Irresponsible Political Parties
కృష్ణా ట్రిబ్యూనల్ కొత్త విలన్
విభజన సందట్లో బాధ్యతల విస్మరణ
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
ఏ
గుడ్డివాడికీ అర్ధంకాని ఏనుగులా తయారయ్యింది ఆంధ్రప్రదేశ్ విభజన. మన నాయకులుగా చెలామణి అవుతున్నవాళ్ళు ఎవరికి
ఎప్పుడు ఏది తోస్తే అది చెప్పేయడమే తప్ప, సమస్య మీద ఒక్కరికీ ఒక సమగ్ర దృష్టి
వున్నట్టు కనిపించడంలేదు.
విభజన
పూర్వ అధ్యాయంలో అదృష్టవంతులు ఇద్దరే; తెలంగాణలో కేసిఆర్, సీమాంధ్రలో సియం కిరణ్
కుమార్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని అనేక మంది, అనేక సంఘాలు, పార్టీలు, అనేక
పధ్ధతుల్లో కొనసాగించినా ఆ క్రెడిట్ అంతా ఇప్పుడు కేసిఆర్ ఖాతాలో పడిపోతోంది. పదేళ్ల
పాలనలో తాము చేస్తున్న ఏకైక మహత్కార్యంలా భావిస్తున్న సోనియా - రాహుల్ - మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా
తెలంగాణవాదులు ఏది కోరితే అది ఇవ్వడానికి సిధ్ధం అన్నట్టు ప్రవర్తిస్తోంది. విభజనను
సమర్ధించేవాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం తీరు బాధగా వుంది. “సముద్రం
నుండి వచ్చే తుపాన్లను నేనేమీ చేయలేనుగానీ, కేంద్రం నుండి వచ్చే తుపాన్లను మాత్రం
అడ్డుకుంటా” అనే ఒకే ఒక్క వెంటిలేటర్ తో కిరణ్ కుమార్
రెడ్డి ప్రభుత్వం ప్రాణం నిలబెట్టుకుంటోంది.
సీమాంధ్ర
ప్రజల భౌతిక సమస్యల్ని పక్కన పెట్టి, వాటిక్లి పరిష్కార మార్గాల్ని విస్మరి<చి,
భాషాసంస్కృతుల గురించి, భావోద్వేగాల్ని
రెచ్చగొట్టినవాళ్లంతా ఇప్పుడు ట్రావెల్ బ్యాగులు సర్దుకుంటున్నారు. సీమాంధ్ర మంత్రులు ఢిల్లీలో కేంద్రమంత్రుల బృందంతో సాగిస్తున్న చర్చల వివరాలు
వింటుంటే గుండె తరుక్కుపోతోంది. వందేళ్ల క్రితం గురజాడ అప్పారావు “మనోళ్ళు వఠ్ఠి వెధవాయిలోయి” అన్న మాటలకు ఇప్పుడు ప్రాసంగికత పెరిగినట్టు అనిపిస్తోంది.
సీమాంధ్ర
నేతలు మాత్రం హైదరాబాద్ ను యుటీ చేయాలనే సింగిల్ పాయింట్ ప్రోగ్రాంనే ఇప్పటికీ
కోనసాగిస్తున్నారు. కేంద్రమంత్రి జేడీ
శీలం అయితే “తెలంగాణవాళ్ళు ఏది అడిగినా ఇచ్చేస్తాం. కానీ, హైదరాబాద్
ను మాత్రం యూటీ చెయ్యండి” అంటూ ఢిల్లీలో
తెలంగాణ కేంద్రమంత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు, అన్ని సంకేతాలు సానుకూలంగా వుండడంతో, హైఅదరాబాద్
తో కూడిన పది జిల్లాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన సంపూర్ణ
రాష్ట్రం కావాలని తెలంగాణవాదులు
పట్టుబిగిస్తున్నారు.
మనుషులకున్న
చిత్రమైన లక్షణం ఏమంటే, తమకు అనుకూలమైన విషయాల్ని
మరెవ్వరూ మార్చడానికి వీలులేని
భగవద్గీత శ్లోకాలుగానో, బైబిల్
వాక్యాలుగానో, ఖురాన్ ఆయతులుగానో ప్రచారం
చేస్తారు. “10, 17, 119” అంటూ కేసిఆర్
చేస్తున్న డిమాండుగానీ, “సమైక్యాంధ్రాకు
371 డి
సహజ కవచకుండలం” అంటూ లగడపాటి రాజగోపాల్ గానీ చేస్తున్న
ప్రచారంగానీ ఈ కోవలోకే వస్తాయి. మారనిది
ప్రపంచంలో ఏదీ వుండదు;. అజ్ఞానంతప్ప.
తెలంగాణలో 17 లోక్ సభ, 119 అసెంబ్లీ స్థానాలు 2007లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా
వచ్చాయి. వాటిని మార్చడం కష్టసాధ్యం
సావచ్చుగానీ, అసాధ్యం ఏమీకాదు. అసలు విషయం
ఏమంటే, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ
నియోజకవర్గాలే వుండాలనే నియమం ఏమీలేదు. అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి వాటిని
మార్చుకోవచ్చు. దానికి గొప్ప ఉదాహరణ నాగాలాండ్. ఆ రాష్ట్ర జనాభా 20 లక్షలు. 11 జిల్లాలు. రాష్ట్రం మొత్తానికి
వున్నది ఒకే ఒక లోక్ సభ నియోజకవర్గం. అందులో, ఏకంగా 60 అసెంభ్లీ సిగ్మెంట్లున్నాయి. అలాగే, ఉత్తరప్రదేశ్ లో అత్యల్పంగా ఒక
పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంభ్లీ
సిగ్మెంట్లు మాత్రమే వున్నాయి.
బీహార్ లో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి 6 అసెంభ్లీ సిగ్మెంట్లు వుండగా, ఢిల్లీలో 10 అసెంభ్లీ సిగ్మెంట్లు వున్నాయి.
భద్రాచలం
డివిజన్, మునగాల, అశ్వారావుపేట ప్రాంతాల్ని తిరిగి సీమాంధ్రలో కలపాలనడంలో తెలివిడి
ఏమీలేదు. 1 నవంబరు 1956 కు ముందు అవి సీమాంధ్రలోనే వున్నాయి
గాభట్టీ ఏలాగూ అవి తిరిగివస్తాయి. తెలివైనవాళ్ళు
అడగాల్సింది అది కాదు. పోలవరం, పులిచింతల ముంపు ప్రాంతాలు సీమాంధ్రలో వుండేలా
కొత్త రాష్ట్ర సరిహద్దుల్ని నిర్ణయించాలి అని కోరడం అర్ధవంతంగా వుంటుంది. ఇందులో కొన్ని
ఇచ్చిపుచ్చుకోవడాలు వుండవచ్చు. ఎందుకంటే ప్రస్తుతమున్న డిజైను ప్రకారం పోలవరం
ముంపు ప్రాతం కేవలం భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో మాత్రమే లేదు. పాల్వంచ రెవెన్యూ డివిజన్ లోనూ ముంపు ప్రాంతం వుంది. పాల్వంచ
రెవెన్యూ డివిజన్ లోని ముంపు ప్రాంతాన్ని పొందాలంటే, దానికి సరిపడా
భూభాగాన్ని భద్రాచలం డివిజన్ నుండి
తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి వుంటుంది. దానికి, ఇరువర్గాలూ సిధ్ధపడాలి. ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాల్లో శ్రీ లక్ష్మణ సమేత
సీతారామచంద్రస్వామిని సీమాంధ్రులు త్యాగం చేయాల్సి రావచ్చు. కుచ్ ఖోకర్ పానా హై. కుచ్ పాకర్ ఖోనా హై.
పోలవరం
ప్రస్తావనను తెచ్చినప్పుడెల్లా ఈ వ్యాసకర్త కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు, విమర్శల్ని
ఎదుర్కోవాల్సి వస్తున్నది. పోలవరం ప్రాజెక్టును సమర్ధించడానికి ప్రధాన కారణం అది తీరాంధ్ర
నేల మీద నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టు. గోదావరి జలాల్ని పోలవరం ప్రాజెక్టు
ద్వార కృష్ణా డెల్టాకు మళ్ళిస్తే, ఆ మేరకు ఆదా అయిన కృష్ణా జలాల్ని శ్రీశైలం
ప్రాజెక్టు ద్వార రాయలసీమకు అందించాలనేది ప్రతిపాదన. రాయలసీమకు జలన్యాయం జరక్కపోతే
రాష్ట్రంలో మరో కుంపటిని రగిలించినట్టే. ఇందులో విషాదం ఏమంటే, రాయలసీమకు చెందిన
నాయకులు కూడా పోలవరాన్ని తీరాంధ్ర ప్రాజెక్టుగా భావించి విమర్శించడం.
పోలవరం
ప్రాజెక్టులో అన్నింటికన్నా ప్రధాన సమస్య
నిర్వాసితులది, వాళ్లకు పునరావాసానిది. నిర్వాసితుల్లో అత్యధికులు ఆదివాసులు.
మైదాన ప్రాంతాల్లో పునరావాస ప్యాకేజిని రూపొందించినంత సులువుగా ఆదివాసులకు
పునరావాస ప్యాకేజిని రూపొందించడం సాధ్యంకాదు. పోలవరం మాత్రమేకాదు, ఏ ప్రాజెక్టు నిర్మాణం
విషయంలో అయినా అంతిమ నిర్ణయం నిర్వాసితులదే కావాలి. మనం కోరుకోవాల్సిందల్లా, నిర్వాసితులు,
లబ్దిదారుల మధ్య తలెత్తే విబేధాలు ఒకే రాష్ట్రపు అంతర్గత
వ్యవహారంగా వుండాలని మాత్రమే!
తెలంగాణ
ఉద్యమానికి భౌతిక పునాది లేదనీ, అక్కడి నాయకులు కేవలం ప్రజల భావోద్వేగాలను
రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడుపుతున్నారని సీమాంధ్ర నాయకులు తరచూ అనేవారు. ఇప్పుడు కథ అందుకు భిన్నంగా సాగుతోంది,
సమైక్యాంధ్య ఉద్యమం భావోద్వేగాల ఉద్యమంగా తేలింది. తాను ముఖ్యమంత్రి అయితే విభజనవాదులందర్నీ
జైల్లో
పడేస్తానని వారం క్రితమే చెప్పిన రాయలసీమ మంత్రి టీజీ వెంకటేష్ క్రమంగా వాస్తవాలను గమనిస్తున్నట్టున్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాటంచేసి పిచ్చివాళ్లుగా
మిగిలామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ
రేవడిగా మారిందని వారు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
విభజన అనంతరం సీమాంధ్రలో చంద్రబాబు, జగన్
ల ప్రాధాన్యం పెరుగుతుందని రాజకీయ
పండితులు బలంగా భావించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి పార్టీల్లోనూ అలాంటి ఉత్సాహ
పూరిత వాతావరణం కనిపించడంలేదు. సమన్యాయం పేరుతో తెలంగాణలో ఎర్రబెల్లి, సీమాంధ్రలో
పయ్యావుల మధ్య నలిగిపోతున్న చంద్రబాబు మైదానంలో దిగడం మానేసి పెవిలియన్ లో
ఔత్సాహిక వ్యాఖ్యతగా మారిపోయారు. సీమాంధ్రలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత బలపడుతోంది
గాబట్టి, అది తమకు అనుకూలంగా మారుతుందని కంప్యూటర్ మీద లెఖ్ఖలు వేసుకోవడం మినహా, తమ పార్టీ మీద
ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి టిడిపి అధినేత చేస్తున్నది ఏమీలేదు.
బెయిల్
మీద జైలు నుండి వచ్చాక ఐదు రోజులు లాంఛనపు
దీక్ష చేయడం మినహా గడిచిన రెండు నెలల్లో జగన్
రాజకీయంగా సాధించిందేమీలేదు. ఇటీవల తుపాను పీడిత పాంతాల్లో జగన్ చేసిన పర్యటనకు
వచ్చిన స్పందనను ఆయన ఓదార్పు యాత్రతో పోలిస్తే ప్రజల్లో వారి గ్రాఫ్ దిగువ ముఖంగా
ప్రయాణిస్తున్నదని చెప్పకతప్పదు. చంద్రబాబు స్వంత నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం` యాత్ర మొదలెట్టడానికి సంచలన విలువతప్ప, సీమాంధ్ర ప్రజలకు
ఉపయోగపు విలువ ఏమీలేదనే చెప్పాలి. చంద్రబాబు ఇటీవల కుప్పంలో పర్యటించినప్పుడు ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాలేదు, సమైక్య శంఖారావానికి భారీగా
జనసేకరణ చేసి, సీమాంధ్ర ప్రజల మద్దతు తనకే
వుందని చాటి చెప్పాలని జగన్ ఆశిస్తున్నారు. అది ఏమేరకు నెరవేరుతుందోగానీ, ఆయనకు
అసలు పోటీ స్వయాన చెల్లెలు షర్మీల నుండే ఎదురుకానుంది!. జగన్ వదిలేసిన బాణం షర్మీల
రెండు నెలల క్రితం చేసిన ప్రజాప్రస్థానంకు
వచ్చినంత జనం ఇప్పుడు సమైక్య శంఖారావానికి రాకపోతే జగన్ ను ప్రజలు వదిలేశారు అనుకోవాల్సి
వుంటుంది.
అధికార,
ప్రతిపక్షాలు తమ భాధ్యతల్ని
విస్మరించడానికి రాష్ట్ర విబజన అంశం గొప్ప వరంగా మారింది. వరుస రెండు తుఫాన్ల
బాధితుల ఆక్రందనలు చల్లారక ముందే మూడో తుఫాను తీరం దాటింది. అంతకన్నా పెద్ద తుఫాను జస్టిస్ బ్రిజేష్ కుమార్
కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్ సృష్టించింది. నదీ జలాల్ని అన్ని ప్రాంతాలవారు
ఉపయోగించుకున్నా, వరదల్ని భరించేది మాత్రం దిగువ ప్రాంతాలవారే. అంచేత దిగువ
ప్రాంతాలకు నికర జలాల్లో పెద్ద వాటా ఇవ్వడం, అదనపు జలాల్ని వినియోగించుకునే
సౌలభ్యం కల్పించడం ఒక సాంప్రదాయం. ఇప్పుడా సాంప్రదాయానికి బ్రిజేష్ కుమార్
ట్రిబ్యూనల్ గండి కొట్టింది. మిగులు జలాలపై మనం పొందుతున్న దిగువ ప్రాంతాల హక్కు (లోయర్
రైపేరియన్ రైట్స్) ని రద్దు చేసింది. ఇది సీమాంధ్రకే కాదు తెలంగాణకు కూడా
కోలుకోలేని నష్టం.
తెలంగాణ,
సీమాంధ్రుల మధ్య ఎన్ని విబేధాలైనా వుండవచ్చు., కానీ, ఎగువ రాష్ట్రాలపై నీటి యుధ్ధం చేయాల్సి
వచ్చినపుడు ఇద్దరూ సమైక్యంగా పోరాడాలి.
లేకుంటే ఇరుప్రాంతాలూ శాశ్వితంగా నష్టపోతాయి.
(రచయిత
ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మొబైల్
: 90102
34336
హైదరాబాద్
30
నవంబరు 2013
ప్రచురణ
: సూర్య దినపత్రిక, ఎడిట్ పేజీ, 1 డిసెంబరు 2013
No comments:
Post a Comment