సీమాంధ్రను మరిచిన
హైదరాబాద్ రాజకీయం
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
రాక్షసులు
ఎన్ని కామరూపాలు ధరించినా అంతమంగా రాక్షసరూపంలోనే చనిపోతారని జానపద కథల్లో
చూస్తుంటాం. సరిగ్గా అలాగే, ముసుగులన్నీ తీసేస్తే మానవసంబంధాలన్నీ ఉత్పత్తి సంబంధాలే అని
తేలిపోతుంది. ఉత్పత్తి సంబంధాలు అనేది పెద్దమాట
అనుకుంటే సామాన్యుల భాషలో ఆస్తి సంబంధాలు, ఆర్ధిక సంబంధాలు లేదా డబ్బు సంబంధాలు అనుకోవచ్చు.
ఇప్పుడు రాయలసీమ – తీరాంధ్ర ఉద్యమంలో తెలుగుతల్లి, తెలుగువాళ్లందరూ ఒక్కటే,
ప్రాణాలైనా ఇచ్చేస్తాం తెలుగుతల్లికి గర్భశోకం మాత్రం రానివ్వం, తెలుగు తల్లిని
బలిపీఠం నుంచి తప్పించేస్తాం వంటి
భావోద్వేగపు మాటలు వినిపించడం తగ్గిపోయాయి. ఇప్పటి వరకు సమైక్యాంధ్ర
ఉద్యమానికి నాయకత్వం వహించినవాళ్లలో అత్యధికులు ఇప్పుడు హైదరాబాద్ ఆస్తుల గురించి
మాట్లాడుతున్నారు.
'హైదరాబాద్‌ను
కేంద్రపాలిత ప్రాంతం చేయకపోతే సీమాంధ్రుల పరిస్థితి కశ్మీర్‌లో శరణార్థుల్లా మారిపోతుంది.
వాళ్ల ఆస్తులన్నీ కారుచౌకగా అమ్మేసుకుని వెళ్లిపోవాల్సివుంటుంది”. అని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎదుట
సీమాంధ్ర కేంద్రమంత్రులు కావూరు సాంబశివరావు తదితరులు కుండబద్ధలు కొట్టారని ఢిల్లీ
నుండి వార్తలు వస్తున్నాయి.
ఇలా
కుండబద్దలుకొట్టే కార్త్యక్రమాన్ని సీమాంధ్ర
నాయకులు 2009 లోనే
చేసివుండాల్సింది. కనీసం ఈఏడాది జులై నెలాఖరులో అయినా చేసివుండాల్సింది. ఆస్తుల
చిట్టను చివరి అంకంలో విప్పకుండా మొదటి నుండే ఆ విషయంలో స్పష్టంగా వుండివుంటే అంధ్రప్రదేశ్ విభజన సాధారణ అన్నదమ్ముల
ఆస్తిపంపకాల్లా వుండేది. కనీసం ఇంత గందరగోళంగా వుండేదికాదు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన అంశం ఆస్తి పంపకాల వ్యవహారంగా మారడం
ఆహ్వానించదగ్గ వ్యవహారమే. ఎందుకంటే భావోద్వేగాలతో చర్చించినంత కాలం ఏ సమస్యకూ
పరిష్కారం దొరకదు. వాస్తవ సమస్యల్ని వాస్తవాల ఆధారంగానే చర్చించాలి. అప్పుడే పరిష్కార
మార్గాలు తెరుచుకుంటాయి.
రాయలసీమ - తీరాంధ్ర
నాయకులు ఇప్పుడు తమ ప్రాంతంలో ఏర్పడే కొత్త రాష్ట్రాన్ని ఎలా నిర్మీంచి, ఎలా
అభివృధ్ధి చేయాలనేదానికన్నా హైదరాబాద్ ను
ఏం చేయాలనే దానిపైనే దృష్టిని కేంద్రీకరించడం విశేషం. ఈ పరిణామాల్ని చూస్తుంటే, సమైక్యాంధ్ర
ఉద్యమం రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతాల సామాన్య ప్రజల సమస్యల్ని
పరిష్కరించడానికి సాగింది కాదనీ, హైదరాబాద్ లోని ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి కొన్ని
కార్పొరేట్ కంపెనీలు సాగిస్తున్న కార్యక్రమని
కొందరు ముందే చెప్పింది నిజమే అనిపిస్తోంది.
ఇప్పటికీ
భావోద్వాగాలతోనే రాష్ట్ర విభజనను
అడ్డుకోవాలనుకుంటున్నవారు ఇద్దరే మిగిలారు. ఒకరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.
మరొకరు విజయవాడ యంపి లగడపాటి రాజగోపాల్. క్రీజ్ లోనికి ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా దిగిన
రాజగోపాల్ కన్నాఇప్పుడు నైన్ డౌన్ గా
క్రీజ్ లో దిగిన కిరణ్ కుమార్ రెడ్డి స్లాగ్ వోవర్లలోనూ భారీ షాట్లకు ప్రయత్నించే ఊపులో కనిపిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి హార్డ్ హిట్టర్ అనీ, స్టార్ బ్యాట్స్ మన్ అనీ వాళ్ళూ వీళ్ళూ చెప్పుకోవడమేతప్ప వారి
బ్యాటింగును చూసినవాళ్ళు ఇప్పటి వరకు లేరు.
ఆంధ్రప్రదేశ్
ను విభజించాలని నిర్ణయించినపుడే కాంగ్రేస్ వర్కింగ్ కమిటి, యూపియే సమన్వయ సంఘం
కూడా హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి
రాజధానిగా వుంచుతామని ప్రకటించాయి. ఈ
ప్రతిపాదనను టిఆర్ ఎస్ అధినేత కేసిఆర్ కూడా అంగీకరించారు. హైదరాబాద్ ను
కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కొందరు సీమాంధ్ర నాయకులు డిమాండు చేయడంతో విభజన
ప్రక్రియలో కొత్త వివాదం రాజుకుంది. హైదరాబాద్ ను
కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాయలసీమ-తీరాంధ్ర
ప్రాంతంలోని సామాన్య ప్రజలకు, రైతాంగానికీ కలిగే ప్రయోజనం ఏమిటో ఇంతవరకు ఎవరూ
వివరించలేదు. నిజం చెప్పాలంటే సామాన్య ప్రజలు,
రైతాంగం ప్రయోజనాల గురించి
మాట్లాడే నాయకుడు ఇప్పుడు రాయలసీమ-తీరాంధ్ర
ప్రాంతంలో కనిపించడంలేదు. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగుల బాధే ప్రపంచ
బాధగా మారిపోయింది. ప్రజల భుజాల మీద తుపాకి పెట్టి తమ ప్రయోజనాలని కాపాడుకోవాలని కార్పొరేట్
కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. రాయలసీమ-తీరాంధ్ర
ప్రాంతంలోని సామాన్య ప్రజలు, రైతాంగాన్ని అక్కడి నాయకులు పక్కన పడేశారు.
ఇంతటి బహిరంగ విషాదం ఇటీవలి కాలంలో మరెక్కడా కనిపించదు.
రేపు ఏర్పడే రాయలసీమ- తీరాంధ్ర రాష్ట్ర నిర్మాణం, అభివృధ్ధి గురించి చర్చ జరగాల్సిన
సమయంలో హైదరాబాద్ గురించి చర్చ జరుగుతున్నదంటే సన్నివేశం ఏంత విషాదకరంగా మారిందో
అర్ధం చేసుకోవచ్చు, ఉమ్మడి రాష్ట్రం విస్తీర్ణం
ఎంత వుండాలి? అనే అంశంపై ఇప్పుడు
ఘాటుగా చర్చలు జరుగుతున్నాయి, కేవలం 17 చదరపు కిలో మీటర్లున్న ఖైరతాబాద్ మండలాన్ని ఉమ్మడి రాష్ట్రం చేస్తే
సరిపోతుందని తెలంగాణలోని అతివాదులు
అంటున్నారు. 125
చదరపు కిలో
మీటర్లున్న పాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఉమ్మడి రాష్ట్రం చేస్తే
సరిపోతుందని మరికొందరంటున్నారు. 40 లక్షల జనాభాతో 217 చదరపు కిలో మీటర్లున్న హైదరాబాద్ జిల్లానో, 80 లక్షల జనాభాతో 625 చదరపు కిలో మీటర్లున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్నో
ఉమ్మడి రాష్ట్రం చేయాలని ఇంకొందరంటున్నారు.
కోటి మంది జనాభాతో 7228 చదరపు
కిలో మీటర్లున్న హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్
అధారిటీ (హెచ్ ఎండిఏ) ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రం చేయాలని
కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు
వంటివారు కోరుతున్నారు. వివాదం ఎంతవరకు పోయిందంటే, “హెచ్ఎండీఏ పరిధిని కేంద్ర
పాలిత ప్రాంతం చేయండి లేదా తెలంగాణ
ప్రక్రియ మొత్తం నిలిపివేయండి'
అని సీమాంధ్ర కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షీండేను తమ అంతిమ నిర్ణయంగా చెప్పారట!
సీమాంధ్ర నేతలు ఢిల్లీలో విభజనను
అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టడంతో దానికి ప్రతిగా అన్నట్టు తెలంగాణవాదులు “భద్రాచలం మాదే” :మునగాల మాదే” “అశ్వారావుపేట మాదే” అంటు కొత్త తిరకాసు
మొదలెట్టారు. 1956 నవంబరు
1 నాటికివున్న తెలంగాణ కావాలని మొన్నటి వరకు చెప్పిన, తెలంగాణ
రాష్ట్ర సమితి కేంద్రమంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలో కొత్తవాదన ప్రవేశపెట్టింది. 2007 నాటి నియోజకవర్గాల
పునర్విభజన ప్రకారం పది జిల్లాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 శాసనసభ నియోజకవర్గాల్ని తెలంగాణ రాష్ట్ర సరిహద్దులుగా
నిర్ణయించాలని కోరింది. అంతకుముందున్న భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గాన్ని2007లో రద్దు చేసి, సీమాంధ్రలో అరకు
పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. భద్రాచలం శాసనసభ నియోజకవర్గాన్ని
కొత్తగా ఏర్పాటుచేసిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కలిపేశారు. ప్రత్యేకంగా చెప్పనప్పటికీ
ఇప్పుడు భద్రాచలంతో కూడిన తెలంగాణను టీఆర్ ఎస్ కోరుతోంది. టీఆర్ ఎస్ తో పోటీపడుతున్న టీ-టిడిపి, సిపిఐ
కూడ ఇప్పుడు భద్రాచలం తెలంగాణదే అంటున్నాయి. హైదరాబాద్ తప్ప మరో ఆలోచనే లేని
సీమాంధ్ర నేతలు భద్రాచలం వంటి కీలక అంశాన్ని పక్కన పడేశాయి.
హైదరాబాద్ రెవెన్యూను కోల్పోతే రేపు ఏర్పడబోయే రాయలసీమ-తీరాంధ్ర రాష్ట్రం ఆర్ధిక లోటుతో కొనసాగాల్సి ఉంటుందని
వాదిస్తున్నవారూ వున్నారు. తరచిచూస్తే ఈ వాదన కూడా తర్కానికి నిలబడదు. యూటీ
చేస్తే, హైదరాబాద్ రెవెన్యూ రాయలసీమ-తీరాంధ్ర ప్రాంతానికి బదిలీ
అవుతుందని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకత్వం వుండదు. రాజధాని నగరం గాబట్టి అనేక
వాణిజ్య సంస్థల కేంద్ర , రాష్ట్ర కార్యాలయాలు ప్రస్తుతం హైదరాబాద్ లో వున్నాయి. అవి పన్నుల్ని
హైదరాబాద్ నుండి చెల్లిస్తున్నాయి. రేపు
రాష్ట్ర విభజన జరిగాక అక్కడి వాణిజ్యసంస్థల కేంద్ర కార్యాలయాలు కొత్త రాజధాని
నగరంలో ఏర్పడతాయి. ఆ రాష్ట్రపు పన్నుల్ని అక్కడే చెల్లిస్తాయి. కాకపోతే ప్రస్తుతం ఒక లక్షా అరవై వేల
కోట్లున్న మూడు ప్రాంతాల సమిష్టి వార్షిక
బడ్జెట్ రేపు దామాషా ప్రకారం తగ్గవచ్చు.
ఎంత చెట్టుకు అంతగాలి!
సీమాంధ్ర నేతల్ని ఇటీవల ఒక రకం నిస్పృహ
ఆవరించినట్టు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచితే కేసిఆర్ కు తన ఆస్తి
రాసిచ్చేస్తానని ఒకాయన ప్రకటిస్తే, తాను ముఖ్యమంత్రి అయితే విభజనవాదుల్ని జైల్లో
పడేస్తానని ఇంకోకాయన ప్రకటించాడు. సీమాంధ్రలో విహజనవాదుల్ని సాంఘీక బహిష్కారం
చేస్తామని మరోకాయన ప్రకటించాడు. ఈ ప్రకటనల ద్వార వారు సాధించదలచింది ఏమైనప్పటికీ రాష్ట్ర
విభజన కోరుకునేవాళ్ళు సీమాంధ్రలో సహితం పెద్ద సంఖ్యలో వున్నారని స్పష్టమౌతోంది.
దాదాపు రెండు శతాబ్దాలుగా కొనసాగుతున్న
పెత్తందారీకులాల ఆధిపత్యాన్ని సీమాంధ్ర
ప్రాంతంలోని బలహీనవర్గాలు ప్రస్తుతం తీవ్రంగా నిరసిస్తున్నాయి. అందువల్లనే, బలహీనవర్గాల్లో
అత్యధికులు ఇప్పుడు విభజనను కోరుకుంటున్నారు. దానివల్ల కలిగే లాభనష్టాలు ఎలావున్నా, పెత్తందారీకులాల
ఆధిపత్యం తగ్గితే చాలనే అభిప్రాయం సీమాంధ్ర బలహీనవర్గాల్లో క్రమంగా బలపడుతోంది.
నిజానికి సీమాంధ్ర
ప్రాంతపు ఆధిపత్య కులాలకు 1972 తరువాత
ఉద్యమ అనుభవమూలేదు. వాళ్లకు ఆ అవసరమూ
రాలేదు. మరోవైపు, ఆ ప్రాంతపు బలహీనవర్గాలు గత మూడు దశాబ్దాలుగా అనేక సాంఘీక,
ఆర్ధిక ఉద్యమాల్లో ఆరితేరాయి. కారంచేడు, చుండూరు ఉద్యమాల్లో సీమాంధ్ర ప్రాంతపు
రెండు ప్రధాన ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా పోరాడిన అనుభవం వారికుంది. విశాఖజిల్లాలో
ఆదివాసులు హోరాహోరీగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పొరాటం చేస్తున్నారు.
కాకినాడ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు చమురు బావులకు వ్యతిరేకంగా
ఉద్యమిస్తున్నారు. రాయలసీమలో వేంపేట పోరాటం, సీమాంధ్రలో చినగంజాం పోరాటం, వాడరేవు
అండ్ నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్
కారిడార్ (వాన్ పిక్) వ్యతిరేక
పోరాటాల్లో వాళ్ళు ఆరితేరారు. ఈ నేపథ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర కొత్త రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని నియమించాలనే ఆలోచన చేస్తోందని
వార్తలు వస్తున్నాయి. సమైక్య హోరు తగ్గగానే పెత్తందారీ కులాల వ్యతిరేక ఉద్యమం మొదలవ్వడానికి సీమాంధ్ర సిధ్ధంగావుంది.
(రచయిత
ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్
: 90102
34336
హైదరాబాద్
23
నవంబరు 2013
ప్రచురణ
: సూర్య దినపత్రిక, ఎడిట్ పేజీ, 24 నవంబరు 2013
No comments:
Post a Comment