వాళ్ళు బేషరతుగా లొంగిపోయారు
- డానీ
జాతీయ బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడెల్లా ఆంధ్రప్రదేశ్ లో ఓ రాజకీయ వీధి నాటకం మొదలతూ వుంటుంది. దీన్ని ఓ వారం రోజులు ఆడుతారు. అందరూ ఆరితేరిన నటులు కావడాన తమ నటనా చాతుర్యంతో ఒక యుధ్ధం మొదలయిపోతున్నంత హడావిడి సృష్టిస్తారు. ఆ తరువాత, ఎవరి డేరాలు, కుర్చీలు బల్లలు, మైకులు వాళ్ళు
తీసుకుని ఎవరి దారిన వాళ్ళు మెల్లగా జారుకుంటారు.
పౌరాణిక పాత్రలు పుట్టినపుడు మంత్రసాని చేతుల్లో మొదలుకుని చచ్చేక చితి మీద శయనించే వరకు ఒకే మూసలో ప్రవర్తిస్తుంటాయి.
మినహాయింపు లేకుండా మన రాజకీయ నాయకులు అందరూ పౌరాణిక పాత్రలు వంటివారు. ఎవరి మూస వారిది. ఎంత హిచ్ కాక్, రామ్ గోపాల్ వర్మ సినిమా అయినా మొదటివారం ఉన్నంత ఉత్కంఠ, సస్పెన్సు రెండోవారం వుండదు!. ఏపీ రాజకీయ నాయకులు ఐదు కేంద్ర బడ్జెట్లుగా ఒకే నాటకం ఆడుతున్నారు. అంచేత, నాటకం మొదలు కాకుండానే ప్రజలు పాత్రల డైలాగుల్ని సహితం ముందుగానే చెప్పేస్తున్నారు.
అరుణ్ జైట్లి యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి ముందే ఏపీలో మూడు విషయాలు తెలిసిపోయాయి.
మొదటిది; ఇది కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్ అనేది. రెండోది, దేశంలో రగులుకుంటున్న రైతాంగ అసంతృప్తిని శాంతింపచేసే ప్రయత్నం చేస్తారనేది. మూడోది; అన్నింటికన్నా కీలకమైనది, ఏపీకి ఏమీ ఇవ్వరనేదీ. ఇందులో మూడోది చిత్రమైనదేగానీ ఏపీకీ ఏమీ ఇవ్వక పోయినా చంద్రబాబు ఏమీ చేయలేరనే అభిప్రాయం జనంలో బలంగా నాటుకుంది. ఢిల్లీని మించిన
రాజధాని నిర్మిస్తానని బహిరంగ సభలో ప్రకటించిన మోదీ మాట తప్పినా చంద్రబాబు, జగన్ నోరు మెదపలేని
స్థితి బహిరంగమే.
జాతీయ ప్రజాస్వామిక కూటమిలో టిడిపి కీలక భాగస్వామి. టీడిపి అధినేత చంద్రబాబుకు గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేసిన చరిత్ర కూడా వుంది. ఎందువల్లనో గానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అమరావతికీ ఢిల్లీకీ మధ్య దూరం రానురాను పెరుగుతూ వుంది. ఈ విషయం మీద అనేక కథనాలు ప్రచారంలో వున్నాయి.
జైట్లి బడ్జెట్ ను ప్రవేశ పెట్టగానే గ్రాండ్ నేరేటివ్స్ యధావిధిగా మొదలయిపోయాయి. బడ్జెట్ విదిలింపుల మీద చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో వున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి ఈ బడ్జెట్ మీద చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. వారి మనో భావాలను వారి అనుకూల మీడియా ‘టెలీపతి’ ద్వార తెలుసుకుని
కథనాలు ప్రచారంలో పెట్టింది.
స్క్రీన్ ప్లే ప్రకారం
బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుకు మోదీ ఎన్ని ఇచ్చారో వివరించారు. అందులో “చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబుకు మోదీ 19 అవార్డులు ఇప్పించారు’ అనే విషయాన్ని మరీ నొక్కి చెప్పారు.
ఇందులో ఒక సమంజసమైన తర్కం వుంది. ఎవరయినా చంద్రబాబును విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధిని అడ్డుకుంటున్నట్టే అనే తర్కాన్ని టిడిపీ శ్రేణులు కొంత కాలంగా బలంగా ప్రచారం చేస్తున్నాయి. దాని ప్రకారం, చంద్రబాబు కుమారుడికి ఏదైనా ఇచ్చి సంతృప్తి పరిస్తే ఆంధ్రప్రదేశ్ ను సంతృప్తి పరచినట్టేననేది
సోము వీర్రాజు తర్కం కావచ్చు.
ప్రత్యర్ధుల్ని బహిరంగంగా ఉరివేయాలనీ, కత్తీ ఢాలు పట్టుకుని యుధ్ధరంగం
లోనికి ఉరకాలనీ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజీ వెంకటేష్ కు చాలా సరదా. బీజేపీ పొగరు దించుతామనీ, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారనీ వారు ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో తక్కువగానూ, టివీల ముందు అతిగానూ కనిపించే చిత్తూరు యంపి నారమల్లి శివప్రసాద్ తాము కత్తులూ, ఢాళ్ళూ తీసి పదును పెట్టామనీ చంద్రబాబు ఆదేశించగానే కదనరంగంలోనికి దూకేస్తామని బీరాలు పలికారు.
పాత్ర ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ సంభాషణలు వారికోసం ప్రత్యేకంగా వున్నాయి. నిధులు తేలేకపోయినందుకు ఆయన చంద్రబాబును విమర్శిస్తారేగానీ నిధులు ఇవ్వనందుకు మోదీని ఏమీ అనలేరు.
నిజానికి కూడా చంద్రబాబు కేంద్రం నుండి
తెచ్చుకోవలసినవి తెచ్చుకోలేక పోయారు. పైగా ఏపీకి రావలసినవి చాలా వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక తరహా హోదాను కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని కేంద్ర సంకేతాలను ఇచ్చినపుడు వారు చాలా సంబరపడ్డారు. ప్రత్యేక తరహా హోదా ఆడపిల్లలాంటిదనీ,
ప్రత్యేక ప్యాకేజీ మగపిల్లాడు లాంటిదని గొప్పగా చెప్పుకున్నారు. “కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా?” అని మురిసిపోయారు. [సీమంతం కూడా జరిపినట్టున్నారు]. చంద్రబాబు తరచూ తనను తాను ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక విప్లవ సారధి అని చెప్పుకుంటూ వుంటారు. పురుషులు పురుడు పోసుకొనే దశకు
జీవశాస్త్రం ఇంకా అభివృధ్ధి కాలేదని వారికి సమాచారంలేదు.
నాటకం నియమాల ప్రకారం కథ క్లైమాక్సుకు చేరుతున్నప్పుడు కొంచెం ఉత్కంఠను పెంచాలి. ఆ నియమానికి లోబడి,
ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా చంద్రబాబు వివిధ పార్టీల జాతీయ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్టు పుకార్లు వినిపించాయి. ఇలాంటివన్నీ సాధారణంగా సియం పేషీ నుండే లీకుల రూపంలో బయటికి వస్తుంటాయి. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో టీడీపీ అధ్యక్షుడు మంతనాలు చేసినట్లు అలా ఒక లీకు బయటికి వచ్చింది.
అనేక పార్టీలు తాము ఎన్డీఏ భాగస్వాములమనీ,
బీజేపి మిత్రపక్షాలమనీ గొప్పగా చెప్పుకుంటుంటాయి గానీ నిజానికి సిబిఐ, ఇడి, ఈసీ, ఆర్బీఐ లను మోదీ తనకు నమ్మకమైన మిత్రులుగా భావిస్తుంటారు.
ఈ జాబితాలో సుప్రీం కోర్టు కూడా వుందని కొందరి అభిప్రాయం.
సిబిఐ భయం వున్నంత కాలం చంద్రబాబు, జగన్ ఎన్నడూ యుధ్ధం కాదుకదా మోదీ మీద ఒక్క పరుష పదాన్ని కూడా వాడలేరని ఏపీలో ఇప్పుడే పుట్టిన పసిపిల్ల కూడా చెపుతుంది.
నిజానికి ఈ విషయాన్ని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టి సమావేశంలో చంద్రబాబే స్వయంగా చెప్పారట. కేంద్రంపై ఒత్తిడి తెస్తే కేసులు పెడతారని కొందరు అంటున్నారని, తాను వేటికీ భయపడేది లేదని వారే అన్నారట. సమావేశంలో మోదీ మీద అమీతుమీ యుధ్ధానికి చంద్రబాబు జెండా ఊపేస్తున్న దశలో ఒక పక్క కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్, మరోపక్క మోదీ ఆత్మీయ మిత్రుడు, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
ఫోన్ చేసి వివాదాన్ని చల్లబరచారని ఇంకో లీకు వచ్చింది. దానర్ధం ఏమంటే చంద్రబాబు మొదలెట్టబోయిన యుధ్ధాన్ని మరోసారి వాయిదా వేశారని!. వచ్చేది ఎలాగూ ఓట్ -ఆన్ -అకౌంట్ బడ్జెటే కనుక మోదీ ప్రభుత్వానికి సంబంధాంచి ఇదే ఐదవ బడ్జెట్; ఇదే చివరి బడ్జెట్. మోదీ చివరి బడ్జెట్ తరువాత కూడా చంద్రబాబు మొదటి యుధ్ధం మొదలెట్టలేదు. దీని అర్ధం ఏమంటే, ప్రత్యేక హోదానే కాకుండా పోలవరం, అమరావతి నిర్మాణాలు
కూడా ప్రశ్నార్ధకం అయ్యాయి. చంద్రబాబు చిత్తశుధ్ధి కూడా బోనులో నిలబడింది. ఉద్దావ్ థాక్రే, రాజ్
నాథ్ సింగ్, అమిత్ షాలతో చంద్రబాబు ఫోన్ సంభాషణలు చేశారనడం ఎంత వాస్తవమో? ఎంత కల్పనో
కూడా మనకు తెలీదు.
సాధారణంగా బడ్జెట్ రూపకల్పన సమయంలో మంత్రివర్గ సూచనలు తీసుకుంటారు, కూటమి గాబట్టి భాగసామ్య పక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. మోదీ ఈ లాంఛనాన్ని పాటించారో లేదో తెలీదు. అయితే, తెలుగు దేశం పార్లమెంటరీ పార్టి సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల వ్యవహార శైలి కొన్ని అనుమానాలకు తావిచ్చింది. సీనియర్ మంత్రి పి. అశోక్ గజపతిరాజు అసలు సమావేశానికే రాలేదు. జూనియర్ మంత్రి వై. సుజనా చౌదరి మాత్రం
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తును వదులుకోవడం సాధ్యం కాదనీ,
ఆ పార్టీతో ఘర్షణ పడలేమనీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రాలేమనీ వివరించారు. వెరసి తాము బేషరతుగా లొంగిపోయామని
తేల్చి చెప్పారు.
(రచయిత సీనియర్ జర్నలిస్టు)
మొబైల్
9010757776
హైదరాబాద్
5 ఫిబ్రవరి 2018
ప్రచురణ :
బీబీసి – తెలుగు 7 ఫిబ్రవరి 2018
https://www.bbc.com/telugu/42966391
No comments:
Post a Comment