Wednesday, 6 May 2026

హిందూ సంఘటన – ముస్లిం విభజన - Hundi Unity and Muslim Division

 

*కాలధార*

*హిందూ సంఘటన – ముస్లిం విభజన*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు* 


 

ఇప్పుడు జరిగిన ఐదు రాష్ ట్రాల ఎన్నికల్లో బిజెపి బలపడుతుందని దాదాపు అందరికీ ముందే తెలుసు. తమిళనాడులో  బిజెపి కాలుమోపడానికి జాగా దొరకదనీ తెలుసు. డియంకే ఓడిపోయి టివికే ఆధిక్యాన్ని సాధిస్తుందని ఊహించకపోవచ్చుగానీ, దక్షణాది రాజకీయాల్లో క్రైస్తవ నేపథ్యంవున్న జోసెఫ్ విజయ్ ముందుకు దూసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం.

 

సమాజాన్ని మార్చడానికి సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నవారూ వున్నారు. వాళ్ళకు పార్లమెంటరి ఎన్నికలతో ఎలాగూ పనిలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్న రాజకీయ పార్టీలు దేశంలో అనేకం వున్నాయి. అవి ఇతర సందర్భాల్లొ పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఎన్నికలప్పుడే మేల్కొని కొన్ని రోజులు కొంచెం హడావిడి చేస్తాయి. ఇంతటి బద్దకస్తులతో రాజకీయాల్లో మార్పురాదు.

 

 బిజెపి అలాకాదు; దానికి ఎన్నికలనేవి 27x7x56. ఎన్నికల్లో బిజెపి వరుస విజయాలు సాధించడానికి ఇదొక ప్రధాన కారణం. అన్నింటికన్నా గొప్పది బిజెపి ఎంచుకున్న ఎన్నికల ఎత్తుగడ. హిందూ సంఘటన – ముస్లిం విభజన.

 

దేశంలో మెజారిటీ సమూహమైన హిందూ సమాజాన్ని తన ఓటు బ్యాంకుగా బిజెపి ఎంచుకుంది. అందులో అందరూకాకున్నా సగం మంది సానుకూలంగా స్పందించినా అధికారంలోనికి రావచ్చు; అధికారాన్ని కొన సాగించవచ్చు అని దానికి అర్ధం అయిపోయింది.  గత మూడు లోక్ సభ ఎన్నికల్లో దానికి 40 శాతం లోపే ఓట్లు వచ్చాయి. అయినా అధికారం దక్కుతోంది. అంచేత అది ‘హేట్ ముస్లిం’ నినాదాన్ని వదులుకోదు. అది దాని ప్రాణరక్షణ మందు. ప్రతి అంశానికి జిహాద్ పనే పదాన్ని ఒక తిట్టుగా చేరురుస్తుంది.

 

అలా బిజెపి ఒక కంఫర్ట్ జోన్ లో కొనసాగుతున్నప్పటికీ దానికో ఇబ్బంది వుంది. హేట్ ముస్లిం నినాదం వల్ల బిజెపికి 40 శాతం ఓట్లు పడ్డా బయట 60 శాతం ఓట్లు వుండిపోతాయి. వాటిని విపక్ష పార్టి ఏదైనా లాక్కో గలిగితే  బిజెపి పునాదులు కదిలిపోతాయి. అందువల్ల, విపక్షాలు ముస్లిం పక్షం వహించకుండ బిజెపి నిత్యం కొత్త వ్యూహాలు పన్నుతూనే ఉంటుంది. విపక్షాల మీద ‘ముస్లిం సంతుష్టీకరణ పార్టీలు’ అని నింద వేస్తుంది. ఈ నింద మీద పడితే విపక్షాలు భయంతో వణికిపోతాయి. ముస్లిం అనే పదాన్ని ఉచ్చరించడానికే భయపడి పోతాయి. ముస్లింలను బిజెపి దగ్గరకు తీసుకోదు; విపక్షాలను దగ్గరికి తీసుకోనివ్వదు.

 

సాధారణంగా ఒక ఎన్నికల గుర్తు మీద ఒక పార్టి మాత్రమే  పోటీ చేస్తుంది.  బిజెపి ఎన్నికల గుర్తు అయిన కమలంను గెలిపించడానికి అనేక పార్టీలు ఏకం అవుతుంటాయి. వాటిల్లో ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ పేరు బాగా వెలిగింది. ‘ఎస్ ఐ ఆర్’ పేరుతో ముస్లింలకు దాదాపు  ఓటు లేకుండా చేసేసింది.  ఆపైన   న్యాయాస్థానాలు కూడ తమవంతు  భక్తిని ప్రదర్శించుకున్నాయి.

 

ఇందిరాగాంధీ కూడా నిరంకుశ పోకడలకు పాల్పడ్డారనేది వాస్తవం. అయితే, రాజ్యాంగ వ్యవస్థల్ని ఇప్పటి స్థాయిలో ఆమె వాడలేదు. ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు 1975లో రద్దు చేసింది. తీర్పు వల్ల ఆమె ప్రధాని పదవే ప్రమాదంలో పడింది. దీనినే ఎమర్జెన్సీకి విధింపుకు తక్షణ ప్రేరణగా భావిస్తారు. ఇప్పటి కోర్టులకు ప్రధానిని తప్పుపట్టే సామర్ధ్యం వుందా? అని ప్రశ్నించుకుంటే లేదనేదే సమాధానం అవుతుంది.

 

మార్చి నెలలో ఓ ముస్లిం కుటుంబం రంజాన్ ఉపవాసాల ఇఫ్తారీ విందును కాశీలో గంగానది మీద ఒక బోటులో జరుపుకుంది. ఈ సంఘటన మీద బిజెపి యువజన విభాగం నేత ఒకరు ఆ కుటుంబం మీద కేసు పెట్టారు. మిగిలిన ఆహారాన్ని నదీలో పడేసి జలాలను కలుషితం చేశారనీ, దీనికి సంబంధించిన వీడియోలను ప్రసారం చేసి దేశవ్యాప్తంగా  హిందువుల మనోభావాలను గాయపరిచారనీ, తద్వార పెద్దఎత్తున  మతకల్లోలాలను రెచ్చగొట్టేందుకు కుట్ర చేశారనేవి ప్రధాన ఆరోపణలు. ఆ బృందానికి ఇప్పటి వరకు బెయిల్ కూడ దొరకలేదు. మతకల్లోలాలను రెచ్చగొట్టే కేసుల్లో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానాలు తేల్చి చెప్పేశాయి. ఈ కేసును ప్రధాని పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

నిజానికి గంగా నదికి ఇరువైపులా వున్న గ్రామాలు, పట్టణాలు, నగరాల మురికినీటిని గంగానది లోనికే వదిలేస్తుంటారు. టూరిస్టు బోట్ల మీద మందు పార్టీలు జరగడం కూడ సర్వసాధారణం. అలాంటప్పుడు ముస్లిం కుటుంబాన్ని మాత్రమే ఎందుకు శిక్షిస్తున్నారంటే ఒక విచిత్ర సమాధానం ముందుకు వచ్చింది. మురికినీళ్ళు, మందు పార్టీలవల్ల ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినలేదు. కానీ, అదే పనిని ముస్లిం కుటుంబం చేసినపుడు ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఆ వివరణ.

 

ఈ పరిణామాలు ఇంతటితోఆగలేదు. ముస్లింలతో ఎంతటి సాన్నిహిత్యం వున్నాసరే వాళ్ళను పెళ్ళిళ్ళు, పండుగలు, శుభకార్యాలకు ఆహ్వానించరాదని అనధికార హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ముస్లింల రాకను నివారించడానికి పందుల్ని వాడేంత వరకు అభివృధ్ధి చెందింది  పరిస్థితి. అనేక వేడుకల్లో పందుల్ని భాగం చేస్తున్నారు. గోమూత్రం, ఆవుపేడలకు పందుల ప్రేమ  అదనపు ఆకర్షణ.

 

మూర్ఖులు, నేరస్వభావం కలిగినవాళ్ళు అన్ని సమూహాల్లోనూ వుంటారు; భారత ముస్లింలలోనూ వుంటారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం వుండాల్సిన అవసరం లేదు. కానీ ఒక ముద్ర వేసేముందు ఎవరిలో ఎంత శాతం అనేది తేల్చుకోవాలిగా? భారతదేశంలో ఏటా 30 వేలకు పైగా మానభంగాల కేసులు నయోదవుతున్నాయని ఎన్ సిఆర్ బి అధికారికంగా ప్రకటించింది. ఆ కేసుల్లో ఆరోపితుల పేర్లను పరిశీలిస్తే వాళ్ల మతం తెలిసిపోతుంది. వాళ్ళలో ముస్లింలు 14 శాతం కన్నా ఎక్కువ వున్నారా? తక్కువ వున్నారా?  ఒకసారి పరిశీలిస్తే పోలా? ఢిల్లీ నిర్భయా (2012), జమ్మూకశ్మీర్ కథువా  (2018), హత్రాస్  (2020), ఉన్నావ్ (2017), శక్తిమిల్ గ్యాంగ్ రేప్ (2013) కేసుల్ని అందరూ మరచిపోయారా? అలాగే భార్యా హంతకుల కేసుల గణాంకాల్ని సహితం మత  ప్రాతిపదికన  వర్గీకరించాలి. అత్యధికులు ఎవరూ? అనేది తేల్చాలి. అలాగే బహుభార్యత్త్వాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం జరుగుతున్నది. సహజీవనం చట్టబధ్ధం అయ్యాక బహుభార్యత్త్వాన్ని ఎవరు ఎంచుకుంటారూ?

 

ఎన్నికల్లో 60 శాతం ఓట్లు బిజెపికి వ్యతిరేకంగా పడుతున్నాయన్నది వాస్తవం.  లెఖ్ఖల ప్రకారం 4కన్నా 60 ఎక్కువ. అయినప్పటికీ విపక్షాలు ఓడిపోతున్నాయి. కారణం వాటి మధ్య సిధ్ధాంతపరమైన ఐక్యత లేదు. లేదా వాటి ఐక్యతకు సిధ్ధాంతపరమైన పునాదిలేదు. అది ఏర్పడనంతకాలం ఇండియా బ్లాక్ అనేది ఒక పీతల గంపలా మాత్రమే వుంటుంది. తాము ఎందుకు గెలిచారో గెలిచినవాళ్ళకు స్పష్టంగా తెలుసు. తాము ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలని ఓడిపోయినవాళ్ళు అనుకోరు. వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, మాయావతి, రాహుల్ గాంధీ  అందరూ ప్రధాని పదవికి అర్హులే. కానీ, ఆ పదవి ఒక్కరికే దక్కుతుందనే స్పృహ వాళ్ళలో రానంత వరకు  ఎన్నికల ఫలితాలు ఇలానే వస్తుంటాయి.

 

అన్నీ మారిపోతున్నట్టే ఎన్నికల రాజకీయాలు కూడ మారిపోయాయి. గతంలో ముందు దేశాధినేతలు ఆ వెనక పారిశ్రామిక వేత్తలు వుండేవారు. దేశాధినేతలు, పారిశ్రామిక వేత్తలు చెట్టాపట్టాలేసుకు తిరిగిన రోజులు కూడ వున్నాయి. ఇప్పుడు ముందు పారిశ్రామిక వేత్తలు వారి వెనుక దేశాధినేతలు నడుస్తున్నారు. ఈ మార్పు ఇంటాబయటా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయం, ఆర్ధికం ఇక ఎంత మాత్రం రెండుకావు; ఆ రెండూ ఒకటే. ప్రజల్లో మతోన్మాదాన్ని క్రమం తప్పకుండా ఎక్కిస్తున్నంత కాలం దేశానికి గడ్డుకాలం తప్పదు.

 

దీని అంతటి సారం ఏమంటే, ఒక రాజకీయార్ధిక ఎజెండా మన సామాజిక జీవితాలతో ఒక కౄరమైన క్రీడను సాగిస్తోంది.

 

05-05-2026