్వాసితులదే కావాలి. మనం కోరుకోవాల్సిందల్లా, నిర్వాసితులు, లబ్దిదారుల మధ్య తలెత్తే విబేధాలు ఒకే రాష్ట్రపు అంతర్గత వ్యవహారంగా వుండాలని మాత్రమే!  

        తెలంగాణ ఉద్యమానికి భౌతిక పునాది లేదనీ, అక్కడి నాయకులు కేవలం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడుపుతున్నారని సీమాంధ్ర నాయకులు తరచూ అనేవారు.  ఇప్పుడు కథ అందుకు భిన్నంగా సాగుతోంది, సమైక్యాంధ్య ఉద్యమం భావోద్వేగాల ఉద్యమంగా తేలింది. తాను ముఖ్యమంత్రి అయితే విభజనవాదులందర్నీ జైల్లో పడేస్తానని వారం క్రితమే చెప్పిన రాయలసీమ మంత్రి టీజీ వెంకటేష్  క్రమంగా వాస్తవాలను గమనిస్తున్నట్టున్నారు.  సమైక్యాంధ్ర కోసం పోరాటంచేసి పిచ్చివాళ్లుగా మిగిలామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిందని వారు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు.

        ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సీమాంధ్రలో  చంద్రబాబు, జగన్ ల ప్రాధాన్యం పెరుగుతుందని  రాజకీయ పండితులు బలంగా భావించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి పార్టీల్లోనూ అలాంటి ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించడంలేదు. సమన్యాయం పేరుతో తెలంగాణలో ఎర్రబెల్లి, సీమాంధ్రలో పయ్యావుల మధ్య నలిగిపోతున్న చంద్రబాబు మైదానంలో దిగడం మానేసి పెవిలియన్ లో ఔత్సాహిక వ్యాఖ్యతగా మారిపోయారు. సీమాంధ్రలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత బలపడుతోంది గాబట్టి, అది తమకు అనుకూలంగా మారుతుందని కంప్యూటర్ మీద లెఖ్ఖలు వేసుకోవడం మినహా,  తమ పార్టీ మీద  ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి టిడిపి అధినేత చేస్తున్నది ఏమీలేదు.

       
        బెయిల్ మీద  జైలు నుండి వచ్చాక ఐదు రోజులు లాంఛనపు దీక్ష చేయడం మినహా గడిచిన రెండు నెలల్లో  జగన్ రాజకీయంగా సాధించిందేమీలేదు. ఇటీవల తుపాను పీడిత పాంతాల్లో జగన్ చేసిన పర్యటనకు వచ్చిన స్పందనను ఆయన ఓదార్పు యాత్రతో పోలిస్తే ప్రజల్లో వారి గ్రాఫ్ దిగువ ముఖంగా ప్రయాణిస్తున్నదని చెప్పకతప్పదు.  చంద్రబాబు  స్వంత నియోజకవర్గమైన  కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం` యాత్ర మొదలెట్టడానికి సంచలన విలువతప్ప, సీమాంధ్ర ప్రజలకు ఉపయోగపు విలువ ఏమీలేదనే చెప్పాలి.   చంద్రబాబు ఇటీవల కుప్పంలో పర్యటించినప్పుడు ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాలేదు, సమైక్య శంఖారావానికి భారీగా జనసేకరణ చేసి, సీమాంధ్ర  ప్రజల మద్దతు తనకే వుందని  చాటి చెప్పాలని జగన్  ఆశిస్తున్నారు. అది  ఏమేరకు నెరవేరుతుందోగానీ, ఆయనకు అసలు పోటీ స్వయాన చెల్లెలు షర్మీల నుండే ఎదురుకానుంది!. జగన్ వదిలేసిన బాణం షర్మీల రెండు నెలల క్రితం చేసిన ప్రజాప్రస్థానంకు  వచ్చినంత జనం ఇప్పుడు సమైక్య శంఖారావానికి రాకపోతే  జగన్ ను ప్రజలు వదిలేశారు అనుకోవాల్సి వుంటుంది.

        అధికార, ప్రతిపక్షాలు  తమ భాధ్యతల్ని విస్మరించడానికి రాష్ట్ర విబజన అంశం గొప్ప వరంగా మారింది. వరుస రెండు తుఫాన్ల బాధితుల ఆక్రందనలు చల్లారక ముందే మూడో తుఫాను తీరం దాటింది.  అంతకన్నా పెద్ద తుఫాను జస్టిస్ బ్రిజేష్ కుమార్ కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ సృష్టించింది. నదీ జలాల్ని అన్ని ప్రాంతాలవారు ఉపయోగించుకున్నా, వరదల్ని భరించేది మాత్రం దిగువ ప్రాంతాలవారే. అంచేత దిగువ ప్రాంతాలకు నికర జలాల్లో పెద్ద వాటా ఇవ్వడం, అదనపు జలాల్ని వినియోగించుకునే సౌలభ్యం కల్పించడం ఒక సాంప్రదాయం. ఇప్పుడా సాంప్రదాయానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ గండి కొట్టింది. మిగులు జలాలపై మనం పొందుతున్న దిగువ ప్రాంతాల హక్కు (లోయర్ రైపేరియన్ రైట్స్) ని రద్దు చేసింది. ఇది సీమాంధ్రకే కాదు తెలంగాణకు కూడా కోలుకోలేని నష్టం.

        తెలంగాణ, సీమాంధ్రుల మధ్య ఎన్ని విబేధాలైనా వుండవచ్చు., కానీ,  ఎగువ రాష్ట్రాలపై నీటి యుధ్ధం చేయాల్సి వచ్చినపుడు ఇద్దరూ సమైక్యంగా పోరాడాలి.  లేకుంటే ఇరుప్రాంతాలూ శాశ్వితంగా నష్టపోతాయి.

         
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ : 90102 34336
హైదరాబాద్
30 నవంబరు 2013
ప్రచురణ : సూర్య దినపత్రిక, ఎడిట్ పేజీ, 1 డిసెంబరు 2013



Saturday, 23 November 2013

సీమాంధ్రను మరిచిన హైదరాబాద్ రాజకీయం

సీమాంధ్రను మరిచిన
హైదరాబాద్ రాజకీయం
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

        రాక్షసులు ఎన్ని కామరూపాలు ధరించినా అంతమంగా రాక్షసరూపంలోనే చనిపోతారని జానపద కథల్లో చూస్తుంటాం. సరిగ్గా అలాగే, ముసుగులన్నీ  తీసేస్తే మానవసంబంధాలన్నీ ఉత్పత్తి సంబంధాలే అని తేలిపోతుంది.  ఉత్పత్తి సంబంధాలు అనేది పెద్దమాట అనుకుంటే సామాన్యుల భాషలో ఆస్తి సంబంధాలు, ఆర్ధిక సంబంధాలు లేదా డబ్బు సంబంధాలు అనుకోవచ్చు. ఇప్పుడు రాయలసీమ – తీరాంధ్ర ఉద్యమంలో తెలుగుతల్లి, తెలుగువాళ్లందరూ ఒక్కటే, ప్రాణాలైనా ఇచ్చేస్తాం తెలుగుతల్లికి గర్భశోకం మాత్రం రానివ్వం, తెలుగు తల్లిని బలిపీఠం నుంచి తప్పించేస్తాం వంటి  భావోద్వేగపు మాటలు వినిపించడం తగ్గిపోయాయి. ఇప్పటి వరకు సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించినవాళ్లలో అత్యధికులు ఇప్పుడు హైదరాబాద్ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. 

        'హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే సీమాంధ్రుల  పరిస్థితి కశ్మీర్‌లో శరణార్థుల్లా మారిపోతుంది. వాళ్ల ఆస్తులన్నీ కారుచౌకగా అమ్మేసుకుని వెళ్లిపోవాల్సివుంటుంది. అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎదుట సీమాంధ్ర కేంద్రమంత్రులు కావూరు సాంబశివరావు తదితరులు కుండబద్ధలు కొట్టారని ఢిల్లీ నుండి వార్తలు వస్తున్నాయి.

        ఇలా కుండబద్దలుకొట్టే కార్త్యక్రమాన్ని సీమాంధ్ర  నాయకులు 2009 లోనే చేసివుండాల్సింది. కనీసం ఈఏడాది జులై నెలాఖరులో అయినా చేసివుండాల్సింది. ఆస్తుల చిట్టను చివరి అంకంలో విప్పకుండా మొదటి నుండే ఆ విషయంలో స్పష్టంగా వుండివుంటే  అంధ్రప్రదేశ్ విభజన సాధారణ అన్నదమ్ముల ఆస్తిపంపకాల్లా వుండేది. కనీసం ఇంత గందరగోళంగా వుండేదికాదు. ఇప్పటికైనా రాష్ట్ర  విభజన అంశం ఆస్తి పంపకాల వ్యవహారంగా మారడం ఆహ్వానించదగ్గ వ్యవహారమే. ఎందుకంటే భావోద్వేగాలతో చర్చించినంత కాలం ఏ సమస్యకూ పరిష్కారం దొరకదు. వాస్తవ సమస్యల్ని వాస్తవాల ఆధారంగానే చర్చించాలి. అప్పుడే పరిష్కార మార్గాలు తెరుచుకుంటాయి. 

రాయలసీమ - తీరాంధ్ర నాయకులు  ఇప్పుడు తమ ప్రాంతంలో ఏర్పడే  కొత్త రాష్ట్రాన్ని ఎలా నిర్మీంచి, ఎలా అభివృధ్ధి చేయాలనేదానికన్నా  హైదరాబాద్ ను ఏం చేయాలనే దానిపైనే దృష్టిని కేంద్రీకరించడం విశేషం. ఈ పరిణామాల్ని చూస్తుంటే, సమైక్యాంధ్ర ఉద్యమం రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతాల సామాన్య ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి సాగింది కాదనీ,  హైదరాబాద్ లోని ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి కొన్ని కార్పొరేట్ కంపెనీలు సాగిస్తున్న కార్యక్రమని  కొందరు  ముందే చెప్పింది నిజమే అనిపిస్తోంది.  

        ఇప్పటికీ భావోద్వాగాలతోనే  రాష్ట్ర విభజనను అడ్డుకోవాలనుకుంటున్నవారు ఇద్దరే మిగిలారు. ఒకరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. మరొకరు  విజయవాడ యంపి లగడపాటి రాజగోపాల్.  క్రీజ్ లోనికి ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా దిగిన రాజగోపాల్ కన్నాఇప్పుడు  నైన్ డౌన్ గా క్రీజ్ లో  దిగిన  కిరణ్ కుమార్ రెడ్డి  స్లాగ్ వోవర్లలోనూ  భారీ షాట్లకు ప్రయత్నించే ఊపులో కనిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హార్డ్ హిట్టర్ అనీ, స్టార్ బ్యాట్స్ మన్ అనీ  వాళ్ళూ వీళ్ళూ చెప్పుకోవడమేతప్ప వారి బ్యాటింగును చూసినవాళ్ళు ఇప్పటి వరకు లేరు. 

        ఆంధ్రప్రదేశ్ ను విభజించాలని నిర్ణయించినపుడే కాంగ్రేస్ వర్కింగ్ కమిటి, యూపియే సమన్వయ సంఘం కూడా  హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా వుంచుతామని  ప్రకటించాయి. ఈ ప్రతిపాదనను టిఆర్ ఎస్ అధినేత కేసిఆర్ కూడా అంగీకరించారు.  హైదరాబాద్ ను  కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కొందరు సీమాంధ్ర నాయకులు డిమాండు చేయడంతో విభజన ప్రక్రియలో కొత్త వివాదం రాజుకుంది. హైదరాబాద్ ను  కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలోని సామాన్య ప్రజలకు, రైతాంగానికీ కలిగే ప్రయోజనం ఏమిటో ఇంతవరకు ఎవరూ వివరించలేదు. నిజం చెప్పాలంటే సామాన్య ప్రజలు,  రైతాంగం  ప్రయోజనాల గురించి మాట్లాడే నాయకుడు ఇప్పుడు రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలో కనిపించడంలేదు. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగుల బాధే ప్రపంచ బాధగా మారిపోయింది. ప్రజల భుజాల మీద తుపాకి పెట్టి  తమ ప్రయోజనాలని కాపాడుకోవాలని కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలోని  సామాన్య ప్రజలు,  రైతాంగాన్ని అక్కడి నాయకులు పక్కన పడేశారు. ఇంతటి బహిరంగ విషాదం ఇటీవలి కాలంలో మరెక్కడా కనిపించదు.   

        రేపు ఏర్పడే రాయలసీమ- తీరాంధ్ర రాష్ట్ర నిర్మాణం, అభివృధ్ధి గురించి చర్చ జరగాల్సిన సమయంలో హైదరాబాద్ గురించి చర్చ జరుగుతున్నదంటే సన్నివేశం ఏంత విషాదకరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు,  ఉమ్మడి రాష్ట్రం  విస్తీర్ణం  ఎంత వుండాలి? అనే అంశంపై  ఇప్పుడు ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి,  కేవలం  17 చదరపు కిలో మీటర్లున్న ఖైరతాబాద్ మండలాన్ని  ఉమ్మడి రాష్ట్రం  చేస్తే  సరిపోతుందని  తెలంగాణలోని అతివాదులు అంటున్నారు. 125 చదరపు కిలో మీటర్లున్న పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఉమ్మడి రాష్ట్రం  చేస్తే  సరిపోతుందని  మరికొందరంటున్నారు.  40 లక్షల జనాభాతో 217 చదరపు కిలో మీటర్లున్న  హైదరాబాద్ జిల్లానో, 80 లక్షల జనాభాతో 625 చదరపు కిలో మీటర్లున్న  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్నో ఉమ్మడి రాష్ట్రం  చేయాలని ఇంకొందరంటున్నారు. కోటి మంది జనాభాతో 7228 చదరపు కిలో మీటర్లున్న హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్  అధారిటీ (హెచ్ ఎండిఏ)  ప్రాంతాన్ని  ఉమ్మడి రాష్ట్రం  చేయాలని  కేంద్ర మంత్రి  కావూరు సాంబశివరావు వంటివారు కోరుతున్నారు. వివాదం ఎంతవరకు పోయిందంటే, హెచ్ఎండీఏ పరిధిని  కేంద్ర పాలిత ప్రాంతం  చేయండి లేదా తెలంగాణ ప్రక్రియ మొత్తం నిలిపివేయండి' అని సీమాంధ్ర కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షీండేను తమ అంతిమ నిర్ణయంగా చెప్పారట!

        సీమాంధ్ర నేతలు ఢిల్లీలో విభజనను అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టడంతో దానికి ప్రతిగా అన్నట్టు తెలంగాణవాదులు భద్రాచలం మాదే :మునగాల మాదే అశ్వారావుపేట మాదే అంటు కొత్త తిరకాసు  మొదలెట్టారు. 1956 నవంబరు  1 నాటికివున్న తెలంగాణ కావాలని మొన్నటి వరకు చెప్పిన, తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రమంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలో కొత్తవాదన  ప్రవేశపెట్టింది. 2007 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పది జిల్లాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 శాసనసభ నియోజకవర్గాల్ని తెలంగాణ రాష్ట్ర సరిహద్దులుగా నిర్ణయించాలని కోరింది. అంతకుముందున్న భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని2007లో రద్దు చేసి, సీమాంధ్రలో అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలం శాసనసభ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటుచేసిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో  కలిపేశారు. ప్రత్యేకంగా చెప్పనప్పటికీ ఇప్పుడు   భద్రాచలంతో కూడిన తెలంగాణను టీఆర్ ఎస్ కోరుతోంది. టీఆర్ ఎస్ తో  పోటీపడుతున్న టీ-టిడిపి, సిపిఐ కూడ ఇప్పుడు భద్రాచలం తెలంగాణదే అంటున్నాయి. హైదరాబాద్ తప్ప మరో ఆలోచనే లేని సీమాంధ్ర నేతలు భద్రాచలం వంటి కీలక అంశాన్ని పక్కన పడేశాయి.

        హైదరాబాద్ రెవెన్యూను కోల్పోతే రేపు  ఏర్పడబోయే రాయలసీమ-తీరాంధ్ర రాష్ట్రం ఆర్ధిక లోటుతో కొనసాగాల్సి ఉంటుందని వాదిస్తున్నవారూ వున్నారు. తరచిచూస్తే ఈ వాదన కూడా తర్కానికి నిలబడదు. యూటీ చేస్తే, హైదరాబాద్ రెవెన్యూ రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతానికి బదిలీ అవుతుందని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకత్వం వుండదు. రాజధాని నగరం గాబట్టి అనేక వాణిజ్య సంస్థల కేంద్ర , రాష్ట్ర కార్యాలయాలు ప్రస్తుతం  హైదరాబాద్ లో వున్నాయి. అవి పన్నుల్ని హైదరాబాద్ నుండి చెల్లిస్తున్నాయి.  రేపు రాష్ట్ర విభజన జరిగాక  అక్కడి  వాణిజ్యసంస్థల కేంద్ర కార్యాలయాలు కొత్త రాజధాని నగరంలో ఏర్పడతాయి. ఆ రాష్ట్రపు పన్నుల్ని అక్కడే చెల్లిస్తాయి.  కాకపోతే ప్రస్తుతం ఒక లక్షా అరవై వేల కోట్లున్న  మూడు ప్రాంతాల సమిష్టి వార్షిక బడ్జెట్  రేపు దామాషా ప్రకారం తగ్గవచ్చు. ఎంత చెట్టుకు అంతగాలి! 

        సీమాంధ్ర నేతల్ని ఇటీవల ఒక రకం నిస్పృహ ఆవరించినట్టు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచితే కేసిఆర్ కు తన ఆస్తి రాసిచ్చేస్తానని ఒకాయన ప్రకటిస్తే, తాను ముఖ్యమంత్రి అయితే విభజనవాదుల్ని జైల్లో పడేస్తానని ఇంకోకాయన ప్రకటించాడు. సీమాంధ్రలో విహజనవాదుల్ని సాంఘీక బహిష్కారం చేస్తామని మరోకాయన ప్రకటించాడు. ఈ ప్రకటనల ద్వార వారు సాధించదలచింది ఏమైనప్పటికీ రాష్ట్ర విభజన కోరుకునేవాళ్ళు సీమాంధ్రలో సహితం పెద్ద సంఖ్యలో వున్నారని స్పష్టమౌతోంది.

        దాదాపు రెండు శతాబ్దాలుగా కొనసాగుతున్న పెత్తందారీకులాల ఆధిపత్యాన్ని  సీమాంధ్ర ప్రాంతంలోని బలహీనవర్గాలు ప్రస్తుతం తీవ్రంగా నిరసిస్తున్నాయి. అందువల్లనే, బలహీనవర్గాల్లో అత్యధికులు ఇప్పుడు విభజనను కోరుకుంటున్నారు.  దానివల్ల కలిగే లాభనష్టాలు ఎలావున్నా, పెత్తందారీకులాల ఆధిపత్యం తగ్గితే చాలనే అభిప్రాయం సీమాంధ్ర బలహీనవర్గాల్లో క్రమంగా బలపడుతోంది.

 నిజానికి సీమాంధ్ర ప్రాంతపు ఆధిపత్య కులాలకు 1972 తరువాత ఉద్యమ  అనుభవమూలేదు. వాళ్లకు ఆ అవసరమూ రాలేదు. మరోవైపు, ఆ ప్రాంతపు బలహీనవర్గాలు గత మూడు దశాబ్దాలుగా అనేక సాంఘీక, ఆర్ధిక ఉద్యమాల్లో ఆరితేరాయి. కారంచేడు, చుండూరు ఉద్యమాల్లో సీమాంధ్ర ప్రాంతపు రెండు ప్రధాన ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం వారికుంది. విశాఖజిల్లాలో ఆదివాసులు హోరాహోరీగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పొరాటం చేస్తున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు చమురు బావులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాయలసీమలో వేంపేట పోరాటం, సీమాంధ్రలో చినగంజాం పోరాటం, వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్  కారిడార్  (వాన్ పిక్) వ్యతిరేక పోరాటాల్లో వాళ్ళు ఆరితేరారు. ఈ నేపథ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం  సీమాంధ్ర కొత్త రాష్ట్రానికి  దళిత ముఖ్యమంత్రిని నియమించాలనే ఆలోచన చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సమైక్య హోరు తగ్గగానే పెత్తందారీ కులాల వ్యతిరేక  ఉద్యమం మొదలవ్వడానికి సీమాంధ్ర సిధ్ధంగావుంది.
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్ : 90102 34336
హైదరాబాద్
23 నవంబరు 2013
ప్రచురణ : సూర్య దినపత్రిక, ఎడిట్ పేజీ, 24 నవంబరు 2013

Tuesday, 19 November 2013

గ్రహణంపట్టిన అభ్యుదయ సాహిత్యం

గ్రహణంపట్టిన అభ్యుదయ సాహిత్యం

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

డేగల దాడి కన్నా ముందే భల్లూకాలు వచ్చిపడ్డాయి.  అమెరికా ఆరాధకులు ’నిమిజ్‌’ను తెస్తారనుకుంటే పుతిన్‌  ప్రేమికులు వచ్చారు.  రష్యా అమెరికాలు తెలుగు నేల మీద పాలూతేనెల్లా కలిసిపోయాయి! ఆఫ్గనిస్తాన్‌ పై  అలనాడు రష్యా  సాగించిన దురాక్రమణ నుండి పొందిన  ఉత్తేజం ఇప్పటికీ అభ్యుదయ రచయితల సంఘంపై   పనిచేస్తున్నట్టేవుంది. అరసం అగ్రనేత ప్రొఫెసర్‌   యస్వీ. సత్యనారాయణగారు తెలుగు నేలపై బుష్‌ భాష  మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఆయన మనోఫలకంపై  తాలిబాన్లు సజీవంగానే వున్నారు. (’ముస్లిం  సాహిత్యంలో తాలీబాన్ల పుట్టుక’ వ్యాసం, వార్త దినపత్రిక,  రచన పేజీ,  ఆగస్టు 14, 2007)

కష్టాల్లోవున్నవాళ్ళ పక్షాన నిలబడడం నా సహజాతం.  కష్టాల్లోవున్నవాళ్ళ కుల, మత, తెగ, లింగ, జాతి, ప్రాంత  తదితర బేధాల్ని కూడా నేనెన్నడూ పాటించలేదు. కష్టజీవుల  పక్షాన నిలబడ్దప్పుడు కొన్ని నిందలు మోయకతప్పదు.   రెండు రోజుల క్రితం ఓ బహిరంగ సభలో కవి ఖాజా  నన్ను ”సాహిత్య తాలిబాన్‌” అన్నప్పుడు నాకేమీ పెద్దగా ఆశ్చర్యం కలుగలేదు. ఉత్త తాలిబాన్‌ అనేసి  వదిలేయకుండా; నాకు ’సాహిత్య ప్రతిపత్తి’ని కూడా  కల్పించినందుకు అతనికి ధన్యవాదాలు చెప్పాలనుకునే  లోపులే, సరిగ్గా అదే శీర్షికతో ఈరోజు ప్రొఫెసర్‌  యస్వీ సత్యనారాయణ వ్యాసం అచ్చయ్యింది.

ఆమెరికా సామ్రాజ్యవాదం  ప్రపంచవ్యాప్తంగా  ముస్లింల  సామాజిక,  సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక  వ్యవస్థల్నీ ఎన్ని కుట్రలతో  నాశనం చేసేస్తున్నదో  "ముస్లిం సాహిత్యంలో కోవర్టుల పుట్టుక" వ్యాసం సుదీర్ఘంగా వివరించింది. అంతర్జాతీయంగా ఆలోచించు, స్థానికంగా ఆచరించు అనేది  సామాజిక ఆచరణకు ఆదర్శవంతమైన నియమం.  ఆ నియమానికి కట్టుబడే; నా వ్యాసం;  చివర్లో, రెండు  స్థానిక ఉదాహరణల్ని పేర్కొంది. కేవలం  యధాతథంగా ఉటంకించడమేతప్ప; ఆ ఉదాహరణల్లోనూ ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు.

ఇదంతా ఎందుకు వివరించాల్సివస్తున్నదంటే, ప్రొఫెసర్‌  యస్వీ సత్యనారాయణగారు భారీ విద్యైక నేపథ్యం వున్నవారు. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యునిగా పనిచేస్తున్నవారు. వారి వ్యావృత్తి  కూడా సామాన్యమైనదికాదు. వారు ప్రముఖ వామపక్షవాది.  సాక్షాత్తు అభ్యుదయ రచయితల సంఘం వంటి   ప్రతిష్టాత్మక సాహిత్య సంస్థకు వారు అగ్రనేత.

"కోవర్టుల పుట్టుక" వ్యాసాన్ని మెచ్చుకున్నవాళ్ళు వున్నట్టే;  నచ్చనివాళ్ళూ ఉంటారు. సాధారణ పాఠకుల విషయం  అలావుంచినా, నా అభిప్రాయాలతో ఏకీభవించని విద్యైక సాహిత్య విమర్శకులు  కనీసం రెండు లాంఛనాలను  పాటించాలి. మొదటిది; నా వ్యాసం ఆవిష్కరించిన  అంతర్జాతీయ నేపథ్యన్ని అభావం చేయాలి. రెండోది; నా  వ్యాసం చివర్లో పేర్కొన్న రెండు స్థానిక ఉదాహరణలు  అవాస్తవమని నిరూపించాలి.

జీవప్రదమైన రెండు సాహిత్య లాంఛనాలను  నిర్వర్తించకుండానే  నా వ్యాసంపై ఆధిక్యాన్ని  సాధించాలనుకున్నారు ప్రొఫెసర్‌ యస్వీ  సత్యనారాయణగారు. జాలి కలిగేలా వారు నా వ్యాసం  చుట్టూ పది చక్కర్లు కొట్టారేతప్ప, ఒక్కటంటే ఒక్క  వాక్యం మీదనైనా వాలే సాహసం చేయలేకపోయారు.

సామాజిక,  సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాలపట్ల నాకు అపారమైన  ఆసక్తివున్నది. ధార్మిక అంశాల గురించి నా అవగాహన పరిమితమైనది.  వాటిని గురించి సాధికారికంగా మాట్లాడే ఉత్సుకత కూడా  నాకులేదు. అందుకే నా వ్యాసంలో ధార్మిక అంశాలకు  సబంధించి ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా లేదు. నేను ప్రతిపాదించిన అంశాలపై తన  అభిప్రాయం చెప్పనంత మాత్రాన ప్రొఫెసర్‌ గారిని తప్పుపట్టలేం. కానీ నేను అసలు  ప్రస్తావించనే ప్రస్తావించని అంశాన్ని  ముందుకుతెచ్చి, దానికి నన్ను ప్రతినిధిగామార్చి,  "మతదురభిమాని" అనేసి పరుగెట్టడం మాత్రం నిజంగానే  తప్పుపట్టాల్సిన అంశం.

రాయాల్సినవి రాయని యస్వీగారు  రాయాల్సిన అవసరంలేనివి అనేకం రాశారు. పోనీ వారు రాసిన వాక్యాలకైనా ప్రాణం వుందా? అంటే అదీలేదు.  పట్టుకుని  చూస్తే; వాటిల్లో ఒక్క వాక్యానికి కూడా నరమూలేదు;  ఎముకాలేదు. వెన్నెముకేలేని వాక్యాలతో పోరుచేయడం "సాహిత్య తాలిబాన్ల"కు క్షాత్రధర్మంకాదు. నా దృష్టిలో సాహిత్య విమర్శ అంటే అక్షరాలా అక్షరయుధ్ధం.

ప్రతి జాతి, ఉపజాతి, తెగ, కులం, మతం, ప్రాంతం, భాషలకూ  తమవైన ప్రత్యేక ఆచార వ్యవహారాలుంటాయి. వీటిని  సాంస్కృతిక సౌందర్యంగా చూడాలేతప్ప, ఆధునిక  తర్కాన్ని అన్వయించడం అపార్థాలకు దారితీస్తుంది.  హిందూ మత సంస్కృతే భారత ఉపఖండం సంస్కృతి అని  నమ్మేవాళ్ళు చాలామందే వున్నారు. కమ్యూనిస్టులు  సహితం దీనికి మినహాయింపుకాదు. ఇలాంటి నమ్మకానికి   కారణాలు రెండు. మొదటిది, ఇతర మత సంస్కృతుల గురించి  తెలియకపోవడం. రెండోది, మన సంస్కృతినే ఇతరులు  ఆచరించాలనుకోవడం. ఇందులో మొదటిది అమాయకత్వమైతే;  రెండోది ఆధిపత్యం.

సాంస్కృతిక భిన్నత్వంలో ఏకత్వం అంటే విలీనంకాదు;  ఐక్యసంఘటన. సాంస్కృతిక ఐక్యసంఘటన అంటే ఎవరి  సంస్కృతినీ వాళ్ళు ఆచరించుకుంటూ ఇతరుల సంస్కృతిని గౌరవించడం. ఇద్దరి సంస్కృతుల్లో  సారూప్యం ఉన్న అంశాలకు ప్రాచూర్యాన్ని కల్పించడం;   తీవ్రంగా విభేధించే అంశాలను త్యజించడం.

అందుకు భిన్నంగా, అందరూ తమతమ సంస్కృతుల్ని  వదులుకుని, మెజారిటీ మతసంస్కృతిని అనుసరించాలని  ప్రతిపాదిస్తున్నవారూ వున్నారు. సాంస్కృతిక  ఆధిపత్యవాదం అంటే ఇదే. ముస్లిం మహిళలు బుర్ఖాను  త్యజించినా వీళ్ళు సంతృప్తి చెందరు; బొట్టు కూడా  పెట్టుకోవాలంటారు. దీనికి వాళ్ళు పెట్టిన  ముద్దుపేరు; సాంస్కృతిక జాతీయవాదం.

మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ రాజకీయాలతో విసిగిపోయిన కొందరు హైదరాబాదీ  ముస్లింలు వామపక్షాలపట్ల ఆకర్షితులవుతున్నారు.  ఇళ్ళ  స్థలాల కోసం సిపియం, సిపి‌ఐ నిర్వహిస్తున్న   భూపోరాటాల్లో పాల్గోనే ముస్లింల సంఖ్య కూడా  గణనీయంగానే పెరుగుతోంది.  ఈ అంశానికి గట్టి  ప్రాచారాన్ని కల్పించి, మరింత మంది ముస్లింల  మద్దతు కూడగట్టగలిగితే, రానున్న గ్రేటర్‌ హైదరాబాద్‌  ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించవచ్చని  వామపక్షాలు ఆశిస్తున్నాయి. వామపక్షాలు నిర్వహించే  ఆందోళనల్లో  పాల్గొంటున్న వాళ్ళు ముస్లింలని బయటి ప్రపంచానికి  చెప్పాలంటే  మగాళ్ళకు ’గడ్డాలు’, ఆడాళ్లకు ’బుర్ఖాలు’  ఉండాలి!. అదేకదా వాళ్లకు గుర్తింపు!.  అప్పుడే మీడియా పాఠకులు, ప్రేక్షకులు  వాళ్ళను సులువుగా గుర్తిస్తారు.  కనుక,  ఇప్పుడు  వామపక్షాలు సహితం బూర్ఖా బాటలో నడవక తప్పడంలేదు. ఇది ప్రహసనంకాదు; విషాదం.

నా వ్యాసంలో ఎక్కడాలేని బుర్ఖాల గురించి ఇంతగా ఆవేదన చెందిన ప్రొఫెసర్‌  యస్వీ సత్యనారాయణగారు తన సంస్కరణోద్యమాన్ని  కమ్యూనిస్టు కార్యాలయాల నుండే ఆరంభిస్తే  ఇంట గెలిచినట్టూ వుండేది. పనిలో పనిగా,  హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ గడ్డానికీ, సవజోత్‌ సింగ్‌  సిధ్ధూ గడ్డానికీ తాత్విక బేధం ఏమిటో, బృందా కారత్‌ బొట్టుకూ,  సాధ్వీ రితంబర బొట్టుకూ ధార్మిక వైరుధ్యం ఏమిటో వివరిస్తే  మాబోటి వాళ్లక్కూడ సాంస్కృతిక వ్యవహారాలపట్ల  కొంచెం అవగాహన పెరగడానికి అవకాశం వుండేది. ఇది సవాలుకాదు; విన్నపం.

ముస్లిం సంస్కృతిపట్ల సామ్రాజ్యవాదుల అవగాహనకూ,  కమ్యూనిస్టుల అవగాహనకూ తేడా ఏమిటో ప్రొఫెసర్‌ యస్వీ  సత్యనారాయణగారు తెలియజేస్తే భవిష్యత్తరాలకు కొంచెం  మేలు జరిగేది.  ప్రాంతీయ సంస్కృతుల్నీ సామ్రాజ్యవాదం నాశనం  చేసేస్తున్నదని కమ్యూనిస్టు నాయకులు తరచూ ఆవేదన  వ్యక్తం చేస్తుంటారు. కానీ, ప్రాంతీయ సంస్కృతుల్నీ  పరిరక్షించుకోవడంపట్ల కమ్యూనిస్టులకు ఒక విధానం  వున్నట్టు కనిపించదు. నూట డెభ్భై సంవత్సరాల  సుదీర్ఘ చరిత్రలో, కమ్యూనిస్టులు, ఇప్పటివరకు  తమదైన ఒక సంస్కృతీని  రూపొందిచుకున్నాట్టూ నాకు  తెలీదు. ఆమధ్య కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో. ఓ సీనియర్ కార్మిక నాయకుని భౌతికకాయానికి శ్రధ్ధాంజలీ ఘటిస్తూ ప్రొఫెసర్ యస్వీగారు న్యుస్ ఛానళ్ళు అన్నింటిలోనూ ప్రముఖంగా కనిపించారు. అక్కడ వారు ఆచరించిన కర్మకాండే వారు ప్రతిపాదిస్తున్న "లౌకిక, ప్రజాస్వామ్య, సామ్యవాద సంస్కృతి" అని మనకు తెలీదు. ఇది వెటకారంకాదు; నిజాయితీ ఒప్పుకోలు.    

అమెరికా-భారత్‌ పౌర అణు ఒప్పందం, సెవెంత్ ఫ్లీట్ లో భారత నౌకాదళ యుగళ గీతాలన్నీ  దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడమేనంటూ వామపక్షాలు భూమ్యాకాశాల్ని ఏకం చేస్తున్న కాలంలోనే నా వ్యాసం అచ్చయింది.  యస్వీగారు నా వ్యాసాన్ని ఖండించబూనుకోవడమే ఒక విశేషమైతే,   అమెరికామీద పల్లెత్తు మాట కూడా అనకుండా వారు వీరోచిత  పలాయానం చిత్తగించడం మరీ విశేషం! అరసానికి అమెరికా గ్రహణం బాధాకరమే! ఇది యస్వీగారి స్వయంవికాసమో, అరసం నూతన అంతర్జాతీయ విధానమో మనకు తెలీదు. ఇది ఎద్దేవాకాదు; తేల్చుకోవాల్సిన అవసరం!

ముస్లిం అభిమానం నాకెలాగూ వున్నది. దాన్ని దాచుకోవాల్సిన అవసరమూలేదు. ఇప్పటి కష్టకాలంలో భారత ముస్లింలకు మతాభిమానం కూడా చారిత్రక అవసరమని నేను భావిస్తాను. ప్రొఫెసరుగారు  "మతదురభిమానం" అన్నారు. ఇది కొంచెం తీవ్రమైన నిందే. నా వ్యాసంలో వారికి అలాంటి అభిప్రాయాన్ని కలిగించిన ఒక్క వ్యాక్యాన్నైనా దయచేసి చూపెడితే బావుండును. ఇది వినయం కాదు; సవాలు.

ఒక్కటే ఆవేదన. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ  ముస్లిం సమాజం కష్టకాలంలోవుంది. దాన్ని మరింత  కష్టాలపాలు చేయవద్దు. శత్రువుల దాడినే తట్టుకోలేక  అది అల్లాడిపోతోంది. ఆపైన; మిత్రుల దాడి కూడానా!.  మిత్రులు, సహచరుల రూపంలో తన వాళ్ళకు హానీ చేసేవాళ్ళను  కోవర్టులంటారు. కోవర్టు అనేది ఉద్యమ భాషే అనే  అభిప్రాయంతోనే ఆ పదాన్ని ఎంచుకున్నాను. ఆ పదం చాలా  తీవ్రంగా, కటువుగా వుందని కొందరు మిత్రులన్నారు.  వారి అభిప్రాయంతో  ఏకీభవిస్తున్నాను. ఎవరైనా  భాషావేత్తలు, ప్రత్యామ్నాయంగా, అంతకన్నా సరళమైన  పదాన్ని సూచిస్తే స్వీకరించడానికి  సిధ్ధంగావున్నాను. ఇది సవాలుకాదు; వినయం.

హైదరాబాదు
14  ఆగస్టు   2007
ప్రచురణ : వార్త దినపత్రిక, రచన పేజీ, 7 అక్టోబరు 2009

(వార్త దినపత్రిక, రచన పేజీ,  ఆగస్టు 14, 2007 సంచికలో  యస్వీ. సత్యనారాయణ వ్యాసం  ’ముస్లిం సాహిత్యంలో  తాలీబాన్ల పుట్టుక’ కు సమాధానం)

Wednesday, 13 November 2013

Battle for Bhadrachalam

Battle for Bhadrachalam
AM Khan Yazdani ( Danny)

It is another Ram Mandir controversy after Ayodhya. This time the dispute is not between Nirmohi Akhara, and the Muslim Central Board of Wakf. It is between the leaders of Telangana and Seemandhra over Bhadrachalam division of Khammam district. Leaders of the both regions have set on to battle it out for the temple town Bhadrachalam considered as the second famous Lord Rama Kshetra after Ayodhya in India.
Over excited with the Congress Working Committee’s decision at the end of the July this year to form a separate Telangana state, Ramireddy Venkata Reddy,  minister from Khammam district,  has ignited the controversy by stating that Bhadrachalam revenue division will be included in the emerging Telangana state.
Robustly committed to single point programme of keeping the state united the Seemandhra legislatures both MPs and MLAs have ignored the statement of Venkata Reddy at the beginning. Subsequently they have changed their mind set and started paying attention towards Bhadrachalam division as the Delhi sent strong signals that the division of Andhrapradesh and formation of Telangana state is imminent.
Khammam is one of the few districts in the Telangana region that were formed after the fall of princely state of Nizam in 1948.  Six taluks of the erstwhile larger Warangal district viz., Khammam,  Madhira, Yellandu,  Paloncha,  Kothagudem and Burgampadu were carved out as a new district with Khammam as its headquarters on 1 October 1953.  After formation of Andhrapradesh in 1956,  Bhadrachalam Revenue Division consisting of Bhadrachalam,  Nuguru and Venkatapuram Taluks of East Godavari district and part of Coastal Andhra region were merged into Khammam  in November 1959 for  administrative viability. Subsequently, Aswaraopet taluq of West Godavari district was also attached to Khammam district.  The unity of diversity in its formation is being reflected in the demography of Khammam district. It has dual character;  partly Telangana and partly Seemandhra.
Every political demand can exists and operate only in a specific time and space. And it will lose its fillip once the time or space under goes any changes. The champion of Telangana cause and TRS chief K Chandrasekhara Rao has set specific time and space to his demand for the formation of a new state. While the space for his demand is Telangana region of erstwhile Nizam princely state, the bench mark for the time frame is 1st November 1956, the formation day of Andhrapradesh.  As the title of the Jeffrey Archer's first novel, Not a Penny More, Not a Penny Less goes Telangana demand also rigidly stands for  ‘not a day after not a day before’.   
In his endeavour to justify the demand for Telangana state, KCR is unfairly  and frequently emphasizing that they are not demanding for the division of Andhrapradesh but for the de-merger of two states namely Andhra and Telangana that were merged in 1956. This is a false theory because Telangana never existed as a separate state ever before. One day before the formation of Andhrapradesh there was Andhra state on one side and Hyderabad state on the other side. The Telangana –Hyderabad region was the integral part of Hyderabad state along with Maratha- Hyderabad and Kannada-Hyderabad regions. As the Andhrapradesh state has been already formed by that time. KCR and his supporters neither move forward the bench mark date for division.
Enthusiastic thinkers like Gadiyaram Srivatsa has a decade ago, demanded for a ‘Greater Telangana’ state that consists of Telangana, Maratha and Kannada regions of erstwhile Hyderabad state. But the idea failed to garner the required fillip as the time and space were utterly changed.
            Notwithstanding the present day controversy, Bhadrachalama has its own glory in the pages of history. The area was under Kakatiyas till it went into the hands of Delhi Sultanate during the first quarter of the 14th century.   Further the area was conquered by  Bahamani Kingdom and then by  Qutb Shahi dynasty of Golconda until the Mughal emperor Aurangzeb conquered the Deccan in 1687.  
During the regime of the eighth and last ruler of the Qutb Shahi dynasty, Abul  Hasan Qutb Shah popularly known as Tana Shah, the Tahasildar for the Palvancha Paragana, Kancherla Gopanna ,  popularly known as Bhakta Ramadasu,  has   constructed the  famous temple for Lord Sri Rama at Bhadrachalam  in the third quarter of 17th century. 










             
           


Tuesday, 12 November 2013

సంక్షోభంలో సమైక్య ఉద్యమం

సంక్షోభంలో సమైక్య ఉద్యమం 
ఏ.యం. ఖాన్‌ యజ్దాని (డానీ) 

నిజాం సంస్థానానికి మళ్ళీ ఏదో మహర్దశ పట్టినట్టుంది. భారత రాజకీయాలన్నీ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అలనాటి నిజాం సంస్థానం చుట్టే తిరుగుతున్నాయి. బీజేపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ముందుకు తెచ్చిన నెహ్రు-పటేల్ వివాదం కూడా నిజాం సంస్థానం నేపథ్యంలోనే సాగుతోంది.   అంధ్రప్రదేశ్‌ లోని నిజాం సంస్థానం (తెలంగాణ)ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, యూపియే సమన్వయ కమిటీ, కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. కర్ణాటకలోని నిజాం సంస్థానం (కన్నడ - హైదరాబాద్‌) కు  ప్రత్యేక హోదా కల్పించే నాలుగు నోటిఫికేషన్లపై ఆ రాష్ట్ర గవర్నర్‌ హెచ్‌ ఆర్‌ భరద్వాజ ఈవారంలోనే సంతకాలు చేశారు. రేపు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రలోని  నిజాం సంస్థానానికి  ప్రత్యేక హోదా కల్పించినా ఆశ్చర్య పడాల్సిందేమీలేదు. చరిత్ర గతం వర్తమానాల మధ్య దోబూచులాడుతూ సాగుతోంది.

కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రక్రియను వేగంగా పూర్తిచేసే  అతృతలోవుంది. విభజనకు సంబంధించిన పదకొండు అంశాలపై కేంద్ర మంత్రుల బృందానికి రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు  సూచనలు ఇవ్వాల్సిన గడువూ ముగిసింది. ఇక అఖిలపక్ష సమావేశమే తరువాయి. దానికీ ముహూర్తం దగ్గర పడింది.

విభజనకు సంబంధించిన ప్రతి రౌండులోను, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్న కేసి‌ఆర్‌, కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించిన సూచనల్లోనూ తన తెలివిని  ప్రదర్శించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ విభజనకాదనీ, 1956 నాటి తెలంగాణను పునరుధ్ధరించడం మాత్రమే అని ఇంతకాలం కేసి‌ఆర్‌ వాదిస్తూ వచ్చారు.  కానీ, కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించిన సూచనల్లో కాలప్రాతిపదికని వారు యాభై యేళ్ళు ముందుకు జరిపారు. 2007లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ నిర్ణయించిన 10 జిల్లాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్ని  సరిహద్దులుగా  నిర్ణయిస్తూ కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేసి‌ఆర్‌ ప్రతిపాదించారు.

తన వాదనని సమర్ధించుకోవడానికి కేసి‌ఆర్‌ శాసనమండలి ఏర్పాటు అంశాన్ని ముందుకు తెచ్చారు. 119 మంది ఎన్నికైన శాసన సభ్యులతోపాటూ, ఒక నామినేటెడ్‌  ఆంగ్లో ఇండియన్‌ ను కలుపుకుంటే శాసన మండలి ఏర్పాటుకు కావల్సిన కనీసపు 120  అసెంబ్లీ సీట్లు తెలంగాణకు వుంటాయనేది వారి వాదన. పైకి సమంజసంగా కనిపిస్తున్న ఈ వాదన వెనుక ఒక వివాదం వుంది. 1956 తరువాత తెలంగాణలో కలిపిన భద్రాచలం డివిజన్‌ తదితర ప్రాంతాల్ని  తెలంగాణలోనే వుంచాలని కేసి‌ఆర్‌ పరోక్షంగా ప్రతిపాదించారు.

కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 120 శాసన సభ్యులు వుండాలి అనేదే కేసిఆర్ కోరిక అయితే దాన్ని అనేక విధాలుగా పరిష్కరించవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ద్వార దాన్ని సాధించుకోవచ్చు. దానికోసం భద్రాచలం డివిజన్‌ తదితర ప్రాంతాల్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపివుంచాల్సిన పనిలేదు.

వనరుల పంపకాల అంశంలో కేసి‌ఆర్‌ పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణం, వన్యప్రాణులు, పునరావాసం, పునర్నిర్మాణం, గిరిజనుల సమస్యలన్నింటినీ పరిష్కరించిన తరువాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని వారు సూచించారు. తెలంగాణ జేయేసి ఛైర్మన్‌ యం. కోదండరామ్‌ కూడా భద్రాచలంపై లొల్లి  మొదలెట్టారు. ”రాముడ్ని ఆంధ్రాలో కలుపుడంటే గోదాట్లో ముంచుడే” అంటున్నారాయన.  2009 ఎన్నికల ముందు వరకు వున్న భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని రద్దు చేసి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటుచేసిన మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో కలిపినందున భద్రాద్రి రాముడు తెలంగాణవాడే అని తేలిందని అంటున్నారాయన.

పోలవరం ప్రాజెక్టును అర్ధం చేసుకున్నవాళ్ళకన్నా అపార్ధం చేసుకున్నవాళ్ళే ఎక్కువ. తీరాంధ్ర భూభాగంలో నిర్మిస్తున్న రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు పోలవరం. దీని నిర్మాణం సజావుగా సాగడానికి భద్రాచలం డివిజన్‌ ను తెలంగాణ పంచాయితీ నుండి విడిగా వుంచడం అవసరం. పోలవరం ముంపు ప్రాంతంలో కొంతభాగం పాత తెలంగాణ మండలాల్లోవున్నా దాన్ని వదులుకోవడానికి కూడా తెలంగాణ పెద్దలు ఉదారంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే అది కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రపు అంతర్గత వ్యవహారంగా వుంటుంది. దాని డిజైను, ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ అప్పుడు ఆ రాష్ట్ర వ్యవహారంగా మారుతుంది.

పదేళ్ల  ఉమ్మడి రాజధానికి మొదట్లో అంగీకారం తెలిపిన కేసి‌ఆర్‌ జీవోయంకు సమర్పించిన నివేదికలో బాహాటంగా దాన్ని వ్యతిరేకించనప్పటికీ, కాల పరిమితిని రెండేళ్లకు కుదించాలనే సూచనని పరోక్షంగా చేశారు. కొత్త రాజధాని నిర్మాణానికి రెండేళ్లకన్నా ఎక్కువ వ్యవధి పట్టదనీ, శాసనసభతోసహా సచివాలయంలోని కీలక శాఖల్ని  సీమాంధ్రులు తమ రాష్ట్రానికి తక్షణమే తరలించుకోవచ్చని సలహాలాంటి హెచ్చరిక ఒకటి చేశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని ఇప్పటి వరకు గట్టిగా చెపుతూ వచ్చిన యంఐయం కూడా క్రమంగా విభజనని సమర్ధించక తప్పని పరిస్థితిలో పడిపోయినట్టు కనిపిస్తోంది.  విభజన అనివార్యమైతే, కర్నూలు, అనంతపురం, తెలంగాణ జిల్లాలతో కూడిన రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రుల బృందాన్ని అసదుద్దీన్‌ ఓవైసీ  కోరడం కొత్త పరిణామం. హైదరాబాద్‌ ను ఉమ్మడి రాజధానిగానూ, కేంద్రపాలిత ప్రాంతంగానూ చేస్తే ఒప్పుకునేది లేదని చెప్పడం కొత్త మలుపు. అన్నింటినీ మించి ఉమ్మడి రాజధాని అంటే ఖైరతాబాద్‌ మండలం మాత్రమే అని యంఐయం చెప్పడం కొత్త వివాదానికి తెర తీసినట్టే!

జీయంవోకు సూచనలు ఇవ్వడం అంటేనే విభజనకు అంగీకరించినట్టు అవుతుందని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు దానికి దూరంగా వుండిపోయారు.  జేడీ శీలం, చిరంజీవి చెపుతున్న మాటల్నిబట్టి  సీమాంధ్రకు చెందిన  కేంద్ర మంత్రులు ”అందరికీ న్యాయం చేయాలి”అని జీయంవోను కోరినట్టు అర్ధం అవుతోంది. అయితే, లోపల వాళ్ళేం చెప్పారో బయట చెప్పడానికి ఎవరూ సిధ్ధంగా లేరు.

సమైక్యవాదం అంటేనే తెలియని సీమాంధ్రకు దాన్ని అలవాటు చేసి, ఇన్నాళ్ళు బండి నడిపిన  విజయవాడ యంపి లడగపాటి రాజగోపాల్‌ చివరి అంకంలో దాదాపు ఒంటరిగా మిగిలారు. జీయంవోకు వ్యక్తిగత స్థాయిలో సమర్పించిన నివేదికలో ”విభజన తరువాత కుర్చీని అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌ ని కొల్లగొట్టాలని కేసి‌ఆర్‌ చూస్తున్నారు” అని  ఆయన ఆరోపించారు. నిజానికి ప్రభుత్వంలో కుర్చీని అడ్డుపెట్టుకుని  దండుకునే సాంప్రదాయం మొదలై చాలా కాలమే అయింది. దీన్నే ప్రాయోజిత పెట్టుబడీదారీ విధానం అంటున్నాం. ఆ అవకాశం అందరికీ కల్పించాలన్నదే  ప్రస్తుత రాజకీయ వివాదానికి ప్రధాన కారణం.

సీమాంధ్ర సమైక్య బరిలో అందరూ వూహించినట్టుగానే ఇద్దరు మిగిలారు. జగన్‌, చంద్రబాబు.  వీరిద్దరిలో ఎవరు కొత్త రాష్ట్రంలో అధికారాన్ని చేపడతారు అనే అంశంపై ఊహాగానాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇద్దరికీ తమవైన బలాలున్నాయి. బలహీనతలూ వున్నాయి. చంద్రబాబు మళ్ళీ అధికారాన్ని  చేపట్టాలనీ, జగన్‌ ఈ రాష్ట్రాన్ని ఏలాలనీ బలంగా కోరుకునేవాళ్ళు పెద్ద సంఖ్యలోనే వున్నారు. అయితే, ’హైటెక్కు’ పాలనని సామాన్య ప్రజలు ఇంకా మరిచిపోకపోవడం చంద్రబాబుకు ఇబ్బందికాగా, అధికారానికి రాకముందే అవినీతి కేసులు వుండడం జగన్‌ కు ఇబ్బంది. దొరికిన ప్రతి అవకాశాన్నీ ప్రత్యర్ధిని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగించడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. విచిత్రం
ఏమంటే రాజకీయంగా హోరాహోరీ పోరుసలుపుతున్న వీళ్ళిద్దరూ ఎత్తుగడల్లో మాత్రం ఒకరినొకరు అనుకరిస్తున్నారు. ఇద్దరూ దీక్షలు చేశారు. ఇద్దరూ జీవోయంకు నివేదికలు పంపలేదు. ఇద్దరూ అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం లేదు.

సీమాంధ్రలో ఇప్పుడు  కొత్తగా వినిపిస్తున్న మూడో పేరు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిది. మూడేళ్ల పాలనలో ప్రజలు ప్రత్యేకంగా గుర్తించుకోదగ్గ మేళ్ళు ఏమీ లేనప్పటికీ రాష్ట్రాన్ని సమైక్యంగావుంచడానికి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సహితం ఎదిరించి నిలబడుతున్నారనే ప్రచారం కిరణ్‌ కుమార్‌ కు సానుకూలంగా మారే అవకాశముంది. అయితే ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్‌ లోనే కొనసాగుతారా? లేకపోతే కొత్తపార్టి పెడతారా? అనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వారు ఈమధ్య సోనియా గాంధి దండకం మానేసి, ఇందిరాగాంధి శతకం ఎక్కువగా చదువుతూ వుండడంవల్ల, వారి కొత్త పార్టి పేరు ఇందిరమ్మ రాజ్యం కావచ్చనే ప్రచారం బలంగానే సాగుతోంది.

సమైక్యవాద ఉద్యమం హోరులో వినిపించకుండాపోయిన సీమాంధ్ర అంతర్గత లుకలుకలు ఇప్పుడు ఒకటొకటిగా వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటి రోజుల నుండే వీలున్నప్పుడెల్లా  రాయల - తెలంగాణవాదాన్ని నెమ్మదిగా  పినిపిస్తూ వస్తున్న జేసి దివారకర రెడ్ది  ఇప్పుడు స్వరాన్ని పెంచుతున్నారు.  రాయల - తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వని ప్రజాప్రతినిధుల్ని ఆయన సీమ ద్రోహులు అనడం పరిస్థితి తీవ్రతను చెపుతోంది. జేసి వాదనను మంత్రి సీ రామచంద్రయ్య ఖండిస్తున్నప్పటికీ, రాయలసీమ వాదాన్ని మరో కోణంలో  ఆయన ముందుకు తెస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడం అనివార్యమైతే, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని వారు జీయంవోను కోరారు.  కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల కన్వీనర్‌ సాకే శైలజానాథ్‌ కూడా రాయల తెలంగాణ అనేది పాత డిమాండే అనడంతో ఈ వాదన క్రమంగా బలపడుతున్నదని అర్ధం అవుతోంది.

ఎన్జీవోలు సమ్మె చేస్తున్నపుడు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నదనిపించిందిగానీ, రెండు నెలల తరువాత అది నిజంకాదని తేలిపోయింది.   కొంతకాలం ఉద్యమానికి బలంగా కనిపించిన ఎన్జీవోలు  వాస్తవానికి దాని బలహీనతగా మారారు. అలసట తీర్చుకోవడానికి చిన్న విరామం అంటూ  పక్కకు తప్పుకున్న ఎన్జీవో నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్‌ వెనక్కు తగ్గినా విభజన ఆగకపోవచ్చనే నిరాశలో కనిపిస్తున్నారు.

సరైన వ్యూహమూ, ఎత్తుగడలు, నాయకుల మీద విశ్వసనీయత  లోపించడంవల్ల  సమైక్యాంధ్ర ఉద్యమం ఇంటా బయట కూడా అనేక అపజయాలను చవిచూసింది. దానికి నాయకత్వం వహించినవాళ్ళు స్థానికంగా ప్రజల్నీ ఉత్తేజ పరచలేకపోయారు.  జాతీయంగా కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రభావితం చేయలేకపోయారు. లక్ష్యం పరిమితమైనప్పుడు అంతకు మించిన ఫలితాలని  ఆశించడమూతప్పే!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మొబైల్‌ ః 90102 34336

హైదరాబాద్‌
8 నవంబరు 2013
ప్రచురణ : సూర్య దినపత్రిక
10 నవంబరు 2013

Saturday, 2 November 2013

సమ్మిళిత విధానాలే శరణ్యం

సమ్మిళిత  విధానాలే శరణ్యం
ఏ. యం. ఖాన్‌ యజ్దానీ (డానీ)

        మనుషులు తమ చరిత్రను తామే నిర్మించుకుంటారు అన్నాడు కార్ల్‌ మార్క్స్‌. అంత వరకు  చాలామందికి  దాదాపు ఏకాభిప్రాయమే వుంటుంది.  అయితే దీనికి చాలా షరతులున్నాయి.  మనుషులు తమకు ఎలా తోస్తే అలా,   ఎప్పుడు అనుకుంటే అప్పుడు తమ చరిత్రను నిర్మించుకోలేరు.  గత సంఘర్షణల ఫలితంగా తమకు అందివచ్చిన చారిత్రక సందర్భం, చైతన్యాల పరిమితుల్లోనే మనుషులు తమ చరిత్రను తాము నిర్మించుకుంటారు. గతించినతరాల సాంప్రదాయాలు వర్తమానతరాల ఆలోచనల్లోచేరి, వాళ్లను నడిపిస్తుంటాయి.

        ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పుడు మనుషులు ప్రాంతాలవారీగా  రెండు రకాలుగా చరిత్రతో  వ్యవహరించే పనిలో వున్నారు. తెలంగాణ ప్రాంతంలో పునర్‌ నిర్మాణపు ఆలోచనలు సాగుతుండగా, రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలో యధాస్థితిని కాపాడేందుకు అక్కడి పాలకవర్గాలు దింపుడుకళ్ళెం ఆశతో చివరి ప్రయత్నాలు ముమ్మరంగా  చేస్తున్నాయి.

        ప్రజల కోరికలు బలంగా ముందుకు వస్తున్నపుడు పాలకవర్గాల కోరికల్ని అంచనా వేయడం కష్టం. అవి తమ కోరికల్ని కొన్నాళ్ళు దాచుకుంటాయి. లేదా ప్రజల కోరికల పేరుతో తమ ప్రయోజనలను సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. తెలంగాణలో ప్రస్తుతం  ప్రజలు అందమైన కలలుకనే సందర్భం. ఇటీవల జరిగిన మంజీర రచయితల సంఘం 27వ వార్షికోత్సవాలు దానికి అద్దంపట్టాయి. హైదరాబాద్‌ అందరిదీ; దానిపై పరిపానాధికారం తెలంగాణవాళ్లది అనే అభిప్రాయం ఆ వేడుకల్లో బలంగా ముందుకువచ్చింది.

        హైదరాబాద్‌ ఆర్ధిక,  సాంస్కృతిక, జీవన శైలిపై విప్లవకవి వరవరరావు కొన్ని అందమైన కలల్ని ముందుంచారు. కొన్ని ఆలోచించదగ్గ సందేహాలు లేవదీశారు.   దోపిడిదారుడు ఆంధ్రావాడైనా, తెలంగాణావాడైనా హైదరాబాద్‌  నుండి పోవాల్సిందే. శ్రమించి చెమట చిందించేవారు ఎవరైనా, ఎక్కడివారైనా హైదరాబాద్‌ వారిదే అని వారొక ప్రకటన చేశారు.  హైదరాబాద్‌ ఫుట్‌ పాత్‌ లపై నడిచే, ఇరానీ కేఫ్‌ లలో చాయ్‌ తాగే పరిస్థితి వస్తుందా? కనీసం అప్పటి విలువలు, సంస్కారం, ప్రేమ వంటివైనా హైదరాబాద్‌ తెహజీబ్‌ లో తేగలమా? అని ఒక అందమైన కలని ముందుంచారు. అంతేకాదు, తెలంగాణ ఎజెండాలో ముస్లింలు, లౌకికవాదం వున్నాయా? తెలంగాణవాదం ముసుగులో హిందూయిజాన్ని నెత్తికెత్తుకున్నామా? అంటూ సాంస్కృతికంగా ప్రాణప్రదమైనా ఒక అంశాన్ని వారు చర్చకు పెట్టారు.

        విజయోత్సవాల్లో మేధోచర్చలకు తావువుండదు కనుక, వరవరరావు లేవనెత్తిన ప్రశ్నలకు మంజీర రచయితల సంఘం వార్షికోత్సవాల్లో ఎవ్వరూ స్పందించివుండరు. కానీ, సమాధానపరచకుండా చల్లారే ప్రశ్నలు కావవి. ముస్లింలు మాత్రమేకాదు, తెలంగాణలోని  ఆర్ధిక, సాంస్కృతిక బలహీనవర్గాలన్నీ సమీప భవిష్యత్తులోనే ఇలాంటి ప్రశ్నల పరంపర సంధించినా ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. ప్రజలు నిర్మించిన దేవాలయాల్లో దెయ్యాలు కాపురంపెట్టడం చరిత్రలో కొత్తేమీకాదు! 

        తెలంగాణకు  పూర్తిగా భిన్నమైన సన్నివేశాన్ని రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతాల్లో చూస్తున్నాం. అక్కడి ప్రజాప్రతినిధులు అగ్నిపర్వతం మీద మూతపెట్టి బొంగురు గొంతులతో ఇప్పటికీ సమైక్యరాగం ఆలపిస్తున్నారు. తమ కోరికల్ని చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలకు ఎంతోకొంత అవకాశమైనా దొరికింది. రాయలసీమ- తీరాంధ్ర ప్రజలకు అలాంటి అవకాశం ఇప్పటికీ దక్కడంలేదు. తమ కోరికలే ప్రజల కోరికలుగా అక్కడి ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే విభజించారు. కనీసం హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతగానైనా (యూటీ) చేయండి అనేది ఇప్పుడు వాళ్ల చివరి కోరిక. రాష్ట్ర విభజనను సమర్ధిస్తున్న బీజేపీ సీమాంధ్ర నేతలు కూడా ఇప్పుడు యూటీ పల్లవి అందుకున్నారు. హైదరాబాద్‌ ను యూటీ చేస్తే  రాయలసీమ- తీరాంధ్ర సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో వాళ్లు వివరిస్తే బాగుండేది.

        ప్రభుత్వానికి కూడా సమైక్యాంధ్ర ఉద్యమం ఒక వరంగా మారింది. పైలీన్‌ తుపానును అడ్డుకోలేకన్న  విభజన తుపానును షక్కరంగా అడ్డుకునేదానికివుంది అని ముఖ్యమంత్రి ఉత్తేజకర హామీలు ఇస్తున్నారు. నిజానికి తుపాను, భారీవర్షాలు, వరదల్ని అడ్డుకోవడం ముఖ్యమంత్రులవల్ల అయ్యే పనికాదు. అడ్డుకోలేదేమని వాళ్లను ఎవరూ అడగరు కూడా. కానీ, తుపాను, భారీవర్షాలు, వరదల బాధితులకు తక్షణ సహాయం, సంపూర్ణ పునరావాసం కల్పించడం మాత్రం కఛ్ఛితంగా ప్రభుత్వ కర్తవ్యం. చెయ్యాల్సిన పనుల్ని చేయలేని ప్రభుత్వాధినేతలు. తాము చేయలేని పనుల్ని చేస్తామనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలీ?

        సంఘీభావ సిధ్ధాంతవేత్త ఎమిలీ దుర్కేమ్‌  నాలుగురకాల ఆత్మహత్యల్ని నిర్వచించాడు. పరుల మేలు కోసం చనిపోవడాన్ని ఆయన ఆల్ట్రూయిస్టిక్‌ సుసైడ్‌ అన్నాడు. వైయస్‌ రాజశేఖర రెడ్డి మరణానంతరం మొదలై, ఇప్పటికీ మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక ధోరణిగా కొనసాగుతున్న ఆత్మాహుతులు ఈ కోవలోకే వస్తాయి. కాంగ్రెస్‌ అధిష్టానం  ఇప్పుడు ఐదో రకం ఆత్మహత్యని  కనిపెట్టింది. అదే, తన మేలు కోసం తానే ఆత్మహత్య చేసుకోవడం!.

        ఎన్టీ రామారావు జానపద సినిమా భువనసుందరికథ లోనూ, ఆ మధ్య వచ్చిన హాలివుడ్‌ సినిమా ద సిక్‌స్త్‌ డే లోనూ, ఒక వ్యక్తి చనిపోయాక అతని  ఆత్మ మరొకరి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలాంటి జానపద పరకాయప్రవేశ విద్యని కాంగ్రెస్‌ ఇప్పుడు రాజకీయాల్లో ప్రదర్శిస్తున్నదట. దీని ప్రకారం,  రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతంలో చెలరేగుతున్న సమైక్యాంధ్ర మంటల్లో కాంగ్రెస్‌ దూకేస్తుందట. ఆ తరువాత ఆ పార్టీ ఆత్మ  జగన్‌ పార్టీలో ప్రవేశిస్తుందట. ఇలాంటి వాదనల్ని ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు  ముందుగా ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు  కాంగ్రెస్‌ కే చెందిన జేసీ దివాకర రెడ్డి, లగడపాటి రాజగోపాల్  వంటివాళ్ళు కూడా ఈ పరకాయ ప్రవేశ విద్యని బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివన్నీ మాయలూ, మంత్రాలూ, క్షుద్రవిద్యలుగా చాలా మందికి కనిపించవచ్చు. వర్తమాన రాజకీయాలు క్షుద్ర విద్యలకన్నా ఏం తక్కువా?  అయితే, క్షుద్రవిద్యల్ని ప్రదర్శించేవాళ్లని అరెస్టుచేసి శిక్షించడానికి మనకు కొన్ని ప్రత్యేక చట్టాలున్నాయి. ఆ చట్టాలని మన ప్రజాప్రతినిధుల మీద ప్రయోగించవచ్చేమో ఆలోచించాలి.

        తెలంగాణలో కాంగ్రెస్‌ సానుకూల ఓట్లు తెరాసకూ, సీమాంధ్రలో కాంగ్రెస్‌ ప్రతికూల ఓట్లు వైసీపీకీ పడేలా ప్రణాళిక రచించి, రెండు ప్రాంతాల్లోనూ టీడిపిని  బరి నుండి తప్పించడానికి కాంగ్రెస్‌ కుట్ర చేసిందని చంద్రబాబు పదేపదే  ఒక చిత్రమైన వాదన చేస్తున్నారు. ఈ వాదన వినడానికి విచిత్రంగా వున్నప్పటికీ,  ఈ సిధ్ధాంతాన్ని నమ్మేవాళ్ళ సంఖ్య గణనీయంగానే వుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా రావల్సిన సందేహం ఏమంటే, కాంగ్రెస్‌ ఆశిస్తునట్టు ఓట్లు వేసే స్థితిలో అసలు జనం వున్నారా? అని.

        కాంగ్రెస్‌ చేసిన విభజన నిర్ణయంతో అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటున్న మరో ముఖ్యనేత సియం కిరణ్‌ కుమార్‌ రెడ్డి. నిరంతరం  సోనియా గాంధి జపం చేసే కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ మధ్య ఇందిరా గాంధి పేరు ఎక్కువగా తలుస్తున్నారు.  ఇది రాష్ట్ర కాంగ్రెస్‌ లో చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలకు తొలి సంకేతమని కొందరు  అప్పుడే రాజకీయ జోస్యాలు చెపుతున్నారు.

        మరోవైపు, ఢిల్లీలో రాహుల్‌ గాంధీకి  సన్నిహితులుగా వుంటున్నవారి నుండి ఇక్కడికి వస్తున్న వార్తలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్ని ప్రజలు ఏవగించుకుంటున్నారని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారట. పార్టీని పూర్తిగా ప్రక్షాళనం చేసి, మొత్తం కొత్త సభ్యులతో 2014 ఎన్నికల బరిలో దిగాలని ఆయన ఆలోచిస్తున్నారనేది ఇక్కడికి అందుతున్న సంకేతాల సారం. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో  కొత్తవాళ్లతో ప్రయోగం చేసిన కాంగ్రెస్‌ గొప్ప విజయాన్ని సాధించింది. కొత్త అభ్యర్ధే గొప్ప అభ్యర్ధి అని అప్పట్లో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీ అనేవారని అంటారు. రాహుల్‌ గాంధి ఇప్పుడు తన బాబాయి బాటలో నడిచే ప్రయత్నాల్లో వున్నారని అంటున్నారు. పాత ఫార్మూలాకు తోడు, తనదైన శైలిలో సామాజికన్యాయాన్ని కూడా జోడించాలని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారట. 

        మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు  రాజకీయ జీవితం 1978 అసెంబ్లీ ఎన్నికలతోనే ఆరంభమైంది. యస్సీ సామాజికవర్గానికి చెందిన కోనేరు ఆ ఎన్నికల్లో కంకిపాడు జనరల్‌  నియోజకవర్గం నుండి విజయం సాధించి అందరినీ అశ్చర్యంలో పడేశారు. అలాంటి సామాజికన్యాయ ప్రయోగాలు చేయాలని రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఉవ్విళ్ళూరుతున్నారట. సామాజికన్యాయం, ఉద్దీపన పథకాల రూపకల్పనలో అపార అనుభవంవున్న సీనియర్‌ అధికారి కే రాజు ఈ కసరత్తులో రాహుల్‌ గాంధీకి సహకరిస్తున్నారని సమాచారం.

        భారతదేశమంతటా రాజకీయ కార్యకలాపాలు దాదాపు మూసపోసినట్టు ఒకేలా వుంటాయి.  ప్రతిజిల్లాలోనూ రెండు కులాలు, లేదా ఒకే కులంలోని రెండువర్గాల చుట్టూ  స్థానిక రాజకీయాలు తిరుగుతుంటాయి. తెలంగాణ, సీమాంధ్ర, రాయలసీమలు దీనికి మినహాయింపు ఏమీకాదు. అనంతపురంలాంటి జిల్లాల్లో రెడ్డి, కమ్మ సామాజికవర్గాల మధ్య రాజకీయం నలుగుతూ వుంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య రాజకీయం తిరుగుతూవుంటుంది.  ఉత్తరాంధ్ర వంటి చోట్ల వెనుకబడిన సామాజికవర్గాలు  కూడా రంగంలో వుంటాయిగానీ, అక్కడ కూడా ఘర్షణ రెండు సామాజికవర్గాలకే పరిమితమై కొనసాగుతూ వుంటుంది. 

        నువ్వా? నేనా? అని మొదలయ్యే  ఈ పోటీ రెండో దశలో, వుంటే నువ్వుండు. లేకపోతే నేనుంటాగా సర్దుకుంటుంది. ఈ క్రమానికి పరాకాష్ట అయిన  మూడవ దశలో ఈ అవగాహన  అధికారంలో వున్నప్పుడు నువ్వు సుష్టుగా తినేయి. నేను మౌనంగా వుంటా. నేను అధికారంలో వున్నప్పుడు నేనూ సుష్టుగా తినేస్తా. నువ్వు మౌనంగా వుండు అనుకుంటూ సాగుతుంది.

        రెండు సామాజికవర్గాలు, లేదా రెండు వర్గాలు, లేదా రెండు పార్టీల మధ్య ఇలాంటి అధికార పంపిణీ అవగాహనలవల్ల మిగిలిన సామాజికవర్గాలన్నీ రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యాన్ని కోల్పోయి కేవలం ప్రేక్షక పాత్ర వహించాల్సి వుంటుంది. విభిన్న సామాజికవర్గాల్లో ఇలాంటి నిర్వేదం ప్రబలడం ప్రమాదకరం. ఎందుకంటే పరిమిత పంపిణీ విధానం ప్రభావం రాజకీయాల మీదనేగాక, ఆ ప్రాంతపు చైతన్యం, అభివృధ్ధి, ఉత్పత్తి రంగాల మీద కూడా పడుతుంది. అంటే, ఆ ప్రాంతపు చైతన్యం, అభివృధ్ధి, ఉత్పత్తి  రంగాలు కుంటుపడతాయి. విభిన్న సామాజికవర్గాల్లో ఇలాంటి నిర్వేదాన్ని పొగొట్టి, అందర్నీ క్రియాశీలంగా మార్చడానికి సమ్మిళిత విధానాలని అనుసరించాల్సి వుంటుంది.

        సమ్మిళిత విధానమంటే ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సమస్తరంగాలను శాశిస్తున్న ప్రాబల్య సామాజికవర్గాలు ఇక పక్కకు తప్పుకోవాలని ఏమీకాదు. ఇక ముందు కూడా వాళ్ళే నాయకత్వం వహించవచ్చు. అయితే, ఒకటే తేడా. ఇప్పటి వరకు   స్వీయసామాజికవర్గాల  అభివృధ్ధి కోసం మాత్రమే ఉపయోగించిన  వాళ్ల అనుభవం, నైపుణ్యాలని ఇక ముందు ఇతర సామాజికవర్గాల అభివృధ్ధి కోసం కూడా  ఉపయోగించాల్సి వుంటుంది.        దానికి వాళ్ళు సిధ్ధమా? అన్నది ఇప్పుడు  ప్రధాన ప్రశ్న.  ఒకవేళ వాళ్ళు సిధ్ధం కాకున్నా పెద్దతేడా ఏమీరాదు. అప్పుడు సమ్మిళిత పాత్రను సాంస్కృతిక, ఆర్ధిక  బలహీనవర్గాలే నిర్వహిస్తాయి. అంటే, యస్సీ, యస్టీ, బీసీ, మత మైనారిటీ వర్గాలే నాయకత్వాన్ని చేపడతాయి.

        ఇప్పటి వరకు రాజకీయ నాయకత్వం వహించిన ప్రాబల్య సామాజికవర్గాల ముందు ఇక ముందు రెండే మార్గాలున్నాయి. సమ్మిళిత విధానాన్ని పాటించడం. లేదా  రాజకీయ నాయకత్వం నుండి తప్పుకోవడం.

(రచయిత ఆంధ్రా  జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336
హైదరాబాద్‌
31 అక్టోబరు 2013

ప్రచురణ : సూర్య దిన పత్రిక
2 నవంబరు 2013