Wednesday 12 March 2014

సినీస్టార్ల రాజకీయం అంత ఈజీ్కాదు

సినీస్టార్ల రాజకీయం అంత ఈజీ్కాదు
డానీ

సినిమా స్టార్లవారసులకు సినిమాల్లో ప్రవేశించడానికి సులువుగా  ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. అలాగే సినిమా స్టార్లు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి కూడా సులువుగా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరుకుతుంది. అయితే ఈ సౌలభ్యం సినిమాల్లోకి అయినా, రాజకీయాల్లోకి అయినా ప్రవేశించడానికి మాత్రమే పనికివస్తుంది. అక్కడ నిలదొక్కుకోవడం అనేది వాళ్లవాళ్ల వ్యక్తిగత సామర్ధ్యం మీద ఆధారపడివుంటుంది. సినిమాల్లోకి వచ్చినవాళ్లందరూ మహానటులు కాలేనట్టే, రాజకీయాల్లోకి వచ్చిన నటులందరూ మహానాయకులు కాలేరు.

గత ఎన్నికల్లో మెగాస్టార్  చిరంజీవి రాజకీయపార్టి పెట్టి రెండేళ్ళు కూడా తిరక్కుండానే బోర్డు తిప్పేశారు. ఈసారి ఎన్నికల్లో మెగాఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే యన్టీ రామారావు ప్రస్తావన వస్తుంది. 

సినిమాలకు కథ ముఖ్యం. పార్టీలకు రాజకీయాలు ముఖ్యం. తెలుగునాట ఈ విజయ రహాస్యం యన్టీఆర్ కు తెలిసినంతగా మరెవరీకీ తెలియదంటే అతిశయోక్తికాదు. వెండితెర మీద పురాణ పురుషులకు ఒక రూపాన్నిచ్చినట్టే, రాజకీయ రంగంలోనూ సంక్షేమ పథకాలకు అయన ఒక కొత్త వూపునిచ్చారు. యన్టీరామారావు  రాజకీయరంగంలో అడుగుపెట్టగానే గానే రాష్ట్ర రాజకీయాలేకాదు, దేశరాజకీయాలు సహితం ఆయన చుట్టూ తిరగడం ఆరంభించాయి.

వెండి తెర సూపర్ స్టార్ గా వున్న యన్టీ రామారావు ఆ ఇమేజితో తెలుగుదేశం పార్టి పెట్టి  ఏడాది తిరక్కుండానే అధికారాన్ని చేపట్టారని చాలామంది ఘనంగా చెపుతుంటారు.  ఇందులో వాస్తవదోషం లేదుగానీ, ఆనాడు టిడిపి అధికారంలోనికి రావడానికి అనేక అంతర్ బహిర్ కారణాలున్నాయి. ఇప్పటికీ కొందరు గుర్తించని అంశం ఏమంటే, యన్టీ రామారావు పార్టీ అయితే అప్పుడు కొత్తగా పెట్టారుగానీ, ఆయన సినిమారంగంలో వుండగానే ఒక రాజకీయ దృక్పధాన్ని రూపకల్పన చేసుకుంటూ వచ్చారు. సందర్భాన్నిబట్టి దాన్ని ప్రచారంలో పెడుతూవచ్చారు.

ఆర్య దేవుళ్ళయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగు సినిమా ప్రేక్షకుల కళ్ళల్లో యన్టీఆర్ కనపడతారు. వెండితెర మీద పౌరాణిక పాత్రలకు ఆయన జీవంపోశారు.  చాలామంది గమనించని విషయం ఏమంటే ఎన్టీఆర్ మొదటీ నుండీ ద్రావిడ అభిమాని. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం  వహించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలోనే అది ప్రస్పుటంగా కనిపించింది. స్వంత బేనర్‌ అయిన నేషనల్‌ ఆర్ట్‌ ధియేటర్స్‌ నిర్మించిన ఆ సినిమాలో రామారావు కథానాయకుడుకాదు. ప్రతినాయకుడు.! రావణాసురునిగా బహుళ ప్రచారంలో వున్న పాత్రను ఆయన రావణబ్రహ్మగా మలిచి ప్రాణప్రతిష్ట చేశారు. ఆ తరువాత దర్శకత్వం వహించిన  'శ్రీకృష్ణపాండవీయం' లోనూ దుర్యోధనుణ్ణి సుయోధనుడ్ని చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటు తెలంగాణాలో ముల్కీ ఆందోళన, అటు ఆంధ్రాలో  జై ఆంధ్రా ఉద్యమం జరుగుతున్న కాలం ''తెలుగు జాతిమనది నిండుగా వెలుగు జాతి మనది'' అనగలిగిన ధీర కళాకారుడు యన్టీ రామారావు. ఇవన్నీ ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి రెండు దశాబ్దాల ముందు విషయం.

ఆర్యవ్యతిరేక సాంస్కృతిక దృక్పధాన్ని ఆయన సినిమాల్లో అంతర్లీనంగా ప్రచారం చేస్తూ వచ్చారు. ద్రావిడ దృక్పథం ఆయనకు, పుట్టినిల్లు గుడివాడ తాలూకాలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సూతాశ్రమం ద్వార అబ్బిందో, మెట్టినిల్లు మదరాసులో పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ ద్వారా అబ్బిందో, లేక సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు మార్గదర్శిగా భావించే యం.జీ. రామచంద్రన్‌ ద్వారా అబ్బిందో చరిత్రకారులు తేల్చాల్సేవుంది.
సినిమాల్లో నటిస్తున్న రోజుల్లోనే యన్టీఆర్ ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీలపట్ల తన వ్యతిరేకతను చాటేవారు.  యన్టీఆర్‌ రాజకీయం కాంగ్రెస్‌ వ్యతిరేక శ్రేణుల ఐక్యత. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని పాటించే సాంప్రదాయాన్ని ఆరంభించింది కూడా ఆయనే.

భౌగోళికరాజకీయాల్లో ఆయన దక్షణాది అభిమానాన్నీ, ఉత్తరాది వ్యతిరేకతను ప్రదర్శించేవారు. తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ సాంస్కృతిక నినాదం తెలుగుజాతి ఆత్మగౌరవం ఈ నేపథ్యంలో పుట్టిందే! ''కేంద్రప్రభుత్వం ఒక మిధ్య'' అంటూ ఆయన చేసిన ఫెడరల్ తిరుగుబాటు కూడా ఆర్య-ద్రావిడ వివాదానికి కొనసాగింపే.

ఇవన్నీ ఆయన వ్యక్తిగత ప్రయత్నం.  ఆంధ్రప్రదేశ్ లో 1980-82  మధ్య రెండేళ్ల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రుల్ని మార్చిన కాంగ్రెస్ పార్టి భ్రష్టుపడిపోవడంతో రాష్ట్రరాజకీయల్లో భారీ శూన్యత అలుముకుంది. ఇది అప్పటి బాహ్యాత్మక వాతావరణం. వ్యక్తిగత ప్రయత్నం,  బాహ్యాత్మక వాతావరణంతో పొసిగినపుడే లక్ష్యలు గమ్యానికి చేరుతాయి. (ఆబ్జెక్టివ్ కండీషన్స్ సబ్జెక్టివ్ ఎఫర్ట్స్).

ప్రజలకు యన్టీరామారావు ఇచ్చుకున్న నిర్వచనం కూడా విచిత్రంగా వుంటుంది.  యన్టీ రామారావు దృష్టిలో ప్రజలంటే కర్షకులు, కార్మికులు మాత్రమే.  వాళ్లను ఆయన అమితంగా ప్రేమించేవారు. వారికోసం ఇతర వర్గాలతో తలపడడానికి కూడా వెనుకాడేవారుకాదు. ఆయన 'అందరివాడు' కాదు. ప్రభుత్వోద్యోగులు, పాత్రికేయులు, చివరకు విద్యార్థులు కూడా ఆయనకు ప్రజలుగా కనిపించే వారుకాదు. వాళ్లందరితోనూ ఆయన తలపడిన సందర్భాలున్నాయి.

        ప్రజారాజ్యం పార్టి  వైఫల్యాలకు కూడా అంతర్ బహిర్ కారణలు పుష్కలంగా వున్నాయి. రాష్ట్ర రాజకీయరంగాన్ని ప్రభుత్వాధినేత వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత  చంద్రబాబునాయుడు దాదాపు సంపూర్ణంగా ఆక్రమించుకునివున్న కాలంలో ప్రజారాజ్యం పార్టి  ఆవిర్భవించింది. అప్పటికే హౌస్ ఫుల్ కారణంగా పీఆర్పీకి పెద్ద సీట్లు రాలేదు.  వ్యక్తిగతంగా చిరంజీవి కూడా ప్రజల్ని కదిలించి, ఉత్తేజాన్నిచ్చే  ఒక్క నినాదం కూడా ఇవ్వలేకపోయారు. అందరివాడు అనిపించుకుని ఓట్లు దండుకోవాలనే ఆతృతలో ఒక నిర్దిష్ట రాజకీయ విధానాన్ని రూపొందించుకోకపోవడంతో ఎవ్వరివాడూ కాకుండాపోయారు. 

ఇప్పుటి రాష్ట్ర రాజకీయ పరిస్థితీ పీఆర్పీ నాటికన్నా భిన్నంగా ఏమీలేదు. తెలంగాణలో టీ.ఆర్.ఎస్, బీజేపి బలపడుతున్నప్పటికీ  అధికార కాంగ్రెస్ పార్టి  సహితం గట్టిపోటీ ఇచ్చే స్థితిలోనే వుంది. మరోవైపు సీమాంధ్రలో జగన్ కు చెందిన వైయస్సార్ సిపీ, తెలుగుదేశం పార్టిలతోపాటూ బీజేపి సహితం పుంజుకుంటుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ఒక్కటే బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కూడా రంగ ప్రవేశం చేస్తుండడంతో సీమాంధ్రలో రాజకీయ శూన్యత ఏమాత్రంలేదని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ఈ నాలుగు పార్టీల్లో ఏదో ఒకదానిలో చేరుతారా? లేకపోతే దైర్యంచేసి కొత్తపార్టీ పెడతారా అన్నది అసలు ప్రశ్న.  పవన్ కళ్యాణ్  వెనుకనడిచే సామాజికవర్గాలు ఏవీ? అనేది అంతకన్నా కీలకమైన ప్రశ్న.

        సినిమా స్టార్లకు మాస్ ఫాలోయింగ్ పెద్ద స్థాయిలో వుంటుంది. పైగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భారీ విజయాలతో టాలీవుడ్ నెంబర్ వన్ గా వున్నారు.   అయితే, సినిమా స్టార్ల మాస్ ఫాలోయింగ్ కూ ఓటింగుకూ పెద్దగా సంబంధంవున్నట్టు కనిపించదు. వాళ్ళ రోడ్ షోలకు జనం ఫుల్లు, పోలింగ్ బూత్ లో ఓట్లునిల్లు అనే నానుడి ఎలాగూవుంది.

        కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ తన సినీఅభిమానులతోపాటూ,  తన స్వంత సామాజికవర్గాన్ని ప్రభావితం చేసే అవకాశాలుంటాయి. అయితే, దీనికీ పరిమితులున్నాయి. ఆయన ఆభిమానులందరూ ఆయన రాజకీయపార్టీకి అభిమానులు కావాలనే నియమం ఏమీలేదు.  అలానే, కాపు సామాజికవర్గం మొత్తం ఆయన వెనుక నడవాలనే నియమమూలేదు. 

మరోవైపు, సీమాంధ్ర కాంగ్రెస్ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఆసక్తికర సామాజిక సమీకరణలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను విడిచి బయటికి పోతున్న ప్రజాప్రతినిధుల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ముందు పంక్తిలో వున్నారు.  కాంగ్రెస్ లోవున్న కాపు సామాజికవర్గం దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలున్నాయి. పైగా, కాంగ్రెస్-కాపు సామాజికవర్గానికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ మెగాబ్రదర్ చిరంజీవే నాయకత్వం వహిస్తున్నారు. ఇన్ని పరిమితుల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.

        హిట్ల కోసం దాదాపు ఒక దశాబ్ద కాలం ముఖం వాచివున్న పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సంభాషణల చాతూర్యంతో హీట్లు ఇచ్చారు. వారే, నాలుగు ప్రభావశీలమైన నాలుగు నినాదాలు అందిస్తే, పవన్ కళ్యాణ్ కు ఇతర సామాజికవర్గాల నుండి కూడా చెప్పుకోదగ్గ ఓట్లు పడవచ్చు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
హైదరాబాద్
మార్చి  2014
ప్రచురణ : ఆంధ్రప్రభ దినపత్రిక, ఎడిట్ పేజీ, 13 మార్చి   2014

http://www.prabhanews.com/specialstories/article-430271

No comments:

Post a Comment