Tuesday, 7 August 2018

Public Debate – Accident


Public Debate  – Accident
ఏదైనా పెద్ద ప్రమాదం జరగగానే మనకు రెండు ధోరణులు కనిపిస్తాయి. మొదటిది; ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిందిస్తాయి. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అంటాయి. ప్రమాదం మరీ పెద్దదయితేఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తాయి. ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే రాష్ట్రంలో జరిగే మంచి చెడులు రెండింటికీ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వానికి అధిపతి ముఖ్యమంత్రి.

మరోవైపు, ప్రతిపక్షాలు శవరాజకీయం జరుపుతున్నాయని అధికారపక్షం ఎదురుదాడికి దిగుతుంది. ఇందులో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే అధికార ప్రతిపక్షాల మధ్య విధానాలు, సిధ్ధాంతాల పరంగా తేడా ఏమీలేదు. వారైనా వీరైనా ఒకటే. వారు దిగితే వీరు, వీరు దిగితే వారూ గద్దెను ఎక్కాలనుకుంటారు.

ప్రమాదాలను ఒక విడి సంఘటనగా చూడడం తప్పు. ఒక ప్రమాదం వెనుక కనీసం పది ప్రభుత్వ శాఖల వైఫల్యం, నిర్లక్ష్యం, అవినీతి వుంటుంది.

క్వారీలో పేలుళ్ళ సంఘటనే తీసుకోండి .

మొదటిది, ఇది గనుల శాఖకు సంబంధించిన అంశం. లీజు వున్న సర్వే నెంబర్లలోనే తవ్వకాలు జరుపుతున్నారా? పక్కకు విస్తరించారా? సాధారణంగా విస్తరించి వుంటారు.
రెండోది, జెలటిన్ స్టిక్ లను నిబంధనల ప్రకారం భద్రపరుస్తున్నారా? లేదా? ఇది పారిశ్రామిక భద్రత విభాగంలోనికి వస్తుంది.
మూడోది, లీజ్ స్థలాల్లో కాకుండా పక్క స్థలాల్లోనూ మైనింగ్ జరుగుతూవుంటే అది రెవెన్యూ శాఖ పరిధిలోనికి  కూడా వస్తుంది.
నాలుగోది, నిర్ణిత స్థలంలోనే కాకుండా అదనపు స్థలంలోనూ మైనింగ్ జరుపుతున్నప్పుడు అదనపు జిలటిన్స్ అవసరం అవుతాయి. వాటిని అక్రమంగా తెస్తుంటారు. ఇది తీవ్రమైన నేరం.
ఐదవది; అక్రమంగా తెచ్చిన జెలిటిన్స్ ను తామే వినియోగిస్తున్నారా? సంఘవ్యతిరేక శక్తులకు కూడా సరఫరా చేస్తున్నారా? ఇది నేర పరిశోధన శాఖ పరిధిలోనికి వస్తుంది.
ఆరు; అక్కడ పనిచేస్తున్న కూలీలు ఎవరూ? వాళ్ళకు నిబంధనల ప్రకారం జీత భత్యాలు ఇస్తున్నారా?
ఏడు; సాధారణంగా కూలీలను ఇతర రాష్ట్రాల నుండి తీసుకుని వస్తుంటారు. వాళ్ళకు నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఇవ్వరు.   ఇది కార్మికశాఖ పరిధిలోని అంశం.  
ఎనిమిది; కూలీలు పారిపోకుండా దాదాపు బంధించి వుంచుతారు. ఇది మరలా పోలీసు శాఖ పరిధిలోనికి వస్తుంది.
తొమ్మిది; మృతుల్లో పిల్లలు కుడా వున్నారు. అంటే కారీల్లో బాల కార్మికుల్ని వినియోగిస్తున్నారు. ఇది ఇంకో నేరం. ఒంకో శాఖ కింద వస్తుమ్ది.
పది; కార్మికులకు రేషన్ కార్డులు వుండవు. ఆధార్ కార్డులు వుండవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సబ్సిడీలు వాళ్ళుకు అందవు. సహజంగానే వాళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ వుంటుంది.
పదకొండు; బాలకార్మికులకు విద్యావకాశాలు వుందవు.
పన్నెండు. అత్యంత సహజంగానే అక్కడి కాంట్రాక్టరు అధికార పార్టీకి చెందిన వాడే వుంటాడు.
పదమూడు; పెద్ద సంఘటన జరిగినప్పుడే మీడియా ఓ రెండు రోజులు హడావిడి చేస్తుంది. ఆ తరువాత దీన్ని వదిలిపెట్టి. ఇంకో సంచలనానికి మారిపోతుంది. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో డజను ప్రభుత్వ శాఖలకు ఈ సంఘటనతో సంబంధం వుందని నిరూపించవచ్చు. ఈ అధికారులందరూ సదరు కాంట్రాక్టరు నుండి ఎంతో  కొంత లబ్ది పొందుతుంటారు.

ఇలాంటి దారుణ సంఘటనలు జరిగినపుడు సంబంధిత శాఖల స్థానిక అధికారులు అందరినీ విధినిర్వహణలో నిర్లిప్తత, నిర్లక్ష్యం, laxity అవినీతి ఆరోపణలపై తక్షణం  సస్పెండ్ చేయాలి. వాళ్ళు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తరువాత మాత్రమే తిరిగి విధుల్లోనికి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలి.

ప్రభుత్వం ఆ పని చేయదు. అధికారుల్ని శిక్షిస్తే తన చేతకానితనాన్ని తానే ఒప్పుకున్నట్టు అవుతుందని ప్రభుత్వం జంకుతుంది.

కాంట్రాక్టరు విషయమూ అంతే అతను అధికార పార్టీకి చెందినవాడు గనుక అతన్ని వెనకేసుకు రావాలనుకుంటుంది. దానివల్ల ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం పోతుంది.

కాంట్రాక్టర్లు అధికార పార్టీకి చెందిన వారనేది కూడా ఒక మిధ్య. ఎన్నికలు జరగ్గానే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీలోనికి చేరిపోవడాన్ని మనం చూస్తున్నాం. అలాగే, రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు అందరూ క్షణాల్లో అధికార పార్టీ లోనికి దూకేస్తారు.

మనం ఇలాంటి సమస్యల్ని ఒక సమగ్రతలో నుండి పరిశీలించాలి.

No comments:

Post a Comment