Friday 25 September 2015

FATWAS Full Text

పూర్తి పాఠం


 ‘ఇస్లాం ప్రతిష్ఠకు అతి, మితవాదాల చేటు అంశం మీద నేను రాయాల్సినదంతా రాశాను. ఆంద్రజ్యోతి వాళ్ళు ప్రచురించాల్సినదంతా ప్రచురించారు. అందుకు  ఆంద్రజ్యోతి యాజమాన్యం, సంపాదకులు, ఎడిట్ పేజీ ఇన్ – చార్జీలకు ధన్యవాదాలు.

స్థలాభావం వల్ల నా వ్యాసంలో కొన్ని పేరాలను తీసివేశారు. వ్యాసం పూర్తి పాఠాన్ని చదవాలనుకున్నవాళ్ళు ఇక్కడ చూడవచ్చు .

ఇస్లాం ప్రతిష్ఠకు అతి, మితవాదాల చేటు
ఎక్కడ  సహనం అవసరమో అక్కడే మీరు తొందరపడుతున్నారు
-     హజ్రత్ ఊమర్ ఫారూఖ్, రెండవ ఖలీఫా

ప్రపంచ సినిమా వేదిక మీద ఇరాన్ సినిమాలది గౌరవనీయమైన స్థానం. యాక్షన్ కథలతో హాలివుడ్ ప్రపంచ మార్కెట్ ను కొల్లగోడుతుంటే, ఇరాన్ సినిమాలు వున్నతమైన బావోద్వేగాలతో ప్రపంచ సినీ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొడుతుంటాయి. భారత సినిమాలు ప్రత్యంక్షంగానో పరోక్షంగానో హిందూమత ప్రచారం సాగిస్తున్నట్టు, హాలివుడ్ సినిమాలు క్రైస్తవ / యూదు మతప్రచారం చేస్తున్నట్టు, ఇరాన్ సినిమాలు ఇస్లాం మత విలువల్ని కళాత్మకంగా ప్రచారం చేస్తుంటాయి. అనుమానం వున్నవాళ్ళు 2012లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ఏ సెపరేషన్ సినిమా చూడవచ్చు.

ఇరాన్ సినిమా అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు మాజిద్ మాజిద్. ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ చూడని అంతర్జాతీయ సినీప్రేక్షకులు వుండరు. కాన్వెంటు బూట్లు పోతే పేద కుటుంబాల పిల్లలకు ఎంత కష్టమో చెప్పే కథ ఇది. ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (1977),’ బరణ్ (2002) చిత్రాల దర్శక-నిర్మాత  మాజిద్ మాజిద్ నిర్మించిన కొత్త సినిమా ‘ముహమ్మద్ – ది మెసెంజర్ ఆఫ్ గాడ్ దీనికి సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్. మాజిద్ మాజిద్, ఏఆర్ రహమాన్ వంటి వర్తమాన సినీరంగ దిగ్గజాలు  జోడీ కడితే  ఆ సినిమా కళాత్మకంగా ఎంత గొప్ప స్థాయిలో వుంటుందో ఊహించుకోవచ్చు. 

ముహమ్మద్ ప్రవక్త (వారికి శాంతి కలుగుగాక) మీద సినిమా తీసినందుకు ముంబాయికి చెందిన సున్నీ రజా అకాడమీ అభ్యంతరం తెలిపింది. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా సినిమా తీసినందుకు. అందులో  పనిచేసినందుకు మాజిద్ మాజిద్, రెహమాన్ ఇద్దరూ మళ్ళీ కల్మా చదవాలనీ, అంటే ఇస్లాం మీద తమ విశ్వాసాన్ని మళ్ళీ ప్రకటించాలనీ,  వాళ్ళు  ఇస్లాం పధ్ధతుల్లో మళ్ళీ పెళ్ళి కూడా  చేసుకోవాలనీ ఒక ఫత్వా జారీచేసింది. ఈ సినిమాను నిషేధించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లకు లేఖలు రాసింది. ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుండే విశ్వ హిందూ పరిషత్ రెహమాన్ కు ఘర్ వాపసీ ఆహ్వానం పంపింది. రెహమాన్ తిరిగి హిందూమతంలోనికి వస్తే, (ముస్లింలు) ఎన్ని ఫత్వాలు జారీచేసినా కీడు కలగకుండా కాపాడుతామని వీహెచ్ పి నేత  సురేంద్ర జైన్  ఒక  హామీ కూడా ఇచ్చారు దానితో ఈ వ్యవహారం  రాజకీయ మలుపు తిరగడమేగాక, ఫత్వాల పరిధి పరిమితుల్ని వివరించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది.

ఇస్లాం ధర్మానికి ఐదు మూలస్థంభాలు  విశ్వాసం (ఈమాన్), ఆరాధన, ఉపవాసం, జకాత్, హజ్. వీటిల్లో మొదటిదీ అత్యంత ప్రాణప్రదమైనది ఈమాన్.  అంటే అల్లా మీద విశ్వాసం, అల్లా ఏకత్వం మీద నమ్మకం. ఇస్లాం ఏకేశ్వరోపాసన మతం. ముస్లిం సమాజంలో అల్లాతప్ప మరెవ్వరూ ఆరాధనీయులుకాదు. మరింత వివరంగా చెప్పాలంటే ప్రవక్తలు కూడా ఆరాధనీయులుకాదు. వాళ్లను గౌరవించడం వేరు; ఆరాధించడం వేరు.

సమాజంలోనికి కొత్త అంశాలు ప్రవేశించినప్పుడెల్లా  ఐహిక జీవితానికీ మతనియమాలకూ మధ్య కొన్ని కొత్త సమస్యలు, సందేహాలు ముందుకు వస్తాయి.  అలాంటి ధార్మిక సందేహాలకు  ధార్మిక వివరణ ఇవ్వడమే ఫత్వాలంటే. ఉదాహరణకు, మూత్రవిసర్జన విషయంలో ముస్లింలు పాటించాల్సిన నియమాలు కొన్ని వున్నాయి. ఏ సెపరేషన్ సినిమాలో అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక వృధ్ధునికి సేవలు చేయడానికి ఒకామెను పెడతారు. ఒకరోజు ఆ వృధ్ధుడు ప్యాంటులో మూత్రవిసర్జ చేసి  ఆ తడిలోనే కూర్చుండిపొతాడు. అతనికి స్నానం చేయించి, బట్టలు మార్చాల్సిన సమయంలో ఆమెకు ముస్లిం మహిళలు పరపురుషుడ్ని ముట్టుకోవచ్చా? అతని బట్టలు మార్చవచ్చా? పురుషులు  మూత్రవిసర్జన చేసిన బట్టల్ని తాకవచ్చా?  వంటి కొన్ని ధార్మిక సందేహాలు వస్తాయి. ఆమె కొద్దిసేపు తటపటాయించి,  ఒక మతగురువుకు ఫోన్ చేసి పరిష్కారం కోరుతుంది. పురుషుడు రోగి అయినపుడు, తన పనులు తాను చేసుకోలేని స్థితిలో వున్నప్పుడు, సహాయం చేయలగల మరో పురుషుడు పరిసరాల్లో లేనపుడు అంటూ  కొన్ని షరతులు చెప్పి, అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ముస్లిం మహిళలు  మానవసేవా దృక్పధంతో  పరపురుషుల బట్టలు మార్చవచ్చు అని వాళ్ళు వివరిస్తారు. ఇది ముస్లిం సమాజంలో ఫత్వాల ఆవశ్యకత, ప్రాముఖ్యత.

ఖలీఫాల కాలంలో ఇస్లాం సమాజంలో  ధార్మికగురువులే  శాసనకర్తలు కనుక  వారికి దండనాధికారం కూడా వుండేది. ఇది  ఖలీఫాల కాలం కాదు. ఇప్పటి మతపెద్దలకు దండనాధికారంలేదు. అయితే, ఖలిఫాల కాలం నాటి అధికారాల్ని చెలాయించాలని ఆశపడే ఛాందసవాదులు కొందరు ముస్లిం సమాజంలో ఇప్పటికీ వున్నారు.  అట్లే,  ఫత్వా జారీచేయడం అంటే మరణదండన విధించినట్టే  అనే నమ్మేవాళ్ళూ  ముస్లిమేతరుల్లో  చాలా మంది వున్నారు.  

ఇస్లాం ధార్మిక జీవితానికి రెండే ప్రామాణిక గ్రంధాలు. మొదటిది ఖురాన్, రెండోది హదీస్ (ప్రవక్త ముహమ్మద్ ఉపదేశాలు, వారి జీవితాచరణ).  ప్రామాణిక గ్రంధాల్లో చెప్పిన నియమాలకూ, ఆధునిక సమాజంలో కొత్తగా వచ్చే అనేక అంశాలకు మధ్య పొంతన కుదర్చడానికి ఫత్వాల రూపంలో ఒక ధార్మిక వివరణ అవసరం అవుతుంది. ఆ వివరణ సమస్యను పరిష్కరించేలా వుండాలిగానీ, మరింత జటిలం చేసేదిగా వుండకూడదు. మత పెద్దల్లో ఆచరణాత్మకవాదులు, ఛాందసులు ఎప్పుడూ వుంటారు. దీనికి ముస్లిం సమాజం కూడా మినహాయింపుకాదు.  చాందసులు, మితవాదులు జారీచేసే ఫత్వాలు తరచూ ఇస్లాం ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. 

విగ్రహారాధనకు ఇస్లాం వ్యతిరేకమనేది అందరికీ తెలిసిన అంశమే. అయితే, ఈ వ్యతిరేకతను ఛాందసులు అతిగా  సాగదీస్తుంటారు. విగ్రహాలను కళ్ళతో చూడకూడదంటారు. ఉత్సవాల బాజాభజంత్రీలని చెవులతో వినకూడదంటారు.  అది అక్కడితో ఆగదు. ఫొటోలను కూడా విగ్రహాల జాబితాలోనికి చేర్చుతారు.  ముస్లీంలు  ఫొటోలు దిగ కూడదు. సినిమాలు చూడకూడదు. సినిమాల్లో నటించకూడదు. వాళ్ల ఇళ్ళలో టీవీలు వుండకూడదు ... ఇలా సాగుతాయి ఫత్వాల రూపంలో వాళ్ల వివరణలు.   హజ్ యాత్ర మీద అనేక వందల  డాక్యుమెంటరీలు వచ్చాయనిగానీ, మక్కాలో హజ్ నమాజ్ ను లైవ్ టెలీకాస్ట్ చేస్తారనిగానీ, అరబ్ సినిమాలకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేక స్థానం వుందనిగానీ వారు  గుర్తించరు.  అంతవరకు దేనికీ, ఐఎస్ వంటి కరడుకట్టిన ఇస్లాం ఛాందసవాద సంస్థలు సహితం తమ ప్రచారానికి టీవీలు, కెమేరాలు, సోషల్ మీడియాను ఆశ్రయించక తప్పడంలేదు.  అయినా, ఈ వాస్తవాలను వారు అనేక  సందర్భాల్లో గుర్తించరు.

ఇలాంటి సమస్య వచ్చినపుడు, అల్లా మీద విశ్వాసానికి (ఇమాన్)  భంగం కలగనంతవరకు జీవిక కోసం ఏది చేసినా తప్పుకాదని ఇస్లాం మతపెద్దల్లో  ఆచరణాత్మకవాదులు అంటారు. హిందూ భక్తిగీతాలను  ముహమ్మద్ రఫీ అంతటి పారవశ్యంతో పాడిన గాయకుడు బాలివుడ్ లో ఇంతవరకు ఇంకొకరు లేరు.  అంతమాత్రాన రఫీ మతవిశ్వాసాల (ఈమాన్) కు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. అదొక మంచి మతసామరస్య  సాంప్రదాయం కూడా. 

ధార్మిక నియమానుసారం తాను సృష్టించిన మనిషి ముస్లింగా జీవిస్తున్నాడో కాఫిర్ గా జీవిస్తున్నాడో  తేల్చాల్సింది  అల్లా ఒక్కడే.  చాందస మతపెద్దలు తెలిసో తెలియకో అల్లా అధికారాల పరిధిలోనికి ప్రవేశిస్తున్నారు. ఆమేరకు వారిది అల్లా మీద తిరుగుబాటే! .

ముహమ్మద్ ప్రవక్త మీద సినిమాలు రావడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ కొన్ని డ్రామా, యానిమేషన్  సినిమాలు వచ్చాయి. 1980వ దశకం ఆరంభంలో ఓమర్ ముఖ్తార్ (లయన్ ఆఫ్ ది డిజర్ట్) సినిమాతో  భారత సినీ ప్రేక్షకులకు దగ్గరయిన దర్శకుడు ముస్తఫా అక్కడ్. అతనే  అంతకు ముందు 1977లో  ముహమ్మద్ – ది మెసంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమాను అరబ్బీ, ఇంగ్లీషు భాషల్లో నిర్మించాడు. "డెభ్భయి కోట్ల (ఇప్పుడు 157 కోట్లు) మంది విశ్వసించే ఇస్లాం గురించి ఇతరులకు తెలిసింది చాలా తక్కువ అని తెలిసినపుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  అలాంటి అపోహల్ని తొలగించడం కోసమే ఈ సినిమా తీశాను" అంటూ ఆ సినిమాను తను ఎందుకు తీశాడో చెప్పుకున్నాడు ముస్తఫా అక్కడ్. సౌదీ అరేబియా రాజు ఖలీద్ బిన్ అబ్దుల్ అజీజ్, లిబియా నేత మువమ్మర్ అల్ గఢాఫీ, మొరాకో రాజు కింగ్ హసన్ ఈ సినిమా నిర్మాణానికి అవసరమైన నిధులు అందించారు. 

          అప్పుడు కూడా ఆ సినిమా మీద కొంత వివాదం నడిచింది. ఆ సినిమా టీజర్లలో ఆంథోని క్విన్ ను చూసి ముస్లిమేతరుడైన అతను ముహమ్మద్ ప్రవక్త గా నటిస్తున్నాడని కొందరు అపోహపడ్డారు. సినిమా పేరులో ప్రవక్త పేరును నేరుగా పెట్టవద్దని  మరికొందరు సూచించారు. వాటికి అనుగుణంగా తన సినిమా పేరును ‘ద మెసేజ్’ (సందేశం) గా మార్చాడు ముస్తఫా అక్కడ్. ఇస్లామిక్ ధార్మిక అంశాలకు అత్యంత సాధికారపీఠంగా భావించే అల్ అజ్ హర్ విశ్వవిద్యాలయం (కైరో, ఈజిప్టు) ముస్తఫా అక్కడ్  సినిమా స్క్రిప్టుకు   ఆమోదం తెలిపింది.  ముహమ్మద్ ప్రవక్త పాత్రలో మరొకరు నటించడం వారి బోధనలకు వ్యతిరేకంగా వుంటుందని భావించి  ప్రవక్తనుగానీ,  వారి భార్యాపిల్లల్నిగానీ, తొలి నలుగురు ఖలీఫాలైన హజ్రత్ అబూబకర్ సిధ్ధీఖీ, హజ్రత్ ఉమర్ ఫారూఖ్, హజ్రత్ ఉస్మాన్ ఘనీ, హజ్రత్ అలీ ముర్తుజాలనుగానీ ఆ సినిమాలో చూపెట్టలేదు.  వాళ్ల నీడ కూడా ఎక్కడా కనిపించకుండా, వాళ్ల గొంతు కూడా ఎక్కడా వినిపించకుండా అనేక  జాగ్రత్తలు తీసుకున్నారు. The makers of this film honour the Islamic tradition which holds that the impersonation of the Prophet offends against the spirituality of his message. Therefore, the person of Mohammad will not be shown (or heard) అంటూ సినిమా ఆరంభంలోనే ఒక వివరణ కూడా ఇచ్చారు.  

నిజానికి 1950ల నాటి హాలివుడ్ చిత్రాల్లోనూ ఏసుక్రీస్తుని తెరమీద నేరుగా  చూపించేవారుకాదు. బెన్-హర్ సినిమా చూసినవాళ్లకు ఈ టెక్నిక్ తెలిసే వుంటుంది. ముస్తఫా అక్కడ్ ఆ టెక్నిక్ ను మరింతగా అభివృధ్ధిచేసి ప్రవక్తతోపాటూ, ఖలీఫాల నీడను కూడా చూపకుండా సెల్యులాయిడ్ మీద ఒక అద్భుత కావ్యాన్ని చెక్కాడు. హజ్రత్ హంజా (ఆంథోని క్విన్) హజ్రత్ బిలాల్ ( జానీ సెక్కా), అబు సుఫియాన్ (మిషేల్ అన్సారా), హింద్ (ఐరీన్ పపాస్) పాత్రల మీద ఆధారపడి ఆ సినిమా కథనం నడుస్తుంది. ఒకచోట హజ్రత్ ఆలీ ఖడ్గం కొంతభాగం కనిపిస్తుంది, ఒకటి రెండు చోట్ల ముహమ్మద్ ప్రవక్త ఒంటె (కస్వా)  తల కనిపిస్తుంది. ఆయా సన్నివేశాల్లో  ప్రవక్త వున్నట్టు ప్రేక్షకులకు  తెలుస్తూనే వుంటుంది. కానీ తెరమీద పాత్ర వుండదు. ఇస్లాంమత ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన అత్యంత ముఖ్యుల్ని తెర నుండి తప్పించి ఇస్లాంమత పుట్టుక మీద సినిమా తీయడం కత్తి మీద సాము వంటిది. స్క్రీన్ ప్లే రాసిన హెచ్ ఏఎల్ క్రేగ్, దర్శకుడు ముస్తఫా అక్కడ్ ఆ ప్రక్రియలో  ఎదురైన సవాళ్లను అధిగమించి అద్భుత  విజయం సాధించారు.

తెలుగు ప్రేక్షకుల్లో  చాలామంది పురాణాలు చదివి వుండరు. అయినప్పటికీ వాళ్ళకు పురాణజ్ఞానం పుష్కలంగా వుంటుంది. దానికి కారణం చాలా వరకు సినిమాలే. యన్టీ రామారావు, యస్వీ రంగారావు వంటి మహానటులు మనకు హిందూ పురాణాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. విజయచందర్ కరుణామయుడు సినిమా వచ్చేంత వరకు క్రైస్తవేతరుల్లో చాలా మందికి ఏసుక్రీస్తు గురించి అంతగా తెలీదు. ఇస్లాం మతంలో పుట్టి, బాల్యమంతా దాదాపు మసీదు ఆవరణలోనే ఆడుకుంటూ పెరిగిన ఈ వ్యాసకర్తకు కూడా ముస్తఫా అక్కడ్ సినిమా చూసేంత వరకు తన  మతానికి సంబందించిన అనేక ధార్మిక సూక్ష్మాలు తెలీవు. ఇవన్నీ సినిమాలు చెపుతాయి.  ఆడియో- విజువల్ మీడియాకు వున్న బలం అదే.

చారిత్రాత్మక  చికాగో ప్రపంచ ధార్మిక మహాసభ ఉపన్యాసంలో స్వామీ వివేకానందుడు మనుషులు బావిలోని కప్పల్లా వుండేపోతే ఇతర మతాల గొప్పతనం ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు అంటారు. ఇప్పుడు ఇస్లాంది అదే పరిస్థితి. ఇతర మతస్తులు ఇస్లాంను అర్ధం చేసుకున్నది తక్కువ; అపార్ధం చేసుకున్నది ఎక్కువ.  ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉన్మాదంతో చేసే కొన్ని చర్యల్నే ఇతరులు ఇస్లాం ధార్మిక ఆచరణ అనుకునే ప్రమాదమూ లేకపోలేదు. మరోవైపు, కొందరు తుంటరులు ప్రవక్తను అవహేళన చేస్తూ, అవమానిస్తూ ‘ఇన్నోసెన్స్ ఆఫ్  ముస్లిమ్స్(2012) వంటి చవకబారు సినిమాలను తీసి, ఇస్లాం మీద దుష్ప్రచారాన్ని సాగిస్తుంటారు. అలాంటి సినిమాలను సినిమాలతోనే ఎదుర్కోవాలి. ఇప్పుడు మాజిద్  మాజిద్ చేసింది అదే.

ది మెసేజ్ సినిమాలో, యుధ్ధానికి వెళుతున్నప్పుడు ప్రవక్త తన సహచరులకు కొన్ని ఆదేశాలిస్తారు. “నిరాయుధుల మీద కత్తి దూయవద్దు. మహిళల్ని, పిల్లల్ని హింసించవద్దు. బందీలతో గౌరవంగా వ్యవహరించండి, చెట్లు నరకవద్దు. బావుల్ని విధ్వంసం చేయవద్దు అంటారు.  ఆ యుధ్ధనియమాల్ని  చూస్తుంటే ఐక్యరాజ్య సమితి అవార్డు గుర్తుకు వస్తుంది. అలాగే ప్రవక్త చివరి క్షణాల్లో తన అనుయాయులకు వడ్డీని ముట్టుకోవద్దని గట్టిగా హెచ్చరిస్తారు.

ఇంతగా ఇస్లామిక్ ఔన్నత్యాన్ని చాటిచేప్పిన ముస్తఫా అక్కడ్  ది మెసేజ్ సినిమా, ముస్లిం జనాభా  అత్యధికంగా వున్న భారతదేశంలో  విడుదల కాలేదు.  కొందరు ముస్లిం నాయకులు భారత  ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, దాని విడుదలను అడ్డుకున్నారు.  ఫలితంగా నిరక్షరాశ్యులయిన కోట్లాదిమంది భారత ముస్లింలు తమ మతం  గురించి తెలుసుకునే గొప్ప అవకాశాన్ని కోల్పోయారు. ఒకవిధంగా ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకునే శక్తులు చేయాల్సిన పనిని ముస్లిములే చేసినట్టయింది.

ఇప్పుడు మాజిద్ మాజిద్ సినిమాకూ అలాంటి నిషేధ ముప్పు పొంచివుంది. భారత దేశంలో ఆ సినిమా ఇంకా  విడుదల కాకపోయినా వెండితెర మీద మరో  అద్భుత కావ్యాన్నీ ఆవిష్కరించినట్టు టీజర్లు చెపుతున్నాయి. అప్పట్లో, ముస్తఫా అక్కడ్ సినిమాకు మౌరీస్ జెర్రే అందించిన  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 1978లో ఆస్కార్ నామినేషన్ పొందింది. మాజిద్ సినిమాకు  రెహమాన్ అంతకు మించిన మహత్తర సంగీతాన్ని అందించాడు. “నా సినిమాకు సంగీతాన్ని ఎందుకు అందించలేదు?” అని నేను చనిపోయాక అల్లా అడుగుతాడనే భయంతో ఈ సినిమాకు సంగీతాన్ని స్వరపరిచాను అని రెహమాన్ స్వయంగా ఒక వివరణ ఇచ్చాడు. ఇప్పుడు సహృదయులయిన భారత ముస్లింలు చేయాల్సింది ఏమంటే మాజిద్ మాజిద్ సినిమాను కాపాడుకోవడం.

అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ (డానీ)
మొబైలు : 9010757776

హైదరాబాద్
18 సెప్టెంబరు 2015
ప్రచురణ  : ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ, 26 సెప్టెంబరు 2015






3 comments:

  1. You said that Mohammad opposed the killing of children but you didn't said that during those times a 10-11 year old was not considered a "Child".

    You didn't say how he ordered the destruction of various temples and statues in the cities like Mecca and Ta'if.

    You said that Mohammad opposed killing prisoners of war but you didn't said that after they were captured they were offered three choices - 1. convert to Islam, 2. accept dhimmi status and live as 2nd class citizens and 3. die.

    I read about Mohammed with references from Sahih Bukhari and I am sorry to say that I did not find those wars including beheading of 700 Jews or any of those wars apt to the current times.

    ReplyDelete
  2. "The Prophet passed by me at a place called Al-Abwa or Waddan, and was asked whether it was permissible to attack the pagan warriors at night with the probability of exposing their women and children to danger. The Prophet replied, "They (i.e. women and children) are from them (i.e. pagans)." I also heard the Prophet saying, "The institution of Hima is invalid except for Allah and His Apostle.""

    That's from Sahih Bukhari

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete