కాశ్మీర్ నెహ్రు మానస పుత్రిక !
- డానీ
పట్టించుకోవాల్సిన కీలక విషయాలను మనం
తరచుగా పట్టించుకోము; పట్టించుకోవాల్సిన అవసరం (అంతగా)
లేని అంశాలను మాత్రం చాలా తీవ్రంగా పట్టించుకుంటాము.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 7న
రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నపుడు కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా
చౌదరీ గట్టిగా నవ్వడం మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ వ్యవహారం సభా హక్కుల తీర్మానం
వరకు వెళ్ళింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014
లోని హామీల అమలుకు నిధుల కేటాయింపు కోరుతూ తెలుగుదేశం, వైయస్సార్ సీపీ సభ్యులు
వుభయసభల్లో విభిన్న పధ్ధతుల్లో నిరసన తెలుపుతున్న సందర్భం అది. వాళ్ల
నిరసనకు కాంగ్రెస్, టీఆర్ ఎస్ కూడా మద్దతు పలుకుతున్న సమయం అది. ఆరోజు కేంద్ర
ప్రభుత్వం ఏపీకీ ప్రత్యేక నిధులు, ప్యాకేజీలు ప్రకటిస్తుందని తెలుగు
ప్రజలు ఎదురుచూస్తుండగా ప్రధాని మైకు అందుకున్నారు. వారు తన ప్రసంగంలో అనేకానేక
అంశాలను ప్రస్తావించారు; ఏపీకి కొత్తగా నిధుల కేటాయింపు గురించితప్ప!
రేణుకా చౌదరి నవ్వుకు కారణమైన ఆధార్
కార్డ్ ప్రస్తావనకన్నా ఎన్నో రెట్లు కీలకమైన అంశాలు ఆరోజు ప్రధాని
ప్రసంగంలో వున్నాయి. బుధ్ధుని దమ్మపథం, బసవేశ్వరుని అనుభవ మంటపం, దేశవిభజన,
కాశ్మీ`ర్, పాకిస్తాన్, నెహ్రూ, పటేల్ వగయిరాలు అందులో వున్నాయి. గాంధీజీ,
అంబేడ్కర్, భారత రాజ్యాంగాల ప్రస్తావన నేరుగా లేకపోయినా వాటి మీద కూడా
ప్రధాని ప్రసంగంలో పరోక్ష వ్యాఖ్యలున్నాయి. ఇప్పుడు ఆలోచనాపరులు చర్చించాల్సింది
వాటి గురించి.
“సర్దార్ వల్లభ్ భాయి పటేల్ భారత తొలి
ప్రధాని అయ్యుంటే …. నా కాశ్మీరానికి చెందిన ఆ భాగం ఈరోజు పాకిస్తాన్ చేతుల్లో
వుండేదికాదు” అని స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ
మీద మోదీజీ ఒక తీవ్ర వ్యాఖ్యానం చేశారు. కాశ్మీరానికి చెందిన మొత్తం
భూభాగం భారత్ చేతుల్లో వుండేదని దాని అర్ధం.
“భారతదేశమునకు దక్షణమున కన్యాకుమారి,
ఉత్తరమున కాశ్మీరం సరిహద్దులు” అని పాఠాలు చదువుకుని ఉత్తేజితులైనవారికి
మోదీజీ ఉపన్యాసం మరింత ఉత్సాహాన్ని ఇచ్చివుండవచ్చు. మోదీజీ లక్ష్యం
కూడా అలాంటి సమూహాలను ఉత్తేజ పరచడమే. అయితే, చారిత్రక
వాస్తవ సంఘటనలు ప్రభుత్వాలు సెలబస్ గా పెట్టే పాఠ్యాంశాలకు అనువుగా
వుండవు. బ్రిటీష్ వాడు పోతూపోతూ భారత ఉపఖండాన్ని భారత్, పాకిస్తాన్
అనే రెండు దేశాలుగా విడగొట్టి రెండింటి మధ్య చిచ్చుపెట్టి వెళ్ళాడనేది ఇప్పటికీ
చాలా మంది నమ్మే విషయం. నిజానికి భారత స్వాత్రంత్ర్య చట్టం-1947 ద్వార భారత
ఉపఖండంలో బ్రిటీష్ ప్రత్యక్ష పాలనలోవున్న ప్రాంతానికేగాక, పరోక్ష పాలనలోవున్న
దాదాపు 570 సంస్థానాలకు సహితం స్వాతంత్ర్యం లభించింది. ఈ సంస్థానాలు స్వతంత్ర
దేశాలుగా కొనసాగడానికో, ఇండియాలోనో, పాకిస్తాన్ లోనో
విలీనం కావడానికో మూడు రకాల అవకాశాల్ని ఈ చట్టంలో
కల్పించారు. ఇవికాక, ఉపఖండంలో పోర్చుగీస్, ఫ్రెంచ్ కాలనీలు కూడా కొనసాగుతున్నాయి.
లేబర్ పార్టికి చెందిన ప్రధాని క్లెమెంట్
అట్లీ ప్రభుత్వం 1947 ఫిబ్రవరి 20న భారత స్వాత్రంత్ర్య చట్టాన్ని చేసింది. ఆగస్ట్
15ను అప్పాయింటెడ్ డేట్ గా నిర్ణయించారు. దీని మీద జులై 18న రాజముద్ర
పడింది. ఆ రోజు నుండే సంస్థానాలకు స్వాతంత్రం దక్కింది. దాదాపు అన్ని సంస్థానాలూ
భారత్ లో విలీనం కావడానికి అంగీకరించాయి. నిజాం, జునాగడ్, కాశ్మీర్ సంస్థానాలు
మాత్రం స్వతంత్రంగా కొనసాగడానికో, పాకిస్తాన్ లో విలీనం కావడానికో మొగ్గు చూపాయి.
నిజాం, జునాగడ్ సంస్థానాలకు పాకిస్తాన్ తో వాయు, జల మార్గాలు మాత్రమే వున్నాయి.
కాశ్మీర్ కు ఏకంగా భూమార్గమే వుంది.
డోగ్రా వంశానికి చెందిన హిందూ
రాజపుత్రుడయిన హరిసింగ్ అప్పుడు కాశ్మీర్ రాజుగా వున్నాడు.ప్రజల్లో అత్యధిక
ప్రజాదరణ కలిగిన నాయకుడైన షేక్ అబ్దుల్లా ప్రచారం చేస్తున్న సోషలిస్టు భావాల్ని
చూసి హరిసింగ్ భయపడ్డాడు. స్వతంత్ర భారత తొలి ప్రధాని కాబోతున్న
జవహర్ లాల్ నెహ్రువి కూడా సోషలిస్టు భావాలే. పైగా నెహ్రూకు షేక్ అబ్దుల్లా అత్యంత
సన్నిహిత మిత్రుడు. నిజాం సంస్థానంలో నవాబు ముస్లీం, ప్రజల్లో అత్యధికులు
హిందువులు అయినట్టు, కాశ్మీరంలో రాజు హిందువు ప్రజల్లో అత్యధికులు
ముస్లింలు. అయినప్పటికీ హరిసింగ్ పాకిస్తాన్ వైపే ముగ్గు చూపడం విశేషం.
ఇద్దరు సోషలిస్టులు ఏకమైతే తన రాజరిక అధికారం సాగదని భావించిన హరిసింగ్
ఇండియాకన్నా పాకిస్తానే తనకు మేలైన మిత్రుడని భావించాడు. ఆ దేశానికి ప్రధాని
కాబోతున్న లియాఖత్ అలీ ఖాన్ తో తొలి విడత చర్చలు కూడా జరిపాడు.
సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్ లో
విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి హోం మంత్రి వల్లభ్ భాయి పటేల్ కు
కాశ్మీర్ సంస్థానం మీద అంతగా ఆసక్తి వుండేదికాదు. నిజాం, జునాగఢ్ సంస్థానాలు భారత్
లో విలీనం అయితే కాశ్మీర్ ను పాకిస్తాన్ లో విలీనం చేసినా ఇబ్బందేమీ కాదనే
అభిప్రాయంతో పటేల్ వుండేవారు. భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ 1947 జూన్
నెలలో ఆరు రోజులు కాశ్మీర్ లో పర్యటించాడు. ఆ సందర్భంగా కాశ్మీరం
పాకిస్తాన్ లో విలీనం అయినా భారత్ దాన్ని మైత్రిభంగంగా
చూడదని హరిసింగ్ తో అన్నాట్టు ప్రత్యక్ష సాక్షులున్నారు. ఈ
విషయంలో పటేల్ తనకు గట్టి హామీ కూడా ఇచ్చారని మౌంట్ బాటెన్ అన్నాడట. అప్పట్లో
పటేల్ భారత త్రివిధ దళాల అధిపతిగా కూడా వున్నారు. మరోవైపు, లియాఖత్ అలీ ఖాన్ కు
కూడా ఎందువల్లనో కాశ్మీర్ విషయం మనసుకు ఎక్కలేదు.
మన జాతియోద్యమ నాయకులందరూ వలసవాద
యుగంలో రాజకీయార్ధిక శిక్షణ పొందినవారు. అంచేత వాళ్లలో సహజంగానే వలస దృక్పధం
వుంటుంది. వలసలకు ఆర్ధిక ప్రయోజనమే ప్రాధమికం. వల్లభ్ భాయి
పటేల్, లియాఖత్ అలీ ఖాన్ లకు కాశ్మీరంలో అలాంటి ఆర్ధిక ప్రయోజనం ఏదీ
కనిపించలేదు. కాశ్మీరంలో ఖనిజాలు, ఇతర వనరులు లేవు. జమ్మూ, కాశ్మీర్ లోయ తప్ప
మిగిలిన ప్రాంతాలు జనావాసానికి కూడా అనువైనవికావు. ఇంతటి జనాభా పెరిగిన తరువాత
కూడా ప్రస్తుతం లడాఖ్ ప్రాంతంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు ముగ్గురు మాత్రమే.
అప్పుడు అదికూడా లేదు. అంచేత వాళ్ళిద్దరి చూపు బంగారు గనులులాంటి హైదరాబాద్,
జునాగఢ్ మీదే వుంది.
కాశ్మీరం విషయంలో పటేల్ నిరాశక్తంగా
వుండడం మీద గాంధీజీకి అసంతృప్తిగా వుండేది. కాశ్మీరాన్ని భారత్ లో కలుపుకోవాలనేది
గాంధీజీ కోరిక. ముస్లింలు అత్యధికులుగా వున్న సంస్థానం భారత్ లో చేరితే మత
ప్రాతిపదిక మీద దేశవిభజన జరిగిందనే నిందను కొట్టిపడేయడానికి వీలుంటుందని మహాత్ముడు
ఆశించేవారు. నిజానికి కాశ్మీర్ ను నయాన్నో భయాన్నో భారతదేశంలో విలీనం చేసుకోవాలని
గట్టిగా భావించిన నేత నెహ్రు ఒక్కరే.
కాశ్మీర్ మీద నెహ్రుది కూడా వలస
దృక్పధమేగానీ అది ఆర్ధిక వలస దృక్పథంకాదు. ఆయనది సాంస్కృతిక వలస దృక్పథం. (మీరు
విన్నది నిజమే!. సాంస్కృతిక వలస పాలన అనేది కూడా ఒకటుంటుంది)
కాశ్మీరాన్ని నెహ్రు భారత దేశపటానికి కీరీటంగా భావించేవారు. అలా అనుకోవడానికి
వారికి బలమైన వ్యక్తిగత కారణం వుంది. నెహ్రూ పూర్వికులు కాశ్మీర్ పండితులు.
కాశ్మీరం భారత దేశపటానికి కిరీటం అయితే, భారత ప్రభుత్వ కిరీటం కాశ్మీర్ పండిట్ తల
మీద వుంటుందని వారు కవితాత్మకంగా పరవశించేవారు. అందుకే ప్రత్యేక పతిపత్తి,
జనాభిప్రాయ సేకరణ వంటి అనేక హామీలను ఇచ్చి అయినా సరే కాశ్మీరాన్ని
విలీనం చేసుకోవడానికి నెహ్రు సిధ్ధపడ్డారు. దానికి షేక్ అబ్దుల్లా
సహకారమూ, మహాత్ముని ఆశిస్సులూ గట్టిగా వున్నాయి.
పాకిస్తాన్ నిజాం, జునాగడ్ లను
కలుపుకోవడానికి పావులు కదపడంతో చిరాకెత్తిన పటేల్ కాశ్మీర్ ను కూడా పాకిస్తాన్ కు
దక్కనివ్వకూడదనుకోవడం ఆ తరువాతి పరిణామం. అప్పటికే కాశ్మీర్ పశ్చిమభాగం (ఆజాద్
కాశ్మీర్), ఊత్తరభాగం (గిల్గిట్ బాల్టిస్తాన్) పాకిస్తాన్
ఆధీనంలోనికీ, తూర్పున ఆక్సాయి చిన్, షాక్స్ గమ్ లోయ (ట్రాన్స్ కారాకోరమ్ ట్రాక్
) చైనా ఆధీనం లోనికి వెళ్ళిపోయాయి. ఈలోగా ఐక్య రాజ్యసమితి రంగప్రవేశం
చేసి వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించేసింది. కాశ్మీర్ లోయ, జమ్మూ ప్రాంతం, లడఖ్,
సియాచిన్ హిమనీనదం మాత్రమే సాంకేతికంగా భారత దేశంలో విలినం అయ్యాయి. నెహ్రు
నిర్వహిస్తానన్న ప్రజాభిప్రాయ సేకరణ తరువాతి కాలంలో గాలికి కొట్టుకుపోవడంతో
కాశ్మీర్ లోయలో స్వయం నిర్ణయాధికార పోరు తలెత్తింది.
గాంధీజీ పటేల్ ఇద్దరూ గుజరాత్ కు
చెందిన వారే. కాంగ్రెస్ లో పటేల్ కు ఎంత బలం వుందీ? నెహ్రూకు ఎంత బలం వుందీ?
అన్నది ప్రశ్నేకాదు. ఆ రోజుల్లో గాంధీజీ అభిప్రాయం ఏమిటీ అన్నదే
ముఖ్యం. పటేను పక్కన పెట్టి గాంధీజీ నెహ్రూను ఎందుకు ప్రధాన మంత్రిని
చేశారన్నది చర్చిస్తే బాగుంటుంది. మోదీజీ గాంధీజీ పాత్రను వదిలిపెట్టి నెహ్రూ మీద
దండయాత్ర చేయాలనుకోవడం కేవలం రాజకీయం.
నెహ్రు ప్రజాస్వామికవాదిగా,
లౌకికవాదిగా, సామ్యవాదిగా ప్రసిధ్ధి చెందారు. అదంతా బూటకపు ప్రచారమని చెప్పడానికి
కాశ్మీరే చాలా పెద్ద ఉదాహరణ. నెహ్రును విమర్శించాలనుకుంటే కాశ్మీర్ ప్రజలకు జరిగిన
అన్యాయాన్ని మోదీజీ ఉటంకిస్తే బాగుండేది. వారు అలా చేయలేదు.
నెహ్రూకన్నా ముందే భారత సమాజంలో ప్రజాస్వామిక సాంప్రదాయాలు వున్నాయని చెప్పడానికి
ప్రయత్నించారు. ఈ సందర్భంగా బుధ్ధుని ధర్మపథాన్నీ, బసవేశ్వరుని అనుభవ మంటపాన్నీ
ఉదహరించారు. రాజ్యంగం ద్వార ప్రభుత్వ పాలన ప్రజాస్వామికంగా మారిందనే అభిప్రాయాన్ని
కూడా మోదీజీ తప్పుపట్టదలిచారని పిస్తోంది. ఆ విధంగా వారి విమర్శ
నెహ్రూకే పరిమితంకాదు; అంబేడ్కర్ కు కూడా వర్తిస్తుంది.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ
విశ్లేషకులు)
హైదరాబాద్
14 ఫిబ్రవరి
ప్రచురణ : మన తెలంగాణ , ఫిబ్రవరి 16, 2018
http://epaper.manatelangana.news/1545618/Mana-Telangana-City-Main/16-02-2018#page/4/2
No comments:
Post a Comment