Muslim
Writers – What they have to write
ముస్లిం రచయితలు ఏం రాయాలి?
వేదిక మీద వున్న పెద్దలకు, వేదిక ముందున్న రచయితలకు సలాం అలైకుమ్.
తెలుగులో వస్తుశిల్పాల మీద మంచి పట్టువున్న రచయిత ఖదీర్ బాబు. ముందుగా తను మంచికథలు ఎలా రాయాలో వివరించడంవల్ల నా పని కొంచెం సులువయింది. ముస్లిం రచయితలు ఎలాంటి కథలు రాయాలి? అంటే కథలు రాయడానికి వాళ్ళు ఎలాంటి టాపిక్కులు ఎంచుకోవాలి అనేది
నా టాపిక్కు.
సూటిగా సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ముస్లిం రచయితలు ముస్లీం కథలు రాయాలి. ముస్లీంల కష్టలను రాయాలి. వాళ్ల మీద పాటిస్తున్న వివక్ష గురించి రాయాలి. ముస్లింల మీద సాగుతున్న అణిచివేత గురించి రాయాలి. ఆ అణిచి వేతనుండి బయటపడే మార్గాలను రాయాలి. ముస్లింల విముక్తి వర్తమాన మానవాళీ విముక్తిగా మారగలదని వివరించాలి. అయితే ఇది అంతసులువుగా సాగే వ్యవహారంకాదు. అలాగనీ అసాధ్యమైన లక్ష్యమూ కాదు.
ఏ కళాసాహిత్య ప్రక్రియకైనా భావోద్వేగాలే ఆయువుపట్టు. భావోద్వేగాలను ప్రసరింపచేసే కళ ఏమాత్రం అబ్బినా మీరు రచయిత అయిపోయినట్టే. ఇస్లాం సాహిత్యం భావోద్వేగాల గని. ఇస్లాం పరంపరలో వేలాది ప్రవక్తలున్నారు. ప్రతి ఒక్కరూ తమదైన పధ్ధతిలో జానపద కథానాయకులు. లెజెండ్స్. ఆ సాహిత్యంతో మీకు ఏమాత్రం పరిచయంవున్నా గొప్ప ఆధునిక కథలు రాయవచ్చు.
నాకు ఒక అదృష్టంవుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఫాతిమున్నీసా నాకు ప్రతిరోజూ నిద్రపుచ్చడానికి ప్రవక్తల జీవిత గాధలు, అరేబియన్ రాత్రులు, హాతింతాయి, సింద్ బాద్ సముద్రయాత్రలు తదితర ముస్లిం సాంప్రదాయపు కథలు చెప్పేది. అప్పట్లో వాటి విలువ నాకు అర్ధం కాలేదుగానీ, నేను రచయితను అయ్యాక ఆ కథలన్నీ నాకు ఒక గొప్ప నిధిగా ఉపయోగపడ్డాయి.
నాలుగేళ్ళ క్రితం నేను ‘కటారా’ అనే కథ రాశాను. అందులో కథాంశం వర్తమాన తెలుగు రాజకీయాలు, మీడియాకు సంబంధించింది. కథ అన్నాక దానికో ఆరంభమూ గమనమూ ముగింపు వుండాలిగా. మనుషులు తమ కింద వున్న స్వర్గాన్ని కాళ్ళతో తన్నుకుని జీవితకాలం దాని కోసం అన్వేషిస్తుంటారు అనే వాక్యంతో నాకథ మొదలవుతుంది. కథ మొదలెట్టినంత సులువుకాదు కథకు ఒక ముగింపును ఇవ్వడం. ఇస్లామిక్ సాహిత్యంలోని ‘షద్దాద్ స్వర్గం’ కథ నుండి ప్రేరణ పొంది నా కథకు ముగింపు ఇచ్చాను. తాను ఎంతగానీ ఇష్టపడి, కష్టపడి, భగవంతుడ్ని ధిక్కరించి నిర్మించుకున్న స్వర్గం లోనికి ప్రవేశించకుండానే,
ప్రవేశిస్తున్న క్షణాల్లోనే షధ్ధాద్
చనిపోతాడు. కటారా కథకు నేను ఇచ్చిన
ముంగింపు వంటిది 1940ల నాటి సుప్రసిధ్ధ హాలివుడ్ సినిమా ‘సిటిజన్ కేన్’ లోనూ వుంది. దాని రచయిత కూడా షద్దాద్ స్వర్గం కథ నుండే ప్రేరణను పొందినా పొంది వుండవచ్చు.
వర్తమాన పరిణామాల్ని కథాంశంగా తీసుకోండి. కథ ఫార్మెట్, చట్రం, నిర్మితి కోసం ఇస్లామిక్ సాహిత్యం నుండి ప్రేరణ పొందండి. ఇలా చేయడంవల్ల మీరు ఒక ఉద్వేగపూరితమైన, ప్రభావశీలమైన కథలు రాయగలరు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రచయితలు ఇటు పుస్తకాల్లోనూ, అటు సినిమాల్లోనూ ఇప్పుడు అనుసరిస్తున్న విధానం ఇదే; జానపద / పౌరాణిక భావోద్వేగాలతో వర్తమాన పరిణామాల్ని చెప్పడం.
వర్తమానం నుండి కాశ్మీర్ సమస్యను తీసుకుని, కథ నిర్మితి కోసం షేక్స్ పియర్ హామ్లెట్ నాటకం నుండి ప్రేరణపొంది, బష్రత్
పీర్ రాయగా, విశాల్ భరద్వాజ తీసిన హైదర్ సినిమా గత ఏడాది విమర్శకుల ప్రసంసలు అందుకుంది. ఇప్పుడు హాలివుడ్ లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది.
మీకు హజ్రత్ అయూబ్ ( అలైహిస్సలాం) కథ తెలుసుకదా! హీబ్రూ బైబిల్ లో వారిని జోబ్ అంటారు. హజ్రత్ అయూబ్ సాటిలేని దైవభక్తులు. షైతాన్ అల్లా దగ్గరికి వెళ్ళి సిరిసంపదలు అన్నీ వున్నప్పుడు ఎవరయినా నీకు భక్తులుగా వుంటారు అంటాడు. వెంటనే అల్లా హజ్రత్ అయూబ్ నుండి సిరిసంపదల్ని లాక్కుంటాడు. అయినా హజ్రత్ అయూబ్ అల్లా ఆరాధనను మానరు. అప్పుడు షైతాన్ మళ్ళీ అల్లా దగ్గరకు వెళ్ళి భార్యా పిల్లలతో సౌఖ్యంగా వున్నవాడు ఎలాగూ నీకు భక్తుడిగా వుంటాడు. అందులో గొప్పేముంది అంటాడు. అప్పుడు అల్లా హజ్రత్ అయూబ్ గారిని భార్యా పిల్లలకు దూరం చేస్తాడు. అయినా వారు అల్లా ఆరాధనను మానరు. మళ్ళీ షైతాన్ అల్లా దగ్గరకు వెళతాడు. మళ్ళీ హజ్రత్ అయూబ్ గారి ఆరాధనలో గొప్పదనం లేదంటాడు. అల్లా హజ్రత్ అయూబ్ గారికి ఒక చర్మవ్యాధిని ఇచ్చి కురూపిగా మారుస్తాడు. అప్పుడూ వారు అల్లా ఆరాధన మానరు. ఎన్ని కష్టాలు ఎదురైనా అల్లా ఆరాధన వదలవద్దని చెపుతుంది వారి జీవితకథ. సహనానికి వారు మారుపేరు.
ఇక్కడే మీకు ఇంకో ప్రవక్త ప్రస్తావన చేస్తాను. హజ్రత్ ఇల్యాస్ కథ మీకు తెలిసే వుంటుంది. దుర్మార్గుడైన అహబ్ రాజును శిక్షించేపనిని అల్లా వారికి అదేశిస్తాడు. ఆ రాజు, అతని భార్యా చాలా అత్యాశపరులు. వాళ్ల కోట పక్కన నబోత్ అనే ఒక దైవ భక్తునికి ద్రాక్షతోట వుంటుంది. రాణి కన్ను ఆ తోట మీద పడుతుంది. దేవుడు తనకు ఇచ్చిన ద్రాక్ష తోటను ఇతరులకు అమ్మను అంటాడు నబోత్. దానికీ ఆగ్రహించిన ఆ రాణి అతన్ని చంపి ద్రాక్షతోటను స్వాధీనం చేసుకుంటుంది.
ఈ రెండు కథలతోపాటూ మీకు ఒక వర్తమాన వాస్తవ సంఘటనను కూడా చెప్పాలి. పదేళ్ల క్రితం అమెరికాలో జరిగిందిది. రోడ్డు విస్తరణ పథకంలో భాగంగా అమెరికాలో ఒక కారు గ్యారేజిని తొలగించారు. ఫలితంగా ఆ కారు గ్యారేజి యజమాని మార్విన్
హీమియర్ ఆర్దికంగా నలిగిపోయాడు. భార్యా బిడ్డలకు దూరమైపోయాడు. ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న ఆ గ్యారేజి మెకానిక్ దిక్కులేని బిచ్చగాడైపోయాడు. చివరకు
అతను టెర్రరిస్టుగా మారిపోయాడు. కొందరు అతన్ని దేశభక్తుడు అని కూడా అంటారు. తన దగ్గరున్న డబ్బులనీ పోసి ఒక పాత బుల్ డోజరు కొని, తన నైపుణ్యంతో దాన్ని బాగుచేసి, 2004 లో ఒకరోజు రోడ్దు మీదకు వచ్చి తన గ్యారేజీని కూల్చి కట్టిన భవనాలను, టౌన్ హాలును, నగర మేయర్ బంగ్లానూ కూల్చివేశాడు. అతని ప్రతీకార చర్య ఐదారు గంటలు సాగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు ఇప్పటికీ యూట్యూబ్ లో వున్నాయి. ఒకసారి చూడండి. ( https://www.youtube.com/watch?v=NWi8FvHiVOE)
మీకు హజ్రత్ అయూబ్ కథ, ద్రాక్షతోట యజమాని నబోథ్ కథ, గ్యారేజి యజమాని మార్విన్ హీమియర్ కథ చెప్పడానికి ఒక కారణం
వుంది. రెండు నెలల క్రితం నేను ఇలియాథాన్ అనే రష్యన్ సినిమా చూశాను. ఇలియాథాన్ అంటే తిమింగలగిలం అని అర్ధం. అంటే తిమింగలాల్ని కూడా మింగేసేంత రాక్షస జంతువన్నమాటా. గత ఏడాది నిర్మించిన ఈ సినిమాకు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్ దక్కింది. నా వుద్దేశ్యంలో ఆ విభాగంలో ఇదే గొప్ప సినిమా.
లివియా థాన్ సినిమాను నేను అరడజనుసార్లు చూశాను. నేను చెప్పిన హజ్రత్ అయూబ్, ద్రాక్ష తోట, అమెరికాలో గ్యారేజి యజమాని కథల్ని కలిపి ఒక కొత్త కథగా మార్చి సినిమాను తీశారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఇదే. ఒక కొత్త ఇతివృత్తాని కథాంశంగా తీసుకోండి. అందులో భావోద్వాగాలను నింపడానికి, నిర్మితిని పాటించడానికి ఇస్లామిక్ సాహిత్యాన్ని పరికించండి.
అరేబియన్ నైట్స్ లో ఒక కథ వుంది. బాగ్దాద్ లో ఒక వ్యాపారికి కైరోలో గొప్ప
నిధి వున్నట్టు ఒక కల వస్తుంటుంది. దానితో అతను ఆ నిధిని వెతుక్కుంటూ కైరో వెళతాడు. అక్కడ
దురదృష్టావశాత్తు పోలీసులకి చిక్కి జైలు పాలవుతాడు. అక్కడ జైలు అధికారి అతన్ని మందలిస్తాడు. కల వస్తే బాగ్దాద్ నుండి కైరోకు వచ్చేయడం అమాయకత్వం అంటాడు. తనకు కూడా బాగ్దాద్ లో నిధి వున్నట్టు కలలు వస్స్తున్నాయనీ అయినా తాను అక్కడికి వెళ్ల దలచుకోలేదని చెపుతాడు. ఆ అధికారి చెప్పిన గుర్తులు సరిగ్గా తన ఇంటివే అని గమనించిన బాగ్దాద్ నివాసి తిరుగు ప్రయాణం అవుతాడు.
ఈ కథను చాలా యేళ్ళ క్రితం సుప్రసిధ్ధ అర్జెంటీన రచయిత జోర్జ్ లూయిస్ బోర్జెస్ తిరగరాశాడు. పోర్చుగీసు రచయిత పౌలో కొయల్హో 1988లో జార్జ్ బోర్జెస్ కథను ప్రేరణగా తీసుకుని క్రైస్తవ మత ప్రచారం కోసం అల్ కెమిస్ట్ అనే నవలను రాశాడు. ఈ నవల ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్ గా మారింది. ఆ నవలకు వచ్చిన పాపులారిటీ గురించి విని నేనూ చదివాను. ఇది అరేబియన్ నైట్స్ కథ. ఇలాంటి కథా చట్రాలు ఇస్లామిక్ / ముస్లిం సాహిత్యంలో కోకొల్లలుగా వున్నాయి. ఏది రాయాలో? మీరు ఎంచుకోండి. ఎలా రాయాలో? అవి చెపుతాయి.
ఈరోజు భూమండలం మీద అంతరించిపోయే ప్రమాదంలోవున్న జాతి ముస్లింలు. ఇంగ్లీషులో ఎన్ డేంజర్డ్ స్పీషెస్ అంటారు. ముందు మీరు ఈ చారిత్రక వాస్తవాన్ని గమనిస్తే ఏ అంశాల్ని సాహితీకరించాలి అనే ప్రశ్నకు ఈ భూమి అంత పెద్ద కాన్వాస్ కనిపిస్తుంది. మీ ఇంటి నుండి అగ్రరాజ్యం అమెరికా వరకు కాదేదీ కథకు అనర్హం.
అస్థిత్వవాద రచయితలు ఉద్యమ నాయకులుగా ఆలోచించాలి. ఎంత వీరోచితంగా యుధ్ధంచేసినా నాయకుడొక్కడే యుధ్ధాన్ని గెలవలేడు. యుధ్ధంలో గెలవడానికి అనేక శ్రేణుల్ని కలుపుకుని ఐక్య సంఘటన కట్టాలి. ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా విశాల ప్రజానీకాన్ని ఏకంచేయాలి. ఆపని చేసే శక్తిసామర్థ్యాలు సాహిత్యానికి వున్నాయి.
ముస్లింలతోపాటూ అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న మరో సమూహం ఆదివాసులు. ఏమిటీ ముస్లింలు, ఆదివాసులు చేసిన పాపం? ముస్లిం దేశాల భూమిపొరల్లో అపార చమురు నిల్వలున్నాయి. ఆదివాసుల గుడిసెల చుట్టూ అపార ఖనిజాలున్నాయి. ఈప్రపంచాన్ని ఏలుతున్నవారికి ఆ చమురుకావాలి. ఆ ఖనిజాలుకావాలి. వాటికోసం ఆ భూభాగాల్ని ఆక్రమించుకోవాలి. ఆ భూభాగాల నుండి ముస్లింలనీ, ఆదివాసుల్ని తొలగించాలి. వాళ్ళు తొలక్కపోతే చంపేయాలి. వాళ్లను చంపాలంటే వాళ్లమీద అనాగరీకులనే ముద్రవేయాలి. చంపదలచిన కుక్కను పిచ్చిది అన్నట్టు. కాల్ ద డాగ్ మ్యాడ్ బిఫోర్ కిల్లింగ్ ఇట్. ఇది నేటి యుగధర్మంగా మారింది.
ముస్లిం రచయితల తక్షణ కర్తవ్యం ఆదివాసులతో ఐక్య సంఘటన కట్టడం. వాళ్ళ కోసం మనం. మన కోసం వాళ్ళు.
యుధ్ధమూ, సాహిత్యము అనే రెండు అంశాలు మన ముందుకు వచ్చాయికనుక ఈ రెండీంటికి సంబంధించి చైనా తత్వవేత్త మావో సేటుంగ్ చెప్పిన ఒక సూక్తిని మీకు గుర్తుచేస్తాను. “ ఆయుధాల యుధ్ధంలో మనం ప్రత్యర్ధికున్న బలహీనమైన స్థానాల మీద దాడిచేస్తాం. అక్షరాల యుధ్ధంలో మనం ప్రత్యర్ధికున్న బలమైన స్థావరం మీద దాడిచేస్తాం”
మన ప్రత్యర్ధుల బలమైన స్థావరం అమెరికా. దానికి
మెదడు ఇజ్రాయిల్. అమెరికా-ఇజ్రాయిల్ శిబిరంలో చెరుతున్న శక్తుల సంఖ్య విస్తారంగానే వుంది. వాటి మీద, వాటిని సమర్ధించే శక్తుల మీద సాంస్కృతిక దాడిచేయండి. అదే మీ సాహిత్య కర్యవ్యం. అదే మీ కథాంశం. అదే మీ కథా వస్తువు.
ఈ నాలుగు మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకూ, నేను చెప్పినవి శ్రధ్ధగా విన్నందుకూ మీ అందరికీ ధన్యవాదాలు!
(అక్షర సాహితి 24
మే 2015, డానీ ప్రసంగం నోట్స్)
END
No comments:
Post a Comment