పోలవరం నిర్ణేతలుగా నిర్వాసితులు
ఏ యం ఖాన్ యజ్దాని (డానీ)
పోలవరం ప్రాజెక్టును అర్ధంచేసుకున్నవాళ్లకన్నా అపార్ధం
చేసుకున్నవాళ్ళే ఎక్కువ. దాన్ని అపార్ధం
చేసుకున్నవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో మాత్రమే వున్నారనుకుంటే తప్పు. రాయలసీమ, తీరాంధ్ర
ప్రాంతంలోనూ ఈ ప్రాజెక్టు గురించి అపార్ధమే బలంగా కొనసాగుతోంది. నాలుగు జిల్లాలకు
విస్తరించిన కృష్ణా డెల్టాలోని దాదాపు పధ్నాలుగు లక్షల ఎకరాల్లో మూడవ పంటకో,
నాలుగవ పంటకో సాగునీరు అందించడానికి
పోలవరం కడుతున్నారనే అభిప్రాయం తెలంగాణలో బలంగా ప్రచారంలోవుంది. రాయలసీమ నాయకుల్లో
కూడా కొందరు పోలవరం మీద దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. విచిత్రంగా,
తీరాంధ్ర ప్రజల్లోనూ ఇది తమ కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టు అనే అపోహే బలంగావుంది.
తెలంగాణకు చెందినవారేకాక,
స్వయంగా కేసిఆర్ కు సన్నిహితులైనవాళ్ళ
నిర్మాణసంస్థలు కూడా గతంలో పోలవరం నిర్మాణ కాంట్రాక్టు కోసం పోటీలు పడ్డాయి. ఇప్పుడు పోలవరం నిర్మాణ
సంస్ద్థల్లో సీమాంధ్రకు చెందిన వాటికి
సింహవాటా దక్కవచ్చు. రాష్ట్ర విభజన
రాయితీల్లో అవి కూడా ఒకటి కావచ్చు.
గోదావరి నది నుండి 80 టీయంసీల నీటిని ప్రకాశం
బ్యారేజి ఎగువన కృష్ణానదిలోనికి మళ్ళించి,
ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీటిని ఆదాచేసి,
తెలుగుగంగ, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్. ఎల్. బి.సి) లకు నికర జలాలను
కేటాయించాలనేది పోలవరం ప్రాజెక్టు ప్రకటిత ప్రధాన లక్ష్యం. ఆ విధంగా అది తీరాంధ్ర నేలమీద
కడుతున్న రాయలసీమ ప్రాజెక్టు. విశాఖపట్నానికి 23 టియంసీల తాగునీరు,
కొత్త కాలువల పరివాహక ప్రాంతంలో 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
అందించడం, 960 మెగావాట్ల విద్యుత్
ఉత్పత్తి చేయడం కూడా ఈ బహుళార్ధసాధక
ప్రాజెక్టులో వున్నాయి.
పోలవరం ప్రాజెక్టు
నిర్మాణంలోనేకాక, నిర్వహణలోనూ అనేక మెలికలున్నాయి. దిగువ రాష్ట్రమైన అంధ్రప్రదేశ్
లో నదుల అనుసంధానంవల్ల అదనపు నీళ్ళను మళ్ళిస్తే, అందులో ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక,
మహారాష్ట్రలకు వాటా ఇవ్వాలని 1976 నాటి ఆర్.యస్. బచావత్ కృష్ణా
జల వివాదాల ట్రిబ్యూనల్ తీర్పులో oఒక షరతు వుంది.
పోలవరం నిర్మిస్తే, 80 టియంసీలలో
మహారాష్ట్రకు 18 శాతంగా 14 టియంసీలు, కర్ణాటకకు 27 శాతంగా 21 టీయంసీల నీళ్ళు ఇవ్వాల్సి వుంటుంది. అంటే, ఎగువరాష్ట్రాలకు 35 టీయంసీలు పోగా మిగిలేది 45 టీయంసీలే. వీటిల్లో 30 టీయంసీలు ఎస్.ఎల్.బి.సి.కు 15 టీయంసీలు తెలుగుగంగకు కేటాయించాలని 1985లో, యన్.టీ. రామారావు ప్రభుత్వం నిర్వహింహించిన
అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఈ రెండు
ప్రాజెక్టులకు ఇప్పటివరకు నికర జలాల కేటాయింపులులేవు..
మనం
చాలా వెనుకబడివున్నాంగానీ, 1996లో
పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్
లో ఊపందుకున్న మరుక్షణం నుండే తమకు రాబోయే అదనపు వాటా
నీటిని నిల్వ చేసుకోవడానికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు సంపూర్ణ ఏర్పాట్లు
చేసుకుని కూర్చున్నాయి. అల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల ప్రాజెక్టు ఈ నేపథ్యంలో
చేపట్టిందే. ఇటీవలి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ముందు కర్ణాటక ప్రభుత్వం అల్మట్టి డ్యాం ఎత్తు
పెంపుదలను సమర్ధించుకున్నది కూడా పోలవరం
ప్రాజెక్టు నెపంతోనే.
పొలవరం ప్రాజెక్టు పూర్తయ్యి, కృష్ణా
బేసిన్ కు నీరు విడుదల అయిన మరుక్షణం, మహారాష్ట్ర,
కర్ణాటకల మీదుగా మన రాష్ట్రంలోనికి వచ్చే
కృష్ణా నికరజలాలు అధికారికంగా 35 టీయంసీలు తగ్గిపోతాయి. మరో
45 టీయంసీల నీరు శ్రీశైలం
ప్రాజెక్టు నుండి రాయలసీమకు విడుదలైపోతాయి. ఆమేరకు, నాగార్జునసాగర్ నుండి
కృష్ణాడెల్టాకు విడుదలయ్యే నీటిలో 80 టీయంసీల కోత విధిస్తారు.
ఆ విధంగా పోలవరంవల్ల కృష్ణాడెల్టాకు నీటి కేటాయింపులో ఒక్క చుక్క నీరు కూడా పెరగదు. అయితే, రావలసిన
వాటా నీరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో అందుబాటులో
వుండడంవల్ల కృష్ణాడెల్టా ఆయకట్టు రైతులు
ఖరీఫ్, రబీ నాట్లు సకాలంలో
వేయడానికి వీలు కుదురుతుంది. పోలవరంవల్ల కృష్ణాడెల్టాకు అదొక్కటే ప్రయోజనం!
పోలవరం అనేకాదు, ప్రతి
ప్రాజెక్టులోనూ ప్రకటిత లక్ష్యాలతోపాటూ అప్రకటిత లక్ష్యాలు, దారిమళ్ళింపులూ, వాటర్
హైజాకులు వుంటాయి. అన్నింటికన్నా
కీలకమైనది ఏ ప్రాజెక్టు అయినా ఆ ప్రాంత ధనికవర్గాలకు ప్రత్యంక్షంగానూ, పేదవర్గాలకు పరోక్షంగాను మాత్రమే ఉపయోగపడుతుంది. సామాజికంగా
పెత్తందారీ కులాలకు ప్రధానంగానూ, బడుగు బలహీనవర్గాలకు నామమాత్రంగానూ
ఉపయోగపడుతుంది.
అందరికీ తేలిసిన విషయం ఏమంటే సాగునీరు
వాడుకోవడానికి స్వంత కమతం ఒకటి కావాలి. గోదావరికి ఉత్త చేతులతో వెళ్ళినవాళ్లకు
దోసేడు నీల్లే దక్కుతాయి. చెంబు తీసుకుపోయినవాళ్లకు చెంబుడు, బిందె
తీసుకుపోయినవాళ్ళకు బిందెడు, ట్యాంకురుతో పెళ్ళినవాళ్ళకు ట్యాంకరు నీళ్ళు
దక్కుతాయి. సాగునీరూ అంతే ఎంత పోలం వుంటే
అంత నీరు దక్కుతుంది.
ప్రాజెక్టులవల్ల ధనికులు మరింత ధనికులవుతారనీ,
పేదవాళ్ళు మరింత పేదవాళ్ళైపోతారనే ఆందోళన కొట్టివేయదగ్గదేమీకాదు. అంటే, దాని అర్ధం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలనీకాదు.
ఆలోచనాపరులు చేయాల్సిందల్లా ప్రాజెక్టుల ద్వారా జరిగే అభివృధ్ధిని ప్రజలకు
సమపంపిణి జరిగే మార్గాలని అన్వేషించడం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రధాన కార్యక్షేత్రం
నల్గొండజిల్లా. పోరాటం వుధృతంగా సాగుతున్న కాలంలోనే నాగార్జునసాగర్ (అప్పట్లో నందికొండ)
ప్రాజెక్టు సర్వే జరిగింది. అంతటి ఉద్రిక్త
పరిస్థితిల్లోనూ కమ్యూనిస్టు నాయకులు తమ బృందానికి సహకరించేవారని విఖ్యాత నీటిపారుదలా ఇంజినీర్ కేయల్ రావు చెప్పేవారు.
పోలవరం
ప్రాజెక్టు వివాదాల్లో రెండు అంశాలు
ప్రాణప్రదమైనవి. ఇందులో మొదటిది సాంకేతికపరమైనది. రెండోది జనావాసానికి
సంబంధించింది.
రెండు మూడేళ్లకు వచ్చే వరద వుధృతి సమయంలో గోదావరి నదిలో నీటి ప్రవాహ
వేగం సగటున పది లక్షల కుసెక్కులు (
సెకనుకు ఘనపు అడుగులు) వుంటుంది. 1953 ఆగస్టు 16 న ధవిళేశ్వరం ఆనకట్ట మీదుగా 29 లక్షల కుసెక్కుల చొప్పున పది రోజులు వరద ప్రవాహం
సాగింది. ఇప్పటి వరకు గోదావరి వరదల్లో అదే గరిష్ట స్థాయి. దాదాపు ఆ స్థాయి వరదలు మళ్ళీ 1986, 2012 లలో వచ్చాయి.
ఆనకట్టలు, బ్యారేజీల్ని మైదాన ప్రాంతంలోనూ, డ్యాముల్ని కొండ
ప్రాంతంలోను నిర్మించాల్సివుంటుంది. మైదాన ప్రాంతంలో ఆర్ధర్ కాటన్ కట్టిన ఆనకట్ట స్పిల్ వే పొడవు దాదాపు 12
వేల అడుగులు. అయితే, పాపికొండల్లో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పొడవు ప్రస్తుత డిజైన్
ప్రకారం మూడు వేల అడుగులకన్నా తక్కువే. క్రస్ట్
గేట్ల ఎత్తు కాటన్ ఆనకట్టకన్నా ఎక్కువే
వున్నప్పటికీ, గోదావరినదికి ముఫ్ఫయి
యేళ్లకు ఒకసారి 30 లక్షల కుసెక్కుల వేగంతో ప్రవహించే భారీ వరద నీటిని విడుదల చేసే సామర్ధ్యం పోలవరం స్పిల్
వేకు వుంటుందా? అనేది నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఏమాత్రం అదుపు తప్పినా
ఘోరప్రమాదం జరిగిపోతుందని వాళ్ళు
హెచరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా
అందుబాటులో వుందా? అనేది ఆలోచించాలి. లేదా
పోలవరం డిజైను మార్చి ఒక డ్యాం బదులు అనేక చిన్న డ్యాములు నిర్మించాలి.
ఎక్కడైనా మితవాదులు వున్నట్టే
అతివాదులూ వుంటారు. గోదావరి నదిలో
వెయ్యేళ్లకు ఒకసారి 50
లక్షల కుసెక్కులతో వరద నీరు ప్రవహిస్తుందని
అంచన. అలాంటి భారీ వరద నీటిని కూడా సులువుగా విడుదల చేసే విధంగా పోలవరం డ్యాం
స్పిల్ వేను పెంచాలని ఒరిస్సా రాష్ట్రం వాదిస్తోంది. 30 లక్షల
క్యుసెక్కులకే అభ్యంతరాలొస్తున్నపుడు 50 లక్షల కుసెక్కుల
నీటి విడుదల సామర్ధ్యం గల స్పిల్ వేను నిర్మించడం సాధ్యమా? అనేది ప్రశ్న.
అమెరికా సంయుక్త రాష్ట్రాల దక్షణ ప్రాంతంలో ఆరిజోనా, నెవెడా రాష్ట్రాల సరిహద్దుల
వెంబడి బ్లాక్ కాన్యాన్ ప్రాంతంలో కొలరాడో నదిమీద నిర్మించిన హోవర్ డ్యాంతో పోలవరం
కు ఫొలికలున్నాయి. బ్లాక్ కాన్యాన్ ప్రాంతంలో మన పాపికొండల్లా లోతైన నల్లరాతి లోయ దిగువ నుండి కొలరాడో
నది ప్రవహిస్తుంటుంది. పోలవరం డిజైన్ ను
రూపొందించే క్రమంలో కేయల్ రావు స్వయంగా
హోవర్ డ్యాం ను సందర్శించి దాని నిర్మాణ విధానాన్ని అధ్యయనం చేసివచ్చారు. పోలవరం
డిజైన్ మీద అభ్యంతరాలున్నవారిలో కేయల్ రావు కూడా ఒకరు. సాంకేతిక అంశాల్లో అలాంటి
నిపుణులు వెలిబుచ్చిన సూచనల్ని పరిగణన లోనికి తీసుకోవాలి.
పోలవరం
డ్యాము నిర్మాణంలో సాంకేతిక అంశంకన్నా ప్రాణపదమైనది జనావాసాల తొలగింపు.. ఆంధ్రప్రదేశ్
తో పాటూ ఒరిస్సా, ఛత్తీస్ గడ్ లకు చెందిన 274 గ్రామాలు
ముంపుకు గురికాగా, దాదాపు 40 వేల కుటుంబాలకు ఇతర ప్రాంతాల్లో
తక్షణసహాయంతోపాటు పునరావాస పథకాన్ని
పెద్దఎత్తున చేపట్టాల్సి వుంటుంది. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో వున్న ముంపు గ్రామాల్ని
రేపు ఏర్పడబోయే విభక్త ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పటికీ, ఒరిస్సా, ఛత్తీస్ గడ్
రాష్ట్రాలతో ముంపు గ్రామాల వివాదం అంత సులభంగా సమసిపోకపోవచ్చు. ఆర్ ఆర్
ప్యాకేజిని కొత్త చట్టం ప్రకారం ఉదారంగా అమలుచేసినా
మరిన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్వాసితుల్లో
అత్యధికులు గిరిజన తెగలవాళ్ళు కనుక వాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడం కష్టసాధ్యం
మాత్రమేకాదు, సంస్కృతీపరంగా చాలా సున్నితమైన అంశం.
సామూహిక వలస, పునరావాసం విషయంలోను అతివాదులూ, మితవాదులూ వుంటారు. పోలవరం
పరిసరాల్లో ఇప్పుడు అడివి అనేదే లేదు కనుక గిరిజనులు మైదాన ప్రాంత జీవితానికి
అలవాటు పడిపోయారనేది ఒక వాదన. ఇప్పటికీ ఆ ప్రాంతపు గిరిజన తెగలు అడవిపై ఆధారపడి,
సాంప్రదాయిక ఆదివాసీ జీవితాన్ని మాత్రమే గడుపుతున్నారనేది
ఇంకో వాదన. ఈ రెండు వాదనలూ వాస్తవం కాదు.
వాస్తవం ఈ రెండింటికి మధ్యన వుంటుంది.
దాన్ని తేల్చాసింది ప్రాజెక్టు లబ్దిదారులుకాదు; బాధితులు. వాళ్ళే పోలవరం
ప్రాజెక్టు డిజైనును నిర్ణయించాలి
(రచయిత ఆంధ్రా
జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ _ 90102 34336
హైదరాబాద్, 27 ఫిబ్రవరి
2014
ప్రచురణ : ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్ పేజీ 4
మార్చి 2014
No comments:
Post a Comment