Thursday, 24 July 2014

మాట్లాడాల్సిన సందర్భమే ఇది

మాట్లాడితేనే మహాపరాధమా? - కె. శ్రీనివాస్‌ 24-7-2014 సంపాదకీయం పై స్పందన
మాట్లాడాల్సిన సందర్భమే ఇది

బ్రిటిష్ ఇండియాలో రెండు రకాల పాలన సాగేది.  బ్రిటీష్ ప్రత్యక్ష పాలనలో వున్న భాగం, పరోక్ష  పాలనలో వున్న భాగం. పరోక్ష పాలన కింద 635 సంస్థానాలుండేవి. వీటిల్లో అతిపెద్దది నిజాం సంస్థానం. భారత స్వాతంత్ర చట్టం-1947 లో ఈ సంస్థానాలకు రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది  1. వాళ్ళు స్వతంత్ర దేశంగా వుండవచ్చు. 2. ఇండియన్ యూనియన్ లో గానీ పాకిస్తాలోగానీ  విలీనం కావచ్చు.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా కొనసాగించాలనుకున్నాడు. ఆమేరకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందాలనీ, బ్రిటీష్ కామన్ వెల్త్ లో సభ్యుడిగా కొనసాగాలనీ ప్రయత్నించాడు. ఇండియన్ యూనియన్ తో నిర్యుధ్ధ సంధి (Standstill Agreement) కూడా చేసుకున్నాడు. స్వాతంత్రానంతరం కూడా భారత వైశ్రాయిగా కొనసాగిన లార్డ్ మౌంట్ బాటెన్ కొలువులో నిజాం రాయబారి లాయక్ అలీ, భారత రాయబారి కేయం మున్షీ  నెలల తరబడి  త్రైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, విదేశీ వ్యవహారాలుతప్ప మిగిలిన స్వర్వ హక్కులతో భారత దేశంలో నిజాం స్వతంత్ర  (Autonomous Dominion Nation) దేశంగా  వుండడానికి ఇండియన్ యూనియన్ అంగీకరించింది. అయితే ఆ ప్రతిపాదనను కూడా నిజాం తిరస్కరించాడు. చివరిదశలో పాకిస్తాన్ నుండి రక్షణ పరికరాలు కొనాలనుకున్నాడుగానీ ఆ దేశంలో విలీనం కావాలని అనుకోలేదు.

త్రైపాక్షిక చర్చలు  విఫలం అయ్యాక అంతిమంగా, నిజాంపై 1948 సెప్టెంబరు నెలలో జరిపిన ఆపరేషన్ పోలో యుధ్ధంలో ఇండియన్ యూనియన్ గెలిచింది.  బ్రిటీష్ పరోక్ష పాలనలో వున్న కారణంగా 1947లో స్వతంత్రం వచ్చేవరకు  నిజాంకు స్వంతంగా స్థాయీ సైన్యాన్ని సమకూర్చుకునే అవకాశంలేదు. స్వతంత్రం వచ్చాక కేవలం ఏడాది కాలంలో భారీగా స్థాయీ సైన్యాన్ని  సమకూర్చుకోవడం సాధ్యం కానూలేదు. నిజాంలో వున్నదల్లా రజాకార్లు అనే  ఒక అల్లరిమూక. ఆ యుధ్ధంలో నిజాం ఓటమి అనివార్యం. 

చరిత్రలో విడిపోయింది కలవకూడదనీ, కలిసింది విడిపోకూడదనీ నియమం ఏమీలేదు. వాటిని అసాధ్యము అనడానికీ లేదు. కలిసిన ఆంధ్రా, తెలంగాణ విడిపోవడాన్ని కళ్లముందు చూస్తున్నాము. వాటిని మళ్ళీ కలుపుతామంటున్నవాళ్ళూ వున్నారు.

ఉషా యస్ డానీ
9010757776


Sunday, 20 July 2014

Development and Destruction


Development and Destruction

వికాసం!  వినాశనం!
డానీ

బియాస్ ప్రమాదం జరిగిన వారంలోపే కోనసీమలో గెయిల్ పైప్ లైన్ పేలింది. మరో వారం తిరక్క ముందే చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిపోయింది. ఇలా వరుస ప్రమాదాలు జరిగినపుడు నిజానికి విషాదం పెరగాలి. కానీ అలా జరగడంలేదు.  విషాదాన్ని మరో విషాదం ఓదారుస్తున్నదో లేకుంటే మన మనసులు మొద్దు బారిపోతున్నాయోగానీ విషాదం బాధ మనకు అంతగా తెలియడంలేదు.  అందుకు మీడియా కూడా తన చేతనైనంత చేస్తున్నది. మొదటి రోజు పతాక శీర్షికగావున్న నగరం పైప్ లైన్ పేలుడు సంఘటనను మరునాడు లోపలి పేజిల్లోకి పంపించివేసింది. పాఠకులకో ప్రేక్షకులకో విషాదాన్ని ప్రతిరోజూ గుర్తుచేయడం తగదని మీడియా సంస్థలు అనుకునివుంటే అదో పధ్ధతి. కానీ, కార్పొరేట్ సంస్థల నేరాల్ని దాచడానికి కూడా మీడియా ఆ పని చేసివుంటే మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన సంక్షోభం అనుకోవాల్సి వుంటుంది.  

రెండు వారాల వ్యవధిలో జరిగిన మూడు  సంఘటనలు తుఫానో, సునామో, భూకంపమోవంటి ప్రకృతి వైపరీత్యాలుకావు. మానవ తప్పిదాలతో కూడిన ప్రమాదాలు. కార్పొరేట్ సంస్థలు చేసే నేరాలని ప్రకృతి వైపరీత్యాలుగా చూపేందుకు ప్రణాళికబధ్ధ ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టు తరచూ సందేహం కలుగుతుంది. ఇటీవల ఇలాంటి అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

గ్యాస్‌ పైపులైన్ విస్ఫోటన జరగ్గానే గెయిల్ సంస్థ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు నిప్పులు చెరిగారు. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యాలయాల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడి ధర్నా నిర్వహించారు. సరిహద్దు భద్రతా దళాల్ని కూడా లెక్కచేయకుండా గెయిల్ సిబ్బందిపై రాళ్లు విసిరారు.  ఉద్యోగులకు చెందిన కార్లు, మోటారుసైకిళ్లను ధ్వంసం చేశారు. ఆవేశం కట్టలు తెంచుకున్న ఆందోళనకారుల్ని  స్థానికులే శాంతింపచేశారు. వాళ్ళా పని చేసింది గెయిల్, ఓఎన్ జీసీ సంస్థల్ని పరిరక్షించాలనికాదు. ఆందోళన అదుపుతప్పి మరిన్ని పైపులైన్లు పేలితే భారతదేశ చిత్రపటం మీద కోనసీమ అనేదే వుండదనే భయంతో. ఇప్పుడు కోనసీమలో అడుగడుగునా ల్యాండ్ మైన్స్ వున్నాయంటే అతిశయోక్తికాదు. వాటిని పెట్టింది తీవ్రవాదులూ, ఉగ్రవాదులూ కాదు. గెయిల్, ఓఎన్ జీసీ, రిలయన్స్, గుజరాత్ పెట్రో కెమికల్స్ వంటి సంస్థలు.

కోనసీమలో ప్రజాందోళన రగులుతున్నదని భావించిన గెయిల్  జీఎం స్థాయి అధికారులు పంకజ్పటేల్, రాకేష్ ప్రసాద్లను సస్పెండ్ చేసింది. పాతిక మందిని సజీవదహనం చేసిన సంఘటనకు బాధ్యులైనవారిపై హత్యానేరం మోపాల్సివుండగా  కేవలం సస్పెండు చేయడం ఒక బూటకపు చర్య మాత్రమే అవుతుంది.  ఏదో  లెఖ్ఖగట్టి బాధితుల కుటుంబాలకు  నష్టపరిహారాన్ని అందజేసిన తరువాత, ప్రజల ఆందోళన శాంతించిన తరువాత, మీడియా కూడా పట్టించుకోవడం మానేసిన తరువాతా ఆ అధికారుల మీద సస్పెండును తొలగించేస్తారు.  ఇది అన్ని చోట్లా జరిగేదే. ఇక్కడా జరుగుతుంది.

ప్రజాందోళనకు భయపడి గెయిల్ సంస్థ ఇద్దరు వున్నతాధికారుల్ని సస్పెండ్ చేసిందిగానీ, ఈ సంఘటనని పరిశోధిస్తున్న పోలీసులు మాత్రం గ్యాస్ పైపులైన్ల పేలుడుnను ఇప్పటికీ నేరంగా భావించడంలేదు. దేనినైనా నేరంగా పరిగణించాలంటే ముందు మెన్స్ రియా  (mɛnz reia) నిర్ధారణ కావాలన్నారు అమలాపురం డీయస్పీ వీరారెడ్డి. ఈ లాటిన్ పదానికి అర్ధం నేరం చేయాలనే ఆలోచన. గెయిల్ గ్యాస్ పైపు లైన్ల పేలుడు సంఘటన దర్యాప్తులో  వారు చాలా బిజీగా వున్నారు. అంత తీరిక లేని సమయంలోనూ నాలుగు రోజుల క్రితం నా ఫోన్ కు స్పందించారు.  మీ సబ్ డివిజన్ లో గత ఇరవై యేళ్ళలో జరిగిన పెద్ద నేర సంఘటన ఏమిటీ? అని అడిగినప్పుడు 1996 నవంబరులో కాట్రేనికోన / భైరవపాలెంలో వచ్చిన తుఫాను పెద్ద సంఘటన అన్నారు. తమ డివిజన్ లో పెద్ద నేర సంఘటన గురించి అడిగినపుడు మాత్రం రికార్డులు చూసి చెప్పాలన్నారు. దానికి తనకు కొంత వ్యవధి కావాలన్నారు. పైపులైన్ల పేలుడు మాత్రం నేర సంఘటన కాదన్నది వారి నిశ్చితాభిప్రాయం.

మానవవికాసం కోసం సహజవనరుల్ని వినియోగం లోనికి తేవడానికి చేసే ప్రయత్నంలో కొన్ని ప్రమాదాలు సహజంగానో, అనివార్యంగానో సంభవిస్తాయనే అభిప్రాయం మనలో చాలా మందికి వుంది. వికాసం కోసం కొంత వినాశనాన్ని భరించకతప్పదనే వేదాంతం ఇందులో ఇమిడి వుంది. ఈ వేదాంతాన్ని మన మెదళ్లలో ఎవరు ఎప్పుడు నాటారనే ప్రశ్నని కాస్సేపు పక్కన పెట్టినా, ఈ వాదనలోనే రెండు తప్పులున్నాయి. ప్రమాద నివారణ కోసం ప్రామాణిక చర్యల్ని పాటించకపోవడం నేరం ఎందుకు కాదు అనేది మొదటి ప్రశ్న అయితే, ఈ ప్రాజెక్టులన్నీ ఎవరి వికాసం కోసం చేపడుతున్నారూ? అవి ఎవరి వినాశనానికి దారి తీస్తున్నాయి అనేది అంతకన్నా ప్రాణప్రదమైన ప్రశ్న.

పశ్చిమాసియా దేశాల్లో బయటపడిన చమురు నిక్షేపాలు వాళ్ల వినాశనానికీ, అమెరికా, యూరప్ దేశాల వికాసానికీ దారితీస్తున్నాయని ఇరాక్ యుధ్ధాని చూసినవాళ్ళకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కోనసీమలో జరుగుతున్నదీ అదే. కృష్ణా-గోదావరి బేసిన్ లో బయటపడిన చమురు, సహజవాయువు నిక్షేపాలు  కార్పొరేట్ సంస్థలకు భారీ లాభాలను సమకూర్చి పెడుతూ వుంటే వుండవచ్చు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కోనసీమ ప్రజలు నిప్పుల కుంపటి మీద నివాసం ఎందుకు చేయాలీ? ఈ ప్రశ్నకు జవాబు దొరకనంత వరకూ కోనసీమలో మంటలు చెలరేగుతూనే వుంటాయి. అవి పైపులైన్లు పేలిన మంటలు కావచ్చు, బ్లో ఔట్ మంటలు కావచ్చు, చమురు కంపెనీల మీద ప్రజల్లో చెలరేగే ఆగ్రహ జ్వాలలు కావచ్చు.

(రవయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

హైదరాబాద్
3 జులై 2014

ఒక్క రోజు కూడా రాయడం మానను.


Danny  Notes
20  July 2014

ఒక్క రోజు కూడా రాయడం మానను.

వృత్తి రీత్యా నేను పాత్రికేయుడ్ని. వృత్తిలో భాగంగా వారానికి ఆరు రోజులు ఒక్క నాగా కూడా లేకుండా  ప్రతి రోజూ వెయ్యి పదాలు (ఆరు వేల క్యారెక్టర్లు) రాస్తాను. దీనికి నాకు పదానికి దాదాపు రెండు రూపాయల చొప్పున వేతనం/కూలి వస్తుంది. అయితే, వృత్తిలో భాగంగా రాసిన రచనల గురించి, వృత్తిపరమైన వేదికల మీద తప్ప ఇతర వేదికల మీద ఎన్నడూ మాట్లాడను. “వృత్తి పరంగా రాసిన రచనల్లో సంస్థాగత ధర్మం ఎక్కువ; వ్యక్తిగత దృక్పథం తక్కువ.” అని కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించాను. నా వృత్తి రచనలకు కొన్ని ఘనమైన సంస్థలు ప్రకటించిన అవార్డుల్ని సహితం నేను వెళ్ళి అందుకోలేదు. వేదికల మీద దండలు వేయించుకోవడం, శాలువలు కప్పుకోవడం నాకు కొంచెం బిడియంగా వుంటుంది.

వృత్తిలో భాగంగా రాసే రచనలు నాలోని రచయిత - సమాజ కార్యకర్తకు చాలా వరకు సంతృప్తినివ్వవు. ఆ లోటును పూరించడానికి నేను ప్రతిరోజూ నా అభిరుచి మేరకు  రెండు గంటలు పుస్తకాలు చదవడానికి, డాక్యుమెంటరిలు / సినిమాలు చూడడానికి, సమాజ-సాహిత్య ఉపన్యాసాలు వినడానికి, వివిధ ఆందోళనకారుల్ని కలవడానికి, విభిన్న ఆలోచనాపరులతో సంభాషించడానికి వెచ్చిస్తాను. ఇంకో రెండు గంటలు రాయడానికో, ఉపన్యసించడానికో వెచ్చిస్తాను. వృత్తియేతర రచనల్నీ విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్ళడానికి అనేక వేదికల్ని వాడుకుంటాను. వాటిల్లో ఫేస్ బుక్ ఒకటి.

అభిరుచికి వృత్తితో ఘర్షణ వస్తే ఏం చేయాలి? అన్నది నాలాంటి రచయితలకు, సమాజ కార్యకర్తలకు తరచుగా ఎదురయ్యే సందేహం. అలాంటి సందర్భం వచినప్పుడెల్లా నేను ఉద్యోగాన్ని మానివేస్తూ వచ్చాను. అలా నాకు చెల్లింది.  అలాంటి సందర్భాల్లో కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా నాకు నైతిక మద్దతు ఇచ్చే మహత్తర సమూహం ఒకటి అన్ని సందర్భాల్లోనూ నాకు వరంగా వుండింది.

ఈ వివరణ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సివచ్చిందనేది ఒక ప్రశ్న. నా రచనల గురించి నా యాజమాన్యాన్ని వేడుకునే అమాయకులు కూడా ఇప్పుడు ఫేస్ బుక్కులో వచ్చారు. వీరికి నేను  ఘాటుగానూ సమాధానం ఇవ్వొచ్చు గానీ వద్దనుకున్నాను. చాలా మందికి తెలియని విషయం ఏమంటే జర్నలిజం నా చివరి వృత్తి. సైకిల్ మెకానిజం మొదలుకుని, ఆయిల్ ట్యాంకర్ల ఫ్యాబ్రికేషన్ వరకు, కుట్టు పని నుండి యంత్రపరికరాలు తయారు చేయడం వరకు, తత్వశాస్త్రం పాఠాలు చెప్పడం దగ్గర నుండి సెఫాలజీ వరకు  నేను చేయని వృత్తిలేదు. ఒకటి రెండు సందర్భాల్లోతప్ప నేను చేసిన పాత్రికేయ ఉద్యోగాలన్నీ ఇంట్లోవున్నవాడ్ని పిలిచి ఇచ్చినవే. కుదిరినన్నాళ్ళు పాత్రికేయ ఉద్యోగం చేస్తా. లేకపోతే మావాళ్ళ కులవృత్తులు చాలా వున్నాయి.  కానీ, నా అభిరుచి మేరకు రాయడం మాత్రం ఒక్క రోజు కూడా మానను. ఇది నా వాగ్దానం!

Monday, 14 July 2014

Solidarity to SKU Baba



అస్తిత్వవాదంలో అస్థిత్వవాదం.
(స్కైబాబాకు సంఘీభావం)

స్కైబాబా ఉద్యోగానికి రాజీనామా చేశాడని రాత్రి తెలిసింది. రచయితగా, పాత్రికేయునిగా  మరీ ముఖ్యంగా ఉద్యమకారునిగా  షేక్ యూసుఫ్ బాబా సున్నిత మనస్కుడు. అతనంటే నాకు యిష్టమైన కారణాల్లో అదే కీలకమైనది. సున్నిత మనస్కులు కొలువులు చేయలేరు. వర్తమాన పాత్రికేయ కొలువు అసలు చేయలేరు. తమకంటూ ఒక ప్రాపంచిక దృక్పధం వున్నవాళ్లకు  ఆ కొలువు మరీ నరకంగా వుంటుంది. 

ఒక విధంగా మా యిద్దరిదీ లవ్ అండ్ హేట్ అనుబంధం.  మేమిద్దరం  ప్రగాఢంగా అభిమానించుకున్న సందర్భాలూ వున్నాయి. భీకరంగా ఘర్షించుకున్న సందర్భాలున్నాయి. స్కై మీద నా అసంతృప్తి చిన్నది. అభిమానం చాలా పెద్దది. బహుశ అతనూ నా విషయంలో అలాగే ఆలోచిస్తాడు అనుకుంటాను. 

అనేకానేక వృత్తుల్లో పాత్రికేయ వృత్తి ఒకటి. అనేకానేక వ్యాపారాల్లో మీడియా వ్యాపారం ఒకటి. వర్తమాన కాలంలో పాత్రికేయ వృత్తికిగానీ, మీడియా వ్యాపారానికిగానీ ప్రత్యేకమైన గౌరవం వుందనో, వుంటుందనో  అనుకోవాల్సిన పనిలేదు. "గతంలో ప్రజల భక్తి గౌరవాలకు పాత్రమైన వృత్తులన్నింటినీ బూర్జువావర్గం నీచ స్థాయికి తీసుకువచ్చేసింది. వైద్యులను, న్యాయవాదులను, కవులను, శాస్త్రవేత్తలను అది తన కింద కూలీకి పనిచేసే నౌకర్లుగా మార్చివేసింది" అని కార్ల్ మార్క్స్ శతాబ్దంన్నర క్రితమే అన్నాడు. ఈ ముక్కను కూడా ఆయన ఏదో ఒక మూల అనకుండా ఏకంగా కమ్యూనిస్టు పార్టి ప్రణాళిక తొలి అధ్యాయంలోనే అన్నాడు. మార్క్స్ కాలం నాటి బూర్జువావర్గంకన్నా క్రూరమైనది, నీచమైనది కార్పొరేట్ రంగం. అంచేత వర్తమాన  మీడియా రంగంలో పనిచేసే వాళ్ళని సాంప్రదాయ అర్ధంలో గౌరవనీయుమైన పాత్రకేయులు అనలేం. వాళ్ళు మీడియా సంస్థల నౌకర్లు మాత్రమే. స్వఛ్ఛంద (ఫ్రీలాన్సింగ్)  పాత్రికేయులు మాత్రమే దీనికి మినహాయింపు కావచ్చు.   

ప్రతి వ్యక్తికీ తనదంటూ ఒక ప్రాపంచిక దృక్పధం వుంటుంది. దాన్నే అతను అన్నిచోట్లా ఆచరిస్తాడు. వీలు కుదిరినప్పుడు వృత్తినీ దానికి వాడుకుంటాడు. ఆ పని పోలీసుగానూ చేయవచ్చు, పాత్రికేయునిగానూ చేయవచ్చు. ఈ విషయంలో తెలంగాణ పాత్రికేయులు చాలా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారు. దాని అర్ధం రాయలసీమ - తీరాంధ్ర పాత్రికేయులు తమ సామాజిక కర్తవ్యాన్ని అసలు నిర్వర్తించడంలేదనికాదు. సీమాంధ్రలో అది వ్యక్తుల స్థాయిలో వుంటే, తెలంగాణలో సంస్థాగత స్థాయిలో కొనసాగుతోంది. 

అన్నిరంగాలలోనూ సాగుతున్నట్టే మీడియాలోనూ నౌకరీకరణ అనేది సామాజిక సమీకరణల పునాది మీద అనేక దశల్లో అనేక విధాలుగా సాగుతోంది. రాజకీయం, కులం, వర్గం, గ్రూపు, బంధుత్వం, ప్రాంతం తదితర పక్షపాతాలు దేనికీ మీడియా అతీతం కాదు. ఇప్పుడు మీడియాలో మతం దశ కూడా మొదలయింది. ఇలాంటి సందర్భాల్లో సహజంగానే స్కైబాబా వంటివాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. ప్రపంచంలోవున్న జబ్బులన్నీ ముందు మీడియాను సోకుతున్నాయి. తెలుగు మీడియాను కాపాడాలంటే చాలా చాలా వ్యాక్సీన్లు కావాలి.

తెలంగాణలోనూ స్కైబాబాది ప్రత్యేకమైన సమస్య. తెలంగాణలో ఇతరులకు  తెలంగాణ రాష్ట్రం సాకరమైతే లక్ష్యం నెరవేరినట్టే. సైబాబాకు ముస్లిం సమాజపు భద్రత, సంక్షేమం కూడా కావాలి. అతనిది అస్తిత్వవాదంలో అస్థిత్వవాదం. సరిగ్గా అక్కడే అతన్ని ఒంటరివాడ్ని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.  ముస్లింలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్లకు తూట్లు పోడవాలంటే ముందు ముస్లిం ఆలోచనాపరుల్ని రంగం నుండి తప్పించాలిగా!  ఇలాంటి ప్రమాదం ఒకటి రాబోతున్నదని స్కైబాబాను మరీ ముందుగా  హెచ్చరించి  భంగపడ్డవాళ్ళలో నేనూ ఒకడ్ని.

చరిత్ర పునరావృతమవుతోందేతప్ప ఇదేమీ కొత్తదికాదు. అలనాటి తెలంగాణ సాయుధపోరాటంలో తొలి అమరుడు బందగీ. చివరి అమరుడు షోయబుల్లా ఖాన్. ఇద్దరూ ముస్లింలే. నిజాం సంస్థానంపై  పోలీస్ యాక్షన్  కు తక్షణ ప్రేరణ  షోయబుల్లా ఖాన్ దారుణ హత్య. ఆ సంఘటన తరువాతే  సర్దార్ పటేల్  నిజాంపై సైనిక చర్యకు నెహ్రును ఒప్పించగలిగాడు. పోలీస్ యాక్షన్ ఫలితాలేమిటీ? బందగీ, షోయబుల్లా ఖాన్ సామాజికవర్గానికి చెందినవాళ్ళు  వేలాదికాదు లక్షలాది మంది  హతమైపోయారు. నిజాం సర్ఫేఖాస్ ఆస్తులు మొదలుకుని  వక్ఫ్ భూములు, ముస్లింల వ్యక్తిగత సంపద వరకు అంతా పరాధీనమైపోయింది. చివరకు వాళ్ళు తమ భాషనూ, సంస్కృతినీ కోల్పోవాల్సి వచ్చింది. చరిత్ర అనుభవాల్ని  తిరగేసి చూస్తే  ముస్లింల సంపద కోసమే నిజాం సంస్థానంపై సైనికచర్య, ఇండియన్ యూనియన్ లో విలీనం, ఆంధ్రా ప్రాంతంతో కలపడం వగయిరాలు జరిగాయని అనుకోవడం అసమంజసం ఏమీకాదు.  

వర్తమాన తెలంగాణ ఉద్యమ భౌధ్ధిక విభాగపు నిర్ణేతలుగా వున్నవాళ్ళలో అత్యధికులు కమ్యూనిస్టులు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి వాళ్ళిప్పుడు తొలి మజిలీ చేరుకున్నారు. వాళ్ల మలి మజిలి సామాజిక తెలంగాణ కావాలి. అలా జరక్కపోతే, ఉద్యమంలోని ఉపస్రవంతులు చాలా క్రూరంగా అణగారిపోతాయి. 

తెలంగాణాలో సంఘ్ పరివార్ శక్తులు నేరుగా అధికారంలో లేకపోవచ్చు. కానీ, ఆ శక్తులే  నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో అధికారాన్ని చేపట్టాయి. మోదీ అంటే రెండు పార్శ్వాలు. ఇందులో చాలామందికి నచ్చుతున్నట్టు కనిపిస్తున్నది కార్పొరేట్ రంగ అభివృధ్ధి. చాలామంది తెలియనట్టు నటిస్తున్నది హిందూమతతత్వం. కార్పొరేట్ రంగ అభివృధ్ధి అన్న భూతం ఇప్పుటికే అన్ని పార్టీలనీ ఆవహించేసింది.   దానికి బీజేపి, టిడిపి, వైయస్సార్ సిపి,  టిఆర్ ఎస్ అనే తేడాలు ఏమీలేవు. ఆ మేరకు వాళ్ళలో ఇప్పుటికే సగమో, పావో మోడి అంశ వుంది. వాళ్ళను మిగిలిన సగం ఆవహించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఈ పరిణామాల బాధితుల్లో అనేకానేక సామాజికవర్గాలు వుంటాయి. వాటిల్లో అత్యధిక అణిచివేతకు గురయ్యేవాళ్ళు ముస్లిం, క్రైస్తవ సామాజికవర్గాలు. వాళ్ళు ముందు కొలువులు కోల్పోతారు. ఆ తరువాత కుటుంబాలను కోల్పోతారు. ఎందుకంటే, కొలువులేనివాడు నిరాస్తిపరుడు అయిపోతాడు. నిరాస్తిపరుడికి బంధుమిత్రులే కాదు పెళ్ళాం పిల్లలు కూడా దూరం అయిపోతారు.

కొందరు ప్రఖ్యాతులకే తప్ప మిగిలినవాళ్లకు స్వతంత్ర (ఫ్రీలాన్సింగ్) పాత్రికేయ వృత్తి ఆర్ధికంగా సాగుబాటు అయ్యేదికాదు.  తెలుగు మీడియాలో అయితే పరిస్థితి మరీ దయనీయంగా వుంది. ఒకటి, రెండు సంస్థలు తప్ప ఎడిట్ పేజీ వ్యాసాలకు కూడా ఎవరూ డబ్బులు ఇవ్వడంలేదు. కాలమ్స్ రాస్తే కొంత సొమ్ము ఇస్తున్నారుగానీ అది సాదరు ఖర్చులకు సరిపోతుంది. డాక్యుమెంటరీలు తీయడం అనేది ఖర్చు ఖాతాయేతప్ప ఆదాయ వనరుకాదు. వెబ్ సైటుగానీ, పుస్తకాల ప్రచురణ సంస్థగానీ పెట్టుబడీతో కూడిన వ్యవహారాలు. పైగా వాటి ఫలాలు అందుకోవడానికి స్థిరంగా కొంతకాలం వేచివుండాలి. . 

రానున్న సంక్షోభానికి స్కైబాబా ఉదంతం తొలి సంకేతం మాత్రమే. ఆయన మీద  ఫలానా మీడియా సంస్థకు వ్యతిరేకి అనిమాత్రమేగాక సామాన్యప్రజలకు, తెలంగాణకు సహితం వ్యతిరేకి అనే ముద్ర వేసి నైతిక సంక్షోభంలో పడేసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అయితే, స్కైబాబాకు నైతిక మద్దతు ఇచ్చేవాళ్ళు  పెద్ద సంఖ్యలో వున్నారు. అదే ఆయనకు అత్మస్థైర్యాన్నివ్వాలి.  

- డానీ
హైదరాబాద్
13 జులై 2014

Wednesday, 2 July 2014

Pinning Hopes On God of Rain

వరుణుడే దిక్కు!!!
డానీ

కారణాలు ఏమైనాగానీ వ్యవసాయంతో చంద్రబాబుకు జత కుదరడంలేదు. వ్యవసాయం దండగ అని అప్పట్లో వారు నోరారా అన్నా, అనకపోయినా వారి తొలి విడత పాలన మలి సంవత్సరాల్లో రాష్ట్రంలోని  రైతులంతా వ్యవసాయం దండగ అనే భావించేవారు. కొందరు గుదిబండ అనుకునేవారు. బతకడమే కష్టం అనుకున్న రైతులూ వున్నారు.  రైతు నాయకునిగా పేరున్న వడ్డే శోభనాద్రీశ్వర రావు ఆ కాలంలో వ్యవసాయ శాఖా మంత్రిగా వున్నారు. వారు  తరచుగా పంటలకు శెలవులు ప్రకటిస్తూ వుండేవారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ విఛ్ఛిన్నం అయిన దశ అది. కాలువ వ్యసాయానికి పుట్టినిల్లు అయిన కృష్ణా-గోదావరి మండలంలోని  సంగం మండలాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించిన రోజులవి. రైతుల ఆత్మహత్యలు ఒక పరంపరగా సాగినకాలం అది.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయిక రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాలీన రెండు కోట్ల టన్నులకు పైగా ఆహారోత్పత్తి జరిగేది. ఇప్పుడు విడిపోయినా రెండు రాష్ట్రాలు సంయుక్తంగా పాత లక్ష్యాల్ని అధిగమిస్తాయనే ఆశిద్దాం. అన్నపూర్ణ, దక్షణాది ధాన్యాగారం, రైస్ బౌల్ వంటి బిరుదుల్ని సంతరించుకున్న రాష్ట్రంలో   ప్రజలందరి జీవితాలు సహజంగానే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంతో ముడిపడి వుంటాయి. అంచేత, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాజీవితాల్లోనుంచి, రాజకీయాల్లోంచీ  వ్యవసాయ రంగాన్ని విడదీయడం సాధ్యంకాదు.

కొత్త శతాబ్దంలో రాష్ట్ర రాజకీయాలని శాసించిన, శాసిస్తున్న వైయస్ రాజశేఖర రెడ్డి,  కే. చంద్రశేఖర రావు, చంద్రబాబునాయుడు, ముగ్గురికీ వ్యవసాయంతో ప్రత్యేక అనుబంధం కూడా వుంది. వైయస్ కు ఇడుపులపాయ ఎస్టేట్ తోనూ, కేసిఆర్ కు పామ్ హౌస్ తోనూ వున్న అనుబంధం గురించి తెలియనివాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు. అయితే చంద్రబాబుకు కుప్పం ప్రాజెక్టుతో వున్న అనుబంధమే ఇప్పుడు అంతగా చర్చల్లో లేదు. 

ఆహారోత్పత్తి పరిమాణంలో కొన్ని గొప్పలున్నప్పటికీ దిగుబడి ప్రమాణాల్లో మన వ్యవసాయం గొప్పదేమీకాదు. ధాన్యం దిగుబడి ప్రపంచ సగటు హెక్టారుకు 4, 112 కేజీలు వుంటే, మన దేశంలో అది 3, 124 కేజీలు మాత్రమే వుంది. ఈజిప్టు వంటి కొన్ని దేశాల్లో ధాన్యం దిగుబడి 10  వేల కేజీలకు పైనే వుంది.  మన దేశంలో దిగుబడి తక్కువగా వుండడానికి ఆర్ధిక, సాంకేతిక కారణాలతోపాటూ కులం, మతం వంటి సాంఘీక కారణాలు కూడా అనేకం వున్నాయి.

దిగుబడి తక్కువగా వున్నప్పుడు రైతుకు వ్యవసాయం లాభసాటిగా వుండదు. లాభసాటిగా లేనప్పుడు వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోతుంది. అలా ఆసక్తి తగ్గిపోతే దిగుబడి మరింతగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని అధిగ మించడానికి ఒక సమగ్ర విధానం వుండాలి. ప్రభుత్వాలకు అంత ఓపిక వుండదు; ఎన్నికల సమయంలో కొన్ని రాయితీలు ప్రకటించడంతప్పా. ఆ రాయితీలు కూడా వ్యవసాయరంగాన్ని ఉధ్ధరించడానికికాదు; గ్రామీణ ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రమే! రాజకీయ ప్రయోజనమే ప్రధానం అయిపోయినపుడు సమస్య నిరంతరం కొనసాగుతూనే వుంటుంది.


1999 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకున్నాక చంద్రబాబు రాజకీయాల్లో అప్రతిహతంగా కనిపించారు. ముఖ్యమంత్రిగా ఆయన జ్యోతిబసు రికార్డును బద్దలు గొడతారని తెలుగు తమ్ముళ్ళేకాదూ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు, అతిరథమహారథులైన కాంగ్రెస్  నాయకులు కూడా భావించేవారు. అప్పట్లో చంద్రబాబు విజన్ కూడా 2020 కు తగ్గేదికాదు.

అంతకు ముందు ఎన్నికల్లో భంగపాటుకు గురైన వైయస్ దాదాపు నాలుగేళ్ళు చంద్రబాబు బలహీనఅంశాన్ని కనిపెట్టడానికి తీవ్ర అన్వేషణ సాగించారు.  వ్యవసాయం చంద్రబాబు బలహీన అంశం అనే విషయం 2003 నాటి పాదయాత్రలో వైయస్  కు అర్ధం అయింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అనే మరఫిరంగులతో ఆయన 2004లో అబేధ్యమైన చంద్రబాబు కోటను కూలగొట్టారు. అధికారానికి రాగానే ఎన్నికల వాగ్దానం ప్రకారం వ్యవసాయానికి  ఉచిత విద్యుత్తు ఫైలుపై వైయస్ తొలి సంతకం పెట్టారు. అదనంగా అప్పటికున్న విద్యుత్ బకాయిల్ని కూడా రద్దు చేశారు.

చంద్రబాబు సంక్షేమ పథకాలకు వ్యతిరేకి అనే అభిప్రాయాన్ని వైయస్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు.  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల మనసుల్ని దోచుకున్నారు. జలయజ్ఞం, ప్రత్యేక ఆర్ధికమండళ్ళు తదితర వ్యవహారాల్లో వైయస్ ప్రభుత్వం ఎదుర్కొన్నన్ని  ఆరోపణల్ని మరెవరూ ఎదుర్కొని వుండరు.  అయినప్పటికీ, దిగువశ్రేణుల్లో వైయస్ మీద అభిమానమే  వుండేది. వైయస్ ను చూసి సంక్షేమ పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల చివరి ఘట్టంలో రుణ మాఫీని ప్రకటించి తనకు చాలా కాలంగా దూరంగా వుంటున్న రైతుల ఓట్లను కూడా కొల్లగొట్టగలిగారు.

ఎన్నికల్లో రైతుల ప్రాధాన్యతను వైయస్ నుండి చంద్రబాబు నేర్చుకున్నట్టు ఆయన కుమారుడు జగన్ నేర్చుకోలేదు. పైగా, చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానన్నప్పుడు జగన్ ఎద్దేవ చేశారు. వ్యవసాయ ప్రధానమైన కృష్ణా- గోదావరి జిల్లాల్లో జగన్ కు ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. తన తండ్రి గెలిచిన చోట జగన్ ఓడిపోయారు.  

అయితే, రైతుల ఓట్లతో గెలిచిన చంద్రబాబు తొలి సంతకంతో రైతుల రుణాల్ని మాఫీ చేయలేదు. రుణమాఫీ ఎలా చేయాలో చెప్పడానికి కోటయ్య కమిటీ వేశారు. మూడు వారాల తరువాత కూడా ఆ కోటయ్య కమిటీ నివేదిక బయటికి రాలేదు. ఇలా తొలి సంతకం దగ్గరే చంద్రబాబు నిరాశ కలిగించారు.

ఎందువల్లనోగానీ, చంద్రబాబుకూ వర్షానికి కూడా సఖ్యత లేనట్టుగా వుంది. గడువు దాటుతున్నా నైరుతిరుతుపవనాలు వస్తున్న జాడ కనిపించడంలేదు. ఖరీఫ్ (సార్వ) నారుమళ్ళు జూన్ మొదటి వారంలోనే పడాలి. నాట్లు జులై మొదటివారంలో మొదలవ్వాలి. ఈలోపులో రైతుల చేతుల్లో బ్యాంకులు పంటరుణాలు ఇవ్వాలి. కొత్త రుణాల సంగతెలావున్నా పాతరుణాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని రైతులకు  బ్యాంకులు తాఖీదులు పంపిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నర్సరావుపేట శాఖలో మొదలయిన ఈ వేలం వ్యవహారం చాలా వేగంగా రాష్ట్రమంతటా పాకదన్న హామీ ఏమీలేదు.  

 పై రాష్ట్రాలతో దౌత్య సంబంధాలు నెరపి సాగునీరు సాధించాల్సిన చంద్రబాబు మంత్రివర్గం మరీ పైకి చూస్తోంది! ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురవడం కోసం ప్రధాన శివాలయాల్లో వరుణజపం, విరాట్‌పర్వ పారాయణం, సహస్ర ఘటాభిషేకం పూజలను నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు.  ఈ మాట ముందే తెలిస్తే వీళ్ళు దేనికీ?; ఆ వరుణుడ్నే ఎన్నుకునే పని!

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
27 జూన్  2014
http://www.andhraprabha.com/columns/a-column-by-danny/19226.html