కూలీలకో న్యాయం ! కార్పొరేట్లకో న్యాయం !!
ఉషా యస్ డానీ
శేషాచలం అడవుల్లో 20 మంది వుడ్
కట్టర్లను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన రెండు రోజుల్లోనే ‘సత్యం కుంభకోణం’పై కోర్టు
తీర్పు వచ్చింది. మదుపుదారులకు దాదాపు పధ్నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన
ఈ కేసులో, ప్రధాన నిందితుడు బీ. రామలింగరాజుకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం
ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఆర్ధిక నేరాల
కేసులు మన శిక్షా స్మృతికున్న వర్గస్వభావానికి అద్దం పట్టాయి.
‘సత్యం’ కేసులో రామలింగరాజు 7800 కోట్ల
రూపాయల అవినీతికి పాల్పడ్డట్టు న్యాయస్థానం తేల్చింది. ఎర్రకూలీలకు పది రోజుల
కాంట్రాక్టుకు 30 వేల రూపాయలు ఇస్తారని మీడియా వార్తలు ధృవీకరిస్తున్నాయి. రెండు
ఆర్ధిక నేరాల మధ్య వత్యాసం 26 లక్షల రెట్లు. 7800 కోట్ల రూపాయల ఆర్ధిక
నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష సరైనదే అనుకుంటే ఎర్రకూలీలకు కేవలం
నిమిషమున్నరకన్నా తక్కువ (85 సెకన్ల) జైలు శిక్షను మాత్రమే వేయాలి. ఒకవేళ, 30 వేల
రూపాయల ఆర్ధిక నేరానికి మరణదండనే సరైన శిక్ష అనుకుంటే
రామలింగరాజు చేసిన ఆర్ధిక నేరానికి ఆయన మీద 26 లక్షల మరణదండనలు
అమలుచేయాలి!!
ఉత్తర తమిళనాడులోని వెనుకబడిన ప్రాంతానికిచెందిన
వేలూరు, ధర్మపురం, విల్లుపురం, సేలం, తిరువణ్ణామలైజిల్లాల్లోని కాఫీ తోటల్లో
చెట్లు నరికే కూలీలకు రోజుకు మూడు వందల రూపాయల చొప్పున వేతనం ఇస్తారు. వేసవి
కాలంలో వాళ్లకు ఆ పని కూడా వుండదు. అలాంటి బలహీన సందర్భాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల
బ్రోకర్లు అక్కడికి చేరుకుని పది రోజులకు ముఫ్ఫయి వేల రూపాయల కూలీ ఇస్తామని
ఆశపెడతారు. పది రోజులూ సజావుగా సాగితే ఆ కూలీలు చెరో ముఫ్ఫయి వేల రూపాయలతో ఇళ్ళకు
చేరేమాట నిజమేగానీ, చాలాసార్లు అలా జరగదు. పేదరికంలో మగ్గుతూ, డబ్బు కక్కుర్తితో
నల్లమల ఆదవులకు వచ్చే చాలా మంది కూలీల జీవితం రాయలసీమ జైళ్ళలో ముగుస్తుంది.
స్మగ్లర్లను పట్టుకునే శక్తి,
స్వేఛ్ఛ లేని అటవీ అధికారులు తరచుగా ఈ కూలీల్ని పట్టుకుని స్మగ్లర్లను
పట్టుకున్నట్టు ప్రపంచానికి కొన్ని కట్టుకథల్ని వినిపిస్తుంటారు. నెల్లూరు జిల్లా
జైలుతోపాటూ రాయలసీమలోని నాలుగు జిల్లాల జైళ్ళలో గత నాలుగేళ్ళలో పది
వేల మంది స్మగ్లర్లను బంధించినట్టు అధికారులు చెపుతున్నారు. ఆ సంఖ్యనుబట్టే అర్ధం
చేసుకోవచ్చు వాళ్ళు స్నగ్లర్లు కారనీ; కేవలం పొట్టకూటి కూలీలని.
పుట్టిన ప్రతివాడికీ ఆహారాన్ని,
నివాసాన్నీ సమకూర్చే శక్తి ప్రకృతికి వుంటుంది. కానీ సహజ సంపదల్ని కొన్నివర్గాలు
స్వాధీనం చేసుకోవడంతో మిగిలినవర్గాలు తమ జీవిక కోసం ప్రకృతి మీద కాక ఆధిపత్యవర్గాల
దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా ఆధారపడడానికి కూడా ప్రతి మనిషి తన
పాత వృత్తి నైణ్యాల్ని వదులుకుని కొత్త వృత్తి నైపుణ్యాలను అలవర్చుకోవాల్సి
వుంటుంది. అలా అలవర్చుకున్నా చాలా మందికి పనిచేసే అవకాశాలు లభించవు. సరిగ్గా
ఈ నేపథ్యం నుండే సమాజంలో ‘దొంగ’ ‘నేరస్తుడు’ అనేవాళ్ళు పుడతారు. ప్రకృతి సిధ్ధమైన
భూమిని కొందరు స్వాధీనం చేసుకున్నప్పుడేకదా అనేకమందికి నివాసానికి ఇల్లు
లేకుండాపోతుంది?. ఆధిపత్యంగల వర్గాలు ప్రకృతిని విచక్షణా రహితంగా
కొల్లగొట్టేకొద్దీ, స్వాధీనం చేసుకునేకొద్దీ సమాజంలో పేదరికం, నేరం
పెరిగిపోతుంది. ఈక్రమాన్ని అర్ధం చేసుకుంటే మనకు ఇంకో విషయం కూడా అర్ధం అవుతుంది.
అదేమంటే పేదలు నేరస్తులుగా మారరు. ఆధిపత్యవర్గాలే వాళ్లను నేరస్తులుగా మారే
స్థితికి నెట్టుతాయి. అంతకన్నా కీలకం ఏమంటే నేరం అనేదాన్ని ఎప్పుడయినా ఆధిపత్యవర్గాలే
నిర్వచిస్తూ వుంటాయి. నేరాన్ని నిర్వచించడంలోనే ఆధిపత్యవర్గాల ప్రయోజనం
ఇమిడివుంటుంది.
నాటి టాటా, బిర్లాల నుండి ఇవ్వాల్టి
అంబానీ, ఆదానీల వరకూ ఏ కార్పొరేట్ సంస్థ చరిత్రను చూసినా వాళ్లంతా ప్రభుత్వ
సహకారంతో సహజసంపదల్ని స్వాధీనం చేసుకుని పైకి ఎదిగినవారేనని సులువుగానే
అర్ధం అవుతుంది.
భారత సామాజిక వ్యవస్థలో నేరానికి కూడా
సామాజికవర్గ స్వభావం వుంటుంది. సామాజికవ్యవస్థలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న
వర్గాలే నేరవ్యవస్థలోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి. పేరు మోసిన ఎర్ర చందనం
స్మగ్లర్ లకు పేర్ల చివర రెడ్డి, నాయుడు అని బిరుదులు వుండడం అసహజం ఏమీ
కాదు. ఇంకా వివరాల్లోనికి వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు
గంగిరెడ్ది వంటివారు, తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు రాజా నాయుడు, టీవీ భాస్కర
నాయుడు వంటి పేర్లు వెలుగులో వుంటాయని సులువుగానే అర్ధం అవుతుంది.
నేర నిరోధక చట్టాలన్నింటిలోనూ నేరానికి
సంబంధించిన ప్రతి స్థాయికీ, తీవ్రతకూ ఒక నిర్దిష్ట పేరు వుంటుంది. చైన్ స్నాచర్,
జేబుదొంగ, దొంగ, దోపిడిదొంగ, బందిపోటు వగయిరా పేర్లను నేరస్థాయి, తీవ్రత,
పరిమాణాన్ని బట్టి వాడుతారు. అలాగే భూ నేరాల్లో ఆక్రమణదారుడు వేరు,
కబ్జాదారుడు వేరు. స్వంత నివాసం కోసమో, బతుకు తెరువు కోసమో ఆక్రమణదారులు చేసేది
మన్నించదగ్గ నేరమే. అందుకే ప్రభుత్వం తరచుగా ఆక్రమణదారుల ఆధీనంలోని పరిమిత భూమిని
క్రమబద్దీకరించి పట్టాలు జారీ చేస్తుంది. స్మగ్లింగ్ వ్యవస్థలోనూ అనేక అంతస్తులు
వుంటాయి. వీటిల్లో అగ్ర భాగాన స్మగ్లర్లు, మాఫియా నేతలు వుంటే అట్టడుగున వుడ్
కట్టర్లు వుంటారు.
దొంగ-పోలీసులది విచిత్రమైన అనుబంధం.
దొంగలు వుండాల్సిన అవసరం లేని సమాజంలో పోలీసుల అవసరమూ వుండదు. పోలీసుల అవసరం లేని
దశకు చేరుకున్న సమాజంలో దొంగలూ వుండరు. ఆ విషయం దొంగలకు తెలిసినా తెలియక పోయినా,
పోలీసులకు మాత్రం క్షుణ్ణంగా తెలుసు.
అటవీశాఖ సిబ్బందికీ, స్మగ్లర్లకూ మధ్య
ఒక అపవిత్ర అనుబంధంలేకపోతే స్మగ్లీంగు అంత సజావుగా ఇన్నేళ్ళు సాగదు. అయితే తరచుగా
చూసీచూడనట్టు పోయే అధికారులు అప్పుడప్పుడయినా తమ విధుల్ని నిర్వహిస్తున్నట్టు
రికార్డుల్లో చూపెట్టాల్సి వుంటుంది. దానికోసం కనీసపు అరెస్టులు చేయాల్సి
వుంటుంది. ఒక్కోసారి ఈ లాంఛనపు అరెస్టులు బెడిసికొట్టి హింసాత్మకంగానూ మారవచ్చు.
అలాంటి సందర్భాల్లో పోలీసులు, నేరస్తులూ భీకరంగా తలపడే వైరివర్గాలుగా
కనిపిస్తారుగానీ అది నిజంకాదు. అపారంగా పెరిగిపోతున్న అటవీశాఖ అధికారుల ఆస్తుల
వివరాలపై ఒక సర్వే జరిపితే ఈ విషయం తేటతెల్లం అవుతుంది.
ఇప్పుడయితే చైనా, జపాన్ ల మూలంగా
ఎర్రచందనానికి గిరాకీ వచ్చిందిగానీ పదేళ్ళ క్రితం వరకు దాని ఉపయోగాలు మన దేశంలో
ఎవరికీ తెలిసేవికావు. చివరకు చైనాలో అణు విద్యుత్ కేంద్రాల్లోనూ, జపాన్ లో లైంగిక
పటుత్వాన్నిచ్చే మందుల తయారీలోను ఎర్రచందనం పొడిని వాడుతున్నారని తేలింది.
నరేంద్రమోదీ మద్దతుతో సింగపూర్ ను
తలదన్నే రాజధాని నగరాన్ని కట్టలని ఆశపడ్డ చంద్రబాబుకు ప్రధాని ఖాళీ చేతులు
చూపించారు. దానితో చంద్రబాబు తన రాజధాని ఆశలన్నీ ఎర్ర చందనం అమ్మకాలపై పెట్టుకున్నారు.
ఎర్రచందనానికి వున్న మార్కెట్ గిరాకీ ఎంత? మన దగ్గర వున్న నిల్వలు ఎంత? వగయిరా
అంశాలతో సంబంధంలేకుండానే దాన్నొక కొత్త బంగారు గనిగా పేర్కొంటూ భారీ అతిశయోక్తులతో
భారీ ప్రచారం సాగించారు.
చెట్లు నరికే కూలీల్ని కాల్చిచంపడం ఒక దారుణమయితే,
వాళ్లను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల్ని సమర్ధించడానికిప్రభుత్వం చేస్తున్న వాదనలు అంతకన్నాదారుణంగా వున్నాయి.
"స్మగ్లర్లు ఎర్రచందనాన్ని తరలించుకుపోతుంటే, ఫారెస్టు అధికారులను చంపేస్తుంటే
పోలీసులు చూస్తూ ఊరుకోవాలా?” అంటూ అధికారపక్ష
నేత ముద్దు కృష్ణమనాయుడు వేసిన గడసరి ప్రశ్న కూడా మరిన్ని ప్రశ్నల్ని లేవదీస్తోంది. చనిపోయిన
ఇరవైమంది గతంలో ఎర్రచందనాన్ని స్మగ్లింగుచేశారని గానీ, అటవీ అధికారుల మీద దాడి
చేసింది కూడా వారేననిగానీ పోలీసు రికార్డుల్లో నేరం నమోదైవుందా?” అని సూటిగా అడిగితే
పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఎవరో గతంలో పోలీసుల మీద దాడి చేశారు. ఇంకెవరో ఆడవికి వస్తే
పోలీసులు కాల్చిచంపి పగతీర్చుకున్నారు. వాళ్ళుగా అడవికి రాకపోయినా పోలీసులే వెళ్ళి
బస్సులోంచి లాక్కొని వచ్చిమరీ కాల్పులు జరిపారు.
కూలీలు గుంపులుగా రావడం కూడా తీవ్రమైన
నేరం అయినట్టు మరో ప్రచారం జరుగుతోంది. ఎక్కడయినా స్మగ్లర్లు ఒకరిద్దరేవుంటారు;
కూలీలు గుంపులుగానే వుంటారు. ఇవ్వాళ ఎర్రచందనం కేసు చర్చనీయాంశంగా మారింది కనుక
చాలా మందికి కొత్తగా వుంటోందిగానీ ఇది సర్వత్రా జరిగేదే. గూడ్సుల కొద్దీ
బియ్యం మన రాష్ట్రం నుండి అక్రమ రవాణ జరుగుతుంది. ఆ వ్యాగన్లలో రాత్రికిరాత్రే ధాన్యం
బస్తాలు ఎక్కించడానికి వందల మంది కూలీలు పనిచేస్తారు. ఇసక క్వారీలు, ఓడ
రేవులు వంటి చోట్ల కూడా ఇలాంటి కూలీల గుంపులే వుంటాయి. పన్నులు ఎగవేసే
నల్లబజారు రవాణావ్యవస్థలోనూ బరువులు మోసేది ముఠాకూలీలే. వాళ్లలో చాలా మందికి తాము
చేస్తున్నది నేరం అని కూడా తెలీదు.
"అడవుల్లో కూలీలకు పనేంట" ని వెంకయ్య నాయుడు వంటివాళ్ళు అంటుంటే, "ఎర్రచందనాన్నీ దోచుకుని పోతున్నవారిని కాల్చేందుకు కాకపోతే అసలు పోలీసులకు ఆయుధాలు ఇచ్చి ఉపయోగం ఏంటని?" గాలి ముద్దుకృష్ణమనాయుడు రెచ్చిపోయారు. పైగా, "మన సంపదను కాపాడడానికి స్మగ్లర్లను (చంపేస్తే) ఎన్ కౌంటర్ చేసే పోలీసుల్నివిమర్శించడం తప్పు” అంటున్నారాయన.
శేషాచలం ఎన్ కౌంటరు సంఘటనలో ప్రభుత్వం పోలీసుల్ని
వేనకేసుకువస్తున్న తీరు ఒక ప్రమాదానికి సంకేతం అయితే,మృతుల మీద పౌరసమాజం సోషల్ మీడియాలోనూ, వ్యక్తిగత సంభాషణల్లోనూ వ్యక్తం
చేస్తున్న అభిప్రాయాలుఅంతకన్నా పెద్ద ప్రమాదానికి సంకేతంగా వున్నాయి. "నేరస్తుల్ని
చంపితే తప్పేంటీ" "తమను చంపినవాళ్ళ మీదపోలీసులు ప్రతీకారం తీసుకోరా?"
"దేశ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం లేదా?" "ఇలాంటి కేసుల్ని న్యాయస్థానాలు పరిష్కరించాలంటే ఎన్ని దశాబ్దాలు కావాలీ?'' "వాళ్ళను అరెస్టు చేస్తే తిండిదండగ. ఇప్పటికే వేల మందిని
జైళ్లల్లోకూర్చోబెట్టి మేపుతున్నాం." "తక్షణ న్యాయమే సరైన పరిష్కారం" వంటి సూచనలు విస్తృతంగా వినవస్తున్నాయి.
ఇలాంటి వాఖ్యలు విన్నప్పుడు కోర్టులు, చట్టాలు,
విచారణ, నేరనిరూపణ వగయిరా బాదరబందీలు లేకుండా
ఎవరు నేరం చేసినా సరే నేరం జరగ్గానే, నేరం జరిగిన స్థలంలోనే శిక్షించే, అవసరమైతే
చంపేసే న్యాయాన్ని పౌరసమాజం ముక్తకంఠంతో ఆమోదిస్తున్నదనే అభిప్రాయం కలుగుతుంది. కానీ,
అది నిజం కాదు. బలహీనవర్గాల నేరం బయటపడినప్పుడు మాత్రమే; మరీ ముఖ్యంగా ఆదివాసులు, ముస్లింలు,
యస్సీలు, యంబీసీలు నేరస్తులుగా వున్న కేసుల్లో మాత్రమే పౌరసమాజం ‘తక్షణ న్యాయం’ గురించి
మాట్లాడుతుంది. మిగిలిన సందర్భాల్లో మౌనంగా వుండిపోతుంది.
"జాతి సంపద, దేశ సంపద, రాష్ట్ర సంపద" అంటూ ఘనంగా చెపుతున్న మాటలు కూడా సందర్భానుసారంగామారిపోయేవే. ఆరేళ్ల క్రితం సత్యం రామలింగరాజు నేరం బయట పడినపుడుగానీ, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఎవరెవరిదో తెలిసినప్పుడుగానీ ఇదే పౌరసమాజానికి "తక్షణ న్యాయమే పరిష్కారం" అన్ననీతి గుర్తుకురాలేదు. అప్పుడు వాళ్లకు జాతి సంపదలు, దేశ సంపదలు, రాష్ట్రసంపదలు, ప్రజాసంపదలు గుర్తుకు రాలేదు. గిరిజన కూలీల నేరం బయటపడగానే అందరికీ "తక్షణ న్యాయమే పరిష్కారం" అన్న నీతిని ఎలుగెత్తి చాటాలనిపిస్తోంది!.
ధనికులైన నేరస్తుల్ని మర్యాదగా విచారించడానికిన్నూ,
పేదలైన నేరస్తుల్ని క్రూరంగా శిక్షించడానికిన్నూ, వెరసి ధనికసమాజాన్ని రక్షించడానికి
మాత్రమే ప్రభుత్వాలు వున్నాయనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలపడేకొద్దీ సామాజిక అశాంతి
మరింతగా పెరుగుతుంది. అప్పుడు పౌరసమాజం ఇంతకన్నా
దారుణ సన్నివేశాల్ని చూడాల్సి రావచ్చు. దొంగలు లేని సమాజం కావాలనే కోరిక పౌరసమాజానికి
వుంటుంది. అప్పుడువాళ్ళు ఆలోచించాల్సింది పోలీసులు, స్థాయీ సైన్యం లేని సమాజాన్ని ఎలా
నిర్మించాలి అని.
(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)
మొబైల్ నెం. 9010757776
14 April 2015
No comments:
Post a Comment