రాజకీయాల్లో
మౌనాన్ని కూడా డీకోడ్ చేయవచ్చు
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను
రాయతీలు అడగడం ప్రజా సమూహాలకు సహజ హక్కు. అధికార పార్టీ ఇస్తున్న రాయితీలకన్నా
ఎక్కువ రాయితీలను ప్రకటించమని ప్రతిపక్ష పార్టిని ప్రజా సమూహాలు కోరుతాయి.
ప్రతిపక్షం స్పందించి కొత్త రాయితీలను ప్రకటిస్తే, వాటిని చూపి రాయితీల ప్యాకేజ్
ను పెంచమని అధికార పార్టీని మళ్ళీ అడుగుతాయి. అణగారిన ప్రజా సమూహాలు పార్లమెంటరీ
ప్రజాస్వామ్యంలో లాబీయింగ్ ద్వారా క్రమక్రమంగా, దశలవారీగా తమ రాయితీలను పెంచుకునే
తీరు ఇదే. ఈ క్రమం సర్పూలాకృతి (spiral)లో సాగుతుంది. అంతిమంగా ఎన్నికల సమయంలో
ఎవరి ప్యాకేజి బాగుంటే ఆ పార్టీకే ఓటు వేస్తారు. ఇలా రాయితీలు కోరే ముస్లిం
సమూహానికి కూడా వుంటుంది.
ఎన్నికల్లో
ప్రధాన పార్టీలన్నీ పోటీచేస్తాయి. అనుకూల ప్రతికూలతలను బట్టి కొన్ని గెలుస్తాయి,
కొన్ని గెలవలేవు. ప్రజా సమూహాల కోరికలూ అంతే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రజా సమూహాల
కోరికల్ని నెరవేర్చుకునేందుకే ప్రయత్నం చేస్తాయి. అనుకూల ప్రతికూలతలను బట్టి
కొన్ని ఎన్నికల్లో కొన్ని కోరికలు నెరవేరుతాయి. కొన్ని ఆలా వాయిదా పడిపోతూ
వుంటాయి. ప్రజా సమూహాలన్నింటి సంక్షేమాన్ని, ఆ సమూహాల్లోనూ ప్రతి ఒక్కరి
సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ప్రభుత్వాలు తమ బాధ్యతను
నెరవేర్చకపోవడం వల్లనే ప్రజలు తమ కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఉద్యమాలో,
లాబీయింగులో చేయాల్సి వస్తుంది.
గతంలో, ఇందిరా గాంధి, ఎన్టీ
రామారావు, వైయస్ రాజశేఖర రెడ్డిల వద్ద లాబీయింగ్ ద్వారానే ముస్లింలు కొన్ని
మేళ్ళను సాధించుకున్నారు. అందుకు కృతజ్ఞతగా ఆయా ఎన్నికల్లో ముస్లింలు ఆయా
పార్టీలకు మద్దతు పలికారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన సందర్భాల్లో
నిర్దాక్షిణ్యంగా ఆ పార్టిల్ని ఓడించారు కూడా. వాస్తవాలను వాస్తవాలుగా
మాట్లాడుకోవాలి.
ఇందిరా గాంధి పెట్టిన పార్టి అనో,
ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అనో, వైయస్ రాజశేఖరెడ్డి కొడుకు పెట్టిన పార్టీ అనో
ప్రజలు ఎప్పుడూ ఎవరికీ ఓటు వేయరు. అయితే, కొన్ని ఎన్నికల్లో భావోద్వేగాలు
కూడా పనిచేస్తాయి. ఎవరయినా చనిపోయినపుడు వాళ్ళ వారసుల్ని ప్రజలు గెలిపిస్తారు. ఆ
సానుభూతి ఒక్కసారి మాత్రమే వుంటుంది. ఆ తరువాత ఏ ఎన్నికల లెఖ్ఖ ఆ ఎన్నికలదే.
బాబ్రీ మసీదు
కూల్చివేత తరువాత కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ను ఓడించడమే
లక్ష్యంగా ముస్లింలు పనిచేశారు. ప్రజాస్వామిక మార్గాల్లో ముస్లింలు సాగించిన
వత్తిడికి కాంగ్రెస్ దిగి వచ్చింది. ముస్లింలకు క్షమాపణలు చెప్పి వారిని దగ్గరకు
తీసుకునే ప్రయత్నం చేసింది. దాని ఫలితంగానే జాతీయ స్థాయిలో సచార్ కమిటిని
వేశారు. ఆంధ్రప్రదేశ్ లో 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వీటిని కాంగ్రెస్
ఇచ్చిందన్నది ఎంత వాస్తవమో ముస్లింలు సాధించుకున్నారన్నది కూడా అంతే వాస్తవం. లాబీయింగ్
చేయకుండా, వత్తిడి తేకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ రాయితీ రాదు.
ముస్లింల 4 శాతం రిజర్వేషన్ లో సయ్యద్, పఠాన్, మీర్జా, బేగ్, తదితర సమూహాలూ లేవు.
వీరిని కూడా బిసి జాబితాలో చేర్చాలని ముస్లింలు మొదటి నుండీ కోరుతున్నారు.
భారత ముస్లిం సమాజం మొత్తాన్ని సాంస్కృతికంగా వెనుకబడిన ఒక సమూహంగా గుర్తించాలనేది
ముస్లింల ప్రధాన డిమాండు. వీళ్లందరికీ 5% రిజర్వేషన్ ఇస్తానన్నది వైయస్
ఎన్నికల హామీ. తరువాత సాంకేతిక కారణాలు చూపి దాన్ని 4 శాతానికి కుదించారు. 2004లో
వైస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన ఓట్లు, సీట్లు కన్నా 2009 ఎన్నికల్లో వచ్చిన
ఓట్లు, సీట్లు రెండూ తక్కువ. వారే స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో “ప్రజలు మాకు పాస్
మార్కులు మాత్రమే వేశారు” అన్నారు. ఆ పాస్ మార్కుల్ని కూడా తాను ముస్లింల
మద్దతుతోనే సాధించినట్టు వైయస్ కు తెలుసు. సయ్యద్, పఠాన్,
మీర్జా, బేగ్, తదితర సమూహాలకు మేళ్ళు చేసే ప్రక్రియను కూడా చేపట్టాలని
వారనుకున్నారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది
ముస్లింల డిమాండ్. దాన్ని వారు ఎలా పరిష్కరించేవారోగానీ ఈ లోపులో హఠాత్తుగా
చనిపోయారు.
వైయస్
రాజకీయ వారసునిగా రంగప్రవేశం చేసిన జగన్ ను ముస్లింలు గట్టిగా నమ్మేరు. గట్టి
మద్దతు ఇచ్చారు. కడప అసెంబ్లీ, లోక్ సభ ఉప ఎన్నికలతో కలుపుకుంటే మూడు ఎన్నికల్లో
జగన్ కు అండగా నిలిచారు. ఇంతగా మద్దతు ఇచ్చినా జగన్ ఎన్నడూ ముస్లిం కొత్త ప్యాకేజి
గురించి ప్రస్తవించలేదు.
మరోవైపు, 2014లో బిజెపితో జతకట్టి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు
నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలని ముస్లింలను అనేక విభాగాల్లో ఇబ్బందులు
పెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముస్లింలు ఇంతటి మనోవేదనకు గురి అయిన కాలం లేదు.
పొరుగురాష్ట్రం తెలంగాణలో కేసిఆర్ ముస్లిం ఫ్రెండ్లీ పాలనను సాగిస్తే ఆంధ్రప్రదేశ్
లో చంద్రబాబు అందుకు విరుధ్ధంగా యాంటి ముస్లిం పాలనను సాగించారు. ఎన్నికలు వస్తే
చంద్రబాబును ఓడించడానికి తమ శక్తినంతా ఉపయోగించాలని మంది ముస్లింలు భావించారు.
ఈ పరిణామాలకు
టర్నింగ్ పాయింట్ నంద్యాల ఉపఎన్నికలు. ముస్లింలను సంతుష్టిపరచాల్సిన అవసరాన్ని
చంద్రబాబు అప్పుడే గుర్తించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావలసిన
అవసరాన్ని జగన్ గుర్తించారు. వాళ్ళిద్దరి రాజకీయ కదలికల్ని ముస్లింలు గుర్తించారు.
నంద్యాల ఉపఎన్నికలు జరగడానికి ఓ మూడు నెలలు ముందు జగన్ ఢిల్లీ వెళ్ళీ ప్రధాని
నరేంద్ర మోదిని కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఎ అభ్యర్ధి ఎవరైనా సరే తమ
మద్దతు వుంటుందని చెప్పారు. అంతేకాక, “అసలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి
నిజంగా ఎవరయినా (బిజెపికి వ్యతిరేకంగా) పోటీ పెట్టాలని అనుకుంటే అది తప్పు”
అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఒక హెచ్చరిక కూడా చేశారు. ఢిల్లీలో
ఒక విధంగా వారు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించారు. మోది జగన్ ల కొత్త రాజకీయ
హనీమూన్ ప్రభావం ముస్లింల మీద పడి నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది.
ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి.
రాజకీయ కారణాలతో కొంత, వ్యక్తిగత కారణాలతో మరికొంత చంద్రబాబు, ప్రధాని నరేంద్ర
మోదీల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఎన్ డి ఏ నుండి టిడిపి బయటికి
వచ్చేసింది. అలా ఏర్పడిన ఖాళీలో ప్రవేశించడానికి జగన్ చాలా ఉత్సుకతతో పావుల్ని
వేగంగా కదిపారు. భువనసుందరి కథలోలా జగన్ రాజకీయాల్లోనికి చంద్రబాబు ప్రవేశిస్తే, చంద్రబాబు
రాజకీయాల్లోనికి జగన్ పరకాయ ప్రవేశం చేశారు. ఫలితంగా ముస్లింలకు దగ్గర కావడానికి
చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ముస్లింలను దూరంగా వుంచడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.
మొదట్లో చిన్న తగవుగా మొదలయిన మోదీ బాబూ వివాదం చిలికి చిలికి గాలివానగా
మారింది. మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ మొదలయిన విమర్శలు మోదీ
ఫాసిస్టూ, నియంత, మతోన్మాది, దేశ ఆర్థిక వ్యవస్థ వినాశకారుడు అనే వరకు పెరిగాయి.
ముందు మోదీతో మొదలయిన వివాదం తరువాత బిజెపికి విస్తరించింది. ఆ తరువాత ఎన్ డి ఏ కు
ఆ తరువాత సంఘపరివారానికి విస్తరించింది. ఇక అక్కడి నుండి వారు వెనక్కు
తిరిగే అవకాశాలు లేవు. కనీసం ఈ ఎన్నికల వరకు అది జరిగే పని కాదు.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముస్లింలలో ఒక చిన్న భాగం మాత్రమే టిడిపికి మద్దతుదారులుగా
వుంది. . మోదీతో తలపడి ఎన్నికల్లో గెలవాలంటే మిగిలిన ముస్లింలను సహితం
సంతుష్టికరించాల్సిన అవసరాన్ని చంద్రబాబు సరిగ్గానే గుర్తించారు. నంద్యాల
ఉపఎన్నికలు జరిగిన సరిగ్గా ఏడాది తరువాత ‘నారా హమారా! టిడిపి హమారా!’ పేరుతో
గుంటూరులో ముస్లిం మహాసభ నిర్వహించి 24 అంశాలతో ఒక ప్యాకేజి ప్రకటించారు.
కేంద్రంలో మోదీ నియంతృత్వ పాలను అంతం చేస్తానంటున్న చంద్రబాబు సవాలు
ఉత్సాహాన్ని ఇస్తున్నప్పటికీ గుంటూరు ప్యాకేజి నిజానికి ముస్లింల ఆశలకు తగ్గట్టుగా
లేదు. ముఖ్యంగా, చట్ట సభల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని పెంచే అంశం మీద హామీ
అందులో స్పష్టంగా లేదు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షంకన్నా ప్రతిపక్షం ఎంతో ఉదారంగా
వుండాలి. అధికార పక్షం ముస్లిం ప్యాకేజీని ప్రకటించినపుడు ప్రతిపక్షం దానికి
పోటీగా అంతకన్నా మెరుగైనా ప్యాకేజీని ప్రకటించాలి. కానీ జగన్ ఆ పని చేయలేదు.
చేయదలచడం లేదనే సంకేతాలూ వస్తున్నాయి. గతంలో ముస్లింల ప్యాకేజీ మీద
చంద్రబాబు చూపించిన నిర్లిప్తంగా ఉన్నట్లు ఇప్పుడు జగన్ కూడా పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు. వారు ప్రజాస్వామిక బాధ్యతను నిర్వర్తించపోగా ప్రజాస్వామ్య ప్రక్రియకు
అడ్దంకిగా మారారు. జగన్ ఇప్పుడు తాను మోదీ పంచన చేరినట్టూ ఒప్పుకోరు. ముస్లింలను
దూరంగా పెడుతున్నట్టూ ఒప్పుకోరు. అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వుంటున్నారు.
అయితే రాజకీయాల్లో మౌనాన్ని కూడా సులువుగా డీకోడ్ చేయవచ్చు. కొన్ని
లొగరిథమ్స్ ను వుపయోగించి మౌనాన్ని శబ్దంగా మార్చవచ్చు. వైసిపి సంస్థాగత
నిర్మాణంలోని 6 జోన్లు, 25 పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లాల బాధ్యుల్ని గమనిస్తే
జగన్ సోషల్ ఇంజినీరింగ్ అర్ధం అయిపోతుంది. 31 మంది బాధ్యుల్లో ఒక్కరంటే ఒక్క
ముస్లిం కూడా లేకుండా చేసి ముస్లిం సమాజానికి జగన్ ఏం సంకేతాన్ని ఇస్తున్నారూ?
ముస్లిం ప్రాతినిథ్యం మీద జగన్ విధానం ఏమిటీ? అది వారు చెప్పకుండానే అర్థం
అవుతోంది.
విచిత్రం ఏమంటే కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిమ పవన్ కళ్యాణ్ సహితం ముస్లిం
సమస్యల పరిష్కారం విషయంలో జగన్ బాటలోనే
నడుస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు టిడిపి-కాంగ్రెస్ ల మధ్యో,
టిడిపి-వైసిపి మధ్యో
ఊగిసలాడుతూ వుండిపోతున్నారే తప్ప ముస్లింల అభ్యున్నతిని సాధించే స్వతంత్ర
ప్రత్యామ్నాయ కార్యక్రమం అంటూ ఒకటి ఏర్పరచుకోలేకపోయారు.
సిపిఐ, సిపిఎం రాష్ట్రశాఖలు
ఈ
ఏడాది ఆగస్టు 27న కర్నూలులో ముస్లిం మేధావులు,
ఉద్యమ ప్రతినిధులతో ఒక సదస్సు నిర్వహించి ముస్లిం అభ్యున్నతి
కార్యక్రమం ఒకదాన్ని రూపొందించారు.
వామపక్షాలతో కలిసి నడుస్తానంటున్న జనసేన నేత పవన్కళ్యాణ్ ఇంకా ఈ విషయంలో తన పార్టీ విధానమేమిటో చెప్పకపోవడం
విశేషం. వారి మౌనాన్ని కూడా డీకోడ్ చేయాల్సివుంది.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్) సెల్ 9010757776
రచన
: 18 డిసెంబరు 2018
ప్రచురణ
: ప్రజాశక్తి దినపత్రిక, 21 డిసెంబరు 2018
http://www.prajasakti.com/Article/Neti_Vyasam/2098807