Sunday, 2 December 2018

ROBO 2.O – ఒక అమానవీయ బాక్సాఫీసు హిట్ సూత్రం !



ROBO 2.O – ఒక అమానవీయ బాక్సాఫీసు హిట్ సూత్రం !
The story of Humanoids with an inhuman message

అవినీతి మీద తిరుగుబాటు వంటి సమాంతర కథలకు  కమ్మర్షియల్ హంగులన్నీ అద్ది, విజువల్ గ్రాఫిక్స్ తో మిరుమిట్లు గొలిపించి భారీ వసూళ్ళు మూటగట్టుకోవడంలో శంకర్ మొనగాడు.

‘రోబో టూ : ఓ’ లో కూడా శంకర్ తరహా హంగులన్నీ వున్నాయి. రజనీకాంత్ రోబోలో రెండు పాత్రల్లో మెప్పిస్తే ఇందులో ఇంకో రెండు పాత్రల్ని చేర్చారు. నాలుగు పాత్రల్లోను రజనీకాత్ వైవిధ్యంతో మెప్పించారు.

విఎఫ్ ఎక్స్ వినియోగం ఐ మాక్స్ స్క్రీన్ కన్నా ఎక్కువగా వాడారు. డబ్బుల్ని పరిచేసి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చే ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లోనూ చేశారు. కథకన్నా విఎఫ్ ఎక్స్ లతోనే సినిమాను హిట్ చేసే ఆతృత  ఎక్కువగా కనిపిస్తుంది.  

శంకర్ సినిమాల్లోని కథానాయకులు సామాజిక న్యాయంకోసం చట్టవిరుధ్ధమైన మార్గాల్ని ఎంచుకుంటారు.  End justifies the means అనే రాబిన్ హుడ్  జీవన సందేశాన్ని శంకర్ తన సినిమాల హిట్ ఫార్మూలాగా మార్చుకున్నారు. నిజానికి అదే వారి సినిమాలకు ప్రాణం.  కానీ, ‘రోబో టూ : ఓ’ కథ విషయంలో  శంకర్ బోల్తా పడ్డారు. తన కాళ్ళను తానే  లేజర్ కిరణాలతో నరుక్కున్నారు. సహజ న్యాయం కోసం చట్టవిరుధ్ధమైన మార్గాల్ని ఎంచుకున్న పక్షి ప్రేమికుడు ఇందులో ప్రతినాయకుడు.   

రజనీకాంత్ స్టార్ డం సినిమా తొలి భాగాన్ని నడిపిస్తుంది. రోబోటిక్స్ సైంటిస్ట్  డాక్టర్ వశీకరణ్  సెల్ ఫోన్ వినియోగదారుల్ని కాపాడడానికి ప్రభుత్వ అనుమతి లేకుండానే ‘చిట్టి’ రోబోను  యాక్టివేట్ చేస్తాడు. ఈ వ్యవహారం అంతా ఇంటర్వెల్ బ్లాక్ వరకు సాగుతుంది.  ప్రతినాయకుడు స్పారోమ్యాన్ ప్రవేశంతో రజీనీకాంత్ ను వెనక్కి తోసి అక్షయ్ కుమార్ తెరను ఆక్రమించుకుంటాడు.

“బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా  సుప్రసిధ్ధులయిన సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని స్పారోమ్యాన్ పాత్రను సృష్టించారు శంకర్. పక్షుల్ని పరిరక్షించడానికి స్పారో మాన్ తపనపడతాడు. వాటి మరణానికి కారకులయిన సెల్ ఫోన్ కంపెనీల మీద ఉద్యమిస్తాడు. అతని శాంతియుత ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో, న్యాయస్థానాల్లో అన్యాయం జరగడంతో నిస్సహాయుడై ఆత్మాహుతి చేసుకుంటాడు. అతని ఆత్మ సెల్ ఫోన్ లులేని సమాజాన్ని నిర్మించదలుస్తుంది.  

నిజానికి స్పారో మ్యాన్ పాత్ర శంకర్ సినిమాలు జెంటిల్ మ్యాన్,  ఒకే ఒక్కడు, శివాజీ, అపరిచితుడుల్లోని కథానాయకుల వరుసలో సృష్టించిందే. అయితే, తన పాత కథల ప్రోటోగానిస్టును ఈ సినిమాలో సెల్ కంపెనీల మీద తిరగబడిన ఉగ్రవాదిగా చిత్రీంచి స్పారో మ్యాన్ ను అతి క్రూరంగా చంపుతాడు శంకర్. ఒక పక్షిప్రేమికుడ్ని క్రూరంగా చంపడం సినిమాటిక్ అన్ జస్టిఫికేషన్. ఆ మేరకు ఇన్నాళ్లు తనను బతికించిన ‘రాబిన్ హుడ్’ పాత్రను చంపి రచయితగ శంకర్ చనిపోయాడు.

బర్డ్స్‍ మ్యాన్ ఆఫ్ ఇండియా  సలీమ్ ఆలీ ని ప్రేరణగా తీసుకుని 'స్పారో మ్యాన్" ను సృష్టించడం తప్పుకాదు. స్పారో మ్యాన్ సంహారం ద్వార  ప్రేక్షకులకు ఒక రాక్షసానందాన్ని ఇవ్వాలనుకోవడం తప్పు. గల్ఫ్, అరబ్ దేశాల తిరుగుబాటుదార్లను టెర్రరిస్టులుగా, రాక్షసులుగా చిత్రించి అమేరికా దర్శకులు తమ ముస్లిం వ్యతిరేకతను ప్రదర్శించి ఆనందిస్తుంటారు. శంకర్ కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకుని తమిళ సినిమాను  అలా ‘హాలివుడ్ బాట’లో నడిపిస్తున్నారు.

రామాయణం లోని జటాయువు పాత్రను మోడల్ గా తీసుకుని ‘పక్షిరాజు’ పాత్రను సృష్టించినట్టు ఒక అభిప్రాయం వుంది.  పురాణం ప్రకారం జటాయువు ప్రోటోగానిస్టు  శ్రీరాముని పక్షాన నిలబడి ఆంటాగోనిస్టు రావణాసురుడ్ని ఎదుర్కొంటుంది.  ఆంటాగోనిస్టు చనిపోతే వధ అంటారు. కంసునివథ, నరకాసుర వథ. బకాసుర వథ, జరాసంధ వధ ఈ కోవకు చెందుతాయి. ప్రొటోగోనిస్టు చనిపోయినపుడు వీరమరణం అంటారు. అభిమన్యుని వీరమరణం,  బాలచంద్రుని వీరమరణం ఈ కోవకు చెందుతాయి.  ఇదొక కళాసాహిత్య నైతిక విలువ. శంకర్ ఈ సినిమాలో జటాయువు వధ అన్నట్టు చిత్రిస్తాడు.  పక్షిరాజును కథానాయకుడు పక్షి సెంటిమెంటుతో మోసం చేసి మరీ చంపుతాడు.  

గతంలోనూ ఉద్యమ సినిమాలు, విప్లవ సినిమాలు అనేకం వచ్చాయి. కానీ, ఉద్యమకారులు, విప్లవకారుల్ని ప్రతినాయకులుగా చూపించే సాహసం ఎవరూ చేయలేదు.  శంకర్ సెల్ ఫోన్ కంపెనీల పక్షాన నిలబడి బాధితుల కోసం పోరాడేవాళ్ళను 3డి  తెరమీద క్రూరంగా చంపించాడు. అలా కళా సాహిత్య రంగంలో ఒక  దుష్ట సాంప్రదాయానికి నాందీ పలికాడు. చివర్లో నాయకుడు సెల్ ఫోన్ కంపెనీలకు రేడియేషన్ లెవల్స్ తగ్గించమని లాంఛనంగా ఒక సలహా పడేస్తాడు.    

రజనీకాంత్ కోసమో, గ్రాఫిక్స్ కోసమో ఈ సినిమా గొప్పగా ఆడవచ్చు. రజనీకాంత్  అభిమానులో, పిల్లలో, మానసిక పరిపక్వత లేనివాళ్ళో ఈ సినిమాను గొప్ప హిట్ కూడా చేయవచ్చు.  అయినప్పటికీ, ఈ సినిమా తప్పుడు సందేశాన్ని ఇచ్చిందనే వాస్తవం మాసిపోదు.  

-         డానీ

No comments:

Post a Comment