Tuesday, 18 March 2014

కులాల కూర్పు మారాలి

Social Adjustment in Political Structure
కులాల కూర్పు మారాలి
డానీ

భవన్ పాతబిల్డింగును తెలంగాణ పిసిసి కార్యాలయంగా మార్చారు. నిన్ననే ప్రారంభోత్సవం జరుపుకున్న కొత్త బిల్డింగ్ ను సీమాంధ్ర పిసిసికి ఇచ్చారు. విచిత్రం ఏమంటే పాతబిల్డింగు కళకళలాడుతూ వైష్ణవాలయంలావుంది. కొత్తబిల్డింగులో బుడ్డిదీపం వెలిగించేవారు కూడా లేక   శివాలయంలా వుంది. ఏఐసిసిలో రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్  నగరంలోనే వున్నారు. అయినా, కొత్త బిల్డింగులో మనిషన్నవాడు కనిపించలేదు. ఎన్నికల ముంగిట సీమాంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఒక్కరూ లేకపోవడం ఆశ్చర్యం! సీమాంధ్రలో కాంగ్రెస్ దయనీయస్థితికి ఇది అద్దం పడుతోంది. పైగా, కొత్త బిల్డింగ్ పేరు ఇందిరా భవన్!

కొత్తతరం రాజకీయ నాయకులకు నిరంతరం పచ్చటి పచ్చిక బయళ్ళుకావాలి.  వాళ్ళెప్పుడూ అలాంటి పచ్చికబయళ్ల వేటలో వుంటారు. ఒకచోట గ్రాసం నిండుకుందని తెలియాగానే కంచె దూకేస్తారు. దీనికి రాజకీయ సిధ్ధాంతాలు ఒక సాకు మాత్రమే!  అట్ట చింపేస్తే, ఏ ఎన్నికల ప్రణాళిక ఏ పార్టీదో చెప్పడం కష్టం అయ్యే రోజులివి. ఇప్పుడు కాంగ్రెస్ అతిరధులంతా గాంధీభవన్ ను వదిలి అయితే ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటున్నారు; కాకుంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ భవనానికి చేరుకుంటున్నారు.

        ప్రతి పార్టీకీ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్థితితప్పదు. పాతికేళ్లక్రితం కూడా కాంగ్రెస్ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంది.  అత్యయిక పరిస్థితి తరువాత జరిగిన 1977 లోక్ సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. సాక్షాత్తు ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ కూడా ఓడిపోయారు. కానీ, ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రం జరిగింది. రాష్ట్రంలోని 42 లోక్ సభాస్థానాల్లో ఒక్క నంద్యాల సీటుతప్ప మిగిలిన 41 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాలలో జనతా టిక్కెట్టుపై నీలం సంజీవరెడ్డి గెలిచారు. వారు రాష్ట్రపతి కావడంతో నంద్యాల స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నూటికి నూరు శాతం సీట్లను గెలుచుకుంది. ఇది అప్పటికీ ఇప్పటికీ రికార్డు.

ఆ తరువాత ఇందిరా గాంధీ మీద వెంగళరావు తిరుగుబాటు చేశారు.  బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో రెడ్డి కాంగ్రెస్ పెట్టారు. ఆనాటి కాంగ్రెస్ అతిరథ మహారథులంతా రెడ్డి కాంగ్రెస్ కు మారిపోయారు. ఇందిరా కాంగ్రెస్ కార్యాలయాల్లో లైటు వెలిగించేవారు కూడా లేకుండాపోయారు. శనివారం దిగ్విజయ్ సింగ్ ముందు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్నట్టు అప్పుడూ ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్టు తీసుకునేవారే  కరువయ్యారు. మాజీ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఇందిరాగాంధీకి విజయవాడలో గెస్ట్ హౌస్ కూడా దొరకలేదు. అలాంటి కష్టకాలంలో, ఇందిరా కాంగ్రెస్ లో మిగిలిన మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహారావు, నాదెండ్ల భాస్కరరావు, పరకాల శేషావతారం తదితరులు ఒక కొత్త వ్యూహంతో పార్టీకి జీవం పోశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజలకు ఎంతో కొంత వ్యతిరేకత వుంటుందిగనుక కొత్తవారికి, కొత్త సామాజికవర్గాలకి  అవకాశంఇచ్చి ఒక ప్రయోగం చేశారు.  ఆ ప్రయోగం ఘనవిజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ కు 175 సీట్లు రాగా, రెడ్డి కాంగ్రెస్ కు కేవలం 30 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

1978 ఎన్నికలని కొందరు రెడ్డికాంగ్రెస్ పై ఇందిరాకాంగ్రెస్ సాధించిన విజయంగా భావించవచ్చు. వాస్తవానికి అది రాజకీయాల్లో పాత పెత్తందారీవర్గాలపై కొత్తశక్తుల విజయం. ఆ ఎన్నికల్లో కొత్త సామాజికవర్గాలు సాధించిన విజయానికి కంకిపాడు ఒక గొప్ప ఉదాహరణ. ఓటర్ల సంఖ్యరీత్యా కంకిపాడు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నియోజకవర్గం. ఓటర్లలో కమ్మసామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్ధిగా రంగంలో దిగిన    కోనేరు రంగారావుది మాదిగ సామాజికవర్గం. అప్పటికి వారు రాజకీయాల్లో అనామకులనే చెప్పవచ్చు. అయినా రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ వారు ఆ ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించారు.

భారత పార్లమెంటరీ రాజకీయాల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మనకు ఒక ఆసక్తికర సామాజిక నియమం కనిపిస్తూ వుంటుంది. ప్రతి రెండు దశాబ్దాలకో, మూడు దశాబ్దాలకో ఒకసారి రాజకీయాల్లో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటుంటాయి. పాతశక్తుల పక్కన దిగువ నుండి కొత్త శక్తులు వచ్చి చేరుతుంటాయి. కొత్తవాటికి స్థానం ఇవ్వాల్సి వుంటుంది.  రాజకీయ నిర్మాణంలో సామాజిక సర్దుబాటు తప్పనిసరవుతుంది. అలాంటి సర్దుబాటును నిరాకరిస్తే మొత్తం రాజకీయ వ్యవస్తే కూలిపోతుంది. అలాంటి చారిత్రక సంధి సమయాల్లో  రాజకీయ నిర్మాణంలో సామాజిక సర్దుబాటును ప్రోత్సహించిన రాజకీయపార్టి విజయాన్ని సాధిస్తుంది. 1978లో ఇందిరా కాంగ్రెస్ విజయాన్నీ,  1983లో యన్టీ రామారావు విజయాన్నీ, 1989లో తిరిగి కాంగ్రెస్  సాధించిన విజయాన్నీ, 1994లో తిరిగి టిడిపి అధికారంలోనికి రావడాన్నీ అచ్చంగా రాజకీయ అర్ధంలోకాక ఇలాగే రాజకీయార్ధిక, సామాజిక కోణంలో అర్ధం చేసుకోవాల్సి వుంటుంది.

పైకి రాజకీయ పార్టీల మధ్య పోటీగా కనిపిస్తున్నవన్నీ, సారాంశంలో కుల మత వర్గ సంఘర్షణలే.  ప్రతి రాజకీయ పార్టీ కులాలు, మతాలు, వర్గాల రూపంలో తనదైన ఒక సామాజిక పునాదిని ఏర్పాటు చేసుకుంటుంది. అదే ఓటు బ్యాంకు. కొన్ని సందర్భాల్లో ఇది తలకిందులుగానూ జరగవచ్చు. కొన్ని కులాలు, మతాలు, వర్గాలు కలిసి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోనూవచ్చు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కొందరు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పరిణామంగా మాత్రమే భావిస్తారుగానీ రాజకీయ నిర్మాణంలో వచ్చిన సామాజిక సర్దుబాటుగా  గుర్తించరు. మనరాష్ట్రంలో పార్లమెంటరీ రాజకీయాల మీద మొదట బ్రాహ్మణ సామాజికవర్గాల ప్రాబల్యం కొనసాగింది. క్రమంగా ఆ స్థానాన్ని రెడ్డి  సామాజికవర్గం ఆక్రమించింది. రాజకీయ ఆధిపత్యంలో కమ్మ సామాజికవర్గానికి సముచిత స్థానం కల్పించడానికి యన్టీ రామారావు రూపంలో భారీ ప్రయత్నం జరిగింది.  వెనుకబడిన కులాలు, షెడ్యూలు కులాలు, ముస్లిం సామాజికవర్గాల మద్దతుతో వారు తమ లక్ష్యాన్ని సాధించారు. ఆ తరువాత రాజకీయాల్లో రెడ్డి-కమ్మ కాంబినేషన్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో  రెడ్డి సామాజికవర్గం కొనసాగితే అది తెలుగుదేశం రాజకీయాలుగానూ, రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో కమ్మ సామాజికవర్గం  కొనసాగితే అది కాంగ్రెస్  రాజకీయాలుగానూ గత మూడున్నర దశాబ్దాలుగా సాగుతోంది. అధికారంలోనికి టిడిపి వస్తుందా? కాంగ్రెస్ వస్తుందా? వైయస్సార్  కాంగ్రెస్ వస్తుందా? అని జరిగే చర్చ అంతా సారాంశంలో కమ్మ సామాజికవర్గం నాయకత్వంలో  రెడ్డి సామాజికవర్గం అధికారాన్ని పంచుకోవాలా? లేక రెడ్డి సామాజికవర్గం నాయకత్వంలో కమ్మ సామాజికవర్గం అధికారాన్ని పంచుకోవాలా? అనేదే! ఇప్పుడు ఆ అధ్యాయం కూడా ముగింపుకు చేరుకుంటున్నది.  దళిత బహుజనులు, మతమైనారిటీలు తదితర కొత్త శక్తులు రాజకీయాధికారంలో సముచిత వాటాను కోరుతున్నాయి. దిగువశ్రేణుల్లో రగులుతున్న సామాజిక కల్లోలాన్ని మరుగుపరచడానికి దాదాపు అన్ని పార్టీలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది నిప్పును గడ్డితో కప్పడం వంటి ప్రయత్నం మాత్రమే!


కాపుసామాజికవర్గం ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాధిపత్యంలో చిన్నతరహా భాగస్వామిగా వుంటున్నదేతప్ప నేరుగా నాయకత్వం వహించిన సందర్భంలేదు. రాజకీయాధిపత్యంలో కాపుసామాజికవర్గాన్ని నాయకత్వ స్థానంలో నిలపడానికి అప్పట్లో, వంగవీటి మోహనరంగా రూపంలో, ఇటీవల  చిరంజీవి రూపంలో కొన్ని ప్రయత్నాలు  జరిగాయి. ఆ ప్రయత్నాలు విఫలం కావడానికి చాలామంది కాపు సామాజికవర్గ నాయకుల వ్యక్తిగత పరిమితుల్ని ప్రస్తావిస్తుంటారు. అది ఒక పార్శ్వం మాత్రమే. నిజానికి సామాజికవర్గాల నిచ్చెనలో కాపు సామాజికవర్గం స్థానాన్ని నిర్ధారించడంలోనే ఒక దందరగోళం వుంది. కాపు సామాజికవర్గం ఆధిపత్య కులాల్లో వెనుకబడినతరగతిగానూ, వెనుకబడినతరగతుల్లో ఆధిపత్య కులంగానూ కొనసాగుతోంది.  కాపు సామాజికవర్గం ఇలాంటి ద్వంద్వసభత్వం నుండి బయటపడితే రాష్ట్ర రాజకీయ సామాజిక సమీకరణల్లో  మరింత స్పష్టత వస్తుంది.
          ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టి పడుతున్న కష్టాలన్నీ 1990వ దశకంలో తెలుగుదేశం పార్టికి వచ్చాయి. 1991 లోక్ సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వుంది. ఎన్టీఆర్ ప్రతిపక్షనేతగా వున్నారు. కష్టకాలంలో వచ్చిన ఆ ఎన్నికల్లో   ఎన్టీఆర్ ఒక అద్భుత సామాజిక ప్రయోగం చేశారు. కొత్త రఘురామయ్య ఐదుసార్లు, ఆచార్య యన్జీ రంగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన ప్రతిష్ఠాత్మక గుంటూరు నియోజకవర్గాన్ని ముస్లిం అభ్యర్ధికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆచార్య యన్జీ రంగాపై  తెలుగు దేశం అభ్యర్ధి  ఎస్ యం లాల్ జాన్ బాషా విజయం సాధించి పార్లమెంటరీ రాజకీయాల పరిభాషలో జెయింట్ కిల్లర్అయ్యారు. ఆ ఎన్నికల్లోనే మచిలీపట్నం నియోజకవర్గంలోనూ ఎన్టీఆర్ మరో ప్రయోగం చేశారు. మాగంటి అంకినీడు, కావూరు సాంబశివరావు నాలుగు విడుతలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం స్థానాన్ని వెనుకబడిన సామాజికవర్గానికి చెందిన కేపి రెడ్డయ్యకు కేటాయించి విజయం సాధించారు. కమ్మసామాజికవర్గం తమ ప్రధాన రాజకీయ కార్యక్షేత్రంగా భావించే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో యన్టీఆర్ ఈ ప్రయోగాన్ని చేయడం విశేషం. దీని ఫలితాలు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించాయి. ఆ ఎన్నికల్లో హిందూ వెనుకబడిన సామాజికవర్గాలు, ముస్లిం సామాజికవర్గాలు టిడిపికి భారీ విజయాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషించాయి. అలా యన్టీఆర్ మళ్ళీ అధికారంలోనికి వచ్చారు.

ఈ గుణపాఠాలన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం నేర్చుకోవాల్సివుంది. అంటే, రాజకీయాల్లో సామాజికవర్గాల కూర్పు మారాల్సిన సమయం వచ్చిందని గమనించాలి. పాత కూర్పు మీద నిరసన వ్యక్తం అవుతున్నప్పుడు దాన్ని తొలగించి కొత్త కూర్పును ఏర్పాటుచేసే చర్యల్ని తక్షణం చేపట్టాలని గుర్తించాలి. అలాంటి కొత్త ప్రయోగాలకు ఇది సరైన సమయం

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
16 మార్చి 2014
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, ఎడిట్ పేజీ, 19  మార్చి 2014

Wednesday, 12 March 2014

సినీస్టార్ల రాజకీయం అంత ఈజీ్కాదు

సినీస్టార్ల రాజకీయం అంత ఈజీ్కాదు
డానీ

సినిమా స్టార్లవారసులకు సినిమాల్లో ప్రవేశించడానికి సులువుగా  ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. అలాగే సినిమా స్టార్లు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కూడా సులువుగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. అయితే ఈ సౌలభ్యం సినిమాల్లోకి అయినా, రాజకీయాల్లోకి అయినా ప్రవేశించడానికి మాత్రమే పనికివస్తుంది. అక్కడ నిలదొక్కుకోవడం అనేది వాళ్లవాళ్ల వ్యక్తిగత సామర్ధ్యం మీద ఆధారపడివుంటుంది. సినిమాల్లోకి వచ్చినవాళ్లందరూ మహానటులు కాలేనట్టే, రాజకీయాల్లోకి వచ్చిన నటులందరూ మహానాయకులు కాలేరు.

గత ఎన్నికల్లో మెగాస్టార్  చిరంజీవి రాజకీయపార్టి పెట్టి రెండేళ్ళు కూడా తిరక్కుండానే బోర్డు తిప్పేశారు. ఈసారి ఎన్నికల్లో మెగాఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే యన్టీ రామారావు ప్రస్తావన వస్తుంది. 

సినిమాలకు కథ ముఖ్యం. పార్టీలకు రాజకీయాలు ముఖ్యం. తెలుగునాట ఈ విజయ రహాస్యం యన్టీఆర్ కు తెలిసినంతగా మరెవరీకీ తెలియదంటే అతిశయోక్తికాదు. వెండితెర మీద పురాణ పురుషులకు ఒక రూపాన్నిచ్చినట్టే, రాజకీయ రంగంలోనూ సంక్షేమ పథకాలకు అయన ఒక కొత్త వూపునిచ్చారు. యన్టీరామారావు  రాజకీయరంగంలో అడుగుపెట్టగానే గానే రాష్ట్ర రాజకీయాలేకాదు, దేశరాజకీయాలు సహితం ఆయన చుట్టూ తిరగడం ఆరంభించాయి.

వెండి తెర సూపర్ స్టార్ గా వున్న యన్టీ రామారావు ఆ ఇమేజితో తెలుగుదేశం పార్టి పెట్టి  ఏడాది తిరక్కుండానే అధికారాన్ని చేపట్టారని చాలామంది ఘనంగా చెపుతుంటారు.  ఇందులో వాస్తవదోషం లేదుగానీ, ఆనాడు టిడిపి అధికారంలోనికి రావడానికి అనేక అంతర్ బహిర్ కారణాలున్నాయి. ఇప్పటికీ కొందరు గుర్తించని అంశం ఏమంటే, యన్టీ రామారావు పార్టీ అయితే అప్పుడు కొత్తగా పెట్టారుగానీ, ఆయన సినిమారంగంలో వుండగానే ఒక రాజకీయ దృక్పధాన్ని రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. సందర్భాన్నిబట్టి దాన్ని ప్రచారంలో పెడుతూవచ్చారు.

ఆర్య దేవుళ్ళయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగు సినిమా ప్రేక్షకుల కళ్ళల్లో యన్టీఆర్ కనపడతారు. వెండితెర మీద పౌరాణిక పాత్రలకు ఆయన జీవంపోశారు.  చాలామంది గమనించని విషయం ఏమంటే ఎన్టీఆర్ మొదటీ నుండీ ద్రావిడ అభిమాని. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం  వహించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలోనే అది ప్రస్పుటంగా కనిపించింది. స్వంత బేనర్‌ అయిన నేషనల్‌ ఆర్ట్‌ ధియేటర్స్‌ నిర్మించిన ఆ సినిమాలో రామారావు కథానాయకుడుకాదు. ప్రతినాయకుడు.! రావణాసురునిగా బహుళ ప్రచారంలో వున్న పాత్రను ఆయన రావణబ్రహ్మగా మలిచి ప్రాణప్రతిష్ట చేశారు. ఆ తరువాత దర్శకత్వం వహించిన  'శ్రీకృష్ణపాండవీయం' లోనూ దుర్యోధనుణ్ణి సుయోధనుడ్ని చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటు తెలంగాణాలో ముల్కీ ఆందోళన, అటు ఆంధ్రాలో  జై ఆంధ్రా ఉద్యమం జరుగుతున్న కాలం ''తెలుగు జాతిమనది నిండుగా వెలుగు జాతి మనది'' అనగలిగిన ధీర కళాకారుడు యన్టీ రామారావు. ఇవన్నీ ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి రెండు దశాబ్దాల ముందు విషయం.

ఆర్యవ్యతిరేక సాంస్కృతిక దృక్పధాన్ని ఆయన సినిమాల్లో అంతర్లీనంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ద్రావిడ దృక్పథం ఆయనకు, పుట్టినిల్లు గుడివాడ తాలూకాలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సూతాశ్రమం ద్వార అబ్బిందో, మెట్టినిల్లు మదరాసులో పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ ద్వారా అబ్బిందో, లేక సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు మార్గదర్శిగా భావించే యం.జీ. రామచంద్రన్‌ ద్వారా అబ్బిందో చరిత్రకారులు తేల్చాల్సేవుంది.
సినిమాల్లో నటిస్తున్న రోజుల్లోనే యన్టీఆర్ ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీలపట్ల తన వ్యతిరేకతను చాటేవారు.  యన్టీఆర్‌ రాజకీయం కాంగ్రెస్‌ వ్యతిరేక శ్రేణుల ఐక్యత. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని పాటించే సాంప్రదాయాన్ని ఆరంభించింది కూడా ఆయనే.

భౌగోళికరాజకీయాల్లో ఆయన దక్షణాది అభిమానాన్నీ, ఉత్తరాది వ్యతిరేకతను ప్రదర్శించేవారు. తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ సాంస్కృతిక నినాదం తెలుగుజాతి ఆత్మగౌరవం ఈ నేపథ్యంలో పుట్టిందే! ''కేంద్రప్రభుత్వం ఒక మిధ్య'' అంటూ ఆయన చేసిన ఫెడరల్ తిరుగుబాటు కూడా ఆర్య-ద్రావిడ వివాదానికి కొనసాగింపే.

ఇవన్నీ ఆయన వ్యక్తిగత ప్రయత్నం.  ఆంధ్రప్రదేశ్ లో 1980-82  మధ్య రెండేళ్ల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రుల్ని మార్చిన కాంగ్రెస్ పార్టి భ్రష్టుపడిపోవడంతో రాష్ట్రరాజకీయల్లో భారీ శూన్యత అలుముకుంది. ఇది అప్పటి బాహ్యాత్మక వాతావరణం. వ్యక్తిగత ప్రయత్నం,  బాహ్యాత్మక వాతావరణంతో పొసిగినపుడే లక్ష్యలు గమ్యానికి చేరుతాయి. (ఆబ్జెక్టివ్ కండీషన్స్ సబ్జెక్టివ్ ఎఫర్ట్స్).

ప్రజలకు యన్టీరామారావు ఇచ్చుకున్న నిర్వచనం కూడా విచిత్రంగా వుంటుంది.  యన్టీ రామారావు దృష్టిలో ప్రజలంటే కర్షకులు, కార్మికులు మాత్రమే.  వాళ్లను ఆయన అమితంగా ప్రేమించేవారు. వారికోసం ఇతర వర్గాలతో తలపడడానికి కూడా వెనుకాడేవారుకాదు. ఆయన 'అందరివాడు' కాదు. ప్రభుత్వోద్యోగులు, పాత్రికేయులు, చివరకు విద్యార్థులు కూడా ఆయనకు ప్రజలుగా కనిపించే వారుకాదు. వాళ్లందరితోనూ ఆయన తలపడిన సందర్భాలున్నాయి.

        ప్రజారాజ్యం పార్టి  వైఫల్యాలకు కూడా అంతర్ బహిర్ కారణలు పుష్కలంగా వున్నాయి. రాష్ట్ర రాజకీయరంగాన్ని ప్రభుత్వాధినేత వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత  చంద్రబాబునాయుడు దాదాపు సంపూర్ణంగా ఆక్రమించుకునివున్న కాలంలో ప్రజారాజ్యం పార్టి  ఆవిర్భవించింది. అప్పటికే హౌస్ ఫుల్ కారణంగా పీఆర్పీకి పెద్ద సీట్లు రాలేదు.  వ్యక్తిగతంగా చిరంజీవి కూడా ప్రజల్ని కదిలించి, ఉత్తేజాన్నిచ్చే  ఒక్క నినాదం కూడా ఇవ్వలేకపోయారు. అందరివాడు అనిపించుకుని ఓట్లు దండుకోవాలనే ఆతృతలో ఒక నిర్దిష్ట రాజకీయ విధానాన్ని రూపొందించుకోకపోవడంతో ఎవ్వరివాడూ కాకుండాపోయారు. 

ఇప్పుటి రాష్ట్ర రాజకీయ పరిస్థితీ పీఆర్పీ నాటికన్నా భిన్నంగా ఏమీలేదు. తెలంగాణలో టీ.ఆర్.ఎస్, బీజేపి బలపడుతున్నప్పటికీ  అధికార కాంగ్రెస్ పార్టి  సహితం గట్టిపోటీ ఇచ్చే స్థితిలోనే వుంది. మరోవైపు సీమాంధ్రలో జగన్ కు చెందిన వైయస్సార్ సిపీ, తెలుగుదేశం పార్టిలతోపాటూ బీజేపి సహితం పుంజుకుంటుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కటే బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కూడా రంగ ప్రవేశం చేస్తుండడంతో సీమాంధ్రలో రాజకీయ శూన్యత ఏమాత్రంలేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ నాలుగు పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరుతారా? లేకపోతే దైర్యంచేసి కొత్తపార్టీ పెడతారా అన్నది అసలు ప్రశ్న.  పవన్ కళ్యాణ్  వెనుకనడిచే సామాజికవర్గాలు ఏవీ? అనేది అంతకన్నా కీలకమైన ప్రశ్న.

        సినిమా స్టార్లకు మాస్ ఫాలోయింగ్ పెద్ద స్థాయిలో వుంటుంది. పైగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భారీ విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ గా వున్నారు.   అయితే, సినిమా స్టార్ల మాస్ ఫాలోయింగ్ కూ ఓటింగుకూ పెద్దగా సంబంధంవున్నట్టు కనిపించదు. వాళ్ళ రోడ్ షోలకు జనం ఫుల్లు, పోలింగ్ బూత్ లో ఓట్లునిల్లు అనే నానుడి ఎలాగూవుంది.

        కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తన సినీఅభిమానులతోపాటూ,  తన స్వంత సామాజికవర్గాన్ని ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. అయితే, దీనికీ పరిమితులున్నాయి. ఆయన ఆభిమానులందరూ ఆయన రాజకీయపార్టీకి అభిమానులు కావాలనే నియమం ఏమీలేదు.  అలానే, కాపు సామాజికవర్గం మొత్తం ఆయన వెనుక నడవాలనే నియమమూలేదు. 

మరోవైపు, సీమాంధ్ర కాంగ్రెస్ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఆసక్తికర సామాజిక సమీకరణలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను విడిచి బయటికి పోతున్న ప్రజాప్రతినిధుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ముందు పంక్తిలో వున్నారు.  కాంగ్రెస్ లోవున్న కాపు సామాజికవర్గం దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయి. పైగా, కాంగ్రెస్-కాపు సామాజికవర్గానికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మెగాబ్రదర్ చిరంజీవే నాయకత్వం వహిస్తున్నారు. ఇన్ని పరిమితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.

        హిట్ల కోసం దాదాపు ఒక దశాబ్ద కాలం ముఖం వాచివున్న పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సంభాషణల చాతూర్యంతో హీట్లు ఇచ్చారు. వారే, నాలుగు ప్రభావశీలమైన నాలుగు నినాదాలు అందిస్తే, పవన్ కళ్యాణ్ కు ఇతర సామాజికవర్గాల నుండి కూడా చెప్పుకోదగ్గ ఓట్లు పడవచ్చు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
మార్చి  2014
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, ఎడిట్ పేజీ, 13 మార్చి   2014

http://www.prabhanews.com/specialstories/article-430271

Monday, 3 March 2014

పోలవరం నిర్ణేతలుగా నిర్వాసితులు

పోలవరం నిర్ణేతలుగా నిర్వాసితులు
ఏ యం ఖాన్ యజ్దాని (డానీ)

పోలవరం  ప్రాజెక్టును అర్ధంచేసుకున్నవాళ్లకన్నా అపార్ధం చేసుకున్నవాళ్ళే ఎక్కువ.  దాన్ని అపార్ధం చేసుకున్నవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో మాత్రమే వున్నారనుకుంటే తప్పు. రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతంలోనూ ఈ ప్రాజెక్టు గురించి అపార్ధమే బలంగా కొనసాగుతోంది. నాలుగు జిల్లాలకు విస్తరించిన కృష్ణా డెల్టాలోని దాదాపు పధ్నాలుగు లక్షల ఎకరాల్లో మూడవ పంటకో, నాలుగవ పంటకో  సాగునీరు అందించడానికి పోలవరం కడుతున్నారనే అభిప్రాయం తెలంగాణలో బలంగా ప్రచారంలోవుంది. రాయలసీమ నాయకుల్లో కూడా కొందరు పోలవరం మీద దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. విచిత్రంగా, తీరాంధ్ర ప్రజల్లోనూ ఇది తమ కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు అనే అపోహే బలంగావుంది.

తెలంగాణకు చెందినవారేకాక, స్వయంగా కేసిఆర్ కు సన్నిహితులైనవాళ్ళ  నిర్మాణసంస్థలు కూడా గతంలో పోలవరం నిర్మాణ కాంట్రాక్టు కోసం  పోటీలు పడ్డాయి. ఇప్పుడు పోలవరం నిర్మాణ సంస్ద్థల్లో  సీమాంధ్రకు చెందిన వాటికి సింహవాటా  దక్కవచ్చు. రాష్ట్ర విభజన రాయితీల్లో అవి కూడా ఒకటి కావచ్చు. 

గోదావరి నది నుండి 80 టీయంసీల నీటిని ప్రకాశం బ్యారేజి ఎగువన కృష్ణానదిలోనికి మళ్ళించి,  ఆమేరకు, నాగార్జునసాగర్‌ నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీటిని ఆదాచేసి, తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌. ఎల్‌. బి.సి) లకు నికర జలాలను కేటాయించాలనేది పోలవరం ప్రాజెక్టు ప్రకటిత ప్రధాన లక్ష్యం. ఆ విధంగా అది తీరాంధ్ర నేలమీద కడుతున్న రాయలసీమ ప్రాజెక్టు.  విశాఖపట్నానికి 23 టియంసీల తాగునీరు, కొత్త కాలువల పరివాహక ప్రాంతంలో 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు  సాగునీరు అందించడం, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం కూడా ఈ బహుళార్ధసాధక  ప్రాజెక్టులో వున్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనేకాక, నిర్వహణలోనూ అనేక మెలికలున్నాయి. దిగువ రాష్ట్రమైన అంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానంవల్ల అదనపు నీళ్ళను మళ్ళిస్తే, అందులో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు వాటా ఇవ్వాలని 1976 నాటి  ఆర్.యస్. బచావత్‌ కృష్ణా జల వివాదాల ట్రిబ్యూనల్‌  తీర్పులో  oఒక షరతు వుంది.

పోలవరం నిర్మిస్తే,  80 టియంసీలలో మహారాష్ట్రకు 18  శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27  శాతంగా 21 టీయంసీల నీళ్ళు  ఇవ్వాల్సి వుంటుంది.  అంటే, ఎగువరాష్ట్రాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో  30 టీయంసీలు ఎస్‌.ఎల్‌.బి.సి.కు  15 టీయంసీలు తెలుగుగంగకు  కేటాయించాలని 1985లో, యన్‌.టీ. రామారావు ప్రభుత్వం నిర్వహింహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.  ఈ రెండు ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులులేవు..

మనం  చాలా వెనుకబడివున్నాంగానీ, 1996లో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన  ఆంధ్రప్రదేశ్ లో ఊపందుకున్న మరుక్షణం నుండే  తమకు రాబోయే అదనపు వాటా నీటిని నిల్వ చేసుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సంపూర్ణ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాయి. అల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల ప్రాజెక్టు ఈ నేపథ్యంలో చేపట్టిందే. ఇటీవలి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు   కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదలను సమర్ధించుకున్నది కూడా  పోలవరం ప్రాజెక్టు నెపంతోనే.

పొలవరం ప్రాజెక్టు పూర్తయ్యి, కృష్ణా బేసిన్‌ కు నీరు విడుదల అయిన మరుక్షణం,  మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా మన రాష్ట్రంలోనికి  వచ్చే కృష్ణా నికరజలాలు  అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. మరో 45 టీయంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు విడుదలైపోతాయి. ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి కృష్ణాడెల్టాకు విడుదలయ్యే నీటిలో 80 టీయంసీల కోత విధిస్తారు. ఆ విధంగా పోలవరంవల్ల కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపులో  ఒక్క చుక్క నీరు కూడా పెరగదు. అయితే, రావలసిన వాటా నీరు  బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో అందుబాటులో వుండడంవల్ల కృష్ణాడెల్టా ఆయకట్టు రైతులు  ఖరీఫ్, రబీ నాట్లు  సకాలంలో వేయడానికి వీలు కుదురుతుంది. పోలవరంవల్ల కృష్ణాడెల్టాకు అదొక్కటే ప్రయోజనం! 

పోలవరం అనేకాదు, ప్రతి ప్రాజెక్టులోనూ ప్రకటిత లక్ష్యాలతోపాటూ అప్రకటిత లక్ష్యాలు, దారిమళ్ళింపులూ, వాటర్ హైజాకులు  వుంటాయి. అన్నింటికన్నా కీలకమైనది ఏ ప్రాజెక్టు అయినా ఆ ప్రాంత ధనికవర్గాలకు ప్రత్యంక్షంగానూ, పేదవర్గాలకు  పరోక్షంగాను మాత్రమే ఉపయోగపడుతుంది. సామాజికంగా పెత్తందారీ కులాలకు ప్రధానంగానూ, బడుగు బలహీనవర్గాలకు నామమాత్రంగానూ ఉపయోగపడుతుంది.  

అందరికీ తేలిసిన విషయం ఏమంటే సాగునీరు వాడుకోవడానికి స్వంత కమతం ఒకటి కావాలి. గోదావరికి ఉత్త చేతులతో వెళ్ళినవాళ్లకు దోసేడు నీల్లే దక్కుతాయి. చెంబు తీసుకుపోయినవాళ్లకు చెంబుడు, బిందె తీసుకుపోయినవాళ్ళకు బిందెడు, ట్యాంకురుతో పెళ్ళినవాళ్ళకు ట్యాంకరు నీళ్ళు దక్కుతాయి.  సాగునీరూ అంతే ఎంత పోలం వుంటే అంత నీరు దక్కుతుంది.

ప్రాజెక్టులవల్ల ధనికులు మరింత ధనికులవుతారనీ, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళైపోతారనే ఆందోళన కొట్టివేయదగ్గదేమీకాదు. అంటే,  దాని అర్ధం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలనీకాదు. ఆలోచనాపరులు చేయాల్సిందల్లా ప్రాజెక్టుల ద్వారా జరిగే అభివృధ్ధిని ప్రజలకు సమపంపిణి జరిగే మార్గాలని అన్వేషించడం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రధాన కార్యక్షేత్రం నల్గొండజిల్లా. పోరాటం వుధృతంగా సాగుతున్న కాలంలోనే నాగార్జునసాగర్ (అప్పట్లో నందికొండ) ప్రాజెక్టు సర్వే జరిగింది. అంతటి ఉద్రిక్త  పరిస్థితిల్లోనూ కమ్యూనిస్టు నాయకులు తమ బృందానికి సహకరించేవారని  విఖ్యాత నీటిపారుదలా ఇంజినీర్ కేయల్  రావు చెప్పేవారు. 

        పోలవరం ప్రాజెక్టు వివాదాల్లో రెండు అంశాలు  ప్రాణప్రదమైనవి. ఇందులో మొదటిది సాంకేతికపరమైనది. రెండోది జనావాసానికి సంబంధించింది.
రెండు మూడేళ్లకు వచ్చే  వరద వుధృతి సమయంలో గోదావరి నదిలో నీటి ప్రవాహ వేగం  సగటున పది లక్షల కుసెక్కులు ( సెకనుకు ఘనపు అడుగులు)  వుంటుంది. 1953 ఆగస్టు 16 న ధవిళేశ్వరం ఆనకట్ట మీదుగా  29 లక్షల  కుసెక్కుల చొప్పున పది రోజులు వరద ప్రవాహం సాగింది. ఇప్పటి వరకు గోదావరి వరదల్లో అదే గరిష్ట స్థాయి.  దాదాపు ఆ స్థాయి వరదలు మళ్ళీ 1986, 2012 లలో వచ్చాయి.  

ఆనకట్టలు, బ్యారేజీల్ని  మైదాన ప్రాంతంలోనూ, డ్యాముల్ని కొండ ప్రాంతంలోను నిర్మించాల్సివుంటుంది. మైదాన ప్రాంతంలో  ఆర్ధర్ కాటన్ కట్టిన  ఆనకట్ట  స్పిల్ వే పొడవు దాదాపు 12 వేల అడుగులు. అయితే,  పాపికొండల్లో నిర్మించ తలపెట్టిన పోలవరం  ప్రాజెక్టు స్పిల్ వే పొడవు ప్రస్తుత డిజైన్ ప్రకారం మూడు వేల అడుగులకన్నా తక్కువే.  క్రస్ట్ గేట్ల ఎత్తు కాటన్ ఆనకట్టకన్నా  ఎక్కువే వున్నప్పటికీ,  గోదావరినదికి ముఫ్ఫయి యేళ్లకు ఒకసారి 30 లక్షల కుసెక్కుల వేగంతో ప్రవహించే  భారీ వరద నీటిని విడుదల చేసే సామర్ధ్యం పోలవరం స్పిల్ వేకు వుంటుందా? అనేది నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఏమాత్రం అదుపు తప్పినా ఘోరప్రమాదం  జరిగిపోతుందని వాళ్ళు హెచరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా  అందుబాటులో వుందా? అనేది ఆలోచించాలి. లేదా పోలవరం డిజైను మార్చి  ఒక డ్యాం బదులు  అనేక చిన్న డ్యాములు నిర్మించాలి.  

ఎక్కడైనా మితవాదులు వున్నట్టే అతివాదులూ వుంటారు.  గోదావరి నదిలో వెయ్యేళ్లకు ఒకసారి  50 లక్షల కుసెక్కులతో వరద నీరు ప్రవహిస్తుందని అంచన. అలాంటి భారీ వరద నీటిని కూడా సులువుగా విడుదల చేసే విధంగా పోలవరం డ్యాం స్పిల్ వేను పెంచాలని ఒరిస్సా రాష్ట్రం వాదిస్తోంది. 30 లక్షల క్యుసెక్కులకే అభ్యంతరాలొస్తున్నపుడు 50 లక్షల కుసెక్కుల నీటి విడుదల సామర్ధ్యం గల స్పిల్ వేను నిర్మించడం సాధ్యమా? అనేది ప్రశ్న.

అమెరికా సంయుక్త రాష్ట్రాల  దక్షణ ప్రాంతంలో ఆరిజోనా, నెవెడా రాష్ట్రాల సరిహద్దుల వెంబడి బ్లాక్ కాన్యాన్ ప్రాంతంలో కొలరాడో నదిమీద నిర్మించిన హోవర్ డ్యాంతో పోలవరం కు ఫొలికలున్నాయి. బ్లాక్ కాన్యాన్ ప్రాంతంలో మన పాపికొండల్లా  లోతైన నల్లరాతి లోయ దిగువ నుండి కొలరాడో నది  ప్రవహిస్తుంటుంది. పోలవరం డిజైన్ ను రూపొందించే క్రమంలో కేయల్ రావు  స్వయంగా హోవర్ డ్యాం ను సందర్శించి దాని నిర్మాణ విధానాన్ని అధ్యయనం చేసివచ్చారు. పోలవరం డిజైన్  మీద అభ్యంతరాలున్నవారిలో  కేయల్ రావు కూడా ఒకరు. సాంకేతిక అంశాల్లో అలాంటి నిపుణులు వెలిబుచ్చిన సూచనల్ని పరిగణన లోనికి తీసుకోవాలి.

        పోలవరం డ్యాము నిర్మాణంలో సాంకేతిక అంశంకన్నా ప్రాణపదమైనది జనావాసాల తొలగింపు.. ఆంధ్రప్రదేశ్ తో పాటూ ఒరిస్సా, ఛత్తీస్ గడ్ లకు చెందిన 274 గ్రామాలు ముంపుకు గురికాగా, దాదాపు 40 వేల కుటుంబాలకు ఇతర ప్రాంతాల్లో తక్షణసహాయంతోపాటు  పునరావాస పథకాన్ని పెద్దఎత్తున చేపట్టాల్సి వుంటుంది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో వున్న ముంపు గ్రామాల్ని రేపు ఏర్పడబోయే విభక్త ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పటికీ, ఒరిస్సా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలతో ముంపు గ్రామాల వివాదం అంత సులభంగా సమసిపోకపోవచ్చు. ఆర్ ఆర్ ప్యాకేజిని  కొత్త చట్టం ప్రకారం ఉదారంగా అమలుచేసినా మరిన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్వాసితుల్లో అత్యధికులు గిరిజన తెగలవాళ్ళు కనుక వాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టసాధ్యం మాత్రమేకాదు, సంస్కృతీపరంగా చాలా సున్నితమైన అంశం.


సామూహిక వలస, పునరావాసం  విషయంలోను అతివాదులూ, మితవాదులూ వుంటారు. పోలవరం పరిసరాల్లో ఇప్పుడు అడివి అనేదే లేదు కనుక గిరిజనులు మైదాన ప్రాంత జీవితానికి అలవాటు పడిపోయారనేది ఒక వాదన. ఇప్పటికీ ఆ ప్రాంతపు గిరిజన తెగలు అడవిపై ఆధారపడి, సాంప్రదాయిక ఆదివాసీ జీవితాన్ని  మాత్రమే గడుపుతున్నారనేది ఇంకో వాదన. ఈ రెండు వాదనలూ వాస్తవం కాదు.  వాస్తవం ఈ రెండింటికి మధ్యన వుంటుంది.  దాన్ని తేల్చాసింది ప్రాజెక్టు లబ్దిదారులుకాదు; బాధితులు. వాళ్ళే పోలవరం ప్రాజెక్టు డిజైనును నిర్ణయించాలి

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ _  90102 34336
హైదరాబాద్‌, 27 ఫిబ్రవరి  2014


ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్ పేజీ 4  మార్చి 2014