Master, Guide and Friend
మా గురువుగారు ఎం. ఎల్. కాంతారావుగారు
మా గురువుగారు ములుముడి లక్ష్మీ కాంతారావుగారు చనిపోయారని అలనాటి నా సహద్యోగి అబ్దుల్ రబ్ నిష్టార్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఎంత బాధగా వుందో చెప్పలేను. గురువునేకాదు ఒక మంచి స్నేహుతుడిని కోల్పోయాను. చనిపోయి మూడు రోజులయిందట. అంతిమసంస్కారాలు నెల్లూరు జిల్లాలో జరిగాయట. లేకుంటే ఈ క్షణం విజయవాడ వెళ్ళిపోయేవాడిని. నాకో గొప్ప సలహాదారుడ్ని, శ్రేయోభిలాషిని కోల్పోయాను.
ఉద్యమ హోల్ టైమర్ జీవితం నుండి బయటికి
రావాలని 1981 ఏప్రిల్ చివర్లోలో నిర్ణయించుకున్నాను. దానికి కారణాలను
చెప్పడానికి ఇది సందర్భం కాదు. ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి కాల్పులు జరిగాయి. మే 1న వరంగల్
లో రాడికల్ యూత్ లీగ్ మహాసభలు జరిగాయి. అదే రోజున విజయవాడలో నా జూలియస్ ఫ్యూజిక్ పుస్తకం
విడుదల అయ్యింది. మే 2న నేను ఒక శ్రేయోభిలాషి ద్వార ఆటోమోబ్సైల్స్ లో ‘వసంత గ్రూపు’
యజమాని గారపాటి వెంకయ్యగారిని కలిశాను. వారు నన్ను ఉమా ఆటో ఏజెన్సీకి పంపించారు. అది
కూడా వసంత గ్రూపు అనుబంధ సంస్థ. అలాంటి అనుబంధ
సంస్థలు వారికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఓ పది వరకు వుండేవి.
ఉమా ఆటో ఏజెన్సీలో గారపాటి విజయ్ కుమార్ గారు మేనేజింగ్ పార్టనర్. అయితే వారెప్పుడూ
‘ఉమా’ లో వుండేవారుకాదు. వేరే ఆఫీసులో వుండేవారు.
జీయల్ ప్రసాదరావు, సుధాకర్, కాంతారావుగార్లు
ఉమాలో వర్కింగ్ పార్టనర్లు. కాంతారావుగారు మానవ వనరుల విభాగాన్ని కూడా చూసేవారు. వారే నన్ను ఇంటర్వ్యూ చేశారు. పైగా వారు
నా జనరల్ నాలెడ్జ్ ను పరీక్షించడానికి ఇంగ్లీషులో
ఓ రిటెన్ టెస్ట్ పెట్టారు. నేను అలాంటి టెస్ట్ ఒకటి రాయాల్సి వస్తుందని అనుకోలేదు.
కానీ, ఆ పూట నేను సెలెక్ట్ అయితీరాలి. ఆ సాయంత్రానికి నాకు తిండి లేదు. ప్రతి అక్షరం
నా భవిష్యత్తు అన్నట్టు ఆన్సర్లు రాసి ఇచ్చి ఆ ఆఫీసు బయటే తచ్చాడుతున్నాను. ఓ అరగంట
తరువాత లోపలికి పిలిచారు. కేంద్రపాలిత రాష్ట్రాల గురించి అడిగిన ప్రశ్నలో దాద్ర- నగర్
హవేలీని మర్చిపోయానన్నారు. మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాశానన్నారు.
“డిజిల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ల గురించి తెలుసా? “ అని అడిగారు.
“ఆటోనగర్ లో చెత్తకుప్పల దగ్గర చూశాను. మడ్డి ఆయిల్ లో తడిచి వుంటాయి. వాటి
ఫంక్షనింగ్ గురించి తెలీదు. కానీ, నేను ఒక మెకానిక్ కొడుకుని. మిషైనరీకి సంబంధించి
ఏ ప్రాడక్టును అయినా సలభంగా దాని ఫంక్షనింగ్ ను తెలుసుకోగలను” అన్నాను.
“ఆర్ యూ కాన్ఫిడెంట్ ? “ అని అడిగారు.
“యస్. ఐ యామ్” అన్నాను.
సెలెక్ట్ అయిపోయాను. ఢిల్లీకి చెందిన స్టీల్ బర్డ్ ఇంటర్నేషనల్ ప్రాడక్స్ ప్రమోషన్ విభాగంలో
నన్ను వేశారు. అప్పట్లో ఆ సంస్థకు ఒరిస్సా.
ఆంధ్రా పంపిణీదారుగా ఉమా ఆటో ఏజెన్సీ వుండేది.
సాధారణంగా మార్కెటింగ్ విభాగంలో ఎవర్నీ చేర్చుకున్నా ప్రాడక్ట్ నాలెడ్జ్ కోసం
ఫ్యాక్టరీకి పంపి ఓ పదిరోజులు ట్రైనింగ్ ఇస్తారు. తొలి పరిచయంలోనే కాంతారావుగారికి
నా మీద ఎంత నమ్మకం ఏర్పడిపోయిందంటే మరునాడే డ్యూటీలో చేరాలన్నారు. ప్రాడక్ట్ ట్రైనింగ్ లేకుండా లైన్ కు వెళ్ళిపొమ్మన్నారు.
నన్ను ట్రయల్ గా ఏలూరు పంపించారు. పాస్ మార్కులతో
తిరిగి వచ్చాను.
మిర్యాలగూడతో నా అసలు టూర్ మొదలయింది. ఇందులో చిన్న చిట్కా వుపయోగించాను. ఆటో
మోబైల్స్ లో డీలర్, మెకానిక్కులే కీలకం. నేను
నా ఫస్ట్ డీలర్ కు దండం పెట్టి , “నేను ఈ రంగానికి కొత్త. ప్రాడక్టు గురించి కూడా
నాకు సరిగ్గా తెలీదు. కానీ బతకడానికి వచ్చాను. మీరు సహకరిస్తే మంచి సర్వీసు ఇస్తాను”
అన్నాను. అతని పేరు మూర్తి, బ్రాహ్మణుడు. అతనికి నేను తెగనచ్చేశాను. ముందు భోజనం చేద్దాం పదా అని ఓ మహిళా
మెస్సుకు తీసుకుని పోయాడు. తరువాత తను ఆర్డర్ పెట్టడమేగాక, టౌన్ లో మిగిలిన డీలర్లకు
కూడా ఫోన్ చేసి నన్ను సిఫారసు చేశాడు. నా పంట పండిపోయింది. అయితే మెకానిక్కులకు కూడా
ఒక మాట చెప్పాలని అతనే సలహా యిచ్చాడు. మిర్యాలగూడ ట్రాక్టర్ల మార్కెట్. అనేక షేడ్లున్నాయి. ఆ మెకానిక్కులందరికీ ఓ వస్తాదు మెకానికి వున్నాడని
మూర్తి చెప్పాడు. అతను ఆమోదిస్తే ఊర్లో మెకానిక్కులు అందరూ అదే వాడుతారు అన్నాడు.
ఆ వస్తాదు మెకానిక్ ఈ ముస్లిం. అతని
షెడ్డుకు వెళ్ళి సలాం చేసి బిడియం వదిలేసి నా పరిస్థితి చెప్పాను. అతను “ఫిల్టర్ కైసా కామ్ కర్తా మాలూమ్?” అనడిగాడు.
నేను బుధ్ధిగా తెలీదు అన్నాను. ఇంకో మెకానిక్
అయితే “తెలీకుండా ఇక్కడ ఈకలు పీకడానికి వచ్చావా?”
అనుండేవాడు. అసలే అతను వస్తాద్ మెకానిక్. అతను అలా అనలేదు. తను రిపేరు చేస్తున్న ట్రాక్టర్ బోయ్నెట్ ఎత్తి, ఆయిల్ ఫిల్టర్ యూనిట్ ను బయటికి తీశాడు.
ఏ పైపుద్వార మడ్డి ఆయిల్ లోపలికి వస్తుందో, అది ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఏ పైపు ద్వార బయటికిపోతుందో
అంతా వివరించాడు. అది నాకు క్లాస్ రూమ్ పాఠం కాదు, ల్యాబ్ పాఠం కూడా కాదు. ఆన్ ఫీల్డ్ ప్రాక్టికల్స్.
“గాడీకో డీజిల్ ఫిల్టర్, బాష్ (ఫ్యూయల్
ఇంజెక్షన్) పంప్ దిల్ హోతాహై, ఔర్ ఆయిల్ ఫిల్టర్ గుర్ధా హోతా హై” అన్నాడు.
“తో ఆప్ హార్ట్ అవుర్ కిడ్ని కే డాక్టర్ హోగయ్” అన్నాను కొంచెం పొగడ్తగా?
అప్పుడు అతను అసలుసిసలు మెకానిక్ గా
మారిపోయాడు. “ నేను నా బండ్లలో ఏదిపడితే ఆ ఫిల్టర్ వాడను. నువ్వే చెప్పావుగా డాక్టర్
అనీ” అనేశాడు.
“మా ఫిల్టర్ శ్యాంపిల్ చూడండి. బాగుంటేనే వాడండి”. అంటూ మా శ్యాంపిల్ ఇచ్చాను.
దాన్ని అతను చింపేస్తాను అన్నాడు. చింపేయండి అన్నాను. అతను నా డీజిల్ ఫిల్టర్
ను చింపేసి లోపలున్న మైక్రాన్ పేపర్ ను తీసి
గట్టిగా సిగరేట్ పొగ పీల్చి, ఫిల్టర్ కాగితం మీద గట్టిగా ఊదాడు. పొగ కాగితంలో నుండి బయటికి వచ్చింది.
అతను బాగానే పనిచేస్తున్నట్టు తలూపాడు.
“మీరు ఈమాటను మీ శిష్యులకు చెప్పండి. ఈ ఊర్లో అందరూ మీ శిష్యులే అని విన్నాను” అన్నాను.
మిర్యాలగూడ ట్రిప్ పెద్ద హిట్ కావడంతో రైట్ క్యాండిడేట్ దొరికాడని కాంతారావుగారు
ఆనందపడిపోయారు. అలా నేను కాన్ఫిడెంట్ గా మొదలయ్యి
వారికి కాన్ఫిడంట్ గా మారిపోయాను
అలా మొదలయింది మా అనుబంధం. కాంతారావుగారిది
నెల్లూరు సమీపాన ఓ చిన్న గ్రామం. వాళ్లనాన్నగారు అక్కడ గ్రామ కరణం. పాత పియూసి కదా ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడేవారు.
వారి ఇంగ్లీషు చేతిరాత చాలా అందంగా వుండేది.
నేను కూడా ఇంగ్లీషులో మాట్లాడడం వారికి చాలా నచ్చేది. వారం రోజుల్లో వారి చేతి రాత
స్ట్రోక్ ను నేను పట్టేశాను. చాలా తక్కువ రోజుల్లోనే మేము చాలా దగ్గర అయిపోయాము. నా
పని తీరు నచ్చడంవల్లనేమో నా తరువాత ఇంకో ఇద్దరు
ముస్లింలను స్టీల్ బర్డ్ విభాగంలో చేర్చుకుని శిక్షణ కోసం ఢిల్లీ పంపించారు.
ఏ ప్రాడక్ట్ అయినా మార్కెట్ లో నిలబడాలంటే నాలుగు అంశాలు కావాలి. క్వాలిటీ,
ప్రమోషన్, క్రెడిట్ ఫెసిలిటీ, హ్యూమన్ రిలేషన్స్. ఆటో మోబైల్స్ మార్కెటింగ్ లో మెకానిక్కులు
కీలకం. వాళ్ళ ఆమోదం లేకుండా ఏ ప్రాడక్టూ మార్కెట్ లో నిలవదు. నేను స్వతహాగా
ఒక మెకానిక్ కొడుకుని. మెకానిక్కుల్ని చాలా గౌరవంగా “డాక్టర సాబ్” అని పిలిచేవాడిని.
“ఆ డాక్టర్లు మనుషుల్ని ఆరోగ్యంగా వుంచుతారు. మీరు ట్రక్కుల్ని ఆరోగ్యంగా వుంచుతారు” అనేవాడ్ని. మిర్యాలగూడలో
నేర్చుకున్నదానికి నా తర్కాన్ని, భాషను ఉపయోగించి నా ప్రాడక్ట్ గొప్పతనాన్ని వివరించేవాడిని. వాళ్ళు
నా మాటల్ని గొప్పగా ఆస్వాదించేవారు.
మొదట్లో నాకు రాయలసీమ, తెలంగాణ అప్పచెప్పారు. మెకానిక్కులతో నా అనుబంధం పెరిగిపోవడంతో
స్టీల్ బర్డ్ కు మార్కెట్ ఆమోదం పెరిగిపోయింది. డీలర్లతో ఎలా డీల్ చేయాలో కాంతారావుగారి
దగ్గర మెళుకువలు న్డేర్చుకున్నాను.
నా హయాంలో స్టీల్ బర్డ్ అమ్మకాలు అనూహ్యంగా
అనేక రెట్లు పెరిగిపోయాయి. కార్పొరేట్ కంపెనీలయిన ‘మైకో’, ‘ప్యూరోలేటర్’ తో మాకు పోటీ.
రాయలసీమలో మైకో కన్నా స్టీల్ బర్డ్ ఎక్కువగా అమ్ముడయ్యేది. ఏదైనా కొత్త ప్రాడక్ట్ గురించి
నేను సిఫారసు చేస్తే రాయలసీమ మెకానిక్కులు ఆమోదిస్తారు అన్నంత పేరు వచ్చేసింది. సాటి
సేల్స్ మెన్ నన్ను అభిమానంతో ’రాయలసీమ కింగ్’ అనేవారు.
అయితే నావల్ల కంపెనీకి కొన్ని ఇబ్బందులూ వుండేవి. సాయంత్రం ఆఫీసు అవ్వగానే బస్
స్టాండ్ కు చేరుకుని ఏదో ఒక ఊరు వెళ్ళి ఓ బహిరంగ సభలో మాట్లాడాల్సి వచ్చేది. రాత్రికి
రాత్రి విజయవాడ తిరిగొచ్చి నిద్రపోకుండానే ఆఫీసుకు పోవాల్సివచ్చేది. కళ్ళు ఉబ్బిపోయి
ఎర్రగా వుండేవి. ఆఫీసులో కునికిపాట్లు పడుతుండేవాడిని. కొత్తలో నన్ను తాగుబోతు అనుకునేవారట.
నిజానికి అప్పటికి నాకు లిక్కర్ అలవాటు లేదు. చాలా అరుదైన సందర్భాల్లో నేనూ నిష్టర్ బీరు తాగేవాళ్లం. ఓసారి కాంతారావుగారు
పిలిచి అడిగారు. “నా కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేకపోవడంవల్ల నేను ఉద్యమాన్ని వదిలి
వచ్చేశాను సార్. కనీసం పబ్లిక్ మీటుంగులకైనా వెళ్ళకపోతే బాగుండదుకదా సార్” అన్నాను.
నేను నక్సలైట్ అని మొదటిసారి తెలిసినపుడు ఆయన
కంగారు పడ్డారు. అయితే నెల్లూరు జిల్లా వారు కావడాన జమీన్ రైతు పత్రిక్కి చందాదారుగా
వుండేవారు. అందులో కేవి రమణారెడ్డిగారి ప్రస్తావన
అప్పుడప్పుడు వస్తుండేది. నక్సలైట్లలో కొందరు
మంచివాళ్ళు కూడా వుంటారని వారు నెమ్మదించేవారు.
ఏ సమస్య వచ్చిన కాంతారావు గారిది ఒకటే
మాట “బట్ ఐ కెన్నాట్ అలౌ స్పాయిలింగ్ ద ఆఫీస్ డెకోరమ్. యూ షుడ్ టేక్ కేర్ ” అనేవారు.
“ఇట్స్ మై డ్యూటీ సార్” అనేవాడ్ని.
కాంతారావుగారి గొప్పతనం గురించి చాలా చెప్పవచ్చుగానీ సమయాభావంవల్ల కొన్నయినా
చెప్పాలి. నేను చేరిన అయిదు నెలల్లోనే జవహర్ లాల్ నెహ్రు యూనివర్శిటీ, విదేశీ భాషల
విభాగం చైనా రచయిత లూసన్ శతజయంతోత్సవాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లో లూసన్ గురించి
ఎక్కువగా చదివిన వాళ్ళలో అప్పట్లో నేను ఒకడ్ని. జేఎన్ యూలో వున్న రాడికల్ విద్యార్ధులు
ఆ విషయాన్ని డీన్ కు తెలపడంతో మూడు రోజుల ఉత్సవంలో
వక్తగా పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది.
ఇంగ్లీషు ఉపన్యాసం అయితే సిధ్ధం చేసుకున్నాను కానీ ఢిల్లీ వెళ్ళడం అంటే మాటలా?
మూడు రోజుల సదస్సు. మరో మూడు రోజుల ప్రయాణం. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. నా దగ్గర
అంత స్తోమత లేదు. కాంతారావు గారితో చెప్పాను. జేఎన్ యూ నుండి వచ్చిన ఆహ్వానాన్ని చూసి
వారు చాలా ఆనందించారు. “ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. అసలు నీ ఢిల్లీ ఖర్చు అంతా మన ఆఫీసే భరిస్తే ఎలా
వుంటుందో మిగిలిన పార్టనర్స్ ను అడుగుతాను” అన్నారు. మరునాడు వారే ఒక పరిష్కారం చెప్పారు.
“నీ ట్రైనింగ్ క్లాసులు పెండింగ్ లో వున్నాయి.
ఇప్పుడు నీకు టైనింగు అక్కర లేదు. అయినా నువ్వు ట్రైనింగ్ కోసం ఢిల్లీ వస్తున్నట్టు
స్టీల్ బర్డ్ కు చెపుతాను. ఆ ఖర్చంతా అటుపోతుంది. సెలవు నేనిస్తాను. నువ్వు జేఎన్ యూ
పని అయిపోయాక స్టీల్ బర్డ్ ఆపీసుకు వెళ్ళి ఆరోజే ఢిల్లీ వచ్చానని చెప్పు. అంత వరకు నీకు అయిన ఖర్చు మన ఆఫీసు ఇస్తుంది. ఒకవేళ
జేఎన్ యూ వాళ్ళు ప్రయాణ ఖర్చులు ఇచ్చారనుకో దాన్ని నువ్వు ఢిల్లీలో ఎంజాయ్ చేసేయి”
అన్నారు. ఇప్పుడు గుర్తుకు వస్తేనే కళ్ళమ్మట నీళ్ళొస్తున్నాయి. ఇంత మంచివాళ్ళ దగ్గర
నేను పనిచేశానా ? అని.
ఆఫీసు కరస్పాండెన్స్ అంతా కాంతారావుగారే చూసే వారు. అసలే కరణంగారబ్బాయికదా ఆయబ్న
ఉత్తరం రాస్తే పని అయిపోయేది. ఒకసారి ఉత్తరం రాయడంలో వున్న కిటుకు చెప్పారు. “మనం రాసే
ఉత్తరాలకు డిపార్టుమెంటువాళ్ళు ఏదో ఒక కొర్రి పెట్టి పక్కన పెడతారు. అంచేత ఆ కొర్రిని కూడా మనం ముందుగా ఊహించి దానికి
సమాధానం కూడా రాసేస్తే వాడు చేయక చస్తాడా?” అనేవారు. అలా నాకు ఆఫీస్ కరస్పాండెన్స్
లో కిటుకులు తెలిశాయి.
ఒకసారి ఢిల్లీ ఫ్యాక్టరీ నుండి పబ్లిసిటీ మెటీరియల్ గా బనీయన్లు వచ్చాయి. వాటి
మీద స్టీల్ బర్డ్ అనే అక్షరాలు అడ్డంగా చాలాపెద్దగా వున్నాయి. వాటిని ఆటోనగర్ లో గ్యారేజి
ఓనర్లకు ఇవ్వాలి. కానీ, విజయవాడ ఆటోనగర్ గ్యారేజి
యజమానులు చాలా సంపన్నులు. వాళ్ళు ఆ బనీయన్ల మీద తిరగరు. పైన చొక్కా వేసుకుంటారు. చొక్కా వేసుకుంటే పబ్లిసిటీ అవ్వదు. అప్పుడు నేనొక
ఆలోచన చేశాను. ఆ బనీయన్లను ఆటోనగర్ స్టాండ్స్
లో వుండే రిక్షా కార్మికులకు పంచేశాను. వాళ్ళయితే ఆ బనీయన్లనే తొడుక్కుని తిరుగుతారు.
బ్రాండ్ రిజిస్టర్ అయ్యి మనకు పబ్లిసిటీ వస్తుంది అనేది నా ఆలోచన.
ఉమా ఆటో ఏజెన్సీకి ఒకరిద్దరు స్లీపింగ్ పార్ట్నర్స్ కూడా వుండేవారు. వారిలో
ఒకరు సిటీలోని రిక్షా కార్మికుల వంటి మీద స్టీల్
బర్డ్ బనియన్లు చూశారు. కొందరికి ఎప్పుడూ మంచి ఆలోచనలు రావు. ఆ బనీయన్లను మేము రికాహావాళ్ళకు
అమ్ముకున్నామనే అనుమానాన్ని ఓ రోజు ఆయన ఆఫీసులో
వదిలారు. నా కొలీగ్ ప్రకాశరావు వచ్చి నాకు చెప్పాడు. నాకు చాలా అవమానంగా తోచింది. వెంటనే
ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తున్నాను అని అన్నాను. నాతోపాటే తామూ రాజీనామా ఇచ్చేస్తామని
నిష్టార్, ప్రకాశరావు అన్నారు.
మేము రాజీనామా విషయం యాజమాన్యానికి చెప్పడానికి ముందే కాంతారావుగారు స్టాఫ్
మీటింగు పెట్టారు. “పిలవని పేరంటానికి వచ్చినవాళ్ళు చెప్పే మాటల్ని మేము పట్టించుకోము. మీరూ పట్టించుకోవద్దు. రిక్షావాళ్ళు
డానీ సంఘంలో వాళ్ళేనని మాకు తెలుసు. వాళ్ళకు ఉచితంగా ఇచ్చాడనీ తెలుసు. దానివల్ల మంచి
పబ్లిసిటీ వచ్చిందని కూడా మా దృష్టికి వచ్చింది. ఆవేశపడిపోయి మీరేమీ రాజీనామాల ఆలోచనలు
చేయవద్దు” అన్నారు. మా ప్రకాశరావు చాలా పంతంగా వున్నాడు. వాడు రాజీనామా మాట వదలడం లేదు.
“నామాట వినండి. ఇక్కడ అందరం నాలుగు పైసల కోసం వెంపర్లాడుతున్న వాళ్ళమే. కానీ మనలో సమాజం గురించి ఆలోచించేవాడు కూడా ఒకడున్నాడు. We feel proud of Mr. Danny” అంటూ నా వైపు తిరిగి “మనం ఒక ఫ్యామిలీ. ఈ ఆఫీసు వదిలే
ఆలోచనలు చేయవద్దు” అని వెళ్ళిపోయారు. స్టాఫ్
నా వైపే చూస్తున్నారు. యాజమాన్యానికి నా మీద అంతటి అభిమానం వుందని అప్పటి వరకు నాకు తెలీదు.
1985 మొదట్లో ఒక సంఘటన జరిగింది. తెలంగాణలో నక్సల్స్ బందు సందర్భంగా విజయవాడలో
నన్ను ముందస్తు జాగ్రత్తగా అరెస్టు చేశారు. ఏదో సాంకేతిక సమస్య వచ్చి కోర్టులో హాజరుపరచకుండా రోజుకో పోలీసు స్టేషనులో పెట్టారు. నా అరెస్టును ఖండిస్తూ పేపర్లలో రోజూ వార్తలు వచ్చేవి.
ఇలా ఐదు
రోజుల తరువాత నన్ను విడుదల చేశారు. అప్పుడు కూడా యాజమాన్యం నన్ను ఏమీ అనలేదు.
మేనేజింగ్ పార్టనర్ గారపాటి విజయ కుమార్ గారు
యధాలాపంగా “ఇలాంటి వార్తలు వ్యాపారానికి ఇబ్బందికదా?”
అన్నారు ఒకరోజు. “నావల్ల సంస్థ గౌరవానికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ స్థితి రాకముందే
నేనే స్వఛ్ఛందంగా తప్పుకుంటాను” అన్నాను.
ఆ ఏడాది జులైలో కారంచేడు సంఘటన జరిగింది. అప్పుడు నేను విధి నిర్వహణలో భాగంగా
చిత్తూరు క్యాంపులో వున్నాను. ఆఘమేఘాలమీద చీరాల వెళ్ళాలని పీపుల్స్ వార్ రీజనల్ కమిటీ
నుండి ఆదేశాలొచ్చాయి. అప్పుడు నా దగ్గర ఆఫీసు క్యాష్, బ్యాంకు డ్రాప్టూలు, చెక్కులు,
ఆర్డర్ ఫారాలు వున్నాయి. ఆఫీసు సరంజామాతోనే
చీరాల వెళ్ళిపోయాను. అకడికి వెళ్ళాక అందులో మునిగిపోయాను. పోలీసు పికెట్ల మూలంగా ఆఫీసు
సూటు కేసును బయటికి తేవడం కుదరలేదు. ఆఫీసు దృష్టితొ చూస్తే నేను చేసింది నేరం. నేను
చీరాలలో వున్నానని వాళ్ళకూ తెలిసింది. పైగా,
యాజమాన్యం కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. మరొకరైతే ఆఫీసు డబ్బుతో అదృశ్యం అయిపోయానని కేసు పెట్టే అవకాశం వుంది.
‘వసంత’ వాళ్ళు మౌనంగా వుండిపోయారు; డానీ త్వరలో వస్తాడు అనే నమ్మకంతో.
ఓ 20 రోజుల తరువాత ఓ తెల్లారు జామున
రహాస్యంగా విజయవాడ వచ్చి నగదు, డ్రాప్టులు,
చెక్కులు, ఆర్డర్లు వున్న సూట్ కేసును నా మిత్రుడు కొల్లి సుబ్రహ్మణ్యానికి ఇచ్చి ఆఫీసుకు
పంపించి వేశాను. “ఇందులో ఆఫీసుకు సంబంధించినవి అన్నీ వున్నాయి. నగదు ఒక్క వెయ్యి రూపాయలు తగ్గింది.
అనివార్యమయి ఖర్చు చేశాను. దాన్ని నా జీతంలో కట్ చేయండి. నేను తప్పు చేశాను. కానీ,
నా కోసం చేయలేదు. అది మీకు తెలుసు. అయినా మీకు
చాలా ఇబ్బంది అయింది. అది నాకు తెలుసు. బాధ్యతగా
రాజీనామా చేస్తున్నాను. సేల్స్ కమీషన్ ఇతర
ప్రోత్సాహకాల రీత్యా నాకు వచ్చేవి ఏమైనా వుంటే నా భార్యకు అందజేయండి. ఇంతకాలం నన్ను మీలో ఒకడిగా చూసుకున్నందుకు
అనేక ధన్యవాదాలు ” అని ఒక ఉత్తరం జతచేశాను.
కొల్లి సుబ్రహ్మణ్యం ఆఫీసుకు వెళ్ళే సమయానికి మేనేజర్ వున్నారు. రాజీనామా లేఖతో
సహా ఆయనకు అన్నీ అప్పచెప్పి సుబ్రహ్మణ్యం వచ్చేశాడు. ఆ తరువాత కొంత సేపపటికి కాంతారావు గారు, గారపాటి విజయకుమార్ గారు ఆఫీసుకు
చేరుకున్నారట. “డానీ రాజీనామా పంపడం ఏమిటీ?” అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారట. “డానీ
ఎప్పుడొచ్చినా ఉద్యోగం అలాగే వుంటుందని కబురు పంపండి” అని ఒక ఆర్డరు వేసి విజయకుమార్
గారు వెళ్ళిపోయారట.
అప్పుడు డానీ ఎక్కడున్నాడో డానీ భార్యకే తెలీదు. ఆఫీసు వాళ్లకు ఎలా తెలుస్తుందీ?
మొత్తానికి ఒక జర్నలిస్టును పట్టుకుని ఆ కబురు నాకు చీరాలలోని విజయనగర్ శిబిరానికి చేర్చారు.
(అదీ మా కాంతారావుగారంటే. వారి గురించి ఇంకా చెప్పాలి గానీ, అర్జంటు పని మీద
బయటికి వెళ్ళాలి. మిగతా భాగం రేపు.
కాంతారావుగారి గ్రూపు ఫొటో ఒకటి వుండాలి. ఇప్పుడు కనిపించడంలేదు. దాన్ని వెతకాలి.
ఈ లోపులో రెడ్ లేబుల్ ఫొటో పెట్టాను. రెడ్ లేబుల్ తో కాంతారావు గారికి నాకూ సంబంధం ఏమిటో రేపు చెపుతాను. )
(ఇంకా వుంది)
కారం చేడు ఉద్యమం ముగిశాక నేను ఏఐఎల్ ఆర్ సీ సభలకు సింద్రీ వెళ్ళాను. ఆ తరువాత ఓ రోజు ఆఫీసుకు వెళ్ళి ఏమీ జరగనట్టు నా
సీట్లో కూర్చున్నాను. యాజమాన్యంలో ఎవరూ నన్ను ఏమీ అడగలేదు. ఆఫీసు ఆర్ధిక వ్యవహారాలు
చూసే జీఎల్ ప్రసాదరావుగారు “భలే వాడివోయ్ నువ్వు’ అని ఒక నవ్వు నవ్వేరు. అంతే.
నేను లేనపుడు ఆఫీసులో కొన్ని మార్పులు జరిగాయి. రాయలసీమ రీజియన్ ను నాకే వుంచి,
తెలంగాణ రీజియన్ ను మరొకరికి ఇచ్చారు. నాకు అదనంగా ఒరిస్సా బాధ్యతలు ఇచ్చారు. స్టీల్
బర్డ్ సంస్థ ఫిల్టర్లతో పాటు హెల్మెట్లు కూడా ఉత్పత్తి చేసేది. సరిగ్గా ఆ సమయంలో ఒరిస్సాలో హెల్మెట్లు తప్పనిసరి
చేశారు. ఒక్కసారిగా వెల్లువలా వచ్చిన డిమాండ్ ను తట్టుకోవడం కంపెనీవల్ల కాలేదు. నేనూ,
నిష్టార్ మరెవ్వరికీ సాధ్యం కానంతగా కష్టపడ్డాం. ట్రక్కుల్లో లోడింగు అన్ లోడింగు పనులూ
మేమే చేసేశాం. ఆ వెంటనే ఆంధ్రాలోనూ హెల్మెట్
తప్పనిసరి చేశారు. సేల్స్ కమీషన్ల రూపంలో చాలా
డబ్బులు వచ్చి పడిపోయాయి. కారంచేడు ఉద్యమంలో పాల్గొన్న కారణంగా ఆగిపోయిన మా ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసేశాను.
అంతా బాగున్నప్పటికీ నా మీద కొన్ని విమర్శలు ఎప్పుడూ వుండేవి. అనేక మంది నా
మీద యాజమాన్యానికి పితూరీలు చెపుతుండేవారు. అయితే సేల్స్ ఫిగర్స్ చాలా గొప్పగా వుండడంతో
మిగిలిన విషయాలను మేనేజ్ మెంట్ పెద్దగా పట్టించుకునేదికాదు.
హొటల్ రూముల్లోనే ఎక్కువ సేపు పుస్తకాలు చదువుకుంటూ వుండిపోతున్నాననీ, హొటల్ రూము నుండి బయటికి వచ్చినా
ఆ టౌన్ లోని స్నేహితులతో గడుపుతున్నాననీ,
ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టూర్ చేయడం లేదనేవి నా మీదున్న విమర్శలు. ఎవరా స్నేహితులూ
తిరుపతిలో త్రిపురనేని మధుసూదనరావు, కావలిలో కేవి రమణా రెడ్డి,
వరంగలులో వరవరరావు, సంబల్ పూర్ లో ఆర్ ఎస్
రావు. వాళ్లు నాకు గురువులు. నా ఆఫీసు టూర్లని అలా వాడుకునేవాడిని. ప్రయాణం ఆనందం మాత్రమే
కాదు జ్ఞానం కూడా. అప్పట్లో నేను టూర్లలోనే
కథలు, వ్యాసాలు రాసేవాడిని.
నేను చిత్తూరులో వుండాల్సిన రోజున గుడివాడ బహిరంగ సభలో ప్రసంగించినట్టు పత్రికల్లో
వార్తలు వస్తే ఆఫీసు వాళ్ళకు ఎలా వుంటుందీ? “సార్! జర్నలిస్టులు నా ఫ్రెండ్స్. నేను
సభకు రాకపోయినా అభిమానంతో నాపేరు అలా రాసేస్తున్నారు” అని తప్పించుకునేవాడిని. “సభలకు
వచ్చిన వాళ్ళ పేర్లే రాయడంలేదు; రానివాళ్ళ
పేర్లు కూడా రాస్తారా?” అని కాంతారావుగారు అడిగేవారు.
ఒకసారి నేను కడపలో వుండాల్సినవాడిని విజయవాడలో ఎవరికో కనిపించినట్టు
ఆఫీసువాళ్లకు తెలిసింది. నన్ను రెడ్
హ్యాండెడ్ గా పట్టుకోవడానికి జీయల్ ప్రసాద్
గారు కడప వచ్చారు. ఉదయం తొమ్మిది గంటలకు వారు కడపలో బస చేసిన హొటలుకు వెళ్ళి పలకరించాను.
అంతకు ముందు రోజు రాత్రి ఉయ్యూరులో నేను ప్రసంగించినట్టూ, టిడిపి వారితో చిన్న తగవు
జరిగినట్టూ విజయవాడ పత్రికల్లో వార్త వచ్చింది. ఆ వార్తను ప్రసాద్ గారికి ఫోన్లో కాంతారావుగారు
వివరించారు.
అప్పట్లో రాత్రి 8 గంటల తరువాత విజయవాడ నుండి కడపకు బస్సు లేదు. రైలు అసలే లేదు. కార్లలో ప్రయాణించేంత సీను లేదు.
ప్రయాణాల్లో నాకన్నా పదేళ్ళు ఎక్కువ అనుభవం వున్న ప్రసాద్ గారికి నేను కడప ఎలా చేరుకున్నానో అర్ధం కాలేదు. కానీ ఎదో
మిస్టరీ వుందని మాత్రం వారికి తెలిసింది.
“నిన్న నువ్వు ఇక్కడ లేవని నాకు తెలుసుగానీ కడప ఎలా చేరావో నిజం చెప్పు” అన్నారు.
అప్పుడు నేను నా ప్రయాణ ప్రణాళిక రహాస్యాలని వారికి చెప్పాను. ఒక్క గంట కాదుకదా ఒక్క నిముషం కూడా నేను వృధా చేయను సార్.
కడపలో శనివారం, ఆదివారం చెయ్యాల్సిన పనుల్ని
శనివారమే పూర్తి చేసేశాను. ట్రావెలింగ్ సూటు కేసు, ఆఫీసు బ్రిఫ్ కేసు ఇక్కడే పెట్టి
శనివారం రాత్రి బస్సెక్కి విజయవాడ వెళ్ళాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆటోనగర్ మెకానిక్
ఒకడు మా అభిమాని వున్నాడు. వాడు విజయవాడ బస్ స్టాండ్ లో నా కోసం బుల్లెట్ మోటారు సైకిల్
తో రెడీగా వున్నాడు. ఇద్దరం ఉయ్యూరు వెళ్ళాం.
నా భార్య అక్కడికి వచ్చి నన్ను కలిసింది. అక్కడ ఉదయం పొలిటికల్ క్లాస్ చెప్పాను.
సాయంతం ఉయ్యూరులో బహిరంగ సభ అనుకున్న దానికన్నా
గంట ఆలస్యం అయింది. మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే టిడిపి వాళ్లకు కోపం వచ్చి మీటింగ్
మీద దాడి చేశారు. దానితో ఇంకా ఆలస్యం అయింది. నేను నా ఉపన్యాసాన్ని ముగించి రాత్రి
9.45కు బుల్లెట్ ఎక్కాను. విజయవాడ స్టేషన్
కు 10.35 కు చేరుకున్నాము. 10.50కు మద్రాస్ ఎక్స్ ప్రెస్ వుంది. అందులో రైల్వే మెయిల్ సర్విస్
(RMS) డబ్బా ఎక్కేశాను. అందులో పోస్టల్ డిపార్ట్
మెంటు ఉద్యోగులు మా అభిమానులుంటారు. వాళ్ళు
నాకు ఎప్పుడూ ఒక బెర్త్ ఇచ్చేస్తారు. తెల్లారగట్ల మూడున్నరకు నెల్లూరులో దిగి.
నాలుగు గంటలకు కడప ఫస్ట్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేశాను. ఆదివారం కడపలో వున్నా హొటల్
రెంట్ కట్టాలిగా? ఆ డబ్బుతోనే ప్రయాణం చేసేశాను. ఆఫీసుకు కూడా నష్టం ఏమీ లేదు” అన్నాను.
ఆయన కొంచెం కోపం నటించారుగానీ లోలోపలా నా తెలివికి మెచ్చుకున్నారు.
కాంతారావుగారు నన్ను తన టేబుల్ దగ్గరికి చాలా అరుదుగా పిలిచేవారు. ఏదైనా విషయం
వుంటే స్లిప్పు రాసి బాయ్ చేత పంపించేవారు. 1985లోనో 1986లోనో డిసెంబరు 31న మధ్యాహ్నం వారు నాకో స్లిప్పు పంపించారు,
“ఈ రాత్రి కార్యక్రమం ఏమిటీ”అని. “వాసుదేవలో
303 బుక్ చేశాం” అని నేను రాసి పంపించా. “ఎవరెవరూ?” అని ఇంకో స్లిప్.
“నేనూ, నిష్టర్, ప్రకాశరావు” అని నా సమాధానం.
“షల్ ఐ జాయిన్? “ అని ఇంకో స్లిప్పు. “యూ ఆర్ మోస్ట్ వెల్ కమ్ సార్” అని నా ఆహ్వానం.
మేము ఇళ్ళ కెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ మార్కెట్టుకు వచ్చి బీరు బాటిల్స్ కేసు
ఒకటి కొని హొటల్ గదికి చేరుకున్నాము. తొమ్మిది గంటలకు కాంతారావుగారు, ప్రసాద్ గారు
వచ్చారు. అప్పటికి మా మధ్య గురుశిష్యుల సంబంధం క్రమంగా స్నేహితుల సంబంధంగా మారుతోంది.
“ఏం తెచ్చారూ?”
“బీరు కేసు తెచ్చాం సార్!” అని గొప్పగా
చెప్పాం.
“మీరు బీర్బల్స్ గానే వుండిపోతారా? కొంచెం పెద్దమనుషులు అవుతారా?” అనడిగారు.
“మనం విస్కిద్దాం” అంటూ బ్రీఫ్ కేసులో నుండి బాటిల్ తీసి టేబుల్ మీద పెట్టారు.
జానీవాకర్ స్కాచ్ విస్కీ రెడ్ లేబుల్
బాటిల్ .
మేము ముగ్గురం కళ్ళార్పకుండా ఆ బాటిల్ ను చూశాం.
అప్పటి వరకు పేరు వినడమేతప్ప జానీవాకర్
బాటిల్ ను మేము చూడలేదు. అప్పట్లో అది ఓపెన్ మార్కెట్ లో దొరికేది కాదు. స్మగ్లింగ్
జరిగేది. కాంతారావుగారు కాకినాడ నుండి దాన్ని తెచ్చారు.
మేము మిమ్మల్ని గౌరవించుకుందాం అనుకుంటుంటే మీరే బాటిల్ తెచ్చారేమిటీ సార్?
అన్నాం.
ఇవ్వాల్టికి దీనితో పోదాం అన్నారాయన.
అప్పటికే కార్క్ తీసిన మూడు బీరు బాటిళ్ళను
పక్కన పెట్టి, కాంతారావుగారినే రెడ్ లేబుల్ మూత తీయమన్నాం. ప్రసాద్ గారు లిక్కర్ తీసుకోరు.
మేము నలుగురం రెడ్ లేబుల్ ను గొప్పగా ఆస్వాదించేశాం. .
ఆరోజు వారు నా స్థాయిని పెంచారని అనిపించింది. ఆ మాట నా మనసులో పడిపోయింది.
వాళ్ల మీద గౌరవంతో నేను మాత్రం ఒక నియమాన్ని పాటించాను. ఉమా ఆటో ఏజెన్సీ బ్రీఫ్
కేసు వదిలేశాక ఇంకో కంపెనీ బ్రీఫ్ కేసు ముట్టుకోలేదు. ప్యూరోలీటర్ వంటి కార్పొరేట్
కంపెనీ జనరల్ మేనేజర్ స్వయంగా నన్ను పిలిచి
ఉద్యోగం ఇస్తానంటే “నా నోటితో స్టీల్ బర్డ్ మంచిదికాదు ఇంకోటి మంచిది అని చెప్పలేనండి”
అన్నాను.
ఆ విషయం తెలిసి గారపాటి వెంకయ్యగారు అదేంటి అంత పెద్ద ఆఫర్ను వదిలేశావు అన్నారు.
నిజానికి ప్యూరోలీటర్ కు కూడా వసంత గ్రూపులో ఇంకో అనుబంధ సంస్థే పంపిణీదారు. మీరు వున్నంత
వరకు ఈ సంస్థను వదలను. సంస్థ మారాల్సిన పరిస్థితితే వస్తే ఈ రంగాన్నే వదిలేస్తాను అన్నాను.
వారు చాలా ఆశ్చర్యపోయారు. “ఈ కమ్యూనిస్టులు
ఇంతే. మొండిఘటాలు” అన్నారు. వారు పొగిడింది నన్ను కాదు. ఆయన్నే. వారు కూడా యవ్వనంలో
గుడివాడ కమ్యూనిస్టే.
ఇది జరిగిన రెండు మూడేళ్ళకే వృధ్ధాప్యం కారణంగా వెంకయ్యగారు చనిపోయారు. అప్పటికి నాకు జర్నలిజం మీద
వ్యామోహం బాగా పెరిగిపోయింది. ఉదయం పత్రికలో రెగ్యులర్ గా నా వ్యాసాలు అచ్చవుతున్నాయి.
ఈలోగా వంగవీటి మోహన రంగా హత్య జరిగి ఒక పదిహేను రోజులు విజయవాడలో కర్ఫ్యూ నడిచింది.
అప్పుడు నా భార్య ‘విజయం’ పత్రిక్కి రిపోర్టరుగా పనిచేస్తోంది. ఆ కర్ఫ్యూ రోజుల్లో
ఆమె వెంట ఎస్కార్ట్ గా వెళ్ళేవాడిని. ఆ సెలవు రోజుల్లోనే ఆంధ్రభూమి
నుండి ఆఫర్ వచ్చింది. నేనూ ఒక కొత్త ఉత్సాహం కోసం మార్పును కోరుకున్నాను. ఉమా ఆటో ఏజెన్సీని వదిలేశాను. వారికి పోటీగా ఇంకో
సంస్థలో చేరలేదు. ఏకంగా ఆటోమోబైల్ రంగాన్నే వదిలేశాను.
ఆటోమోబైలు రంగాన్ని వదిలేశాక కూడా కాంతారావు గారితో అనుబంధం కొనసాగింది. కొత్త
స్టాఫ్ కావలసివచ్చినపుడు ఎవరినయినా పంపమని నన్ను అడిగేవారు.
ఈ రోజుల్లో రెడ్ లేబుల్ అనేది సాధారణ విషయం అయిపోయినా కాంతారావుగారు గుర్తొస్తే కొత్త సంవత్సరం రాత్రి
వాసుదేవ హొటల్ రూం లో వారు తెచ్చిన రెడ్ లేబుల్ బాటిల్ గుర్తుకొస్తుంది.
కాంతారావుగారు ఇంటికి వస్తున్నారంటే
డ్రిక్ దగ్గర మరో మనిషిని అనుమతించను. నిష్టర్ ఒక్కడే తోడు వస్తాడు. కొన్నేళ్ళుగా
నిష్టార్ లిక్కర్ మానేశాడు. నలుగురిని అతిథులుగా పిలిస్తే గురువుకు ఇవ్వాల్సినంత గౌరవం
ఇవ్వలేము. గురువు అనేవాడు ప్రత్యేకంలో ప్ర్తత్యేకం.
గత ఏడాది ఆగస్టు 27న విజయవాడలో నేనూ కాంతారావుగారు రెడ్ లేబుల్ సాక్షిగా నా పుట్టినరోజు జరుపుకున్నాం.
ఈ ఏడాది కూడా వారితోనే విజయవాడలో పుట్టినరోజు జరుపుకోవాలన్నది నా ఆలోచన. కాంతారావు
గారితో రెడ్ లేబుల్ తాగడానికి నేను ఇష్టపడతానని
మా పిల్లలకు కూడా తెలుసు. ముందుగానే రెండు రెడ్ లేబుల్ బాటిల్స్ తెచ్చి ఇంట్లో పెట్టాడు
మా చిన్నోడు. ఈలోగా ఇలా. దుర్వార్త.
- డానీ
21 ఆగస్టు 2018