Friday 25 September 2015

హోదాకు సాకుల తూట్లు

హోదాకు సాకుల తూట్లు 

-     డానీ

        మార్కెట్వైన్ నవల ప్రిన్స్ అండ్ పాపర్ లో యువరాజు, పేదకుర్రాడు ఇద్దరూ చూడ్డానికి ఒక్కలాగే వుంటారుగానీ వాళ్ళు వేరువేరు. సరిగ్గా అందుకు భిన్నమైన కథ ఒకటి  ఆంధ్రప్రదేశ్ లో సాగుతోంది.  ప్రభుత్వాధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కరేగానీ వారు ఘడియకో రూపంలో కనిపిస్తుంటారు. ఒక ఘడియలో వారు ప్రపంచంలో అత్యంత ధనవంతునిగానూ, ఇంకో ఘడియలో అత్యంత నిరుపేదగానూ కనిపిస్తుంటారు. స్వయంగా ముఖ్యమంత్రే ద్విపాత్రాభినయం చేస్తుండడంవల్ల ఆంధ్రప్రదేశ్ స్థాయి, హోదా, వాస్తవ స్థితిగతులు  ఏమిటనేది ఇప్పుడు ఎవరికీ అర్ధంకాని బ్రహ్మపదార్ధంగా మారిపోయాయి. 

        ప్రభుత్వాధినేతకు ఆసక్తివున్న వ్యవహారాల్లో  వందలు వేల కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చుపెట్టడాన్ని మనం చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అంతులేని నిధులున్నాయని ఎవరికయినా అనిపిస్తుంది. ఆఘమేఘాల మీద పూర్తిచేసిన  పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం, అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి చూపెడుతున్న ఆతృత  దీనికి కొన్ని ఉదాహరణలు. ప్రభుత్వాధినేతకు ఆసక్తిలేని అంశాలు ముందుకు వచ్చినపుడు బాధ్యతగల పదవుల్లో వున్నవాళ్ళంతా  నిధుల కొరత గురించి, కష్టాలు కడగండ్ల గురించి ఏకరువు పెట్టడాన్ని కూడా మనం చూస్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటి పేదరాష్ట్రం ప్రపంచంలో మరొకటి లేదేమో అనిపిస్తుంది. రైతుల రుణమాఫీ పథకం సాచివేత, ఉత్తరాంధ్రా, రాయలసీమ  ప్రాజెక్టుల నిర్మాణం మీద నిర్లిప్తత  దీనికి ఉదాహరణలు.

        రాష్ట్రానికి ప్రత్యేక తరహా హోదాను తెచ్చే అంశాన్ని చర్చించడానికి ముందు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రమో, ధనికరాష్ట్రమో తేల్చాల్సి వుంటుంది. అధికారికంగా దాన్ని తేల్చకుండా ఇంతటి కీలమైన వ్యవహారం ఒక్క మిల్లీమీటరు కూడా ముందుకు సాగదు. ఈపని చేయాల్సిన ప్రభుత్వమే ద్విపాత్రాభినయం చేస్తోంది.  మరోవైపు, ప్రభుత్వ ప్రాయోజిత మీడియా నిర్వాహకులు, వేతనమేధావివర్గం కలిసి చర్చను సమర్ధంగా పక్కదోవ పట్టించారు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదా వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవనీ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం  విపక్షాలు నిష్ప్రయోజన ఉద్యమాలు చేస్తున్నాయనే అభిప్రాయాన్ని వాళ్ళు బలంగా ప్రచారం చేయగలిగారు.

ఇప్పుడు సాగుతున్న ఉద్యమం ప్రత్యేక తరహా హోదా సాధన కోసంకాదు;  ప్రత్యేక తరహా హోదా అమలు కోసం. ఈ రెండింటి మధ్య  చాలా తేడావుంది. ఆంధ్రప్రదేశ్ కు 2014 ఫిబ్రవరి 21న భారత పార్లమెంటు ప్రత్యేక తరహా హోదాను ఇచ్చేసింది. ఆ మేరకు అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అధికారిక ప్రకటన చేశారు. పైగా ఈ ప్రకటనను వారు అప్పటి ప్రధాన ప్రతిపక్షం, ఇప్పటి అధికారపక్షం అయిన బీజేపి కోరిక మేరకు చేశారు. మరీవివరంగా చెప్పాలంటే ప్రస్తుత నరేంద్రమోదీ ప్రభుత్వంలో నెంబర్ టూగా చెలామణి అవుతున్న వెంకయ్య నాయుడి డిమాండు మేరకు చేశారు.

ఏపికీ ప్రత్యేక తరహా హోదా  ఇవ్వడానికి మార్గదర్శక సూత్రాలు ఒప్పుకోవు, దానికి అవసరమైన అర్హతలు, ప్రత్యేక భౌగోళిక, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు  ఏపీలో లేవు, పొరుగురాష్ట్రాలు ఒప్పుకోవు, పధ్నాల్గవ ఆర్ధిక సంఘం సిఫార్సులు విరుధ్ధంగా వున్నాయి  అనేవన్నీ కుంటిసాకులు మాత్రమే. ఈ అంశం మీద ఇప్పుడు కొత్తగా  నిర్ణయం తీసుకోవడంలేదనేది ముందు గమనించాలి. పధ్నాల్గవ ఆర్ధిక సంఘం పుట్టడానికి ముందే  పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని  అమలు చేయాలనేది మాత్రమే ప్రస్తుత డిమాండ్. పధ్నాల్గవ ఆర్ధిక సంఘం సిఫార్సుల గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు పదేపదే చెపుతుంటే ‘తోడేలు –మేకపిల్ల కథ గుర్తుకువస్తోంది. పార్లమెంటు నియమించిన ఆర్ధికసంఘం పార్లమెంటు నిర్ణయాన్ని రద్దుచేసేంత పెద్దదికాదనే అంశాన్ని వీళ్ళు  తమ ప్రయోజనం కోసం దాచిపెడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా హోదాను అమలు చేయని పక్షంలో భారత పార్లమెంటు నిర్ణయాలకు ఏమాత్రం విలువ లేదనే అర్ధం వస్తుంది. అదే జరిగితే పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పునాదుల్ని ప్రస్తుత పాలకులు  కూల్చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంతకన్నా పెద్ద ఉద్యమాలకు సిధ్ధం కావల్సి వుంటుంది.

పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అస్థవ్యస్థంగా, అడ్డగోలుగా చేసి కాంగ్రెస్/యుపీఏ తప్పుకున్న్నదనీ, ప్రస్తుత  బీజేపీ/ఎన్డీయే ప్రభుత్వానికి గత ప్రభుత్వ నిర్ణయాలను పాటించాల్సిన పనిలేదనే వాదన కూడా పసలేనిది మాత్రమేకాక ప్రమాదకరమైనది. ఎప్పుడయినా కాలపరిమితి ముగియగానే లోక్ సభ రద్దు అవుతుందిగానీ రాజ్యసభ ఎన్నడూ రద్దుకాదు. మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చిన రాజ్యసభ ఇప్పటికీ సజీవంగా వుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం నుండి బీజేపి/ ఎన్డీఏ తప్పుకోవాలనుకుంటే ఆ నిర్ణయాన్ని మరలా పార్లమెంటు వేదిక మీదనే తీసుకోవాలి. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా వుంటున్న తెలుగుదేశం పార్టి వైఖరి కూడా అప్పుడు తేలిపోతుంది.

ఇటీవల భారత రాజకీయాలు ఎంతగా దిగజారిపోతున్నాయంటే చర్చ జరగాల్సిన చట్టసభల్లో ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడంలేదు. బయటికొచ్చి మీడియా పాయింటు దగ్గర మాత్రం పెద్దగా హడావిడి చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర శాసన సభలకూ, దేశ పార్లమెంటుకూ పెద్ద తేడాలేదు.  ఆమేరకు శాసనకర్తలు తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి బూటకాలు ఎక్కువ కాలం సాగవు.

హోదా బదులు ప్యాకేజీలు తెస్తామనీ, హోదాకన్నా ఎక్కువ నిధులు తెస్తామనీ “ఆ నాయుడూ ఈ నాయుడూ (ఈ పదప్రయోగం యం. వెంకయ్యనాయుడు గారిదే) ప్రచ్చన్నంగా సంకేతాలు పంపడమేగాక, ప్రత్యక్షంగా ప్రకటనలూ గుప్పిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ తేవడం పెద్దమాట. లెఖ్ఖప్రకారం రావలసినవైనా తెస్తున్నారా? అన్నది ముందుగా తేల్చాల్సిన అంశం. ఈ ‘ఎక్కువ తెస్తున్నాం అనే జడపదార్ధాన్ని తేల్చడానికి కూడా కొన్ని పనిముట్లు, లాంఛనాలు వున్నాయి. వాటినయినా ఇద్దరు నాయుళ్ళు పాటించాలి.

కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ కు కల్పించాల్సిన ఆర్దిక రాయితీల గురించి ఏపి పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లో సెక్షన్ 46, 90, 94 లలో పొందుపరిచారు. ఇవిగాక పార్లమెంటులో మాజీ ప్రధాని మరో ఆరు హామీలు ఇచ్చారు. వీటితోపాటూ ప్రత్యేక తరహా హోదా అంశం ఎలానూ వుంది. ఈ ఐదు సెక్షన్ల అమలుకు అయ్యే అంచనా వ్యయాన్నీ, కేంద్రం నుండి రావలసిన దానికీ వచ్చిన దానికీ మధ్య అంతరాన్నీ లెఖ్ఖగట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి అసాధ్యమైన కసరత్తు ఏమీకాదు. ఆ లెక్క తేలినప్పుడు మాత్రమే టిడీపి-బీజేపి, నరేంద్ర మోదీ-బాబు పొత్తులవల్ల రాష్ట్రానికి మేలు జరుగుతున్నదో కీడు జరుగుతున్నదో తేలిపోతుంది.

మోదీ, చంద్రబాబు చేస్తున్న ప్రకటనల్లోని నిజాల్ని నిగ్గుతేల్చడానికి ఒక  లిట్మస్ టెస్టు ఎలాగూవుంది.  2014-15, 2015-16  ఆర్ధిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రిసోర్స్ గ్యాప్ ఎంత?  గత రెండు కేంద్ర బడ్జెట్లలో ఆలోటును పూరిస్తూ నిధుల్ని కేటాయించారా?  వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపువున్న బుందేల్ ఖండ్ తో సమానంగా (ఎక్కువకాదు) రాయలసీమ, ఉత్తరాంధ్రా ప్రాంతాలకు నిధులు ఇస్తున్నారా? హుద్ హుద్ తుఫానువల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టం ఎంత? కేంద్రప్రభుత్వం ఎంత ఇస్తానంది? ఎంత ఇచ్చింది? ఈ అంశాల మీదా  రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. అది భవిష్యత్ చర్చకు ఒక అధికారిక ఆధారంగా వుండడమేగాక, నరేంద్రమోదీ దగ్గర చంద్రబాబు పరపతిని తేల్చడానికి కూడా ఒక భారమితిగా పనికివస్తుంది. ఎలాగూ చంద్రబాబుగారికి శ్వేతపత్రాలు విడుదల చేయడం అంటే చాలా ఇష్టం. వారు విడుదల చేయాల్సిన తొలి శ్వేతపత్రం ఇదే! బాకీ సబ్ బక్వాస్!

(రచయిత ఆంధ్రప్రదేశ్ పౌరసమాజం కన్వీనర్)
మొబైలు : 9010757776
హైదరాబాద్

24 సెప్టెంబరు 2015  

ప్రచురణ :  సాక్షి డైలీ, ఆంధ్రప్రదేశ్, 25 సెప్టేంబరు 2015 

http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/25092015/Details.aspx?id=2926115&boxid=25524544

No comments:

Post a Comment