Development and Destruction
వికాసం! వినాశనం!
డానీ
బియాస్
ప్రమాదం జరిగిన వారంలోపే కోనసీమలో గెయిల్ పైప్ లైన్ పేలింది. మరో వారం తిరక్క
ముందే చెన్నైలో పదకొండు అంతస్తుల భవనం కూలిపోయింది. ఇలా వరుస ప్రమాదాలు జరిగినపుడు
నిజానికి విషాదం పెరగాలి. కానీ అలా జరగడంలేదు.
విషాదాన్ని మరో విషాదం ఓదారుస్తున్నదో లేకుంటే మన మనసులు మొద్దు
బారిపోతున్నాయోగానీ విషాదం బాధ మనకు అంతగా తెలియడంలేదు. అందుకు మీడియా కూడా తన చేతనైనంత చేస్తున్నది. మొదటి
రోజు పతాక శీర్షికగావున్న నగరం పైప్ లైన్ పేలుడు సంఘటనను మరునాడు లోపలి పేజిల్లోకి
పంపించివేసింది. పాఠకులకో ప్రేక్షకులకో విషాదాన్ని ప్రతిరోజూ గుర్తుచేయడం తగదని మీడియా
సంస్థలు అనుకునివుంటే అదో పధ్ధతి. కానీ, కార్పొరేట్ సంస్థల నేరాల్ని దాచడానికి
కూడా మీడియా ఆ పని చేసివుంటే మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన సంక్షోభం అనుకోవాల్సి
వుంటుంది.
రెండు
వారాల వ్యవధిలో జరిగిన మూడు సంఘటనలు
తుఫానో, సునామో, భూకంపమోవంటి ప్రకృతి వైపరీత్యాలుకావు. మానవ తప్పిదాలతో కూడిన
ప్రమాదాలు. కార్పొరేట్ సంస్థలు చేసే నేరాలని ప్రకృతి వైపరీత్యాలుగా చూపేందుకు ప్రణాళికబధ్ధ
ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టు తరచూ సందేహం కలుగుతుంది. ఇటీవల ఇలాంటి అనుమానాలు
మరింత బలపడుతున్నాయి.
గ్యాస్ పైపులైన్ విస్ఫోటన జరగ్గానే గెయిల్ సంస్థ అనుసరిస్తున్న నిర్లక్ష్య
వైఖరిపై స్థానికులు నిప్పులు చెరిగారు. ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల కార్యాలయాల ముందు పెద్ద
సంఖ్యలో గుమిగూడి ధర్నా నిర్వహించారు. సరిహద్దు భద్రతా దళాల్ని కూడా లెక్కచేయకుండా
గెయిల్ సిబ్బందిపై రాళ్లు విసిరారు. ఉద్యోగులకు చెందిన కార్లు, మోటారుసైకిళ్లను
ధ్వంసం చేశారు. ఆవేశం కట్టలు తెంచుకున్న ఆందోళనకారుల్ని స్థానికులే శాంతింపచేశారు. వాళ్ళా పని చేసింది
గెయిల్, ఓఎన్ జీసీ సంస్థల్ని పరిరక్షించాలనికాదు. ఆందోళన అదుపుతప్పి మరిన్ని
పైపులైన్లు పేలితే భారతదేశ చిత్రపటం మీద కోనసీమ అనేదే వుండదనే భయంతో. ఇప్పుడు కోనసీమలో అడుగడుగునా ల్యాండ్ మైన్స్
వున్నాయంటే అతిశయోక్తికాదు. వాటిని పెట్టింది తీవ్రవాదులూ, ఉగ్రవాదులూ కాదు.
గెయిల్, ఓఎన్ జీసీ, రిలయన్స్, గుజరాత్ పెట్రో కెమికల్స్ వంటి సంస్థలు.
కోనసీమలో
ప్రజాందోళన రగులుతున్నదని భావించిన గెయిల్ జీఎం స్థాయి అధికారులు పంకజ్పటేల్, రాకేష్ ప్రసాద్లను సస్పెండ్ చేసింది. పాతిక మందిని సజీవదహనం చేసిన సంఘటనకు
బాధ్యులైనవారిపై హత్యానేరం మోపాల్సివుండగా
కేవలం సస్పెండు చేయడం ఒక బూటకపు చర్య మాత్రమే అవుతుంది. ఏదో
లెఖ్ఖగట్టి బాధితుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందజేసిన తరువాత, ప్రజల ఆందోళన
శాంతించిన తరువాత, మీడియా కూడా పట్టించుకోవడం మానేసిన తరువాతా ఆ అధికారుల మీద
సస్పెండును తొలగించేస్తారు. ఇది అన్ని
చోట్లా జరిగేదే. ఇక్కడా జరుగుతుంది.
ప్రజాందోళనకు భయపడి గెయిల్ సంస్థ ఇద్దరు వున్నతాధికారుల్ని సస్పెండ్
చేసిందిగానీ, ఈ సంఘటనని పరిశోధిస్తున్న పోలీసులు మాత్రం గ్యాస్ పైపులైన్ల పేలుడుnను ఇప్పటికీ నేరంగా భావించడంలేదు. దేనినైనా నేరంగా
పరిగణించాలంటే ముందు మెన్స్ రియా (mɛnz reia) నిర్ధారణ కావాలన్నారు అమలాపురం
డీయస్పీ వీరారెడ్డి. ఈ లాటిన్ పదానికి అర్ధం నేరం చేయాలనే ఆలోచన. గెయిల్ గ్యాస్
పైపు లైన్ల పేలుడు సంఘటన దర్యాప్తులో వారు
చాలా బిజీగా వున్నారు. అంత తీరిక లేని సమయంలోనూ నాలుగు రోజుల క్రితం నా ఫోన్ కు
స్పందించారు. “మీ సబ్
డివిజన్ లో గత ఇరవై యేళ్ళలో జరిగిన పెద్ద నేర సంఘటన ఏమిటీ?” అని
అడిగినప్పుడు 1996 నవంబరులో కాట్రేనికోన / భైరవపాలెంలో వచ్చిన తుఫాను పెద్ద
సంఘటన అన్నారు. తమ డివిజన్ లో పెద్ద నేర సంఘటన గురించి అడిగినపుడు మాత్రం రికార్డులు చూసి చెప్పాలన్నారు.
దానికి తనకు కొంత వ్యవధి కావాలన్నారు. పైపులైన్ల పేలుడు మాత్రం నేర సంఘటన కాదన్నది
వారి నిశ్చితాభిప్రాయం.
మానవవికాసం కోసం సహజవనరుల్ని వినియోగం లోనికి తేవడానికి చేసే ప్రయత్నంలో
కొన్ని ప్రమాదాలు సహజంగానో, అనివార్యంగానో సంభవిస్తాయనే అభిప్రాయం మనలో చాలా
మందికి వుంది. వికాసం కోసం కొంత వినాశనాన్ని భరించకతప్పదనే వేదాంతం ఇందులో ఇమిడి
వుంది. ఈ వేదాంతాన్ని మన మెదళ్లలో ఎవరు ఎప్పుడు నాటారనే ప్రశ్నని కాస్సేపు పక్కన
పెట్టినా, ఈ వాదనలోనే రెండు తప్పులున్నాయి. ప్రమాద నివారణ కోసం ప్రామాణిక చర్యల్ని
పాటించకపోవడం నేరం ఎందుకు కాదు అనేది మొదటి ప్రశ్న అయితే, ఈ ప్రాజెక్టులన్నీ ఎవరి
వికాసం కోసం చేపడుతున్నారూ? అవి ఎవరి వినాశనానికి దారి తీస్తున్నాయి అనేది
అంతకన్నా ప్రాణప్రదమైన ప్రశ్న.
పశ్చిమాసియా దేశాల్లో బయటపడిన చమురు నిక్షేపాలు వాళ్ల వినాశనానికీ, అమెరికా,
యూరప్ దేశాల వికాసానికీ దారితీస్తున్నాయని ఇరాక్ యుధ్ధాని చూసినవాళ్ళకు కొత్తగా
చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కోనసీమలో జరుగుతున్నదీ అదే. కృష్ణా-గోదావరి బేసిన్ లో బయటపడిన
చమురు, సహజవాయువు నిక్షేపాలు కార్పొరేట్
సంస్థలకు భారీ లాభాలను సమకూర్చి పెడుతూ వుంటే వుండవచ్చు. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం
కోనసీమ ప్రజలు నిప్పుల కుంపటి మీద నివాసం ఎందుకు చేయాలీ? ఈ ప్రశ్నకు జవాబు దొరకనంత
వరకూ కోనసీమలో మంటలు చెలరేగుతూనే వుంటాయి. అవి పైపులైన్లు పేలిన మంటలు కావచ్చు,
బ్లో ఔట్ మంటలు కావచ్చు, చమురు కంపెనీల మీద ప్రజల్లో చెలరేగే ఆగ్రహ జ్వాలలు
కావచ్చు.
(రవయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
3 జులై 2014
No comments:
Post a Comment